కాసులు కొట్టు.. పాస్‌బుక్ పట్టు
రెవెన్యూ సిబ్బంది వసూళ్ల పర్వం
* పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్‌లకు డిమాండ్
* భూముల క్రయవిక్రయాలు, బ్యాంకుల్లో రుణాల కోసం రైతుల పాట్లు
గుడివాడ : జిల్లాలో పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్‌లకు కొరత ఏర్పడింది. భూముల క్రయవిక్రయాలు చేయాలన్నా.. బ్యాంకుల్లో రుణాలు పొందాలన్నా పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ తప్పనిసరి. దీంతో వీటి కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో భూముల క్రయవిక్రయాలు జోరందుకున్నందున పాత పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్‌లకు డిమాండ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకున్న పలువురు సిబ్బంది అందుబాటులో ఉన్న కొన్ని పుస్తకాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ-పాస్ బుక్ కావాలంటే 45 రోజులు ఆగాల్సిందే..
ప్రస్తుతం తహశీల్దార్ కార్యాలయాల్లో ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్‌లు అయిపోతే కొత్తగా ఇవ్వాల్సిన వారందరికీ ఎలక్ట్రానిక్ పాస్‌పుస్తకాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే కొన్ని మండలాల్లో ఈ-పాస్ పుస్తకాలు అందిస్తున్నారు. ఈ-పాస్ పుస్తకాల మంజూరుకు దాదాపు నెలన్నరకు పైగా సమయం పడుతుంది. దీంతో సత్వరం తమ అవసరాలు తీరడం కోసం పాత పాస్‌పుస్తకాలు పొందేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు.
రూ.5 వేల నుంచి 10 వేల వరకు వసూళ్లు...
భూముల క్రయవిక్రయాలు చేయాలంటే తప్పనిసరిగా పట్టాదార్ పాస్‌పుస్తకంతో పాటు భూమి యాజమాన్యపు హక్కు పత్రం (టైటిల్ డీడ్) కావాలి. ఇవి లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగే పరిస్థితి లేదు. దీంతో వెంటనే పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ కావాలంటే రెవెన్యూ సిబ్బందికి అధిక మొత్తంలో సొమ్ము చెల్లించాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం మచిలీపట్నం, నూజివీడు, విజయవాడ, గుడివాడ డివిజన్లలోని కొన్ని మండలాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏ నిమిషంలో భూమి ధర ఎలా మారుతుందో తెలియని పరిస్థితిలో వెంటనే రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలనుకునేవారి సంఖ్య పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో పట్టాదార్ పాస్‌పుస్తకాల కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. నూజివీడు, ఆగిరిపల్లి, పామర్రు, ఉయ్యూరు, నందిగామ, గుడివాడ మండలంలోని వలివర్తిపాడు, నాగవరప్పాడు ప్రాంతాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నందున ఆయా ప్రాంతాల రైతులు పట్టాదార్ పాస్‌పుస్తకం కావాలంటే రూ.5 వేలు నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నవి అరకొర.. పెండింగ్‌లో దరఖాస్తులు...
* జిల్లా వ్యాప్తంగా ఈ-పాస్‌బుక్‌లు, టైటిల్ డీడ్‌లు ఇచ్చేందుకు గాను ప్రస్తుతం పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్‌ల ముద్రణ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో కొన్ని మండలాల్లో మాత్రమే పుస్తకాలు ఉన్నాయి.
* నూజివీడు డివిజన్‌లో ఇప్పటికే దాదాపు 400 పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్‌లు పెండింగ్ ఉన్నట్లు సమాచారం.
* గుడివాడ డివిజన్‌లో మండలానికి దాదాపు వందకు పైగా పాస్‌పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ముద్రించిన పుస్తకాలు ఆర్డీవో కార్యాలయంలో మాత్రమే ఉన్నాయని సమాచారం.
* రియల్‌భూం ఉన్న ఉయ్యూరు, పామర్రు, విజయవాడ, పెనమలూరు మండలాల్లోనూ పట్టాదార్ పాస్‌పుస్తకాలు లేవని చెబుతున్నారు.
* కొన్నిచోట్ల వీఆర్వోలు ఈ పరిస్థితిని ముందే పసిగట్టి పాస్‌పుస్తకాలు బ్లాక్‌చేసి కాసులు దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
* ప్రతి పుస్తకానికి వీఆర్వో దగ్గర నుంచి, పైస్థాయి అధికారి వరకు పెద్ద ఎత్తున మామూళ్లు ముట్టజెబితేనే పాస్‌పుస్తకం చేతికందుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
* ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా ఇచ్చే ఈ-పాస్‌బుక్ విధానం జిల్లా వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
* ఈ-పాస్‌బుక్ చేతికి అందాలంటే మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేశాక.. అది రెవెన్యూ కార్యాలయానికి చేరుతుంది. ఆ తర్వాత దీనిపై నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తరువాత 45 రోజులు ఆగాల్సి ఉంది. అక్కడ నుంచి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి.. తరువాత హైదరాబాద్ వెళ్లి తిరిగి రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానం ఆలస్యం అవుతున్నందున మాన్యువల్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్‌లు సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు.