Title deed
-
పట్టాదారు పుస్తకాలకు మంగళం
టైటిల్ డీడ్స్ కూడా రద్దు ప్రజల సెంటిమెంట్‌పై బాబు దెబ్బ చెదిరిపోనున్న ఎన్టీఆర్ తెచ్చిన పాసుపుస్తకాలు ‘మీభూమి’ పోర్టల్ వివరాల ఆధారంగానే రుణాలు రెవెన్యూ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: రైతులు తమ సర్వ హక్కుగా భావించే పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్లను ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వీటిని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు వాటిని రద్దు చేస్తున్నారు. ఈ విషయాన్ని ‘పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు’ శీర్షికతో 2015 మే 31నే ‘సాక్షి’ కథనం ప్రచురించింది. తాజాగా సోమవారం రెవెన్యూ అధికారులతో సమావేశమైన చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో రైతులకు సెంటిమెంట్‌పై దెబ్బపడినట్లయింది.వీటిస్థానంలో ‘మీభూమి’ పోర్టల్‌లో భూములు, యాజమాన్య హక్కుల వివరాలు పొందుపరుస్తారని, వాటి ఆధారంగానే బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని సమీక్షలో చంద్రబాబు చెప్పారు. భవిష్యత్‌లో ఆదాయ, నివాస, జనన ధ్రువీకరణ పత్రాలన్నిటినీ ఆధార్ కార్డుకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. మూడు కేటగిరీలుగా విభజన రేషన్ కార్డులను మూడు కేటగిరీలుగా చేయాలని సీఎం సూచించారు. ఇందులో బీపీఎల్ (బిలో పావర్టీ లైన్), ఏపీఎల్ (అబౌ పావర్టీ లైన్), ట్యాక్స్ పేయర్స్ కేటగిరీలుగా ఆదాయ వర్గాల విభజన చేస్తారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేసి, ఆ తర్వాతే నిర్ణయించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో త్వరలో సోషియో ఎకనమిక్ డేటా నమోదు కార్యక్రమం జరగనుందని, దీని ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడానికి వీలవుతుందన్నారు. ఉద్యోగులకు ట్యాబ్‌లు రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ట్యాబ్లెట్లు అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు. వీఆర్ఓలు, అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, పంచాయితీ కార్యదర్శులు, వ్యవసాయాధికారులు, హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులు తదితరులకు ట్యాబ్‌లు అందజేస్తారు. పట్టణ ప్రాంతాల్లో అనుమతి లేని భూముల్లో ఇల్లు నిర్మించుకున్న పేదవర్గాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. రెవెన్యూ సర్వే అకాడమీ ఏర్పాటుకు రూ.50 కోట్లు మంజూరుతో పాటు, కొత్తగా 82 మంది కంప్యూటర్ ఆపరేటర్ల నియామకానికి సీఎం అంగీకరించారు. ల్యాండ్ సర్వే కోసం రూ.20 కోట్లతో ఎలక్ట్రానిక్ టోటల్ సిస్టం మెషీన్లను కొనుగోలు చేసి, డిజిటల్ ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించారు. సమీక్ష సమావేశంలో రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి, సీసీఎల్ఏ అనిల్‌కుమార్ పునీటా, ఐటీ అడ్వైజర్ జె.సత్యనారాయణ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ, ఐటీ కార్యదర్శి శ్రీధర్, రిజిస్ట్రేషన్స్ ఐజీ వెంకటరామిరెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్టప్ మ్యాప్‌లో విశాఖ.. కొచ్చి స్టార్టప్ విలేజి చైర్మన్‌తో భేటీలో చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: సిలికాన్ వ్యాలీ తరహాలో 18 నెలల్లో విశాఖ నగరాన్ని గ్లోబల్ స్టార్టప్ మ్యాప్‌లో పెట్టాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం సచివాలయంలో చంద్రబాబుతో కొచ్చి స్టార్టప్ విలేజి చైర్మన్ సంజయ్ విజయ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థులలో కొత్త ఆవిష్కరణలపై ఆసక్తి పెంచి, విశాఖను స్టార్టప్ విలేజీగా మార్చడంలో చేపట్టాల్సిన ప్రణాళికలపై ఇరువురూ చర్చించారు. నేటి నుంచి పారిస్‌లో ఏపీ బృందం సాక్షి, హైదరాబాద్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగే ఎయిర్ షోకు రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు హాజరు కానున్నారు. ఆయన వెంట రాష్ర్ట పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొననున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకూ జరగనున్న ఈ షోలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా పాల్గొంటారు. ఈ బృందం టౌలోస్లోని ఎయిర్‌బస్ తయారీ కర్మాగారాన్ని సందర్శించనుంది. కేబినెట్ భేటీ రేపటికి వాయిదా :రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారానికి వాయిదాపడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మంగళవారం మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. చంద్రబాబు విదేశీ పర్యటన వాయిదా స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ అభ్యర్థులను గెలిపించేందుకు విదేశీ పర్యటనను సైతం వాయిదా వేసుకున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఆయన దక్షిణ కొరియా, హాంకాంగ్, జపాన్ దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. వచ్చే నెల 3వ తేదీన స్థానిక ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలున్నాయి. దీనితోనే విదేశీ పర్యటను వచ్చే నెల 6 లేదా 7వ తేదీకి వాయిదా వేసుకున్నారని సమాచారం. -
చర్యలు మొదలు
ఆర్డీడీతో సహా 10మందికి చార్జిమెమోలు 10 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సూచన టైటల్ డీడ్-1180 సర్వేపై నిగ్గుతేల్చిన విజిలెన్స్ ఆర్డీడీతో సహా అందరూ బాధ్యులేనని నిర్ధారణ విశాఖపట్నం: టైటిల్ డీడ్ నెం-1180 సర్వే వ్యవహారంలో అవకతవకలు జరిగిన మాట వాస్తమేనని రెవెన్యూ విజిలెన్స్‌శాఖ నిగ్గుతేల్చింది. రికార్డులను టాంపరింగ్ చేయడంతో పాటు పిటీషనర్లకు లాభం చేకూర్చేలా సర్వేచేశారనినిర్ధారణకు వచ్చారు. ఈ అవినీతి భాగోతంపై సీసీఎల్ఎ నియమించిన కమిటీ సిఫార్సు మేరకు ఇప్పటికే సస్పెండ్కుగురైనసర్వే అండ్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ (కాకినాడ ) కె.వెంకటేశ్వర రావుతో సహా 10 మందిపై ప్రభుత్వం చార్జీమెమోలు జారీ చేసింది. పదిరోజుల్లో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలకు ఉపక్రమిం చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ బుధవారం జీవో-118ను జారీ చేశారు. ఈ అవినీతి వ్యవహారానికి చెందిన కధాకమామిషు ఇలా ఉంది.గ్రేటర్ మహా విశాఖ(జీవీఎంసీ)విలీనమైన చినగదిలి మండలం అడవివరం పంచాయతీ పరిధిలోని విజయరామపురం అగ్రహారంలో 30ఎకరాల సర్వే కోసం 2006లో కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ భూమి పక్కనే మరో 94 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.ఆ సమయంలో విశాఖ ఏడీగా పనిచేసిన కె.వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో సర్వే చేయించారు. రికార్డుల్లో 30 ఎకరాలను 80 ఎకరాలుగా టాంపరింగ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న 94 ఎకరాలను కలిపి 124 ఎకరాలను సర్వే చేసి ఒకే టైటిల్ డీడ్-1180కింద మార్చేశారు. ఆ తర్వాత ఈ భూములు పలువురు చేతులు కూడా మారిపోయాయి. ఏడీ వెంకటేశ్వర రావు మూడొంతుల మేర సర్వే పూర్తిచేయగా, ఆ తర్వాత వచ్చిన మరో ఏడీ డిఎల్బీఎల్ కుమార్ పూర్తి చేశారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న పలువురు ప్రభుత్వ పెద్దలు కూడా అప్పట్లో ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్టు విమర్శలు విన్పించాయి. 2013-14లో జేసీగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్ ఈ అవకతవకలను గుర్తించి ఏడీ కుమార్‌ను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 2014 నవంబర్‌లో ఏడీ కుమార్ సమర్పించిన నివేదికపై విచారణకు ఆదేశించాలని కమిషనర్‌కు జేసీ లేఖ రాశారు. కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎల్ఎ ఒక విజిలెన్స్ కమిటీని నియమించింది. జేసీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ కమిటీలో హెడ్‌క్వార్టర్స్ డీడీ సీహెచ్వి సుబ్బారావు, విజిలెన్స్ అసిస్టెంట్ సెక్రటరీ కృష్ణభారతిలతో కూడిన కమిటీ ప్రాధమిక విచారణ అనంతరం ప్రభుత్వ భూమిని అప్పనంగా దారాదత్తంచేసినట్టుగా నిర్ధారణ కావడంతో ఆర్డీడీగా పదోన్నతిపై కాకినాడలో పనిచేస్తున్న వెంకటేశ్వరరావుపై గతేడాది డిసెంబర్లో సస్పెన్షన్ వేటు వేశారు. కాగా ఆ తర్వాత ఏడీగాపనిచేసి బదిలీపై పశ్చిమగోదావరి వెళ్లిన ఏడీ డీఎల్‌బీఎల్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కేసులో సస్పెండ్‌కు గురయ్యారు. మిగిలిన వారంతా శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం ఈ అవినీతి భాగోతంలో భాగస్వాములైన వారందరికి చార్జిమెమోలూ జారీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్‌కు గురైన ఆర్డీడీ వెంకటేశ్వరరావు, ఏడీ డిఎల్బీఎల్ కుమార్‌లతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ పట్నం ఏడీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తు న్న కె.రాంబాబు, పోర్టుట్రస్ట్లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్‌గా పనిచేస్తున్న వి.కొండలరావు, డిప్యుటేషన్‌పై విశాఖఅర్బన్ మండల సర్వేయర్(మాకవరపాలెం మండల సర్వేయర్) బి.సత్యనారాయణ, విశాఖ అర్బన్ సర్వేయర్ కె.సింహాచలం, ఆనందపురం మండల సర్వేయర్ ఆర్.చిరంజీవి, శ్రీకాకుళం సీడీ గ్రేడ్-1గా పనిచేస్తున్న జి.నాగేశ్వరరావులతో పాటు ఇటీవల రిటైర్ అయిన జి.రమణయ్య (విశాఖ), బి.రామారావు (శ్రీకాకుళం)లపై క్రమశిక్షణచర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వారి నుంచి ఏపీ సివిల్‌సర్వీసెస్ రూ ల్స్ 1991, రూల్-9లకనుగుణంగా భారీ ఫెనాల్టీ విధించాలని ఆదేశించింది. అయితే క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పుకునేందుకు వీరికి 10 రోజుల పాటు అవకాశమిచ్చారు. ఈలోగా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం పట్ల సంతృప్తి చెందని పక్షంలో తదుపరి చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. -
కాసులు కొట్టు.. పాస్‌బుక్ పట్టు
రెవెన్యూ సిబ్బంది వసూళ్ల పర్వం * పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లకు డిమాండ్ * భూముల క్రయవిక్రయాలు, బ్యాంకుల్లో రుణాల కోసం రైతుల పాట్లు గుడివాడ : జిల్లాలో పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లకు కొరత ఏర్పడింది. భూముల క్రయవిక్రయాలు చేయాలన్నా.. బ్యాంకుల్లో రుణాలు పొందాలన్నా పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ తప్పనిసరి. దీంతో వీటి కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో భూముల క్రయవిక్రయాలు జోరందుకున్నందున పాత పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లకు డిమాండ్ పెరిగింది. దీనిని ఆసరాగా చేసుకున్న పలువురు సిబ్బంది అందుబాటులో ఉన్న కొన్ని పుస్తకాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ-పాస్ బుక్ కావాలంటే 45 రోజులు ఆగాల్సిందే.. ప్రస్తుతం తహశీల్దార్ కార్యాలయాల్లో ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లు అయిపోతే కొత్తగా ఇవ్వాల్సిన వారందరికీ ఎలక్ట్రానిక్ పాస్‌పుస్తకాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే కొన్ని మండలాల్లో ఈ-పాస్ పుస్తకాలు అందిస్తున్నారు. ఈ-పాస్ పుస్తకాల మంజూరుకు దాదాపు నెలన్నరకు పైగా సమయం పడుతుంది. దీంతో సత్వరం తమ అవసరాలు తీరడం కోసం పాత పాస్‌పుస్తకాలు పొందేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. రూ.5 వేల నుంచి 10 వేల వరకు వసూళ్లు... భూముల క్రయవిక్రయాలు చేయాలంటే తప్పనిసరిగా పట్టాదార్ పాస్‌పుస్తకంతో పాటు భూమి యాజమాన్యపు హక్కు పత్రం (టైటిల్ డీడ్) కావాలి. ఇవి లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగే పరిస్థితి లేదు. దీంతో వెంటనే పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ కావాలంటే రెవెన్యూ సిబ్బందికి అధిక మొత్తంలో సొమ్ము చెల్లించాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం మచిలీపట్నం, నూజివీడు, విజయవాడ, గుడివాడ డివిజన్లలోని కొన్ని మండలాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఏ నిమిషంలో భూమి ధర ఎలా మారుతుందో తెలియని పరిస్థితిలో వెంటనే రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలనుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పట్టాదార్ పాస్‌పుస్తకాల కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. నూజివీడు, ఆగిరిపల్లి, పామర్రు, ఉయ్యూరు, నందిగామ, గుడివాడ మండలంలోని వలివర్తిపాడు, నాగవరప్పాడు ప్రాంతాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నందున ఆయా ప్రాంతాల రైతులు పట్టాదార్ పాస్‌పుస్తకం కావాలంటే రూ.5 వేలు నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నవి అరకొర.. పెండింగ్‌లో దరఖాస్తులు... * జిల్లా వ్యాప్తంగా ఈ-పాస్‌బుక్‌లు, టైటిల్ డీడ్లు ఇచ్చేందుకు గాను ప్రస్తుతం పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్ల ముద్రణ ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో కొన్ని మండలాల్లో మాత్రమే పుస్తకాలు ఉన్నాయి. * నూజివీడు డివిజన్లో ఇప్పటికే దాదాపు 400 పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లు పెండింగ్ ఉన్నట్లు సమాచారం. * గుడివాడ డివిజన్లో మండలానికి దాదాపు వందకు పైగా పాస్‌పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ముద్రించిన పుస్తకాలు ఆర్డీవో కార్యాలయంలో మాత్రమే ఉన్నాయని సమాచారం. * రియల్‌భూం ఉన్న ఉయ్యూరు, పామర్రు, విజయవాడ, పెనమలూరు మండలాల్లోనూ పట్టాదార్ పాస్‌పుస్తకాలు లేవని చెబుతున్నారు. * కొన్నిచోట్ల వీఆర్వోలు ఈ పరిస్థితిని ముందే పసిగట్టి పాస్‌పుస్తకాలు బ్లాక్‌చేసి కాసులు దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. * ప్రతి పుస్తకానికి వీఆర్వో దగ్గర నుంచి, పైస్థాయి అధికారి వరకు పెద్ద ఎత్తున మామూళ్లు ముట్టజెబితేనే పాస్‌పుస్తకం చేతికందుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. * ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా ఇచ్చే ఈ-పాస్‌బుక్ విధానం జిల్లా వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. * ఈ-పాస్‌బుక్ చేతికి అందాలంటే మీ-సేవా కేంద్రంలో దరఖాస్తు చేశాక.. అది రెవెన్యూ కార్యాలయానికి చేరుతుంది. ఆ తర్వాత దీనిపై నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తరువాత 45 రోజులు ఆగాల్సి ఉంది. అక్కడ నుంచి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి.. తరువాత హైదరాబాద్ వెళ్లి తిరిగి రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానం ఆలస్యం అవుతున్నందున మాన్యువల్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్లు సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు. -
పాస్‌పుస్తకాల కోసం పాట్లు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పాస్‌పుస్తకాల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఒకవేళ పాస్ పుస్తకం ఉన్నా టైటిల్ డీడ్ ఇచ్చేందుకు అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దాదాపు జిల్లా అంతటా ఇదే పరి స్థితి ఉన్నప్పటికీ వరంగల్ రెవెన్యూ డివి జన్‌లో మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో కొందరు రైతులు రెండేళ్ల క్రితం నుంచి టైటిల్‌డీడ్ కోసం వీఆర్వో ల చుట్టూ తిరిగినా ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను పలుమార్లు అడిగినా ‘ఆర్డీఓ సార్ సంతకం కాలేదు’ అనే సమాధానం వస్తోందని అంటున్నారు. అడిగినంత ఇచ్చినా... రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయి సిబ్బందికి అక్రమ ఆదాయ వనరు పట్టాదారు పాస్‌పుస్తకాల జారీ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయా గ్రామాలు, మండలాల్లో భూమి రేటును బట్టి ఎకరానికి ఇంత అని వీఆర్వోలు ధర ఖరారు చేసి మరీ వసూలు చేసుకుంటారు. ప్రస్తుతం హన్మకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, వర్ధన్నపేట తదితర మండలాల పరిధిలో కొన్నిచోట్ల పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీకి ఎకరాకు రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భూములకు మార్కెట్ ధర ఉన్నచోట తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధికారులు అడిగినంత ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. అయితే ఇంతచేసినా పనులు సకాలంలో కాకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటాల్లో తేడాల వల్ల...? సహజంగా రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేసే క్రమంలో రెండు పుస్తకాలు ఇస్తారు. ఇందులో ఒకటి స్థానిక తహసీల్దార్ సంతకంతో ఉంటుంది. రెండోది ఆర్డీఓ సంతకంతో ఉంటుంది. దీనినే టైటిల్ డీడ్ లేదా భూమి హక్కుపత్రం అంటారు. ఇది జారీ చేయడానికి అనధికారికంగా ఆర్డీఓ కార్యాల యాల్లో రూ.300 వరకు వసూలు చేసేవారు. ఈ మొత్తం కూడా వీఆర్వోలు సంబంధిత రైతుల నుంచి వసూలు చేసి ఇచ్చేవారు. అయితే ముందుగా తహసీల్దార్ నుంచి వచ్చే పట్టాదార్ పాస్‌పుస్తకం ఇచ్చి టైటిల్ డీడ్ కోసం కొంత సమయం కేటాయించేవారు. ఎందుకంటే.. డివిజన్ పరిధిలోని అన్ని మండలాల పుస్తకాలు ఆర్డీఓలు చూడాలి. కాబట్టి వారికి సందేహాలు ఉన్నచోట పరిశీలన చేసి మరీ జారీ చేసేవారు. ఇయితే క్రమంగా ఇది లాభసాటి వ్యాపారంగా మారడంతో కొన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో ఒక్కో పుస్తకానికి రూ.వెయ్యి వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో వీఆర్వోలు ఈ విషయంలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. వెరశి ఆర్డీఓ కార్యాలయానికి సంతకం కోసం వెళ్లిన పుస్తకాలు ఏళ్లు గడుస్తున్నా అడ్రస్ లేకుండా పోతున్నాయి. ఇదేమిటని నిలదీసిన రైతులకు ఏదో ఒక కొర్రీవేసి పనులు చేయకుండా వేధిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. బ్యాంకుల్లో అవస్థలు రైతులు తమ పాస్‌పుస్తకాలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకుంటారు. గతంలో కేవలం ఒకే పుస్తకంతో రుణం ఇచ్చిన బ్యాంకర్లు కొంతకాలంగా టైటిల్ డీడ్ కూడా ఉంటేనే రుణం ఇస్తామని మెలిక పెడుతున్నారు. అయితే వేల సంఖ్యలో పుస్తకాలు ఆర్డీఓ కార్యాలయాల్లో ఉండటంతో రైతులు రుణం పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. రుణం మంజూరు అయిన వారు కూడా టైటిల్ డీడ్ లేక పొందలేక పోతున్నామంటున్నారు. వరంగల్ డివిజన్‌లోనే వేలల్లో... జిల్లా మొత్తంగా సమస్య ఉన్నప్పటికీ వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సమస్య తీవ్రత ఎక్కుగా ఉంది. ఇక్కడ రెండేళ్ల నుంచి టైటిల్ డీడ్ కోసం ఎదురుచూస్తున్న రైతులు ఉన్నారు. డివిజన్ పరిధిలోని 10 మండలాల నుంచి మొత్తం 2వేల పుస్తకాల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. ఆర్ఓఆర్పై నిషేధం ఉన్న సాకుతో అధికారులు అన్నింటినీ అదేగాటన పెట్టి కాలయాపన చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు రైతుల అవస్థలు గుర్తించి పాస్‌పుస్తకాల జారీ ప్రక్రియను పూర్తిచేస్తే చేస్తే కనీసం బ్యాంకు రుణాలైనా పొందే అవకాశం ఉంటుంది.