చర్యలు మొదలు | Dealing with the title deed No. -1180 survey | Sakshi
Sakshi News home page

చర్యలు మొదలు

Published Thu, Feb 19 2015 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 9:32 PM

Dealing with the title deed No. -1180 survey

ఆర్‌డీడీతో సహా 10మందికి చార్జిమెమోలు
10 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని సూచన
టైటల్ డీడ్-1180 సర్వేపై నిగ్గుతేల్చిన విజిలెన్స్
ఆర్‌డీడీతో సహా అందరూ బాధ్యులేనని నిర్ధారణ

 
విశాఖపట్నం: టైటిల్ డీడ్ నెం-1180 సర్వే వ్యవహారంలో అవకతవకలు జరిగిన మాట వాస్తమేనని రెవెన్యూ విజిలెన్స్‌శాఖ నిగ్గుతేల్చింది. రికార్డులను టాంపరింగ్ చేయడంతో పాటు పిటీషనర్లకు లాభం చేకూర్చేలా సర్వేచేశారనినిర్ధారణకు వచ్చారు. ఈ అవినీతి భాగోతంపై సీసీఎల్‌ఎ నియమించిన కమిటీ సిఫార్సు మేరకు ఇప్పటికే సస్పెండ్‌కుగురైనసర్వే అండ్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ (కాకినాడ ) కె.వెంకటేశ్వర రావుతో సహా 10 మందిపై ప్రభుత్వం చార్జీమెమోలు జారీ చేసింది. పదిరోజుల్లో లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలకు ఉపక్రమిం చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ    బుధవారం జీవో-118ను జారీ చేశారు. ఈ అవినీతి వ్యవహారానికి చెందిన కధాకమామిషు ఇలా ఉంది.గ్రేటర్ మహా విశాఖ(జీవీఎంసీ)విలీనమైన చినగదిలి మండలం అడవివరం పంచాయతీ పరిధిలోని విజయరామపురం అగ్రహారంలో 30ఎకరాల సర్వే కోసం 2006లో కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు.

ఈ భూమి పక్కనే మరో 94 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.ఆ సమయంలో విశాఖ ఏడీగా పనిచేసిన కె.వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో సర్వే చేయించారు. రికార్డుల్లో 30 ఎకరాలను 80 ఎకరాలుగా టాంపరింగ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న 94 ఎకరాలను కలిపి 124 ఎకరాలను సర్వే చేసి ఒకే టైటిల్ డీడ్-1180కింద మార్చేశారు. ఆ తర్వాత ఈ భూములు పలువురు చేతులు కూడా మారిపోయాయి. ఏడీ వెంకటేశ్వర రావు మూడొంతుల మేర సర్వే పూర్తిచేయగా, ఆ తర్వాత వచ్చిన మరో ఏడీ డిఎల్‌బీఎల్ కుమార్ పూర్తి చేశారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న పలువురు ప్రభుత్వ పెద్దలు కూడా అప్పట్లో ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్టు విమర్శలు విన్పించాయి. 2013-14లో జేసీగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్ ఈ అవకతవకలను గుర్తించి ఏడీ కుమార్‌ను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 2014 నవంబర్‌లో ఏడీ కుమార్ సమర్పించిన నివేదికపై విచారణకు ఆదేశించాలని కమిషనర్‌కు జేసీ లేఖ రాశారు. కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎల్‌ఎ ఒక విజిలెన్స్ కమిటీని నియమించింది. జేసీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ కమిటీలో హెడ్‌క్వార్టర్స్ డీడీ సీహెచ్‌వి సుబ్బారావు, విజిలెన్స్ అసిస్టెంట్  సెక్రటరీ కృష్ణభారతిలతో కూడిన కమిటీ ప్రాధమిక విచారణ అనంతరం ప్రభుత్వ భూమిని అప్పనంగా దారాదత్తంచేసినట్టుగా నిర్ధారణ కావడంతో ఆర్‌డీడీగా పదోన్నతిపై కాకినాడలో పనిచేస్తున్న వెంకటేశ్వరరావుపై గతేడాది డిసెంబర్‌లో సస్పెన్షన్ వేటు వేశారు. కాగా ఆ తర్వాత ఏడీగాపనిచేసి బదిలీపై పశ్చిమగోదావరి వెళ్లిన ఏడీ డీఎల్‌బీఎల్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కేసులో సస్పెండ్‌కు గురయ్యారు.

మిగిలిన వారంతా శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం ఈ అవినీతి భాగోతంలో భాగస్వాములైన వారందరికి చార్జిమెమోలూ జారీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్‌కు గురైన ఆర్‌డీడీ వెంకటేశ్వరరావు, ఏడీ డిఎల్‌బీఎల్ కుమార్‌లతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ పట్నం ఏడీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తు న్న కె.రాంబాబు, పోర్టుట్రస్ట్‌లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్‌గా పనిచేస్తున్న వి.కొండలరావు, డిప్యుటేషన్‌పై విశాఖఅర్బన్ మండల సర్వేయర్(మాకవరపాలెం మండల సర్వేయర్) బి.సత్యనారాయణ, విశాఖ అర్బన్ సర్వేయర్ కె.సింహాచలం, ఆనందపురం మండల సర్వేయర్ ఆర్.చిరంజీవి, శ్రీకాకుళం సీడీ గ్రేడ్-1గా పనిచేస్తున్న జి.నాగేశ్వరరావులతో పాటు ఇటీవల రిటైర్ అయిన జి.రమణయ్య (విశాఖ), బి.రామారావు (శ్రీకాకుళం)లపై క్రమశిక్షణచర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వారి నుంచి ఏపీ సివిల్‌సర్వీసెస్ రూ ల్స్ 1991, రూల్-9లకనుగుణంగా భారీ ఫెనాల్టీ విధించాలని ఆదేశించింది. అయితే క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పుకునేందుకు వీరికి 10 రోజుల పాటు అవకాశమిచ్చారు. ఈలోగా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం పట్ల సంతృప్తి చెందని పక్షంలో తదుపరి చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement