దేశీ కార్పొరేట్ రంగంలో తాజాగా వెలుగుచూస్తున్న కుంభకోణాలు, అవకతవకలు... బోర్డు రూమ్ సంక్షోభానికి దారితీస్తున్నాయి. స్కామ్‌ల పాపం తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో కంపెనీల నుంచి వైదొలగుతున్న ఇండిపెండెంట్ డైరెక్టర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో మొత్తం 126 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఆ సంఖ్య రెట్టింపై 291కి పెరగడం తాజా పరిస్థితికి నిదర్శనం. ఈ వివరాలను ఎన్‌ఎస్‌ఈఇన్ఫోబేస్ డాట్‌కామ్ వెల్లడించింది. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్(ఎన్‌ఎస్‌ఈ), ప్రైమ్ డేటాబేస్ కలసి ఈ సంస్థను ఏర్పాటు చేశాయి. తాజా నివేదికలో స్వతంత్ర డైరెక్టర్ల విషయమై కీలకాంశాలు వెలుగుచూశాయి.
సాధారణంగా ఒక కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌లో మూడో వంతు ఇండిపెండెంట్(స్వతంత్ర) డైరెక్టర్లుంటారు. కంపెనీలను వదిలిపోతున్న ఇండిపెండెంట్ డైరెక్టర్లలో సగం మంది వారి పదవీకాలం పూర్తవ్వడంతో వైదొలుగుతున్నారు. ఆరోగ్య, వ్యక్తిగత లేదా ఇతర వృత్తులు, వ్యాపకాల్లో స్థిరపడటం వంటి కారణాలతో చాలా మంది తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 291 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. దీంట్లో 146 మంది తమ పదవీ కాలం పూర్తవ్వడంతో రాజీనామా చేయగా, మళ్లీ ఆ పదవిలో కొనసాగడం ఇష్టం లేదంటూ 36 మంది వైదొలిగారు.
ఇతర వృత్తుల్లో స్థిరపడేందుకు రాజీనామా చేసిన వారి సంఖ్య 26గా ఉంది. సెబీ, కంపెనీల చట్టం ప్రకారం తగిన అర్హతలు లేకపోవడంతో 17 మంది రాజీనామా చేశా రు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, ఆసక్తి లేదంటూ రాజీనామా చేసిన వాళ్ల సంఖ్య 40. యాజమాన్యం మారడంతో ఆరుగురు రాజీనామా చేశారు. కాగా, జెట్ ఎ యిర్‌వేస్ కంపెనీలో ఇబ్బందులు తలెత్తగానే పలువు రు ఇండిపెండెంట్ డైరెక్టర్లు రాజీనామా చేశారు. చెల్లింపుల్లో విఫలం కావడంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నుంచి కూడా ఇండిపెండెట్ డైరెక్టర్లు వైదొలిగారు.
ఇష్టపడని పదవి..
గతంలో ఇతర కంపెనీలకు ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేసిన వాళ్లు, ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పదవులు నిర్వహించినవాళ్లు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా రావడానికి ఇష్టపడటం లేదు. కంపెనీల్లో అవకతవకలు ఉంటాయేమోనన్న అనుమానాలతో ఈ పదవులను వారు తిరస్కరిస్తున్నారు. కంపెనీ ప్రమోటర్లు, యాజమాన్యం తీసుకునే నిర్ణయాలకు బలికావలసి వస్తుందనే భయాలతో పలువురు ఈ పదవులను నిరాకరిస్తున్నారు. ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా చేరితే, ఒకవేళ కంపెనీ లోటుపాట్లు వెల్లడైన పక్షంలో, అప్పటివరకూ తాము సంపాదించుకున్న పేరు, నమ్మకం అన్నీ కోల్పోవలసి వస్తుందని, న్యాయ వివాదాలు ఎదుర్కోవలసి వస్తుందని, అందుకే ఈ పదవులకు దూరంగా ఉంటున్నామని పలువురు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే... భారత్‌లో పలు కంపెనీలు కుటుంబాల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. దీంతో ఇండిపెండెంట్ డైరెక్టర్లు ప్రమోటర్ల దయ మీదనే ఆధారపడక తప్పటం లేదు. దీనికి వ్యతిరేకంగా గళం విప్పితే.. ప్రత్యేక తీర్మానం ద్వారా వీరిని సాగనంపే అవకాశాలున్నాయి. ఒకవేళ కంపెనీ అవకతవకల విషయమై తెలిసి కూడా స్పందించకపోతే, వీరి ఆస్తులను కూడా కంపెనీల వ్యవహారాల శాఖ స్తంభింపజేసే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పుడు ఇండిపెండెంట్ డైరెక్టర్ల పదవి అడకత్తెరలో పోకచెక్కలా మారిందని విశ్లేషకులంటున్నారు. వంద శాతం పూర్తిగా నమ్మకం కుదిరితేనే ఈ పదవికి ముందుకొస్తున్నారని చెబుతున్నారు.
ఇండిపెండెంట్ డైరెక్టర్ విధులేంటి?
► ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్...తన బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. కంపెనీ, వాటాదారులు ముఖ్యంగా మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం బాథ్యతాయుతంగా మెలగాలి.
► తన హోదాను స్వలాభం కోసం దుర్వినియోగం చేయకూడదు. అలాగే తన స్వలాభం కోసం కంపెనీకి నష్టం వచ్చేలా ప్రవర్తించకూడదు. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ సవ్యంగా సాగేలా తగిన తోడ్పాటునందించాల్సి ఉంటుంది.
► కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.
► ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలాగా కంపెనీ రోజువారీ కార్యకలాపాలను ఇండిపెండెంట్ డైరెక్టర్లు చూడాల్సిన పని ఉండదు. వారికి అధికారాలు కూడా పరిమితంగానే ఉన్నాయి.
► డైరెక్టర్ల సమావేశాలకే కాకుండా బోర్డ్ నియమించే కమిటీల్లో సభ్యుడిగా ఉంటూ, ఈ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కావలసి ఉంటుంది. కంపెనీలో ఏమైనా అవకతవకలు చోటు చేసుకుంటే వాటిని వెలుగులోకి తేవలసి ఉంటుంది.
► కంపెనీకి సంబంధించిన రహస్యాలను (టెక్నాలజీ, భవిష్యత్తు నిర్ణయాలు, ఇతర కంపెనీలతో కుదుర్చుకోబోయే ఒప్పందాలు తదితర అంశాలను) లీక్ చేయకూడదు. ఇక ప్రత్యేక తీర్మానం ద్వారానే ఇండిపెండెంట్ డైరెక్టర్లను తొలగించే వీలుంది.
ప్రశ్నించే అధికారం ఉండాలి...
ప్రమోటర్లు, వాటాదారుల ఆధిపత్యం ఉన్న కంపెనీల్లో ‘నిజమైన’ ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఎవరూ ఉండరు. ఇండిపెండెంట్ డైరెక్టర్ హోదాను పునఃపరిశీలించాలి. భారత కుటుంబ వ్యాపారాల్లో మెజార్టీ వాటా ప్రమోటర్ గ్రూప్‌దే. ఇలాంటి కంపెనీల్లో డైరెక్టర్ల స్వతంత్రత చాలా కష్టసాధ్యమైన విషయం. మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ ఇండిపెండెంట్ డైరెక్టర్ల బాధ్యత అయినప్పటికీ, ప్రమోటర్ గ్రూప్ చర్యలను, నిర్ణయాలను ప్రశ్నించే అధికారం వారికి ఉండాలి.
– ప్రణవ్ హల్దియా, ఎమ్‌డీ, ప్రైమ్ డేటాబేస్ గ్రూప్
సత్యం స్కామ్ నుంచి...
సత్యం కంప్యూటర్స్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్ల పాత్ర కీలకమైందని ప్రభుత్వం గుర్తించింది. అప్పటి వరకూ ఇండిపెండెంట్ డైరెక్టర్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఉత్సవ విగ్రహాలేనని చెప్పవచ్చు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 2013 నాటి కంపెనీల చట్టంలో ఇండిపెండెంట్ డైరెక్టర్లకు సంబంధించిన నిబంధనల విషయమై పలు మార్పులు, చేర్పులు చేసింది.
మరోవైపు ఇండిపెండెంట్ డైరెక్టర్లు సభ్యులుగా ఉన్న రిస్క్ మేనేజ్‌మెంట్ కమిటీ తరచుగా సమావేశాలు జరుపుతూ, కంపెనీ స్థితిగతులపై చర్చించాల్సి ఉంటుంది. కానీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కంపెనీలో నాలుగేళ్ల కాలంలో ఇలాంటి ఒక్క సమావేశం కూడా జరగలేదంటే కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇక లిస్టైన కంపెనీల్లో మొత్తం డైరెక్టర్లలో మూడు నుంచి ఐదో వంతు వరకూ ఇండిపెండెంట్ డైరెక్టర్లుండాలి. టాప్1000 కంపెనీల్లో కనీసం ఒక మహిళ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండితీరాలి.
Comments
Please login to add a commentAdd a comment