న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్‌నకు రిటైల్ స్టోర్ల బదలాయింపు విషయంలో ఫ్యూచర్ రిటైల్‌తో (ఎఫ్‌ఆర్‌ఎల్) ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ వివాదం కొనసాగుతోంది. ఈ ’మోసపూరిత వ్యూహం’ అమలుకు ఎఫ్‌ఆర్‌ఎల్ స్వతంత్ర డైరెక్టర్లు సహాయం చేశారంటూ అమెజాన్ తాజాగా ఆరోపించింది. ఎఫ్‌ఆర్‌ఎల్ భారీ అద్దె బకాయిలు కట్టలేకపోవడం వల్లే 835 పైచిలుకు స్టోర్లను రిలయన్స్ గ్రూప్ స్వాధీనం చేసుకుందన్న వాదనలన్నీ తప్పుల తడకలని పేర్కొంది.
స్టోర్స్ స్వాధీనానికి నెల రోజుల ముందే ఈ బకాయిలు కేవలం రూ. 250 కోట్లు మాత్రమే ఉంటాయంటూ ఎఫ్‌ఆర్‌ఎల్ వెల్లడించిందని.. ఆ కాస్త మొత్తానికి అన్ని స్టోర్స్‌ను రిలయన్స్‌కు ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. ఎఫ్‌ఆర్‌ఎల్ స్వతంత్ర డైరెక్టర్లకు ఈ మేరకు లేఖ రాసింది. సంక్షోభంలో ఉన్న ఎఫ్‌ఆర్‌ఎల్‌కు తాము ఆర్థిక సహాయం అందిస్తామంటూ ఆఫర్ చేసినప్పటికీ అప్పట్లో రిలయన్స్‌కు రిటైల్ వ్యాపార విక్రయ డీల్‌పై చర్చల సాకును చూపించి స్వతంత్ర డైరెక్టర్లు తమ ప్రతిపాదన తిరస్కరించారని పేర్కొంది.
ఆ తర్వాత కంపెనీ, దాని ప్రమోటర్లు, డైరెక్టర్లు మొదలైన వారంతా రిలయన్స్ గ్రూప్‌తో కుమ్మక్కై ఎఫ్‌ఆర్‌ఎల్ నుంచి రిటైల్ స్టోర్స్‌ను వేరు చేశారని, ఈ మోసాన్ని అడ్డుకోవడానికి స్వతంత్ర డైరెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అమెజాన్ ఆరోపించింది. తద్వారా ప్రజలు, నియంత్రణ సంస్థలను మోసం చేశారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో చట్టప్రకారం ప్రమోటర్లతో పాటు డైరెక్టర్లకు కూడా జైలు శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాల ద్వారా రిటైల్ వ్యాపారమైన ఎఫ్‌ఆర్‌ఎల్‌లో అమెజాన్‌కు స్వల్ప వాటాలు ఉన్నాయి.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు రూ. 24,713 కోట్లకు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పం దం కుదుర్చుకుంది. అయితే, ఇది తన ప్రయోజనాలకు విరుద్ధమంటూ అమెజాన్ న్యాయస్థానాలు, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయించగా పలు చోట్ల దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం దీనిపై ఇంకా న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌ఎల్ డీల్‌ను రిలయన్స్ రద్దు చేసుకుంది. రిటైల్ స్టోర్స్ లీజు బకాయిలు తమకు కట్టనందున వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment