fraudulent offers
-
ఇలా మోసం చేస్తున్నారు.. ఆర్బీఐ హెచ్చరిక!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్న అసాంఘిక శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆర్బీఐ హెచ్చరించింది. సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగులుగా నటిస్తూ నకిలీ లెటర్ హెడ్స్, ఈమెయిల్ అడ్రెస్‌లను ఉపయోగించి లాటరీలు.. ఫండ్ ట్రాన్స్ఫర్, విదేశీ రెమిటెన్సులు, ప్రభుత్వ పథకాల పేరిట కొందరు మోసగిస్తున్నారని పేర్కొంది.కరెన్సీ ప్రాసెసింగ్ ఫీజులు, ట్రాన్స్ఫర్/రెమిటెన్స్/ప్రొసీజర్ చార్జీలంటూ వసూలు చేస్తున్నారని వివరించింది. ఆర్బీఐ/ప్రభుత్వ అధికారుల్లాగా నటిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులు, స్కీములతో నిధులు పొందేందుకు సెక్యూరిటీ డిపాజిట్లు కట్టాల్సి ఉంటుందని చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను మోసగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. సాధారణంగా వీరు ఐవీఆర్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ ద్వారా బాధితులను సంప్రదిస్తున్నారు.ఆర్బీఐ అధికారులుగా పరిచయం చేసుకునే సదరు మోసగాళ్లు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసేస్తామని బెదిరిస్తూ, నిర్దిష్ట వ్యక్తిగత వివరాలు ఇచ్చేలా బాధితులను బలవంతపెడుతున్నారు. ఈ నేపథ్యంలో అపరిచితులకు అకౌంట్ లాగిన్ వివరాలు, ఓటీపీ లేదా కేవైసీ పత్రాలు మొదలైనవి ఇవ్వరాదని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. -
మోసకారి లోన్‌యాప్ కంపెనీలపై కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: మోసాలు, వేధింపులకు పాల్పడే లోన్‌యాప్ కంపెనీలు, వాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా విధి విధానాలను రూపొందించినట్లు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేని లోన్‌యాప్‌ల డెవలపర్లు, వాటితో ఒప్పందం చేసుకునే గూగుల్ ప్లే స్టోర్స్, యాప్ స్టోర్స్ వంటి కంపెనీలు, సర్వీస్ ప్రొవైడర్లుగా ఉండే టెలికాం కంపెనీలు, యాప్‌ల ఖాతాలను నిర్వహించే బ్యాంకులపైన కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. డీజీపీ శుక్రవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే పోలీసు శాఖ రాష్ట్ర, జిల్లా స్థాయిలో బ్యాంకు అధికారులతో సమావేశమై కొత్త విధివిధానాలను వివరించిందని తెలిపారు. విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న నకిలీ లోన్ యాప్ ముఠాలు ఇక్కడ ఏజంట్లను నియమించుకుని మోసాలకు పాల్పడుతున్నాయన్నారు. అందుకోసం ఎక్కడో ఉన్నవారి పేరున మన రాష్ట్రంలో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. అటువంటి ఖాతాలను నిశితంగా పరిశీలించాలని, ఒక్కసారిగా భారీగా నగదు జమ అయ్యే ఖాతాలను వెంటనే జప్తు చేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే బ్యాంకులపైనా కేసులు నమోదు చేస్తామన్నారు. రాష్ట్రంలో మోసాలకు పాల్పడే లోన్ యాప్ కంపెనీలపై ఇప్పటికే 75 కేసులు నమోదు చేసి, 71 మందిని అరెస్టు చేశామని, బ్యాంకు ఖాతాల్లోని రూ.10.50 కోట్లు జప్తు చేశామని వెల్లడించారు. మోసాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించిన 230 కంపెనీల్లో 170 కంపెనీలను బ్లాక్ చేయించామని చెప్పారు. చైనా తదితర దేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడే వారిపై చర్యల కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇంటర్‌పోల్ వంటి సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి లోన్‌యాప్ మోసాలపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిజర్వ్ బ్యాంకు అనుమతి లేని యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవద్దని, ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని చెప్పారు. మోసాలు, వేధింపులు ఎదుర్కొనే వారు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేస్తే పోలీసులు తక్షణం సహకరిస్తారని చెప్పారు. బెదిరింపులు, ఫొటో మార్ఫింగులకు భయపడి ఆత్మహత్య యత్నాలు వంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. లంచగొండి సీఐ, ఎస్సై అరెస్ట్ హత్య కేసులో నిందితుల జాబితాలో పేర్లు చేర్చకుండా ఉండేందుకు లంచం తీసుకున్నట్టు రుజువు కావడంతో కృష్ణా జిల్లా పమిడిముక్కల సీఐగా చేసిన ఎం.ముక్తేశ్వరరావు, తోట్లవల్లూరు ఎస్సైగా చేసిన వై.అర్జున్‌లను శుక్రవారం అరెస్టు చేసినట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వారిని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు. డీజీపీ తెలిపిన ప్రకారం ఈ కేసు వివరాలు తోట్లవల్లూరుకు చెందిన గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి, మిథునలను పోలీసులు ఈ ఏడాది జులై 26న అరెస్టు చేశారు. ఈ కేసులో శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు సీఐ ముక్తేశ్వరరావు రూ.15 లక్షలు, ఎస్సై అర్జున్ రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి బంధువు జొన్నల నరేంద్రరెడ్డి ద్వారా వ్యవహారం నడిపారు. శ్రీకాంత్ రెడ్డి తల్లిదండ్రులు నరేంద్రరెడ్డికి రూ.19.36 లక్షలు ఇచ్చారు. ఇందులో నుంచి నరేంద్రరెడ్డి సీఐ ముక్తేశ్వరరావుకు రూ.12.50 లక్షలు, ఎస్సై అర్జున్‌కు రూ.1.50 లక్షలు ఇచ్చారు. ఈ విషయం శ్రీకాంత్‌రెడ్డి బంధువు పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి తెలిసింది. పోలీసుల పేరు చెప్పి నరేంద్రరెడ్డి ఎక్కువ తీసుకున్నారని ఆయన శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెప్పారు. దాంతో నరేంద్రరెడ్డి ఆగ్రహించి శ్రీనివాసరెడ్డిని హత్య చేశాడు. ఈ కేసులో ఆత్కూరు పోలీసులు నరేంద్రరెడ్డిని విచారించడంతో సీఐ, ఎస్సైల అవినీతి కూడా బయటపడింది. దాంతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి సీఐ, ఎస్సైపై ఏసీబీ విచారణకు ఆదేశించారు. వారు లంచం తీసుకున్నట్టుగా విచారణలో వెల్లడైంది. దాంతో వారిద్దరినీ అరెస్టు చేశామని, విధుల నుంచి తొలగిస్తామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. -
మోసం చేసేందుకు సహాయపడ్డారు
న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూప్‌నకు రిటైల్ స్టోర్ల బదలాయింపు విషయంలో ఫ్యూచర్ రిటైల్‌తో (ఎఫ్ఆర్ఎల్) ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ వివాదం కొనసాగుతోంది. ఈ ’మోసపూరిత వ్యూహం’ అమలుకు ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లు సహాయం చేశారంటూ అమెజాన్ తాజాగా ఆరోపించింది. ఎఫ్ఆర్ఎల్ భారీ అద్దె బకాయిలు కట్టలేకపోవడం వల్లే 835 పైచిలుకు స్టోర్లను రిలయన్స్ గ్రూప్ స్వాధీనం చేసుకుందన్న వాదనలన్నీ తప్పుల తడకలని పేర్కొంది. స్టోర్స్ స్వాధీనానికి నెల రోజుల ముందే ఈ బకాయిలు కేవలం రూ. 250 కోట్లు మాత్రమే ఉంటాయంటూ ఎఫ్ఆర్ఎల్ వెల్లడించిందని.. ఆ కాస్త మొత్తానికి అన్ని స్టోర్స్‌ను రిలయన్స్‌కు ఎలా బదిలీ చేస్తారంటూ ప్రశ్నించింది. ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లకు ఈ మేరకు లేఖ రాసింది. సంక్షోభంలో ఉన్న ఎఫ్ఆర్ఎల్కు తాము ఆర్థిక సహాయం అందిస్తామంటూ ఆఫర్ చేసినప్పటికీ అప్పట్లో రిలయన్స్‌కు రిటైల్ వ్యాపార విక్రయ డీల్‌పై చర్చల సాకును చూపించి స్వతంత్ర డైరెక్టర్లు తమ ప్రతిపాదన తిరస్కరించారని పేర్కొంది. ఆ తర్వాత కంపెనీ, దాని ప్రమోటర్లు, డైరెక్టర్లు మొదలైన వారంతా రిలయన్స్ గ్రూప్‌తో కుమ్మక్కై ఎఫ్ఆర్ఎల్ నుంచి రిటైల్ స్టోర్స్‌ను వేరు చేశారని, ఈ మోసాన్ని అడ్డుకోవడానికి స్వతంత్ర డైరెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అమెజాన్ ఆరోపించింది. తద్వారా ప్రజలు, నియంత్రణ సంస్థలను మోసం చేశారని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో చట్టప్రకారం ప్రమోటర్లతో పాటు డైరెక్టర్లకు కూడా జైలు శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాల ద్వారా రిటైల్ వ్యాపారమైన ఎఫ్‌ఆర్‌ఎల్‌లో అమెజాన్‌కు స్వల్ప వాటాలు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో రిటైల్ వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు రూ. 24,713 కోట్లకు విక్రయించేందుకు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పం దం కుదుర్చుకుంది. అయితే, ఇది తన ప్రయోజనాలకు విరుద్ధమంటూ అమెజాన్ న్యాయస్థానాలు, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్‌ను ఆశ్రయించగా పలు చోట్ల దానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ప్రస్తుతం దీనిపై ఇంకా న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్ఎల్ డీల్‌ను రిలయన్స్ రద్దు చేసుకుంది. రిటైల్ స్టోర్స్ లీజు బకాయిలు తమకు కట్టనందున వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. -
అవార్డు రెడీ! అమౌంట్ రెడీయేనా!!
దిగాలుగా కూర్చున్న శోభను చూస్తూ ‘ఏమైంది..?’ అడిగింది లలిత. ముందు కొంచెం సంశయించినా అసలు విషయం చెప్పక తప్పింది కాదు శోభకి. ∙∙∙ ఆర్నెల్లుగా శోభ యూ ట్యూబ్‌లో వంటల ఛానెల్ నడుపుతోంది. వారంలో రెండు రకాల వంటలైనా అప్లోడ్ చేస్తుంటుంది. ఛానెల్ మానిటైజేషన్‌కు దగ్గరలో ఉంది. సబ్స్క్రైబర్ల జాబితా ఇంకాస్త పెరిగితే అనుకున్న టార్గెట్ పూర్తవుతుందనే ఆనందంలో ఉంది శోభ. ఓరోజున వీడియో షూట్లో బిజీగా ఉన్న శోభ ఫోన్ రింగయ్యింది. కొత్త నెంబర్. ఫోన్ చేసినవారు తమని తాము పరిచయం చేసుకున్నారు. విషయం విన్న శోభ మొహం వెలిగిపోయింది. రూల్స్ అన్నీ నోట్ చేసుకుంది. పని పూర్తయ్యాక నోట్ చేసుకున్న వెబ్సైట్లో తన వివరాలన్నీ ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసుకుంది. మరుసటి రోజు మరో కొత్త నెంబర్ నుంచి ఫోన్. శోభ ఇచ్చిన వివరాలన్నీ చాలా బాగున్నాయని, కార్పోరేట్ çసంస్థలతో డీల్‌కి ఈ ప్రొఫైల్ వెళ్లాలంటే ది బెస్ట్ అవార్డు ఒకటుండాలని, అది తమ కంపెనీ ఇస్తుందంటూ ఇప్పటి వరకు అవార్డు వచ్చినవారు ఏ స్థాయిలో ఉన్నారో ఊరిస్తూ చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలతో మెయిల్ పంపించాం చెక్ చేయండి అని చెబుతూ... అవార్డుకి రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంద’న్నారు. ముందు కొంచెం తటపటాయించినా, ‘పెద్ద స్థాయి కంపెనీల నుంచి స్పాన్సర్స్ వస్తే ఛానెల్ పాపులర్ అవుతుంది, ఆదాయమూ పెరుగుతుంది. కదా..‘ఇంట్లోవారికి చెబితే ఈ డిజిటల్ గోల వారికి అర్ధం కాదు. పైగా ఎన్నో ప్రశ్నలు వేసి విసిగిస్తారు, వద్దులే!’ అనుకుంది. అవార్డు కంపెనీ పెట్టిన నిబంధనలకు ఓకే చెబుతూ.. వారు చెప్పిన అమౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేసింది. వారం రోజులుగా అవార్డ్ కంపెనీ నుంచి ఫోన్ వస్తుందని, మెయిల్ వస్తుందని ఎదురు చూస్తూనే ఉంది. ఈ విషయమంతా శోభ ద్వారా విన్న లలిత... ‘నువ్వు మోసపోయావు శోభా! డబ్బు సెండ్ చేసే ముందు ఒక్క మాటైనా నాకు చెప్పాలింది. సోషల్ మీడియాలో ఇటీవల ‘అవార్డు ఇస్తామహో..’ అనే మోసాలు ఎక్కువగా పుట్టుకు వస్తున్నాయి. పాతిక వేల నుంచి పాతిక లక్షల వరకు టోపీ పెడుతున్నారు అవార్డ్ ఫ్రాడ్స్.. అంటూ ఏయే విధంగా సోషల్ మీడియాలో ఈ తరహా మోసాలు జరుగుతున్నాయో వివరించింది లలిత. టార్గెట్ ఇలా మొదలు ► కరోనా మొదలైనప్పటి నుంచి ఇలా అవార్డ్ ఫ్రాడ్ చేసే వారి సంఖ్య పెరిగింది. మహిళలను, టీనేజర్స్‌ను టార్గెట్ చేసుకొని అవార్డు గాలం వేస్తుంటారు. ► ఛానెల్ మానిటైజేషన్‌కి అంచున ఉన్నవారు మొదటి టార్గెట్. ► సోషల్ ప్రొఫైల్స్‌లో పూర్తి వివరాలున్నవారు, సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నవారు రెండవ టార్గెట్. ► మీరు, మీ వర్క్ చాలా బాగుంది అంటూ మాటలు కలుపుతారు. మీకు బెస్ట్ అవార్డు తప్పక వస్తుందని నమ్మబలుకుతారు. ► తమ కంపెనీ నుంచి తీసుకున్న అవార్డుతో జాతీయ స్థాయిలో ఫేమస్ అవుతారని, అలా ఇప్పటివరకు ఫేమస్ అయినవారి జాబితా చూపుతారు. అవార్డు తీసుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీరు మరింత ఫోకస్ అవుతారని మాటల్లో పెడతారు. ముంబయ్ లేదా ఢిల్లీ వంటి నగరాలలో పెద్ద స్థాయి వేదికల మీద వచ్చి అవార్డు ఫంక్షన్ అంటారు. ► మా దగ్గర మీరు అవార్డు తీసుకుంటే మీ ప్రొఫైల్ కార్పోరేట్ స్పాన్సర్స్‌కు వెళుతుందని, అప్పుడు వారు మీకు స్పాన్సర్షిప్ ఇస్తారని చెబుతారు. ► సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్.. ఇలా అవార్డ్‌కి ఒక రేటు చొప్పున చెబుతారు. డబ్బులు ఎక్కువ ఇచ్చేవారుంటే డైమండ్ అవార్డ్ ఎర వేస్తారు. ► ఇంకా లొంగిపోతే మీ ఛానెల్‌ని ముందుకు తీసుకెళ్తాం.. అంటూ ఇంకా డబ్బులు లాగుతారు. సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ ఎప్పుడూ ఈ తరహా పనిలో ఉంటారు. మేం కన్ఫర్మ్ చేసుకుంటాం అంటూ... రెండు, మూడు వీడియోలు కూడా లైవ్ లో చేయిస్తారు. రిజిస్ట్రేషన్‌కే 5 నుంచి 10 వేల రూపాయలు కట్టించుకుంటారు. ∙ లింక్స్‌ను గుడ్డిగా క్లిక్ చేయకూడదు వాస్తవానికి పెద్ద పెద్ద కార్పొరేట్ డీల్స్‌తో ఒక వీడియో చేస్తే పాతికవేల ఆదాయం వస్తుంది. వీరు కూడా అలాగే ఆలోచించి రెండు వీడియోలు చేసినా యాభై వేలు వస్తుంది కదా! అనుకుంటారు. అందుకు అవార్డు ఒక అర్హతగా నమ్ముతారు. అలాగే డబ్బులు పోగొట్టుకుంటారు. మోసగాళ్లు పాష్ ఇంగ్లిష్ మాట్లాడే ఒకరిద్దరిని అపాయింట్ చేసుకొని ఈ తరహా ఫ్రాడ్‌కి తెర లేపుతుంటారు. అందుకే ఒకే నెంబర్ నుంచి కాకుండా కొత్త కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు వస్తుంటాయి. డబ్బులు ఇచ్చి అవార్డు ఇస్తున్నారంటేనే అది పెద్ద స్కామ్ అనుకోవాలి. అలాంటి లింక్స్ ఏవైనా వచ్చినా క్లిక్ చేయకూడదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ అత్యాశకు పోకూడదు ఈ తరహా ఫ్రాడ్స్ గురించి కేసులు ఫైల్ అవలేదు. కానీ, నేరాలు జరుగుతున్నాయనేది మాత్రం వాస్తవం. డబ్బులిచ్చి అవార్డు తీసుకోవడం అనేదే పెద్ద స్కామ్ అని గుర్తించాలి. నిజమైన అవార్డు ఇచ్చేవారెవరూ డబ్బులు తీసుకోరని గుర్తుంచుకోవాలి. డిజిటల్ మార్కె టింగ్ గురించి కూలంకషంగా తెలుసుకొని, జాగ్రత్త వహించాలి. కానీ, ఆత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకూడదు. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
ప్రజలను అప్రమత్తం చేయండి
♦ మోసపూరిత ఆఫర్ల విషయమై ♦ బ్యాంక్‌లకు ఆర్బీఐ సూచన ముంబై: ఈ మెయిల్స్, ఫోన్ కాల్స్ ద్వారా వచ్చే మోసపూరిత ఆఫర్ల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) బ్యాంకులకు సూచించింది. ఆర్థికాంశాల పట్ల తగిన అవగాహన లేకపోవడం, జాగరూకత లేకపోవడం వల్ల అమాయకులైన ప్రజలు ఇలాంటి మోసపూరిత ఆఫర్లకు బలై నష్టపోతున్నారని ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి స్కీమ్‌లు/ఆఫర్ల పట్ల ప్రజలే కాకుండా బ్యాంక్‌లు కూడా నష్టపోతున్నాయని వివరించింది. లాటరీ తగిలిందనో లేక ప్రైజ్‌లు వచ్చాయనో ఫోన్‌కాల్స్, ఈమెయిల్స్ వస్తాయని, కొంత మొత్తం డబ్బులు డిపాజిట్ చేస్తే ఈ లాటరీ/ప్రైజ్‌లు మీకు వస్తాయని మోసగాళ్లు ప్రలోభపెడతారని పేర్కొంది. వాళ్లు చెప్పినట్లుగా డబ్బులు డిపాజిట్ చేస్తే ఆ తర్వాత ఎలాంటి స్పందన ఉండదని వివరించింది. బ్యాంకులు తమ ఖాతాదారుల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈ తరహా మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేలా పోస్టర్లు, పాంప్లెట్లు, నోటీసులు, ఇంకా ఇతర మార్గాల ద్వారా బ్రాంచ్‌లు, ఏటీఎంల్లో విస్తృతమైన ప్రచారం చేయాలని ఆర్బీఐ సూచించింది. మోసపూరిత ఆఫర్ల పట్ల ప్రజలు ఆకర్షితులు కాకుండా చూడడంలో బ్యాంక్ సిబ్బంది తగిన తోడ్పాటునందించాలని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ. లక్షకు మించిన మోసపూరిత కేసులు 861 నమోదయ్యాయని, వీటి విలువ రూ.4,920 కోట్లని వివరించింది. ఇక 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,651 కేసులు నమోదయ్యాయని, వీటి విలువ రూ.11,083 కోట్లని పేర్కొంది.