Fraudsters Target Youtube Cooking Channels By Offering False Awards - Sakshi
Sakshi News home page

అవార్డు రెడీ! అమౌంట్‌ రెడీయేనా!!

Published Thu, Jul 22 2021 12:58 AM | Last Updated on Thu, Jul 22 2021 10:26 AM

Awards Frauds Entering to YouTube Cooking Channels  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దిగాలుగా కూర్చున్న శోభను చూస్తూ ‘ఏమైంది..?’ అడిగింది లలిత.
ముందు కొంచెం సంశయించినా అసలు విషయం చెప్పక తప్పింది కాదు శోభకి.

∙∙∙
ఆర్నెల్లుగా శోభ యూ ట్యూబ్‌లో వంటల ఛానెల్‌ నడుపుతోంది. వారంలో రెండు రకాల వంటలైనా అప్‌లోడ్‌ చేస్తుంటుంది. ఛానెల్‌ మానిటైజేషన్‌కు దగ్గరలో ఉంది. సబ్‌స్క్రైబర్ల జాబితా ఇంకాస్త  పెరిగితే అనుకున్న టార్గెట్‌ పూర్తవుతుందనే ఆనందంలో ఉంది శోభ.

ఓరోజున వీడియో షూట్‌లో బిజీగా ఉన్న శోభ ఫోన్‌ రింగయ్యింది. కొత్త నెంబర్‌. ఫోన్‌ చేసినవారు తమని తాము పరిచయం చేసుకున్నారు. విషయం విన్న శోభ మొహం వెలిగిపోయింది. రూల్స్‌ అన్నీ నోట్‌ చేసుకుంది. పని పూర్తయ్యాక నోట్‌ చేసుకున్న వెబ్‌సైట్‌లో తన వివరాలన్నీ ఇచ్చి, రిజిస్ట్రేషన్‌ చేసుకుంది. మరుసటి రోజు మరో కొత్త నెంబర్‌ నుంచి ఫోన్‌. శోభ ఇచ్చిన వివరాలన్నీ చాలా బాగున్నాయని, కార్పోరేట్‌ çసంస్థలతో డీల్‌కి ఈ ప్రొఫైల్‌ వెళ్లాలంటే ది బెస్ట్‌ అవార్డు ఒకటుండాలని, అది తమ కంపెనీ ఇస్తుందంటూ ఇప్పటి వరకు అవార్డు వచ్చినవారు ఏ స్థాయిలో ఉన్నారో ఊరిస్తూ చెప్పారు.

అందుకు సంబంధించిన వివరాలతో మెయిల్‌ పంపించాం చెక్‌ చేయండి అని చెబుతూ... అవార్డుకి రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంద’న్నారు. ముందు కొంచెం తటపటాయించినా, ‘పెద్ద స్థాయి కంపెనీల నుంచి స్పాన్సర్స్‌ వస్తే ఛానెల్‌ పాపులర్‌ అవుతుంది, ఆదాయమూ పెరుగుతుంది. కదా..‘ఇంట్లోవారికి చెబితే ఈ డిజిటల్‌ గోల వారికి అర్ధం కాదు. పైగా ఎన్నో ప్రశ్నలు వేసి విసిగిస్తారు, వద్దులే!’ అనుకుంది. అవార్డు కంపెనీ పెట్టిన నిబంధనలకు ఓకే చెబుతూ.. వారు చెప్పిన అమౌంట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసింది.

వారం రోజులుగా అవార్డ్‌ కంపెనీ నుంచి ఫోన్‌ వస్తుందని, మెయిల్‌ వస్తుందని ఎదురు చూస్తూనే ఉంది. ఈ విషయమంతా శోభ ద్వారా విన్న లలిత...
‘నువ్వు మోసపోయావు శోభా! డబ్బు సెండ్‌ చేసే ముందు ఒక్క మాటైనా నాకు చెప్పాలింది. సోషల్‌ మీడియాలో ఇటీవల ‘అవార్డు ఇస్తామహో..’ అనే మోసాలు ఎక్కువగా పుట్టుకు వస్తున్నాయి. పాతిక వేల నుంచి పాతిక లక్షల వరకు టోపీ పెడుతున్నారు అవార్డ్‌ ఫ్రాడ్స్‌.. అంటూ ఏయే విధంగా సోషల్‌ మీడియాలో ఈ తరహా మోసాలు జరుగుతున్నాయో వివరించింది లలిత.   

టార్గెట్‌ ఇలా మొదలు
► కరోనా మొదలైనప్పటి నుంచి ఇలా అవార్డ్‌ ఫ్రాడ్‌ చేసే వారి సంఖ్య పెరిగింది. మహిళలను, టీనేజర్స్‌ను టార్గెట్‌ చేసుకొని అవార్డు గాలం వేస్తుంటారు.
► ఛానెల్‌ మానిటైజేషన్‌కి అంచున ఉన్నవారు మొదటి టార్గెట్‌.
► సోషల్‌ ప్రొఫైల్స్‌లో పూర్తి వివరాలున్నవారు, సోషల్‌ యాక్టివిటీస్‌ ఎక్కువగా ఉన్నవారు రెండవ టార్గెట్‌.
► మీరు, మీ వర్క్‌ చాలా బాగుంది అంటూ మాటలు కలుపుతారు. మీకు బెస్ట్‌ అవార్డు తప్పక వస్తుందని నమ్మబలుకుతారు.
► తమ కంపెనీ నుంచి తీసుకున్న అవార్డుతో జాతీయ స్థాయిలో ఫేమస్‌ అవుతారని, అలా ఇప్పటివరకు ఫేమస్‌ అయినవారి జాబితా చూపుతారు. అవార్డు తీసుకుంటే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ కాబట్టి మీరు మరింత ఫోకస్‌ అవుతారని మాటల్లో పెడతారు. ముంబయ్‌ లేదా ఢిల్లీ వంటి నగరాలలో పెద్ద స్థాయి వేదికల మీద వచ్చి అవార్డు ఫంక్షన్‌ అంటారు.
► మా దగ్గర మీరు అవార్డు తీసుకుంటే మీ ప్రొఫైల్‌ కార్పోరేట్‌ స్పాన్సర్స్‌కు వెళుతుందని, అప్పుడు వారు మీకు స్పాన్సర్‌షిప్‌ ఇస్తారని చెబుతారు.
► సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్‌.. ఇలా అవార్డ్‌కి ఒక రేటు చొప్పున చెబుతారు. డబ్బులు ఎక్కువ ఇచ్చేవారుంటే డైమండ్‌ అవార్డ్‌ ఎర వేస్తారు.
► ఇంకా లొంగిపోతే మీ ఛానెల్‌ని ముందుకు తీసుకెళ్తాం.. అంటూ ఇంకా డబ్బులు లాగుతారు. సోషల్‌ ఇంజనీరింగ్‌ ఫ్రాడ్స్‌ ఎప్పుడూ ఈ తరహా పనిలో ఉంటారు. మేం కన్ఫర్మ్‌ చేసుకుంటాం అంటూ... రెండు, మూడు వీడియోలు కూడా లైవ్‌ లో చేయిస్తారు. రిజిస్ట్రేషన్‌కే 5 నుంచి 10 వేల రూపాయలు కట్టించుకుంటారు.


లింక్స్‌ను గుడ్డిగా క్లిక్‌ చేయకూడదు
వాస్తవానికి పెద్ద పెద్ద కార్పొరేట్‌ డీల్స్‌తో ఒక వీడియో చేస్తే పాతికవేల ఆదాయం వస్తుంది. వీరు కూడా అలాగే ఆలోచించి రెండు వీడియోలు చేసినా యాభై వేలు వస్తుంది కదా! అనుకుంటారు. అందుకు అవార్డు ఒక అర్హతగా నమ్ముతారు. అలాగే డబ్బులు పోగొట్టుకుంటారు. మోసగాళ్లు పాష్‌ ఇంగ్లిష్‌ మాట్లాడే ఒకరిద్దరిని అపాయింట్‌ చేసుకొని ఈ తరహా ఫ్రాడ్‌కి తెర లేపుతుంటారు. అందుకే ఒకే నెంబర్‌ నుంచి కాకుండా కొత్త కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు వస్తుంటాయి. డబ్బులు ఇచ్చి అవార్డు ఇస్తున్నారంటేనే అది పెద్ద స్కామ్‌ అనుకోవాలి. అలాంటి లింక్స్‌ ఏవైనా వచ్చినా క్లిక్‌ చేయకూడదు.

– అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

అత్యాశకు పోకూడదు
ఈ తరహా ఫ్రాడ్స్‌ గురించి కేసులు ఫైల్‌ అవలేదు. కానీ, నేరాలు జరుగుతున్నాయనేది మాత్రం వాస్తవం. డబ్బులిచ్చి అవార్డు తీసుకోవడం అనేదే పెద్ద స్కామ్‌ అని గుర్తించాలి. నిజమైన అవార్డు ఇచ్చేవారెవరూ డబ్బులు తీసుకోరని గుర్తుంచుకోవాలి. డిజిటల్‌ మార్కె టింగ్‌ గురించి కూలంకషంగా తెలుసుకొని, జాగ్రత్త వహించాలి. కానీ, ఆత్యాశకు పోయి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకోకూడదు.

– జి.ఆర్‌. రాధిక, ఎస్పీ, (సైబర్‌ క్రైమ్‌ విభాగం), ఏపీ పోలీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement