best award
-
ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?
ప్రపంచవ్యాప్తంగా వివిధ అంశాల్లో ఫొటోగ్రఫీ పోటీలు జరుగుతుంటాయి. అలాగే ఫుడ్‌కు సంబంధించి కూడా పోటీ ఉంది. ఫుడ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2024 పోటీలో ఫుడ్ ఫోటోగ్రఫీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఔత్సాహిక , ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకు బహుమతులను ప్రదానం చేస్తుంది. ఫుడ్ ఫర్ సేల్, ఫుడ్ ఫర్ ఫ్యామిలీ,ఫుడ్ ఇన్ యాక్షన్ ఇలా పలు కేటగిరీల్లో బహుతులను అందిస్తుంది. పింక్ లేడీ మూమెంట్స్‌తో పాటు మహిళా ఫోటోగ్రాఫర్లకు ప్రత్యేక అవార్డులు కూడా ఉన్నాయి. ఇథియోపియాలోని ఒక గ్రామంలో కరో తెగకు మహిళలు స్టోన్ గ్రైండర్లతో బియ్యం ముద్ద తయారు చేస్తున్న చిత్రం. తీసింది ఇండియాకు చెందిన సంఘ మిత్ర సర్కార్. ఇది షార్ట్ లిస్ట్ అయింది. ఫుడ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పేరుతో ఉత్తమ అవార్డును ఇస్తుంది. ఈ క్రమంలో వెజిటబుల్ మ్యాన్ చిత్రాన్ని బ్రిటన్‌కు చెందిన కేరొలీన్ తీసిన ఫోటో విశేషంగా నిలుస్తోంది. ఈ చిత్రం ఫుడ్ ఫొటోగ్రఫీ పోటీలో ఫైనలిస్టుల్లో ఒకటిగా నిలిచింది. వెజిటబుల్ మ్యాన్ 13వ ఎడిషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా 65 కంటే ఎక్కువ దేశాల నుండి వేలాది ఫోటోలు పోటీ పడుతున్నాయి. ఫైనలిస్టుల ఫోటోలను లండన్‌లోని ది మాల్ గ్యాలరీస్‌లో ప్రదర్శిస్తారు. జూన్ 4న లండన్‌లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో విజేతలను ప్రకటిస్తారు. విజేత 5వేల యూరోలను బహుమతి గెల్చుకోవచ్చు. ఫుడ్ ఫర్ సేల్ కేటగిరీ టిప్ ట్రీ కేక్, వైన్ ఫోటోగ్రఫీ 👉 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Dr Aparna Buzarbarua: విశ్రాంత సమయాన అవిశ్రాంత కృషి
‘అపర్ణ మేడం పాఠం ఒక్కసారి వింటే ప్రతి చెట్టు, ప్రతి పువ్వుతో స్నేహం చేయాలనిపిస్తుంది’ ‘అపర్ణ స్వరపరిచిన పాటలు వింటే అద్భుతం అనిపిస్తుంది’ ‘అపర్ణ వినిపించే వీణ స్వరాలు అపురూపం’ ‘అపర్ణ రాసిన పుస్తకాలు శాస్త్రీయ విషయాలను సైతం చాలా సులభంగా అర్థమయ్యేలా చెబుతాయి’... ఇలాంటి కామెంట్స్ అపర్ణ గురించి తరచుగా వినిపిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే డా. అపర్ణ బుజర్ బారువా బహుముఖ ప్రజ్ఞాశాలి. విశ్రాంత జీవితానికి కొత్త అర్థం ఇచ్చిన ప్రతిభావంతురాలు. కోల్‌కతాలో జరిగిన ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె తీసిన ‘దూలియ కల్చర్ ఆఫ్ వోల్డ్ కామ్రూప్’ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్‌ను అందుకుంది... సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే అస్సాంలోని తేజ్‌పూర్‌లో పుట్టిపెరిగింది అపర్ణ. గువహటిలోని కాటన్ కాలేజీలో బాటనీ లెక్చరర్‌గా తన ఉద్యోగప్రస్థానాన్ని 1969లో ప్రారంభించిన అపర్ణ ఒకవైపు విద్యార్థులకు బాటనీ పాఠాలు బోధిస్తూనే మరోవైపు విద్యార్థిగా మ్యూజిక్ కాలేజీలో చేరి సంగీత పాఠాలు నేర్చుకునేది. సంగీత విద్యాపీuŠ‡ నుంచి సితార్లో విశారద్ డిగ్రీ పొందింది. ఎంతోమంది కవుల పాటలకు స్వరాలు సమకూర్చింది. ఆ పాటలు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమై ఆదరణ పొందాయి. వందపాటలకు పైగా స్వరాలు అందించిన అపర్ణ ఏఐఆర్ గువహటి ఫస్ట్ ఉమెన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అరుదైన ఘనతను దక్కించుకుంది. 2003లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హోదాలో పదవీ విరమణ చేసిన అపర్ణ ‘ఇది విశ్రాంతి సమయం’ అనుకోలేదు. ‘ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి చాలా సమయం దొరికింది’ అనుకుంది. తన సాంస్కృతిక మూలాలను వెదుక్కుంటూ వెళ్లింది. కొత్త సంగీత ధోరణులను అధ్యయనం చేసింది. సంస్కృతి, సాహిత్యం, శాస్త్రీయ రంగాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు రాసింది. గువహటిలోని గీతానగర్‌లో తన భర్త నాగేంద్రనాథ్ బుజర్ బారువా పేరు మీద చక్కటి లైబ్రరీ ఏర్పాటు చేసింది. కాలంతో పాటు నడుస్తూ షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు తీయడం నేర్చుకుంది. 26 నిమిషాల నిడివి ఉన్న ‘దూలియ కల్చర్ ఆఫ్ వోల్డ్ కామ్రూప్’ డాక్యుమెంటరీ అపర్ణకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చింది. ‘దూలియ సంస్కృతి గత, వర్తమానాలకు అద్దం పట్టేలా ఈ డాక్యుమెంటరీని రూపొందించాను. దూలియా లాంటి ప్రత్యేక సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అంటుంది అపర్ణ. దూలియ అనేది పురాతన కళారూపం. దూలియ సంస్కృతి వైభవం గాయకుల పాటల్లో, ఆటల్లో, తోలుబొమ్మలాటలో కనిపిస్తుంది. గానం, నటన, హాస్యప్రదర్శన, డప్పులు వాయించడం... ఎన్నో కళల సమాహారంగా దూలియ సంస్కృతి ఉండేది. ఈ పురాతన కళారూపం గురించి ఊరూవాడా తిరిగి లోతైన పరిశోధన చేసింది అపర్ణ. తాను తెలుసుకున్న విషయాలకు డాక్యుమెంటరీ రూపాన్ని ఇచ్చింది. దూలియ సంస్కృతికి తన జీవితాన్ని అంకితం చేసిన డ్రమ్మర్, నటుడు మోహన్ చంద్ బర్మన్ కృషిని ఈ డాక్యుమెంటరీ హైలెట్ చేస్తుంది. దూలియ సంస్కృతిపై అపర్ణకు ఆసక్తి, అనురక్తి ఎలా పెరిగింది అనే విషయానికి వస్తే.... కొన్ని సంవత్సరాల క్రితం గువహటిలోని గీతానగర్ రాస్ ఫెస్టివల్లో కామ్రూపియా ప్రదర్శనను ప్రారంభించడానికి అపర్ణను ఆహ్వానించారు నిర్వాహకులు. ఈ ప్రదర్శను చూసి అపర్ణ మంత్రముగ్ధురాలైంది. ఈ ఆనందం ఒక కోణం అయితే కళాకారుల ఆర్థిక కష్టాలు తెలుసుకొని బాధ పడడం మరో కోణం. ఇక ఆరోజు నుంచి కామ్రూప్ కళాకారుల కోసం తన వంతుగా ఏదైనా చేయాలని తపించి పోయింది. ఈ గొప్ప కళారూపాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తే, సహాయం చేసే ద్వారాలు తెరుచుకుంటాయని నిర్ణయించుకొని తన నిర్మాణ, దర్శకత్వంలో డాక్యుమెంటరీ ప్రారంభించింది. ఏ లక్ష్యంతో అయితే ఈ డాక్యుమెంటరీ నిర్మాణానికి అపర్ణ పూనుకుందో అది నెరవేరే సమయం వేగవంతం అయింది. దూలియ సంస్కృతి గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ పురాతన కళారూపాన్ని తమ భుజాల మీద మోస్తున్న అరుదైన కళాకారులకు సహాయం అందడమే ఇక తరువాయి. ఏ పని మొదలుపెట్టినా ‘అంతా మంచే జరుగుతుంది’ అనుకోవడం అపర్ణ సెంటిమెంట్. కళాకారులకు సహాయం అందే విషయంలో కూడా ఆమె సెంటిమెంట్ నెరవేరాలని ఆశిద్దాం. నా వయసు జస్ట్ 78 ప్లస్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్‌ను అందుకోవడానికి వేదికపైకి వచ్చినప్పుడు యాంకర్ నన్ను ఆశ్చర్యంగా చూసి ‘మీ వయసు ఎంత?’ అని అడిగారు. 78 ప్లస్ అని చెప్పగానే ‘మీరు నిజంగా ఈ తరానికి స్ఫూర్తి’ అన్నారు. ఇది విని ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ఈ చప్పట్లను కూడా నాకు వచ్చిన అపురూపమైన అవార్డ్‌గానే భావిస్తున్నాను. మొదటి డాక్యుమెంటరీకే నాకు పెద్ద పేరు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. – డా.అపర్ణ బుజర్ బారువా -
స్వీట్ ఎక్స్పెరిమెంట్: పరిశోధనత్రయం
3డీ బయో ప్రింటెడ్ హ్యూమన్ మోడల్స్ రూపకల్పనకు గాను ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలకు ‘బెస్ట్ రీసెర్చ్’ అవార్డు వచ్చింది. సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ఉదయ్ సక్సేనా, డాక్టర్ సుబ్రహ్మణ్యం వంగల పర్యవేక్షణలో యువ శాస్త్రవేత్తలు శరణ్య, అర్పిత రెడ్డి, ఆర్. ఎన్, సంజన బత్తుల సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన ఇది. వీళ్లు టైప్ 2 డయాబెటిస్ డ్రగ్‌ను టెస్ట్ చేసే త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. అలానే టైప్ 2 డయాబెటిస్ నివారణకు అవసరమైన సప్లిమెంట్‌ను కూడా రూపొందించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు యువ శాస్త్రవేత్తలు సాక్షితో పంచుకున్న వివరాలివి. దాదాపుగా ప్రతి సృష్టి మానవ దేహభాగాలను పోలిన మోడల్స్‌ను సృష్టించి వాటి మీద ఔషధాల పని తీరును పరిశీలించడం ద్వారా సత్వర ఫలితాలను సాధించవచ్చని నిరూపించారు ఈ యంగ్ సైంటిస్ట్‌లు. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కోవిడ్‌ను నియంత్రించడానికి తయారు చేసిన మందులు ఎలా పని చేస్తున్నాయోనని నిర్ధారణ చేసుకోవడానికి జంతువుల మీద ప్రయోగించి తెలుసుకునే సమయం లేకపోయింది. ఒక ఔషధం ప్రయోగ దశలన్నీ పూర్తి చేసుకుని మార్కెట్లోకి రావడానికి సంవత్సరాలు పడుతుంది. కోవిడ్ సమయంలో అంత సమయం లేదు. అప్పుడు ఈ త్రీడీ బయోప్రింటెడ్ హ్యూమన్ లైక్ మోడల్ బాగా ఉపయోగపడింది. అలాగే ఇదే టెక్నాలజీ ఆధారంగా టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ చూపిస్తున్న ప్రభావాన్ని యాక్యురేట్‌గా తెలుసుకునే విధంగా హ్యూమన్‌లైక్ టైప్ 2 డయాబెటిస్ మోడల్ని డెవలప్ చేశారు. ప్రస్తుతం ఈ యంగ్ సైంటిస్ట్‌లు ముగ్గురూ రీసెర్చ్ అసోసియేట్లుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌లో ఇన్క్యుబేషన్ సెంటర్లోని రీజెనె ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పరిశోధనలు చేస్తున్నారు. ‘‘హెల్త్ సైన్సెస్‌లో పరిశోధనల అవసరం చాలా ఉంది. కోవిడ్ పాండమిక్ సమయంలో హ్యూమన్‌లైక్ మోడల్ ఆవశ్యకత తెలిసింది. మా పరిశోధనలో త్రీడీ బయో ప్రింటెడ్ హ్యూమన్ వాస్క్యులార్ లంగ్ మోడల్ తర్వాత టైప్ టూ డయాబెటిస్ మోడల్ మీద దృష్టి పెట్టాం. దాదాపుగా ఏడాది పాటు జరిగిన ప్రయోగం ఇది. ఒక వ్యక్తి డయాబెటిక్ దశకు చేరకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగిన విధంగా ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్‌ని రూపకల్పన చేయడంలో సక్సెస్ అయ్యాం. సమాజానికి అవసరమైన పని చేశామనే సంతృప్తి కలుగుతోంది’’ అన్నారు సంజన. ఆమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి సంజన. గ్రాడ్యుయేషన్ యూఎస్‌లోని యూసీ డేవిస్‌లో పూర్తి చేసి హైదరాబాద్‌లో పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. సంజన బత్తుల ‘‘సాధారణంగా జంతువుల మీద ప్రయోగం చేసి ఆ తర్వాత మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఒక ఔషధం ఇలా అన్ని దశలూ పూర్తి చేసుకోవడానికి దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది. అంతే కాదు, కొన్ని సందర్భాల్లో జంతువుల్లో మంచి ఫలితాలనిచ్చిన డ్రగ్ మనుషులలో అంత కచ్చితంగా పని చేయకపోవచ్చు కూడా. మేము రూపొందించిన ప్రయోగంలో హ్యూమన్ లైక్ డిసీజ్ మోడల్స్‌ని డెవలప్ చేసి వాటి మీద ఔషధాన్ని ప్రయోగించాం. దాంతో రిజల్ట్ త్వరగా తెలుసుకోగలిగాం. అలాగే టైప్ టూ డయాబెటిస్ మోడల్లో వివిధ రకాల యాంటీ డయాబెటిక్ డ్రగ్స్‌తోపాటు డివిటిజ్ అనే న్యూట్రాస్యుటికల్ సప్లిమెంట్‌ని కూడా ప్రయోగించి చూశాం. ఈ న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్ కండరాల్లో గ్లూకోజ్ స్వీకరణకు పనిచేస్తుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా మంచి ఫలితాలనిచ్చాయి. ఈ సప్లిమెంట్ మార్కెట్లోకి వచ్చి ఐదు నెలలైంది’’ అని చెప్పారు అర్పిత రెడ్డి. ఆమెది వ్యవసాయ కుటుంబం. కర్నాటకలోని కోలార్ జిల్లా, శ్రీనివాసపుర తాలూక, రాయల్పాడు గ్రామం. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ, బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్‌లో సెల్యూలార్ అండ్ మాలిక్యులార్ డయాగ్నస్టిక్స్‌లో పీజీ డిప్లమో చేశారు. అర్పిత రెడ్డి, ఆర్. ఎన్ టైప్ వన్ జన్యుకారణాలతో వస్తుంది. టైప్ టూ డయాబెటిస్ మన దగ్గర లైఫ్ స్టయిల్ డిసీజ్‌గా మారిపోయింది. డయాబెటిక్ కండిషన్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతాయి. ఒక వ్యక్తి డయాబెటిస్ కండిషన్‌కి రావడానికి ముందు కొంతకాలం ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉంటారు. ఆ దశలో తెలుసుకోగలిగితే దేహానికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు. అందుకే మేము కండరాల కణజాలం మీద పని చేసే సప్లిమెంట్ మీద దృష్టిపెట్టాం’’ అని చెప్పారు శరణ్య. ఆమెది కేరళ రాష్ట్రంలోని కన్నూరు. మంగుళూరు యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో పీజీ, ప్రోటియోమిక్స్లో పీజీ డిప్లమో చేశారు. శరణ్య – వాకా మంజులారెడ్డి -
అన్నాఖబాలే దుబా..: సేవలో.. ది బెస్ట్!
ఏ అంశంలోనైనా అందరికంటే విభిన్నంగా, ప్రత్యేకంగా ఉన్నవారే ‘ది బెస్ట్’గా నిలుస్తారు. ప్రపంచంలోనే ‘ది బెస్ట్’ అని అనిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు. తన ఆలోచనా దృక్పథం, సామాజికాభివృద్ధిపై ఉన్న మక్కువతో ‘అన్నా ఖబాలే దుబా’ ప్రపంచంలోనే ‘బెస్ట్ నర్సు’గా నిలిచింది. గ్రామంలోని వారంతా తనలా ఎదగాలన్న ఆకాంక్షే ‘ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు’ను తెచ్చిపెట్టింది అన్నాకు. అన్నా ఖబాలే దుబా కెన్యాలోని తొర్బి అనే మారుమూల గ్రామంలో పుట్టింది. అక్కడ చదువుకున్నవారు చాలా తక్కువ. ఇక తన కుటుంబంలో అయితే ఒక్కరు కూడా అక్షరాస్యులు లేరు. ఇలాంటి వాతావరణంలో పుట్టిపెరిగిన అన్నా చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేది. ఒకసారి వింటే ఇట్టే పట్టేసే అన్నా గ్రామంలోనే తొలి గ్రాడ్యుయేట్‌గా ఎదిగింది. నర్సింగ్ చదువుతోన్న సమయంలో ‘మిస్ టూరిజం కెన్యా’ కిరీటాన్నీ గెలుచుకుంది. అందరూ తనలా చదవాలని... అన్నా స్వగ్రామంలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండడం వల్ల మూఢనమ్మకాలు అధికంగా ఉండేవి. వీటి కారణంగా ఆడపిల్లలకు చాలా చిన్నవయసులో పెళ్లిళ్లు చేసేవారు. ఆచారం పేరిట వారు చేసే అకృత్యాల మూలంగా అభం శుభం తెలియని ఆడపిల్లలు వైకల్యాల బారినపడేవారు. పద్నాలుగేళ్ల వయసులో బలవంతపు పెళ్లి నుంచి తప్పించుకుంది అన్నా. వీటన్నింటిని చిన్నప్పటి నుంచి ప్రత్యక్షంగా చూసిన అన్నా ఈ మూఢాచారాలను ఎలాగైనా నిర్మూలించాలనుకునేది. నర్సింగ్ డిగ్రీ అయిన తరువాత ఆసుపత్రిలో నర్సుగా చేరింది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ బాల్యవివాహాలతో సహా పలు మూఢాచారాలను తీవ్రంగా వ్యతిరేకించేది. చదువుకోవడం కలిగే ప్రయోజనాలు స్వయంగా రుచిచూసిన అన్నా గ్రామంలోని మిగతా పిల్లలు తనలా చదువుకోవాలని బలంగా కోరుకునేది. ఖబాలే దుబా ఫౌండేషన్.. మూఢాచారాలను వ్యతిరేకించడంతోనే అన్నా ఆగిపోలేదు. గ్రామంలో ఎక్కువమందిని అక్షరాస్యుల్ని చేస్తే మూఢాచారాలను ఆపవచ్చని ... తొర్బి గ్రామంలోని పిల్లలను విద్యావంతులుగా తీర్చిద్దాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ‘ఖబాలే దుబా’ పేరిట పౌండేషన్‌ను స్థాపించింది. కమ్యూనిటీ లిటరసీ కార్యక్రమం ద్వారా గ్రామంలోని పిల్లలు, పెద్దలకు చదువు చెబుతోంది. ఆసుపత్రిలో విధులు ముగించుకున్న తరువాత మిగతా సమయాన్ని.. ఇతర టీచర్లతో కలసి తరగతులు చెప్పడానికి కేటాయించి వందలాదిమంది విద్యకు కృషిచేస్తోంది. ప్రస్తుతం లిటరసీ కార్యక్రమంలో 150 మంది పిల్లలు, 100 మంది పెద్దవాళ్లు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. చదువుతోపాటు లైంగిక, ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యంపైన కూడా అవగాహన కల్పిస్తోంది. గ్రామంలోని పిల్లలకేగాక తన కుటుంబానికి చెందిన 19 మందిని కూడా చదివిస్తోంది అన్నా. 31 ఏళ్ల అన్నా డ్యూటీ, సామాజిక సేవాకార్యక్రమాలతో తీరికలేకుండా ఉన్నప్పటికీ ఎపిడిమియాలజీలో మాస్టర్స్ చేస్తోంది. బెస్ట్ నర్స్‌గా.. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ సంస్థ గ్లోబల్ బెస్ట్ నర్స్‌ను ఎంపికచేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానాలు పంపగా.. 24 వేలమందికిపైగా పోటీపడ్డారు. వేల మందిని వెనక్కు నెట్టి గ్లోబల్ నర్సింగ్ అవార్డుని గెలుచుకుంది అన్నా. ఈ అవార్డుకింద రెండున్నర లక్షల డాలర్లను గెలుచుకుని ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ‘‘నేను ఈరోజు అవార్డును అందుకోవడానికి నా కుటుంబం, మా కమ్యునిటీల ప్రేరణే కారణం. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. మూఢాచారాలనుంచి భవిష్యత్ తరాలను కాపాడడమే నా లక్ష్యం. ఈ అవార్డు ద్వారా వచ్చిన నగదు కెన్యాలో మరిన్ని స్కూళ్ల ఏర్పాటుకు, విస్తరణకు ఉపయోగపడుతుంది’’ అని అన్నా ఆనందం వ్యక్తం చేసింది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు స్కైట్రాక్స్ అవార్డు
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి అత్యుత్తమ ప్రాంతీయ విమానాశ్రయం అవార్డును సొంతం చేసుకుంది. 2021 సంవత్సరానికి గాను ప్రపంచస్థాయిలో ఇచ్చే స్కైట్రాక్స్ అవార్డును దక్కించుకుంది. వరుసగా మూడుసార్లు ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం. దీంతోపాటు ప్రపంచస్థాయిలో నిర్ధారించే టాప్ 100 విమానాశ్రయాల్లో 64 స్థానంలో నిలిచిందని జీఎంఆర్ వర్గాలు సోమవారం వెల్లడించాయి. గతంలో 71వ ర్యాంకు ఉండేదని పేర్కొన్నాయి. ఆన్లైన్ ద్వారా స్కైట్రాక్స్ విమాన ప్రయాణికుల అభిప్రాయాలు, వారి సంతృప్తిని కొలమానంగా చేసుకుని అవార్డులను అందజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 550 విమానాశ్రయాల్లోని ప్రయాణికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులను ప్రకటిస్తుంది. కోవిడ్ పరిస్థితుల్లో కూడా జీఎంఆర్ ఎయిర్పోర్ట్ ఆధునిక సాంకేతికతతో ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతోనే ఈ అవార్డు దక్కిందని గెయిల్ సీఈవో ప్రదీప్ ఫణీకర్ అన్నారు. -
అవార్డు రెడీ! అమౌంట్ రెడీయేనా!!
దిగాలుగా కూర్చున్న శోభను చూస్తూ ‘ఏమైంది..?’ అడిగింది లలిత. ముందు కొంచెం సంశయించినా అసలు విషయం చెప్పక తప్పింది కాదు శోభకి. ∙∙∙ ఆర్నెల్లుగా శోభ యూ ట్యూబ్‌లో వంటల ఛానెల్ నడుపుతోంది. వారంలో రెండు రకాల వంటలైనా అప్లోడ్ చేస్తుంటుంది. ఛానెల్ మానిటైజేషన్‌కు దగ్గరలో ఉంది. సబ్స్క్రైబర్ల జాబితా ఇంకాస్త పెరిగితే అనుకున్న టార్గెట్ పూర్తవుతుందనే ఆనందంలో ఉంది శోభ. ఓరోజున వీడియో షూట్లో బిజీగా ఉన్న శోభ ఫోన్ రింగయ్యింది. కొత్త నెంబర్. ఫోన్ చేసినవారు తమని తాము పరిచయం చేసుకున్నారు. విషయం విన్న శోభ మొహం వెలిగిపోయింది. రూల్స్ అన్నీ నోట్ చేసుకుంది. పని పూర్తయ్యాక నోట్ చేసుకున్న వెబ్సైట్లో తన వివరాలన్నీ ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసుకుంది. మరుసటి రోజు మరో కొత్త నెంబర్ నుంచి ఫోన్. శోభ ఇచ్చిన వివరాలన్నీ చాలా బాగున్నాయని, కార్పోరేట్ çసంస్థలతో డీల్‌కి ఈ ప్రొఫైల్ వెళ్లాలంటే ది బెస్ట్ అవార్డు ఒకటుండాలని, అది తమ కంపెనీ ఇస్తుందంటూ ఇప్పటి వరకు అవార్డు వచ్చినవారు ఏ స్థాయిలో ఉన్నారో ఊరిస్తూ చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలతో మెయిల్ పంపించాం చెక్ చేయండి అని చెబుతూ... అవార్డుకి రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంద’న్నారు. ముందు కొంచెం తటపటాయించినా, ‘పెద్ద స్థాయి కంపెనీల నుంచి స్పాన్సర్స్ వస్తే ఛానెల్ పాపులర్ అవుతుంది, ఆదాయమూ పెరుగుతుంది. కదా..‘ఇంట్లోవారికి చెబితే ఈ డిజిటల్ గోల వారికి అర్ధం కాదు. పైగా ఎన్నో ప్రశ్నలు వేసి విసిగిస్తారు, వద్దులే!’ అనుకుంది. అవార్డు కంపెనీ పెట్టిన నిబంధనలకు ఓకే చెబుతూ.. వారు చెప్పిన అమౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేసింది. వారం రోజులుగా అవార్డ్ కంపెనీ నుంచి ఫోన్ వస్తుందని, మెయిల్ వస్తుందని ఎదురు చూస్తూనే ఉంది. ఈ విషయమంతా శోభ ద్వారా విన్న లలిత... ‘నువ్వు మోసపోయావు శోభా! డబ్బు సెండ్ చేసే ముందు ఒక్క మాటైనా నాకు చెప్పాలింది. సోషల్ మీడియాలో ఇటీవల ‘అవార్డు ఇస్తామహో..’ అనే మోసాలు ఎక్కువగా పుట్టుకు వస్తున్నాయి. పాతిక వేల నుంచి పాతిక లక్షల వరకు టోపీ పెడుతున్నారు అవార్డ్ ఫ్రాడ్స్.. అంటూ ఏయే విధంగా సోషల్ మీడియాలో ఈ తరహా మోసాలు జరుగుతున్నాయో వివరించింది లలిత. టార్గెట్ ఇలా మొదలు ► కరోనా మొదలైనప్పటి నుంచి ఇలా అవార్డ్ ఫ్రాడ్ చేసే వారి సంఖ్య పెరిగింది. మహిళలను, టీనేజర్స్‌ను టార్గెట్ చేసుకొని అవార్డు గాలం వేస్తుంటారు. ► ఛానెల్ మానిటైజేషన్‌కి అంచున ఉన్నవారు మొదటి టార్గెట్. ► సోషల్ ప్రొఫైల్స్‌లో పూర్తి వివరాలున్నవారు, సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నవారు రెండవ టార్గెట్. ► మీరు, మీ వర్క్ చాలా బాగుంది అంటూ మాటలు కలుపుతారు. మీకు బెస్ట్ అవార్డు తప్పక వస్తుందని నమ్మబలుకుతారు. ► తమ కంపెనీ నుంచి తీసుకున్న అవార్డుతో జాతీయ స్థాయిలో ఫేమస్ అవుతారని, అలా ఇప్పటివరకు ఫేమస్ అయినవారి జాబితా చూపుతారు. అవార్డు తీసుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీరు మరింత ఫోకస్ అవుతారని మాటల్లో పెడతారు. ముంబయ్ లేదా ఢిల్లీ వంటి నగరాలలో పెద్ద స్థాయి వేదికల మీద వచ్చి అవార్డు ఫంక్షన్ అంటారు. ► మా దగ్గర మీరు అవార్డు తీసుకుంటే మీ ప్రొఫైల్ కార్పోరేట్ స్పాన్సర్స్‌కు వెళుతుందని, అప్పుడు వారు మీకు స్పాన్సర్షిప్ ఇస్తారని చెబుతారు. ► సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్.. ఇలా అవార్డ్‌కి ఒక రేటు చొప్పున చెబుతారు. డబ్బులు ఎక్కువ ఇచ్చేవారుంటే డైమండ్ అవార్డ్ ఎర వేస్తారు. ► ఇంకా లొంగిపోతే మీ ఛానెల్‌ని ముందుకు తీసుకెళ్తాం.. అంటూ ఇంకా డబ్బులు లాగుతారు. సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ ఎప్పుడూ ఈ తరహా పనిలో ఉంటారు. మేం కన్ఫర్మ్ చేసుకుంటాం అంటూ... రెండు, మూడు వీడియోలు కూడా లైవ్ లో చేయిస్తారు. రిజిస్ట్రేషన్‌కే 5 నుంచి 10 వేల రూపాయలు కట్టించుకుంటారు. ∙ లింక్స్‌ను గుడ్డిగా క్లిక్ చేయకూడదు వాస్తవానికి పెద్ద పెద్ద కార్పొరేట్ డీల్స్‌తో ఒక వీడియో చేస్తే పాతికవేల ఆదాయం వస్తుంది. వీరు కూడా అలాగే ఆలోచించి రెండు వీడియోలు చేసినా యాభై వేలు వస్తుంది కదా! అనుకుంటారు. అందుకు అవార్డు ఒక అర్హతగా నమ్ముతారు. అలాగే డబ్బులు పోగొట్టుకుంటారు. మోసగాళ్లు పాష్ ఇంగ్లిష్ మాట్లాడే ఒకరిద్దరిని అపాయింట్ చేసుకొని ఈ తరహా ఫ్రాడ్‌కి తెర లేపుతుంటారు. అందుకే ఒకే నెంబర్ నుంచి కాకుండా కొత్త కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు వస్తుంటాయి. డబ్బులు ఇచ్చి అవార్డు ఇస్తున్నారంటేనే అది పెద్ద స్కామ్ అనుకోవాలి. అలాంటి లింక్స్ ఏవైనా వచ్చినా క్లిక్ చేయకూడదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ అత్యాశకు పోకూడదు ఈ తరహా ఫ్రాడ్స్ గురించి కేసులు ఫైల్ అవలేదు. కానీ, నేరాలు జరుగుతున్నాయనేది మాత్రం వాస్తవం. డబ్బులిచ్చి అవార్డు తీసుకోవడం అనేదే పెద్ద స్కామ్ అని గుర్తించాలి. నిజమైన అవార్డు ఇచ్చేవారెవరూ డబ్బులు తీసుకోరని గుర్తుంచుకోవాలి. డిజిటల్ మార్కె టింగ్ గురించి కూలంకషంగా తెలుసుకొని, జాగ్రత్త వహించాలి. కానీ, ఆత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకూడదు. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
ఈ అవార్డు ఉత్సాహాన్నిచ్చింది: మంచు విష్ణు
శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రాజ్ ఆనంత దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘చదరంగం’ (2020). 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ పతాకంపై హీరో మంచు విష్ణు నిర్మించిన తొలి వెబ్ సిరీస్ ఇది. ఆన్ డిమాండ్ వీడియో, ఆడియో కంటెంట్లకు సంబంధించి ఎక్స్ఛేంజ్ ఫర్ మీడియా గ్రూప్ ప్రకటించిన స్ట్రీమింగ్ మీడియా అవార్డ్స్‌లో ‘చదరంగం’ ఉత్తమ ప్రాంతీయ వెబ్ సిరీస్‌గా అవార్డు గెలుచుకుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ – ‘‘ఈ అవార్డు రావడం చాలా గౌరవంగా ఉంది. ‘చదరంగం’ మా టీమ్ అందరి మనసులకు దగ్గరైన వెబ్ సిరీస్. భవిష్యత్‌లో ఇంకా ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌ను చేసేందుకు ఇలాంటి అవార్డ్స్ ఉత్సాహాన్ని ఇస్తాయి’’ అన్నారు. ‘చదరంగం’ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ తొమ్మిది ఎపిసోడ్స్‌గా రూపొందింది. -
ది డిసిపుల్‌కి అంతర్జాతీయ పురస్కారం
చైతన్య తమ్హానే దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం ‘ది డిసిపుల్’ వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తా చాటింది. ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును సొంతం చేసుకుంది. కరోనా వల్ల అన్ని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. 77వ వెన్నిస్ ఫెస్టివల్‌ను మాత్రం నిర్వహించారు. 2001లో మీరా నాయర్ తీసిన ‘మాన్సూన్ వెడ్డింగ్’ తర్వాత వెన్నిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇంత దూరం వెళ్లిన చిత్రం ‘ది డిసిపుల్’ కావడం విశేషం. అలాగే ఆదర్శ్ గోపాలకృష్ణన్ తెరకెక్కించిన మలయాళ చిత్రం ‘మతిళుకల్’ (1989) తర్వాత ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారం అందుకున్న చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఓ యువ సంగీత కళాకారుడు చేసే సంగీత ప్రయాణమే ఈ చిత్రకథ. ‘ది డిసిపుల్’ చిత్రదర్శకుడు గతంలో తీసిన ‘కోర్ట్’ జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. -
అదిరిన భారత బాక్సర్ల పంచ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో భారత బాక్సర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా జర్మనీలో జరిగిన బ్లాక్ ఫారెస్ట్ కప్ టోర్నమెంట్లో భారత జూనియర్ మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. మొత్తం ఏడు పతకాలు గెల్చుకొని టోర్నమెంట్లో ఉత్తమ జట్టు అవార్డును సొంతం చేసుకున్నారు. భారత్ నెగ్గిన ఏడు పతకాల్లో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు ఉన్నాయి. ఉక్రెయిన్, జర్మనీ, కజకిస్తాన్, లాత్వియా, హంగేరి, లిథువేనియా, మంగోలియా, గ్రీస్, పోలాండ్ దేశాలు కూడా పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ తరఫున 13 మంది బాక్సర్లు బరిలోకి దిగారు. భారత్ తరఫున తమన్నా (48 కేజీలు), అంజు (50 కేజీలు), నేహా (54 కేజీలు), అంబేషోరి దేవి (57 కేజీలు), ప్రీతి దహియా (60 కేజీలు) స్వర్ణ పతకాలను సాధించారు. ఫైనల్లో ఓడిన తన్ను (52 కేజీలు), ఆశ్రేయ (63 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. -
ఉత్తమ చిత్రం గ్రీన్‌బుక్
లాస్ ఏంజిలస్: 2019 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డును ‘గ్రీన్‌బుక్’ దక్కించుకుంది. శ్వేత,నల్ల జాతీయుల మధ్య స్నేహబంధానికి దర్పణంగా నిలిచే ఒక వ్యక్తి జీవిత చరిత్రే గ్రీన్‌బుక్ చిత్రం. రోమా చిత్ర దర్శకుడు అల్ఫాన్సో కారన్‌కు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించగా, ద ఫేవరెట్ సినిమాలో నటించిన ఒలివియా కామన్ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. బొహెయిమెన్ రాప్సోడీ చిత్రంలో అస్థాన విద్వాంసుడు ఫ్రెడీ మెర్క్యురీ పాత్రలో నటించిన రామి మలేక్ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం లాస్ ఏంజిలస్‌లో అట్టహాసంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. వ్యాఖ్యాత లేకుండా ఈ ఉత్సవం జరగడం విశేషం. 1989 తర్వాత వ్యాఖ్యాత లేకుండా ఆస్కార్ అవార్డుల ఉత్సవం జరగడం ఇది రెండో సారి. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో భారతీయ డాక్యుమెంటరీకి అవార్డు లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన ఘటనపై ‘పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’పేరుతో తీసిన డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డు పొందింది. ఒక నల్లజాతి విద్యాంసుడు అతని దగ్గర కారు డ్రైవరుగా పనిచేసే శ్వేత జాతీయుడి మధ్య సంబంధమే ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ఎంపికయిన గ్రీన్ బుక్ కథాంశం. గ్రీన్‌బుక్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడు(మహేర్షల అలీ), ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డులు కూడా లభించాయి. ఉత్తమ నటి రేసులో ముందున్న గ్లెన్ క్లోజ్(ద వైఫ్)ను పక్కకు నెట్టి ద ఫేవరెట్ చిత్రంలో నటించిన కాల్మన్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కాల్మన్ నిగ్రహం కల రాణి అన్నెగా నటించారు. ఈ సారి అవార్డులు వేర్వేరు సినిమాలకు వచ్చాయి. బొహెమియన్ రాప్సోడీ చిత్రానికి ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్, ఉత్తమ సౌండ్ ఎడిటింగ్, ఉత్తమ మిక్సింగ్ అవార్డులు సహా మొత్తం నాలుగు అవార్డులు లభించాయి. కారన్‌కు ఒకే ఏడాది 4 నామినేషన్లు రోమా సినిమా ఉత్తమ చిత్రం అవార్డును పొగొట్టుకున్నా ఇతర కేటగిరీలో ఉత్తమ పురస్కారాలు అందుకుంది. చిత్ర దర్శకుడు కారన్ ఉత్తమ దర్శకుడి అవార్డు పొందారు. విదేశీ భాషా చిత్రం కేటగిరీ, సినిమాటోగ్రఫీ కేటగిరీలో కూడా ఈయన ప్రతిభకు పురస్కారాలు లభించాయి. ఒకే సంవత్సరంలో నాలుగు నామినేషన్లు పొందిన మొట్టమొదటి వ్యక్తి కారన్. భారతీయ ఫ్రెడ్డీ భారతీయ మూలాలున్న వ్యక్తికి సంబంధించిన పాత్ర పోషించిన నటుడికి కూడా 91వ ఆస్కార్ అవార్డుల్లో ఓ పురస్కారం దక్కింది. బొహెమియన్ రాప్సోడీ చిత్రంలో ఫ్రెడ్డీ మెర్కూరీ పాత్రలో నటించినందుకు ఉత్తమ నటుడి అవార్డుకు రామి మలేక్ ఎంపికయ్యారు. ఆ చిత్రం ఫ్రెడ్డీ మెర్యూరీ జీవితం ఆధారంగా తెరకెక్కిందే. ఇంతకీ ఈ ఫ్రెడ్డీ మెర్క్యూరీ ఎవరని అనుకుంటున్నారా? ఈయన తన చిన్న తనాన్ని మహారాష్ట్రంలోని పంచగని పట్టణంలో గడిపారు. అక్కడే పాఠశాల విద్యనభ్యసించారు. సంగీత రంగంలో కూడా ప్రవేశించారు. టాంజానియాలోని జంజీబర్లో పార్సీ కుటుంబంలో 1946లో మెర్క్యూరీ జన్మించారు. ఆ తర్వాత ఆయన కుటుంబం భారత్‌కు వలస వచ్చింది. పంచగనిలోని సెయింట్ పీటర్స్ స్కూల్లో మెర్యూరీ చదువుకుంటూనే హెక్టిక్స్ అనే రాక్బ్యాండ్లోనూ అలరించాడు. శాస్త్రీయ సంగీత పాఠాలు నేర్పాలని ఆ స్కూల్లోని గురువులు ప్రయత్నించినా మెర్క్యూరీ ర్యాప్ మ్యూజిక్ పైనే ఆసక్తి చూపాడు. తర్వాత 1960ల్లో ఆయన తన తల్లిదండ్రులతో కలిసి బ్రిటన్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. -
ఎంపీ కవితకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు
చంద్రశేఖర్‌కాలనీ: నిజామాబాద్ ఎంపీ కవిత ఫ్రేమ్ ఇండియా–ఏషియా పోస్ట్ మ్యాగజైన్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ ఎంపీకి అవార్డును అందజేశారు. దేశం లోని మొత్తం 545 మంది ఎంపీలకుగాను మ్యాగ జైన్ సర్వే ద్వారా 25 మందిని ఉత్తమ ఎంపీలుగా ఎంపిక చేసింది. ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవాదృక్పథం, లోక్‌సభకు హాజరు, లోక్‌సభ నిర్వహణలో పాత్ర, నియమనిబంధనలు పాటించడం, ప్రశ్నలగడం తదితర అంశాల ఆధారంగా ఎంపీలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సర్వే నిర్వహించిన అత్యధిక విభాగాల్లో ఎంపీ కవితకు 90 శాతానికిపైగా పాయింట్లువచ్చాయి. కవిత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, క్రియాశీలకంగా వ్యవహరించారని సర్వే రిపోర్టు పేర్కొన్నది. రాజనీతి, ఉద్యమకారిణి, అనవ్య ప్రతిభాశాలిగా, సామాజిక సేవాధృక్పథం, ప్రజాదరణ, కార్యశీలత తదితర అంశాల్లో ఆమెకు మంచి గుర్తింపు లభించిందని మ్యాగజైన్ పేర్కొఇంది. కళా సంస్కృతిని రక్షిచడంలో, మంచి మహిళా వక్తగా ఆమె పేరు పొందారని వివరించింది. అమెరికా నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాంస్కృతిక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజలను చైతన్యపర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని సంస్థ పేర్కొంది. బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఆమె చురుగ్గా వ్యవహరించారని, తెలంగాణ సంస్కృతిక సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారని వివరించింది. అవార్డు అందుకున్న ఎంపీ కవితకు అభిమానులు అభినందనలు తెలిపారు. అంతకుముందు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నివాసానికి వెళ్లి స్పీకర్ ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీపాటిల్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు. -
‘మహా’ శకటానికి ప్రథమ బహుమతి
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌లో ప్రదర్శించిన శకటాలకు ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. రాష్ట్రాల కేటగిరీలో ఛత్రపతి శివాజీ పట్టాభిషేక ఘట్టాన్ని చూపుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శకటానికి ప్రథమ బహుమతి దక్కింది. అస్సాం, ఛత్తీస్‌గఢ్‌ల శకటాలు వరసగా రెండో, మూడో బహుమతులు పొందాయి. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఢిల్లీలో బహుమతులను ప్రదానం చేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖల కేటగిరీలో క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఉత్తమ శకటం అవార్డు దక్కింది. త్రివిధ దళాల కేటగిరీలో ఆర్మీ పంజాబ్ రెజిమెంట్, పారా–మిలిటరీ దళాల కేటగిరీలో ఐటీబీపీలు ఉత్తమ కవాతు ట్రోఫీని పొందాయి. -
పన్నెండో సారి...!!
అనంతపురం అగ్రికల్చర్ : చిత్తూరు జిల్లాకు చెందిన ఆర్.విజయశంకరరెడ్డి 1990 నుంచి జిల్లాలోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఏపీడీ)గా గత రెండేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాతృశాఖ వ్యవసాయశాఖ అయినా నిజాంషుగర్స్, డ్వామా, ఆత్మ, ఏపీఎంఐపీ శాఖల్లోనే ఎక్కువ కాలం పనిచేశారు. ఎక్కడున్నా విధి నిర్వహణలో అంకితభావం ఆయన సొంతమని ఆయాశాఖల అధికారులు చెబుతున్నారు. అందుకే ఆయన ఇప్పటివరకు 12 సార్లు ఉత్తమ అధికారిగా అవార్డు దక్కించుకున్నారు. అందులో రెండు సార్లు రాష్ట్ర స్థాయి అవార్డు, మిగతా 10 సార్లు జిల్లా స్థాయిలో అవార్డు పొందారు. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా గురువారం స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో కలెక్టర్ కోన శశిధర్ చేతుల మీదుగా 12వ సారి అవార్డు సొంతం చేసుకున్నారు. -
కళ్యాణదుర్గం కేవీకేకు రాష్ట్ర ఉత్తమ అవార్డు
కళ్యాణదుర్గం రూరల్ : కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో ఉన్న లక్ష్మిదేవమ్మ కృషి విజ్ఞాన కేంద్రానికి రాష్ట్ర ఉత్తమ అవార్డు వచ్చింది. ఈనెల 5న నంద్యాలలో జరిగిన పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో రాష్ట్ర ఉత్తమ కేవీకేగా అవార్డును కో ఆర్డినేటర్ జాన్సుధీర్కు వ్యవసాయశాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి, ఎన్జీరంగా విశ్వవిద్యాలయ సంచాలకుల చేతులమీదుగా అవార్డును ప్రదానం చేశారు. రైతులకు అందుబాటులో ఉంటూ కరువు జిల్లా అయినా అనంతలో 70 శాతం మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారని, ఇందులో రైతులకు చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయల పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తూ మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలిపి మంచి ఫలితాలు సాధించారు. దీంతో వ్యవసాయ శాఖ గుర్తించి రాష్ట్ర ఉత్తమ కేవీకేగా అవార్డును అందజేసింది. ఈ అవార్డు జాన్‌సుధీర్ అందుకున్నారు. -
శ్వేతహోటల్‌కు రాష్ట్రస్థాయి అవార్డు
వరుసగా ఐదోసారి ఎంపిక కరీంనగర్ బిజినెస్: నగరంలోని శ్వేత హోటల్‌కు ప్రభుత్వం రాష్ట్రస్థాయి అవార్డును ప్రకటించినట్లు మేనేజర్ తోట కోటేశ్వర్ చెప్పారు. బుధవారం హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, టూరిజం శాఖ మంత్రి చందూలాల్, చైర్మన్ పేర్వారం రాములు, ప్రభుత్వ సలహాదారు కేవీ. రమణాచారి చేతుల మీదుగా మంగళవారం అవార్డు అందుకున్నట్లు తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించినందుకే ఈ అవార్డు దక్కిందన్నారు. వరుసగా ఐదోసారి అవార్డుకు ఎంపికవడంపై హర్షం వ్యక్తంచేశారు. సమావేశంలో మేనేజర్ యంసాని వేణుగోపాల్, పురుషోత్తం రెడ్డి, కృష్ణకుమార్, సతీశ్, శ్రీనివాస్, మూర్తి, ప్రశాంత్‌రెడ్డి, సుధాకర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
ఉత్తమ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
పోచమ్మమైదాన్ :జిల్లాలో సమాజ సేవ చేస్తున్న యువత, మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు 2015–2016 సంవత్సరానికి గాను జిల్లా ఉత్తమ యువజన సంఘం అవార్డుల ఎంపికకు దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్లు నెహ్రూ యువ కేం ద్ర జిల్లా కోఆర్డినేటర్ మనోరంజన్ తెలి పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన చేశారు. నెహ్రూ యువకేంద్రంలో అఫిలియేషన్ పొందిన వారే అవార్డులకు అర్హులని పేర్కొన్నారు. రిజి స్ట్రేషన్ అయి మూడేళ్లు కావాలని, సభ్యు లు 14 – 29 మధ్య వయసు వారై ఉండాలని సూచించారు. మూడేళ్ల ప్రగతి నివేదిక, ఆడిట్ రిపోర్టు, కార్యక్రమాల ఫొటో లు, పేపర్ కటింగ్ జిరాక్స్‌లను దరఖాస్తుతో జతచేసి, ఈనెల 25 లోగా హన్మకొండ లోని ఎన్‌వైకే కార్యాలయంలో అం దజేయాలని సూచించారు. వివరాలకు 0870–2578776 నంబర్లో సంప్రదిం చాలని కోరారు. -
సేవలు అద్వితీయం
♦ కంగ్టి పీహెచ్‌సీకి అరుదైన అవార్డు ♦ ఉత్తమ సేవలకు గుర్తింపు ♦ రేపు అవార్డు అందుకోనున్న డాక్టర్ భాస్కర్ కంగ్టి : మారుమూల ప్రాంతమని నిర్లక్ష్యం వహించకుండా.. నిరంతర శ్రమ, సేవలతో ఉత్తమ అవార్డుల జాబితాలో చేరింది కంగ్గి పీహెచ్సీ. మెరుగైన సేవల పరంగా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఆరు పడకలే ఉన్నా ప్రతినెలా 40-45 మంది గర్భిణులకు డెలివరీలు అవుతున్నాయి. ఈ విభాగంలో కంగ్టి పీహెచ్సీ జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండగా రాష్ర్టంలో రెండోస్థానం సాధించి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. రేపు అవార్డు స్వీకరణ.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రాష్ర్ట ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని డీఎంఈ సెంటర్లో మదర్ అండ్ చైల్డ్ సర్వీసెస్ (ఎంసీఎస్)లో బెస్ట్ పీహెచ్సీ అవార్డు ప్రదానం చేస్తారని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్ తెలిపారు. ఆసుపత్రిలో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో ప్రసవం కోసం కంగ్టి పీహెచ్‌సీకి గర్భిణులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, సిబ్బంది వైద్య సేవలకుగాను ఈ అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు. గత ఏడాది అత్యధికంగా515 డెలివరీలు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి పీహెచ్సీలో 515 మంది గర్భిణులకు డెలివరీలు నిర్వహించిన రికార్డు ఉంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పెద్దశంకరంపేటలో నిర్వహిస్తుండడంతో మండలానికి చెందిన కొందరు మహిళలు అంతదూరం వెళ్లలేక పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ర్టకు వెళ్తున్నారు. సిబ్బంది పెరిగితే మరిన్ని సేవలు పీహెచ్సీలో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయ. సిబ్బంది పెరిగితే సేవలు మరింత మెరుగుపడనున్నాయి. మండలంలో 8 ఆరోగ్య ఉపకేంద్రాలు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో లేక అలంకారప్రాయంగా మారాయి. పీహెచ్సీలో, సబ్ సెంటర్లలో అవసరం మేర సిబ్బంది నియమకాలు జరిగితే వైద్య సేవలు ఇంకను మెరుగుపడతాయని వైద్యాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అవార్డుల పరంపర... ఈ ఆసుపత్రిలో అందించిన సేవలను గుర్తించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహించిన సిబ్బంది జిల్లా స్థాయి ఉత్తమ సేవల పురస్కారాలు అందుకుంటున్నారు. కంగ్టి పీహెచ్‌సీకి చెందిన ముగ్గురు స్టాఫ్ నర్సులు, ముగ్గురు ఏఎన్ఎంలు, ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఉత్తమ అవార్డులు అందుకొన్నారు. కాగా ఏఎన్ఎం కమల వరుసగా మూడు సార్లు ఉత్తమ అవార్డు అందుకోవడం విశేషం -
కేంబ్రిడ్జి నుంచి విజ్ఞాన్ వర్సిటీకి ఉత్తమ అవార్డు
చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి ఉత్తమ అవార్డు దక్కిందని వర్సిటీ ఎస్ అండ్ ెహ చ్(సైన్స్ అండ్ హ్యుమనిటీస్) విభాగాధిపతి ఎన్.శ్రీనివాసులు తెలిపారు. సోమవారం యూనివర్సిటీలోని తన చాంబర్లో ఆయన మాట్లాడుతూ యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ తమ ‘ఉత్తమ భాగస్వామ్య విద్యాసంస్థ’గా విజ్ఞాన్ యూనివర్సిటీని ఎంపిక చేసిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యం పెంపొందించుకోవడంలో విజ్ఞాన్ అత్యంత ప్రభావం చూపిందని, అందుకే ఈ అవార్డుకు ఎంపిక చేసిందని పేర్కొన్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ కో ఆర్డినేటర్లకు హైదరాబాద్‌లో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారని, తమకు అవార్డు ప్రదానం చేశారని పేర్కొన్నారు. ఆంగ్ల అధ్యాపకురాలు శారద, ఎస్ అండ్ హెచ్ విభాగ అధ్యాపకుడు కె.రవీంద్రబాబు ఈ అవార్డును స్వీకరించారని వివరించారు. అవార్డుకు ఎంపికయ్యేందుకు కృషి చేసిన సిబ్బందికి విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, యూనివర్సిటీ వీసీ సి.తంగరాజన్ తదితరులు అభినందనలు తెలిపారు.