సేవలు అద్వితీయం
♦ కంగ్టి పీహెచ్‌సీకి అరుదైన అవార్డు
♦ ఉత్తమ సేవలకు గుర్తింపు
♦ రేపు అవార్డు అందుకోనున్న డాక్టర్ భాస్కర్
కంగ్టి : మారుమూల ప్రాంతమని నిర్లక్ష్యం వహించకుండా.. నిరంతర శ్రమ, సేవలతో ఉత్తమ అవార్డుల జాబితాలో చేరింది కంగ్గి పీహెచ్‌సీ. మెరుగైన సేవల పరంగా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఆరు పడకలే ఉన్నా ప్రతినెలా 40-45 మంది గర్భిణులకు డెలివరీలు అవుతున్నాయి. ఈ విభాగంలో కంగ్టి పీహెచ్‌సీ జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండగా రాష్ర్టంలో రెండోస్థానం సాధించి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
రేపు అవార్డు స్వీకరణ..
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రాష్ర్ట ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని డీఎంఈ సెంటర్‌లో మదర్ అండ్ చైల్డ్ సర్వీసెస్ (ఎంసీఎస్)లో బెస్ట్ పీహెచ్‌సీ అవార్డు ప్రదానం చేస్తారని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్ తెలిపారు. ఆసుపత్రిలో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో ప్రసవం కోసం కంగ్టి పీహెచ్‌సీకి గర్భిణులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది వైద్య సేవలకుగాను ఈ అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు.
గత ఏడాది అత్యధికంగా515 డెలివరీలు..
గత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి పీహెచ్‌సీలో 515 మంది గర్భిణులకు డెలివరీలు నిర్వహించిన రికార్డు ఉంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పెద్దశంకరంపేటలో నిర్వహిస్తుండడంతో మండలానికి చెందిన కొందరు మహిళలు అంతదూరం వెళ్లలేక పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ర్టకు వెళ్తున్నారు.
సిబ్బంది పెరిగితే మరిన్ని సేవలు
పీహెచ్‌సీలో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయ. సిబ్బంది పెరిగితే సేవలు మరింత మెరుగుపడనున్నాయి. మండలంలో 8 ఆరోగ్య ఉపకేంద్రాలు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో లేక అలంకారప్రాయంగా మారాయి. పీహెచ్‌సీలో, సబ్ సెంటర్లలో అవసరం మేర సిబ్బంది నియమకాలు జరిగితే వైద్య సేవలు ఇంకను మెరుగుపడతాయని వైద్యాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అవార్డుల పరంపర...
ఈ ఆసుపత్రిలో అందించిన సేవలను గుర్తించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహించిన సిబ్బంది జిల్లా స్థాయి ఉత్తమ సేవల పురస్కారాలు అందుకుంటున్నారు. కంగ్టి పీహెచ్‌సీకి చెందిన ముగ్గురు స్టాఫ్ నర్సులు, ముగ్గురు ఏఎన్‌ఎంలు, ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఉత్తమ అవార్డులు అందుకొన్నారు. కాగా ఏఎన్‌ఎం కమల వరుసగా మూడు సార్లు ఉత్తమ అవార్డు అందుకోవడం విశేషం