
- అనారోగ్యంతో ఉన్న పోసాని పట్ల ప్రభుత్వ దాష్టీకం
- జైలులో గుండె, కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పిన పోసాని
- ఈసీజీ, ఇతర పరీక్షల అనంతరం కడప రిమ్స్‌కు రిఫర్ చేసిన వైద్యులు
- తదుపరి పరీక్షలంటేనే ఆరోగ్యం బాగోలేదన్నది సుస్పష్టం
- అయినా అంబులెన్సులో కాకుండా, పోలీసు వాహనంలో ఆస్పత్రికి
- ఆస్పత్రిలోనూ స్ట్రెచర్ కానీ, వీల్‌చైర్ కానీ లేకుండా నడిపించే లోపలికి
- 67 ఏళ్ల వయసు.. ఇప్పటికే ఓసారి గుండె ఆపరేషన్
సాక్షి కడప : రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి 67 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రముఖ సినీనటుడు, రచయిత, నిర్మాత పోసాని కృష్ణమురళిని అక్రమ కేసులో ఇరికించి, అరెస్టు చేయడమే కాకుండా, ఆయన ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం కుట్రపూరితంగానే వ్యవహరించింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోసాని మురళిని గురువారం రాత్రి కోర్టులో హాజరుపరిచి, శుక్రవారం రాజంపేట సబ్‌జైలుకు తీసుకెళ్లారు. అక్కడ విరేచనాలు అయినట్లు కుటుంబ సభ్యులకు పోసాని తెలిపారు.
శనివారం గుండెల్లో, కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ముందుగా అక్కడి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమికంగా పరీక్షలు చేయించి, వైద్యుల సూచన మేరకు కడపలోని రిమ్స్‌కు తరలించారు. ఇక్కడ కూడా ఆయన పట్ల ప్రభుత్వం, పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. గుండెల్లో, కడుపు నొప్పితో బాధపడుతున్నా అంబులెన్సులో కాకుండా పోలీసు వాహనంలోనే తీసుకెళ్లడం క్రూరత్వమే.
పైగా, ఆయనది అనారోగ్యం కాదని, నటన అంటూ రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు రిమ్స్ ఆవరణలోనే మీడియాతో మాట్లాడుతూ చెప్పడం అందరినీ విస్మయపరిచింది. 67 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ ప్రముఖుడు, సీనియర్ సిటిజన్ పట్ల ఓ సీఐ ఇంత దారుణంగా మాట్లాడటం ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు. ఇదే తరుణంలో పోసోని మురళీకృష్ణకు ఏదైనా జరగరానిది జరిగితే బా«ద్యత ఎవరిదంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఇలాగేనా ఆస్పత్రికి తీసుకెళ్లేది?
పోసానికి ఇప్పటికే ఓసారి గుండె ఆపరేషన్ అయింది. మరికొన్ని ఆరోగ్య సమస్యలూ ఉన్నాయి. ఓబులవారి పల్లె పోలీసు స్టేషన్‌లో స్థానిక పీహెచ్‌సీ వైద్యులు పరీక్షించినప్పుడు ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. గుండెకు సంబంధించే కాకుండా ఇతర అరోగ్య సమస్యలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు కూడా పేర్కొంటున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఆయన్ని పోలీసు వాహనంలో తిప్పీ తిప్పీ గురువారం మధ్యాహ్నం ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు.
అక్కడ 9 గంటలు విచారణ జరిపి, ఆ తర్వాత రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో రాత్రంతా వాదనలు జరిగాయి. శుక్రవారం రాజంపేట సబ్‌జైలుకు తీసుకొచ్చేవరకు.. అంటే రెండు రాత్రులు, రెండు పగళ్లు ఆయనకు విశ్రాంతి, నిద్ర లేవు. ఆయన బాగా అలసిపోయారు. జైలుకు తీసుకొచ్చేప్పటికే బాగా నీరసించిపోయారు. సబ్‌జైలుకు తరలించిన తర్వాత విరేచనాలు అయినట్లు, ఇతర సమస్యలు ఎదుర్కొన్నట్లు ఆయన ములాఖత్‌లో సన్నిహితులకు తెలిపారు.
శనివారం గుండెల్లో, కడుపులో నొప్పితో బాధపడ్డారు. ఇలాంటి తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జైలు, పోలీసు అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టంగా కనిపించింది. ఇలాంటి సమస్యలతో ఉన్న వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా ఆక్సిజన్, ఇతర అత్యవసర వైద్య సౌకర్యాలు ఉన్న అంబులెన్సులోనే తీసుకెళ్లాలి. వైద్యులు వెంట ఉండాలి. రాజంపేట పీహెచ్‌సీలో ఈసీజీ, ఇతర ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం కడపలోని రిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడం ఒకింత తీవ్రతకు నిదర్శనమే.

అయినా పోలీసులు ఆయన్ని రాజంపేట పీహెచ్‌సీ నుంచి కడప రిమ్స్‌కు అంబులెన్స్‌లో కాకుండా పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. అదీ.. సరిగా గాలి కూడా ఆడకుండా ఇద్దరు పోలీసుల మధ్య కూర్చోబెట్టి తీసుకెళ్లారు. రిమ్స్‌లో కూడా స్ట్రెచర్ కానీ, వీల్ చెయిర్ కానీ ఏర్పాటు చేయలేదు. వాహనం నుంచి ఆస్పత్రిలోకి నడిపించుకుంటూనే తీసుకెళ్లారు. రిమ్స్ వైద్యులు పరీక్షల అనంతరం పోసాని కిడ్నీలో రాయి ఉన్నట్లు చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా కడపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా అంబులెన్సులో కాకుండా పోలీసు వాహనంలోనే తిరిగి రాజంపేటకు తరలించారు. పోసాని పట్ల ప్రభుత్వం క్రూరత్వానికి ఇదే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కుటుంబ సభ్యులు అభిమానుల్లో ఆందోళన
పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతోపాటు అభిమానుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. అనారోగ్యంతో ఉన్న ఆయన్ని పోలీసు వాహనాల్లో తీసుకెళ్తున్నారని, ఏదైనా అత్యవసరం అయితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. శనివారం ములాఖత్‌లో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆయన్ని సబ్ జైలులో కలిశారు.
అనంతరం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న తీరును సబ్‌జైలు అధికారులకు కూడా ఆకేపాటి వివరించారు. పోసాని ఛాతినొప్పి, ఇతర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఏదైనా జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా అధికారులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులు పోసానిని పీహెచ్‌సీకి తీసుకెళ్లి, అక్కడి నుంచి కడప రిమ్స్‌కు వైద్యం కోసం తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment