సమాజంలో సమానత్వం లక్ష్యంగా
తొమ్మిదేళ్లుగా పేద విద్యార్థులు, దివ్యాంగుల సేవలో
ఉత్తమ సేవకురాలిగా నేషనల్ అవార్డుకు ఎంపిక
విద్యతోనే భేదాభిప్రాయాలు నివారించవచ్చు : డాక్టర్ సారా
తమ కోసం ఏదైనా పని చేసుకుంటే స్వార్థం.. అదే సమాజం కోసం చేస్తే సేవ. ఇందులోనూ ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. కొంత మంది వృద్ధులకు సహాయం చేస్తే, మరి కొందరు అనాథలకు, పేద పిల్లలకు సహకారం అందిస్తారు. ఇలా పేద విద్యార్థులు, దివ్యాంగులు, అనాథ వృద్ధుల సంక్షేమం కోసం పరితపిస్తూ, తనకు తోచిన సేవలు అందించడమే కాకుండా, తన లాంటి ఎంతో మందికి దక్సూచిలా నిలుస్తున్నారు. అంగవైకల్యం కలిగిన వారికి భరోసా కల్పిస్తూ వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయూతనిస్తున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 200 మంది విద్యార్థులు, 150 మంది దివ్యాంగులకు అండగా ఉన్నారు డాక్టర్ సారథామురుగన్. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారు ఈ సేవకురాలు..
– అడ్డగుట్ట
కేరళకు చెందిన ఈమె పదిహేను ఏళ్ల క్రితం నగరానికి వచ్చి సికింద్రాబాద్‌లోని తన బంధువులతో కలిసి ఉంటున్నారు. మొదట ఐటీ ఉద్యోగం చేస్తూ జీవనం సాగించిన సారా అనంతరం, ఉద్యోగం మానేసి పేద విద్యార్థులు, దివ్యాంగుల సేవకు 2016లో సెవెన్ రేస్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈమె సేవలను గుర్తించి ఇటీవల డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెలలో మహారాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు డాక్టర్ సారా.
దివ్యాంగుల్లో స్ఫూర్తి నిపుతూ..
దివ్యాంగుల్లో స్ఫూర్తిని నింపి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తోంది. సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా దివ్యాంగులతో చిరు వ్యాపారాలు పెట్టించడం, కుట్టు మిషన్లు పంపిణీ వంటి ఉపాధి మార్గాలను కల్పిస్తున్నారు. మురికివాడల్లోనూ, రోడ్లపైనా ఎలాంటి ఆసరా లేని వారికి ఆహారం పంపిణీ చేస్తారు. దాదాపు 150 మంది దివ్యాంగులకు కుట్టు మిషన్లతో పాటు 200 వీల్ చైర్లు పంపిణీ చేశారు.
30 వేల గ్రాసరీ కిట్ల పంపిణీ.. కోవిడ్ మహమ్మారి సమయంలో రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు సెవెన్ రేస్ ఫౌండేషన్ ద్వారా 30 వేల నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఎంతో ముఖ్యమైన ఆక్సిజన్ సిలిండర్లు కూడా సప్లై చేశారు. సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎందరికో అండగా నిలిచారు.
విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం..
ప్రస్తుత సమాజంలో ధనిక, పేద అనే భేదాలు లేకుండా ఉండాలంటే అది విద్యతోనే సాధ్యమని నమ్ముతాను. అందుకే మా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు, వికలాంగులకు సహాయ సహకారాలు అందించే దాతల సహాయంతో విద్యార్థులను చదివిస్తాం. ఇటీవల బాబా సాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేయడం గర్వంగా ఉంది. – డాక్టర్ సారా, సెవెన్ రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు
పేదలకు ఉన్నత విద్య లక్ష్యంగా..
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించేందుకు సారా నిరంతరం శ్రమిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, ఓల్డ్ సఫీల్‌గూడ, మౌలాలి ప్రాంతాల్లోని 6 ప్రభుత్వ పాఠశాలను సెవెన్‌రేస్ ఫౌండేషన్ దత్తత తీసుకుంది. ప్రతి ఏడాదీ ఉచితంగా నోటు పుస్తకాలు, స్టేషనరీ, విద్యారి్థనులకు శానిటరీ కిట్స్ పంపిణీ చేస్తుంటారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సెవెన్‌రేస్ సంస్థ సొంతంగా చదివిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment