ఒకరోజు శ్రీరంజనికి తప్పనిసరి పరిస్థితుల్లో బైక్ ట్యాక్సీ బుక్ చేయాల్సి వచ్చింది. పురుష డ్రైవర్ వెనుక కూర్చొని ప్రయాణించడానికి ఆమె పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. ‘ఎవరైనా చూస్తారేమో...ఏమైనా అనుకుంటారేమో’ ‘ఈ డ్రైవరు ఉన్నట్టుండీ అసభ్యంగా ప్రవర్తిస్తాడేమో...’ ఇలా ఎన్నో ఆలోచనలతో ఆమె ప్రయాణం అత్యంత భారంగా గడిచింది. ఇప్పుడు శ్రీరంజనిలాంటి మహిళలకు బైక్ ట్యాక్సీ ప్రయాణం భారం కాబోదు...
‘పింక్’ యాప్‌లో బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లు మాత్రమే వస్తారు. ‘పింక్’ ద్వారా మహిళల సౌకర్యం, భద్రతా అనేది ఒక కోణం అయితే ఎంతోమంది మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారనేది మరో కోణం. చెన్నై నగరంలో ఎంటీసీ బస్సులు, ఎలక్ట్రిక్ రైళ్లు, ఎంఆర్‌టీఎస్ రైళ్లు, మెట్రో రైలులాంటి రవాణా సేవలు ఉన్నా, ఆటో, ట్యాక్సీల మీద ఆధారపడే ప్రయాణీకులు కూడా ఎక్కువే. ఆయా సంస్థల యాప్‌లలో బైక్ టాక్సీ కోసం బుక్ చేస్తే పురుషు డ్రైవర్‌లే ఎక్కువగా వచ్చేవారు.
వారి వెనుక కూర్చుని ప్రయాణించడం మహిళలకు అసౌకర్యంగా ఉండేది. ఈ నేపథ్యంలో ‘పింక్’ బైక్‌లు వారి చింతను దూరం చేసి నిశ్చింతగా ప్రయాణం చేసేలా చేస్తున్నాయి. ప్రముఖ బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ‘ర్యాపిడో’ చెన్నైౖలో ‘బైక్ పింక్’ను ప్రారంభించింది. ‘బైక్ పింక్ సర్వీస్ అనేది మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించాం. ఇది మహిళా ప్రయాణికులకు భద్రతను ఇవ్వడమే కాదు, ఎంతో మంది మహిళలకు డ్రైవర్‌లుగా ఉపాధిని ఇస్తుంది’ అని ‘ర్యాపిడో’ ప్రకటించింది. మహిళా డ్రైవర్‌లను ‘వుమెన్ కెప్టెన్’గా వ్యవహరిస్తారు. ర్యాపిడోతోపాటు ఉబర్, వోలలాంటి ట్రాన్స్‌పోర్ట్ కంపెనీల ద్వారా మహిళలు డ్రైవర్‌లుగా ఉపాధి పొందుతున్నారు.
అనకాపుత్తూరుకు చెందిన మంగ ఉమెన్ కెప్టెన్. ఆమెకు ఐదేళ్ల కుమార్తె ఉంది. పాపను ఉదయం స్కూల్‌కు బైక్‌పై డ్రాప్ చేసిన తర్వాత ఆమె పని మొదలవుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు బైక్ రైడింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత ఇంటి పనుల్లో నిమగ్నమైపోతుంది. కొన్నిసార్లు రాత్రి 9 గంటల వరకు బైక్ రైడింగ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో పాపను తన తల్లి ఇంటి దగ్గర వదలి పెట్టి వస్తుంది. తొమ్మిది గంటలకు రైడింగ్ యాప్‌ను ఆఫ్ చేస్తుంది.
ఒక క్లాత్‌స్టోర్‌లో పనిచేసిన శ్వేత జీతం సరిపోకపోవడంతోబైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. రోజుకు రూ. 1000 వరకు సంపాదిస్తోంది. ‘మొదట్లో నేను చేయగలనా? అని భయపడ్డాను. ఎంతోమంది ఉమెన్ బైక్ ట్యాక్సీ డ్రైవర్‌లతో మాట్లాడాను. వారు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు’ అంటుంది శ్వేత. ఇక మహిళా డ్రైవర్‌ల దారి రహదారేనా! కావచ్చేమో కాని... ఆ దారిలో రకరకాల అడ్డంకులు వస్తుంటాయి. ‘ఒక ప్రయాణికుడు కావాలని పద్నాలుగు సార్లు నా బైక్ బుక్ చేశాడు.
అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి సంస్థకు ఫిర్యాదు చేస్తే తక్షణం అతడి ఖాతాను రద్దు చేశారు’ అంది ఒక మహిళా డ్రైవర్. ‘డ్రైవింగ్ సమయంలో మేము అభద్రతగా ఫీల్ అయితే సంస్థకు ఫిర్యాదు చేసే, పోలీసులను సంప్రదించే వీలు ఉంది’ అంటుంది మరో మహిళా డ్రైవర్. కొందరు పురుష ప్రయాణికులు మహిళా డ్రైవర్‌ను చూడగానే తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు.
‘డ్రైవర్ మహిళ అనే విషయం తెలియక బుక్ చేశాను. సారీ’ అంటూ ప్రయాణాన్ని ఆకస్మికంగా రద్దు చేసుకుంటున్నారు. మహిళలు సరిగ్గా డ్రైవ్ చేయరనేది అనేది వారి అపోహ. ఇలాంటి అపోహల అడ్డుగోడలను కూల్చేస్తూ, లింగ వివక్షతను సవాలు చేస్తూ విమెన్ కెప్టెన్‌ల బండి వేగంగా దూసుకుపోతోంది.
– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై
Comments
Please login to add a commentAdd a comment