Women drivers
-
అడవి ఒడిలో...
‘నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ ఉద్యోగం వచ్చింది’ అని మార్గరెట్ బారు తన సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు అభినందనలు తెలియజేసిన వారికంటే ఆశ్చర్యపోయిన వారే ఎక్కువ.‘డ్రైవర్ ఉద్యోగం... అది కూడా అడవిలో... నువ్వు ఆడపిల్ల అనే విషయం మరిచావా’ అన్నవారు కూడా ఉన్నారు. అయితే వారి ఆశ్చర్యాలు, అభ్యంతరాలేవీ మార్గరెట్ దారికి అడ్డుకాలేకపోయాయి.ఒడిషాలోని దిబ్రుఘర్ అభయారణ్యంలోని తొలి మహిళా సఫారి డ్రైవర్‌గా ఎంతోమంది యువతులకు స్ఫూర్తిని ఇస్తోంది మార్గరెట్ బారు.దిబ్రుఘర్ అభయారణ్యానికి సమీపంలోని క్రిస్టియన్పడా మార్గరెట్ బారు స్వగ్రామం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెట్రిక్యులేషన్ పాసైన తరువాత చదువు మానేయాల్సి వచ్చింది. అభయారణ్యంలో వివిధ ఉద్యోగాలలో మహిళల నియామకానికి అటవీశాఖ ప్రకటన మార్గరెట్‌కు ఆశాకిరణంలా తోచింది.తన కుటుంబానికి ఆసరాగా ఉండడానికి ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరిగా చేయాలనుకున్న మార్గరెట్ డ్రైవర్ ఉద్యోగానికి ఎంపికైంది.అయితే సఫారీ డ్రైవర్ ఉద్యోగంలో చేరాలనుకున్నప్పుడు ఇతరుల నుంచే కాదు కుటుంబసభ్యుల నుంచి కూడా అభ్యంతరాలు, సందేహాలు ఎదురయ్యాయి.అయినప్పటికీ మార్గరెట్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. డ్రైవింగ్, వెహికిల్ మెయింటెనెన్స్, జంగిల్ రోడ్లను నావిగేట్ చేయడంలో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆరునెలల కఠినమైన శిక్షణ తరువాత ఉద్యోగంలో చేరింది.దిబ్రుఘర్ అభయారణ్యంలోని 13మంది సఫారీ డ్రైవర్లలో ఏకైక మహిళ మార్గరెట్. అయితే ఎప్పుడూ అసౌకర్యంగా భావించలేదు. అభద్రతకు గురి కాలేదు.రోజు ఉదయం ఆరు నుంచి మార్గరెట్ ఉద్యోగ జీవితం మొదలవుతుంది.‘అడవిలో రోడ్లు నాకు సహనాన్ని, ధైర్యాన్ని నేర్పాయి. ప్రతిరోజూ ఒక కొత్త సాహసం చేసినట్లుగా భావిస్తాను. ఈ ఉద్యోగం ద్వారా నా కుటుంబానికి అండగా ఉన్నందుకు గర్వంగా ఉంది’ అంటుంది మార్గరెట్.డ్రైవర్ ఉద్యోగం వల్ల మార్గరెట్ ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం ఒక కోణం అయితే, సంప్రదాయ ఉద్యోగాలకు అతీతం గా కొత్తదారిలో పయనించాలని కలలు కనే అమ్మాయిలకు రోల్‌మోడల్‌గా నిలవడం మరో కోణం.మార్గరెట్లాగే మూసధోరణులకు భిన్నంగా ప్రయాణిస్తోంది సంగీత. ఒకప్పుడు ఆమె మార్గరెట్ రూమ్మేట్. 24 సంవత్సరాల సంగీత సీక్రా దిబ్రూఘర్‌లో మొదటి మహిళా ఎకో గైడ్.‘అడవిలో మీకు భయం వేయదా? ఇది రిస్క్ జాబ్... సిటీలో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదా... ఇలాంటి మాటలు ఎన్నో వింటుంటాను. అయితే అడవి అనేది అమ్మలాంటిది. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు భయం ఎందుకు! నేను, నా స్నేహితురాలు ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తి ఇవ్వడం సంతోషంగా ఉంది’ అంటుంది సంగీత సీక్రా. -
‘బైక్ పింక్ సర్వీస్': ఓన్లీ మహిళా డ్రైవర్లే..!
ఒకరోజు శ్రీరంజనికి తప్పనిసరి పరిస్థితుల్లో బైక్ ట్యాక్సీ బుక్ చేయాల్సి వచ్చింది. పురుష డ్రైవర్ వెనుక కూర్చొని ప్రయాణించడానికి ఆమె పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. ‘ఎవరైనా చూస్తారేమో...ఏమైనా అనుకుంటారేమో’ ‘ఈ డ్రైవరు ఉన్నట్టుండీ అసభ్యంగా ప్రవర్తిస్తాడేమో...’ ఇలా ఎన్నో ఆలోచనలతో ఆమె ప్రయాణం అత్యంత భారంగా గడిచింది. ఇప్పుడు శ్రీరంజనిలాంటి మహిళలకు బైక్ ట్యాక్సీ ప్రయాణం భారం కాబోదు...‘పింక్’ యాప్‌లో బుక్ చేసుకుంటే మహిళా డ్రైవర్లు మాత్రమే వస్తారు. ‘పింక్’ ద్వారా మహిళల సౌకర్యం, భద్రతా అనేది ఒక కోణం అయితే ఎంతోమంది మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతున్నారనేది మరో కోణం. చెన్నై నగరంలో ఎంటీసీ బస్సులు, ఎలక్ట్రిక్ రైళ్లు, ఎంఆర్టీఎస్ రైళ్లు, మెట్రో రైలులాంటి రవాణా సేవలు ఉన్నా, ఆటో, ట్యాక్సీల మీద ఆధారపడే ప్రయాణీకులు కూడా ఎక్కువే. ఆయా సంస్థల యాప్‌లలో బైక్ టాక్సీ కోసం బుక్ చేస్తే పురుషు డ్రైవర్లే ఎక్కువగా వచ్చేవారు. వారి వెనుక కూర్చుని ప్రయాణించడం మహిళలకు అసౌకర్యంగా ఉండేది. ఈ నేపథ్యంలో ‘పింక్’ బైక్‌లు వారి చింతను దూరం చేసి నిశ్చింతగా ప్రయాణం చేసేలా చేస్తున్నాయి. ప్రముఖ బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ‘ర్యాపిడో’ చెన్నైౖలో ‘బైక్ పింక్’ను ప్రారంభించింది. ‘బైక్ పింక్ సర్వీస్ అనేది మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించాం. ఇది మహిళా ప్రయాణికులకు భద్రతను ఇవ్వడమే కాదు, ఎంతో మంది మహిళలకు డ్రైవర్లుగా ఉపాధిని ఇస్తుంది’ అని ‘ర్యాపిడో’ ప్రకటించింది. మహిళా డ్రైవర్లను ‘వుమెన్ కెప్టెన్’గా వ్యవహరిస్తారు. ర్యాపిడోతోపాటు ఉబర్, వోలలాంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీల ద్వారా మహిళలు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు.అనకాపుత్తూరుకు చెందిన మంగ ఉమెన్ కెప్టెన్. ఆమెకు ఐదేళ్ల కుమార్తె ఉంది. పాపను ఉదయం స్కూల్‌కు బైక్‌పై డ్రాప్ చేసిన తర్వాత ఆమె పని మొదలవుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు బైక్ రైడింగ్ చేసి ఇంటికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత ఇంటి పనుల్లో నిమగ్నమైపోతుంది. కొన్నిసార్లు రాత్రి 9 గంటల వరకు బైక్ రైడింగ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో పాపను తన తల్లి ఇంటి దగ్గర వదలి పెట్టి వస్తుంది. తొమ్మిది గంటలకు రైడింగ్ యాప్‌ను ఆఫ్ చేస్తుంది. ఒక క్లాత్‌స్టోర్‌లో పనిచేసిన శ్వేత జీతం సరిపోకపోవడంతోబైక్ ట్యాక్సీ డ్రైవర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. రోజుకు రూ. 1000 వరకు సంపాదిస్తోంది. ‘మొదట్లో నేను చేయగలనా? అని భయపడ్డాను. ఎంతోమంది ఉమెన్ బైక్ ట్యాక్సీ డ్రైవర్లతో మాట్లాడాను. వారు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు’ అంటుంది శ్వేత. ఇక మహిళా డ్రైవర్ల దారి రహదారేనా! కావచ్చేమో కాని... ఆ దారిలో రకరకాల అడ్డంకులు వస్తుంటాయి. ‘ఒక ప్రయాణికుడు కావాలని పద్నాలుగు సార్లు నా బైక్ బుక్ చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి సంస్థకు ఫిర్యాదు చేస్తే తక్షణం అతడి ఖాతాను రద్దు చేశారు’ అంది ఒక మహిళా డ్రైవర్. ‘డ్రైవింగ్ సమయంలో మేము అభద్రతగా ఫీల్ అయితే సంస్థకు ఫిర్యాదు చేసే, పోలీసులను సంప్రదించే వీలు ఉంది’ అంటుంది మరో మహిళా డ్రైవర్. కొందరు పురుష ప్రయాణికులు మహిళా డ్రైవర్‌ను చూడగానే తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. ‘డ్రైవర్ మహిళ అనే విషయం తెలియక బుక్ చేశాను. సారీ’ అంటూ ప్రయాణాన్ని ఆకస్మికంగా రద్దు చేసుకుంటున్నారు. మహిళలు సరిగ్గా డ్రైవ్ చేయరనేది అనేది వారి అపోహ. ఇలాంటి అపోహల అడ్డుగోడలను కూల్చేస్తూ, లింగ వివక్షతను సవాలు చేస్తూ విమెన్ కెప్టెన్ల బండి వేగంగా దూసుకుపోతోంది.– అస్మతీన్ మైదీన్, సాక్షి, చెన్నై (చదవండి: అగ్గిపుల్లలాంటి ఆడపిల్లకు ఫైర్‌తో భయం ఏమిటి..?) -
జొమాటో మహిళా డెలివరీ ఏజెంట్ల కొత్త డ్రెస్ చూశారా? వీడియో వైరల్
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అంతర్జాతీయమ హిళా దినోత్సవం సందర్భంగా సరికొత్త నిర్ణయం తీసుకుంది. తన మహిళా డెలివరీ సిబ్బంది కోసం కొత్త డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది. ఇకపై తమ ఫుడ్ డెలివరీ మహిళా డ్రైవర్లు కుర్తాలు ధరిస్తారని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. చాలామంది మహిళా డెలివరీ ఉద్యోగులు జొమాటో టీ-షర్టులతో అసౌకర్యంగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జొమాటో తెలిపింది. వారు కొత్త డ్రెస్ కుర్తాలు వేసుకున్నవీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ కొత్త డ్రెస్‌కోడ్‌ను చాలా బావున్నాయంటూ చాలామంది ప్రశంసించారు. మరికొంతమంది మాత్రం వారి అన్యాయ మైన వేతనాలు, పని పరిస్థితుల గురించి పట్టించుకోండి అంటూ సలహా ఇచ్చారు. ఉద్యోగుల సౌకర్యాలు, వేతనాలు, పని వాతావరణం గురించి ఆలోచించాలని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. View this post on Instagram A post shared by Zomato (@zomato) -
ఆర్టీసీలో ఇక మహిళా డ్రైవర్లు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో ఇకపై మహిళా డ్రైవర్లు రానున్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళా కండక్టర్లను చూసిన మనం ఇకపై వారిని డ్రైవర్లుగానూ చూడబోతున్నాం. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక కసరత్తు మొదలెట్టారు. రాష్ట్రంలోని ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికను తయారుచేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా శిక్షణ పొందే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. దీనిపై ఇప్పటికే 13 ఉమ్మడి జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లకు ప్రాథమికంగా ఆదేశాలిచ్చారు. పదో తరగతి పాసైన వారు శిక్షణకు అర్హులు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. వారికి ఉమ్మడి జిల్లాల్లోని అందుబాటులో ఉన్న ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లలో 32 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఆర్టీసీ బస్సుపైనే శిక్షణ ఇవ్వడంతో వారికి డ్రైవింగ్‌లో మరిన్ని మెలకువలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ శిక్షణ ఇచ్చినందుకు గాను ఆర్టీసీకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం నగదు చెల్లిస్తుంది. ఆర్టీసీలోనే పోస్టింగ్.. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అభ్యర్థులకు ఆర్టీసీలోనే డ్రైవర్‌గా పోస్టింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డ్రైవింగ్‌లో శిక్షణతో పాటు మహిళలకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తారు. వారిలో అర్హత, నైపుణ్యాన్ని బట్టి తొలి దశలో ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల్లో నియమించేందుకు ప్రతిపాదించారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా శిక్షణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో మహిళలకు పదవులు, నామినేటెడ్ పనులు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో అగ్రపీఠం వేస్తున్నారు. ఆయన స్ఫూర్తితో ఎస్సీ మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అర్హుల ఎంపిక కోసం అవసరమైన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. ఎంపికైన ఎస్సీ మహిళలకు ఆర్టీసీ ద్వారా భారీ వాహనాల డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తాం. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను తొలి దఫా ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 310 ఎస్సీ బ్యాక్లాగ్ డ్రైవర్ పోస్టుల్లో నియమించేలా ప్రభుత్వానికి నివేదిస్తాం. – మేరుగ నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
Lockdown: కష్టాలు.. ట్రక్ డ్రైవర్‌గా మారిన నటి
షూటింగ్‌లు కలిసి రాలేదు. లాక్డౌన్లో పని లేదు. కార్తీకకు యాక్టింగ్‌తో పాటు డ్రైవింగ్ వచ్చు. ఉన్న డబ్బుతో ఒక ట్రక్ కొనింది. కూరగాయలు, పండ్లు తిప్పే బండ్లకు లాక్డౌన్ నియమాలు వర్తించవు. ఇక కార్తీక ఫుల్ బిజీ అయ్యింది. పైనాపిల్స్ చీప్‌గా దొరికే చోటు నుంచి రేటు పలికే చోటుకు, కొబ్బరిబోండాలు సలీసుగా దొరికే చోటు నుంచి పిరిమిగా ఉండే చోటుకు సరఫరా చేస్తూ స్టార్ డ్రైవర్‌గా నవ్వులు చిందిస్తోంది. ఒక కేరళ నటి స్ఫూర్తి ఇది. అర్ధరాత్రి. కేరళలోని మలప్పురం చెక్‌పోస్ట్ దగ్గర అటుగా వచ్చిన ట్రక్‌ను పోలీసులు ఆపారు. ‘బండిలో ఏముంది?’ డ్రైవర్‌ను అడిగారు. ‘పైనాపిల్స్’ అనే సమాధానం వినిపించింది. పోలీసులు ఆశ్చర్యపోయారు. కారణం డ్రైవింగ్ సీట్లో ఉన్నది మహిళా డ్రైవర్. జీన్స్ ప్యాంట్, షర్ట్ వేసుకుని, పైన ఖాకీ షర్ట్ వేసుకుని, టోపీ పెట్టుకుని ఉంది. ‘ఏమైంది సార్. పండ్ల బండ్లకు ప్రాబ్లం లేదు కదా. తొందరగా వదలండి. నాకు ఆలస్యమైపోతోంది’ అందా డ్రైవర్. పోలీసులు లోడ్ చెక్ చేశాక చిరునవ్వుతో ఆ బండిని వదిలారు. చిరునవ్వుతో డ్రైవర్ కూడా కదిలింది. ఆ డ్రైవర్ పేరు కార్తీక. మలయాళంలో చిన్నపాటి నటి. ∙∙ ‘చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. దాంతో పాటు డ్రైవింగ్ కూడా. రెండూ నేర్చుకున్నాను. పెద్ద లారీలు కూడా నడుపుతాను. కొన్ని సినిమాలలో యాక్ట్ చేశాను. కాని నాకంటూ గుర్తింపు రాలేదు. నా భర్త గల్ఫ్‌లో పని చేస్తాడు. నాకు 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఈ లాక్డౌన్లో ఏ పనీ లేకుండా ఉండటం సరి కాదనుకున్నాను. వెంటనే ఒక ట్రక్ కొన్నాను. నిజానికి లారీ కొందామనుకున్నాను. అంత డబ్బు లేదు. ట్రక్‌తో మొదలెట్టాను’ అంటుంది కార్తీక. కేరళలో కన్నూరుకు చెందిన కార్తీక బతుకు దేవులాటలో అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలోని వాజక్కులంకు షిఫ్ట్ అయ్యింది. ‘ఇక్కడ పైనాపిల్స్ చీప్. కన్నూరులో కాస్ట్లీ. ఒక వెయ్యి కిలోల పైనాపిల్స్ తీసుకుని ఐదారుగంటలు ప్రయాణించి కన్నూరుకు తీసుకెళ్లాను. లాభం వచ్చింది. అలాగే వాజక్కులం నుంచి కొబ్బరిబోండాలు కొని ఎర్నాకులంకు సరఫరా చేస్తుంటాను. నేను కిరాయికి వెళతాను. అలాగే స్వయంగా సరుకు తీసుకెళ్లి అమ్ముతాను. బాగుంది ఇప్పుడు’ అంటుంది కార్తీక. ఖాకీ షర్ట్ ధరించి, తల మీద టోపీ పెట్టుకుని ట్రక్ నడిపే కార్తీకను పెద్దగా ఎవరూ గమనించరు. షాపుల వాళ్లు గమనించినా గౌరవం ఇస్తున్నారు. అర్ధరాత్రిళ్లు, అపరాత్రుళ్లు కూడా ఆమె నిర్భయంగా హైవే మీద దూసుకెళుతూ ఉంటుంది. బతుకు స్పీడ్‌బ్రేకర్ వేసినప్పుడు కూడా జీవితం స్టీరింగ్‌ను ఎలా ఒడిసి పట్టాలో కార్తీక ఇలా మనకు చెబుతోంది. -
టేకాఫ్‌కి ఆల్వేస్ రెడీ అంటున్న హీరోయిన్లు
సినిమాను నడిపేది హీరో. కథలో డ్రైవింగ్ సీట్ ఎప్పుడూ తనదే. అయితే సినిమాలన్నీ ఆ దారిలోనే కాకుండా వేరే రూట్ కూడా తీసుకున్నాయి. స్టీరింగ్ సీట్‌ను హీరోయిన్‌కి ఇస్తున్నాయి. కథను గమ్యం వరకు సురక్షితంగా నడిపించగలం అని హీరోయిన్లు నిరూపిస్తున్నారు. ఇప్పుడు గమ్యం ఆకాశం వైపు మారింది. ఆకాశమే హద్దు అయింది. హీరోయిన్లు పైలట్లు అవుతున్నారు. టేకాఫ్‌కి ఆల్వేస్ రెడీ అంటున్నారు. ఆ హీరోయిన్ల విశేషాలు. తొలి లేడీ పైలట్ జాన్వీ కపూర్ టైటిల్ రోల్లో ఈ ఏడాది విడుదలైన సినిమా ‘గుంజన్ సక్సేనా’. ఫైటర్ పైలట్ నడిపిన తొలి మహిళ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గుంజన్ పాత్రలో జాన్వీ నటించారు. ఈ పాత్రలో ఒదిగిపోవడానికి హెలీకాప్టర్ నడపడం గురించి కొన్ని మెళకువలు తెలుసుకున్నారు జాన్వీ. ఒక పైలట్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కొన్ని శిక్షణా తరగతులకు హాజరయ్యారు. జాన్వీ శ్రమ వృథా కాలేదు. బాగా నటించింది అనే ప్రశంసలు దక్కాయి. డిసెంబర్లో టేకాఫ్ ‘తేజస్’ సినిమా కోసం పైలట్‌గా మారబోతున్నారు కంగనా రనౌత్. సర్వేష్ మేవార దర్శకత్వంలో కంగనా ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘తేజస్’. ఇందులో ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా కనిపించనున్నారామె. డిసెంబర్లో ప్రారంభం కానున్న సినిమాలోని పాత్ర కోసం కఠినమైన శిక్షణలో ఉన్నారు కంగనా. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ కోసం పెరిగిన బరువు తగ్గిస్తూ, పైలట్‌గా ఫిట్‌గా కనిపించడానికి శ్రమిస్తున్నారు. కంగనా కూడా హెలీకాప్టర్ నడిపే క్లాసులకు హాజరవుతున్నారు. ‘‘ధైర్యవంతుల పాత్రను స్క్రీన్ మీదకు తీసుకురావడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు కంగనా. కో పైలట్ అజయ్ దేవగన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ హీరోగా ‘మే డే’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతోపాటు ఓ కీలక పాత్రలో అజయ్ నటించనున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ నటిస్తున్నారని గురువారం ప్రకటించారు. అమితాబ్ బచ్చన్ పైలట్, రకుల్ కో పైలట్‌గా కనిపిస్తారు. ‘‘ఈ సినిమా చేయడం థ్రిల్లింగ్‌గా ఉంది. త్వరలోనే శిక్షణ ప్రారంభించి టేకాఫ్‌కి రెడీ అవుతాను’’ అన్నారు రకుల్. పాత్ర ఏదైనా పర్ఫెక్ట్ అనిపించుకోవడానికి కథానాయికలు ఇష్టంగా కష్టపడుతున్నారు. హీరోయిన్ల ప్రతిభను ఛాలెంజ్ చేసే పాత్రలు మరిన్ని రావాలి. హీరోయిన్ల పాత్రల మీద గీసిన హద్దులన్నీ చెరిపేసేలా దూసుకెళ్లాలి. -
మూడు రెక్కల దేవత
దేవతలకు రెండు రెక్కలు ఉంటాయి. మణిపూర్‌లోని లైబి ఓయినమ్‌కు మూడు రెక్కలు ఉన్నాయి. వాటిని మూడు చక్రాలుగా మార్చి ఆటో నడుపుతుంటుంది. కష్టంలో సాయం చేస్తే మనిషి అనొచ్చు. దైన్యావస్థలో ఆదుకుంటే దేవత అనాలి. లైబి ఓయినమ్ను ఇప్పుడు మణిపూర్‌లో దేవత అనే అంటున్నారు. ఆమె ఎటువంటి సహాయం చేసిందో తెలిస్తే మీరూ అంటారు. జూన్ 1, 2020. సాయంత్రం ఆరు గంటలకు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని తూర్పు ప్రాంతం డ్యూలాలాండ్లో ఒక అంబులెన్స్ ఆగింది. అందులో నుంచి ఒక అమ్మాయిని, ఆమె తండ్రిని దించేసి వెళ్లిపోయింది. ‘మమ్మల్ని ఇంటి దాకా దించుతామన్నారు కదా’ అన్నారు తండ్రీ కూతుళ్లు. ‘ఇక్కడ నుంచి జిల్లా మారిపోతుంది. జిల్లా లోపలి వరకే దించాలి. దాటకూడదని రూలు’ అని వెళ్లిపోయాడు అంబులెన్స్ డ్రైవర్. తండ్రీ కూతుళ్లు నిశ్చేష్టులయ్యారు. ఒకవైపు చూస్తే చీకటి పడుతోంది. అమ్మాయి పేషెంట్. కోవిడ్ బారిన పడి పద్నాలుగు రోజులు ఇంఫాల్‌లోని ప్రసిద్ధ వైద్య సంస్థ జె.ఎన్.ఐ.ఎమ్.ఎస్‌లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యింది. తీసుకెళ్లడానికి తండ్రి వచ్చాడు. వాళ్లది ఇంఫాల్ నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉన్న కాంజోంగ్ జిల్లాలో స్కిప్ అనే గ్రామం. అక్కడకు వెళ్లాలి. ఎలా? తండ్రి తన కూతురిని రోడ్డు పక్కన నిలబెట్టి టాక్సీల కోసం పరిగెత్తాడు. మొదట అందరూ వస్తామన్నారు. బేరం చేశారు. తీరా తీసుకెళ్లాల్సింది పేషెంట్‌ని అని తెలిశాక వెనక్కు తగ్గారు. ‘మా అమ్మాయికి కరోనా తగ్గిపోయింది. ఇప్పుడు లేదు. భయపడకండి’ అని తండ్రి చెప్పినా ఎవరూ వినలేదు. ‘అమ్మో.. మేము రాలేం’ అని తప్పించుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ల బాధ చూసిన ఎవరో లైబి ఓయినమ్‌కు ఫోన్ చేశారు. లైబి ఓయినమ్ ఇంఫాల్‌లో తొలి మహిళా ఆటోడ్రైవర్. అంతకు ముందు ఆమె స్ట్రీట్ వెండర్‌గా అవీ ఇవీ రోడ్డు పక్కన అమ్ముతూ ఉండేది. ఇప్పుడు ఆటో డ్రైవర్ అయ్యింది. ఇద్దరు పిల్లల తల్లి. భర్త ఉన్నా కుటుంబానికి తన సంపాదన ఆధారం. ‘కోవిడ్ పేషెంట్‌ను ఇంటికి తీసుకెళ్లాలి’ అని చెప్పారు వాళ్లు. ‘వారికి అభ్యంతరం లేకపోతే తీసుకెళతాను’ అంది లైబి. కాని ఆమెకు ఉన్నది ఆటో మాత్రమే. వెళ్లాల్సిన దూరం పెద్దది. అంత దూరం ఆటోలో వెళ్లడం సాధ్యమా? పైగా చీకటి పడిపోయింది. తోడు కోవిడ్ నుంచి బయటపడ్డ అమ్మాయి. రకరకాల ఆలోచనలు వచ్చినా లైబి ధైర్యం చేసి భర్తకు ఫోన్ చేసింది. ‘నాతో తోడురా. బేరం వచ్చింది’ అని చెప్పింది. భర్త ఆమెను చేరుకున్నారు. ఇద్దరూ కలిసి ఆ తండ్రీ కూతుళ్ల దగ్గరకు వెళ్లారు. ‘పదండి పోదాం’ అన్నారు. లైబి, ఆమె భర్త ముందు కూర్చుంటే వెనుక బాధితురాలు, ఆమె తండ్రి కూచున్నారు. ప్రయాణం మొదలైంది. గంట కాదు... రెండు గంటలు కాదు... ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా ఆటోను నడిపింది లైబి. రాత్రి రెండున్నర ప్రాంతంలో పేషెంట్‌ను సురక్షితంగా ఇల్లు చేర్చింది. ఆమె చేసిన పనికి ఆ కుటుంబం శతకోటి నమస్కారాలు పెట్టింది. లైబి భర్తతో అప్పటికప్పుడు తిరిగి వచ్చేసింది. కాని ఈ విషయం వెంటనే పత్రికల ద్వారా లోకానికి తెలిసింది. లైబి చేసిన పనిని ఇంఫాల్లోనే కాదు దేశ విదేశాల్లో ఉన్న చాలామంది, ముఖ్యంగా మణిపూర్ వాసులు మెచ్చుకున్నారు. ఆమెకు కానుకగా ఇవ్వడానికి అందరూ డబ్బు పంపారు. అవన్నీ లక్షా పది వేల రూపాయలు అయ్యాయి. వాటిని జూన్ 11న మణిపూర్ సి.ఎం. ఎన్.బిరేన్ సింగ్ ఆమెకు అందజేశాడు. ఆమెకు శాలువా కప్పి సత్కరించాడు. లైబి ఆ పేషెంట్‌ను దింపి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సూచనల ప్రకారం తన భర్తతో కలిసి క్వారంటైన్లో ఉంటోంది. డిశ్చార్జ్ అయిన కోవిడ్ పేషెంట్‌తో అంత సేపు ఉన్నందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఈ పని చేసింది. మణిపూర్‌లో తొలి మహిళా ఆటో డ్రైవర్ అయిన లైబి మీద రెండేళ్ల క్రితం ‘ఆటో డ్రైవర్’ పేరుతో డాక్యుమెంటరీ తయారైంది. దానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ‘స్త్రీలకు స్ఫూర్తి కలిగించే విధంగా ఆమె జీవితం ఉంది’ అని ఆ డాక్యుమెంటరీ చూసినవాళ్లంతా అన్నారు. ఇప్పుడు తన సేవాభావంతో కూడా ఆమె చాలామందికి స్ఫూర్తి కలిగిస్తోంది. దేవతలు తెల్లటి బట్టల్లో ఉండరని, సాదాసీదా ఖాకీ యూనిఫామ్ వేసుకు తిరుగుతుంటారు లైబిని చూస్తే మనకు అర్థమవుతుంది. శాలువాతో సత్కరిస్తున్న సీఎం. ఎన్.బిరేన్ తనను ఇంటికి చేర్చిన లైబీతో ప్రయాణికురాలు -
ఆటో అక్క
నేనాటోవాణ్ని... న్యాయమైన రేటువాణ్ని’ అన్నాడు బాషా సినిమాలో రజనీకాంత్.‘రాజీ లేని పోరాటం నాది... న్యాయమైన విజయం నాది’ అంటోంది చెన్నై రాజేశ్వరి.రాజీ లేని పోరాటం చేయడం వల్లనే రాజేశ్వరి...రాజీ అక్క అయింది.ఆటో అక్కగా... ఆటో రాజీగా పలువురికి రోల్ మోడల్‌గా మారింది. జీవితంలో అనేక ప్రశ్నలుంటాయి. అడుగడుగునా ఒక ప్రశ్నార్థకం ఎదురవుతూనే ఉంటుంది. ప్రతి ప్రశ్నార్థకానికీ ఓ సమాధానం తప్పకుండా ఉండి తీరుతుంది. అయితే ఆ సమాధానం ఏంటో... ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. సమాధానం కోసం శోధన జరగాలి, అంతకంటే పెద్ద పరిశ్రమ జరగాలి. సమాధానాన్ని వెతికి పట్టుకోగలిగిన వాళ్లకు... విజయం కళ్ల ఎదుట ఆవిష్కారమవుతుంది. రాత్రి తొమ్మిది గంటలకు చెన్నైలో ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి ఒక ఆటో బయలుదేరింది. ఆ ఆటో నంబరు TN 01, AE 5608. అడయార్‌లో ఇంటి ముందు ఆటో దిగిన యువతి మీటరు లెక్క చూసి డబ్బిచ్చింది. ఆటో నడుపుతున్న మహిళ చిల్లర తిరిగి ఇస్తూ... ఆటో దిగిన యువతికి తన ఫోన్ నంబరు చెప్పింది. ‘‘రాత్రంతా డ్యూటీలోనే ఉంటాను. ఎప్పుడు అవసరమైనా ఫోన్ చేయండి. మిమ్మల్ని క్షేమంగా గమ్యం చేరుస్తాను. అయితే ఓ గంట ముందుగా ఫోన్ చేస్తే మీరున్న చోటుకి వచ్చి పికప్ చేసుకోగలుగుతాను’’ అని కూడా చెప్పింది. ‘‘అంటే ఆఫీస్‌లో లేట్ అయినప్పుడు ఫోన్ చేస్తే వచ్చి పికప్ చేసుకుంటారా’’ అని అడిగిందామె ఆటో మహిళను. అవునన్నట్లు ఆమె తలూపుతూ... మాటల్లో ఉండగానే ఆటో నడుపుతున్న మహిళ ఫోన్ మోగింది. ‘‘ఎయిర్ పోర్ట్ డ్రాపా? మీరెక్కడున్నారు’’ అని అడుగుతూ ఆటో రివర్స్ చేసుకుందామె. ఆమె పేరు రాజేశ్వరి. చెన్నై వాసులకు ఆమె ‘ఆటో రాజీ, రాజీ అక్క, ఆటో అక్క’గా పరిచయం. కోయంబత్తూరు గాయం రాజేశ్వరిది కేరళలోని పాలక్కాడ్. బి.ఎ ఫిలాసఫీ చేసింది. పాలక్కాడ్‌లో బి.ఎ చదువుతున్నప్పుడే ఆమెకి అశోక్ పరిచయమయ్యాడు. అశోక్ ఆటో నడుపుతాడు. వాళ్ల ప్రేమ పెళ్లి పీటలెక్కింది. ప్రేమ నుంచి పెళ్లి వరకు సమాజం నుంచి ఎదురైన సమస్యలు, పెళ్లి తర్వాత జీవితం చూపించిన కష్టాలను చెప్పడం మొదలుపెడితే రోజంతా చెప్పినా పూర్తి కావు. కానీ వాటిని ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరామె. ‘‘మా జీవిత ప్రస్థానాన్ని కోయంబత్తూర్‌లో మొదలుపెట్టాం’’ అని మాత్రమే చెప్తుంటారు. పెళ్లి తర్వాత కోయంబత్తూరులో ఒక ట్రావెల్ ఏజెన్సీలో అకౌంటెంట్‌గా ఉద్యోగంలో చేరారు రాజేశ్వరి. ఆమె ఉద్యోగం, అశోక్ ఆటో రాబడితో బతుకు బండి గాడిన పడింది అనుకునే లోపే ఊహించని ఉత్పాతం బాంబు పేలుడు రూపంలో ఎదురైంది. కోయంబత్తూరులో 1998, ఫిబ్రవరి 14వ తేదీన... ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ మీటింగ్ ఉందా రోజు. అద్వానీని లక్ష్యంగా చేసుకున్న దుండగులు నగరంలో పదకొండు ప్రదేశాల్లో బాంబులు పేల్చారు. మొత్తం పన్నెండు బాంబులు. ఆ పేలుళ్లలో 58 మంది మరణించగా, రెండు వందలకు పైగా అమాయకులు గాయాలపాలయ్యారు. బాంబు పేలుళ్ల కారణంగా గాయాలపాలైన బాధితుల్లో రాజీ దంపతులు కూడా ఉన్నారు. ఆ దుర్ఘటన తర్వాత రాజేశ్వరి దంపతులకు కోయంబత్తూరులో నివసించడం కష్టమైంది. రాజేశ్వరి సోదరుడు చెన్నైలో రైల్వే ఉద్యోగి. అతడి అండతో రాజేశ్వరి కుటుంబం చెన్నైకి చేరింది. సాధికారత సాధన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రాజేశ్వరి చెన్నైలో జీవన పోరాటం రాజేశ్వరి దంపతులకు కోయంబత్తూరు చేసిన బాంబు గాయాలైతే మానాయి. కానీ చెన్నైలో ఉద్యోగం గగనకుసుమమైంది. ఆమె చేతిలో ఉన్న డిగ్రీ, ఉద్యోగంలో ఉన్న అనుభవం ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఇంటర్వ్యూలకు వెళ్లడం, తిరిగి రావడం రొటీన్ అయింది. ఇంటర్వ్యూల్లో ఫెయిల్ కావడం అంటే జీవితంలో ఫెయిల్ కావడమేనా? కాదు, జీవితంలో విజయం సాధించడానికి ఓ దారి ఉండే ఉంటుంది. జీవన ప్రవాహంలో కొట్టుకుపోకుండా నిలదొక్కుకోవాలంటే ఇంటర్వ్యూలో గెలిచి ఉద్యోగం సంపాదించుకోవడం ఒక్కటే కాదు, తనకు తానే ఓ ఉపాధిని వెతుక్కోవాలని కూడా అనుకుంది. ఆమెకు బాగా పరిచయం ఉన్న స్వయం ఉపాధి మార్గం ఆటో నడపడం ఒక్కటే. కోయంబత్తూరులో సరదాగా నేర్చుకున్న డ్రైవింగ్‌తోనే చెన్నైలో జీవించాలి అనుకుందామె. ‘నేను సొంత ఆటో కొనుక్కునే వరకు ఈ ఆటోను పగలు నువ్వు నడుపు, రాత్రి నేను నడుపుతాను’ అన్నదామె భర్త అశోక్‌తో. ఆమె ఈ మాట అన్నది ఇరవై ఏళ్ల కిందట. ఈ మాట అన్నప్పటికి ఆమెకు ఇరవై ఎనిమిదేళ్లు. నగరాన్ని చదివింది కోయంబత్తూరులో ఆటో నడపడం... చెన్నైలో ఆటో నడపడం ఒకటి కాదు. చెన్నై ట్రాఫిక్ వలయం ఒక ఎత్తయితే, నగరంలో రూట్లు తెలుసుకోవడం మరో ఎత్తు. ఇప్పుడున్నట్లు జీపీఎస్ ఉన్న రోజులు కావవి. మ్యాప్ ఎదురుగా పెట్టుకుని నగరంలో అన్ని ప్రదేశాలనూ తెలుసుకుంది. ఆటోలో తిరుగుతూ దూరాలను తెలుసుకుంది. ఇప్పుడు రాజేశ్వరికి ఒక అడ్రస్ చెబితే రూట్ మ్యాప్ ఆన్ చేయాల్సిన అవసరమే లేదు. మ్యాప్ ఆమె మైండ్‌లోనే ఉంటుంది. ఆమె రైడ్ ముగించుకుని వెళ్తున్నప్పుడు లేదా ఫోన్ కాల్ అందుకుని పికప్ కోసం వెళ్తున్నప్పుడు... రోడ్డు మీద బస్ కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిలు, ముసలి వాళ్లు కనిపిస్తే వాళ్లను ఆటోలో ఎక్కించుకుంటుంది రాజేశ్వరి. ‘‘హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌లో పని చేసే వాళ్లకు డ్యూటీ తొమ్మిది– పది గంటల వరకు ఉంటుంది. వాళ్లలో ఎక్కువ మందికి అరకొర జీతాలే తప్ప ఆటోల్లో ఇళ్లకు వెళ్లగలిగిన జీతాలుండవు. ఆ టైమ్‌లో రోడ్డు మీద ఎప్పుడో వచ్చే బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒంటరిగా ఉన్న ఆడపిల్లలను ఆ టైమ్‌లో అలా చూసి ఏమీ పట్టనట్లు వెళ్లిపోలేను. అందుకే వాళ్లను ఆటో ఎక్కించుకుని నేను వెళ్లే రూట్లో వాళ్లకు అనువైన చోట దించుతాను. అదేమీ పెద్ద సామాజిక సేవ కాదు. నేను చేయగలిగిన చిన్న సహాయం’’ అన్నారామె. అక్క ఉంది అండగా ఆడవాళ్ల మీద జరుగుతున్న అత్యాచారాలు చూసిన తర్వాత రాత్రి పూట ఆటో నడపాలనే నిర్ణయానికి వచ్చానని చెప్పారు రాజేశ్వరి. ‘‘రాత్రి ఎనిమిది నుంచి నాకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. మహిళలు ఆ సమయంలో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మగవాళ్లు నడిపే క్యాబ్‌లు, ఆటోలంటే కొంచెం సందేహిస్తారు. జరుగుతున్న అత్యాచారాలు కూడా అలాగే ఉంటున్నాయి మరి. అందుకే అవకాశం ఉంటే మహిళ నడిపే ఆటోలు, క్యాబ్‌లకే ప్రాధాన్యం ఇస్తారు. నేను మహిళలకు ఆ చాయిస్ ఇవ్వగలుగుతున్నాను. అలాగే ఈ సర్వీస్ నా జీవితానికి కూడా భరోసానిస్తోంది. రోజుకు 30 ట్రిప్పులు నడుపుతున్నాను. నెలకు ముప్పై నుంచి నలభై వేలు సంపాదిస్తున్నాను. నాకు ఇరవై ఏళ్ల కిందట చెన్నైలో ఏ ప్రైవేట్ కంపెనీలోనో ఉద్యోగం దొరికినా, నెలకింత డబ్బుని ఇంటికి తీసుకెళ్లగలిగేదాని కాదు’’ అని మోటివేషనల్ క్లాస్‌లలో చెప్తోంది రాజేశ్వరి. ఇప్పటికి 13 కాలేజీల్లో లెక్చర్ ఇచ్చారామె. తల్లిదండ్రులు అన్నీ అమర్చి చదివిస్తున్న రోజుల విలువను తెలుసుకోవాలని చెబుతారామె. పరీక్షల్లో మార్కులు తక్కువ రావడం, ఫెయిల్ కావడం, లవ్ ఫెయిల్ కావడం వంటి వాటిని భూతద్దంలో చూసుకుని ఆందోళన చెందడమంత హాస్యాస్పదమైన విషయాలు మరేవీ ఉండవని కూడా విద్యార్థులకు చెబుతారామె. విద్యార్థి దశలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలనే పెద్ద సమస్యలుగా భావించి జీవితాలను అంతం చేసుకోవడం అర్థరహితం అని కూడా విద్యార్థులను హెచ్చరిస్తారు రాజేశ్వరి. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరికి వాళ్లు సొంత నడక మొదలు పెట్టాల్సిందేనని, జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరిలా ఉండదని కూడా చెప్తుంటారు రాజేశ్వరి. బతుకు దారి రహదారి కాదు ‘‘నా జీవితంలో లెక్కలేనన్ని ఎగుడుదిగుళ్లు ఎదురయ్యాయి. ఏ దశలోనూ వెనుకడుగు వేయలేదు. చెన్నై రోడ్ల మీద, ఆ ట్రాఫిక్‌లో బండి నడపడానికి మించిన క్లిష్టమైన సమస్య మరేదీ ఉండదు. జీవితంలో వచ్చే కష్టాలన్నీ అంతకంటే చిన్నవే అని కూడా అనిపించింది. ఆటో నడుపుతూ చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా చేశాను. యాక్సిడెంట్ అవుతుందేమోనని ప్రయాణాన్ని ఆపకూడదు, బండి నడపడమూ ఆపకూడదు. సరిగ్గా అలాగే జీవిత ప్రస్థానంలో ఎన్ని అవాంతారాలెదురైనా ప్రయాణాన్ని కొనసాగించాల్సిందే. ప్రత్యర్థి కనిపించని యుద్ధరంగం ‘‘జీవితం ఓ యుద్ధరంగం. ప్రత్యర్థి కనిపించని యుద్ధరంగం ఇది. ఈ యుద్ధరంగంలో మనం సైనికులం. పోరాడుతూనే ఉండాలి. పోరాటంలో ధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యాన్ని కోల్పోతే కింద పడిపోతాం. ఒకసారి కిందపడితే మళ్లీ లేచి తిరిగి పోరాడడానికి మరింత శక్తియుక్తులు కావాలి. అందుకే మనం కింద పడకుండా ఉండడానికి నిరంతరం పోరాడుతూనే ఉండాలి. ఆ పోరాటం... జీవితంతో పోరాటం, జీవితంలో పోరాటం. విజయాల అంచులకు తీసుకెళ్లే పోరాటం కూడా అదే. అందుకు నా జీవితమే పెద్ద ఉదాహరణ’’ అని జీవిత విజయ సూత్రాన్ని వివరించారు రాజేశ్వరి. డ్రైవింగ్‌ను ప్రొఫెషన్‌గా తీసుకోవాలనుకునే అమ్మాయిలకు ఆమె ట్రైనింగ్ ఇస్తున్నారు. సమాజంలో ఆడవాళ్ల భద్రత బాధ్యత ప్రభుత్వానిదే. అయితే ఆ భద్రత బాధ్యతను ఆడవాళ్లు కూడా కొంత పంచుకుంటే అనేక అనర్థాలు తలెత్తకుండానే సమసిపోతాయంటారు రాజేశ్వరి. అంతటి బాధ్యతతో ఆలోచించడం వల్లనే ఆమె చెన్నై వాసులకు ‘రాజీ అక్క’ అయ్యారు.– వాకా మంజులారెడ్డి -
ఆమే.. రథసారథి
ఇప్పటి వరకు ఇంటికి పరిమితమైన ఆ వనితలు..ఇప్పుడు నగర రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు.తోటి మహిళా ప్రయాణికులను సురక్షితంగాగమ్యస్థానాలకు చేర్చుతూ శెభాష్ అనిపించుకుంటున్నారు. మహిళా సాధికారతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు.వారే ‘షీ క్యాబ్’ డ్రైవర్లు. ఈ రథసారథులకు రాత్రి, పగలు తేడా లేదు.. ప్రతిరోజు 14గంటల డ్రైవింగ్.. అంతకుమించి ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటుకుంటూ వీల్‌పై తమ పవర్‌ను విస్తృతం చేస్తున్నారు.. మహిళా శక్తిని చాటుతున్నారు. సనత్‌నగర్: 2015 నవంబర్‌లో ‘షీ క్యాబ్’ సర్వీస్ ప్రారంభమైంది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వీరు సేవలందిస్తున్నారు. ఆర్టీఏ సహకారంతో 35 శాతం సబ్సిడీపై మొత్తం 10 మంది మహిళలకు క్యాబ్‌లు అందజేశారు. అయితే ఆరోగ్యం, ఇతరత్రా కారణాలతో ముగ్గురు వైదొలిగారు. ప్రస్తుతం ఏడుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు 24గంటలు సర్వీస్ అందిస్తున్నారు. రాత్రి వేళల్లో ఇద్దరు తప్పనిసరిగా విధుల్లో ఉంటూ మహిళా ప్రయాణికులకు భరోసానిస్తున్నారు. ప్రారంభంలో 24గంటలు విధులు నిర్వర్తించిన మహిళా డ్రైవర్లు... ఆరోగ్యరీత్యా ఇప్పుడు 14గంటలు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా రోజుకు 300–400 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారు. ప్రోత్సాహమేదీ? మాది మధ్యతరగతి కుటుంబం. నా భర్త రాజు జీడిమెట్లలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటారు. కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలనే ఉద్దేశంతో ‘షీ క్యాబ్’లో చేరాను. రెండేళ్లు గడిచాయి. ప్రతిరోజు రాత్రి 7గంటల నుంచి ఉదయం 9గంటల విధులు నిర్వర్తిస్తాను. ఇలా అయితేనే అన్ని ఖర్చులు(లోన్, డీజిల్, పార్కింగ్, మెయింటెనెన్స్, టోల్ చార్జీలు) పోను రూ.1,000 మిగులుతాయి. ప్రయాణికులతో మాకెప్పుడు ఇబ్బందులు తలెత్తలేదు. కానీ రేట్ల విషయంలోనే అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ రంగంలోకి రావాలని చాలామంది మహిళలకు ఆసక్తి ఉన్నా... ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించడం లేదు. – మంజుల, క్యాబ్ డ్రైవర్ మరెందరికో స్ఫూర్తి... భర్తను కోల్పోయిన వారు కొందరు... ‘ఆమె’ పనిచేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి ఉన్న వారు మరికొందరు.. కారణాలేవైనా ఆత్మస్థైర్యమే పెట్టుబడిగా, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వీరందరూ రథసారథులయ్యారు. ఓవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే.. మరోవైపు జీవన‘చక్రం’ తిప్పుతున్నారు. మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక్కడా చిన్నచూపే.! అన్ని రంగాల్లో మాదిరే ఇక్కడా మహిళలను చిన్నచూపు చూస్తున్నారు. షీ క్యాబ్‌లపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదనే విమర్శలున్నాయి. ఎయిర్‌పోర్టుకు వచ్చే స్వదేశీయులు, విదేశీ ప్రతినిధులు, అతిథులు, ముఖ్యంగా ఒంటరి మహిళలు ‘షీ క్యాబ్’ సర్వీస్‌లపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడు కేవలం ఏడుగురు మాత్రమే ఉండడం, అందులోనూ రాత్రివేళల్లో ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉంటుండడంతో షీ క్యాబ్‌లను ఎక్కువగా ఆశ్రయించే అవకాశం లేకుండాపోతోంది. ఈ రంగంలోకి వచ్చేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నప్పటికీ... ‘ఆ మహిళలు ఏం నడుపుతారులే?’ అని చిన్నచూపు చూస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా డ్రైవర్లకు ప్రత్యేకించి స్పెషల్ ఇన్సెంటీవ్స్, రేట్స్ మెనూ లేవని వాపోయారు. చార్జీలు పెంచాలి... మాది అంబర్‌పేట. నా భర్త నాగరాజు కార్పెంటర్‌గా పనిచేస్తారు. కుటుంబం గడవాలంటే ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. డ్రైవింగ్‌లో నైపుణ్యం ఉండడంతో ‘షీ క్యాబ్’లో చేరి సబ్సిడీలో క్యాబ్ పొందాను. మొదట్లో 24గంటలు పనిచేస్తే.. రూ.3వేలు మిగిలేవి. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో 14గంటలు చేస్తున్నాం. ఇప్పుడు రూ.1,000 వస్తున్నాయి. దాదాపు రాత్రంతా క్యాబ్ నడపడమే. ఈ రంగంలో రాణించాలంటే ముఖ్యంగా కావాల్సింది మనోధైర్యం, కుటుంబ సహకారం. అన్ని గంటలు డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలంటే చాలా సహనం అవసరం. ఈ రంగంలో మేము అవార్డులు, రివార్డులు కోరుకోవడం లేదు. కానీ ధరలు పెంచితే బాగుంటుంది. లీటర్ డీజిల్ రూ.48 ఉన్నప్పటి నుంచి క్యాబ్ నడుపుతున్నాం. ఇప్పుడు డీజిల్ ధర రూ.70 అయింది. కానీ మా క్యాబ్ రేట్లు మారడం లేదు. మహిళా క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి ప్రత్యేకంగా ధరలు పెంచాలి. – బాలమణి, క్యాబ్ డ్రైవర్ రాయితీ ఇవ్వాలి... మాది ఎల్బీనగర్ కొత్తపేట. మొదట నేను స్టాఫ్ నర్స్‌గా పనిచేశాను. నా భర్త రవీందర్‌రెడ్డి(న్యాయవాది) చనిపోవడంతో కుటుంబ భారం నాపై పడింది. ఎలాగైనా పిల్లలను ఉన్నత స్థితికి చేర్చాలన్నదే నా లక్ష్యం. ప్రయాణికులు మహిళా డ్రైవర్లను ఎంతో గౌరవంగా చూస్తారు. అందుబాటులో లేకున్నా ‘షీ క్యాబ్స్’ వచ్చే వరకు వేచి చూసే ప్రయాణికులు కూడా ఉన్నారు. ఒంటరి మహిళలు, కుటుంబంతో వచ్చేవారిని మాత్రమే అనుమతిస్తాం. డ్రైవర్‌గా రాణించాలంటే నిబద్ధత అవసరం. అయితే తమకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం కరువైంది. పార్కింగ్, మెయింటెనెన్స్, టోల్ చార్జీల్లో రాయితీలివ్వాలి, క్యాబ్ ధరలు పెంచాలి. – సుభాషిణి, క్యాబ్ డ్రైవర్ -
త్వరలో మహిళల కోసం ప్రత్యేక ఆటోలు
సాక్షి, ముంబై : మహిళా ప్రయాణికుల కోసం మహిళా డ్రైవర్లతో 50 ఆటో సేవలు థానేలో త ్వరలో ప్రారంభం కానున్నాయి. పట్టణంలో కొన్ని ఆటోలు మహిళలే నడపాలని ఎమ్మెమ్మార్డీఏకు ప్రతిపాదన పంపిన రవాణా శాఖ, తర్వాత మహిళల సంక్షేమం కోసం 50 మంది మహిళా డ్రైవర్లను ఇవ్వాలని ఎన్జీవోలను ఆశ్రయించింది. మహిళలకు ప్రత్యేక పర్మిట్లు జారీ చేసి వారితో ఆటోలను నడిపించేందుకు కృషి చేస్తున్నామని రవాణా విభాగం పేర్కొంది. మహిళలే ఆటో నడపడం వల్ల మహిళా ప్రయాణికులకు కూడా సురక్షిత భావం ఏర్పడుతుందని రవాణా శాఖ అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆటోలకు ప్రత్యేక రంగు ప్రతిపాదించామని తెలిపారు. ఈ ప్రతిపాదన అమలైతే రాష్ట్రంలో మహిళా డ్రైవర్లున్న తొలి పట్టణంగా థానేకు ఘనత దక్కుతుందని అన్నారు. -
కోర్టులో మహిళా డ్రైవర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారత నినాదాన్ని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి.రజని ఆచరణలో చేసి చూపించారు. నాంపల్లి క్రిమినల్‌కోర్టులో మొదటిసారిగా ఇద్దరు మహిళా డ్రైవర్లను నియమించారు. ఆమె నేతృత్వంలో బుధవారం ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. డ్రైవర్లుగా పురుషులు మాత్రమే చేయగలరన్న అపోహను పక్కనపెట్టి ఇద్దరు మహిళలను డ్రైవర్లుగా న్యాయవ్యవస్థ విధుల కోసం ఎంపిక చేశారు. -
అమలు కాని ‘షీ క్యాబ్స్’
♦ కార్ల కోసం మహిళా డ్రైవర్ల పడిగాపులు ♦ రవాణా కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు ♦ ప్రతిపాదనలకే పరిమితమైన పాజెక్టు సాక్షి,సిటీబ్యూరో : అది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు... నగరంలో మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారి కోసం ప్రత్యేకంగా మహిళా డ్రైవర్లే నడిపే షీ- క్యాబ్స్‌ను ప్రవేశపెట్టాలన్న మహిళా భద్రతా కమిటీ సూచన మేరకు ప్రభుత్వం ఆ ప్రాజెక్టును చేపట్టింది. అప్పటికే జీహెచ్ఎంసీ షీ క్యాబ్స్ ఏర్పాటు విషయంలో విఫలమైంది. మరోసారి అలా జరగకుండా కనీసం 50 షీ క్యాబ్స్ నగరంలో ప్రవేశపెట్టాలని రవాణాశాఖ అధికారులు ప్రణాళికలను రూపొందించారు. కేరళలోని త్రివేండ్రమ్‌లో నడుస్తున్న షీ క్యాబ్స్ తరహాలో నగరంలో ప్రవేశ పెట్టేందుకు మహిళా డ్రైవర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా చాలా మంది దరఖాస్తు చేశారు. కానీ వారిలో రెండు విడతలుగా 18 మందిని ఎంపిక చేసి గత డిసెంబర్లో మహిళా ప్రయాణికుల భద్రతకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలో వారికి రుణసదుపాయంపై కార్లు అందజేసి షీ క్యాబ్స్‌ను అందుబాటులోకి తెస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వారు ఆ మహిళా డ్రైవర్లు ఆర్టీఏ కార్యాలయంలో వద్ద పడిగాపులు కాస్తున్నారు. కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్టు అమలైందీ లేదు. షీ క్యాబ్స్ రోడ్డెక్కిందీ లేదు. అలా మొదలైంది.... గతేడాది నగరంలో పలు చోట్ల మహిళలపై జరిగిన అకృత్యాల దృష్ట్యా మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం పూనం మాలకొండయ్య నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ సూచన మేరకు షీ క్యాబ్స్‌కు శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఏడాది జీహెచ్ఎంసీ ఇదే తరహాలో షీ-క్యాబ్స్‌కు సన్నాహాలు చేపట్టింది. అయితే, బ్యాంకులు రుణా లు అందజేసేందుకు ముందుకు రాకపోవడంతో ఆ ప్రాజెక్టు విజయవంతం కాలేదు. ఈసారి అలా జరగకుండా స్త్రీ,శిశు సంక్షేమశాఖ, రవాణాశాఖలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. వాహనాల ఖరీదుపై మహిళా డ్రైవర్లకు మొదట 50 శాతం సబ్సిడీ ఇవ్వాలనుకున్నారు. తర్వాత దానిని 35 శాతానికి తగ్గించారు. బ్యాంకులు సైతం రుణాల మంజూరుకు ముందుకు వచ్చాయి. అప్పటికే డ్రైవింగ్‌లో అనుభవం ఉన్న 18 మందిని ఎంపిక చేసి మరోసారి శిక్షణనిచ్చారు. ఇప్పుడు వాళ్లంతా కార్ల కోసం, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. కన్సల్టెన్సీ కోసం ఎదురు చూపులు... మరోవైపు షీ క్యాబ్స్ ప్రాజెక్టు నిర్వహణ కోసం రవాణాశాఖ ఒక కన్సల్టెన్సీ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించగా.. నాలుగైదు సంస్థలు ముందుకొచ్చాయి. వాటిలోంచి కేరళలోని త్రివేండ్రమ్‌కు చెందిన ‘షీ ట్యాక్సీ’ సంస్థకు అన్ని విధాలుగా అర్హత ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు రవాణా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన లు పంపారు. కన్సల్టెన్సీ ఖరారైతే మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా షీ క్యాబ్స్ ప్రారంభించాలనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. -
కదిలింది... నారీ లోకం
షి క్యాబ్స్పై మహిళల ఆసక్తి తరలివచ్చిన ఉన్నత విద్యావంతులు {స్కీనింగ్ పరీక్షలు ప్రారంభం ప్రభుత్వం తలపెట్టినషీ క్యాబ్స్ పథకానికి మహిళా డ్రైవర్ల నుంచి మంచి స్పందన లభించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి 47 మంది మహిళా డ్రైవర్లు దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలకు 12 మంది మహిళా డ్రైవర్లు హాజరయ్యారు. వీరిలో ఎంటెక్, డిగ్రీ వంటి ఉన్నత చదువులు పూర్తిచేసిన వారు...సాధారణ డ్రైవింగ్ లెసైన్స్‌తో పాటు, ట్రాన్స్‌పోర్టు డ్రైవింగ్ లెసైన్స్ కలిగిన వారు ఉండడం విశేషం. కొంతమంది ఏడాది కాలంగా డ్రైవింగ్ చేస్తుండగా... మరి కొందరు ఏడెనిమిదేళ్ల అనుభవం ఉన్న మహిళా డ్రైవ ర్లు ఆర్టీఏ అధికారులను సంప్రదించారు. మియాపూర్‌కు చెందిన శివలీల ఎంటెక్ పూర్తి చేశారు. ఆమె బస్సులు, లారీల వంటి పెద్ద వాహనాలు నడిపేందుకు అర్హతగా భావించే హెవీ డ్రైవింగ్ లెసైన్సు కలిగి ఉన్నారు. మరో 8 మంది డ్రైవింగ్‌లో ఏడాది అనుభవం కలిగిన వారున్నారు. ఇద్దరు డిగ్రీ పూర్తి చేశారు. పదో తరగతితో పాటు, ఐటీఐ పూర్తి చేసిన మహిళ లూ షీ క్యాబ్స్ నడిపేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అభ్యర్ధుల దరఖాస్తులు, డ్రైవింగ్ లెసైన్సులు, ఇతర డాక్యుమెంట్లు స్వీకరించిన అధికారులు అర్హత గల వారిని త్వరలోనే శిక్షణకు ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. ఉపాధికి చక్కటి మార్గం - జేటీసీ రఘునాథ్ షీ క్యాబ్స్‌తో మహిళా డ్రైవర్లకు చక్కటి ఆదాయం లభించగలదని జేటీసీ రఘునాథ్ తెలిపారు. నగరంలోని ఐటీ పరిశ్రమలు, స్కూళ్లు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థల కోసం ఈ వాహనాలను నడిపేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. పగటిపూట మాత్రమే షీ క్యాబ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం త్రివేండ్రమ్‌లో నడుపుతున్న 50 మంది మహిళా డ్రైవర్లు ప్రతి నెల రూ.50 వేలకు పైగా ఆర్జిస్తున్నారని తెలిపారు. వాహనాలపై వాణిజ్య ప్రకటనల వల్ల కొంత మేర ఆదాయం వస్తుందన్నారు. త్వరలోనే విధివిధానాలను రూపొందించి, శిక్షణ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి నగరంలో వసతి కల్పిస్తామన్నారు.