♦ కార్ల కోసం మహిళా డ్రైవర్ల పడిగాపులు
♦ రవాణా కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
♦ ప్రతిపాదనలకే పరిమితమైన పాజెక్టు
సాక్షి,సిటీబ్యూరో : అది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు... నగరంలో మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారి కోసం ప్రత్యేకంగా మహిళా డ్రైవర్లే నడిపే షీ- క్యాబ్స్‌ను ప్రవేశపెట్టాలన్న మహిళా భద్రతా కమిటీ సూచన మేరకు ప్రభుత్వం ఆ ప్రాజెక్టును చేపట్టింది. అప్పటికే జీహెచ్‌ఎంసీ షీ క్యాబ్స్ ఏర్పాటు విషయంలో విఫలమైంది. మరోసారి అలా జరగకుండా కనీసం 50 షీ క్యాబ్స్ నగరంలో ప్రవేశపెట్టాలని రవాణాశాఖ అధికారులు ప్రణాళికలను రూపొందించారు. కేరళలోని త్రివేండ్రమ్‌లో నడుస్తున్న షీ క్యాబ్స్ తరహాలో నగరంలో ప్రవేశ పెట్టేందుకు మహిళా డ్రైవర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా చాలా మంది దరఖాస్తు చేశారు.
కానీ వారిలో రెండు విడతలుగా 18 మందిని ఎంపిక చేసి గత డిసెంబర్‌లో మహిళా ప్రయాణికుల భద్రతకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలో వారికి రుణసదుపాయంపై కార్లు అందజేసి షీ క్యాబ్స్‌ను అందుబాటులోకి తెస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వారు ఆ మహిళా డ్రైవర్లు ఆర్టీఏ కార్యాలయంలో వద్ద పడిగాపులు కాస్తున్నారు. కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్టు అమలైందీ లేదు. షీ క్యాబ్స్ రోడ్డెక్కిందీ లేదు.
అలా మొదలైంది....
గతేడాది నగరంలో పలు చోట్ల మహిళలపై జరిగిన అకృత్యాల దృష్ట్యా మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం పూనం మాలకొండయ్య నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ సూచన మేరకు షీ క్యాబ్స్‌కు శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఏడాది జీహెచ్‌ఎంసీ ఇదే తరహాలో షీ-క్యాబ్స్‌కు సన్నాహాలు చేపట్టింది. అయితే, బ్యాంకులు రుణా లు అందజేసేందుకు ముందుకు రాకపోవడంతో ఆ ప్రాజెక్టు విజయవంతం కాలేదు.
ఈసారి అలా జరగకుండా స్త్రీ,శిశు సంక్షేమశాఖ, రవాణాశాఖలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. వాహనాల ఖరీదుపై మహిళా డ్రైవర్లకు మొదట 50 శాతం సబ్సిడీ ఇవ్వాలనుకున్నారు. తర్వాత దానిని 35 శాతానికి తగ్గించారు. బ్యాంకులు సైతం రుణాల మంజూరుకు ముందుకు వచ్చాయి. అప్పటికే డ్రైవింగ్‌లో అనుభవం ఉన్న 18 మందిని ఎంపిక చేసి మరోసారి శిక్షణనిచ్చారు. ఇప్పుడు వాళ్లంతా కార్ల కోసం, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు.
కన్సల్టెన్సీ కోసం ఎదురు చూపులు...
మరోవైపు షీ క్యాబ్స్ ప్రాజెక్టు నిర్వహణ కోసం రవాణాశాఖ ఒక కన్సల్టెన్సీ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించగా.. నాలుగైదు సంస్థలు ముందుకొచ్చాయి. వాటిలోంచి కేరళలోని త్రివేండ్రమ్‌కు చెందిన ‘షీ ట్యాక్సీ’ సంస్థకు అన్ని విధాలుగా అర్హత ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు రవాణా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన లు పంపారు. కన్సల్టెన్సీ ఖరారైతే మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా షీ క్యాబ్స్ ప్రారంభించాలనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు.
అమలు కాని ‘షీ క్యాబ్స్’
Published Wed, Apr 8 2015 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM
Advertisement