ఇప్పటి వరకు ఇంటికి పరిమితమైన ఆ వనితలు..ఇప్పుడు నగర రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు.తోటి మహిళా ప్రయాణికులను సురక్షితంగాగమ్యస్థానాలకు చేర్చుతూ శెభాష్ అనిపించుకుంటున్నారు. మహిళా సాధికారతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు.వారే ‘షీ క్యాబ్’ డ్రైవర్లు. ఈ రథసారథులకు రాత్రి, పగలు తేడా లేదు.. ప్రతిరోజు 14గంటల డ్రైవింగ్.. అంతకుమించి ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటుకుంటూ వీల్‌పై తమ పవర్‌ను విస్తృతం చేస్తున్నారు.. మహిళా శక్తిని చాటుతున్నారు.
సనత్‌నగర్: 2015 నవంబర్‌లో ‘షీ క్యాబ్’ సర్వీస్ ప్రారంభమైంది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వీరు సేవలందిస్తున్నారు. ఆర్టీఏ సహకారంతో 35 శాతం సబ్సిడీపై మొత్తం 10 మంది మహిళలకు క్యాబ్‌లు అందజేశారు. అయితే ఆరోగ్యం, ఇతరత్రా కారణాలతో ముగ్గురు వైదొలిగారు. ప్రస్తుతం ఏడుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు 24గంటలు సర్వీస్ అందిస్తున్నారు. రాత్రి వేళల్లో ఇద్దరు తప్పనిసరిగా విధుల్లో ఉంటూ మహిళా ప్రయాణికులకు భరోసానిస్తున్నారు. ప్రారంభంలో 24గంటలు విధులు నిర్వర్తించిన మహిళా డ్రైవర్లు... ఆరోగ్యరీత్యా ఇప్పుడు 14గంటలు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా రోజుకు 300–400 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారు.
ప్రోత్సాహమేదీ?
మాది మధ్యతరగతి కుటుంబం. నా భర్త రాజు జీడిమెట్లలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటారు. కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలనే ఉద్దేశంతో ‘షీ క్యాబ్’లో చేరాను. రెండేళ్లు గడిచాయి. ప్రతిరోజు రాత్రి 7గంటల నుంచి ఉదయం 9గంటల విధులు నిర్వర్తిస్తాను. ఇలా అయితేనే అన్ని ఖర్చులు(లోన్, డీజిల్, పార్కింగ్, మెయింటెనెన్స్, టోల్ చార్జీలు) పోను రూ.1,000 మిగులుతాయి. ప్రయాణికులతో మాకెప్పుడు ఇబ్బందులు తలెత్తలేదు. కానీ రేట్ల విషయంలోనే అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ రంగంలోకి రావాలని చాలామంది మహిళలకు ఆసక్తి ఉన్నా... ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించడం లేదు.
– మంజుల, క్యాబ్ డ్రైవర్
మరెందరికో స్ఫూర్తి...
భర్తను కోల్పోయిన వారు కొందరు... ‘ఆమె’ పనిచేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి ఉన్న వారు మరికొందరు.. కారణాలేవైనా ఆత్మస్థైర్యమే పెట్టుబడిగా, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వీరందరూ రథసారథులయ్యారు. ఓవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే.. మరోవైపు జీవన‘చక్రం’ తిప్పుతున్నారు. మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఇక్కడా చిన్నచూపే.!
అన్ని రంగాల్లో మాదిరే ఇక్కడా మహిళలను చిన్నచూపు చూస్తున్నారు. షీ క్యాబ్‌లపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదనే విమర్శలున్నాయి. ఎయిర్‌పోర్టుకు వచ్చే స్వదేశీయులు, విదేశీ ప్రతినిధులు, అతిథులు, ముఖ్యంగా ఒంటరి మహిళలు ‘షీ క్యాబ్’ సర్వీస్‌లపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడు కేవలం ఏడుగురు మాత్రమే ఉండడం, అందులోనూ రాత్రివేళల్లో ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉంటుండడంతో షీ క్యాబ్‌లను ఎక్కువగా ఆశ్రయించే అవకాశం లేకుండాపోతోంది. ఈ రంగంలోకి వచ్చేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నప్పటికీ... ‘ఆ మహిళలు ఏం నడుపుతారులే?’ అని చిన్నచూపు చూస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా డ్రైవర్లకు ప్రత్యేకించి స్పెషల్ ఇన్సెంటీవ్స్, రేట్స్ మెనూ లేవని వాపోయారు.
చార్జీలు పెంచాలి...
మాది అంబర్‌పేట. నా భర్త నాగరాజు కార్పెంటర్‌గా పనిచేస్తారు. కుటుంబం గడవాలంటే ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. డ్రైవింగ్‌లో నైపుణ్యం ఉండడంతో ‘షీ క్యాబ్’లో చేరి సబ్సిడీలో క్యాబ్ పొందాను. మొదట్లో 24గంటలు పనిచేస్తే.. రూ.3వేలు మిగిలేవి. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో 14గంటలు చేస్తున్నాం. ఇప్పుడు రూ.1,000 వస్తున్నాయి. దాదాపు రాత్రంతా క్యాబ్ నడపడమే. ఈ రంగంలో రాణించాలంటే ముఖ్యంగా కావాల్సింది మనోధైర్యం, కుటుంబ సహకారం. అన్ని గంటలు డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలంటే చాలా సహనం అవసరం. ఈ రంగంలో మేము అవార్డులు, రివార్డులు కోరుకోవడం లేదు. కానీ ధరలు పెంచితే బాగుంటుంది. లీటర్ డీజిల్ రూ.48 ఉన్నప్పటి నుంచి క్యాబ్ నడుపుతున్నాం. ఇప్పుడు డీజిల్ ధర రూ.70 అయింది. కానీ మా క్యాబ్ రేట్లు మారడం లేదు. మహిళా క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి ప్రత్యేకంగా ధరలు పెంచాలి. – బాలమణి, క్యాబ్ డ్రైవర్
రాయితీ ఇవ్వాలి...
మాది ఎల్బీనగర్ కొత్తపేట. మొదట నేను స్టాఫ్ నర్స్‌గా పనిచేశాను. నా భర్త రవీందర్‌రెడ్డి(న్యాయవాది) చనిపోవడంతో కుటుంబ భారం నాపై పడింది. ఎలాగైనా పిల్లలను ఉన్నత స్థితికి చేర్చాలన్నదే నా లక్ష్యం. ప్రయాణికులు మహిళా డ్రైవర్లను ఎంతో గౌరవంగా చూస్తారు. అందుబాటులో లేకున్నా ‘షీ క్యాబ్స్’ వచ్చే వరకు వేచి చూసే ప్రయాణికులు కూడా ఉన్నారు. ఒంటరి మహిళలు, కుటుంబంతో వచ్చేవారిని మాత్రమే అనుమతిస్తాం. డ్రైవర్‌గా రాణించాలంటే నిబద్ధత అవసరం. అయితే తమకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం కరువైంది. పార్కింగ్, మెయింటెనెన్స్, టోల్ చార్జీల్లో రాయితీలివ్వాలి, క్యాబ్ ధరలు పెంచాలి. – సుభాషిణి, క్యాబ్ డ్రైవర్
Comments
Please login to add a commentAdd a comment