She Cabs
-
‘ఇంద్రారెడ్డి చార్మినార్‌లో ఒంటరిగా వదిలిపెట్టారు, అలా డ్రైవింగ్ నేర్చుకున్నా’
సాక్షి, హైదరాబాద్: ‘నేను మూడు రోజుల్లోనే కారు డ్రైవింగ్ నేర్చుకున్నా. మా ఆయనే నేర్పించారు’అని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ప్రభుత్వ సహకారంతో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతులతో తాను డ్రైవింగ్ నేర్చుకున్న అనుభవాలను పంచుకున్నారు. సంకల్పం, నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో 23 మంది యువతులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా శుక్రవారం సరూర్‌నగర్ వీఎంహోంలో షీ క్యాబ్స్ వాహనాలను మంత్రి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో మొదటి రోజు స్టీరింగ్, రెండో రోజు బ్రేక్, గేర్ల గురించి నేర్చుకున్నా. మూడో రోజు స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ కారు నడిపా. ఇక నాల్గవ రోజు రోడ్డు మీదకు వాహనం నడుపుతూ వచ్చా’అని చెప్పారు. పాతబస్తీలో డ్రైవ్ చేస్తే ఎక్కడైనా చెయ్యొచ్చు అని ఇంద్రారెడ్డి చార్మినార్‌లో తనను ఒంటరిగా వదిలిపెట్టారని, అలా డ్రైవింగ్ నేర్చుకున్నానని సబిత తెలిపారు. చదవండి: కేజిన్నర వెండి, బంగారంతో కూకట్‌పల్లిలో బతుకమ్మ.. వైరల్ ఫొటో -
పూటుగా మద్యం తాగి.. క్యాబ్ నడిపిస్తున్న యువతిపై..
సాక్షి, బంజారాహిల్స్: షీక్యాబ్స్ నడిపిస్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. లంగర్‌హౌజ్‌లో నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్‌వ్యాపారి మోటా రమణ(55) ఆదివారం సాయంత్రం జీడిమెట్ల సమీపంలోని గాజులరామారంలో విందుకు హాజరయ్యాడు. అక్కడ పూటుగా మద్యం తాగిన రమణ ఇంటికి వెళ్లేందుకు ఉమెన్ ఆన్ వీల్స్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నాడు. క్యాబ్ నడిపిస్తున్న యువతి (32)ని దారిపొడవునా అసభ్య పదజాలంతో మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సరిగ్గా బంజారాహిల్స్ రోడ్ నెం–1 చేరుకోగానే ఆమె రమణ చేష్టలు భరించలేక రాత్రి 9.45 ప్రాంతంలో డయల్ 100కు ఫోన్ చేసింది. అప్రమత్తమైన బంజారాహిల్స్ పెట్రోలింగ్ పోలీసులు క్షణాల్లోనే బంజారాహిల్స్ రోడ్ నెం–12 చౌరస్తా సమీపానికి వచ్చి క్యాబ్‌ను ఆపడంతో పాటు ఆమెకు భద్రత కల్పించారు. నిందితుడు రమణను అరెస్టు చేసి బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. నిందితుడిపై ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు దర్యాప్తు అధికారి ఎస్ఐ కె.ఉదయ్ తెలిపారు. -
మహిళల చేతికి ‘స్టీరింగ్’..!
సాక్షి, సంగారెడ్డి: ‘మహిళలు విమానాలు నడుపుతున్నారు.. అంతరిక్షంలోకి రాకెట్లతో వెళ్తున్నారు.. కుటుంబాలను నడిపే బాధ్యతనూ సమర్థంగా నిర్వహిస్తున్నారు.. కార్లను నడపటం వారికి కష్టమేమీ కాదు.. అందుకే ఇంటి స్టీరింగ్‌తో పాటు ఉపాధి పొందడానికి మొదటిసారిగా ప్రభుత్వం ‘కారు’ స్టీరింగ్ కూడా మీ చేతుల్లో పెడుతోంది..’అని ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. వీటిని విజయవంతంగా నడిపించుకొని ఉపాధి పొందుతారనే విశ్వాసముందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 18 మంది మహిళలకు ‘షీ క్యాబ్స్’కార్లను అందజేశారు. సమాజ అభివృద్ధికి దోహదం.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఇది సమాజ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని హరీశ్ చెప్పారు. ‘తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్సీలకు రూ.2,737 కోట్లతో 1.63 లక్షల మంది ఎస్సీ లబ్ధిదారులకు మేలు చేసేలా పథకాలు అమలుపరిచాం. గత ప్రభుత్వాల హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేది. మహిళలకు షీ క్యాబ్స్ పేరుతో అద్దెకు నడిపి ఉపాధి పొందడానికి కార్లను అందజేసే కార్యక్రమం రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నాం. ఈ జిల్లా నుంచి ప్రారంభిస్తున్న ఈ పథకానికి 25 మంది దరఖాస్తు చేసుకోగా 18 మందిని ఎంపిక చేసి వారికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించి లైసెన్సులు సైతం ఇచ్చాం. క్యాబ్ డ్రైవర్స్ ఆత్మరక్షణకు పెప్పర్ స్ప్రే, సెల్‌ఫోన్, జియో లొకేషన్ సౌకర్యం కల్పించాం. ఈ పథకం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇటు ఈ పథకం సక్సెస్ అయ్యేందుకు కార్లను అందజేసిన మహిళలను మూడు నెలల పాటు వారం వారం పర్యవేక్షిస్తూ నెలకోసారి అధికారులు నివేదికను అందజేయాలి. జిల్లాలో అత్యధికంగా పరిశ్రమలున్నాయి. వాటిలో పనిచేసే మేనేజర్లు, పర్సనల్ మేనేజర్లు, ఇతర అధికారులకు కార్లు అద్దెకు అవసరం అవుతాయి. కార్లు పొందిన మహిళలకు ఆసక్తి ఉంటే పరిశ్రమల యజమానులతో మాట్లాడి టై అప్ చేయిస్తాం.. దీంతో ప్రతినెలా పని లభించడమే కాకుండా నెలనెలా అద్దె వస్తుంది. ఇటు ‘ఊబర్’సంస్థతో కూడా టై అప్ చేసుకోవచ్చు..’అని మంత్రి అన్నారు. అనంతరం మహిళా లబ్ధిదారులు నడిపిన షీ క్యాబ్స్‌లో హరీశ్ ప్రయాణించి వారికి సూచనలు అందజేశారు. అనంతరం వారితో సెల్ఫీలు దిగి సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం.హనుమంతరావు, జెడ్పీ చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. మిగతావారికి వారంలో రైతుబంధు.. ఇక యాసంగిలో రూ.7,500 కోట్లు రైతుబంధు కింద రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నామని మంత్రి హరీశ్ తెలిపారు. మునిపల్లి మండలం కంకోల్లో రైతువేదికను ప్రారంభించిన ఆయన.. ఇప్పటివరకు రూ.5,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు. మిగతావారికి వారంలోగా డబ్బులు జమ అవుతాయన్నారు. కల్లాల నిర్మాణానికి రూ.600 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. కుటుంబానికి ఆసరా అవుతా.. సంగారెడ్డి కేంద్రంలోని తారా డిగ్రీ కళాశాలలో చదువుతున్నాను. కుటుంబానికి చేయూతనివ్వాలని ఏదో ఒక వ్యాపారం చేయాలనుకున్నాను. పెట్టుబడి పెట్టేంత ఆర్థిక స్థోమత లేకపోయింది. ప్రభుత్వ ‘షీ క్యాబ్’పథకం గురించి తెలిసి దరఖాస్తు చేశాను. ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎంపిక చేసి, డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి లైసెన్స్ కూడా ఇప్పించారు. ఇప్పుడు కారు కూడా వచ్చింది. కుటుంబానికి ఎంతో కొంత ఆసరా అవుతాననే భరోసా కలిగింది. – బి.ప్రవళిక, చేర్యాల్, కంది మండలం ఆత్మస్థైర్యం కలిగింది.. మావారు క్యాటరింగ్ చేస్తారు. ఆ సంపాదనతో కుటుంబ పోషణ కష్టంగా ఉంది. గృహిణిగా ఉన్న నేను కూడా ఏదో ఓ పనిచేసి అండగా నిలవలానుకున్నా. ఎస్సీ కార్పొరేషన్ ప్రకటనతో షీ క్యాబ్‌కు దరఖాస్తు చేసుకోవడంతో లబ్ధిదారుగా ఎంపిక చేశారు. నెలరోజుల పాటు ఇచ్చిన శిక్షణలో పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని పనులు చేయగలరనే ఆత్మస్థైర్యం కలిగింది. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.10 వేలు మిగిలినా కుటుంబానికి భారం తప్పుతుంది. – పాతర తేజస్వి, సంగారెడ్డి టౌన్ అమ్మను పోషించుకునేందుకు.. 11 ఏళ్లు ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు. నేను అమ్మ ఇద్దరమే ఉంటున్నాం. ఆమెనే నా ఆలనా పాలనా చూసేది. కూలిపనికి వెళ్లి కష్టపడి నన్ను చదివించింది. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే పత్రికలో షీ క్యాబ్ స్కీం ప్రకటన చూశా. లబ్ధిదారుగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. సబ్సీడీపై కారు అందించారు. అన్నీ తానై నన్ను పోషించిన అమ్మకు అన్ని విధాలా అండగా ఉండాలనేదే లక్ష్యం. – గొర్లకాడి వసంత, జుల్కల్, కంది మండలం -
ఆమే.. రథసారథి
ఇప్పటి వరకు ఇంటికి పరిమితమైన ఆ వనితలు..ఇప్పుడు నగర రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు.తోటి మహిళా ప్రయాణికులను సురక్షితంగాగమ్యస్థానాలకు చేర్చుతూ శెభాష్ అనిపించుకుంటున్నారు. మహిళా సాధికారతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు.వారే ‘షీ క్యాబ్’ డ్రైవర్లు. ఈ రథసారథులకు రాత్రి, పగలు తేడా లేదు.. ప్రతిరోజు 14గంటల డ్రైవింగ్.. అంతకుమించి ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని దాటుకుంటూ వీల్‌పై తమ పవర్‌ను విస్తృతం చేస్తున్నారు.. మహిళా శక్తిని చాటుతున్నారు. సనత్‌నగర్: 2015 నవంబర్‌లో ‘షీ క్యాబ్’ సర్వీస్ ప్రారంభమైంది. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వీరు సేవలందిస్తున్నారు. ఆర్టీఏ సహకారంతో 35 శాతం సబ్సిడీపై మొత్తం 10 మంది మహిళలకు క్యాబ్‌లు అందజేశారు. అయితే ఆరోగ్యం, ఇతరత్రా కారణాలతో ముగ్గురు వైదొలిగారు. ప్రస్తుతం ఏడుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు 24గంటలు సర్వీస్ అందిస్తున్నారు. రాత్రి వేళల్లో ఇద్దరు తప్పనిసరిగా విధుల్లో ఉంటూ మహిళా ప్రయాణికులకు భరోసానిస్తున్నారు. ప్రారంభంలో 24గంటలు విధులు నిర్వర్తించిన మహిళా డ్రైవర్లు... ఆరోగ్యరీత్యా ఇప్పుడు 14గంటలు పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా రోజుకు 300–400 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారు. ప్రోత్సాహమేదీ? మాది మధ్యతరగతి కుటుంబం. నా భర్త రాజు జీడిమెట్లలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటారు. కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలనే ఉద్దేశంతో ‘షీ క్యాబ్’లో చేరాను. రెండేళ్లు గడిచాయి. ప్రతిరోజు రాత్రి 7గంటల నుంచి ఉదయం 9గంటల విధులు నిర్వర్తిస్తాను. ఇలా అయితేనే అన్ని ఖర్చులు(లోన్, డీజిల్, పార్కింగ్, మెయింటెనెన్స్, టోల్ చార్జీలు) పోను రూ.1,000 మిగులుతాయి. ప్రయాణికులతో మాకెప్పుడు ఇబ్బందులు తలెత్తలేదు. కానీ రేట్ల విషయంలోనే అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ రంగంలోకి రావాలని చాలామంది మహిళలకు ఆసక్తి ఉన్నా... ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందించడం లేదు. – మంజుల, క్యాబ్ డ్రైవర్ మరెందరికో స్ఫూర్తి... భర్తను కోల్పోయిన వారు కొందరు... ‘ఆమె’ పనిచేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి ఉన్న వారు మరికొందరు.. కారణాలేవైనా ఆత్మస్థైర్యమే పెట్టుబడిగా, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వీరందరూ రథసారథులయ్యారు. ఓవైపు కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే.. మరోవైపు జీవన‘చక్రం’ తిప్పుతున్నారు. మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇక్కడా చిన్నచూపే.! అన్ని రంగాల్లో మాదిరే ఇక్కడా మహిళలను చిన్నచూపు చూస్తున్నారు. షీ క్యాబ్‌లపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదనే విమర్శలున్నాయి. ఎయిర్‌పోర్టుకు వచ్చే స్వదేశీయులు, విదేశీ ప్రతినిధులు, అతిథులు, ముఖ్యంగా ఒంటరి మహిళలు ‘షీ క్యాబ్’ సర్వీస్‌లపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడు కేవలం ఏడుగురు మాత్రమే ఉండడం, అందులోనూ రాత్రివేళల్లో ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉంటుండడంతో షీ క్యాబ్‌లను ఎక్కువగా ఆశ్రయించే అవకాశం లేకుండాపోతోంది. ఈ రంగంలోకి వచ్చేందుకు చాలామంది ఉత్సాహం చూపుతున్నప్పటికీ... ‘ఆ మహిళలు ఏం నడుపుతారులే?’ అని చిన్నచూపు చూస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా డ్రైవర్లకు ప్రత్యేకించి స్పెషల్ ఇన్సెంటీవ్స్, రేట్స్ మెనూ లేవని వాపోయారు. చార్జీలు పెంచాలి... మాది అంబర్‌పేట. నా భర్త నాగరాజు కార్పెంటర్‌గా పనిచేస్తారు. కుటుంబం గడవాలంటే ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. డ్రైవింగ్‌లో నైపుణ్యం ఉండడంతో ‘షీ క్యాబ్’లో చేరి సబ్సిడీలో క్యాబ్ పొందాను. మొదట్లో 24గంటలు పనిచేస్తే.. రూ.3వేలు మిగిలేవి. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో 14గంటలు చేస్తున్నాం. ఇప్పుడు రూ.1,000 వస్తున్నాయి. దాదాపు రాత్రంతా క్యాబ్ నడపడమే. ఈ రంగంలో రాణించాలంటే ముఖ్యంగా కావాల్సింది మనోధైర్యం, కుటుంబ సహకారం. అన్ని గంటలు డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలంటే చాలా సహనం అవసరం. ఈ రంగంలో మేము అవార్డులు, రివార్డులు కోరుకోవడం లేదు. కానీ ధరలు పెంచితే బాగుంటుంది. లీటర్ డీజిల్ రూ.48 ఉన్నప్పటి నుంచి క్యాబ్ నడుపుతున్నాం. ఇప్పుడు డీజిల్ ధర రూ.70 అయింది. కానీ మా క్యాబ్ రేట్లు మారడం లేదు. మహిళా క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి ప్రత్యేకంగా ధరలు పెంచాలి. – బాలమణి, క్యాబ్ డ్రైవర్ రాయితీ ఇవ్వాలి... మాది ఎల్బీనగర్ కొత్తపేట. మొదట నేను స్టాఫ్ నర్స్‌గా పనిచేశాను. నా భర్త రవీందర్‌రెడ్డి(న్యాయవాది) చనిపోవడంతో కుటుంబ భారం నాపై పడింది. ఎలాగైనా పిల్లలను ఉన్నత స్థితికి చేర్చాలన్నదే నా లక్ష్యం. ప్రయాణికులు మహిళా డ్రైవర్లను ఎంతో గౌరవంగా చూస్తారు. అందుబాటులో లేకున్నా ‘షీ క్యాబ్స్’ వచ్చే వరకు వేచి చూసే ప్రయాణికులు కూడా ఉన్నారు. ఒంటరి మహిళలు, కుటుంబంతో వచ్చేవారిని మాత్రమే అనుమతిస్తాం. డ్రైవర్‌గా రాణించాలంటే నిబద్ధత అవసరం. అయితే తమకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం కరువైంది. పార్కింగ్, మెయింటెనెన్స్, టోల్ చార్జీల్లో రాయితీలివ్వాలి, క్యాబ్ ధరలు పెంచాలి. – సుభాషిణి, క్యాబ్ డ్రైవర్ -
షీ క్యాబ్స్ కు ఆదరణ...
సాక్షి, సిటీబ్యూరో: షీ క్యాబ్స్ సేవలకు మహిళా ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. గతేడాది డిసెంబర్13న శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ట్రాఫిక్ పోలీసు ప్రీపెయిడ్ కౌంటర్ నుంచి ప్రారంభమైన షీ క్యాబ్స్ సేవలను ఇప్పటి వరకు 5,830 మంది ఉపయోగించుకున్నారు. శంషాబాద్ నుంచి నగరంతో పాటు శివారుల్లోని వివిధ ప్రాంతాలకు 5,059 ట్రిప్పులు తిప్పారు. ఇందులో ప్రయాణించిన మహిళలు ఈ సేవలు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ఉదయం ఆరు నుంచి అర్ధరాత్రి వరకు ఈ సేవలు మహిళా ప్రయాణికులకు అందుబాటులో ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళతో పాటు పురుషుడు ఉన్నా క్యాబ్‌ల్లో ప్రయాణానికి అనుమతినిస్తున్నారు. -
శంషాబాద్ విమానాశ్రయం నుంచి షీ క్యాబ్స్
శంషాబాద్: మహిళల రక్షణను మరింత పటిష్టపరం చేసేందుకు వీలుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షీ క్యాబ్స్ (మహిళలు నడిపే కార్లు) అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ప్రారంభించారు. ప్రస్థుతం 10 క్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచుతామని సీవీ ఆనంద్ తెలిపారు. మహిళా ప్రయాణికురాలితోపాటు ఆమె భర్త, కుటుంబ సభ్యులు కూడా వీటిల్లో ప్రయాణించవచ్చన్నారు. మహిళా ప్రయాణికులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా సురక్షితంగా ప్రయాణించేందుకు షీ క్యాబ్స్ ఉపయోగపడతాయని చెప్పారు. -
షీ క్యాబ్స్ 108కు అప్పగింత
- సన్నాహాల్లో రవాణా శాఖ సాక్షి, హైదరాబాద్: మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘షీ క్యాబ్స్’ నిర్వహణను 108 నిర్వాహక సంస్థకు అప్పగించేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేస్తోంది. క్యాబ్ నిర్వహణలో పారదర్శకత, కోరిన వెంటనే వాహనాన్ని అందుబాటులో ఉంచడం వంటి కచ్చితమైన సేవల కోసం రవాణా అధికారులు ఈ ప్రయత్నాలు మొదలు పెట్టారు. 108 తరహాలోనే సులభంగా గుర్తుంచుకొనేలా మూడంకెల టోల్‌ఫ్రీ నంబర్‌ను కేటాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే... మహిళా డ్రైవర్ల ఫోన్ నంబర్లన్నింటినీ ఈ కాల్ సెంటర్‌కు అనుసంధానిస్తారు. ఏడాది పాటు ప్రతిపాదనలకే పరిమితమైన ‘షీ క్యాబ్స్’ ఈ నెల 8న ప్రారంభమైన సంగతి తెలిసిందే. 10 మంది మహిళా డ్రైవర్లకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వీటిని అప్పగించారు కూడా. దశలవారీగా 100 వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు అప్పుడు మంత్రి చెప్పినా... 20 రోజుల కిందట ప్రారంభించిన వాహనాలే ఇంత వరకూ రోడ్డెక్కలేదు. ఈ క్యాబ్స్ నిర్వహణకు ప్రత్యేక కాల్ సెంటర్ లేకపోవడం, టారిఫ్ నిర్ణయించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీన్ని చక్కదిద్దేందుకు కార్యాచరణ చేపట్టిన రవాణా శాఖ... 108 నిర్వహిస్తున్న జీవీకే సంస్థకే ‘షీక్యాబ్స్’ను అప్పగించడం వల్ల మరో ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని భావిస్తోంది. కాల్ సెంటర్ ఏర్పాటు, టోల్‌ఫ్రీ నంబర్ కేటాయింపుపై నాలుగైదు రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్లు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ ‘సాక్షి’కి తెలిపారు. -
అమలు కాని ‘షీ క్యాబ్స్’
♦ కార్ల కోసం మహిళా డ్రైవర్ల పడిగాపులు ♦ రవాణా కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు ♦ ప్రతిపాదనలకే పరిమితమైన పాజెక్టు సాక్షి,సిటీబ్యూరో : అది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు... నగరంలో మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వారి కోసం ప్రత్యేకంగా మహిళా డ్రైవర్లే నడిపే షీ- క్యాబ్స్‌ను ప్రవేశపెట్టాలన్న మహిళా భద్రతా కమిటీ సూచన మేరకు ప్రభుత్వం ఆ ప్రాజెక్టును చేపట్టింది. అప్పటికే జీహెచ్ఎంసీ షీ క్యాబ్స్ ఏర్పాటు విషయంలో విఫలమైంది. మరోసారి అలా జరగకుండా కనీసం 50 షీ క్యాబ్స్ నగరంలో ప్రవేశపెట్టాలని రవాణాశాఖ అధికారులు ప్రణాళికలను రూపొందించారు. కేరళలోని త్రివేండ్రమ్‌లో నడుస్తున్న షీ క్యాబ్స్ తరహాలో నగరంలో ప్రవేశ పెట్టేందుకు మహిళా డ్రైవర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా చాలా మంది దరఖాస్తు చేశారు. కానీ వారిలో రెండు విడతలుగా 18 మందిని ఎంపిక చేసి గత డిసెంబర్లో మహిళా ప్రయాణికుల భద్రతకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలో వారికి రుణసదుపాయంపై కార్లు అందజేసి షీ క్యాబ్స్‌ను అందుబాటులోకి తెస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వారు ఆ మహిళా డ్రైవర్లు ఆర్టీఏ కార్యాలయంలో వద్ద పడిగాపులు కాస్తున్నారు. కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ఈ ప్రాజెక్టు అమలైందీ లేదు. షీ క్యాబ్స్ రోడ్డెక్కిందీ లేదు. అలా మొదలైంది.... గతేడాది నగరంలో పలు చోట్ల మహిళలపై జరిగిన అకృత్యాల దృష్ట్యా మహిళల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం పూనం మాలకొండయ్య నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ సూచన మేరకు షీ క్యాబ్స్‌కు శ్రీకారం చుట్టారు. అంతకుముందు ఏడాది జీహెచ్ఎంసీ ఇదే తరహాలో షీ-క్యాబ్స్‌కు సన్నాహాలు చేపట్టింది. అయితే, బ్యాంకులు రుణా లు అందజేసేందుకు ముందుకు రాకపోవడంతో ఆ ప్రాజెక్టు విజయవంతం కాలేదు. ఈసారి అలా జరగకుండా స్త్రీ,శిశు సంక్షేమశాఖ, రవాణాశాఖలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. వాహనాల ఖరీదుపై మహిళా డ్రైవర్లకు మొదట 50 శాతం సబ్సిడీ ఇవ్వాలనుకున్నారు. తర్వాత దానిని 35 శాతానికి తగ్గించారు. బ్యాంకులు సైతం రుణాల మంజూరుకు ముందుకు వచ్చాయి. అప్పటికే డ్రైవింగ్‌లో అనుభవం ఉన్న 18 మందిని ఎంపిక చేసి మరోసారి శిక్షణనిచ్చారు. ఇప్పుడు వాళ్లంతా కార్ల కోసం, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. కన్సల్టెన్సీ కోసం ఎదురు చూపులు... మరోవైపు షీ క్యాబ్స్ ప్రాజెక్టు నిర్వహణ కోసం రవాణాశాఖ ఒక కన్సల్టెన్సీ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించగా.. నాలుగైదు సంస్థలు ముందుకొచ్చాయి. వాటిలోంచి కేరళలోని త్రివేండ్రమ్‌కు చెందిన ‘షీ ట్యాక్సీ’ సంస్థకు అన్ని విధాలుగా అర్హత ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు రవాణా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన లు పంపారు. కన్సల్టెన్సీ ఖరారైతే మార్చి8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా షీ క్యాబ్స్ ప్రారంభించాలనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. -
రోడ్డెక్కిన ‘షీ క్యాబ్స్’
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలోనే ప్రథమంగా మహిళల కోసం మహిళలే నడిపే ‘షీ క్యాబ్స్’ రోడ్డెక్కాయి. ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల సంఘం ఆధ్వర్యంలో నడిచే ఈ క్యాబ్స్‌ను పబ్లిక్‌గార్డెన్స్‌లో బుధవారం స్త్రీ శిశుసంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ, ట్రాఫిక్ డీసీపీ సుధీర్‌బాబు, సామాజిక కార్యకర్త రాగిడి లక్ష్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంలో నీలం సహానీ మాట్లాడు తూ మహిళలే క్యాబ్ నడిపిస్తామని ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. ఈ క్యాబ్‌లు రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు విస్తరించాలన్నారు. షీ క్యాబ్స్ ఎండీ విజయారెడ్డి మాట్లాడుతూ... ముందుగా రెండు క్యాబ్‌లు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆదరణను బట్టి మరిన్ని ఏర్పాటు చేస్తా మన్నారు. నగరాల్లో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలకు తావు లేకుండా వారికి సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు వీటిని ప్రవేశపెట్టామన్నారు. క్యాబ్‌లో జీపీఎస్ విధానాన్ని అమర్చామన్నారు. క్యాబ్ కావల్సినవారు 9393024242కు ఫోన్ చేయాలని సూచించారు. కరాటే మాస్టర్ నరేందర్ ఆత్మరక్షణకు మెళకువలు ప్రదర్శించారు. మొదటి ప్రయాణికురాలిగా అదనపు ఎస్పీ పద్మజ ప్రయాణించారు. షీక్యాబ్స్ సీఈఓ అనురాధారావు పాల్గొన్నారు.