- సన్నాహాల్లో రవాణా శాఖ
సాక్షి, హైదరాబాద్: మహిళా ప్రయాణికుల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘షీ క్యాబ్స్’ నిర్వహణను 108 నిర్వాహక సంస్థకు అప్పగించేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేస్తోంది. క్యాబ్ నిర్వహణలో పారదర్శకత, కోరిన వెంటనే వాహనాన్ని అందుబాటులో ఉంచడం వంటి కచ్చితమైన సేవల కోసం రవాణా అధికారులు ఈ ప్రయత్నాలు మొదలు పెట్టారు. 108 తరహాలోనే సులభంగా గుర్తుంచుకొనేలా మూడంకెల టోల్‌ఫ్రీ నంబర్‌ను కేటాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే... మహిళా డ్రైవర్ల ఫోన్ నంబర్లన్నింటినీ ఈ కాల్ సెంటర్‌కు అనుసంధానిస్తారు.
ఏడాది పాటు ప్రతిపాదనలకే పరిమితమైన ‘షీ క్యాబ్స్’ ఈ నెల 8న ప్రారంభమైన సంగతి తెలిసిందే. 10 మంది మహిళా డ్రైవర్లకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వీటిని అప్పగించారు కూడా. దశలవారీగా 100 వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు అప్పుడు మంత్రి చెప్పినా... 20 రోజుల కిందట ప్రారంభించిన వాహనాలే ఇంత వరకూ రోడ్డెక్కలేదు. ఈ క్యాబ్స్ నిర్వహణకు ప్రత్యేక కాల్ సెంటర్ లేకపోవడం, టారిఫ్ నిర్ణయించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీన్ని చక్కదిద్దేందుకు కార్యాచరణ చేపట్టిన రవాణా శాఖ... 108 నిర్వహిస్తున్న జీవీకే సంస్థకే ‘షీక్యాబ్స్’ను అప్పగించడం వల్ల మరో ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని భావిస్తోంది. కాల్ సెంటర్ ఏర్పాటు, టోల్‌ఫ్రీ నంబర్ కేటాయింపుపై నాలుగైదు రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్లు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ ‘సాక్షి’కి తెలిపారు.
షీ క్యాబ్స్ 108కు అప్పగింత
Published Wed, Sep 30 2015 4:51 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM
Advertisement
Advertisement