సాక్షి, సిటీబ్యూరో: షీ క్యాబ్స్ సేవలకు మహిళా ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. గతేడాది డిసెంబర్13న శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ట్రాఫిక్ పోలీసు ప్రీపెయిడ్ కౌంటర్ నుంచి ప్రారంభమైన షీ క్యాబ్స్ సేవలను ఇప్పటి వరకు 5,830 మంది ఉపయోగించుకున్నారు. శంషాబాద్ నుంచి నగరంతో పాటు శివారుల్లోని వివిధ ప్రాంతాలకు 5,059 ట్రిప్పులు తిప్పారు. ఇందులో ప్రయాణించిన మహిళలు ఈ సేవలు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ఉదయం ఆరు నుంచి అర్ధరాత్రి వరకు ఈ సేవలు మహిళా ప్రయాణికులకు అందుబాటులో ఉండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహిళతో పాటు పురుషుడు ఉన్నా క్యాబ్‌ల్లో ప్రయాణానికి అనుమతినిస్తున్నారు.