పైనాపిల్ లోడ్‌తో కూడిన ట్రక్ నడుపుతున్న కార్తీక
షూటింగ్‌లు కలిసి రాలేదు. లాక్‌డౌన్‌లో పని లేదు. కార్తీకకు యాక్టింగ్‌తో పాటు డ్రైవింగ్ వచ్చు. ఉన్న డబ్బుతో ఒక ట్రక్ కొనింది. కూరగాయలు, పండ్లు తిప్పే బండ్లకు లాక్‌డౌన్ నియమాలు వర్తించవు. ఇక కార్తీక ఫుల్ బిజీ అయ్యింది. పైనాపిల్స్ చీప్‌గా దొరికే చోటు నుంచి రేటు పలికే చోటుకు, కొబ్బరిబోండాలు సలీసుగా దొరికే చోటు నుంచి పిరిమిగా ఉండే చోటుకు సరఫరా చేస్తూ స్టార్ డ్రైవర్‌గా నవ్వులు చిందిస్తోంది. ఒక కేరళ నటి స్ఫూర్తి ఇది.
అర్ధరాత్రి. కేరళలోని మలప్పురం చెక్‌పోస్ట్ దగ్గర అటుగా వచ్చిన ట్రక్‌ను పోలీసులు ఆపారు.
‘బండిలో ఏముంది?’ డ్రైవర్‌ను అడిగారు.
‘పైనాపిల్స్’ అనే సమాధానం వినిపించింది.
పోలీసులు ఆశ్చర్యపోయారు. కారణం డ్రైవింగ్ సీట్లో ఉన్నది మహిళా డ్రైవర్. జీన్స్ ప్యాంట్, షర్ట్ వేసుకుని, పైన ఖాకీ షర్ట్ వేసుకుని, టోపీ పెట్టుకుని ఉంది.
‘ఏమైంది సార్. పండ్ల బండ్లకు ప్రాబ్లం లేదు కదా. తొందరగా వదలండి. నాకు ఆలస్యమైపోతోంది’ అందా డ్రైవర్.
పోలీసులు లోడ్ చెక్ చేశాక చిరునవ్వుతో ఆ బండిని వదిలారు.
చిరునవ్వుతో డ్రైవర్ కూడా కదిలింది. ఆ డ్రైవర్ పేరు కార్తీక. మలయాళంలో చిన్నపాటి నటి.
∙∙
‘చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. దాంతో పాటు డ్రైవింగ్ కూడా. రెండూ నేర్చుకున్నాను. పెద్ద లారీలు కూడా నడుపుతాను. కొన్ని సినిమాలలో యాక్ట్ చేశాను. కాని నాకంటూ గుర్తింపు రాలేదు. నా భర్త గల్ఫ్‌లో పని చేస్తాడు. నాకు 8 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఈ లాక్‌డౌన్‌లో ఏ పనీ లేకుండా ఉండటం సరి కాదనుకున్నాను. వెంటనే ఒక ట్రక్ కొన్నాను. నిజానికి లారీ కొందామనుకున్నాను. అంత డబ్బు లేదు. ట్రక్‌తో మొదలెట్టాను’ అంటుంది కార్తీక.
కేరళలో కన్నూరుకు చెందిన కార్తీక బతుకు దేవులాటలో అక్కడికి 300 కిలోమీటర్ల దూరంలోని వాజక్కులంకు షిఫ్ట్ అయ్యింది. ‘ఇక్కడ పైనాపిల్స్ చీప్. కన్నూరులో కాస్ట్‌లీ. ఒక వెయ్యి కిలోల పైనాపిల్స్ తీసుకుని ఐదారుగంటలు ప్రయాణించి కన్నూరుకు తీసుకెళ్లాను. లాభం వచ్చింది. అలాగే వాజక్కులం నుంచి కొబ్బరిబోండాలు కొని ఎర్నాకులంకు సరఫరా చేస్తుంటాను. నేను కిరాయికి వెళతాను. అలాగే స్వయంగా సరుకు తీసుకెళ్లి అమ్ముతాను. బాగుంది ఇప్పుడు’ అంటుంది కార్తీక.
ఖాకీ షర్ట్ ధరించి, తల మీద టోపీ పెట్టుకుని ట్రక్ నడిపే కార్తీకను పెద్దగా ఎవరూ గమనించరు. షాపుల వాళ్లు గమనించినా గౌరవం ఇస్తున్నారు. అర్ధరాత్రిళ్లు, అపరాత్రుళ్లు కూడా ఆమె నిర్భయంగా హైవే మీద దూసుకెళుతూ ఉంటుంది. బతుకు స్పీడ్‌బ్రేకర్ వేసినప్పుడు కూడా జీవితం స్టీరింగ్‌ను ఎలా ఒడిసి పట్టాలో కార్తీక ఇలా మనకు చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment