కదిలింది... నారీ లోకం
షి క్యాబ్స్‌పై మహిళల ఆసక్తి
తరలివచ్చిన ఉన్నత విద్యావంతులు
{స్కీనింగ్ పరీక్షలు ప్రారంభం
ప్రభుత్వం తలపెట్టినషీ క్యాబ్స్ పథకానికి మహిళా డ్రైవర్ల నుంచి మంచి స్పందన లభించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి 47 మంది మహిళా డ్రైవర్లు దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏలో నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలకు 12 మంది మహిళా డ్రైవర్లు హాజరయ్యారు. వీరిలో ఎంటెక్, డిగ్రీ వంటి ఉన్నత చదువులు పూర్తిచేసిన వారు...సాధారణ డ్రైవింగ్ లెసైన్స్‌తో పాటు, ట్రాన్స్‌పోర్టు డ్రైవింగ్ లెసైన్స్ కలిగిన వారు ఉండడం విశేషం. కొంతమంది ఏడాది కాలంగా డ్రైవింగ్ చేస్తుండగా... మరి కొందరు ఏడెనిమిదేళ్ల అనుభవం ఉన్న మహిళా డ్రైవ ర్లు ఆర్టీఏ అధికారులను సంప్రదించారు.
మియాపూర్‌కు చెందిన శివలీల ఎంటెక్ పూర్తి చేశారు. ఆమె బస్సులు, లారీల వంటి పెద్ద వాహనాలు నడిపేందుకు అర్హతగా భావించే హెవీ డ్రైవింగ్ లెసైన్సు కలిగి ఉన్నారు. మరో 8 మంది డ్రైవింగ్‌లో ఏడాది అనుభవం కలిగిన వారున్నారు. ఇద్దరు డిగ్రీ పూర్తి చేశారు. పదో తరగతితో పాటు, ఐటీఐ పూర్తి చేసిన మహిళ లూ షీ క్యాబ్స్ నడిపేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అభ్యర్ధుల దరఖాస్తులు, డ్రైవింగ్ లెసైన్సులు, ఇతర డాక్యుమెంట్లు స్వీకరించిన అధికారులు అర్హత గల వారిని త్వరలోనే శిక్షణకు ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు.
ఉపాధికి చక్కటి మార్గం
- జేటీసీ రఘునాథ్
షీ క్యాబ్స్‌తో మహిళా డ్రైవర్లకు చక్కటి ఆదాయం లభించగలదని జేటీసీ రఘునాథ్ తెలిపారు. నగరంలోని ఐటీ పరిశ్రమలు, స్కూళ్లు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థల కోసం ఈ వాహనాలను నడిపేందుకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. పగటిపూట మాత్రమే షీ క్యాబ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం త్రివేండ్రమ్‌లో నడుపుతున్న 50 మంది మహిళా డ్రైవర్లు ప్రతి నెల రూ.50 వేలకు పైగా ఆర్జిస్తున్నారని తెలిపారు. వాహనాలపై వాణిజ్య ప్రకటనల వల్ల కొంత మేర ఆదాయం వస్తుందన్నారు. త్వరలోనే విధివిధానాలను రూపొందించి, శిక్షణ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి నగరంలో వసతి కల్పిస్తామన్నారు.