
ప్రోత్సాహకం ప్రకటించిన ఉన్నత విద్యామండలి
గుర్తింపు కోసం కాలేజీలు ముందుకొచ్చేలా చర్యలు
వర్సిటీల వీసీలతో మండలి చైర్మన్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు కోసం దరఖాస్తు చేసేలా విద్యా సంస్థలను ప్రోత్సహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అందుకు ముందుకొచ్చే కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు రూ.లక్ష పారితోషికం ఇస్తామని ప్రకటించింది. ఈ అంశంపై సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి గురువారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఉన్నత విద్యలో జాతీయ స్థాయి గుర్తింపు పొందేందుకు న్యాక్ గుర్తింపు అవసరమని, ఈ విషయాన్ని అన్ని సంస్థలకు అర్థమయ్యేలా చెప్పాలని వీసీలను కోరారు. త్వరలో ప్రతీ జిల్లాలోనూ కాలేజీలను గుర్తించి, న్యాక్‌కు దరఖాస్తు చేసేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని నిర్ణయించారు.
ముందుకు రాని సంస్థలు
విద్యా ప్రమాణాలను అంచనా వేసేందుకు న్యాక్ గుర్తింపును జాతీయ స్థాయిలో కొలమానంగా తీసుకుంటున్నారు. మౌలిక వసతులు, నిపుణులైన అధ్యాపకులు, సొంత భవనాలు, లే»ొరేటరీలు, లైబ్రరీ, ఆ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులకు లభిస్తున్న ఉద్యోగాలు, జాతీయ స్థాయిలో వారి ప్రతిభ మొదలైన అంశాలను పరిగణనలోనికి తీసుకొని న్యాక్ గుర్తింపు ఇస్తారు. అయితే, న్యాక్ గుర్తింపుపై రాష్ట్ర విద్యా సంస్థలు ఆసక్తి చూడం లేదు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 362 వర్సిటీలు, 6,176 కళాశాలలకు న్యాక్ గుర్తింపు ఉంది. 695 వర్సిటీలు, 34,734 కళాశాలలకు గుర్తింపు లేదు. తెలంగాణలో 11,055 డిగ్రీ కాలేజీలు, 173 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. 15 యూనివర్సిటీలు 293 కాలేజీలు కలిపి 298 ఉన్నత విద్యా సంస్థలకు న్యాక్ అక్రెడిటేషన్ ఉంది. అందులో 90 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. పునఃసమీక్ష చేసిన ప్రతీసారి మౌలిక వసతుల కల్పన, ఫ్యాకల్టీ కొరత కారణంగా న్యాక్ గుర్తింపు సంఖ్య తగ్గుతోంది.
న్యాక్ తప్పనిసరి కాబోతోందా?
న్యాక్ గుర్తింపును తప్పనిసరి చేయాలని యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి భావిస్తున్నాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోనూ దీన్ని చేర్చారు. న్యాక్ గుర్తింపు విధానంలోనూ అనేక మార్పులు తేవాలని నిర్ణయించారు. ఏ, బీ, సీ, డీ గ్రేడ్ల స్థానంలో 1 నుంచి 5 అంచెలుగా గ్రేడ్లు ఇవ్వనున్నారు. 1 నుంచి 4 వరకు ’లెవల్’ పొందిన సంస్థలను జాతీయ విశిష్ట విద్యా కేంద్రాలుగా పేర్కొంటారు.
విద్య, పరిశోధనలో అంతర్జాతీయ స్థాయి సామర్థ్యమున్న సంస్థలకు ‘ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ గ్లోబల్ ఎక్సలెన్స్ ఫర్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్’పేరుతో ఐదో లెవెల్ గుర్తింపు ఇస్తారు. ఈ కొత్త విధానంపై యూజీసీ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. అక్రెడిటెడ్ విద్యాసంస్థలకు మెచ్యూరిటీ బేస్డ్ గ్రేడెడ్ అక్రెడిటేషన్ (ఎంబీజీఏ) పేరిట 1 నుంచి 5 గ్రేడ్లు ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment