
16 నెలలుగా జీవో 59 దరఖాస్తుదారుల ఎదురుచూపులు
త్వరలోనే పరిష్కరిస్తామన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి
ఈ జీవో కింద దాదాపు 50 వేల దరఖాస్తులు పెండింగ్
దరఖాస్తులు పరిష్కరిస్తే ఖజానాకు రూ.6 వేల కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: ‘గత ప్రభుత్వ హయాంలో జీవో 59ని అడ్డం పెట్టుకుని విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులపరం చేశారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమాలను గుర్తించాం. ఆ క్రమంలోనే జీవో 59 అమలును నిలిపివేసిన మాట వాస్తవమే. ఇప్పుడు జీవో 59 కింద దరఖాస్తులను మళ్లీ పరిష్కరించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. త్వరలోనే ఈ జీవోను అమలు చేస్తాం’... అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన ప్రకటన ఇది.
16 నెలలుగా తమ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఈ ప్రకటనతో ఊపిరి పీల్చుకున్నారు. తమ నివాసాల క్రమబద్దీకరణ ఇప్పట్లో సాధ్యపడదనే నిరాశలో ఉన్న వారిలో మంత్రి ప్రకటన ఆశలు నింపింది. అయితే, ఈ అంశంపై మంత్రి ప్రకటన తర్వాత మళ్లీ ఎలాంటి కదలిక లేకపోవటంతో తమ దరఖాస్తులకు ఎప్పుడు మోక్షం లభిస్తుందోనని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.
సబ్ కమిటీ వద్ద పూర్తి నివేదిక
జీవో 59 అమలులో భాగంగా రెవెన్యూ శాఖ ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం జీవో 59 కింద మొత్తం 57,661 దరఖాస్తులు రాగా, 55,997 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. వీటిలో 2022లో 23,189.. 2023లో 8,771 దరఖాస్తులను ఆమోదించారు. మొత్తం 32,788 దరఖాస్తులకు డిమాండ్ నోటీసులు జారీ చేయగా, 13,726 మంది ప్రభుత్వానికి ఫీజు చెల్లించారు. 10,553 మందికి కన్వేయన్స్ డీడ్ (రిజి్రస్టేష¯న్)లు కూడా జారీ చేశారు.
కానీ, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో 2023 నవంబర్ నాటికి జారీచేసిన కన్వేయన్స్ డీడ్‌లను నిలిపివేయాలని.. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తర్వులు జారీ చేసింది. వీటితోపాటు చాలా దరఖాస్తులు డిమాండ్ నోటీసుల జారీ కోసం సిద్ధంగా ఉన్నాయి. కొన్ని దరఖాస్తులు కలెక్టర్ల లాగిన్‌లలో పెండింగ్‌లో ఉన్నాయి.
మొత్తంమీద 47 వేలకు పైగా దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్ ఉన్నాయని తేలింది. వీటిని పరిష్కరిస్తే ప్రభుత్వానికి రూ.500 కోట్లు సమకూరుతాయని, అధిక విలువ కేటగిరీలో నమోదు చేసిన భూములను క్రమబద్దీకరిస్తే రూ.5,500 కోట్లు వస్తాయని, మొత్తం కలిపి రూ.6 వేల కోట్ల ఆదాయం వస్తుందని రెవెన్యూ శాఖ కేబినెట్ సబ్‌కమిటీకి ఇచ్చిన నివేదికలో వెల్లడించింది.
ఎవరో చేసిన తప్పునకు..
జీవో 59 ద్వారా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయనేది కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. ఈ అక్రమాలు చేసినవారు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడే లబ్ధి పొందారని, ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులంతా నాటి ప్రభుత్వంలో పలుకుబడి లేక, దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన చేయించుకోలేకపోయిన వారేనని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఎవరో తప్పు చేశారని రాష్ట్రవ్యాప్తంగా ఆ జీవో అమలును నిలిపివేయడం సరైంది కాదని అంటున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న జీవో 59 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.