కొండపోచమ్మసాగర్ కోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు
హరీశ్ రైతుల్ని బెదిరించి భూములు కొన్నాక దాన్ని రద్దు చేశారు
మీడియాతో మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి అప్పటి మంత్రి హరీశ్‌రావు భూములు కొనుగోలు చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ రిజర్వాయర్ కోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారని.. దీనివల్ల రైతుల భూములు పోతాయని బెదిరించి హరీశ్ ఆ భూములు కొన్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.
హరీశ్ భూములు కొన్నాక భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేశారని దుయ్యబట్టారు. రైతుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నానని... ధరణిలో రికార్డు కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్న హరీశ్‌రావు.. భూసేకరణ నోటిఫికేషన్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదని పొంగులేటి ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పొంగులేటి ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ఒకసారి నోటిఫికేషన్ జారీ అయ్యాక దాన్ని రద్దు చేయలేరని.. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ శివార్లలో భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పటికీ మనుగడలో ఉందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆరెస్టు చేయట్లేదంటూ ప్రశ్నిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి.. అందుకు వీలుగా గవర్నర్ చేత అనుమతి ఇప్పించాలని సూచించారు. పక్కా ఆధారాలతోనే ముందుకు వెళ్తున్నామని, తొందరపడి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన తమకు లేదని మంత్రి చెప్పారు.
డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు..
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతాయని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ సమావేశాల్లో రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్‌వోఆర్) చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అలాగే కులగణన, రైతు రుణమాఫీ, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలను చర్చించే అవకాశం ఉందని చెప్పారు.
డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాల అనంతరం సచివాలయంలో తెలుగుతల్లి విగ్రహావిష్కరణ, సోనియాగా>ంధీ జన్మదిన వేడుకలతోపాటు బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వివరించారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌తో నాటి ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతోపాటు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి జస్టిస్ మదన్ బి. లోకూర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చంచనున్నట్లు సమాచారం.
కేంద్రం స్పష్టత ఇస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం..
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కాస్త అస్పష్టంగా ఉన్నాయని, వాటిపై స్పష్టత కోరుతున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. కేంద్రం నుంచి స్పష్టత వస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెరుగుతుందన్నారు. ఒకసారి లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైతే పథకం వేగం పుంజుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
మంత్రివర్గ విస్తరణ!
మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల తర్వాత రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. మంత్రులుగా ఎవరెవరికి అవకాశం ఉంటుందన్న ప్రశ్నకు ఆయన నేరుగా స్పందించలేదు. తాను మంత్రిని మాత్రమేనని, మంత్రి పదవులు ఇప్పించే స్థాయిలో లేనని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment