ముసాయిదా చట్టంపై ఈ నెలాఖరు వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు
సామాన్య రైతు నుంచి దొరవారు ఇచ్చే సూచనలదాకా అన్నీ పరిగణనలోకి..
రాజ్యాంగం కల్పించిన హక్కులను ధరణి హరించింది
ఇకపై 33 కాదు.. ఒక్కటే మాడ్యూల్
సాదాబైనామాలకు మరోమారు దరఖాస్తుల స్వీకరణ
ప్రతి గ్రామంలో రెవెన్యూ కాపలాదారుడిని పెడతాం
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
త్వరలో జీవో 59 దరఖాస్తుల పరిష్కారం
జీవో 59 కింద అక్రమంగా భూములను క్రమ బద్ధీకరించుకున్నారు. నానక్‌రాంగూడలో రూ.3 వేల కోట్ల ఖరీదైన 32 ఎకరాలను రెగ్యులరైజ్ చేసుకున్నారు. మేం రాగానే వాటిని వెనక్కు తీసుకున్నాం. అర్హులకు న్యాయం జరిగేలా త్వరలో జీవో 59 దరఖాస్తులను పరిష్కరిస్తాం.
సాక్షి, హైదరాబాద్: రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్)–2020 స్థానంలో త్వరలో కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వీలైతే అసెంబ్లీలో పెట్టి లేదంటే ఆర్డినెన్స్ రూపంలో తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే రూపొందించిన ముసా యిదా చట్టంపై ప్రజల నుంచి సలహాలు, సూచ నలు వస్తున్నాయన్నారు. సూచనలు తీసుకునే గడువును ఈనెల 23నుంచి మరో వారం పొడిగి స్తామని చెప్పారు. గడువు ముగిసిన 45 రోజుల్లో గా కొత్త చట్టం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
కొత్త ఆర్‌వోఆర్ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలు రెవె న్యూ సంబంధిత అంశాలపై ఆయన శనివారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కొత్త చట్టం, ధరణి పోర్టల్‌లో తెస్తున్న మార్పులు, సాదా బైనామాలు, అసైన్డ్ భూములకు హక్కుల కల్పన, భూముల విలువల సవరణ, జీవో 59 దరఖా స్తులు వంటి అంశాలపై పొంగులేటి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
ధరణితో ప్రజలు కుదేలు: గత ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పి రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాల భూమి డేటాను విదేశీ కంపెనీకి అప్పగించినందుకే మేం ధరణి పోర్టల్‌ను తప్పుపడుతున్నాం. ఇది రైతుల మెడలో పెద్ద గుదిబండ. ఈ పోర్టల్ కారణంగా ప్రజలు కుదేలయ్యారు.. తీవ్ర నష్టం జరిగింది. ఇద్దరు వ్యక్తులు నాలుగు గోడల మధ్య కూర్చుని తెచ్చిన చట్టం ఇది. ప్రజలు తమ భూమి తమకు రావాలని దేవుళ్లకు దండం పెట్టారో లేదో తెలియదు కానీ, దొరకు, కలెక్టర్లకు మాత్రం పొర్లు దండాలు పెట్టాల్సి వచ్చింది. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ధరణి హరించింది. తినీతినక కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని అమ్ముకునే హక్కును కాలరాసింది.
పుట్టలో పాముల్లా అక్రమాలు
మేం అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే పుట్టలో పాముల్లాగా ధరణిలో వందలాది అక్రమాలు బయటకు వస్తున్నాయి. రెండు నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మూడు నిమిషాల్లో మ్యుటేషన్ అని చెప్పి భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు ఆస్కారం కల్పించారు.
అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్లు చేసుకుని తాళాలు వేసుకున్నారు. వాళ్లేం చేశారో కలెక్టర్లకు కూడా తెలియదు. హెడ్ ఆఫీస్, విదేశీ కంపెనీకి మాత్రమే తెలుసు. మేం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో అన్ని వివరాలు ప్రజా బాహుళ్యంలో పెట్టించాం లొసుగులు సవరించేందుకే చట్టం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నామంటే.. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం కాదు.
ఆత్రుతగా తప్పులు చేయడం కాదు. పేరు మార్చడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావు. మన నిర్ణయాలతో తరతరాలు ముందుకెళ్లాలి. అందుకే భేషజాలకు పోకుండా ధరణి పోర్టల్‌ను మాత్రమే కాదు. చట్టంలోని లొసుగులను సవరించాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే కొత్త చట్టం తెస్తున్నాం. ఆర్‌వోఆర్ చట్టం–2020 కారణంగానే సమస్యలన్నీ వచ్చాయి.
80–85 వేల దరఖాస్తులే పెండింగ్‌లో..
మేం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించాం. అప్పటికే 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతిరోజూ 3–5 వేల కొత్త దరఖాస్తులు వస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్ పెట్టి 1.28 లక్షల దరఖాస్తులు పరిష్కరించాం. అంతేకాదు రోజూ పరిష్కరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు పోర్టల్‌లో 80–85 వేల దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. రైతుల దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను కూడా నమోదు చేయిస్తున్నాం.
అభిప్రాయ సేకరణకు జిల్లా స్థాయిలో సదస్సులు
కొత్త చట్టం ముసాయిదాపై చెట్టుకింద కూర్చునే సామాన్య రైతు నుంచి దొర వారు ఇచ్చే సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం. జిల్లా స్థాయిలో సదస్సులు నిర్వహించి అభిప్రాయ సేకరణ జరుపుతాం. దేశంలోనే రోల్‌మోడల్ చట్టంగా రూపొందిస్తాం. దీని ద్వారా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందుతాయి. పోర్టల్‌లోని దరఖాస్తు పద్ధతిని మార్చేస్తాం.
ఇప్పటివరకు ఉన్న 33 మాడ్యూళ్ల స్థానంలో ఒకటే మాడ్యూల్ తెస్తాం. రైతుల ఏ సమస్యపై అయినా ఈ మాడ్యూల్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. పాత పహాణీలో 35 కాలమ్‌లు ఉండేవి. 100 ఏళ్ల చరిత్ర ఉండేది. ఇప్పుడు ఒక్కటే కాలమ్ ఉంది. దీని స్థానంలో 14–16 కాలమ్‌లతో కొత్త పహాణీ అందుబాటులోకి తెస్తాం. సీసీఎల్‌ఏ స్థాయిలో కూడా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి కటాఫ్ డేట్ నిర్ణయిస్తున్నాం. సీసీఎల్‌ఏకు వచ్చిన దరఖాస్తులు వారం రోజుల్లోగా పరిష్కారం కావాలని ఆదేశిస్తా.
ఎలుక వచ్చిందని ఇంటిని తగులబెట్టుకోలేం కదా?
దొరగారు చెపితే వినలేదని 23 వేల మందిని అర్ధరాత్రి వేరే శాఖకు బదిలీ చేశారు. వీఆర్‌వో, వీఆర్‌ఏల వ్యవస్థను లేకుండా చేయడం ద్వారా గ్రామ స్థాయిలో రెవెన్యూకు సాక్ష్యాలు లేకుండా చేశారు. మేం రాష్ట్రంలోని 10,945 గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు కాపలాదారులను నియమించాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం. ఇంట్లోకి ఎలుక వచ్చిందని ఇంటిని తగులబెట్టుకోలేం కదా?
పేదోళ్ల భూములు వారికే పంచుతాం
పేదలకు ఇందిరమ్మ పంచిన భూములు లాగేసుకున్నారు. అలాంటి భూములు గుర్తించాం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటినీ తిరిగి పేదలకు పంచుతాం. పేదోడి భూమి ధనికుల చేతికి వెళ్లనివ్వం. ఆ కోణంలోనే అసైన్డ్ భూములపై అమ్మకపు హక్కు కల్పిస్తాం.
కొత్త చట్టం ఏర్పాటు కాగానే మళ్లీ సాదాబైనామాల దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న 9 లక్షల దరఖాస్తులకు తోడు కొత్తగా వచ్చే వాటిని ఏకకాలంలో శాశ్వతంగా పరిష్కరిస్తాం. గత ప్రభుత్వం భూముల విలువల సవరణలో శాస్త్రీయత పాటించలేదు. మేం అధికారులు, థర్డ్ పార్టీ నుంచి వివరాలు సేకరించాం. రెండింటినీ క్రోడీకరించి త్వరలోనే న్ణియం తీసుకుంటాం.
పార్టీ ఆస్తులు ఏం చేయాలా అని దొర ఆలోచిస్తున్నాడు
‘బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం 100 శాతం ఖాయం. అయితే బీఆర్‌ఎస్ పేరిట ఉన్న ఆస్తులు, డబ్బులు ఏం చేయాలనేదానిపై దొర ఆలోచిస్తున్నాడు. పార్టీని విలీనం చేయకుండా కవితకు బెయిల్ రాదు. మేం కేంద్రంలో అధికారంలో లేము కనుక ఆ కేసులు తప్పించడం మాతో కాదు. అందుకే ఆయన కాంగ్రెస్ జోలికి రాడు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరికకు బ్రేక్ మాత్రమే పడింది.
ప్రతి దానికీ ఆషాఢాలు, శ్రావణాలు ఉంటాయి కదా! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. నెలాఖరులోనే జేఎన్‌జే సొసైటీకి భూమిని సీఎం చేతుల మీదుగా అప్పగిస్తాం. ఈ సొసైటీలో లేని మిగిలిన వారికి ఎలా ఇవ్వాలన్న దానిపైనా ఆలోచిస్తున్నాం. ఇతర సొసైటీల సభ్యత్వాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment