కొత్త దారి
‘నాకు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్ ఉద్యోగం వచ్చింది’ అని మార్గరెట్ బారు తన సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు అభినందనలు తెలియజేసిన వారికంటే
ఆశ్చర్యపోయిన వారే ఎక్కువ.
‘డ్రైవర్ ఉద్యోగం... అది కూడా అడవిలో... నువ్వు ఆడపిల్ల అనే విషయం మరిచావా’ అన్నవారు కూడా ఉన్నారు. అయితే వారి ఆశ్చర్యాలు, అభ్యంతరాలేవీ మార్గరెట్ దారికి అడ్డుకాలేకపోయాయి.ఒడిషాలోని దిబ్రుఘర్ అభయారణ్యంలోని తొలి మహిళా సఫారి డ్రైవర్‌గా ఎంతోమంది యువతులకు స్ఫూర్తిని ఇస్తోంది మార్గరెట్ బారు.
దిబ్రుఘర్ అభయారణ్యానికి సమీపంలోని క్రిస్టియన్పడా మార్గరెట్ బారు స్వగ్రామం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెట్రిక్యులేషన్ పాసైన తరువాత చదువు మానేయాల్సి వచ్చింది. అభయారణ్యంలో వివిధ ఉద్యోగాలలో మహిళల నియామకానికి అటవీశాఖ ప్రకటన మార్గరెట్‌కు ఆశాకిరణంలా తోచింది.
తన కుటుంబానికి ఆసరాగా ఉండడానికి ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరిగా చేయాలనుకున్న మార్గరెట్ డ్రైవర్ ఉద్యోగానికి ఎంపికైంది.
అయితే సఫారీ డ్రైవర్ ఉద్యోగంలో చేరాలనుకున్నప్పుడు ఇతరుల నుంచే కాదు కుటుంబసభ్యుల నుంచి కూడా అభ్యంతరాలు, సందేహాలు ఎదురయ్యాయి.
అయినప్పటికీ మార్గరెట్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. డ్రైవింగ్, వెహికిల్ మెయింటెనెన్స్, జంగిల్ రోడ్లను నావిగేట్ చేయడంలో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆరునెలల కఠినమైన శిక్షణ తరువాత ఉద్యోగంలో చేరింది.
దిబ్రుఘర్ అభయారణ్యంలోని 13మంది సఫారీ డ్రైవర్‌లలో ఏకైక మహిళ మార్గరెట్. అయితే ఎప్పుడూ అసౌకర్యంగా భావించలేదు. అభద్రతకు గురి కాలేదు.
రోజు ఉదయం ఆరు నుంచి మార్గరెట్ ఉద్యోగ జీవితం మొదలవుతుంది.
‘అడవిలో రోడ్లు నాకు సహనాన్ని, ధైర్యాన్ని నేర్పాయి. ప్రతిరోజూ ఒక కొత్త సాహసం చేసినట్లుగా భావిస్తాను. ఈ ఉద్యోగం ద్వారా నా కుటుంబానికి అండగా ఉన్నందుకు గర్వంగా ఉంది’ అంటుంది మార్గరెట్.
డ్రైవర్ ఉద్యోగం వల్ల మార్గరెట్ ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం ఒక కోణం అయితే, సంప్రదాయ ఉద్యోగాలకు అతీతం గా కొత్తదారిలో పయనించాలని కలలు కనే అమ్మాయిలకు రోల్‌మోడల్‌గా నిలవడం మరో కోణం.
మార్గరెట్‌లాగే మూసధోరణులకు భిన్నంగా ప్రయాణిస్తోంది సంగీత. ఒకప్పుడు ఆమె మార్గరెట్ రూమ్‌మేట్. 24 సంవత్సరాల సంగీత సీక్రా దిబ్రూఘర్‌లో మొదటి మహిళా ఎకో గైడ్.
‘అడవిలో మీకు భయం వేయదా? ఇది రిస్క్ జాబ్... సిటీలో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదా... ఇలాంటి మాటలు ఎన్నో వింటుంటాను. అయితే అడవి అనేది అమ్మలాంటిది. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు భయం ఎందుకు! నేను, నా స్నేహితురాలు ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తి ఇవ్వడం సంతోషంగా ఉంది’ అంటుంది సంగీత సీక్రా.
Comments
Please login to add a commentAdd a comment