Margaret
-
అడవి ఒడిలో...
‘నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ ఉద్యోగం వచ్చింది’ అని మార్గరెట్ బారు తన సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు అభినందనలు తెలియజేసిన వారికంటే ఆశ్చర్యపోయిన వారే ఎక్కువ.‘డ్రైవర్ ఉద్యోగం... అది కూడా అడవిలో... నువ్వు ఆడపిల్ల అనే విషయం మరిచావా’ అన్నవారు కూడా ఉన్నారు. అయితే వారి ఆశ్చర్యాలు, అభ్యంతరాలేవీ మార్గరెట్ దారికి అడ్డుకాలేకపోయాయి.ఒడిషాలోని దిబ్రుఘర్ అభయారణ్యంలోని తొలి మహిళా సఫారి డ్రైవర్‌గా ఎంతోమంది యువతులకు స్ఫూర్తిని ఇస్తోంది మార్గరెట్ బారు.దిబ్రుఘర్ అభయారణ్యానికి సమీపంలోని క్రిస్టియన్పడా మార్గరెట్ బారు స్వగ్రామం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మెట్రిక్యులేషన్ పాసైన తరువాత చదువు మానేయాల్సి వచ్చింది. అభయారణ్యంలో వివిధ ఉద్యోగాలలో మహిళల నియామకానికి అటవీశాఖ ప్రకటన మార్గరెట్‌కు ఆశాకిరణంలా తోచింది.తన కుటుంబానికి ఆసరాగా ఉండడానికి ఏదో ఒక ఉద్యోగం తప్పనిసరిగా చేయాలనుకున్న మార్గరెట్ డ్రైవర్ ఉద్యోగానికి ఎంపికైంది.అయితే సఫారీ డ్రైవర్ ఉద్యోగంలో చేరాలనుకున్నప్పుడు ఇతరుల నుంచే కాదు కుటుంబసభ్యుల నుంచి కూడా అభ్యంతరాలు, సందేహాలు ఎదురయ్యాయి.అయినప్పటికీ మార్గరెట్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. డ్రైవింగ్, వెహికిల్ మెయింటెనెన్స్, జంగిల్ రోడ్లను నావిగేట్ చేయడంలో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆరునెలల కఠినమైన శిక్షణ తరువాత ఉద్యోగంలో చేరింది.దిబ్రుఘర్ అభయారణ్యంలోని 13మంది సఫారీ డ్రైవర్లలో ఏకైక మహిళ మార్గరెట్. అయితే ఎప్పుడూ అసౌకర్యంగా భావించలేదు. అభద్రతకు గురి కాలేదు.రోజు ఉదయం ఆరు నుంచి మార్గరెట్ ఉద్యోగ జీవితం మొదలవుతుంది.‘అడవిలో రోడ్లు నాకు సహనాన్ని, ధైర్యాన్ని నేర్పాయి. ప్రతిరోజూ ఒక కొత్త సాహసం చేసినట్లుగా భావిస్తాను. ఈ ఉద్యోగం ద్వారా నా కుటుంబానికి అండగా ఉన్నందుకు గర్వంగా ఉంది’ అంటుంది మార్గరెట్.డ్రైవర్ ఉద్యోగం వల్ల మార్గరెట్ ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం ఒక కోణం అయితే, సంప్రదాయ ఉద్యోగాలకు అతీతం గా కొత్తదారిలో పయనించాలని కలలు కనే అమ్మాయిలకు రోల్‌మోడల్‌గా నిలవడం మరో కోణం.మార్గరెట్లాగే మూసధోరణులకు భిన్నంగా ప్రయాణిస్తోంది సంగీత. ఒకప్పుడు ఆమె మార్గరెట్ రూమ్మేట్. 24 సంవత్సరాల సంగీత సీక్రా దిబ్రూఘర్‌లో మొదటి మహిళా ఎకో గైడ్.‘అడవిలో మీకు భయం వేయదా? ఇది రిస్క్ జాబ్... సిటీలో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదా... ఇలాంటి మాటలు ఎన్నో వింటుంటాను. అయితే అడవి అనేది అమ్మలాంటిది. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు భయం ఎందుకు! నేను, నా స్నేహితురాలు ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తి ఇవ్వడం సంతోషంగా ఉంది’ అంటుంది సంగీత సీక్రా. -
అస్థికలు భద్రపరిచేందుకు అద్దె రూ.63 లక్షలు, ఫ్యామిలీ ప్యాక్ కూడా!
ప్రపంచ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ప్రాంతం ఏదంటే హాంకాంగ్ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఒక జత చెప్పుల డబ్బా అంతటి విస్తీర్ణం ఉన్న స్థలం కూడా వేల డాలర్లు పలుకుతుంది. అలాంటి ప్రాంతంలో చూపరుల్ని ఆకట్టుకునే 12 అంతస్తుల అందమైన భవనాన్ని ఈ మధ్య నిర్మించారు. పాలరాతితో, వంపులు తిరిగిన డిజైన్, రూఫ్ గార్డెన్తో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ భవనాన్ని చూస్తే ఎవరైనా ఫిదా(వశం) అయిపోతారు. అయితే అది నిర్మించింది ధనవంతులు నివసించడం కోసం కాదు. మరణించిన వారి అస్థికలను భద్రపరచడం కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అదే స్థాయిలో అందులో సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. షాన్ సమ్ టవర్ పేరుతో నిర్మించిన ఈ భవనంలో అస్థికల కలశాన్ని భద్రపరచాలంటే 76,000 డాలర్లు (రూ.63 లక్షలు) చెల్లించాలి. అది కూడా 10 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత లీజ్ రద్దయిపోతుంది. ఎందుకంటే ఆ భవనంలో 22,000 మంది అస్థికలను మాత్రమే భద్రపరచవచ్చు. ఒక కుటుంబంలో ఎనిమిది మంది అస్తికలను భద్రపరచడానికి ఫ్యామిలీ ప్యాకేజీ సదుపాయం ఉంది. అందుకయ్యే ఖర్చు 4,40,000 డాలర్లు (రూ.3.64 కోట్లు). షాన్ సమ్ అంటే చైనా భాషలో దయా హృదయం అని అర్థం. ఈ భవనం సంపన్నులకే అందుబాటులో ఉండడం గమనార్హం. అంతా అత్యాధునికం కేవలం అస్థికల కోసం ఇంత ఖరీదా? అని ఎవరైనా నోరెళ్లబెట్టొచ్చు. కానీ, అక్కడున్న హంగులు, ఆర్భాటాలు చూస్తే మతి పోవాల్సిందే. తమకెంతో ఇష్టమైన వారిని స్మరించుకోవడానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ భవనాన్ని నిర్మించారు. పైన అంతా రూప్గార్డెన్ ఉంటుంది. ప్రతి అంతస్తులోనూ పెద్ద పెద్ద బాల్కనీలు ఉంటాయి. చైనా సంస్కృతి సంప్రదాయాల్లో శ్మశాన వాటికలు ఎలా ఉంటాయో అలా వంపుల తిరిగిన డిజైన్‌తో భవనం ఉంటుంది. ఇక లోపల పాలరాతి ఫ్లోరింగ్, ఏసీలు, గాలిలో తేమని తొలగించే వ్యవస్థ కూడా ఉన్నాయి. అస్థికలను భద్రపర్చే చిన్నచిన్న గదుల తలుపులను బంగారు నాణేలతో సౌందర్యభరితం చేశారు. భిన్న సంప్రదాయాలు, ఆచారాలను పాటించే వారి అభిరుచులకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం జరిగింది. పెద్దలకి నివాళులరి్పంచుకోవడానికి ముందస్తుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వారికిష్టమైన ఆహారాన్ని వండి తీసుకువెళ్లి, సంప్రదాయబద్ధంగా నివేదించవచ్చు. పెద్దలను గౌరవించుకోవడానికి మనుషుల అస్థికల కోసం ప్రత్యేకంగా అందమైన భవనం కట్టాలన్న ఆలోచన ఏడు పదుల వయసున్న మార్గరెట్ జీ అనే ఒక మహిళా పారిశ్రామికవేత్తకు వచ్చింది. జ్యువెలరీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఆమె వయసు మీదపడ్డాక సేవా కార్యక్రమాల బాట పట్టారు. తన పేరు మీదే ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సమాజానికి సేవలందిస్తున్నారు.‘‘మరణించిన పెద్దలకి నివాళులర్పించడానికి చైనా సంప్రదాయంలో చాలా ప్రాధాన్యతనిస్తారు. దివికేగిన పెద్దల స్మృతుల్లో గడిపి, వారిని గౌరవిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. అలాంటి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ భవనం నిర్మించాం’’ అని మార్గరెట్ చెప్పారు. భర్త మరణంతో.. హాంకాంగ్ నగర జనాభా 70 లక్షలపైమాటే. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనాభా కిటకిటలాడిపోతూ ఉంటుంది. వాస్తవానికి విస్తీర్ణంలో హాంకాంగ్ పెద్దదే. కానీ కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండడం వల్ల నివాసయోగ్యమైన ప్రాంతం తక్కువే. అందుకే ఇక్కడ ఆకాశహార్మ్యాల నిర్మాణం ఎక్కువగా ఉంది. ఈ నగరంలో ఒక ఇంటి సగటు విస్తీర్ణం 430 చదరపు అడుగులు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. అస్థికల భవన నిర్మాణాన్ని తలపెట్టిన మార్గరెట్ భర్త 2007లో మరణించారు. ఆయన స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడానికి ఆమెకి స్థలం దొరకలేదు. ఆ సమయంలోనే మరణించిన వారి కోసం ప్రత్యేకంగా ఒక అపార్ట్మెంట్ నిర్మించాలన్న ఆలోచన ఆమెకు వచి్చంది. అది ఇన్నేళ్లకి సాధ్యమైందని చెబుతున్నారు. ఇక హాంకాంగ్‌లో వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. ప్రతి అయిదుగురిలో ఒకరు 65 ఏళ్లకు పైబడిన వారే. ఇక నగరంలో ప్రతి ఏటా దాదాపు 46,000 మంది మరణిస్తున్నారు. వారి అవశేషాలను భద్రపరచడానికి ప్రభుత్వం పలు సదుపాయాలు ఏర్పాటు చేసింది. అయితే అవి సరిపోకపోవడం వల్ల ప్రైవేట్ భవనం నిర్మించాల్సి వచి్చంది. హాంకాంగ్‌లో సంపన్నులు కూడా ఎక్కువే. అలాంటి వారి సౌకర్యార్థం షాన్ సమ్ అందుబాటులోకి వచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మార్గరెట్ బూర్కి–వైట్: తను లేరు, తనిచ్చిన లైఫ్ ఉంది
దేశ విభజన రక్తకన్నీటి ధారలను తన కెమెరాతో బంధించిన వారిలో ముఖ్యులు మార్గరెట్ బూర్కి–వైట్. ‘గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్’ పేరుతో ప్రసిద్ధమైన హత్యాకాండ మిగిల్చిన విషాదాన్ని మార్గరెట్ భావి తరాలు మరచిపోలేని విధంగా చిత్రీకరించారు. మార్గరెట్ (1904–1971) అమెరికా పౌరసత్వం తీసుకున్న పోలెండ్ జాతీయురాలు. తండ్రి జోసెఫ్ వైట్ యూదు జాతీయుడు. తల్లి మిన్నీ బూర్కి ఐరిష్ జాతీయురాలు. తల్లి మీద ప్రేమతో బూర్కి (ఆమె ఇంటిపేరు) పేరును కూడా మార్గరెట్ తన పేరులో చేర్చుకున్నారు. మార్గరెట్ చిన్నతనం న్యూజెర్సీలో గడిచింది. కెమెరాలంటే ఆసక్తి చూపించే తండ్రి నుంచి ప్రోత్సాహం రావడంతో చిన్ననాడే ఆమె ఫొటోలు తీయడం ఆరంభించారు. ఆమె ప్రఖ్యాత ‘లైఫ్’లో పనిచేసిన తొలి మహిళా ఫొటోగ్రాఫర్. అలాగే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రణభూమి దగ్గర ఉండి ఫొటోలు తీసే అవకాశం వచ్చిన మొదటి మహిళ మార్గరెట్. అప్పుడే క్రెమ్లిన్ (రష్యా) మీద నాజీ సేనల దాడుల (1941) దృశ్యాలను తన కెమెరాలో బంధించే అవకాశం ఆమెకు దక్కింది. ఇలాంటి సంక్షుభిత పరిణామాలను చిత్రించేందుకు అనుమతి పొందిన ఏకైక విదేశీయురాలు మార్గరెట్. తన ఫొటో తీయడానికి స్టాలిన్ కూడా ఆమెను అనుమతించాడు. సోవియెట్ పరిశ్రమలను ఫొటోలు తీయడానికి అనుమతి పొందిన తొలి పాశ్చాత్య మహిళ కూడా ఆమే. హిట్లర్ పతనం తరువాత జర్మనీ దుస్థితిని కూడా ఆమె తన ఫ్రేములలో బంధించారు. మహాత్మా గాంధీ ఫొటోలు తీయడానికే మార్గరెట్ మార్చి, 1946లో భారతదేశానికి వచ్చారు. చరఖా ముందు కూర్చుని ఉన్న గాంధీజీ ఫొటో మార్గరెట్ తీసిందే. ఇంకా చాలా పోజులలో గాంధీజీ ఫొటోలు ఉన్నాయి. ఆమె భారతదేశం కోసం తీసిన ఫొటోలు 66. అందులో గాంధీ, జిన్నా, అంబేడ్కర్ వంటి చరిత్రపురుషుల పోర్ట్రయిట్లు, విభజన విషాదాల ఫొటోలు ప్రధానంగా ఉన్నాయి. అసలు భారత విభజన విషాదాన్ని కెమెరాలో బంధించడానికే ఆమె ఇక్కడికి వచ్చారని అనిపిస్తుంది. మార్గరెట్ పార్కిన్సన్ పెయిన్ వ్యాధితో 1971లో తుదిశ్వాస విడిచారు. భారత స్వాతంత్య్ర సమరం అహింసాయుతంగా మొదలై, దారుణమైన హింసతో ముగిసింది. ఇదొక వైచిత్రి. గాంధీజీ వంటి అహింసామూర్తిని ఫొటోలు తీయడానికి వచ్చిన మార్గరెట్ హింసాత్మక భారతాన్ని చూశారు. నేడు (జూన్ 14) మార్గరెట్ జయంతి. గాంధీజీ నూలు వడికే మగ్గం దగ్గర ఉన్న చరిత్రాత్మకమైన ఫొటోను తీసింది మార్గరెటే! (పైఫొటో:) మార్గరెట్ బూర్కి వైట్ -
గాంధీజీ ఫొటోల్లో అదే అద్భుతం.. ఆ ఘనత మార్గరెట్దే!
విభజన వేళ భారత్‌లో జరిగిన హింస ప్రపంచ చరిత్ర కనీ వినీ ఎరుగనిదని చరిత్రకారుల ఏకాభిప్రాయం. ఆ విషాదగాథ ఆధారంగా వందల గ్రంథాలు వచ్చాయి. వేల పేజీల సృజనాత్మక సాహిత్యం వచ్చింది. మతావేశాలతో చెలరేగిన ఆ కల్లోలాలలో కోటి నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. మృతులు పది లక్షలని అంచనా. అపహరణకు గురైన వారు కావచ్చు, లైంగిక అత్యాచారాలకు బలైన వారు కావచ్చు– బాలికలు, యువతలు 75,000 నుంచి లక్ష. చరిత్ర చూడని భయానక శరణార్థి సమస్య వచ్చింది. ‘తమస్’ (భీష్మ సహానీ)’, ‘ఎ ట్రెయిన్ టు పాకిస్తాన్’ (కుష్వంత్‌సింగ్), ‘ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్’ (ఊర్వశీ బుటాలియా), ‘ఏ టైమ్ ఆఫ్ మ్యాడ్నెస్’, ‘మిడ్నైట్ చిల్డ్రన్’ (సల్మాన్ రష్దీ), పార్టిషన్ (బార్న్‌వైట్–స్పున్నర్), ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ (ల్యారీ కోలిన్, డొమినిక్ లాపిరె), ‘మిడ్నైట్ ఫ్యూరీస్’ (నిసీద్ హజారీ) వంటి నవలలు, చరిత్ర పుస్తకాలలో, అమృతా ప్రీతమ్, ఇస్మత్ చుగ్తాయ్, గుల్జార్, సాదత్ హసన్ మంటో వంటి వారి వందలాది కథలలో ఆ విషాదం అక్షరబద్ధమైంది. జిన్నా ప్రత్యక్షచర్య పిలుపే ఇందుకు కారణం. కానీ విభజన నాటి విషాదాన్ని కెమెరా ద్వారా చిత్రబద్ధం చేసిన వారు మార్గరెట్ బర్కి వైట్. తేనెపట్టును తలపిస్తూ రైళ్లను ముసురుకున్న మానవ సమూహాలు, కిలో మీటర్ల మేర ఎడ్లబళ్లు, మంచం సవారీ మీద వృద్ధులు, భుజాల మీద పిల్లలు, బరువైన కావళ్లు, ఓ ఎత్తయిన ప్రదేశంలో తల పట్టుకు కూర్చున్న అబ్బాయి, కలకత్తా వీధులలో దిక్కులేకుండా పడి ఉన్న శవాల గుట్టలు.. ఇవన్నీ ఏదో సందర్భంలో, ఏదో ఒక పత్రికలో చూసి ఉంటాం. ఇవన్నీ మార్గరెట్ వైట్ (1904–1971) ధైర్య సాహసాల వల్ల చారిత్రక ఫ్రేములకెక్కినవే. ఒక మహా మానవ విషాదాన్ని ఆమె చారిత్రక దృష్టితో దృశ్యీకరించారు. ఆ నలుపు తెలుపు ఫొటోల్లోనూ ఎర్రటి నెత్తురు చూసిన అనుభూతి తెచ్చారామె. రెండో ప్రపంచయుద్ధం ముగియగానే ఇంగ్లండ్ భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వడం ఖాయమని తేలింది. అప్పుడు మార్గరెట్ అమెరికా నుంచి వెలువడుతున్న ‘లైఫ్’ పత్రికలో పని చేసేవారు (తరువాత ‘టైమ్’ మ్యాగజీన్‌కు మారారు). చాలామంది అంతర్జాతీయ పత్రికల ప్రతినిధులూ, ఫొటోగ్రాఫర్ల మాదిరిగానే ఆమె కూడా (మార్చి, 1946) భారత్‌కు వచ్చారు. అసలు ఆమె ఉద్దేశం గాంధీజీ మీద వార్తా కథనం. కానీ ఆయన కార్యదర్శి చరఖా వడకడం వస్తేనే లోపలికి వెళ్లనిస్తామని చెప్పాడు. చాలా తొందరగా నేర్చుకుని వచ్చారామె. తీరా, ఆ రోజు సోమవారం. గాంధీజీకి మౌనవ్రతం. అయితే సహజ కాంతిలోనే ఫొటోలు తీయాలని, మూడు డిమాట్ ఫ్లాష్‌లు మాత్రమే ఉపయోగించాలన్న షరతులతో మొత్తానికి అనుమతించారు. గాంధీజీ రాట్నం ముందు కూర్చుని పేపర్ క్లిపింగ్స్ చూసుకుంటున్నారు. అలాగే ఫొటో తీశారు మార్గరెట్. గాంధీకి అత్యంత ప్రియమైన రాట్నం ముందు కూర్చుని ఉన్న ఫొటోల్లో ఇదే అద్భుతం. సహజ కాంతిలో తీయడంతో గాంధీజీ రుషిలా కనిపిస్తారు. చాలాసార్లు గాంధీ వెంటే పర్యటించారామె. జిన్నా, అంబేడ్కర్, నెహ్రూ వంటి ప్రముఖులందరి ఫొటోలు తీశారు. వార్తలు రాయడానికి ఈమెతోనే వచ్చారు ‘లైఫ్’ పత్రికా రచయిత్రి లీ ఎలీనన్. మార్గరెట్ కెమెరా పనితనానికి లీ కలం బలం తోడైంది. ఇలాంటి సమయంలో భారత్‌లో మహిళలు పనిచేయలేరని చాలామంది హితవు పలికారు. రవాణా సదుపాయాలు ఉండవని చెప్పారు. యువతులను అపహరించడం సర్వసాధారణం. ప్రాణాలకు ముప్పు సరే. అవన్నీ నిజమే అయినా మార్గరెట్ తట్టుకుని నిలబడ్డారు. అప్పటికి ఆమె వయసు పాతిక లోపే. ఒక పాత జీప్‌లో కెమెరా సామగ్రి, టైప్ రైటర్, ఇతర వస్తువులతో లాహోర్ వెళుతుంటే ఒకచోట శరణార్థుల గుంపు దాడి చేసింది కూడా. కానీ సైనికులు రక్షించారు. అమృత్సర్ దగ్గర బియాస్ నది వద్ద రైలు పట్టాలకు ఎడమ వైపున ఈగలు వాలుతున్న 17 శవాలను గమనించారామె. ఒక నదిలో కుళ్లి ఉబ్బిన శవాల వైపే చూస్తున్న రాబందులను చూశారు. ఆకలితో చనిపోయిన నాలుగేళ్ల బాలుడిని లాహోర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ పక్కన ఖననం చేస్తున్న దృశ్యం చూశారు. జబ్బు పడిన మహిళను భుజం మీద మోసుకుంటూ వస్తున్న సిక్కును కెమెరాలో బంధించారు. ఈ సిక్కుతో పాటే భారత్‌కు బయలుదేరిన భారీ గుంపు (కఫిలా)లో 103 మందిని మధ్యలోనే చంపారు. ఇవన్నీ ఆమె ‘హాఫ్ వే టు ఫ్రీడమ్’ అన్న స్వీయ రచనలో నమోదు చేశారు. మరునాడే అమెరికా ప్రయాణమనగా, మార్గరెట్ గాంధీజీని కలుసుకున్నారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. ప్రయాణం రోజే గాంధీజీ హత్య జరిగింది. ఆదరాబాదరా వెళ్లారామె. శవం దగ్గరకు రానిచ్చినా, ఫొటోకు అనుమతి ఇవ్వలేదు. అయినా కెమెరాకు రహస్యంగా పని చెప్పబోయారు. ఫ్లాష్ వెలిగింది. అంతా ఆగ్రహించారు. కెమెరాలో రీలు లాగేసి, అక్కడ నుంచి గెంటేశారు. కెమెరా లెన్స్ లేదా ఆమె కళ్లు గమనించినదే అయినా అదంతా దేశ విభజన నాటి విషాద చరిత్రే. కానీ ఆ కంటికీ, ఆ లెన్స్కీ అందని విషాదం ఇంకా ఎంతో... ఎంతెంతో... ఉండిపోయింది. -డా. గోపరాజు నారాయణరావు -
మహిళే మొదట వ్యాక్సిన్‌కి చేయూత
షీ జెంగ్లీ.. కరోనాను కనిపెట్టిన మహిళ. శైలజ.. కరోనా నుంచి అలెర్ట్ చేసిన మహిళ. జెన్నిఫర్.. వ్యాక్సిన్‌కు ప్రయోగమైన మహిళ. కరోనా మొదలు నుంచి.. తుదికి చేరుతున్న ప్రతి దశలోనూ మహిళ! ఇప్పుడు ప్రతి దేశంలోనూ.. వ్యాక్సిన్‌కి చేయూత అవుతున్నదీ మహిళే! రెండువేల పందొమ్మిది డిసెంబరులో కోవిడ్–19 వస్తే, రెండువేల ఇరవై డిసెంబర్‌కి కోవిడ్–19 వ్యాక్సిన్ వచ్చింది. వ్యాక్సిన్ రావడం అంటే మానవాళి పునర్జన్మించడమే. ఆ జన్మకు తొలి పొత్తిలి పట్టిన మహిళ మార్గరెట్ కీనన్! 90 ఏళ్ల బ్రిటిష్ బామ్మ గారు ఆమె. బ్రిటన్‌లోనే కాదు, ప్రపంచంలోనే తొలిసారి వ్యాక్సిన్‌కి చెయ్యి పట్టిన తొలి మహిళ మార్గరెట్. అందరికన్నా ముందు టీకా వేయించుకుని డిసెంబర్ తొలివారంలోనే లోకానికి నూతన çసంవత్సరాన్ని తీసుకొచ్చారు మార్గరెట్. ఆ తర్వాత మిగతా దేశాల్లోనూ వ్యాక్సిన్లు సిద్ధమయ్యాయి. యు.ఎస్., స్విట్లర్జాండ్, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, రష్యా దేశాలు తాము కనిపెట్టిన వ్యాక్సిన్‌ను తమ పౌరులకు ఇచ్చాయి. ఈ దేశాలన్నిటిలోనూ తొలి వ్యాక్సిన్ షాట్‌ను తీసుకున్నది మహిళలే కావడం యావత్ ప్రపంచం మహిళలకు తలవొంచి నమస్కరించవలసిన మరొక సందర్భం. కోవిడ్–19 వ్యాక్సిన్‌ను కనిపెట్టే తొలి రోజుల్లో ప్రయోగాలు జరిగిందీ మహిళల మీదే, కనిపెట్టాక ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటున్నదీ మహిళలే. టీకాను ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించింది మహిళావని. అందుకే వారికి నమస్కరించాలి. మార్గరెట్ : బ్రిటన్ మార్గరెట్ కీనన్ తీసుకున్నది ఫైజర్–బయోన్టెక్ వ్యాక్సిన్. తన తొంభయ్యవ పుట్టినరోజుకు వారం ముందు ఆమె వ్యాక్సిన్‌కు నిస్సంకోచంగా భుజమిచ్చారు. ప్రపంచ ప్రజలకు అభయం ఇవ్వడమే అది. మధ్య ఇంగ్లండ్‌లోని కోవెంట్రీ నగరంలో ఉంటారు ఆమె. బంగారు ఆభరణాల దుకాణంలో కొన్నేళ్ల క్రితం వరకు సహాయకురాలుగా పని చేశారు. కూతురు. కొడుకు. నలుగురు మనవలు, మనవరాళ్లు. నిన్న కొత్త సంవత్సరాన్ని పిల్లలతో, తన స్నేహితులతో సంతోషంగా గడిపారు. డిసెంబర్లో వ్యాక్సిన్ తొలి షాట్ తీసుకున్న 21 రోజుల తర్వాత గత వారం రెండో ‘బూస్టర్ జాబ్’ చేయించుకున్నారు మార్గరెట్. శాండ్రా : ఆమెరికా ఆమెరికా తన తొలి వ్యాక్సిన్‌ని శాండ్రా శారా లిండ్సేకు ఇచ్చింది. శాండ్రా క్రిటికల్ కేర్ నర్సు. జమైకా–అమెరికా సంతతి యువతి. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఉన్న ‘లాంగ్ ఐలాండ్ జెవిష్ మెడికల్ సెంటర్’లో వైద్య సేవికగా పని చేశారు. కొత్త వ్యాక్సిన్ అంటే అందర్లో భయం ఉంటుంది. ఆ భయం పోగొట్టడానికే శాండ్రా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆమె తీసుకున్నదీ ఫైజర్ వ్యాక్సిన్నే. పేరు తెలియనివ్వని మహిళ : స్విట్జర్లాండ్ ఫొటోలో మీరు చూస్తున్నది పేరు తెలియనివ్వని ఆ మహిళనే. వయసు 90 ఏళ్లు. స్విట్జర్లాండ్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న తొలి సిటిజెన్. స్విస్ మిలిటరీ దాదాపుగా పది లక్షల డోస్‌లను దేశమంతటా పంపిణీ చేసింది. ఆ డోస్‌లు మొదట లాసెర్న్, అప్పెన్జెల్ ఇన్నర్ రోడ్స్ ప్రాంతాలకు సరఫరా అయ్యాయి. ఆ ప్రాంతంలోని నర్సింగ్, కేర్ హోమ్‌లో ఉండేవారికి వ్యాక్సిన్ వేసేందుకు వెళ్లిన వైద్య కార్యకర్తలకు ఈ పేరు తెలియనివ్వని మహిళ చిరునవ్వుతో ఎదురెళ్లి మరీ చెయ్యిపట్టారు. ఎడిత్ క్వాయ్జెల్లా : జర్మనీ ఎడిత్ వయసు 101 ఏళ్లు. ఆరోగ్యంగా ఉన్నారు. జర్మనీలో అందరికన్నా ముందుగా ఆమే ఉత్సాహంగా వ్యాక్సిన్ తీసుకున్నారు! అదీ ఫైజర్ వాళ్లదే. బెర్లిన్‌లోని వృద్ధుల ఆరోగ్య సంరక్షణాలయంలో ఉంటున్నారు ఎడిత్. డిసెంబర్ 26 అందులోని నలభై మంది వ్యాక్సిన్‌కు ముందుకొస్తే వారందరికన్నా ముందు వేయించుకున్నది ఎడిత్తే. శాక్సోనీ అన్హాల్ట్లోని హార్జ్ పర్వత ప్రాంత సమీపంలో ఉన్న హల్బెర్ట్స్టాడ్ ఆమె జన్మస్థలం. పది లక్షలకు పైగా వాక్సిన్ డోస్‌లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న జర్మనీ ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించడంలో మొదట వృద్ధులకు ప్రాధాన్యం ఇస్తోంది. గున్–బ్రిట్ జాన్సన్: స్వీడన్ స్వీడన్లో తొలి డోస్ అందుకున్నవారు గున్ బ్రిట్. ఆమె వయసు 91 ఏళ్లు. రాజధాని స్టాక్హోమ్కి, గోథెన్బర్గ్ నగరానికి మధ్య ఉండే ఎమ్జోల్బీ పట్టణంలోని ఒక వృద్ధాశ్రమంలో ఉంటారు బ్రిట్. ‘‘నాక్కాస్త గొప్పగానే ఉంది. మానవ ప్రయత్నాల మీద నాకసలు సందేహమే రాదు. చక్కగా వ్యాక్సిన్ వేయించుకున్నాను కనుక చక్కగా పనిచేస్తుంది’’ అంటున్నారు. అధికారులు ఆమెకు వ్యాక్సిన్ వేసిన తర్వాత చెప్పారట.. స్వీడన్లో కోవిడ్ వ్యాక్సిన్ మొదట తనకే వేసినట్లు! ‘‘ఆశ్చర్యపోయాను’ అని నవ్వుతున్నారు. ఇప్పుడామె తన మనవళ్లు, ముని మనవళ్లను కరోనా బెరుకు లేకుండా కలుసుకో గలుతున్నారట. 2021 జూన్ నాటికి దేశంలోని వృద్ధులందరికీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే సంకల్ప బలంతో ఉంది స్వీడన్ ప్రభుత్వం. మ్యారిసెట్: ఫ్రాన్స్ పారిస్ శివార్లలోని సెవ్రాన్ పట్టణంలో ఉన్న రీనీ–మారెట్ ఆసుపత్రిలో తొలి వ్యాక్సిన్‌ను 78 ఏళ్ల మ్యారిసెట్ తీసుకున్నారు. ‘‘నేను కదిలిపోయాను తెలుసా..!’ అని ఉద్వేగంతో అంటున్నారు మ్యారిసెట్. ఫ్రాన్స్‌లో మొదట సెవ్రాన్, డిజాన్ ప్రాంతాలలో వ్యాక్సిన్ వేసే కార్యక్రమం మొదలైంది. అందరిలో మొదట మ్యారిసెట్కే వ్యాక్సిన్ అందింది. అందుకే ఆమెకంత భావోద్వేగం. ఈ ప్రారంభ వేడుకను (వేడుకే గా మరి) ట్వీట్ చేస్తూ.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మక్రాన్ ‘వైరస్‌ను ఎదుర్కొడానికి మనకు అందివచ్చిన కొత్త ఆయుధం.. వ్యాక్సిన్’ అని సంతోషం వ్యక్తం చేశారు. యానీ లించ్: ఐర్లాండ్ ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో దేశవ్యాప్త వ్యాక్సినేషన్ కార్యక్రమం 79 ఏళ్ల యానీ లించ్‌తో మొదలైంది. పదిమంది మనవల బామ్మగారు యానీ. కరోనా భయంతో ఇన్నాళ్లూ ఆమె వారికి ఎక్కడ అంటిస్తానోనని దూరంగా ఉన్నారు. సెయింట్ జేమ్స్ ఆసుపత్రిలో తన కుటుంబ సభ్యులు వెంట రాగా సంబరంగా వ్యాక్సిన్ వేయించుకున్నారు యానీ. ‘‘ఐర్లండ్‌లో తొలి డోస్‌ను వేయించుకున్న వ్యక్తిగా నా పేరు చరిత్రలో నిలిచిపోతుందంటే సంతోషమే కదా..’’ అంటున్నారు. వాస్తవానికి ఆమె తన మనవల్ని దగ్గరకు తీసుకోవడం కోసమే వ్యాక్సిన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారట. రష్యాలో తొలి వ్యాక్సిన్ పుతిన్ కుమార్తె వేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఏ కుమార్‌తో వెల్లడి కాలేదు. పుతిన్‌కి ఎకతెరీనా పుతీనా, మారియా పుతీనా అనే కుమార్తెలు ఉన్నారు. ప్రయోగాల దశలో కూడా పుతిన్ కుమార్తె వాక్సిన్ పని తీరు తెలుసుకోవడం కోసం సహకరించారని అన్నారు కానీ ఇద్దరిలో ఎవరన్నది నేటికీ బయటికి పొక్కలేదు. వేయించుకున్నవారికి కొంచెం జ్వరం వచ్చిందనైతే మాత్రం పుతిన్ మాటల్లోనే తెలిసింది. -
కరోనా ఉందని మర్చేపోయాను!
లండన్: ఆరు నెలలు దాటిపోయినా ప్రపంచ ప్రజలకు నేటికింకా కరోనాకు భయపడటం పూర్తిగా అలవాటు కాలేదు! బ్రిటన్ దిగువసభలో ఎంపీగా ఉన్న 60 ఏళ్ల మార్గరెట్ ఫెరియర్ అనే ప్రపంచ పౌరురాలైతే మరీ నిర్భయంగా.. లండన్ నుంచి ఏడింబరో, ఏడింబరో నుంచి లండన్.. ప్రజా రవాణా వాహనాలలో పదిమందితో కలిసి ప్రయాణించి వచ్చి సభలో కూర్చున్నారు. అయితే ఆ సంగతి ఆమె మళ్లీ సభ నుంచి వెలుపలకి వచ్చి మరొకసారి పదిమందితో కలిసి ప్రయాణించినప్పుడు గానీ సభకు తెలియలేదు. కరోనా కాలంలో మార్గరెట్ నిర్భయంగా తిరగడం అన్నది ఆమెకు కరోనా లేనట్లయితే తప్పకుండా ఒక విశేషం అయి ఉండేదే. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యాక కూడా ఆమె సభకు రావడం, మెట్రో రైళ్లలో రాకపోకలు సాగించడంతో అది నిర్భీతి కాక నిర్బాధ్యత అయింది. బ్రిటన్ చట్టం ఇలాంటి బాధ్యతా రాహిత్యాన్ని అస్సలు సహించదు. చట్టం సహించనప్పుడు చట్టసభ సహిస్తుందా?! స్పీకర్ ఆమెను సభ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. ఆమెది స్కాటిష్ నేషనల్ పార్టీ. ఆ పార్టీ ఆమెను తన ఎంపీ పదవికి రాజీనామా చేయమని కూడా కోరింది! ‘సారీ’ చెప్పారు మార్గరెట్. సభకు, పార్టీకి, నియోజకవర్గ ప్రజలకీ. నాలుగు వేల పౌండ్ల అపరాధ రుసుము చెల్లించారు. ‘నేనిలా చేయకుండా ఉండాల్సింది. కరోనా ఉందని మర్చేపోయాను’ అన్నారు. ఇంతగా తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నా కూడా ఆమెపై కరోనా నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు అవకుండా ఏం పోలేదు. బ్రిటన్‌లో శిక్షలు మెత్తగా ఉన్నా శిక్షల అమలు కఠినంగా ఉంటుంది. మార్గరెట్ ఇప్పుడు ఆ కఠినత్వానికి, మృదుత్వానికీ మధ్య కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. -
అమ్మకానికి మార్గరెట్ థాచర్ నివాసం...!
బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ ప్యాలెస్ ను అమ్మకానికి పెట్టారు. ఆరంతస్తుల ఆ అపూర్వ భవనంలో సిబ్బంది క్వార్టర్స్, లూయిస్ ఫైర్ ప్లేస్ లు... ఓ ప్రధానమంత్రికి కావలసిన అన్నిరకాల హంగులూ ఉన్నాయి. దానికి తోడు... నీలి రాతితో మెరసి పోతున్న ఆ సౌధాన్ని.. కొనేవారి కోసం యజమానులు నిరీక్షిస్తున్నారు. మాజీ ప్రధాని చివరిగా నివసించిన ఆ భవనంలోని ప్రత్యేకతలను బట్టి... దాని ఖరీదును ముఫ్ఫై మిలియన్ల యూరోలుగా నిర్ణయించారు. లండన్ లోని 73 ఛెస్టర్ స్క్వేర్ లో ఉన్న ఆ భవంతిలో అంతకు ముందు కవి మాథ్యూ ఆర్నాల్డ్, నవలా రచయిత మేరీ షెల్లీ, 1930 కంజర్వేటివ్ ప్రధాని స్టాన్లీ బాల్డ్ విన్ నివసించారు. ఇటీవల లగ్జరీ డెవలపర్ లెకాన్ ఫీల్డ్ కొన్ని మిలియన్ పౌండ్లతో పునరుద్ధరించి, మూడేళ్ళ తర్వాత మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. ఈ భవంతిలోని ప్రధాన ద్వారాలకు థాచర్ ఇష్టంతో పొదిగించుకున్న 73 నీలి ఫలకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హాల్లోని ఫ్లోరింగ్, లాబీలకు కూడ అదేరకం రాయిని వినియోగించారు. ఇటువంటి ప్రత్యేకతలు కొనుగోలుదారులను అమితంగా ఆకట్టుకునేట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ భవనానికి ఏర్పాటు చేసిన బాంబ్ ప్రూఫ్ తలుపులు ఆ నాయకురాలి జీవితానికి గుర్తులుగా నిలుస్తున్నాయి. థాచర్ 1984 లో బ్రైటన్ హోటల్ బాంబు దాడి నుంచి తప్పించుకున్న తర్వాత బాంబ్ ఫ్రూఫ్ తలుపుల అవసరం మరింత పెరిగింది. అంతేకాదు ఈ ప్యాలెస్ లో ప్రదర్శన శాలలు, మోడరన్ జిమ్, సినిమా హాల్, 500 సీసాలు పట్టే వైన్ సెల్లార్ వంటి మరెన్నో ఆధునిక హంగులూ ఉన్నాయి. మేడమీది రెండో అంతస్తులో మాస్టర్ సూట్లు, డబుల్ బెడ్ రూమ్, డ్రెస్సింగ్ ఏరియా, మాస్టర్ బాత్ రూమ్ సహా అనేక ప్రత్యేక ఆకర్షణలు కొనుగోలుదారులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. అలాగే భవనంలోని మరో ఐదు బెడ్ రూమ్ లు, సిబ్బంది వసతి గృహాలతోపాటు ఇటాలియన్ ఫర్నిచర్, పాలరాతి టేబుల్ రాచరికపు అందాలను ఉట్టిపడేలా చేస్తున్నాయి. థాచర్ త్రండి ఆల్ ఫ్రెడ్ రాబర్ట్స్ 'గ్రాంథం' ప్రాంతానికి 1945 నుంచి 1946 వరకు మేయర్ గా పనిచేశారు. దీంతో ఆమె తన బాల్యాన్ని గ్రాంథం లో గడిపింది. స్థానిక గ్రామర్ స్కూల్లో చదివిన మార్గరెట్... ఆక్స్ ఫర్డ్ సోమర్ విల్లె కాలేజీలో కెమిస్ట్రీ లో పట్టభద్రత పొందింది. అనంతరం ఓ పరిశోధన రసాయన శాస్త్రవేత్తగా పనిచేసి, ఆమెకు 25 ఏళ్ళ వయసున్నపుడు రాజకీయాల్లో అడుగు పెట్టింది. 1951 లో కంజర్వేటివ్ అభ్యర్థిగా ఎంపికై... 1970 లో పార్టీ నాయకురాలిగా ఎదిగింది. తర్వాత మూడు పర్యాయాలు జనరల్ ఎన్నికల్లో గెలిచి మొదటి బ్రిటిష్ ప్రధానమంత్రిగా థాచర్ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. -
నేరం ఎవరిది ?
నిజాలు దేవుడికెరుక: ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలిస్తారు ఎవరైనా. కానీ ఆమె అతడి ప్రాణం తీసింది. తమ బంధానికే కాదు, అతడి జీవితానికి కూడా ముగింపు పలికింది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమె ఎందుకలా చేసింది? భర్త ప్రాణాలు తీసేంతగా వారి మధ్య ఏం జరిగింది? జూలై 9, 1923. లండన్‌లోని సవాయ్ హోటల్. రాత్రి ఒంటిగంట దాటింది. హాల్లో మేనేజర్ అటూ ఇటూ ఆవేశంగా తిరుగుతున్నాడు. అతడికి ఎదురుగా నిలబడి ఉన్న స్వీపర్ బిత్తర చూపులు చూస్తున్నాడు. ‘‘నీకు మొన్నే చెప్పాను... పనిలో తేడా జరిగితే ఊరుకునేది లేదని. ఇవాళ మూడో ఫ్లోర్ నువ్వసలు సరిగ్గా శుభ్రం చేయలేదు. ఎక్కడ చూసినా దుమ్మే’’... అరిచినట్టే అన్నాడు మేనేజర్. ‘‘సారీ సర్. ఏదో హడావుడిలో పొరపాటు చేశాను. రేపు జాగ్రత్తగా చేస్తాను’’ సంజాయిషీ ఇచ్చాడు స్వీపర్. ‘‘రేపు కాదు. ఇప్పుడే తుడవాలి. అసలే ఇవాళ కస్టమర్స్ చిరాకు పడ్డారు. రేపు వాళ్లు లేచేసరికి శుభ్రంగా లేకపోతే మళ్లీ మాట పడాల్సి వస్తుంది. వెళ్లు... శుభ్రంగా తుడిచేసి అప్పుడు పడుకో.’’ చిర్రెత్తుకొచ్చింది స్వీపర్‌కి. కానీ నిస్సహాయత నోరు మెదపనివ్వలేదు. మౌనంగా అక్కడ్నుంచి కదిలాడు. మూడో అంతస్తుకి చేరుకుని కారిడార్ శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. ‘‘కాస్త కూడా జాలి లేదు ఈ మనిషికి. ఒంటి గంటన్నర అవుతోంది. అందరూ హాయిగా నిద్రపోతున్నారు. వీడు మాత్రం దుమ్ము, మురికి అంటూ నా వెంట పడ్డాడు. శాడిస్ట్గాడు’’... తిట్టుకుంటూ తుడుస్తున్నాడు. ఉన్నట్టుండి ఏవో మాటలు వినిపించడంతో పని ఆపి నిలబడ్డాడు. ఓ సూట్లోంచి ఆడ, మగ స్వరాలు కాస్త హెచ్చు స్థాయిలో వినిపిస్తున్నాయి. ‘‘నాకు చిరాకు తెప్పించకు. నోర్మూసుకుని పడుకో’’... అరుస్తున్నాడతను. ‘‘నోరు మూసుకోవాల్సింది నువ్వా నేనా? నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్? హింసించి చంపుదామనా?’’... అంతకంటే గట్టిగా అరుస్తోందామె. తలుపు కాస్త తెరిచి ఉండటంతో మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. స్వీపర్ నవ్వుకున్నాడు. ‘‘ఉన్నోళ్లయినా లేనోళ్లయినా మొగుడూపెళ్లాలంటే కొట్టుకోవాల్సిందేనన్నమాట’’ అనుకుంటూ మళ్లీ తన పనిలో పడ్డాడు. రెండు నిమిషాలు గడిచాయో లేదో... తుపాకీ పేలిన శబ్దం వినిపించి అదిరిపడ్డాడు. ఒక్కసారి కాదు... మూడుసార్లు వెంటవెంటనే పేలింది తుపాకీ. గబగబా ఆ గది దగ్గరకు పరిగెత్తాడు స్వీపర్. తలుపు తోసుకుని లోనికెళ్లాడు. నేలమీద పడివున్నాడా వ్యక్తి. తుపాకీ గుళ్లు ఒంటిని చీల్చడంతో రక్తం ఎగజిమ్మి అన్నిటిమీదా పడింది. గాయాల నుంచి రక్తం ఉబికి వస్తోంది. చేతిలో తుపాకీతో అతడి దేహం పక్కన కూర్చుని ఉందామె. ‘‘దేవుడా... ఇంత ఘోరం ఎలా చేశాను’’ అంటూ పిచ్చిగా అరుస్తూ ఏడుస్తోంది. క్షణంసేపు కొయ్యబారిపోయాడు స్వీపర్. తర్వాత తేరుకుని, పరుగున వెళ్లి విషయాన్ని మేనేజర్ చెవిన వేశాడు. అతడు వెంటనే పోలీసులకు కబురందించాడు. కొద్ది నిమిషాల్లో పోలీసులు హోటల్‌కి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో పడివున్న వ్యక్తిని చూసి షాక్ తిన్నారు. ‘‘ఇతడు ఫామీ బే కదూ’’ అన్నాడు ఇన్స్పెక్టర్ మృతదేహాన్ని చూస్తూ. అవునన్నట్టు తలూపాడు మేనేజర్. పోలీసులు ఫామీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి అతడి భార్యని అదుపులోకి తీసుకున్నారు. తెల్లారేసరికల్లా... ఈజిప్టు యువరాజు ఫామీ బేని, అతడి భార్య మార్గరెట్ చంపేసిందన్న వార్త దావానలంలా వ్యాపించింది! ‘‘మీ భర్తని ఎందుకు చంపారు?’’ తల దించుకుని, మౌనంగా కూర్చునివున్న మార్గరెట్‌ని అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘నేను తనని చంపకపోతే, తను నన్ను చంపేసేవాడు సర్. ఆత్మరక్షణ కోసం అనుకోకుండా కాల్చాను తప్ప తనని చంపాలన్న ఉద్దేశం నాకు లేదు.’’ ‘‘మీ భర్త మిమ్మల్ని ఎందుకు చంపుతాడు? మమ్మల్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారా?’’ చివ్వున తలెత్తి చూసింది మార్గరెట్. క్షణాల్లో ఆమె ముఖం ఎర్రబడింది. ‘‘అలాంటిదాన్నే అయితే అందరికీ తెలిసేలా చంపివుండేదాన్ని కాదు కదా. దానికి వేరే మార్గం ఎంచుకుని, ఎవరికీ దొరక్కుండా తప్పించుకుని ఉండేదాన్ని’’... ఆవేశంగా అంది. ‘‘కూల్ మిసెస్ ఫామీ... ఆరా తీస్తేనే ఆవేశపడిపోతున్నారే! ఇంతకీ మీ హస్బెండ్ మిమ్మల్నెందుకు చంపాలనుకున్నారో చెప్పనేలేదు’’... అతడి మాటలోని విరుపు కోపం తెప్పించినా తమాయించుకుంది. ‘‘మనిషయితే ప్రాణం పోస్తాడు. అతడు మృగం కాబట్టి ప్రాణం తీయాలనుకున్నాడు. ఇన్నాళ్లూ చిత్రహింసలు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా చంపేయాలనుకున్నాడు’’... ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది మార్గరెట్. ఇక ప్రశ్నించడం ఇష్టంలేక లేచాడు ఇన్స్పెక్టర్. అప్పటికే హోటల్ మేనేజర్ని వాళ్లిద్దరి గురించి ఆరా తీశారు. ఇద్దరూ వచ్చినప్పటి నుంచీ పోట్లాడుకుంటూనే ఉన్నారని, కలిసేవున్నా అపరిచిత వ్యక్తుల్లా ప్రవర్తించేవారని చెప్పాడతను. ముందురోజు ఉదయం టిఫిన్ చేయడానికి డైనింగ్ హాల్‌కి వచ్చినప్పుడు మార్గరెట్ ముఖం మీద కమిలిన గాయాలున్నాయని, వాటిని కవర్ చేయడానికి ఆమె దట్టంగా మేకప్ వేసుకుందని రెస్టారెంటులోని సర్వర్లు చెప్పారు. దాంతో మార్గరెట్ చెప్పేదాంట్లో నిజం లేకపోలేదనిపించింది ఇన్స్పెక్టర్కి. అందుకే ఆమెను మరీ ఎక్కువ విసిగించకుండా వదిలేశాడు. ప్రిన్స్ ఫామీ బే హత్య సంచలన వార్త అయ్యింది. అందులోనూ అతడిని భార్యే చంపేయడం అందరినీ షాక్‌కి గురి చేసింది. మార్గరెట్‌కి శిక్ష పడటం ఖాయం అని నిర్ధారించేసుకున్నారంతా. అయితే కోర్టుకెళ్లాక కథ అనుకోని మలుపు తిరిగింది. దానికి కారణం... మార్గరెట్ లాయర్ ఎడ్వర్డ్ మార్షల్ హాల్. హాల్ మామూలు లాయర్ కాదు. మరణశిక్ష పడుతుందనుకున్న ఎంతోమంది ఖైదీలను శిక్షే పడకుండా తప్పించిన ఘటికుడు. అందుకే అతడిని లాయర్‌గా ఎంచుకుంది మార్గరెట్. అతడు ఆమె నమ్మకాన్ని నిలబెట్టాడు. మార్గరెట్ తన భర్తను చంపడానికి కారణాలను చూపుతూ ఎవరికీ తెలియని కొత్త కథని విన్పించాడు. ఫామీ బే పూర్తి పేరు... అలీ కెమెల్ ఫామీ బే. ఈజిప్టు రాజకుమారుడు. ఓసారి ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు అతడికి మార్గరెట్ లోరాతో పరిచయమయ్యింది. ఆమె అతడికంటే పదేళ్లు పెద్దది. అప్పటికే పెళ్లయ్యి, భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. అవేమీ ఫామీని ఆమె ప్రేమలో పడకుండా ఆపలేకపోయాయి. అతడి ప్రేమను అంగీకరించినా పెళ్లి దగ్గర మాత్రం అభ్యంతరం చెప్పింది మార్గరెట్. ముస్లిం అయిన అతడు తమ సంప్రదాయాలతో తన ఆధునికతకు, స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తాడేమోనని దిగులుపడింది. అలాంటిదేమీ జరగదని అతడు హామీ ఇచ్చాడు. ఆధునిక వస్త్రాలు వేసుకోనిస్తానని, ఆమెతోనే జీవితాంతం ఉంటానని, తేడా వస్తే ఎప్పుడైనా తనకు విడాకులిచ్చి వెళ్లిపోవచ్చని అగ్రిమెంట్ రాసిచ్చాడు. దాంతో అతడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది మార్గరెట్. అయితే ఈజిప్టు వెళ్లిన తరువాతగానీ తానో పంజరంలో ఇరుక్కుపోయిందని అర్థం కాలేదు మార్గరెట్‌కి. ఫామీ పరమ దుర్మార్గుడు. మూర్ఖుడు. శాడిస్టు. ఆమెని ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టాడు. శృంగారం పేరుతో అతడు చేసే వికృత చేష్టలతో నరకం చూసిందామె. పచ్చిపుండులా మారిన శరీరానికి వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్‌తో తన ఆవేదనను చెప్పుకుంది. అయితే ఆ విషయం తెలిసి మరింత హింసించాడు ఫామీ. తనను వదిలేయమని ప్రాధేయపడింది. అగ్రిమెంట్ ప్రకారం విడాకులు తీసుకునే హక్కు తనకుందంది. కానీ అప్పుడే తెలిసిందామెకి... అగ్రిమెంట్ విషయంలో కూడా మోసం జరిగిందని. మొదట తనకి చూపించిన కాగితాల్లో ఉన్న అంశాల్ని మార్చేసి, వేరే కాగితాల మీద ఫామీ తనతో సంతకం పెట్టించుకున్నాడని తెలిసి విస్తుపోయింది. కానీ విధిలేక మౌనంగా ఉండిపోయింది. ఆమె పారిపోతుందని భయమేసి ఒక్కదాన్నీ వదిలిపెట్టేవాడు కాదు ఫామీ. ఎక్కడికెళ్లినా తనతో పాటే తీసుకెళ్లేవాడు. లండన్‌కి కూడా అలానే తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ గొడవపడ్డారు. ఆవేశం తట్టుకోలేక అతడు తుపాకీతో కాల్చబోతే, దాన్ని లాక్కుని అతడినే ఆమె కాల్చేసింది. ‘‘యువరానర్... ప్రిన్స్ ఫామీ శాడిజానికి నా క్లయింట్ నరకం అనుభవించింది. తనలో తనే కుమిలిపోయింది. సర్దుకుపోవడానికి సైతం ప్రయత్నించింది. కానీ ఎప్పుడైతే తన భర్త స్వలింగ సంపర్కుడు అని తెలిసిందో, తన మేనేజర్‌తోనే అతడికి సంబంధం ఉండటం కళ్లారా చూసిందో... అప్పుడు తట్టుకోలేకపోయింది. నిలదీస్తే అతడు కొట్టాడు. చిత్రహింసలు పెట్టాడు. చివరకు చంపబోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం అతడిని చంపింది. దయచేసి మానవతా దృక్పథంతో మార్గరెట్‌కు న్యాయం చేయండి.’’ అని మార్షల్ హాల్ వాదించాడు. హాల్ వాదనకు కోర్టు దద్దరిల్లింది. న్యాయస్థానం మార్గరెట్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత మార్గరెట్ ఫ్రాన్స్ వెళ్లిపోయింది. జీవితమంతా ఒంటరిగానే బతికి, ఎనభయ్యేళ్ల వయసులో (1971) కన్నుమూసింది. ఆమె పోయినా, ఆమె గురించిన సందేహాలు మాత్రం అందరి మనసుల్లోనూ అలానే నిలిచిపోయాయి. మార్గరెట్ నిజంగానే నిర్దోషా, ఆమె భర్త అంత పెద్ద శాడిస్టా, ఆమెను హింసించిన అతడు నేరస్తుడా లేక అతడిని చంపిన మార్గరెట్ నేరస్తురాలా, అసలు నేరం ఎవరిది అన్న ప్రశ్నలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మార్గరెట్‌ని నిర్దోషిగా వదిలేయడం అన్యాయమన్నారు చాలామంది. దానికి కారణం మార్గరెట్ గతం. ఆమెకు చాలామందితో సంబంధాలున్నాయని, ఎంతోమందితో ప్రేమ వ్యవహారాలు నడిపిందని కొందరు సాక్ష్యాలు చూపించారు. డబ్బు మీద ఆమెకు వ్యామోహం ఎక్కువని కూడా అన్నారు. వాళ్ల మాట నిజమనే సంఘటన ఒకటి జరిగింది కూడా. విచారణకాలంలో తాను గర్భవతినని చెప్పింది మార్గరెట్. కానీ పరీక్ష చేస్తే అది అబద్ధమని తేలింది. కేవలం తన భర్త ఆస్తిలో వాటా కోసమే ఆమె అలా చేస్తోందని ఫామీ కుటుంబ సభ్యులు అన్నా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు హత్య చేసిన ఆమెకు ఆస్తి మీద ఎలాంటి హక్కూ లేదని అక్కడి చట్టాలు చెప్పడంతో సెలైంట్‌గా ఫ్రాన్స్‌కు చెక్కేసింది. ఒక్కసారి ఆమె గురించి ఆరా తీసివుంటే... ఫామీ హత్య కేసు మరో మలుపు తిరిగివుండేదని అంతా భావించారు. - సమీర నేలపూడి