నేరం ఎవరిది ?
నిజాలు దేవుడికెరుక: ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలిస్తారు ఎవరైనా. కానీ ఆమె అతడి ప్రాణం తీసింది. తమ బంధానికే కాదు, అతడి జీవితానికి కూడా ముగింపు పలికింది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమె ఎందుకలా చేసింది? భర్త ప్రాణాలు తీసేంతగా వారి మధ్య ఏం జరిగింది?
జూలై 9, 1923. లండన్‌లోని సవాయ్ హోటల్. రాత్రి ఒంటిగంట దాటింది. హాల్లో మేనేజర్ అటూ ఇటూ ఆవేశంగా తిరుగుతున్నాడు. అతడికి ఎదురుగా నిలబడి ఉన్న స్వీపర్ బిత్తర చూపులు చూస్తున్నాడు.
‘‘నీకు మొన్నే చెప్పాను... పనిలో తేడా జరిగితే ఊరుకునేది లేదని. ఇవాళ మూడో ఫ్లోర్ నువ్వసలు సరిగ్గా శుభ్రం చేయలేదు. ఎక్కడ చూసినా దుమ్మే’’... అరిచినట్టే అన్నాడు మేనేజర్.
‘‘సారీ సర్. ఏదో హడావుడిలో పొరపాటు చేశాను. రేపు జాగ్రత్తగా చేస్తాను’’ సంజాయిషీ ఇచ్చాడు స్వీపర్.
‘‘రేపు కాదు. ఇప్పుడే తుడవాలి. అసలే ఇవాళ కస్టమర్స్ చిరాకు పడ్డారు. రేపు వాళ్లు లేచేసరికి శుభ్రంగా లేకపోతే మళ్లీ మాట పడాల్సి వస్తుంది. వెళ్లు... శుభ్రంగా తుడిచేసి అప్పుడు పడుకో.’’
చిర్రెత్తుకొచ్చింది స్వీపర్‌కి. కానీ నిస్సహాయత నోరు మెదపనివ్వలేదు. మౌనంగా అక్కడ్నుంచి కదిలాడు. మూడో అంతస్తుకి చేరుకుని కారిడార్ శుభ్రం చేయడం మొదలుపెట్టాడు.
‘‘కాస్త కూడా జాలి లేదు ఈ మనిషికి. ఒంటి గంటన్నర అవుతోంది. అందరూ హాయిగా నిద్రపోతున్నారు. వీడు మాత్రం దుమ్ము, మురికి అంటూ నా వెంట పడ్డాడు. శాడిస్ట్‌గాడు’’... తిట్టుకుంటూ తుడుస్తున్నాడు. ఉన్నట్టుండి ఏవో మాటలు వినిపించడంతో పని ఆపి నిలబడ్డాడు. ఓ సూట్‌లోంచి ఆడ, మగ స్వరాలు కాస్త హెచ్చు స్థాయిలో వినిపిస్తున్నాయి.
‘‘నాకు చిరాకు తెప్పించకు. నోర్మూసుకుని పడుకో’’... అరుస్తున్నాడతను.
‘‘నోరు మూసుకోవాల్సింది నువ్వా నేనా? నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్? హింసించి చంపుదామనా?’’... అంతకంటే గట్టిగా అరుస్తోందామె.
తలుపు కాస్త తెరిచి ఉండటంతో మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. స్వీపర్ నవ్వుకున్నాడు. ‘‘ఉన్నోళ్లయినా లేనోళ్లయినా మొగుడూపెళ్లాలంటే కొట్టుకోవాల్సిందేనన్నమాట’’ అనుకుంటూ మళ్లీ తన పనిలో పడ్డాడు. రెండు నిమిషాలు గడిచాయో లేదో... తుపాకీ పేలిన శబ్దం వినిపించి అదిరిపడ్డాడు. ఒక్కసారి కాదు... మూడుసార్లు వెంటవెంటనే పేలింది తుపాకీ.
గబగబా ఆ గది దగ్గరకు పరిగెత్తాడు స్వీపర్. తలుపు తోసుకుని లోనికెళ్లాడు. నేలమీద పడివున్నాడా వ్యక్తి. తుపాకీ గుళ్లు ఒంటిని చీల్చడంతో రక్తం ఎగజిమ్మి అన్నిటిమీదా పడింది.
గాయాల నుంచి రక్తం ఉబికి వస్తోంది. చేతిలో తుపాకీతో అతడి దేహం పక్కన కూర్చుని ఉందామె. ‘‘దేవుడా... ఇంత ఘోరం ఎలా చేశాను’’ అంటూ పిచ్చిగా అరుస్తూ ఏడుస్తోంది. క్షణంసేపు కొయ్యబారిపోయాడు స్వీపర్. తర్వాత తేరుకుని, పరుగున వెళ్లి విషయాన్ని మేనేజర్ చెవిన వేశాడు. అతడు వెంటనే పోలీసులకు కబురందించాడు. కొద్ది నిమిషాల్లో పోలీసులు హోటల్‌కి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో పడివున్న వ్యక్తిని చూసి షాక్ తిన్నారు. ‘‘ఇతడు ఫామీ బే కదూ’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ మృతదేహాన్ని చూస్తూ. అవునన్నట్టు తలూపాడు మేనేజర్. పోలీసులు ఫామీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి అతడి భార్యని అదుపులోకి తీసుకున్నారు. తెల్లారేసరికల్లా... ఈజిప్టు యువరాజు ఫామీ బేని, అతడి భార్య మార్గరెట్ చంపేసిందన్న వార్త దావానలంలా వ్యాపించింది!
‘‘మీ భర్తని ఎందుకు చంపారు?’’
తల దించుకుని, మౌనంగా కూర్చునివున్న మార్గరెట్‌ని అడిగాడు ఇన్‌స్పెక్టర్.
‘‘నేను తనని చంపకపోతే, తను నన్ను చంపేసేవాడు సర్. ఆత్మరక్షణ కోసం అనుకోకుండా కాల్చాను తప్ప తనని చంపాలన్న ఉద్దేశం నాకు లేదు.’’
‘‘మీ భర్త మిమ్మల్ని ఎందుకు చంపుతాడు? మమ్మల్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారా?’’
చివ్వున తలెత్తి చూసింది మార్గరెట్. క్షణాల్లో ఆమె ముఖం ఎర్రబడింది.
‘‘అలాంటిదాన్నే అయితే అందరికీ తెలిసేలా చంపివుండేదాన్ని కాదు కదా. దానికి వేరే మార్గం ఎంచుకుని, ఎవరికీ దొరక్కుండా తప్పించుకుని ఉండేదాన్ని’’... ఆవేశంగా అంది.
‘‘కూల్ మిసెస్ ఫామీ... ఆరా తీస్తేనే ఆవేశపడిపోతున్నారే! ఇంతకీ మీ హస్బెండ్ మిమ్మల్నెందుకు చంపాలనుకున్నారో చెప్పనేలేదు’’... అతడి మాటలోని విరుపు కోపం తెప్పించినా తమాయించుకుంది.
‘‘మనిషయితే ప్రాణం పోస్తాడు. అతడు మృగం కాబట్టి ప్రాణం తీయాలనుకున్నాడు. ఇన్నాళ్లూ చిత్రహింసలు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా చంపేయాలనుకున్నాడు’’... ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది మార్గరెట్. ఇక ప్రశ్నించడం ఇష్టంలేక లేచాడు ఇన్‌స్పెక్టర్.
అప్పటికే హోటల్ మేనేజర్‌ని వాళ్లిద్దరి గురించి ఆరా తీశారు. ఇద్దరూ వచ్చినప్పటి నుంచీ పోట్లాడుకుంటూనే ఉన్నారని, కలిసేవున్నా అపరిచిత వ్యక్తుల్లా ప్రవర్తించేవారని చెప్పాడతను. ముందురోజు ఉదయం టిఫిన్ చేయడానికి డైనింగ్ హాల్‌కి వచ్చినప్పుడు మార్గరెట్ ముఖం మీద కమిలిన గాయాలున్నాయని, వాటిని కవర్ చేయడానికి ఆమె దట్టంగా మేకప్ వేసుకుందని రెస్టారెంటులోని సర్వర్లు చెప్పారు. దాంతో మార్గరెట్ చెప్పేదాంట్లో నిజం లేకపోలేదనిపించింది ఇన్‌స్పెక్టర్‌కి. అందుకే ఆమెను మరీ ఎక్కువ విసిగించకుండా వదిలేశాడు.
ప్రిన్స్ ఫామీ బే హత్య సంచలన వార్త అయ్యింది. అందులోనూ అతడిని భార్యే చంపేయడం అందరినీ షాక్‌కి గురి చేసింది. మార్గరెట్‌కి శిక్ష పడటం ఖాయం అని నిర్ధారించేసుకున్నారంతా. అయితే కోర్టుకెళ్లాక కథ అనుకోని మలుపు తిరిగింది. దానికి కారణం... మార్గరెట్ లాయర్ ఎడ్వర్డ్ మార్షల్ హాల్. హాల్ మామూలు లాయర్ కాదు. మరణశిక్ష పడుతుందనుకున్న ఎంతోమంది ఖైదీలను శిక్షే పడకుండా తప్పించిన ఘటికుడు. అందుకే అతడిని లాయర్‌గా ఎంచుకుంది మార్గరెట్. అతడు ఆమె నమ్మకాన్ని నిలబెట్టాడు. మార్గరెట్ తన భర్తను చంపడానికి కారణాలను చూపుతూ ఎవరికీ తెలియని కొత్త కథని విన్పించాడు.
ఫామీ బే పూర్తి పేరు... అలీ కెమెల్ ఫామీ బే. ఈజిప్టు రాజకుమారుడు. ఓసారి ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు అతడికి మార్గరెట్ లోరాతో పరిచయమయ్యింది. ఆమె అతడికంటే పదేళ్లు పెద్దది. అప్పటికే పెళ్లయ్యి, భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. అవేమీ ఫామీని ఆమె ప్రేమలో పడకుండా ఆపలేకపోయాయి. అతడి ప్రేమను అంగీకరించినా పెళ్లి దగ్గర మాత్రం అభ్యంతరం చెప్పింది మార్గరెట్. ముస్లిం అయిన అతడు తమ సంప్రదాయాలతో తన ఆధునికతకు, స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తాడేమోనని దిగులుపడింది. అలాంటిదేమీ జరగదని అతడు హామీ ఇచ్చాడు. ఆధునిక వస్త్రాలు వేసుకోనిస్తానని, ఆమెతోనే జీవితాంతం ఉంటానని, తేడా వస్తే ఎప్పుడైనా తనకు విడాకులిచ్చి వెళ్లిపోవచ్చని అగ్రిమెంట్ రాసిచ్చాడు. దాంతో అతడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది మార్గరెట్.
అయితే ఈజిప్టు వెళ్లిన తరువాతగానీ తానో పంజరంలో ఇరుక్కుపోయిందని అర్థం కాలేదు మార్గరెట్‌కి. ఫామీ పరమ దుర్మార్గుడు. మూర్ఖుడు. శాడిస్టు. ఆమెని ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టాడు. శృంగారం పేరుతో అతడు చేసే వికృత చేష్టలతో నరకం చూసిందామె. పచ్చిపుండులా మారిన శరీరానికి వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్‌తో తన ఆవేదనను చెప్పుకుంది. అయితే ఆ విషయం తెలిసి మరింత హింసించాడు ఫామీ. తనను వదిలేయమని ప్రాధేయపడింది. అగ్రిమెంట్ ప్రకారం విడాకులు తీసుకునే హక్కు తనకుందంది. కానీ అప్పుడే తెలిసిందామెకి... అగ్రిమెంట్ విషయంలో కూడా మోసం జరిగిందని. మొదట తనకి చూపించిన కాగితాల్లో ఉన్న అంశాల్ని మార్చేసి, వేరే కాగితాల మీద ఫామీ తనతో సంతకం పెట్టించుకున్నాడని తెలిసి విస్తుపోయింది. కానీ విధిలేక మౌనంగా ఉండిపోయింది. ఆమె పారిపోతుందని భయమేసి ఒక్కదాన్నీ వదిలిపెట్టేవాడు కాదు ఫామీ. ఎక్కడికెళ్లినా తనతో పాటే తీసుకెళ్లేవాడు. లండన్‌కి కూడా అలానే తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ గొడవపడ్డారు. ఆవేశం తట్టుకోలేక అతడు తుపాకీతో కాల్చబోతే, దాన్ని లాక్కుని అతడినే ఆమె కాల్చేసింది.
‘‘యువరానర్... ప్రిన్స్ ఫామీ శాడిజానికి నా క్లయింట్ నరకం అనుభవించింది. తనలో తనే కుమిలిపోయింది. సర్దుకుపోవడానికి సైతం ప్రయత్నించింది. కానీ ఎప్పుడైతే తన భర్త స్వలింగ సంపర్కుడు అని తెలిసిందో, తన మేనేజర్‌తోనే అతడికి సంబంధం ఉండటం కళ్లారా చూసిందో... అప్పుడు తట్టుకోలేకపోయింది. నిలదీస్తే అతడు కొట్టాడు. చిత్రహింసలు పెట్టాడు. చివరకు చంపబోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం అతడిని చంపింది. దయచేసి మానవతా దృక్పథంతో మార్గరెట్‌కు న్యాయం చేయండి.’’ అని మార్షల్ హాల్ వాదించాడు.
హాల్ వాదనకు కోర్టు దద్దరిల్లింది. న్యాయస్థానం మార్గరెట్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత మార్గరెట్ ఫ్రాన్స్ వెళ్లిపోయింది. జీవితమంతా ఒంటరిగానే బతికి, ఎనభయ్యేళ్ల వయసులో (1971) కన్నుమూసింది. ఆమె పోయినా, ఆమె గురించిన సందేహాలు మాత్రం అందరి మనసుల్లోనూ అలానే నిలిచిపోయాయి. మార్గరెట్ నిజంగానే నిర్దోషా, ఆమె భర్త అంత పెద్ద శాడిస్టా, ఆమెను హింసించిన అతడు నేరస్తుడా లేక అతడిని చంపిన మార్గరెట్ నేరస్తురాలా, అసలు నేరం ఎవరిది అన్న ప్రశ్నలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
మార్గరెట్‌ని నిర్దోషిగా వదిలేయడం అన్యాయమన్నారు చాలామంది. దానికి కారణం మార్గరెట్ గతం. ఆమెకు చాలామందితో సంబంధాలున్నాయని, ఎంతోమందితో ప్రేమ వ్యవహారాలు నడిపిందని కొందరు సాక్ష్యాలు చూపించారు. డబ్బు మీద ఆమెకు వ్యామోహం ఎక్కువని కూడా అన్నారు. వాళ్ల మాట నిజమనే సంఘటన ఒకటి జరిగింది కూడా. విచారణకాలంలో తాను గర్భవతినని చెప్పింది మార్గరెట్. కానీ పరీక్ష చేస్తే అది అబద్ధమని తేలింది. కేవలం తన భర్త ఆస్తిలో వాటా కోసమే ఆమె అలా చేస్తోందని ఫామీ కుటుంబ సభ్యులు అన్నా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు హత్య చేసిన ఆమెకు ఆస్తి మీద ఎలాంటి హక్కూ లేదని అక్కడి చట్టాలు చెప్పడంతో సెలైంట్‌గా ఫ్రాన్స్‌కు చెక్కేసింది. ఒక్కసారి ఆమె గురించి ఆరా తీసివుంటే... ఫామీ హత్య కేసు మరో మలుపు తిరిగివుండేదని అంతా భావించారు.
- సమీర నేలపూడి