sameera nelapudi
-
మనసు లేని మనిషి
క్రైమ్ ఫైల్ ‘‘ఇదే సర్ ఇల్లు’’... కారు దిగుతూనే అన్నాడు కెల్విన్. ‘‘ఊ... పదండి’’ అన్నాడు ఇన్స్పెక్టర్. అందరూ మెయిన్ డోర్ వైపు నడిచారు. కాలింగ్ బెల్ కొడితే క్షణాల్లో తలుపు తెరచుకుంది. ‘‘ఎస్... ఏం కావాలి?’’ అన్నాడు తలుపు తెరిచిన వ్యక్తి, అందరినీ తేరిపార చూస్తూ. మాట్లాడలేదు ఇన్స్పెక్టర్. జేబులోంచి ఐడీ కార్డు మాత్రం తీసి చూపించాడు. దాన్ని చూస్తూనే... ‘‘ఓహ్... రండి లోపలికి. ఏంటిలా వచ్చారు?’’ అన్నాడతను అందంగా నవ్వుతూ. ‘‘స్టాసీ కనిపించడం లేదని వాళ్ల అక్కయ్య కంప్లయింట్ ఇచ్చారు. ఎంక్వయిరీకి వచ్చాం మిస్టర్ పీటర్సన్.’’ అతను నవ్వాడు. ‘‘అనుకున్నాను ఇలాంటిదేదో జరుగు తుందని. కానీ మీరనుకున్నట్టు, మీకు అందిన కంప్లయింట్లో ఉన్నట్టు తను కనిపించకుండా పోలేదు. వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. అది తెలియక అందరూ స్టాసీ మిస్ అయ్యిందనుకుంటున్నారు.’’ ‘‘మీ భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందా? మరి మీరింత ఆనందంగా ఉన్నారేంటి?’’ అన్నాడు ఇన్స్పెక్టర్ తీక్షణంగా చూస్తూ. ‘‘నన్ను కాదనుకుని వెళ్లిపోయినవాళ్ల గురించి ఏడుస్తూ కూర్చోవడంలో అర్థం లేదు. ఎంతో ప్రేమించాను. వంచించి పోయింది. తన ఆనందం తాను వెతుక్కుంది. మరి నా ఆనందాన్ని నేనెందుకు చంపేసుకోవాలి?’’ ఇన్స్పెక్టర్ కనుబొమలు పైకి లేచాయి. ‘‘మీ యాటిట్యూడ్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉందే! కానీ, స్టాసీ వేరే వ్యక్తితో వెళ్లిపోయిందంటూ మీరు చెబుతున్నది నేనెలా నమ్మాలి?’’ వెంటనే టీపాయ్ మీద ఉన్న తన మొబైల్ అందుకున్నాడతను. టకటకా మెసేజులన్నీ చెక్ చేశాడు. ఒక మెసేజ్ ఓపెన్ చేసి ఇన్స్పెక్టర్కి అందించాడు. ‘‘చూడండి... మీకే తెలుస్తుంది’’ అన్నాడు. ఇన్స్పెక్టర్ ఆ మెసేజ్ చదివాడు. ‘‘సారీ డియర్... నేను వెళ్లి పోతున్నాను. నా మనసు నాకు తెలియ కుండానే వేరే వ్యక్తి వైపు మళ్లింది. అతని తోనే నాకు ఆనందం ఉందనిపిస్తోంది. అందుకే నీతో బంధాన్ని తెంచేసుకుంటు న్నాను. సారీ అండ్ బై... స్టాసీ.’’ అర్థమైందన్నట్టు తలూపాడు ఇన్స్పెక్టర్. ‘‘మీరివాళ ఓసారి స్టేషన్‌కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. కేసు క్లోజ్ చేస్తాం’’ అనేసి తన టీమ్‌తో పాటు వెనుదిరిగాడు. కారు ఎక్కుతుంటే అసిస్టెంట్ కెల్విన్ అన్నాడు... ‘‘నాకెందుకో అనుమానంగా ఉంది సర్. మూడేళ్ల క్రితం ఈయన భార్య క్యాథలీన్ సావియో బాత్ టబ్‌లో మునిగి మరణించింది. ప్రమాద వశాత్తూ మరణించిందని కేసు క్లోజ్ చేశారు. ఇప్పుడు మరో భార్య కనిపించ కుండా పోయింది. ఇందులో అనుమానించాల్సిందేమీ లేదంటారా?’’ అప్పటికే ఇన్స్పెక్టర్ బుర్ర పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఎక్కడో ఏదో ముడి ఉంది. అది విడితే కానీ అన్ని విషయాలూ బయటకు రావు. అందుకే ముందు దాన్ని విప్పే ప్రయత్నంలో పడ్డాడతను. ‘‘ఏంటి సర్ మళ్లీ వచ్చారు? ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాను కదా?’’... పొద్దున్నే వచ్చిన పోలీసులను చూసి అదే నవ్వు ముఖంతో అన్నాడు పీటర్సన్. ‘‘మీరివ్వాల్సిన స్టేట్మెంట్స్ ఇంకా ఉన్నాయి మిస్టర్ పీటర్సన్. పదండి స్టేషన్‌కి’’ అన్నాడు చేతులకు బేడీలు వేస్తూ. ‘‘ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పానుగా స్టాసీ ఎవరితోనో వెళ్లిపోయిందని. తను ఇచ్చిన మెసేజ్ కూడా చూపించాను. ఇంకేం సాక్ష్యాలు కావాలి మీకు?’’ అన్నాడు ఆవేశంగా. ‘‘నిజమైన సాక్ష్యానికీ సృష్టించిన సాక్ష్యానికీ తేడాలు ఆమాత్రం తెలియవా? మీరూ ఒకప్పుడు పోలీసేగా... ఇలాంటి వెన్ని చూసుంటారు మీరు? అయినా నేను వచ్చింది స్టాసీ కేసు గురించి కాదు. మీ భార్య క్యాథలీన్ సావియోని హత్య చేసినందుకు అరెస్ట్ చేయడానికి.’’ ఇన్స్పెక్టర్ మాట వింటూనే పీటర్సన్ ముఖం పాలిపోయింది. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మౌనంగా వారి వెంట నడిచాడు. ఫిబ్రవరి 21, 2013... అమెరికాలోని ఇలినాయిస్... ‘‘తన మూడో భార్య క్యాథలీన్ సావియోని హత్య చేసినందుకు డ్రూ పీటర్సన్‌కి ముప్ఫై ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.’’ తీర్పు వింటూనే అవాక్కయి పోయాడు పీటర్సన్. అన్నాళ్లూ ఉన్న కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా ఎగిరిపోయింది. బిత్తర చూపులు చూశాడు. ఇలా జరిగిం దేమిటి అన్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు. అతని దగ్గరకు వచ్చాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎప్పటికీ దొరకననుకున్నారు కదా మిస్టర్ పీటర్సన్. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడొకడు ఉంటాడు. ఇక వెళ్దామా?’’ అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వులో విజయగర్వం ఉంది. దాన్ని చూసి తల దించుకున్నాడు పీటర్సన్. అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో క్లోజ్ అయిపోయిన కేసు మళ్లీ ఎలా తెరచుకుంది? తనకిప్పుడు శిక్ష ఎలా పడింది? ఏమీ అర్థం కావడం లేదతనికి. ఎందుకంటే ఆ రోజు తన ఇంటి నుంచి వెళ్లాక ఇన్స్పెక్టర్ ఏం చేశాడో, ఎన్ని రహస్యాలను బయటికి లాగాడో అతడికి తెలియదు కాబట్టి! ఎప్పుడైతే పీటర్సన్ భార్య క్యాథలీన్ మరణం గురించి కెల్విన్ గుర్తు చేశాడో... అప్పుడే వెయ్యి సందేహాలు తలెత్తాయి ఇన్స్పెక్టర్ మనసులో. వెంటనే డ్రూ పీటర్సన్ జీవిత పుస్తకంలోని ప్రతి పుటనీ, ఆ పుటల్లోని ప్రతి అక్షరాన్నీ క్షుణ్నంగా చదవడం మొదలెట్టాడు. పీటర్సన్ చరిత్ర ఇన్స్పెక్టర్కి సరైన దారి చూపించింది. 1954, జనవరి 5న పుట్టాడు డ్రూ పీటర్సన్. చిన్నప్పట్నుంచీ పోలీసు యూనిఫామ్ అంటే పిచ్చి. అందుకే పట్టుబట్టి పోలీసయ్యాడు. అయితే నిజాయతీపరుడైన పోలీస్ కాలేదు. యూనిఫామ్ ముసుగులో అవినీతికి పాల్పడ్డాడు. చివరికి పై అధికారుల కంటికి చిక్కి డిస్మిస్ అయ్యాడు. ఇదంతా ఒకెత్తు. అతడి వ్యక్తిగత జీవితం మరొకెత్తు. పీటర్సన్ మొదట్నుంచీ ఆడపిల్లల విషయంలో చాలా వీక్. పోలీస్ ట్రెయినింగ్ సమయంలోనే హైస్కూల్లో తన సహ విద్యార్థిని అయిన క్యారెల్ను పెళ్లాడాడు. కానీ నాలుగేళ్లలోనే వారి బంధం సడలిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత విక్టోరియాని పెళ్లాడాడు పీటర్సన్. ఓ పక్క ఆమెతో కాపురం చేస్తూనే క్యాథలీన్ సావియోతో ప్రేమాయణం మొదలెట్టాడు. అది తెలిసి విక్టోరియా వేరుపడిపోయింది. దాంతో క్యాథలీన్ని తన అర్ధాంగినిగా చేసుకున్నాడు. కానీ ఆ బంధమూ బలంగా లేదు. పీటర్సన్ తనను తరచుగా వేధిస్తున్నాడంటూ క్యాథలీన్ పలుమార్లు పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చింది. కానీ తన పలుకుబడితో వాటిని బుట్టదాఖలు చేయించాడు పీటర్సన్. చివరికి 2004, ఏప్రిల్ నెలలో ఓ రోజు బాత్‌టబ్‌లో శవమై తేలింది క్యాథలీన్. కానీ ఆ సమయంలో పీటర్సన్ ఇంట్లో లేడని ఎలిబీ ఉండటంతో ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా తేల్చి కేసు క్లోజ్ చేశారు. ఆ తర్వాత తనకంటే ముప్ఫ య్యేళ్లకు పైగా చిన్నదైన స్టాసీ యాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2007లో ఓరోజు తన అక్క ఇంటికని బయలుదేరిన స్టాసీ మాయమైపోయింది. చెల్లెలు ఎంతకీ రాకపోవడంతో పీటర్సన్‌కి ఫోన్ చేసిందామె. అతడు చెప్పిన పొంతన లేని సమాధానాలకు సందేహాలు తలెత్తి, పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం పీటర్సన్ జీవితాన్ని తిరగ తోడారు. ‘‘నేనేదో సందేహంతో మామూలుగా అన్నాను. కానీ మీరు అంత కచ్చితంగా పీటర్సన్ని నేరస్తుడిగా ఎలా నిరూ పించారు సర్?’’... అడిగాడు కెల్విన్. సబార్డినేట్ ఉత్సుకతను చూసి నవ్వు కున్నాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎంత పెద్ద నేరస్తుడైనా ఒక్కోసారి చిన్న తప్పు చేసి దొరికిపోతాడు కెల్విన్. పీటర్సన్ కూడా అదే చేశాడు. ఇంటి నుంచి వెళ్లిన రోజు రాత్రి తొమ్మిది గంటలకు స్టాసీ తనకు మెసేజ్ ఇచ్చిందంటూ చూపించాడు కదా! ఆ మెసేజ్ చివర్లో స్టాసీ అని రాసివుంది. ఏ భార్య అయినా తన భర్తకు మెసేజ్ ఇస్తూ చివర్లో తన పేరు రాసుకుంటుందా? అంత అవసరం ఉంటుందా? తన భర్తకి తన నంబర్ తెలియదా?’’ ‘‘నిజమే సర్. నాకిది తట్టనే లేదు’’ అన్నాడు కెల్విన్ ఆశ్చర్యపోతూ. ‘‘అక్కడికీ ఆమె వేరే ఎవరి నంబర్ నుంచైనా మెసేజ్ పెట్టిందేమోనని ఆ నంబర్ స్టాసీదేనా అని కూడా అడిగాను పీటర్సన్ని. అతడు అవునని చెప్పాడు. దాంతో నా అనుమానం బలపడింది. కచ్చితంగా ఏదో నంబర్ నుంచి ఆ మెసేజ్ తన ఫోన్‌కి పీటర్సనే ఇచ్చుకున్నాడని అనిపించింది. మనం నమ్మమేమోనని భయమేసి కింద స్టాసీ పేరు పెట్టాడు. అడ్డంగా దొరికిపోయాడు. దానికి తోడు నువ్వు క్యాథలీన్ని గుర్తు చేశావ్. ఆ కేసు నేను రహస్యంగా రీ ఓపెన్ చేశాను. చని పోయినప్పుడు క్యాథలీన్ నగ్నంగా ఉంది. అంటే స్నాన ం చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయిందని మనం అనుకోవాలని అలా ప్లాన్ చేశాడు. కానీ ఆమె ఒంటిమీద దెబ్బలున్నాయని పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో ఉంది. ఆ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేశాడు. అలాగే భర్త హింసిస్తున్నా డంటూ క్యాథలీన్ ఇచ్చిన కంప్లయింట్లన్నీ నా విచారణలో దొరికాయి. అలా ఓ చిన్న తీగ మొత్తం డొంకని కదిలించింది.’’ ‘‘మీరు గ్రేట్ సర్. మూసేసిన కేసును తెరిచి మరీ ఛేదించారు.’’ తల అడ్డంగా ఊపాడు ఇన్స్పెక్టర్. ‘‘లేదు కెల్విన్. నేను ఇంకా గెలవలేదు. స్టాసీ జాడ తెలియట్లేదు. ఆమె ప్రాణాలతో ఉందా? లేక ఆమె కూడా క్యాథలీన్లాగే పీటర్సన్ పైశాచికత్వానికి బలైందా? అది తెలిసినప్పుడే నేను నిజంగా గెలిచినట్టు.’’ ఇన్స్పెక్టర్ ఈ మాట అని రెండేళ్లయ్యింది. కానీ ఇప్పటికీ అతను గెలవలేదు. ఎందుకంటే... నేటికీ స్టాసీ జాడ తెలియలేదు! - సమీర నేలపూడి -
ప్రేమించింది... కానీ..!
క్రైమ్ ఫైల్ అక్టోబర్ 12, 2012... కెంటకీ (యు.ఎస్.)... రాత్రి 8:53 అయ్యింది. పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఫోన్ రింగవుతోంది. ‘‘ఏయ్ సూజీ... ఫోన్ తియ్యి’’ అన్నాడు రోనాల్డ్. ‘‘షటప్ రోనీ... పొద్దుట్నుంచీ ఎన్ని ఫోన్లు అటెండ్ అయ్యానో తెలుసా? మాట్లాడి మాట్లాడి మాట పడిపోయేలా ఉంది. రెండు వారాల నుంచి సెలవు అడుగుతుంటే ఇవ్వట్లేదు. ఇంకో రెండు రోజులు ఇలాగే పని చేస్తే ఇక నా ఇంట్లో పార్టులేవీ పని చేయవు’’... అంది సూజీ గుడ్లు తేలేస్తూ. నవ్వాడు రోనాల్ట్. ‘‘నువ్వెప్పుడూ ఇంతే. నేను చూస్తాను ఉండు’’ అంటూ ఫోన్ దగ్గరకు వెళ్లబోయాడు. ఆగు అన్నట్టు చేయి చాపింది సూజీ. ‘‘ఎందుకు... నా పని కూడా నువ్వే చేస్తున్నావని బిల్డప్ ఇద్దామనా? నేనే చూస్తాలే’’ అంటూ ఫోన్ తీసింది. అవతలి నుంచి ఓ ఆడగొంతు. ‘‘మేడమ్... మేడమ్... నా పేరు షయానా. నేను... నేను...’’ ‘‘ఏం జరిగింది? ఎందుకలా కంగారు పడుతున్నారు? చెప్పండి’’ అంది సూజీ కాల్ రికార్డర్ ఆన్ చేస్తూ. ‘‘నేను... నేను నా బాయ్‌ఫ్రెండ్ ర్యాన్ని చంపేశాను’’... వణుకుతున్న గొంతుతో అందామె. ‘‘ఏంటీ... చంపేశారా?’’ ‘‘అవును. తను నన్ను చంపబోయాడు. నన్ను నేను కాపాడుకునే ప్రయత్నంలో నేనే తనని చంపేశాను. వెంటనే రండి’’ అంటూ గబగబా అడ్రస్ చెప్పి, మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసిందామె. ‘‘రోనీ... కాండో హైల్యాండ్ హైట్స్‌లో మర్డర్ జరిగిందట. సర్కి ఇన్ఫామ్ చెయ్యి’’ అరిచినట్టే చెప్పింది సూజీ. సరే అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు రోనాల్డ్. విషయాన్ని అధికారుల చెవిన వేశాడు. వాళ్లు హుటాహుటిన బయలుదేరారు. అరగంట తిరేగసరికల్లా హైల్యాండ్ హైట్స్‌లో ఉన్నారు. ఆ ఇంట్లో అడుగు పెడుతుంటే రక్తపు వాసన గుప్పుమంది. అందరూ ఖర్చీఫులు తీసుకుని ముక్కులు మూసుకున్నారు. ‘‘షయానా... షయానా’’... పిలిచాడు ఇన్స్పెక్టర్. ‘‘ఇక్కడున్నాను సర్’’ అంది దుఃఖంతో పూడుకుపోయిన ఓ గొంతు. ఆ స్వరం వినిపించిన వైపు చూశారంతా. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంది షయానా. పోలీసులను చూస్తూనే మెల్లగా లేచి నిలబడింది. అందరూ అటువైపు నడిచారు. అక్కడ... డైనింగ్ టేబుల్ పక్కనే... రక్తపు మడుగులో పడివున్నాడు ర్యాన్ పోస్టన్. తుపాకీ గుండు దూసుకు వెళ్లిన గుర్తు నుదుటిపై స్పష్టంగా కనిపిస్తోంది. ఛాతిమీద మూడు చోట్ల బుల్లెట్లు చేసిన గాయాలు ఉన్నాయి. వాటిలోంచి రక్తం ఉబికి వస్తోంది. ‘‘ఓ గాడ్... ఎలా జరిగింది?’’... అన్నాడు ఇన్స్పెక్టర్. అతడలా అడగడంతోనే బావురుమంది షయానా. ‘‘ఇదంతా నా వల్లే జరిగింది సర్. ఈ దారుణం చేసింది నేనే. నేనే నా ర్యాన్ని చంపేసుకున్నాను’’ అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది షయానా. లేడీ అసిస్టెంట్ వైపు చూసి సైగ చేశాడు ఇన్స్పెక్టర్. ఆమె వెళ్లి షయానాను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ఆమె తేరుకున్న తర్వాత అడిగాడు ఇన్స్పెక్టర్... ‘‘అసలేం జరిగిందో చెబుతారా?’’ ‘‘ర్యాన్, నేను ప్రేమించుకున్నాం సర్. కొన్నాళ్లుగా కలిసే ఉంటున్నాం. తను నా ప్రాణం. తనూ నన్ను ప్రాణంలాగే చూసుకునేవాడు. కానీ ఏమయ్యిందో ఏమో... ఈ మధ్య తనలో మార్పు వచ్చింది. నన్ను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు. ఏదైనా అడిగితే తిడతాడు, కొడతాడు. అన్నీ భరించాను. కానీ రాత్రి ఏకంగా చంపడానికే వచ్చాడు. తుపాకి గురిపెట్టాడు. నన్ను చంపొద్దని చేతులు పట్టుకున్నాను. అయినా వినలేదు. మీదకు రాబోయాడు. దాంతో తన చేతిలోని తుపాకీ లాక్కున్నాను. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆవేశంలో కాల్చేశాను’’... ఏడుస్తూ చెప్పింది. ‘‘ఊ... ఆత్మరక్షణ కోసం చేసినా నేరం నేరమే కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. దయచేసి మాతో రండి’’ అన్నాడు ఇన్స్పెక్టర్. సరేనంది షయానా. మరుక్షణం ఆమె చేతికి బేడీలు పడ్డాయి. క్యాంప్‌బెల్ కౌంటీ కోర్ట్... ‘‘నా క్లయింట్ నేరస్తురాలిగా బోనులో నిలబడివుంది. కానీ నిజానికి తను బాధితురాలు. ర్యాన్ పోర్టన్ కోసం తన జీవితాన్నే ఇచ్చేసింది. కానీ అతనామెను చిత్రహింసలు పెట్టాడు. వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఈమెను వదిలించుకోవడం కోసం ఏకంగా చంపేయాలని చూశాడు. అతన్నుంచి తనను తాను కాపాడుకోవడానికే నా క్లయింట్ అతణ్ని కాల్చింది తప్ప కోపంతోనే, చంపాలన్న ఉద్దేశంతోనో కాదు. కాబట్టి తనని క్షమించి వదిలి పెట్టమని...’’ ‘‘నో’’.... ఒక్కసారిగా కోర్టు దద్దరిల్లింది. ఆవేశంగా వాదిస్తోన్న లాయర్ మాట్లాడ్డం ఆపి అయోమయంగా చూశాడు. అందరి దృష్టీ ఆ అరుపు వచ్చిన వైపు పడింది. కోర్టు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు ఓ వ్యక్తి. యాభయ్యేళ్ల వరకూ ఉంటుంది వయసు. పుష్టిగా, పొడవుగా ఉన్నాడు. ముఖంలో కోపం. కళ్ల నిండా నీళ్లు. ‘‘లాయర్ వాదిస్తున్నప్పుడు మధ్యలో మాట్లాడటం తప్పు. మొదటిసారి కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఎవరు మీరు? ఏదైనా చెప్పాలా?’’... అడిగాడు జడ్జి. ‘‘చెప్పాలి సర్. చాలా చెప్పాలి. చాలా చాలా నిజాలు చెప్పాలి. దయచేసి నాకు అనుమతినివ్వండి’’ అన్నాడా వ్యక్తి ఆవేశంగా. చెప్పమన్నట్టు సైగ చేశాడు జడ్జి. ఆ వ్యక్తి ముందుకు వచ్చాడు. ‘‘నా పేరు జే పోర్టన్ సర్. చనిపోయిన ర్యాన్‌కి కన్నతండ్రిని.’’ ఆశ్చర్యంగా చూశాడు జడ్జి. ‘‘మీరు తన కన్నతండ్రా? మరి ఇందాక తండ్రినని చెప్పిన వ్యక్తి ఎవరు?’’ ‘‘ఆయన తన స్టెప్ ఫాదర్ సర్. నా భార్యా నేనూ విడిపోయాం. తను వేరే పెళ్లి చేసుకుంది. కానీ ర్యాన్ మాత్రం నా బిడ్డే. నేను విదేశాలకు వెళ్లాను. అందుకే ఇప్పటి వరకూ కోర్టుకు రాలేకపోయాను. ఇవాళ ఫైనల్ హియరింగ్ అని వచ్చాను. కేసు ఇలా తప్పుడు దారిలో వెళ్తోందని తెలిస్తే ఎప్పుడో వచ్చేవాడిని.’’ ‘‘అంటే మీ ఉద్దేశం?’’ కళ్లొత్తుకున్నాడు జే. ‘‘నా బిడ్డ మరణానికి కారణం నాకు తెలుసు సర్. ఆ కారణం ఎవరో కాదు... ఇదిగో, ఈ అమ్మాయే... షయానా. నా కొడుకు జీవితంలోకి తుఫానులా వచ్చింది. అల్లకల్లోలాన్ని సృష్టించింది. చివరికి వాడినే మింగేసింది. తనని వదలొద్దు సర్. నా కొడుకును నాకు దూరం చేసిన ఈ పిల్లని వదలొద్దు.’’ జే అరుపులతో కోర్టు హాలు దద్దరిల్లింది. కేసు చివరకు వచ్చేసింది. ఆత్మ రక్షణ కోసం షయానా తన బాయ్‌ఫ్రెండ్‌ని చంపిందని దాదాపు నిరూపించేశాడు ఆమె తరఫు లాయర్. కానీ ఇదేంటి? ఇప్పుడిలా కొత్త వెర్షన్ చెప్తున్నాడీయన? అందరి బుర్రల్లోనూ ఇదే ప్రశ్న. జడ్జిలో కూడా. ‘‘ఏమంటున్నారు మిస్టర్ జే? కాస్త వివరంగా చెప్తారా?’’ అన్నాడు న్యాయమూర్తి. ‘‘చెప్తాను సర్. ఈమెను నా కొడుకు ప్రేమించిన మాట నిజమే. కానీ ఈమె ఓ మూర్ఖురాలు. ర్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. అందుకే తనని వదిలించుకోవా లనుకున్నాడు ర్యాన్. అది వీలుకాక చాలా ఇబ్బంది పడ్డాడు. నాతో ఫోన్లో చెప్పి బాధపడ్డాడు. సరే, ఏదో ఒకటి చేద్దామని నేను అనుకునేలోపు ఏకంగా తనే వెళ్లిపో యాడు. వాడు ఓ ఆడపిల్లని హింసించేంత దుర్మార్గుడు కాదు సర్. న్యాయాన్ని కాపాడాలని న్యాయశాస్త్రం చదివాడు. వాడికి అన్యాయం జరగనివ్వకండి ప్లీజ్. ’’ కథ కొత్త మలుపు తిరిగింది. అందరి మనసుల్లోనూ షయానా మీద బోలెడు అనుమానాలు మొదలయ్యాయి. దాంతో కేసు వాయిదా పడింది. కేసును మరోసారి దర్యాప్తు చేసి నిజానిజాల్ని పది రోజుల్లోగా నిర్ధారించమని పోలీసుల్ని ఆజ్ఞాపించాడు న్యాయమూర్తి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. జే చెప్పిన మాటల్ని బట్టి, ఆ కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. అవన్నీ పచ్చి నిజాలని వారి దర్యాప్తులో తేలింది. ర్యాన్ పోర్టన్ న్యాయశాస్త్రం చది వాడు. అందంగా ఉంటాడు. దాంతో అమ్మాయిలు అతనంటే పడి చచ్చేవారు. ఆ అమ్మాయిల్లో షయానా హ్యూబర్స కూడా ఉంది. అయితే మిగిలినవారిలా కలలు కని ఊరుకోలేదామె. తన కలల రాకుమారుడి మనసును గెలుచుకుంది. ఓ కాఫీ షాపులో అనుకోకుండా ర్యాన్‌తో అయిన పరిచయాన్ని స్నేహంగా మార్చుకుంది. ప్రేమగా మలచుకుంది. అతనితో సహజీవనం మొదలు పెట్టింది. ఆ తర్వాతే ఆమె నిజస్వరూపం ర్యాన్‌కి తెలిసి వచ్చింది. షయానా పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు. ఆమెకి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది. చిన్నచిన్న వాటికే పెద్ద రాద్ధాంతం చేయడం ఆమె దగ్గరే నేర్చు కోవాలి ఎవరైనా. దానికి తోడు వల్ల మాలిన అనుమానం. ర్యాన్ ఎవరి ఆకర్షణలో అయినా పడిపోతాడేమో, ఏ అమ్మాైయెునా అతడికి దగ్గరైపోతుందేమో అని ప్రతిక్షణం భయపడిపోయేది. దాంతో అతడు కదిలితే కాల్చుకు తినేది. ఎవరి నైనా పన్నెత్తి పలుకరిస్తే హూంకరించేది. మొదట్లో సర్ది చెప్పేవాడు ర్యాన్. కానీ ఉండేకొద్దీ అతడిలో ఓర్పు నశించి పోయింది. ఇక మనం కలిసి ఉండలేం, విడిపోదాం అన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. నిన్ను వదిలే ప్రసక్తి లేదని తేల్చేసింది. పైగా నీ పరువు తీస్తానంటూ బెదిరించేది. దాంతో ఏం అనలేకపోయేవాడు ర్యాన్. షయానా సైకో అని, ఆమెని వదిలించుకో లేకపోతున్నానని తండ్రితో చెప్పుకుని బాధపడ్డాడు. దాంతో తానే షయానాని ఒప్పిద్దామనుకున్నాడు జే. అంతలోనే ఓ ఊహించని సంఘటన జరిగింది. ర్యాన్‌కి మిస్ ఓహియో అందాల పోటీల్లో గెలిచిన ఆడ్రీతో పరిచయమైంది. ఆమెతో తన జీవితం బాగుంటుంది అనిపించింది. ఆమెతో డేట్‌కి వెళ్లాలను కున్నాడు. ఆ రోజు సాయంత్రం వెళ్లేం దుకు సిద్ధమయ్యాడు. అది షయానాకి తెలిసిపోయింది. గొడవకు దిగింది. అతడు వినిపించుకోలేదు. దాంతో ‘నాకు దక్కని నిన్ను ఎవరికీ దక్కనివ్వను’ అంటూ షూట్ చేసి చంపేసింది. దాన్ని ఆత్మరక్షణ కోసం చేసినట్టుగా క్రియేట్ చేసింది. క్యాంప్‌బెల్ కౌంటీ కోర్ట్... ‘‘స్వార్థంతో ఉన్మాదిగా మారి ర్యాన్ని హత్య చేసిన షయానాకి నలభయ్యేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.’’ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు విని షాకయ్యింది షయానా. జే కళ్లలో మాత్రం కన్నీటితో పాటు కాసింత తృప్తి! - సమీర నేలపూడి -
దేనికింత శిక్ష?!
క్రైమ్ ఫైల్ ఫిబ్రవరి 1, 2011... మంజక్కాడ్ (కేరళ)... రాత్రి పదకొండున్నర కావస్తోంది. వాకిట్లో అటూ ఇటూ తిరుగుతోంది సుమతి. మధ్యమధ్యన రోడ్డువైపు చూస్తోంది. నుదుటికి పట్టిన చెమటను చీరకొంగుతో తుడుచుకుంటోంది. అరుగుమీద కూర్చుని ఉన్న గణేశ్ భార్యవైపే చూస్తున్నాడు. ‘‘సుమతీ... ఎందుకలా కంగారుపడతావ్? ఒక్కోసారి ఆలస్యమవుతూ ఉంటుందిలే’’ అన్నాడు తన ఆదుర్దాని బయటపడనివ్వకుండా. ‘‘నావల్ల కాదండీ. ఎంత లేటయినా పదిన్నరలోపే వచ్చేయాలి. పదకొండున్నర అవుతున్నా రాలేదంటే నాకెందుకో కంగారుగా ఉంది’’ అంది దిగులుగా. అంతలో లోపల్నుంచి వచ్చాడు గణేశ్ తమ్ముడు శంకర్. ‘‘ఏంటి మీరిద్దరూ? తను రావలసింది రైల్లో. మన దేశంలో రైళ్లు ఎప్పుడూ లేటేగా. కంగారు పడటం మానేసి నిశ్చితార్థానికి ఏం వంటలు చేయించాలో చెప్పండి. పొద్దున్నే ఆర్డర్ ఇవ్వాలి’’ అన్నాడు పెన్ను, పేపర్ తీస్తూ.సుమతి, గణేశ్‌లు ముఖాలు చూసు కున్నారు. ఎల్లుండి తమ కూతురు సౌమ్య నిశ్చితార్థం. అందుకే బంధువులంతా వచ్చారు. ఆ సందడిలో సౌమ్య ఇంకా ఇంటికి రాలేదన్న విషయం అందరూ మర్చిపోయారు... సుమతి, గణేశ్ తప్ప. వాళ్లిద్దరి మనసులూ కూతురి చుట్టూనే తిరుగుతున్నాయి. తను క్షేమంగా రావాలని మౌనంగా ప్రార్థిస్తున్నాయి. ‘‘ఇంత ఆలస్యం ఎప్పుడూ కాలేదు శంకర్. టైముకే వచ్చేస్తుంది. కానీ ఈరోజు ఏమయ్యిందో అర్థం కావట్లేదు’’... సుమతికి దుఃఖం పొంగుకొచ్చేస్తోంది. ‘‘బెంగపడకు వదినా. రేపట్నుంచి సెలవు పెట్టేస్తానంది కదా. ఇవాళ చివరి రోజని ఎక్కువ పనేమైనా చేసిందేమో. అందుకే ఆలస్యమై ఉంటుంది. నువ్వు లోపలికి పద. బోలెడంత పని ఉంది’’... కంగారు పెట్టాడు శంకర్. ఇక తప్పదని లోనికి నడిచింది సుమతి. గణేశ్ కూడా లేచి వెళ్లాడు. మరో రెండు గంటలు గడిచి పోయాయి. సౌమ్య రాలేదు. ఇక ఆగలేక పోయింది సుమతి. ‘‘ఇప్పటికైనా కదులు తారా? పిల్ల ఇంకా ఇంటికి రాలేదు. ఏదో ఒకటి చేయండి’’... భర్తమీద అరిచేసింది. ‘‘ఓసారి స్టేషన్‌కి వెళ్లి చూసొద్దాం అన్నయ్యా. లేటయ్యి ఆటోగానీ దొరక లేదేమో’’ అన్నాడు శంకర్. సరేనంటూ లేచాడు గణేశ్. చెప్పులు తొడుక్కుని రెండడుగులు వేశారో లేదో... గణేశ్ ఫోన్ రింగయ్యింది. తీసి హలో అన్నాడు. అంతే... ఏదో వినకూడనిది విన్నట్టు కొయ్యబారిపోయాడు. చేతిలోని సెల్ జారి పడిపోయింది. నీరసం ఆవహించినట్టుగా కుప్పకూలిపోయాడు. పరుగు పరుగున వచ్చింది సుమతి. ‘‘ఏమయ్యిందండీ... ఎవరు ఫోన్ చేశారు’’ అంది కంగారుగా. మాట్లాడలేకపోయాడు గణేశ్. ‘‘సౌమ్యా’’ అంటూ ఒక్క కేక పెట్టాడు. తిరుచూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి... ఐసీయూ తలుపులు తెరచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చాడు. గబగబా అతని దగ్గరకు పరుగెత్తింది సుమతి. ‘‘డాక్టర్‌గారూ... మా సౌమ్య...’’ ‘‘మా ప్రయత్నం మేము చేస్తున్నాం. తన పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది.’’ ‘‘అంటే...’’ ‘‘బతుకుతుందన్న నమ్మకం లేదు.’’ ఆ మాట వింటూనే విలవిల్లాడి పోయింది సుమతి. ‘‘అంత మాటనకండి డాక్టర్‌గారూ. తను మా ఇంటి దీపం. ఆ దీపం ఆరిపోయిందంటే మా బతుకులన్నీ చీకటైపోతాయి. నా బిడ్డని కాపాడండి. మీ కాళ్లు పట్టుకుంటాను.’’ తన కాళ్లమీద పడిన సుమతిని చప్పున పైకి లేపాడు డాక్టర్. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. తన చేతుల్లో ఏమీ లేదు. ఎలా గ్యారంటీ ఇవ్వగలడు? ఎలా మీ బిడ్డను మీకప్పగిస్తానని చెప్పగలడు? ఓ పక్కగా నిలబడివున్న ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్లాడు. ‘‘దారుణం. ఘోరం. ఆ అమ్మాయి ఎలా తట్టుకుందో ఏమో. ఇప్పటి వరకూ ప్రాణాలతో ఉందంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇది చేసింది ఎవరైనా సరే, వదలొద్దు సర్. జస్ట్... కిల్ హిమ్’’ అనేసి వెళ్లిపోతుంటే ఇన్స్పెక్టర్ పిడికిలి బిగిసింది. ఎందుకంటే అతడి మనసులో కూడా అదే ఉంది. వాణ్ని వదలకూడదు. ఓ ఆడపిల్లకి ఇంత దారుణమైన గతి పట్టించినవాణ్ని బతకనివ్వకూడదు. అతడలా అనుకుంటూ ఉండగానే సెల్ మోగింది. తీసి హలో అన్నాడు. అవతలి వ్యక్తి చెప్పింది వినగానే వేగంగా కదిలాడు. ఇన్స్పెక్టర్ స్టేషన్‌కి వెళ్లేసరికి ఎదురు చూస్తూ ఉన్నాడా వ్యక్తి. అతణ్ని చూస్తూనే... ‘‘చెప్పండి. మీరేం చూశారు?’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘నేనో చర్చి పాస్టర్ని సర్. నిన్న సాయంత్రం నేను ఎర్నాకులం-షోరనూర్ ప్యాసింజర్ రెలైక్కాను. తర్వాత కాసేపటికి ఓ అమ్మాయి అరుపులు, ఏడుపు వినిపిం చాయి. నేను చెయిన్ లాగబోతే మిగతా వాళ్లు అడ్డుకున్నారు. అప్పటికే రైలు ఆలస్యంగా నడుస్తోందని, ఆపితే ఇంకా ఆలస్యమవుతుందని అన్నారు. నేనెంత చెప్పినా వినిపించుకోలేదు. కాసేపటికి అరుపులు ఆగిపోయాయి. తర్వాతి స్టేషన్లో రైల్వే పోలీసులకి విషయం చెప్పాను.’’ ‘‘ఓ... ఆ వ్యక్తి మీరేనా? మీ కంప్లయింట్‌ని బట్టే ఆ ఏరియా అంతా వెతకడం జరిగింది. ఓ చోట పొదల్లో... రక్తపు మడుగులో పడివున్న ఒకమ్మాయి కనిపించింది. తన ఐడీ కార్డును బట్టి వివరాలు తెలిశాయి. ఆస్పత్రిలో చేర్పించి తనవాళ్లకు కబురు చేశాం. ఇప్పుడు తను చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. పాపం... చాలా దారుణంగా రేప్ చేశారెవరో.’’ ‘‘ఉదయం న్యూస్‌లో చూశాను సర్. అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను. నాకు ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది.’’ అలర్ట్ అయ్యాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎవరి మీద?’’ అన్నాడు ఆతృతగా. ‘‘తిరుచూర్ స్టేషన్లో రైలు ఆగినప్పుడు ఓ బిచ్చగాడు మా కంపార్ట్మెంట్లో ఎక్కాడు. రైలు బయలుదేరాక పక్కనున్న లేడీస్ కంపార్ట్మెంట్లోకి వెళ్లాడు. అతనికి ఒక చేయి కూడా లేదు.’’ పెద్ద క్లూ దొరికింది ఇన్స్పెక్టర్కి. పాస్టర్ని అభినందించాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. తిరుచూర్ స్టేషన్‌లోని సీసీ కెమెరా ఫుటేజుల ద్వారా ఆ ఒంటి చేతి వ్యక్తి ఫొటోలు పట్టాడు. సౌమ్య సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేస్తే ఫోన్ ఓ షాపులో దొరికింది. దాన్ని అమ్మింది ఒక ఒంటి చేతి వ్యక్తి అని షాపువాడు చెప్ప డంతో అతడే అసలు నిందితుడని నిర్ధారణ అయిపోయింది. దాంతో వేట మొదలైంది. పెద్ద సమయం వృథా కాకుండానే ఆ మృగం పోలీసుల చేతికి చిక్కింది. వాడు సౌమ్య పట్ల చేసినది తెలిస్తే... విన్న ప్రతి హృదయం కదిలి పోతుంది. ప్రతి కన్నూ తడిసిపోతుంది. కొచ్చిలో ఓ షాపులో పని చేస్తోంది సౌమ్య. పనయ్యాక అక్కడ రైలు ఎక్కి, షోరనూర్ స్టేషన్లో దిగుతుంది. అక్క డ్నుంచి మంజక్కాడ్లో ఉన్న తమ ఇంటికి చేరుకుంటుంది. ఆ రోజు కూడా అలానే రైలు ఎక్కింది. తిరుచూర్ స్టేషన్ దగ్గర లేడీస్ కంపార్ట్మెంట్ మొత్తం ఖాళీ అయిపోయింది. సౌమ్య మాత్రమే మిగి లింది. సరిగ్గా అప్పుడే లోనికి దూసుకొ చ్చాడు గోవిందస్వామి. సౌమ్యపై దాడి చేశాడు. ఆమె చేతిలోని పర్సు లాక్కు న్నాడు. నగలు కూడా లాక్కోబోతే ఆమె తిరగబడింది. దాంతో సౌమ్య తలను బోగీలో ఉన్న ఇనుపరాడ్కేసి కొట్టాడు. తర్వాత ఆమెను రైల్లోంచి తోసేశాడు. రైలు ఇంకా వేగం పుంజుకోలేదు. దాంతో గోవిందస్వామి కూడా రైల్లోంచి దూకేశాడు. సౌమ్య ఎక్కడ పడిందా అని వెతికాడు. ఒకచోట కనిపించింది. రక్తపు మడుగులో పడివుంది. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆమెనలా చూసి కూడా ఆ కర్కోటకుడికి జాలి కలగలేదు. పశువులా ఆమెమీద పడ్డాడు. దారుణాతి దారుణంగా అనుభవించాడు. తర్వాత ఆమె నగలు, సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు. ఫిబ్రవరి 6... తిరుచూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి... ‘‘సారీ... ఐదు రోజులుగా పడిన శ్రమ ఫలించలేదు. సౌమ్య ఇక లేదు.’’ ఆ మాట వింటూనే సుమతి కళ్లు తిరిగి పడిపోయింది. ఇతర కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఎన్నో ఘోరాలను చూసి చూసి కరడు కట్టిన ఖాకీల గుండెలు సైతం ఆ క్షణం బాధతో మెలికలు తిరిగాయి. ఇరవై మూడేళ్ల చిన్న పిల్ల. కష్టపడి పని చేసి తన కుటుంబానికి ఆధారంగా నిలబడింది. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలిచింది. తమ్ముడిని చదివిస్తోంది. అలాంటి మంచి అమ్మాయికా ఇలాంటి గతి పట్టింది! మరో రెండు రోజుల్లో తన నిశ్చితార్థం. నెల రోజుల్లో పెళ్లి. కొత్త జీవితం గురించి ఎన్నో కలలు కంటోంది. భవిష్యత్తు గురించి అందమైన ఊహలు అల్లుకుంటోంది. అంతలోనే దురదృష్టం నీడలా వెంటాడింది. ఓ మానవ మృగం చేతిలో ఆమె బతుకు చితికిపోయింది. ఆమె జీవితం అర్ధంతరంగా అంతమై పోయింది. ఆమె కథ ఎవరిని మాత్రం కదిలించదు! ఆమెకు జరిగిన అన్యాయం ఎవరి గుండెల్ని పిండదు! సౌమ్య కేసు కేరళలో పెద్ద సంచల నమే సృష్టించింది. ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరక్కుండా చూడాలంటే సౌమ్యకు ఆ గతి పట్టించినవాడిని వదిలిపెట్టకూడ దంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును త్వరత్వరగా తేల్చింది. గోవిందస్వామికి ఉరిశిక్షను విధించింది. వేటగాడిని చంపుతారు సరే. వేటకు బలైన జీవిని తిరిగి తీసుకు రాగలరా? మరొకరు అలా బలి కానే కారని గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎందుకంటే ప్రతిచోటా గోవిందస్వామి లాంటి వేటగాళ్లు ఉన్నారు. వాళ్ల చేతుల్లో సౌమ్య లాంటి అమాయకురాళ్లు మానప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాతి సంవత్సరమే జరిగిన నిర్భయ ఉదంతమే అందుకు పెద్ద ఉదాహరణ. మరి ఈ రాక్షసుల రాజ్యంలో మన ఆడపిల్లలు ఎలా బతకాలి? ఏ ధైర్యంతో వాళ్లు అడుగు బయటపెట్టాలి?! - సమీర నేలపూడి -
విధి వంచిత
క్రైమ్ ఫైల్ మార్చి, 2012... ముంబై... ‘షాట్ రెడీ’ అన్న మాట వింటూనే చేతిలోని స్క్రిప్టు పక్కన పెట్టి లేచింది మీనాక్షి. హుషారుగా వెళ్లి కెమెరా ముందు నిలబడింది. యాక్షన్ అని చెప్పగానే డైలాగులు చెప్పడం మొదలుపెట్టింది. క్షణాల్లో సీన్లో ఇన్వాల్వ్ అయిపోయింది. అద్భుతంగా కరుణ రసాన్ని పండించింది. ఆమె నటన చూసి అందరూ మెస్మరైజ్ అయిపోయారు. డెరైక్టర్ కట్ చెప్పగానే చప్పట్ల వర్షం కురిపించారు. ఆనందంతో పొంగిపోయింది మీనాక్షి. గొప్ప నటి కావాలన్న తన లక్ష్యం తప్పక నెరవేరుతుందని ఆ చప్పట్ల వర్షం తనకి చెబుతున్నట్టుగా అనిపించిందామెకి. ‘‘వెల్డన్ మీనాక్షీ... అదరగొట్టేశావ్. నీకు మంచి భవిష్యత్తు ఉంది. కీపిటప్’’... వెన్ను తట్టాడు డెరైక్టర్. ‘‘థాంక్యూ సర్’’ అంది మీనాక్షి వినయంగా. నెక్స్ట్షాట్ డైలాగులు తీసుకొచ్చి చేతిలో పెట్టాడు బాయ్. వెళ్లి చదువుకుంటూ కూర్చున్న మీనాక్షి, ఎవరో వచ్చి నిలబడినట్టు అనిపించడంతో తల ఎత్తి చూసింది. ఎదురుగా ఓ వ్యక్తి, ఓ అమ్మాయి ఉన్నారు. అతని వయసు ముప్ఫై పైనే ఉంటుంది. ఆ అమ్మాయి ముప్ఫయ్యేళ్లకు చేరువలో ఉండివుంటుంది. ‘‘నమస్తే మేడమ్, మీరు మీనాక్షిగారు కదూ. మీరంటే నాకు చాలా ఇష్టం’’... సంబరపడిపోతూ అందా అమ్మాయి. ‘‘నాక్కూడా మీరంటే ఎంతో గౌరవం మేడమ్. ఎక్కడో నేపాల్ నుంచి వచ్చి బాలీవుడ్లో స్థానం సంపాదించారు. మీరు నిజంగా గ్రేట్’’ అన్నాడా వ్యక్తి. ‘‘నేనంత గొప్పదాన్నేం కాదండీ. ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాను. చిన్నప్ప ట్నుంచీ నటనంటే పిచ్చి. అందుకే కాలు మీద కాలు వేసుకుని బతికేంత డబ్బు ఉన్నా, ఇక్కడికి వచ్చాను’’ అంది మీనాక్షి. ‘‘అలా అనకండి మేడమ్. మీలాంటి వాళ్లే మాకు స్ఫూర్తి. మా ఇద్దరికీ నటనంటే ఆసక్తి. అందుకే అదృష్టం పరీక్షించుకుందా మని వచ్చాం. అనుకోకుండా మిమ్మల్ని కలిశాం. చాలా సంతోషంగా ఉంది’’ అన్నాడతను ఆనందంగా. ‘‘టాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రయత్నించండి. నేను కూడా నాకు తెలిసినవాళ్లకు చెబుతాను’’ అంది మీనాక్షి. వాళ్లిద్దరి ముఖాలూ సంతోషంతో వెలిగాయి. మరోసారి కలుస్తామని చెప్పి వెళ్లి పోయారు. మళ్లీ స్క్రిప్టు చదువుకోవ డంలో మునిగిపోయింది మీనాక్షి. ఏప్రిల్, 2012... దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు ఇన్స్పెక్టర్. ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఇన్స్పెక్టర్ వైపే తీక్షణంగా చూస్తున్నాడు. అతడి ముఖంలో విసుగు, ఆతృత, కోపం, బాధ... రకరకాల హావభావాలు కదలాడు తున్నాయి. కాసేపలాగే చూసి... ‘‘ఏంటి సర్ ఆలోచిస్తున్నారు? పది రోజులు దాటింది నేను కంప్లయింట్ ఇచ్చి. ఇంతవరకూ ఏ ఉపయోగం లేదు’’... అరిచినట్టే అన్నాడతను. ఇన్స్పెక్టర్ కోపం తెచ్చుకోలేదు. ‘‘నాకర్థమవుతోంది నవరాజ్ నీ బాధ! కానీ ఏం చేయమంటావ్. ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాం.’’ ‘‘ఏంటి సర్ ప్రయత్నించేది! అక్కడ నా చెల్లెలు ఎలా ఉందో, ఏమైపోయిందో, వాళ్లు తనని ఏం చేశారో. మా అమ్మ గుండె పగిలేలా ఏడుస్తోంది. నేను పిచ్చోడిలా తిరిగిన చోటు తిరక్కుండా తిరుగుతున్నాను. వయసులో ఉన్న పిల్ల సర్. తనకేదైనా అయితే’’... దుఃఖం పొంగుకొచ్చింది నవరాజ్కి. ఇన్స్పెక్టర్ మనసంతా అదోలా అయిపోయింది. అయినా ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఏం చెప్ప గలడు? ఏదైనా తెలిస్తే కదా చెప్పడానికి! ఉన్నట్టుండి నేపాల్‌కు చెందిన నవ రాజ్ థాపా స్టేషన్‌కి వచ్చాడు. తన చెల్లెలు మీనాక్షీ థాపాని ఎవరో కిడ్నాప్ చేశా రంటూ కంప్లయింట్ ఇచ్చాడు. మీనాక్షి బాలీవుడ్ నటి. అప్పటికే ఓ హారర్ సినిమాలో నటించింది. ఇప్పుడు మరో సినిమాలో చేస్తోంది. కొన్ని మోడలింగ్ ప్రాజెక్టులు చేసింది. మరికొన్ని చేతిలో ఉన్నాయి. అలాంటి సమయంలో ఆమె ఉన్నట్టుండి మాయమైపోయింది. రెండు రోజులు వరుసగా షూటింగుకు రాకపోవ డంతో దర్శక నిర్మాతలు, నేపాల్‌లో ఉన్న మీనాక్షి కుటుంబానికి ఫోన్ చేశారు. వాళ్లు ముంబై వచ్చి వెతికారు. కానీ ఆమె జాడ తెలియలేదు. ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉంది. దాంతో మీనాక్షి అన్న నవరాజ్ పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. ‘‘మాట్లాడరేంటి సర్... నా చెల్లెలు ఏమయ్యింది? తను క్షేమంగానే ఉందం టారా?’’... జీరబోయిన గొంతుతో అడిగిన ప్రశ్నే అడుగుతున్నాడు నవరాజ్. ఏమీ చెప్పలేక నీళ్లు నములుతున్నాడు ఇన్స్పెక్టర్. అంతలో ఓ కానిస్టేబుల్ వేగంగా లోపలికి వచ్చాడు. ‘‘సర్... మీనాక్షిగారి ఫోన్ కొద్దిసేపటి క్రితం ఆన్ అయ్యింది. పది నిమిషాల తర్వాత మళ్లీ ఆఫ్ అయిపోయింది.’’ అలెర్ట్ అయ్యాడు ఇన్స్పెక్టర్. ‘‘లొకేషన్ ట్రేస్ చేశారా?’’ ‘‘చేశాం సర్. ముంబైలోనే ఉన్నారు. అంతే కాదు సర్. బ్యాంక్‌వాళ్లు ఫోన్ చేశారు. ఇవాళ ఉదయం మీనాక్షి అకౌంట్ నుంచి అరవై వేలు డ్రా అయ్యాయట.’’ చివ్వున లేచాడు ఇన్స్పెక్టర్. ‘‘నవరాజ్... క్లూ దొరికింది. ఈ రెండు ఆధారాలూ చాలు, మీనాక్షి దగ్గరకు చేరుకోవడానికి. పదండి వెళ్దాం’’ అన్నాడు టోపీ పెట్టుకుంటూ. నవరాజ్ లేచాడు. మరో రెండు నిమిషాల్లో వాళ్లు ఎక్కిన వాహనం రయ్యిన దూసుకుపోయింది. ముంబై శివార్లలో ఉన్న ఓ కాలనీ దగ్గర ఆగింది పోలీస్ జీపు. దిగి చుట్టూ చూశాడు ఇన్స్పెక్టర్. ఖరీదైన మనుషు లెవరూ ఆ కాలనీలో ఉండటం లేదని అక్కడి ఇళ్లను చూస్తేనే తెలుస్తోంది. ‘‘లొకేషన్ ఎక్కడ?’’ అన్నాడు. ‘‘రండి సర్’’ అంటూ ముందుకు నడిచాడు ఓ కానిస్టేబుల్. కొన్ని సందులు దాటి ఓ ఇంటి ముందు ఆగాడు. ఇదే అన్నట్టు సైగ చేశాడు. ఇన్స్పెక్టర్ సిగ్నల్ ఇచ్చాడు. టీమ్ అందరూ ఒక్కసారిగా తలుపు పగులగొట్టి లోపలకు వెళ్లారు. వాళ్లని చూస్తూనే లోపల ఉన్న ఇద్దరు వ్యక్తులూ హడలిపోయారు. ఎలా తప్పించుకుందామా అని చూశారు. కానీ ఏ దారీ కనిపించక లొంగిపోయారు. ‘‘మీనాక్షి ఎక్కడ?’’... అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘మీనాక్షి ఎవరు?’’ అన్నాడొక వ్యక్తి. అంతే... చెంప ఛెళ్లుమంది. భగ్గు మంటోన్న చెంపను తడుముకుంటూ నోరు విప్పాడతను. అతడు చెప్పింది విని అవాక్కయిపోయారు పోలీసులు. అలహాబాద్‌లోని ఓ చిన్న హోటల్... పోలీసుల బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లు తోంది. ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ అయోమయంగా చూస్తున్నారు. పోలీసులంతా చకచకా టై మీదికి వెళ్లారు. ఇద్దరు కానిస్టేబుళ్లు వాటర్ ట్యాంక్ మూత తీసి అందులోకి దిగారు. నీటి అడుగున ఉన్న... ప్లాస్టిక్ సంచుల మూటలను బయటకు తీశారు. వాటిని చూస్తూనే ‘‘మీనాక్షీ’’ అంటూ అరిచి కుప్పకూలాడు నవరాజ్. ‘‘అమిత్ జైస్వాల్, ప్రీతీ సురీన్... ఏదీ కూడా దాచకుండా చెప్పండి. లేదంటే నాలో రాక్షసుణ్ని చూస్తారు’’... గర్జించాడు ఇన్స్పెక్టర్. అమిత్ చెప్పడం మొదలు పెట్టాడు. అది వింటే మనిషన్నవాడు, మనసున్నవాడు ఎవడూ తట్టుకోలేడు! అలహాబాద్‌కు చెందిన అమిత్ ‘లా’ చదివాడు. లాయర్‌గా ప్రాక్టీసు మొదలు పెట్టాడు. అతనికి అసిస్టెంట్‌గా చేరింది ప్రీతి. ఇద్దరూ హద్దులు దాటారు. అది అమిత్ భార్యకి, పిల్లలకి తెలిసి పెద్ద గొడవ జరిగింది. అయినా ప్రీతిని వదల డానికి ఇష్టపడలేదు అమిత్. ఆమెను తీసుకుని రాత్రికి రాత్రే ముంబై వచ్చేశాడు. ఇద్దరికీ నటనంటే ఇష్టం కావడంతో సిని మాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ సమయంలోనే ఓ షూటింగ్ స్పాట్లో మీనాక్షిని కలిశారు. ఆమె ఎంతో అభిమానంగా మాట్లాడింది. దాంతో పరిచయాన్ని కొనసాగించారు. తరచూ కలిసి కష్టసుఖాలు మాట్లాడుకునే వారు. కలిసి భోజనాలు చేసేవారు. తీరిగ్గా ఉన్నప్పుడు పార్టీలూ చేసుకునేవారు. అదెంత ప్రమాదకరమో మీనాక్షి అంచనా వేయలేకపోయింది. కాల సర్పాలతో తిరుగుతున్నానని తెలుసుకోలేక పోయింది. ఆ సర్పాలు తనను కాటు వేస్తాయని ఊహించలేకపోయింది. ఓరోజు మీనాక్షికి ఫోన్ చేసి, తమ స్వస్థలమైన అలహాబాద్‌లో ఫంక్షన్ ఉంది, వెళ్దాం రమ్మంది ప్రీతి. ఆ రోజు షూటింగ్ లేకపోవడంతో వెళ్లింది మీనాక్షి. ముగ్గురూ అలహాబాద్ వెళ్లి ఓ చిన్న హోటల్లో బస చేశారు. అక్కడ మీనాక్షిని బంధించారు అమిత్, ప్రీతి. తర్వాత ‘మీనాక్షిని కిడ్నాప్ చేశాం, పదిహేను లక్షలు ఆమె అకౌంట్లో జమ చేస్తే వదిలేస్తాం’ అంటూ మీనాక్షి ఫోన్ నుంచే ఆమె తల్లి కమలకు మెసేజిచ్చారు. కమల దగ్గర అంత డబ్బు లేదు. కొడుకు నవరాజ్తో కలిసి ఎలాగో అరవై వేలు కూడగట్టి, మీనాక్షి అకౌంట్లో వేసింది. దాంతో వాళ్లకి పదిహేను లక్షలు ఇచ్చేంత సీన్ లేదని అర్థమైంది ఇద్దరికీ. అప్పుడే... ఆ క్షణమే మీనాక్షిని గొంతు నులిమి చంపేశారు. తలను నరికేశారు. మొండెంను ముక్కలు చేసి, ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి వాటర్ ట్యాంక్‌లో పడేశారు. తలను ప్యాక్ చేసి, బ్యాగ్‌లో పెట్టుకుని బయలుదేరారు. అలహాబాద్ నుంచి ముంబై వచ్చే దారిలో బస్సులోంచి తలను విసిరేశారు. చాచి కొట్టాడు ఇన్స్పెక్టర్. ‘‘పాపం అమాయకురాలిని పొట్టనబెట్టుకున్నారు. మీరు మనుషులా’’ అన్నాడు ఛీదరింపుగా. ‘‘తను బాగా డబ్బున్న అమ్మాయి నని, హాబీగా యాక్టింగ్ చేస్తున్నాని మీనాక్షి చెప్పింది సర్. అందుకే మేం సెటిలవ్వ డానికి తనని ఉపయోగించుకోవాలను కున్నాం. కానీ తనకంత సీన్ లేదని తర్వాత అర్థమైంది. అందుకే చంపేశాం.’’ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా మాట్లాడుతోన్న ప్రీతిని చూసి మండు కొచ్చింది ఇన్స్పెక్టర్. తర్వాత పోలీసు లాఠీలు ఆ ఇద్దరి శరీరాల మీద నృత్యం చేశాయి. ఆ మానవ మృగాలు కటకటాల వెనక్కి వెళ్లిపోయాయి. ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాయి. - సమీర నేలపూడి -
మాస్టర్ మైండ్
క్రైమ్ ఫైల్ మార్చి 19, 2004... కన్సాస్ (యు.ఎస్.)... టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగు తున్నాడు ఇన్స్పెక్టర్ జేమ్స్. సబార్డినే ట్లంతా ఆయనేం చెబుతాడా అని చూస్తున్నారు రెప్ప వేయకుండా. పది నిమిషాల తర్వాత నోరు విప్పాడు జేమ్స్. ‘‘కొన్ని నెలల క్రితం పక్క రాష్ట్రంలో కొన్ని హత్యలు జరిగాయి. వేర్వేరు కుటుం బాలకు చెందినవారు, వేర్వేరు వయసుల వారు, వేర్వేరు వృత్తుల్లో ఉన్నవారు... కానీ అందరూ ఒకేలా హత్యకు గురయ్యారు. వాళ్లలో మగవాళ్లున్నారు, ఆడవాళ్లున్నారు. అత్యాచారం చేసి, కాళ్లూ చేతులూ కట్టేసి, తాడు మెడకు బిగించి చంపారు. హత్య జరిగిన ప్రతిచోటా ‘బీటీకే’ అన్న మూడక్షరాలు రాసివున్న కాగితం దొరికింది’’ అని చెప్పి ఆగాడు జేమ్స్. ‘‘అంటే ఏంటి సర్?’’ అన్నాడు రోనీ. తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడు జేమ్స్. ‘‘అది తెలుసుకోవడంలో అక్కడి పోలీసులు పూర్తిగా ఫెయిల య్యారు. కానీ మనం సక్సెస్ కావాలి.’’ అందరూ ముఖాలు చూసుకున్నారు. ‘‘మనకేం సంబంధం సర్? అది మన పరిధిలోకి రాదు కదా?’’ అన్నాడు మరో సబార్డినేట్ పాల్సన్. ‘‘ఆ హంతకుడు ఇప్పుడు మన పరిధిలోనే ఉన్నాడు.’’ అందరూ అలెర్ట్ అయ్యారు. ‘‘అంటే ఇక్కడ హత్యలు మొదలెట్టాడా సర్?’’ అడిగాడు రోనీ ఆదుర్దాగా. ‘‘లేదు. కానీ మొదలుపెడతాడేమో అని అనుమానంగా ఉంది. ఎందుకంటే... ఇవాళ నా ఆఫీసుకు ఒక లెటర్ వచ్చింది’’ అంటూ టేబుల్ మీద ఉన్న కాగితాన్ని అందుకున్నాడు జేమ్స్. మడతలు విప్పి, చదవడం మొదలుపెట్టాడు. ‘‘మై డియర్ ఫ్రెండ్స్. నేను వచ్చేశా. మీకోసం చాలా సర్ప్రైజులు తీసుకొచ్చా. అవి మీకు ఎప్పుడు ఎలా ఎదురవుతాయో ఇప్పుడే చెప్పలేను. అయినా సర్ప్రైజులు ఇవ్వడం నాకు కొత్తకాదు. అందుకోవడం మీకూ కొత్త కాదు. నన్ను మర్చిపోయా రేమోనన్న అనుమానంతో గుర్తు చేయ డానికి కొన్ని తీపి జ్ఞాపకాలు పంపు తున్నాను’’... చదవడం ఆపి టేబుల్ మీద ఉన్న ఫొటోలు తీసి చూపించాడు జేమ్స్. తర్వాత మళ్లీ చదవడం మొదలెట్టాడు. ‘‘ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు వికీ వెగర్లీ. 1986, సెప్టెంబర్ 16న నా చేతుల్లో కన్నుమూసింది. చనిపోయే ముందు నాకు చాలా సంతోషాన్ని, తృప్తిని మిగిల్చింది. అందుకే తనని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరూ మర్చిపోకండి. తనని కాదు, నన్ను. బై - బిల్ థామస్ కిల్‌మేన్.’’ అందరూ అవాక్కయిపోయారు. ‘‘బీటీకే అంటే బిల్ థామస్ కిల్‌మేన్ అన్నమాట. ఎంత పొగరు వాడికి! వాణ్ని వదలకూడదు సర్’’ అన్నాడు రోనీ కసిగా. అందరి పిడికిళ్లూ బిగుసుకున్నాయి. ‘‘వదలం రోనీ. వాణ్ని మనం పట్టుకుంటున్నాం. మనతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దాం. ఇప్పటికి పదిమందిని చంపేశాడు. పదకొండో మనిషి వాడి చేతికి చిక్కడానికి వీల్లేదు’’ అన్నాడు జేమ్స్ గంభీరంగా. కానీ అతను అనుకున్నది జరగలేదు. ఆ హంతకుడిని పట్టుకోవడం వాళ్ల వల్ల కాలేదు. రాత్రింబవళ్లు తిరిగారు. కానీ అతను దొరకలేదు. జూన్ 9, 2004. కవర్ తెరిచాడు జేమ్స్. ఓ ఫ్లాపీ ఉంది. దానిమీద ‘బీటీకే స్టోరీ’ అని రాసి ఉంది. ఆ ఫ్లాపీలో బీటీకే కిల్లర్ గురించి పలు పత్రికల్లో వచ్చిన కథనాల పేపర్ కటింగ్స్, క్రైమ్ సీన్స్‌కి సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి. మరణం మీద రాసిన ఓ కవిత కూడా ఉంది. చివరిలో... ‘‘మరణం అనేది ఓ వరం. ఆ వరాన్ని నేను ఎంతోమందికి అందించాను. అందిస్తూనే ఉంటాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు. చివరికి మీరు కూడా’’ అన్న మెసేజ్ ఉంది. జేమ్స్‌కి బీపీ వచ్చేసింది. చేతిలో ఉన్న ఫ్లాపీ కవర్ని విసిరి కొట్టాడు. ‘‘స్కౌండ్రల్. ముప్ఫయ్యేళ్లుగా తప్పించుకు తిరుగుతు న్నాడు. పైగా మనల్నే వెక్కిరిస్తున్నాడు. ఐ విల్ సీ హిజ్ ఎండ్’’ అంటూ ఆవేశంగా అక్కడ్నుంచి కదిలాడు. డెట్రాయిట్‌లోని ఓ అపార్ట్మెంట్ తలుపు తెరచుకుంది. తలుపు తీసిన యువతి వయసు ముప్ఫైలోపే ఉంటుంది. తెల్లగా, అందంగా ఉంది. ‘‘ఎస్... ఎవరు కావాలి?’’ అంది ఎంతో మృదువుగా. జేమ్స్ తన జేబులోని ఐడీ కార్డ్ తీసి చూపించాడు. ఆమె నొసలు ముడిచింది. ‘‘పోలీసులా? ఏం జరిగింది సర్? ఎవరి కోసం వచ్చారు?’’ అంది కంగారుగా. జేమ్స్, అతని టీమ్ లోపలికి నడి చారు. ‘‘మీ పేరు తెలుసుకోవచ్చా?’’ అన్నాడు జేమ్స్ ఇల్లంతా పరిశీలిస్తూ. ‘‘కెర్రీ... కెర్రీ రాసన్’’ చెప్పిందామె. ‘‘బీటీకే అంటే తెలుసా మిస్ కెర్రీ?’’ ‘‘మిస్ కాదు... మిసెస్ కెర్రీ. నాకు తెలియదు బీటీకే అంటే ఏమిటో?’’ ‘‘పోనీ బిల్ థామస్ కిల్‌మేన్ ఎవరో తెలుసా?’’ తెలీదన్నట్టు తలూపి, ‘‘ఎవరతను?’’ అడిగింది. ‘‘మీ నాన్న’’ విస్తుపోయింది కెర్రీ. ‘‘మా నాన్నగారి పేరు అది కాదు. డెన్నిస్ రాడర్.’’ నవ్వాడు జేమ్స్. ‘‘తెలుసు. కొద్ది సేపటి క్రితం మేం ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాం. అతను ఓ సీరియల్ కిల్లర్. పదిమందిని అనుభవించి, అత్యంత కిరాతంగా చంపేసిన క్రూరుడు. తనను పట్టుకొమ్మంటూ పోలీసులకే సవాలు విసిరిన పొగరబోతు. దురదృష్టంకొద్దీ... అతడు మీ నాన్నే.’’ అవాక్కయిపోయింది కెర్రీ. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదామెకి. మౌనంగా సోఫాలో కూలబడిపోయింది. ‘‘ఏంటి కెర్రీ? ఎవరు వీళ్లు? ఏమంటున్నారు?’’ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర్నుంచి లేచి వచ్చింది, అప్పుడే లంచ్‌కి కూర్చున్న కెర్రీ తల్లి పౌలా. ఆమె ఎవరు అన్నట్టుగా కెర్రీ వైపు చూశాడు జేమ్స్. ‘‘మా అమ్మగారు... పౌలా రాడర్’’ అంది కెర్రీ. ‘‘సారీ మిసెస్ రాడర్. మీకు ఈ విషయం ఇలా చెప్పాల్సి రావడం బాధా కరమే. కానీ తప్పదు. మీ భర్త డెన్నిస్ రాడర్ ఒక సీరియల్ కిల్లర్. ఇందాకే అరెస్ట్ చేశాం. మీరు, మీ అమ్మాయి స్టేషన్‌కి వస్తే కొన్ని వివరాలు తీసుకోవాలి. మళ్లీ కలుద్దాం’’ అనేసి కదిలాడు జేమ్స్. లిఫ్టులోకి వెళ్లేవరకూ వెనుక నుంచి పౌలా గట్టిగట్టిగా ఏడుస్తోన్న శబ్దం వినిపిస్తూనే ఉంది అతనికి. ‘‘ఎట్టకేలకు దొరికావ్ మిస్టర్ రాడర్. ఓ సారీ... బీటీకే, బిల్ థామస్ కిల్‌మేన్.’’ జేమ్స్ అలా అనగానే నవ్వాడు డెన్నిస్. ‘‘నో... బిల్ థామస్ కిల్‌మేన్ కాదు. బైండ్... టార్చర్... కిల్. అంటే కట్టు... హింసించు... చంపు’’ అన్నాడు ఎంతో కూల్‌గా. ‘‘అలాగే చంపావ్గా అందరినీ. సిగ్గుగా లేదూ ఈ పని చేయడానికి? ఆడా లేదు మగా లేదు. చిన్నా లేదు పెద్దా లేదు. మితిమీరిన కోరికతో నీ కళ్లు మూసుకు పోయాయి’’ అన్నాడు జేమ్స్ చిరాకు పడుతూ. డెన్నిస్ రియాక్ట్ కాలేదు. నవ్వుతూ జేమ్స్ వైపు చూస్తున్నాడు. ‘‘ఆవేశపడకండి సర్. మొత్తానికి దొరికానుగా, ఇంకా ఎందుకు బీపీ పెంచుకుంటారు! అయినా నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. బీటీకే కిల్లర్ నేనేనని ఎలా కనిపెట్టారు మీరు?’’ చిర్రెత్తుకొచ్చింది జేమ్స్‌కి. ఇన్స్పెక్టర్ తను. ప్రశ్నలు తను వేయాలి. క్రిమినల్గాడు... వాడు వేస్తాడేంటి? ‘‘ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో ఓ చోట తప్పటడుగు వేస్తాడు మిస్టర్ రాడర్. ఫ్లాపీ పంపించావ్గా. దానిలో డేటా ఎక్కించిన ఐపీ అడ్రస్‌ను కనిపెట్టవచ్చని, దాని ద్వారా ఆ ఐపీ ఉన్న కంప్యూటర్ను ట్రేస్ చేయొచ్చని నీకు తెలియదో, తెలిసినా మర్చిపోయావో నాకు తెలీదు. ఆ ఫ్లాపీయే నిన్ను పట్టించింది. పాపం, చాలా తెలివైనవాణ్ని అనుకున్నావ్ కదూ?’’ ‘‘ముప్ఫయ్యేళ్లుగా నన్ను పట్టుకోలేక ముప్పుతిప్పలు పడ్డారు. దాన్ని బట్టి తెలియడం లేదా ఎవరు తెలివైనవాళ్లో! నిజం మీకూ తెలుసు. కాకపోతే ఒప్పుకోవ డానికి మీ ఇగో అడ్డు వస్తోందంతే.’’ లాగిపెట్టి కొట్టాడు జేమ్స్. ‘‘నీలాగే చాలామంది క్రిమినల్స్ తెలివైనవాళ్లం అనుకుంటారు. పోలీసుల్ని పిచ్చివాళ్లుగా జమకడతారు. చివరికి మేము గెలవకా తప్పదు. మీరు మా చేతుల్లో నలగకా తప్పదు. దేవుడనేవాడే ఉంటే, నీలాంటి క్రూరుణ్ని ఇక ఈ భూమి మీద ఒక్క క్షణం ఉండనివ్వడు. నీకు మరణశిక్ష పడి తీరుతుంది.’’ ఆ క్షణంలో జేమ్స్ అన్న మాట తథాస్తు దేవతలు విన్నట్టు లేరు. అందుకే డెన్నిస్‌కి మరణశిక్ష పడలేదు. కాకపోతే మరణించేవరకూ నరక యాతన అనుభ వించమంటూ న్యాయస్థానం శపించింది. అతడు చంపిన మనిషికో జీవితఖైదు చొప్పున పది జీవితఖైదులు విధించింది. 175 యేళ్ల తర్వాత గానీ బెయిలుకు అప్లై చేయడానికి వీల్లేదని కండిషన్ పెట్టింది. అన్నేళ్లు అతను బతికుండడు. అప్పటి వరకూ బతికినా అది బతుకూ కాదు. ఆ విషయం... జైలు గోడల మధ్య జీవచ్ఛవంలా బతుకుతోన్న డెన్నిస్‌కి ఇప్పటికైనా అర్థమైందో లేదో మరి! - సమీర నేలపూడి డెన్నిస్ రాడర్ కేసు నడుస్తుండగానే అతని భార్య అనారోగ్యంతో మరణించింది. అతని కూతురు కెర్రీ... తన తండ్రి ఓ కసాయి అన్న నిజాన్ని జీర్ణించుకోలేక నేటికీ తల్లడిల్లుతోంది. ‘బయటికెళ్లినప్పుడు జాగ్రత్తమ్మా, మనుషులు మంచోళ్లు కాదు’ అంటూ చెప్పిన తన తండ్రే మంచోడు కాదని, తనలాంటి కొందరు అమ్మాయిలను అత్యాచారం చేసి చంపాడని తెలిసి ఆమె తట్టుకోలేకపోతోంది. కెర్రీయే కాదు, డెన్నిస్ అలాంటివాడంటే ఎవ్వరూ నమ్మలేదు. అతను మంచి ఉద్యోగిగా రిటైర్ అయ్యాడు. స్థానిక లూథరన్ చర్చికి పెద్దగా వ్యవహ రించేవాడు. కూల్‌గా, వినయంగా, అందరితో ఆప్యాయంగా ఉంటాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఉన్నట్టుండి అతడో మేకవన్నె పులి అని తెలిస్తే నమ్మడం కష్టమే కదా మరి! -
ఐస్‌క్రీమ్ కిల్లర్
క్రైమ్ ఫైల్ జూన్ 10, 2011... వియెన్నా (ఆస్ట్రియా) ‘‘టిమ్... లే త్వరగా. మిట్ట మధ్యాహ్నం ఏంటీ నిద్ర?’’... భర్తని పట్టి కుదిపింది మార్గరెట్. ‘‘ఏంటి మ్యాగీ నువ్వు? శెలవు కదా అని హాయిగా పడుకుంటే, ఏం కొంప మునిగిపోయిందని లేపుతున్నావ్?’’... విసుక్కున్నాడు టిమ్. ‘‘కొంప మునిగిందనే లేపుతున్నాను. లే ముందు’’ అంటూ చెయ్యిపట్టి లాగింది. ఇక తప్పదని లేచాడు టిమ్. ‘‘రా నాతో’’ అంటూ బయటకు లాక్కెళ్లింది మార్గరెట్. పక్కింటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. పోలీసులు కూడా ఉన్నారు. ‘‘ఏం జరిగింది? ఇంతమంది ఉన్నా రేంటి? పోలీసులెందుకు వచ్చారు?’’ అంటూ అటు పరుగెత్తాడు టిమ్. ఆ ఇంటి బేస్మెంట్లో పోలీసులు ఏదో వెతుకు తున్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లాడు టిమ్. ‘‘ఏంటి సర్ ఇదంతా?’’ అన్నాడు. టిమ్‌ని పరికించి చూశాడు ఇన్స్పెక్టర్. ‘‘మీరెవరు?’’ అన్నాడు. ‘‘నా పేరు టిమ్. నాది పక్కిల్లే.’’ అలాగా అన్నట్టు తలూపాడు. ‘‘ఈ ఇంట్లో వాళ్ల గురించి మీకేమైనా తెలుసా?’’... అడిగాడు. ‘‘ఈ ఇంట్లో మ్యాన్‌ఫ్రెడ్ హింటర్ బర్గర్, అతని భార్య ఎలిజబెత్ ఉంటున్నారు. వాళ్లది ఐస్‌క్రీమ్ వ్యాపారం. ఇద్దరూ చాలా మంచివాళ్లు.’’ ‘‘వాళ్లతో మీకెప్పటి నుంచి పరిచయం? క్లోజ్‌గా ఉంటారా?’’ ‘‘మరీ క్లోజేమీ కాదు సర్. హలో అంటే హలో అనుకుంటాం. మేమిక్కడికి వచ్చి ఏడాదిన్నరే అయ్యింది. కానీ వాళ్లు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారట. ఇంతకీ ఏం జరిగింది సర్? వాళ్లకేమైనా అయ్యిందా కొంపదీసి?’’ ‘‘ఎవరికో ఏదో జరిగింది మిస్టర్ టిమ్. కానీ ఎవరికో తెలియదు. ఓసారి అలా చూడండి .’’ ఇన్స్పెక్టర్ చూపించిన వైపు చూశాడు టిమ్. అక్కడ... గోడ పక్కగా రెండు ఐస్‌క్రీమ్ టబ్స్ ఉన్నాయి. ‘‘ఐస్‌క్రీమ్ టబ్స్... మ్యాన్‌ఫ్రెడ్ వాళ్ల షాపులోవి అయ్యుంటాయి’’ అన్నాడు టిమ్ వాటిలో వింతేముంది అన్నట్టు. ‘‘నేను చూడమంది వాటిని కాదు. వాటిలోంచి కింద దిమ్మ రించిన కాంక్రీట్‌ని’’ అన్నాడు ఇన్స్పెక్టర్. అప్పుడు అటువైపు దృష్టి సారించాడు టిమ్. అక్కడ పొడి కంకర ఉంది. ఏమీ అర్థం కాలేదు. ఏంటన్నట్టు ఇన్స్పెక్టర్ వైపు చూశాడు. ఇన్స్పెక్టర్ అన్నాడు... ‘‘అర్థం కాలేదు కదూ! అది మామూలు కంకర కాదు మిస్టర్ టిమ్. ఆ కంకర అక్కడక్కడా తడిసి గడ్డ కట్టింది. అది నీటి తడి కాదు... రక్తం. కంకర నిండా కుళ్లిపోయిన మాంసపు ముక్కలు.. ఎముకలు.. ఏవేవో ఉన్నాయి. అవన్నీ ఏ కోడివో, కుక్కవో కాదు.. మనిషివి! కాదు.. మనుషులవి. రెండు గుండెలు, నాలుగు ఊపిరితిత్తులు ఉన్నాయి. అంటే అవి ఇద్దరు మనుషుల శరీర భాగాలన్నమాట’’. వింటుంటేనే కడుపులో దేవినట్ట య్యింది టిమ్‌కి. ‘‘ఏంటి సర్ ఈ దారుణం? ఎవరివా శరీర భాగాలు?’’ ‘‘తెలియదు. బేస్‌మెంట్‌ని బాగు చేస్తుంటే వర్కర్‌కి ఈ టబ్స్ కనిపించాయి. తెరిచి చూస్తే కంకర. తీసి వాడదామను కుంటే భయంకరమైన దుర్వాసన. వెంటనే మాకు ఫోన్ చేశారు. మేం వచ్చి చూస్తే ఇవన్నీ కన్పించాయి. ఇంతకీ ఈ ఇంట్లో వాళ్లని మీరెప్పుడు చూశారు?’’ ‘‘మ్యాన్ఫ్రెడ్ని చూసి చాలా రోజు లయ్యింది సర్. ఎలిజబెత్ అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు సర్?’’ ఇన్స్పెక్టర్ మాట్లాడలేదు. తాళం పగులగొట్టి, ఇంటి లోపలంతా పరిశీలిం చాడు. కొన్నిచోట్ల గోడల మీద రక్తపు మరకలు తుడిచిన ఆనవాళ్లున్నాయి. వంటింట్లో ఓ మూల రంపం ఉంది. దాని చెక్క పిడి మీదా రక్తపు మరకలు ఉన్నాయి. దాంతో పలు సందేహాలు తలెత్తాయి. హాల్లో ఉన్న మ్యాన్‌ఫ్రెడ్, ఎలిజబెత్‌ల ఫొటోలు తీసుకుని స్టేషన్‌కి బయలుదేరాడు. వియెన్నా ప్రధాన రహదారి... ఓ కారు వేగంగా దూసుకుపోతోంది. అంతలో ఉన్నట్టుండి మరో కారు అడ్డుగా రావడంతో దానికి ఠక్కున బ్రేకు పడింది. ‘‘ఏయ్... బతకాలని లేదా? ఏంటా చెత్త డ్రైవింగ్? బ్రేక్ పడటం ఆలస్యమై ఉంటే చచ్చి ఉండేవాడివి’’... అరిచింది డ్రైవింగ్ సీట్లో కూర్చున్నామె. ‘‘మనుషుల్ని చంపడం మీకు అలవాటేగా మిసెస్ ఎలిజబెత్ కరాన్జా’’ అంటూ కారు దిగాడు ఇన్స్పెక్టర్. ఖంగు తింది ఎలిజబెత్. ‘‘సారీ సర్... ఎవరో అనుకుని అలా మాట్లాడాను’’ అంది ఎంతో మృదువుగా. ఆమె కారు దగ్గరకు వచ్చాడు ఇన్స్పెక్టర్. డోరు తెరిచాడు. ఎలిజబెత్ చేతిని పట్టుకుని బేడీలు వేశాడు. అవాక్క యిపోయింది ఎలిజబెత్. ‘‘ఏంటి సర్... నేనేం చేశాను?’’ అంది కంగారుగా. ‘‘స్టేషన్‌కి వెళ్లి మాట్లాడుకుందాం. రోడ్డుమీద ఏం బాగుంటుంది?’’ అంటూ ఆమెను తీసుకెళ్లి కారెక్కించాడు. ‘‘ఇక వాదించి లాభం లేదు. నాకు సగం నిజం తెలిసింది. మిగతా సగం నువ్వు చెప్పేస్తే మంచిది.’’ తల అడ్డంగా ఊపింది ఎలిజబెత్. ‘‘మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు సర్. నేను...’’ ‘‘ఏ తప్పూ చేయలేదు అంటావ్. కానీ అది నమ్మడానికి నేనంత పిచ్చోణ్ని కాదు. నీ భర్త హోల్జర్ హాల్జ్ మూడేళ్ల క్రితం ఉన్నట్టుండి మాయమైపోయాడు. వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడన్నావ్. తర్వాత నీ జీవితంలోకి వచ్చిన ప్రియుడు మ్యాన్‌ఫ్రెడ్ మాయ మయ్యాడు. ఎవరైనా అడిగితే బ్రేకప్ అయ్యిందన్నావ్. కానీ వాళ్లిద్దరూ మాంసపు ముద్ద లుగా కాంక్రీటులో దాగివున్నా రని నాకు తెలిసిపోయింది. కాబట్టి ఇక అడ్డంగా బొంకొద్దు. నిజం చెప్పు. ఏం జరిగింది? చెప్పకపోతే ఆడపిల్లవని కూడా చూడకుండా మా ట్రీట్మెంట్ రుచి చూపించాల్సి ఉంటుంది.’’ ‘‘వద్దు సార్’’... అరిచినట్టే అంది ఎలిజబెత్. ‘‘ఆ పని మాత్రం చేయకండి. నేనిప్పుడు గర్భవతిని.’’ ఉలిక్కిపడ్డాడు ఇన్స్పెక్టర్. ‘‘ఏంటీ... గర్భవతివా? ఎవరి బిడ్డకి... హాల్జ్ బిడ్డకా, మ్యాన్‌ఫ్రెడ్ బిడ్డకా?’’ ‘‘వాళ్లిద్దరూ ప్రాణాలతో లేరని మీరే అన్నారు కద సార్. ఇక వాళ్ల బిడ్డకి తల్లినెలా అవుతాను? నా కడుపులో ఉన్నది నా కొత్త బాయ్‌ఫ్రెండ్ బిడ్డ’’ ‘‘అంటే వాళ్లిద్దరినీ...’’ ‘‘నేనే చంపాను. చంపి ముక్కలు ముక్కలు చేసేశాను.’’ ‘‘ఎందుకు?’’ ఇన్స్పెక్టర్ అలా అడగ్గానే పెద్దగా నవ్వింది ఎలిజబెత్. ఆ నవ్వు వికృతంగా ఉంది. ‘‘ఎందుకేమిటి సర్? ఒకణ్ని నేను పెళ్లి చేసుకున్నాను. మంచి భార్యగా నడచుకున్నాను. కానీ వాడు మాత్రం మంచి భర్త కాలేకపోయాడు. నా మీద ప్రేమ లేదు. ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిజ్ ఉంది, కంప్యూటర్ ఉంది, ఓ పెళ్లామూ ఉంది అన్నట్టుగా ప్రవర్తించేవాడు. వాడెలా ఉన్నా ఒక బిడ్డను ఇస్తే చాలనుకున్నాను. కానీ ఆ సంతోషమూ లేకుండా పోయింది. ఓరోజు రాత్రి వాడితో నాకో బిడ్డ కావాలన్నాను. ముఖం తిప్పుకున్నాడు. అటువైపు తిరిగి పడుకున్నాడు. గుర్రు పెట్టి నిద్రపోయాడు. నాకు చిర్రెత్తు కొచ్చింది. నేను, నా ఫీలింగ్స్ వాడికి పట్టవని అర్థమైంది. అలాంటివాడు నాకెందుకని చంపి పారేశాను.’’ నోరు తెరచుకుని వింటున్నాడు ఇన్స్పెక్టర్. ఎంతో కూల్‌గా, రిలాక్స్డ్గా తను చేసిన దారుణాన్ని వివరిస్తోన్న ఎలిజబెత్‌ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదతనికి. ఎలిజబెత్ మాత్రం చెప్పుకుంటూ పోతోంది. ‘‘ఆ తర్వాత మ్యాన్‌ఫ్రెడ్ పరిచయ మయ్యాడు. ప్రేమన్నాడు. పెళ్లన్నాడు. సహజీవనం మొదలు పెట్టాడు. పెళ్లి కాక పోయినా ప్రపంచానికి వాడు నా భర్త అనే చెప్పాను. వాడినీ నేనెంతో ప్రేమించాను. వాడయినా నాకో బిడ్డను ఇస్తాడని ఆశపడ్డాను. కానీ నా కల నెరవేరలేదు. పైగా వాడు వేరే అమ్మాయితో ప్రేమాయణం మొదలెట్టాడు. దాంతో వాడినీ నా భర్త దగ్గరకే పంపేశాను.’’ ‘‘వాళ్లనలా ముక్కలు చేయడానికి నీకు మనసెలా ఒప్పింది?’’ ‘‘నన్ను బాధ పెట్టడానికి వాళ్లకు మనసొప్పినట్టే నాకూ ఒప్పింది. చంపాక బాడీస్‌ని ఏం చేయాలో తోచలేదు. ఐస్ క్రీమ్స్ పెట్టే బాక్సుల్లో ఉంచాను. అయినా కంపు కొట్టాయి శవాలు. ఎన్ని స్ప్రేలు వాడినా ఫలితం లేకపోయింది. అందుకే ముక్కలు చేసేసి, కాంక్రీట్‌లో కలిపి టబ్బుల్లో పెట్టాను. తీసుకెళ్లి బేస్మెంట్లో పడేశాను. కానీ పొద్దున్న అవి పనివాళ్ల కంటబడ్డాయి. వాళ్లు మీకు ఫోన్ చేయడం విన్నాను. విషయం బయటపడుతుందని అర్థమై వేరే చోటికి పారిపోదామనుకునే లోపే మీరు నన్ను పట్టుకున్నారు.’’ ‘‘ఛ... ఓ ఆడదానివై ఉండి ఇంత దారుణం చేశావా? ఇప్పుడు మరొకరితో ప్రేమలో ఉన్నావ్. ఒకవేళ అతడూ నిన్ను తల్లిని చేయకపోతే చంపేసేదానివా?’’ నవ్వింది ఎలిజబెత్. ఆ నవ్వు వెనుక అర్థమేమిటో ఇన్స్పెక్టర్కి అర్థమయ్యింది. ‘‘సాటి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేసిన నీలో అమ్మ మనసు ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక ప్రాణికి జన్మనివ్వడానికి రెండు ప్రాణాలు తీసిన నిన్నెలా అర్థం చేసు కోవాలి?’’ అనేసి వెళ్లిపోతోన్న ఇన్స్పెక్టర్ వైపు చూసి తనలో తనే నవ్వుకుంది ఎలిజబెత్... నాలుగు నెలల బిడ్డ ఉన్న తన పొట్టని తడుముకుంటూ! 2012, నవంబర్ 23న ఎలిజబెత్ కరాన్జాకి జీవిత ఖైదును విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తీప్పు వెలువడే లోపే బిడ్డకు జన్మనిచ్చింది ఎలిజబెత్. ఆ బిడ్డ తండ్రిని జైలు అధికారుల సమక్షంలోనే పెళ్లాడింది కూడా. ఈ కేసు ఆస్ట్రియాలో పెద్ద సంచలనం సృష్టించింది. ‘ఐస్‌క్రీమ్ కిల్లర్’ అంటూ మీడియా విరివిగా కథనాలు ప్రసారం చేసింది. 2011లో ‘ఎడిషన్ ఎ’ అనే పబ్లిషింగ్ కంపెనీ ‘ద ఐస్ కిల్లర్’ అనే పుస్తకాన్ని వెలువరించింది. దీనిలో ఎలిజబెత్ కథ మొత్తం ఉంది. ఆమె జీవితంలో ఏం జరిగింది, ఎలా తన భర్తనీ ప్రియుణ్నీ చంపింది వంటి విషయాలన్నీ కూలంకషంగా ఉన్నాయి. తర్వాత స్వయంగా కర్జానాయే తన జీవితం ఆధారంగా ‘మై టూ లైవ్స్’ అనే పుస్తకం రాసింది. ఈ పుస్తకం విరివిగా అమ్ముడయ్యింది. - సమీర నేలపూడి -
మానని గాయం
క్రైమ్ ఫైల్ జూన్ 22, 2004... బ్రెజిల్... మంచమ్మీద కూర్చుని డైరీ తెరిచింది ఇరవయ్యేళ్ల సబీన్. పెన్నును చేతిలోకి తీసుకుంది. కానీ ఏం రాయాలో అర్థం కావడం లేదు. కలం నుంచి అక్షరాలు జారి పడటం లేదు. కళ్ల నుంచి కన్నీళ్లు మాత్రం రాలిపడుతున్నాయి. ‘‘ఎందుకురా ఏడుస్తున్నావ్? ఇకనైనా ఈ కన్నీటికి ఫుల్స్టాప్ పెట్టు’’... ఎప్పుడు వచ్చిందో ఆమె తల్లి, బాధగా అంది. కళ్లు తుడుచుకుంది సబీన్. ‘‘కన్నీళ్లకే కాదమ్మా, ఈ జీవితానికే ఫుల్స్టాప్ పెట్టాలని ఉంది’’ అంటూ బావురుమంది. అల్లాడిపోయింది తల్లి. గబగబా వెళ్లి కూతుర్ని గుండెకు హత్తుకుంది. ‘‘ఊరుకో తల్లీ. అయిపోయిందేదో అయిపోయింది. ఇక అన్నిటినీ మర్చిపో. కొత్త జీవితాన్ని మొదలుపెట్టు’’ అంటూ అనునయించే ప్రయత్నం చేసింది. ‘‘లేదమ్మా. పాత గాయాలు సలుపు తుంటే కొత్త జీవితాన్ని ఎలా మొదలు పెట్టమంటావ్. ఒకవేళ నేను మర్చిపోవా లని అనుకున్నా ఈ సమాజం నన్ను మర్చి పోనివ్వద్దు. పొద్దుట్నుంచీ మీడియా మళ్లీ నా వెంట పడుతోంది. ఇంకెలాగమ్మా నేను మర్చిపోయేది?’’ ఆమె అలా అంటూ ఉండగానే ఫోన్ మోగింది. తల్లి లిఫ్ట్ చేసింది. ‘‘నేనొక టీవీ రిపోర్టర్ని మేడమ్. మార్క్ కేసులో ఇవాళ తీర్పు వెలువడింది కదా! దాని గురించి మీ అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను. ఒకసారి తనని పిలుస్తారా?’’ సబీన్ తల్లి ముఖం కోపంతో ఎర్ర బడింది. ‘‘ఇంటర్వ్యూ కావాలా? అసలు జాలనేదే లేదా మీకు? ఎందుకు దాన్నిలా హింసిస్తున్నారు?’’... అరిచింది. అయినా అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేయలేదు. సబీన్ తల్లి ఎంత చెప్తున్నా ఆమె వదలడం లేదు. దాంతో సబీన్ ఫోన్ లాక్కుని ‘‘నేను సబీన్‌ని మాట్లాడు తున్నాను’’ అంది. ‘‘సబీన్ మీరా? మీకోసమే ఫోన్ చేశాను. మీరోసారి...’’ ‘‘మీ స్టూడియోకి రావాలి అంతే కదా’’... ఆమె మాట పూర్తి కాకుండానే అంది సబీన్. ‘‘నేను వస్తాను. ఇంటర్వ్యూ ఇస్తాను. ఏర్పాట్లు చేసుకోండి’’ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ‘‘సబీన్... నువ్వు ఇంటర్వ్యూ ఇస్తావా? వద్దురా’’ అంది తల్లి. ‘‘లేదమ్మా. నేను వెళ్తేనే ఈ కథకు ముగింపు దొరుకుతుంది’’ అంటూ లేచి బాత్రూమ్లోకి వెళ్లింది సబీన్. గంట తర్వాత... చానెల్ స్టూడియోలో ఉంది సబీన్. మొదలుపెడదామా అన్నట్టు సైగ చేసింది యాంకర్. సరేనన్నట్టు తలూపింది సబీన్. ‘‘అందరికీ నమస్కారం. ఈరోజు మార్క్ డ్యూట్రాక్స్ అనే సీరియల్ కిల్లర్‌కి ముప్ఫయ్యేళ్ల కఠిన కారాగారశిక్ష పడింది. ఆ కిరాతకుడి చేతి నుంచి తప్పించుకున్న ఏకైక వ్యక్తి సబీన్ డార్డెన్. ఆమె ఈ రోజు మన ముందు ఉన్నారు. ఆవిడ కథ ఏమిటో, అసలు ఆమె జీవితంలో ఏం జరి గిందో ఆవిడ ద్వారానే తెలుసుకుందాం’’ అని సబీన్ వైపు తిరిగింది యాంకర్. మరుక్షణం సబీన్ టీవీ స్క్రీన్ల మీద ప్రత్యక్షమయ్యింది. ‘‘చెప్పండి మిస్ సబీన్? ఎనిమిదేళ్ల క్రితం ఏం జరిగింది? పోలీసులు సీరియల్ కిల్లర్ మార్క్ ఇంటి మీద దాడి చేసి నప్పుడు మీరు అక్కడ దొరికారు. కానీ మీ పట్ల ఏం జరిగిందనేది ఇంతవరకూ మీరు చెప్పలేదు. అసలు మీరు ఆ సీరియల్ కిల్లర్ చేతికి ఎలా చిక్కారు?’’ గొంతు సవరించుకుంది సబీన్. మెల్లగా పెదవి మెదిపింది. ‘‘నా కథ తెలుసుకోవాలని అందరికీ ఆతృతగా ఉంది. నాపట్ల ఏం జరిగిందో తెలుసు కోవాలని ఉత్సుకతగా ఉంది. అందుకే ఎనిమిదేళ్లుగా మీడియా నా వెంట పడుతూనే ఉంది. కానీ నేనేరోజూ నోరు విప్పలేదు. ఎందుకంటే... పీడకలని పదే పదే తలచుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ ఈరోజు నా కథ చెప్పాలని అనుకుంటున్నాను. దానికి కారణం ఉంది. ఆ కారణం చివర్లో చెప్తాను. ముందు నా కథ వినండి’’ అంటూ చెప్పడం మొదలు పెట్టింది సబీన్. ఆగస్ట్ 13, 1996... స్కూలు నుంచి సైకిల్ మీద ఇంటికి బయలుదేరింది సబీన్. ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి వచ్చేసరికి ఒక కారు దూసుకొచ్చి ఆమె ముందు ఆగింది. అందులోంచి ఓ వ్యక్తి దిగాడు. సబీన్ దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. ఆమె నోటిలో గుడ్డలు కుక్కి కారులోకి నెట్టాడు. తప్పించుకోవా లని ప్రయత్నించింది సబీన్. ఆ అవకాశం ఇవ్వలేదతను. సబీన్ చెంపల మీద పిడి గుద్దులు గుద్దాడు. పన్నెండేళ్ల చిన్నపిల్ల... తట్టుకోలేకపోయింది. అతడి బలం ముందు ఓడిపోయి సొమ్మసిల్లింది. కళ్లు తెరిచేసరికి ఒకచోట బందీగా ఉంది సబీన్. ఆ చోటు ఏమిటో, ఎక్క డుందో అర్థం కాలేదు. కాళ్లూ చేతులూ కట్టేసి ఉన్నాయి. నోటిలో గుడ్డలున్నాయి. కదలడానికి లేదు. కనీసం అరవడానికి కూడా లేదు. దుఃఖం పొంగుకొచ్చింది. మౌనంగా ఏడుస్తూ చుట్టూ చూసింది. అదేదో ఇంటి బేస్మెంట్లా అనిపిస్తోంది. ఎక్కడ చూసినా చెత్త, పాత సామాన్లు, విరిగిన ఫర్నిచర్ లాంటివి ఉన్నాయి. అంతా మురికి మురికిగా ఉంది. కడుపులో దేవినట్లయ్యింది సబీన్కి. తన ఇల్లు గుర్తుకొచ్చింది. ఇంట్లో కాస్త దుమ్ము ఉన్నా ఇష్టం ఉండదు అమ్మకి. వెంటనే శుభ్రం చేస్తుంది. తన పక్క దుప్పటి కాస్త మురికిగా అనిపిస్తే వెంటనే తీసేసి తెల్లని దుప్పటి పరుస్తుంది. ‘‘ఆ మురికి అంటి నీ కూతురేం మాసిపోదులే’’ అని నాన్న సెటైర్లు వేస్తుంటారు. అలాంటిది తాను ఇలాంటి మురికి కూపంలో ఉన్నానని తెలిస్తే అమ్మకెలా ఉంటుంది! అమ్మానాన్నలు గుర్తురాగానే దుఃఖం మరింత ఎక్కువయ్యింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. అంతలో తలుపు తీసిన చప్పుడయ్యింది. సబీన్ గుండె జారిపో యింది. భయంగా తలుపు వైపు చూసింది. లోపలికి వచ్చి తలుపు గడియ పెడుతున్నాడతను. తనను ఎత్తుకొచ్చింది అతనే. ఇప్పుడు తనని ఏం చేస్తాడు? మెల్లగా సబీన్ దగ్గరకు వచ్చాడా వ్యక్తి. కట్లు విప్పాడు. నోటిలో ఉన్న గుడ్డలు లాగేశాడు. సబీన్ ఏదో మాట్లాడ బోయింది. కానీ అతడు అవకాశమివ్వ లేదు. పశువులా మీదపడ్డాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా మృగంలా విరుచుకుపడ్డాడు. పన్నెండేళ్ల ఆ లేత కుసుమాన్ని క్రూరంగా నలిపేశాడు. అలా ఒక్కసారి కాదు... ఎన్నోసార్లు చేశాడు. ఎనిమిది రోజుల పాటు తన పశువాంఛకు ఆ పసిదాన్ని బలి తీసుకున్నాడు. చెప్పడం ఆపి వెక్కి వెక్కి ఏడుస్తోంది సబీన్. టీవీల ముందు కూర్చుని చూస్తున్న వాళ్లందరి కళ్లూ కూడా చెమరుస్తున్నాయి. ‘‘కంట్రోల్ యువర్సెల్ఫ్ సబీన్... తర్వాత ఏమైంది?’’ అడిగింది యాంకర్. నిభాయించుకుంది సబీన్. ‘‘ప్రతి మగాడూ నాన్నలాంటివాడే అనుకునే వయసు అది. కానీ అందరూ నాన్నలా ఉండరని వాణ్ని చూశాక అర్థమయ్యింది. వాడెవడో నాకు తెలీదు. ఎందుకు కిడ్నాప్ చేశాడో తెలీదు. ఎందుకు నా శరీరంతో అలా ఆడుకుంటున్నాడో అర్థం కాదు. వాడు చేసే పనుల వల్ల నా శరీరం బాధకు గురవుతుంటే, వాడికి ఆనందం ఎందుకు కలుగుతోందో తెలిసేది కాదు. ఎనిమిది రోజులు నరకయాతన పడ్డాను. తర్వాత పోలీసులు వచ్చారు. నా తర్వాత మరో అమ్మాయిని కిడ్నాప్ చేశాడ ని, అది ఎవరో చూసి తమకు ఫోన్ చేసి చెబితే వాణ్ని అరెస్ట్ చేశామనీ చెప్పారు. నన్ను ఆ నరక కూపం నుంచి బయటకు తీసుకొచ్చారు. అదీ నా కథ.’’ ‘‘ఓహ్... సారీ సబీన్. మీ పట్ల ఇంత ఘోరం జరగడం నిజంగా బాధాకరం’’ అంది యాంకర్. వెంటనే పెద్దగా నవ్వింది సబీన్. ఒక క్షణం.. రెండు క్షణాలు... ఐదు క్షణాలు... అలా పగలబడి నవ్వుతూనే ఉంది. యాంకర్ విస్తుపోయింది. టీవీ చూస్తోన్న ప్రేక్షకులదీ అదీ పరిస్థితి. ఎందుకు నవ్వుతోందామె? నవ్వి నవ్వి ఆగింది సబీన్. ‘‘నిజంగా మీకు అంత బాధగా ఉందా?’’ అంది యాంకర్వైపు చూసి. తత్తరపడిందామె. ఏం మాట్లాడాలో అర్థం కాక గుటకలు మింగింది. ‘‘మీరు నిజంగా అంత బాధపడేవాళ్లే అయితే... ఈరోజు నేను ఇక్కడికి రావలసిన అవసరం ఉండేది కాదు. అప్పుడు... ఆ సమయంలో... ఆ రాక్షసుడు నాకు ఎనిమిది రోజుల పాటే నరకం చూపించాడు. కానీ మీరు... మీరు నన్ను ఎనిమిదేళ్ల పాటు నరకయాతన పెట్టారు’’... అరిచినట్టే అంది సబీన్. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ‘ ‘ఒక ఆడపిల్లని. తెలిసీ తెలియని వయసులో ఓ రాబందు రెక్కల మాటున బందీని అయ్యాను. వాడి క్రూరచర్యలకు బలయ్యాను. అదృష్టంకొద్దీ తప్పించుకుని బయటపడ్డాను. నా భవిష్యత్తు పాడు కాకూడదని, పోలీసులు నా పట్ల జరిగినదాన్ని దాచిపెట్టారు. కోర్టు కూడా నన్ను ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ చేయకుండా జాగ్రత్తగా డీల్ చేసింది. కానీ ఏం లాభం? మీరంతా కలిసి నాకసలు భవిష్యత్తే లేకుండా చేశారు. ఈ కేసు గురించి చర్చ వచ్చినప్పుడల్లా నన్ను మీడియా వాళ్లు బయటకు లాగాలని చూశారు. నన్ను వెంటాడారు, వేధించారు. బయటకు వెళ్తే ప్రతి ఒక్కరూ గుచ్చి గుచ్చి చూశారు. ఆ చూపులు గుండెల్లోకి గునపాల్లా దూసుకెళ్లా యని, ఆ చూపుల్లో ఉన్న వంద సందే హాలు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని ఛిద్రం చేసి పారేశాయని మీకెవ్వరికీ తెలియదు. నా మీద జాలి చూపమని నేనెవ్వరినీ అడగ లేదు. నా గాయాన్ని రేపకుండా ఉంటే చాలనుకున్నాను. కానీ ఆ ఆశ అడియాసే అయ్యింది. నాపట్ల ఏదో జరిగిందని మీ అనుమానం. అదేంటో తెలిసేవరకూ మీరు నన్ను వదలరని నాకు తెలుసు. అందుకే ఈరోజు మీ అందరి ముందుకూ వచ్చాను. మార్క్ డ్యూట్రాక్స్ నా జీవితాన్ని నాశనం చేశాడు కానీ నన్ను చంపలేదు. కానీ మీరు మీ చూపులతో, ప్రశ్నలతో ప్రతి క్షణం నన్ను చంపుతున్నారు. వాడు చేసిన గాయాన్ని పదే పదే రేపుతూ, వాడి కంటే ఎక్కువగానే నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇంతకంటే ఆ రోజు నేను వాడి చేతుల్లోనే చచ్చిపోయి ఉంటే ఎంతో బాగుండేది’’ అనేసి ఆవేశంగా లేచి వెళ్లిపోతోన్న సబీన్ వైపు నివ్వెరపోయి చూస్తూండిపోయింది యాంకర్. ఆ క్షణంలో టీవీ ముందు కూర్చున్న ఎంతోమంది మనసులు సిగ్గుతో చితికిపోయాయి. మానవ మృగం: మార్క డ్యూట్రాక్స్ మార్క్ డ్యూట్రాక్స్ ఓ సీరియల్ కిల్లర్. పదిహేనేళ్ల లోపు ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి బంధించేవాడు. వాళ్లను రాక్షసంగా అనుభవించేవాడు. అదంతా వీడియో తీసి బ్లూఫిల్ముల వ్యాపారం చేసేవాడు. కొత్త అమ్మాయిని తీసుకు రాగానే పాత అమ్మాయిని తిండి పెట్టకుండా మాడ్చి చంపేసేవాడు. అలా పదమూడుమంది అమ్మాయిల్ని పొట్టనబెట్టుకున్నాడు. సబీన్‌ని బందీగా ఉంచిన సమయంలోనే మరో అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. అది చూసిన ఓ వ్యక్తి మార్క్ కారు నంబరును పోలీసులకు తెలియజేశాడు. దాంతో పోలీసులు మార్క్‌ని, అతనికి సహకరించిన అతడి భార్య మిషెల్‌ని అరెస్ట్ చేశారు. సబీన్‌ని కాపాడారు. మార్క్‌కి న్యాయస్థానం ముప్ఫయ్యేళ్ల కఠిన కారాగారశిక్షను, మిషెల్‌కి పాతికేళ్ల శిక్షనూ విధించింది. ఇద్దరూ బ్రెజిల్ జైల్లో మగ్గుతున్నారు. - సమీర నేలపూడి -
నెత్తుటి రాత
క్రైమ్ ఫైల్ మన్‌హట్టన్ (అమెరికా)... నవంబర్ 2, 2006... ఆండీ ఆస్ట్రాయ్ కళ్లలోంచి కన్నీళ్లు జారిపడుతున్నాయి. అతని వైపే తీక్షణంగా చూస్తున్నాడు ఇన్స్పెక్టర్. ఆయన కళ్లలో కొద్దిగా జాలి. కొన్ని వందల ప్రశ్నలు. ‘‘ఊరుకోండి మిస్టర్ ఆండీ. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ నాకు...’’ ‘‘నేనే నేరస్తుడినని అనిపిస్తోంది... అంతే కదా’’... ఇన్స్పెక్టర్ మాట పూర్తి కాకముందే అన్నాడు ఆండీ. ‘‘మీ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆమెను మొదట చూసింది మీరే. మాకు ఫిర్యాదు చేసిందీ మీరే. మరి మొదట మా దృష్టి మీమీదే పడటం సహజం కదా?’’ నవ్వాడు ఆండీ. ‘‘మీ వివరణ అద్భుతంగా ఉంది సర్. ఫిర్యాదు చేసినవాళ్లే నేరస్తులు అయి ఉంటారన్న మీ అనాలసిస్ చాలా గొప్పగా ఉంది.’’ ఇన్స్పెక్టర్ ముఖం కోపంతో ఎర్ర బడింది. ‘‘మీరు మాట్లాడుతున్నది ఓ పోలీసాఫీసర్‌తో అని మర్చిపోకండి ఆండీ. ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో, ఎవరిని అనుమానించాలో మాకు తెలుసు. మీరు మా మీద సెటైర్లు వేయాల్సిన పని లేదు.’’ ‘‘నేను సెటైర్లు వేయడం లేదు సర్. మీ అనుమానం కరెక్ట్ కాదంటున్నాను.’’ ‘‘సరే. చెప్పారుగా. ఇక వెళ్లండి. అవసరమైతే మళ్లీ పిలుస్తాను’’... అనేసి ఫైల్లో తల దూర్చాడు ఇన్స్పెక్టర్. ఆండీ ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ ఇన్స్పెక్టర్ ముఖంలో కనిపిస్తోన్న సీరియస్ నెస్ అతణ్ని నోరు విప్పనివ్వలేదు. దాంతో మౌనంగా లేచి బయటకు నడిచాడు. ఆండీ బయటకు వెళ్లగానే సబార్డి నేట్స్ని పిలిచాడు ఇన్స్పెక్టర్. ‘‘అతని మీద ఓ కన్నేసి ఉంచండి. ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు... అన్ని వివరాలూ కావాలి నాకు. అతని ఫోన్ కాల్స్ కూడా ట్రేస్ చేయండి’’... అదేశించాడు. వాళ్లు సరేనని వెళ్లిపోయారు. ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడ్డాడు. ఆడ్రియానా షెల్లీ... ఆండీ ఆస్ట్రాయ్ భార్య. మంచి రచయిత్రి. టాలెంటెడ్ నటి. అద్భుతమైన దర్శకురాలు. టీవీలో పని చేసింది. సినిమా రంగంలో పని చేసేం తగా ఎదిగింది. అవార్డులూ రివార్డులూ అందుకుంది. ‘వెయిట్రస్’ అనే సినిమా తీసే పనిలో తల మునకలై ఉంది. కానీ అంతలోనే ఆత్మహత్య చేసుకుంది. సరిగ్గా ముందు రోజు అదే సమయానికి (నవంబర్ 1, 2006, సాయంత్రం 5:30) ఇన్స్పెక్టర్కి ఓ ఫోన్ వచ్చింది. ‘‘సర్... నా పేరు ఆండీ ఆస్ట్రాయ్. నా భార్య ఆడ్రియానా ఆత్మహత్య చేసుకుంది. మీరు వెంటనే రండి.’’ తక్షణం తన టీమ్‌ని తీసుకుని మన్ హట్టన్‌లోని వెస్ట్ విలేజ్ ప్రాంతంలో ఉన్న అబింగ్డన్ స్క్వేర్ అపార్ట్మెంట్స్కి చేరుకున్నాడు ఇన్స్పెక్టర్. బాత్రూములో.. షవర్ గొట్టానికి దుప్పటితో ఉరి వేసు కుంది ఆడ్రియానా. ‘‘తనని మొదట ఎవరు చూశారు?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘నేనే సర్. సాయంత్రం తన పని త్వరగా అయిపోయింది, ఇంటికి వెళ్తు న్నాను అని నాకు నాలుగ్గంటలకి ఫోన్ చేసింది. నేను ఐదున్నరకు ఇంటికొచ్చాను. తలుపు దగ్గరకు వేసివుంది. హాల్లో ఉయ్యాల్లో ఉన్న పాప ఏడుస్తోంది. ఆడ్రియానా కోసం ఇల్లంతా వెతికాను. చివరికి తను బాత్రూములో ఇలా...’’ ఆండీ గొంతు పూడుకుపోయింది. అర్థమైందన్నట్టు తలూపాడు ఇన్స్పెక్టర్. ఆడ్రియానా మృతదేహాన్ని కిందికి దించి, పోస్ట్‌మార్టమ్‌కి పంపించి, తనూ బయలు దేరాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతడి మెదడుని తొలుస్తున్న ప్రశ్న ఒకటే. కెరీర్ అంత సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న సమయంలో ఆడ్రియానా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? ఈ ప్రశ్న అతడిలో వంద సందేహాలను రేకెత్తిస్తోంది. అవన్నీ ఆండీ దగ్గరకు వెళ్లే ఆగుతున్నాయి. కచ్చితంగా వ్యక్తిగత జీవితంలోని సమస్య వల్లే ఆమె చనిపోయిందని ఇన్స్పెక్టర్కి అనిపిస్తోంది. రెండు మూడు రోజులపాటు ఇదే ఆలోచనల్లో ఉన్నాడు. తర్వాత అతడికి మరో ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి చెప్పింది విని అవాక్కయ్యాడు. వెంటనే హడావుడిగా బయలుదేరాడు. ‘‘ఏంటి సర్, ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా’’ గుమ్మంలో నిలబడిన పోలీసుల్ని చూసి అన్నాడు ఆండీ. ‘‘నేరస్తుడు పోలీసుల్ని వెతుక్కుంటూ ఎప్పుడూ రాడు. నేరస్తుణ్ని వెతుక్కుంటూ పోలీసులే వెళ్లాలి... తప్పదు’’ అన్నాడు ఇన్స్పెక్టర్ లోపలికి అడుగుపెడుతూ. నిట్టూర్చాడు ఆండీ. ‘‘నా భార్య పోయిందన్న బాధ కంటే ఆమె మరణానికి నేనే కార కుడినని మీరు వేస్తోన్న నిందే ఎక్కువ బాధపెడుతోంది సర్ నన్ను.’’ ‘‘ఆహా అలాగా! ఏ మూలో నీ మాటలు నిజమేమోనన్న అనుమానం ఉండింది నాలో. కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే నాకిప్పుడే ఓ కొత్త నిజం తెలిసింది. ఆడ్రియానా ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరో హత్య చేశారు.’’ విస్తుపోయాడు ఆండీ. ‘‘నిజమా సర్? తనది హత్యా? నేను అనుకుంటూనే ఉన్నాను. నా భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. కానే కాదు.’’ ఇన్స్పెక్టర్ భృకుటి ముడివడింది. అనుమానిస్తున్నాడే గానీ ఆండీలో నేరస్తుడి లక్షణాలు ఎక్కడా కనిపించడం లేదు. తడబాటు లేదు. మాటల్లో బాధ ఉంది. కళ్లలో నిజాయతీ ఉంది. పైగా తన టీమ్ అతణ్ని ఫాలో అవుతోంది. ఎక్కడా అతని ప్రవర్తనలో తేడా లేదు. అయినా కూడా ఆడ్రియానాది హత్య అని అటాప్సీ చేసిన డాక్టర్ ఫోన్ చేసి చెప్పగానే, కావాలనే ఆండీని పరీక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు కూడా ఆండీలో ఏ తేడా కనిపించడం లేదు. మరి హత్య ఎవరు చేశారు? ‘‘నేను క్రైమ్స్పాట్ని మళ్లీ చూడాలి’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘మీ ఇష్టం సర్’’ అన్నాడు ఆండీ. ఆడ్రియానా మరణించిన బాత్రూమ్ దగ్గరకు వెళ్లారు. ఆ రోజు వేసిన సీలును తొలగించి ఇన్స్పెక్టర్ లోనికి ప్రవేశించాడు. బాత్రూముని మరోసారి క్షుణ్నంగా పరిశీలించాడు. అతడి కళ్లు ఒకచోట ఆగిపోయాయి. క్లూ దొరికింది. వెంటనే అతని మెదడు చురుగ్గా పని చేయడం మొదలు పెట్టింది. ‘‘నిజం చెప్పు... ఆడ్రియానాని నువ్వే కదూ చంపింది?’’... గర్జించినట్టే అన్నాడు ఇన్స్పెక్టర్. అతడికి ఎదురుగా కూర్చుని ఉన్న పందొమ్మిదేళ్ల డీగో పిలికో భయంతో వణికాడు. ఇక తప్పించుకోలేనని అర్థమై మొత్తం కక్కేశాడు. ఆడ్రియానా వాళ్లు నివసిస్తోన్న అపార్ట్ మెంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది. అక్కడికి కూలీగా వచ్చాడు డీగో. ఓ రోజు అందరూ భోజనం చేయడానికి వెళ్లారు. ఆకలిగా లేకపోవడంతో డీగో మాత్రం పని చేస్తున్నాడు. ఇనుపరాడ్లను సుత్తితో కొడు తున్నాడు. అంతలో ఆడ్రియానా వచ్చింది. చాలా శబ్దం వస్తోందని, పాప నిద్ర పాడ వుతోంది మెల్లగా పని చేసుకొమ్మని అంది. నువ్వే సర్దుకుపో అంటూ నిర్లక్ష్యంగా సమా ధానమిచ్చాడు డీగో. ఆడ్రియానా ఏదో చెప్పబోతే ఎగ తాళిగా మాట్లాడాడు. ఆమెకు కోపం వచ్చింది. వెళ్లి అపార్ట్ మెంట్ యజమానికి ఫిర్యాదు చేసింది. అతడు కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్‌కి విషయం చెప్పాడు. అతడు డీగోని పిలిచి క్లాసు పీకాడు. దాంతో పగబట్టాడు డీగో. నవంబర్ 1 సాయంత్రం క్రష్ నుంచి పాపను తీసుకుని ఇంటికొచ్చింది ఆడ్రియానా. కార్ పార్క్ చేసి తన ఫ్లాట్‌కి వెళ్తోన్న ఆమెను అనుసరించాడు డీగో. ఆమె వెనకాలే అపార్ట్మెంట్లోకి దూసు కెళ్లాడు. ఆడ్రియానా మీద దాడి చేశాడు. ఆమె చెప్పేది కనీసం వినకుండా పీక నులిమి చంపేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు బాత్రూమ్లోకి తీసుకెళ్లి దుప్పటితో ఉరి వేశాడు. అంతా విని చాచి కొట్టాడు ఇన్స్పెక్టర్. ‘‘మనిషివా రాక్షసుడివా! చిన్నబిడ్డకు తల్లి. ఆ పాప కళ్లముందే తల్లిని చంపేశావ్. అది కూడా చిన్న కారణానికి. నిన్నేం చేసినా పాపం లేదు... ఛీ’’ అనేసి బయటకు వచ్చే శాడు. అతడి కోసమే ఎదురు చూస్తోన్న ఆండీ కంగారుగా లేచి దగ్గరకు వెళ్లాడు. ‘‘ఏమైనా చెప్పాడా?’’ అన్నాడు ఆతృతగా. ‘‘సారీ ఆండీ... మిమ్మల్ని అనుమా నించాను. మీ భార్యను చంపింది వీడే’’ అని, ఏం జరిగిందో చెప్పాడు. ఆండీ కళ్లలో నీళ్లు పొంగుకొచ్చాయి. ‘‘అంత చిన్నదానికి నా భార్యను చంపేశాడా? చేతులెలా వచ్చాయి సర్ వాడికి? నా బిడ్డను తల్లి లేనిదాన్ని చేశాడు’’ అంటూ చేతుల్లో ఉన్న పాపను గుండెకు హత్తుకు న్నాడు. ఓదార్పుగా అతని భుజమ్మీద చేయి వేశాడు ఇన్స్పెక్టర్. ‘‘అసలు వాడే చంపి ఉంటాడని మీకెలా అనుమానం వచ్చింది సర్’’... అడిగాడు ఆండీ. ‘‘రెండోసారి బాత్రూమ్ని పరిశీలించి నప్పుడు ఇసుక కనిపించింది. అప్పుడే నా దృష్టి కన్స్ట్రక్షన్ వర్క్ మీద పడింది. అక్కడ మాత్రమే ఇసుక ఉంది. అది ఆడ్రియానా చెప్పులకు అంటుకునే చాన్స్ లేదు. తర్వాత ఇంట్లోకి వచ్చిన నీ బూట్లకూ అంటుకునే అవకాశం లేదు. కచ్చితంగా అక్కడి నుంచే ఎవరో వచ్చి ఉంటారనిపించింది. అందరి గురించీ ఎంక్వయిరీ చేస్తే గతంలో డీగో మీద ఆడ్రియానా కంప్లయింట్ ఇచ్చిన విషయం బయటికొచ్చింది. వాణ్ని లాక్కొచ్చి నాలుగు పీకితే నిజం కక్కాడు.’’ ‘‘మ్మ్మ్... నా భార్య ఎన్నో కథలు రాసింది. వీడు మాత్రం తన నుదుటన నెత్తుటి రాత రాశాడు. వస్తాను సర్’’ అనేసి వెళ్లిపోతోన్న ఆండీ వైపు జాలిగా చూస్తూండిపోయాడు ఇన్స్పెక్టర్. ఆడ్రియానా భర్త ఆండీ, వారి ప్రేమకు ప్రతిరూపం సోఫియా ఆవేశంలో చేసినా, డీగో చేసిన నేరాన్ని తీవ్రగానే పరిగణించింది న్యాయస్థానం. పెరోల్ తీసుకునే అవకాశం కూడా లేకుండా పాతికేళ్ల కఠిన కారాగారశిక్షను విధించింది. ప్రస్తుతం అతను జైలులో మగ్గుతున్నాడు. ఆడ్రియానా గుర్తుగా ‘ఆడ్రియానా షెల్లీ ఫౌండేషన్’ను స్థాపించాడు ఆమె భర్త ఆండీ. దాని ద్వారా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ను, పేద రోగులకు వైద్య సహాయాన్ని, పేద కళాకారులకు ఆర్థిక సాయాన్నీ అందిస్తున్నాడు. తమ ప్రేమకు గుర్తుగా మిగిలిన కూతురు సోఫీ (ప్రస్తుతం ఏడేళ్లు)ని గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు. - సమీర నేలపూడి -
ఆట ముగిసింది
నిజాలు దేవుడికెరుక * ప్రపంచమే మెచ్చిన క్రీడాకారుడు * యువతకు ఆరాధ్యదైవం అతడు * మరి నేరస్తుడు ఎలా అయ్యాడు? ఏప్రిల్ 15, 2015. అమెరికాలోని మసాచుసెట్స్... కోర్టు హాలు జనంతో కిక్కిరిసి ఉంది. కోర్టు బయట కూడా అంతా కోలా హలంగా ఉంది. అందరూ ఏదో సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. ఆ రోజు వెలువడబోయే తీర్పు గురించి టెన్షన్ పడు తున్నారు. అంతలో ఒక్కసారిగా అంతా నిశ్శబ్దంగా అయిపోయింది. న్యాయమూర్తి వచ్చారు. తనని చూడగానే లేచి నిలబడిన వాళ్లందరినీ కూర్చోమని సైగ చేస్తూ తన సీట్లో ఆసీనులయ్యారు. వాదోపవాదాలు మొదలుపెట్టమని ఆదేశించారు. న్యాయమూర్తులు లేచారు. ఒకరిని మరొకరు ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నాలు చేశారు. తమను తాము సమర్థించు కున్నారు. చివరి వాదనను యమ జోరుగా వినిపించి కూర్చున్నారు. న్యాయమూర్తి తీర్పు రాయడం మొదలుపెట్టారు. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఆయన ఏం తీర్పు చెప్పబోతున్నారు?! వారి ఉత్కంఠకు తెర వేస్తూ న్యాయ మూర్తి పెదవి విప్పారు. ‘‘ఓడిన్ లాయిడ్ అనే వ్యక్తిని హత్య చేసినందుకుగాను ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఆరన్ హెర్నా డెంజ్కు యావజ్జీవిత ఖైదును విధించడ మైనది. ఈ శిక్షను ఆరన్ పూర్తిగా అనుభ వించాలి. బెయిల్ అప్లై చేసుకునే అవ కాశాన్ని న్యాయస్థానం ఇవ్వడం లేదు.’’ అందరూ అవాక్కయ్యారు. కొందరి కైతే కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ప్రతి ఒక్కరి కళ్లూ ఆరన్ వైపు తిరిగాయి. ఆరన్ తల దించుకున్నాడు. రెండు చేతులతో ముఖాన్ని మూసుకున్నాడు. కొన్ని క్షణాల పాటు అలానే ఉండిపోయాడు. తర్వాత లేచి అందరి వైపూ చూశాడు. ఒక అమ్మాయి మీద అతని దృష్టి ఆగిపోయింది. ఆమె ఏడుస్తోంది. ఏడపును ఆపుకోలేక అవస్థ పడుతోంది. ఆరన్ వైపే దిగులుగా చూస్తోంది. ‘ఈ యెడబాటు నేను తాళలేను’ అన్న భావం ఉంది ఆమె చూపుల్లో. ఆమెనా స్థితిలో చూసి తట్టుకోలేక పోయాడు ఆరన్. చెమ్మగిల్లుతోన్న కళ్లను వేళ్లతో తుడుచుకున్నాడు. మౌనంగా పోలీసుల వెంట నడిచాడు. అంతవరకూ బయట నిలబడి చూస్తోన్న అభిమానులు ఆరన్‌తో కర చాలనం చేయడానికి ఎగబడ్డారు. అతడిని పలుకరించాలని పరితపించారు. వారి కళ్లు తడుస్తున్నాయి. వాళ్ల మనసులు బాధతో మూలుగుతున్నాయి. తమ ఆరాధ్య క్రీడా కారుడు జైలుకు వెళ్లిపోతుంటే వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. అతడు హత్య చేశాడంటే వాళ్లు నమ్మలేకపోతున్నారు. నిజంగానే ఆరన్ ఆ నేరం చే సి ఉంటాడా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ... ఆరన్ నిజంగానే ఆ హత్య చేశాడా? లేక అతడు ఆ నేరంలో ఇరుక్కున్నాడా? అసలు ఏం జరిగింది??? జూన్ 18, 2013. ఉత్తర అటెల్బరోలోని ఇండస్ట్రియల్ పార్క్... పోలీసు జీపు వేగంగా వచ్చి ఆగింది. నలుగురైదుగురు పోలీసులు బిలబిల మంటూ దిగారు. వారిని చూస్తూనే ఓ వ్యక్తి పరిగెత్తుకు వచ్చాడు. ‘‘నేనే సర్ ఫోన్ చేసింది’’ అన్నాడు రొప్పుతూ. ‘‘ఎక్కడ?’’... అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘నాతో రండి’’ అంటూ లోనికి నడిచాడా వ్యక్తి. పోలీసులు అతణ్ని అనుసరించారు. పార్క్‌లో... ఓ మూలగా... వెల్లకిల్లా పడి ఉంది ఓ వ్యక్తి మృతదేహం. వయసు ముప్ఫైకి మించదు. శరీరంలో ముందు నుంచీ వెనుక నుంచీ కూడా బుల్లెట్లు దూసుకుపోయాయి. రక్తం ఎగజిమ్మి చుట్టు పక్కలంతా పడింది. ‘‘ఇతనెవరో నీకు తెలుసా?’’ ఇన్స్పెక్టర్ అలా అడగ్గానే తల అడ్డంగా ఊపాడా వ్యక్తి. ‘‘ఏదో కాసేపు రిలాక్స్ అవుదామని పార్క్‌కి వచ్చాను. అనుకోకుండా ఈ డెడ్‌బాడీని చూశాను. వెంటనే మీకు ఫోన్ చేశాను’’... చెప్పాడు. అప్పటికే జనం గుమిగూడారు. ‘‘మీలో ఎవరికైనా ఇతను తెలుసా?’’... అక్కడున్న వాళ్లందరినీ ఉద్దేశించి అడిగాడు ఇన్స్పెక్టర్. ఎవ్వరూ మాట్లాడలేదు. దాంతో ఆధారాల కోసం పరిసరాలన్నీ వెతకడం మొదలుపెట్టారు. అంతలో ఓ అసిస్టెంట్... ‘‘సర్... ఇది చూడండి’’ అంటూ అరిచాడు. అందరూ అటువైపు వెళ్లారు. అక్కడ ఒక సెల్‌ఫోన్ ముక్కలు ముక్కలుగా పడి ఉంది. సిమ్ ఓ చోట, బ్యాటరీ ఓ చోట, మిగతా భాగాలు వేరేచోట చెల్లాచెదరుగా పడివున్నాయి. ‘‘వాటన్నిటినీ కలెక్ట్ చేయండి. ఆ నంబర్ ఎవరిదో కనుక్కోండి. బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించండి.’’ ఇన్స్పెక్టర్ ఆదేశించగానే ఆ పనుల్లో మునిగిపోయారు సబార్డినేట్స్. కాలింగ్ బెల్ మోగీ మోగగానే తలుపు తెరచుకుంది. ‘‘ఎవరు కావాలి సర్’’ అన్నాడు తలుపు తెరచిన వ్యక్తి. ‘‘ఆరన్ హెర్నాండెజ్’’... సింపుల్‌గా చెప్పాడు ఇన్స్పెక్టర్. అతను లోపలికి వెళ్లాడు. ఐదు నిమి షాల తర్వాత ఆరన్ వచ్చాడు. వస్తూనే ఇన్స్పెక్టర్కి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. కూర్చో మంటూ మర్యాదలు చేయబోయాడు. వద్దని వారించాడు ఇన్స్పెక్టర్. ‘‘సారీ మిస్టర్ ఆరన్. మేమిక్కడికి మీ అభిమానులుగా రాలేదు. ఓడిన్ లాయిడ్‌ని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం.’’ ‘‘వ్వాట్’’... నేను హత్య చేశానా? అది కూడా ఓడిన్‌ని. తనెవరో తెలుసా? నా చెల్లెలు ప్రేమించిన వ్యక్తి. అయితే గియితే అతణ్నిచ్చి మా చెల్లికి పెళ్లి చేస్తాను గానీ హత్య ఎందుకు చేస్తాను సర్?’’ నవ్వాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎవరు ఏది ఎందుకు చేస్తారో నాకు తెలుసు మిస్టర్ ఆరన్. ఎక్కువ తర్కించకుండా కో ఆపరేట్ చేయండి’’ అంటూ సబార్డినేట్ వైపు చూశాడు. అతడు ముందుకు వచ్చి ఆరన్ చేతికి బేడీలు వేశాడు. ‘‘సర్ నేను చెప్పేది వినండి... నేనీ హత్య చేయలేదు’’... ఆరన్ అరిచాడు. కానీ పోలీసులు వినే స్థితిలో లేరు. వాళ్లు పూర్తి ఆధారాలతో వచ్చారు. పార్కులో దొరికిన సెల్‌ఫోన్ ఆరన్దేనని తేలింది. అయినా వెంటనే అతణ్ని అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆరన్ పెద్ద సెలె బ్రిటీ. దేశ ఖ్యాతిని పెంచిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ప్రపంచం నలు మూలలా అతనికి అభిమానులు ఉన్నారు. అలాంటివాడిని బ్లైండ్‌గా అరెస్ట్ చేస్తే ఏమవుతుందో వారికి తెలుసు. అందుకే ముందు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేశారు. ఆరన్ ఇంటి మీద, అతనికి సంబంధించిన మనుషుల మీద నిఘా పెట్టారు. ఆరన్ ఇంట్లో పనిచేసే ఓ వ్యక్తి మొదటి ఆధారాన్ని అందించాడు. ఆ రోజు ఆరన్కి, ఓడిన్కి ఆరన్ ఇంట్లో ఎందుకో వాదన జరిగింది. ఆరన్ రెచ్చిపోయాడు. ఓడిన్ మీద కలబడ్డాడు. అతణ్ని గాయపరిచాడు. తర్వాత నెమ్మదించాడు. ఓడిన్కి ఏదో చెప్పి బయటకు తీసుకువెళ్లాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికి హడావుడిగా వచ్చాడు. తాను ఓడిన్‌ని గాయపర్చినప్పుడు కారిన రక్తాన్ని పనివాళ్లతో శుభ్రం చేయించాడు. ఈ సమాచారాన్ని బట్టి, ఓడిన్‌ని పార్క్‌కి తీసుకెళ్లి హత్య చేశాడని అంచనా వేశారు పోలీసులు. ఆ తర్వాత ఆరన్‌తో సహజీవనం చేస్తోన్న షయానా జెంకిన్స్ని విచారించారు. ఆమె మొదట ఆరన్ నిర్దోషి అని వాదించింది. కానీ పోలీసుల తెలివి తేటల ముందు ఎక్కువసేపు నటించలేక పోయింది. ఆరన్ తనకి ఓ పెట్టె ఇచ్చాడని, దాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్ట మన్నాడని చెప్పింది. అది హత్యకు ఉప యోగించిన ఆయుధమని కనిపెట్టడానికి పోలీసులకు పెద్ద సమయం పట్టలేదు. ఈ సాక్ష్యాలతో పాటు ఆరన్ ప్రవర్తన కూడా అతని చుట్టూ ఉచ్చు బిగియడానికి కారణమయ్యింది. ఆరన్ ఆవేశపరుడు. 2007లో ఓ బార్లో బాగా తాగి బిల్లు కట్ట డానికి నిరాకరించాడు. నిలదీసిన వెయి టర్ని గాయపర్చాడు. కొన్ని నెలల తర్వాత ఓ నైట్ క్లబ్బులో ఇద్దరు వ్యక్తులతో వాదనకు దిగి, ఆవేశంలో వాళ్లని షూట్ చేశాడు. 2012లో జరిగిన జంట హత్యల కేసుతో కూడా అతడికి సంబంధం ఉందన్న ఆరోపణలున్నాయి. అవన్నీ విచా రణలో ఉండగానే ఈ హత్య జరిగింది. ఆధారాలన్నీ ఆరన్ వైపే చూపించాయి. దాంతో పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. రెండేళ్ల విచారణ తర్వాత అన్ని కేసులకూ కలిపి ఒకేసారి తీర్పు వెలువడింది. ఓడిన్‌ని ఆరనే హత్య చేశాడని, మిగతా అన్ని కేసుల్లోని ఆరోపణలు కూడా నిజమేనని తేలింది. ఆరన్‌కు జీవితఖైదు పడింది. ఒకనాడు ప్రపంచమంతా అభిమానుల్ని సంపాదించుకున్న ఓ గొప్ప ఆటగాడు, నేడు నేరస్తుడిగా అదే ప్రపంచం ముందు తలదించుకుని నిలబడ్డాడు. అభిమాన సందోహంలో ఉక్కిరి బిక్కిరైన ప్రముఖుడు... ఇప్పుడు ఒంటరిగా జైలు గదిలో ఊచలు లెక్కబెడుతున్నాడు. అతడేమీ ప్లాన్ చేసి నేరాలు చేయలేదు. కానీ తన బలహీన తను జయించలేకపోయాడు. ఆవేశాన్ని అణచుకోలేక అంత పెద్ద ఘోరానికి పాల్పడ్డాడు. ప్రాణంగా ప్రేమించే ప్రియురాలిని ఒంటరిదాన్ని చేశాడు. ప్రాణమిచ్చే అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. పరువును మంటగలుపుకుని, ప్రతిష్టను దిగజార్చుకుని, హంతకుడన్న ముద్రను వేసుకుని కటకటాల వెనుక కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. కానీ ఆ కన్నీళ్లను ఎవరూ తుడవరు. అతడిని ఎవరూ ఓదార్చరు. ఎందుకంటే... తప్పు చేసింది సామాన్యుడైనా, సెలెబ్రిటీ అయినా... శిక్ష అనుభవించక తప్పదు! - సమీర నేలపూడి ఆరన్ ప్రేయసి... షయానా జెంకిన్స హత్య కేసులో అరెస్టయ్యి, తీర్పు వెలువడే లోపు ఆరన్, షయానాలకి ఓ పాప పుట్టింది. ఆ పాప కోసమైనా అతడు నిర్దోషిగా విడుదల కావాలని తపించింది షయానా. కానీ ఆమె ఆశ ఫలించలేదు. ఆరన్ జైలుకు వెళ్లక తప్ప లేదు. అయితే ఆరన్ హంతకుడు కాదు అని ఇప్పటికీ వాదించేవాళ్లు కొందరు ఉన్నారు. ఎందుకంటే ఓడిన్‌ని ఆరన్ షూట్ చేయడం ఎవరూ ప్రత్యక్షంగా చూడలేదు. అలాంటప్పుడు అతడే చంపాడని ఎలా నిర్ధారిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు వాళ్లు. కానీ ఆ ప్రశ్నను ఆరన్ మాత్రం సంధించలేకపోయాడు. ప్రతి మాటకీ తడబడ్డాడు. ప్రతి ప్రశ్నకూ పొంతన లేని సమాధానాలే చెప్పాడు. అతడే నేరం చేశాడని న్యాయస్థానం నమ్మడానికి అతడిలోని ఆ తడబాటు కూడా ఒక కారణమయ్యింది. -
ప్లాట్ నం.201
నిజాలు దేవుడికెరుక ప్రతి మనిషీ తన ఇంటిని స్వర్గంలా అనుకుంటాడు. కానీ ఆ ఇల్లు నరకంలా మారితే? నిలువునా వణికిస్తే? ఏం చేయాలి? ఎలా భరించాలి? ఎలా బటయపడాలి? అది తెలియకే అల్లాడారు వాళ్లు. ఆదుకునే హస్తం కోసం ఆశగా చూశారు. ఇంతకీ ఎవరు వాళ్లు? వాళ్ల పట్ల ఏం జరిగింది? అక్టోబర్, 2009... ముంబై. ఓ ప్రైవేటు ఆస్పత్రి జనంతో కిటకిటలాడుతోంది. డాక్టర్ల పిలుపుకోసం ఎదురు చూస్తోన్న రోగులు, రోగులకు సేవలు అందించేందుకు చకచకా తిరుగుతోన్న సిబ్బందితో అంతా హడావుడిగా ఉంది. వాళ్లందరినీ దాటుకుంటూ, అడుగులో అడుగు వేసుకుంటూ, బిత్తర చూపులు చూస్తూ నడుస్తున్నాడో వ్యక్తి. అతని వయసు అరవై వరకూ ఉంటుంది. చెదిరిన పల్చని జుత్తు, అంతగా ఖరీదు చేయని బట్టలు, ఎవరికీ అర్థం కాని హావభావాలు... కాస్త విచిత్రంగా ఉన్నాడు. అతని చేతిలో ఉన్న క్యారీ బాగుల్లో యాపిల్స్, బిస్కట్స్, కేక్స్ కనిపిస్తున్నాయి. వాటిని బట్టి ఆస్పత్రిలో ఉన్న తమ వారినెవరినో చూడటానికి వచ్చాడని అర్థమవుతోంది. ‘బి’ వార్డులో ఉన్న ఓ గది దగ్గరకు వెళ్లి ఆగాడా వ్యక్తి. లోపలకు వెళ్లాలను కున్నాడు కానీ, గుమ్మం దగ్గర ఉన్న వార్డ్బాయ్ అడ్డుకున్నాడు. ‘‘ఎక్కడికి సొంత ఇంట్లోకి వెళ్లినట్టు వెళ్లిపోతున్నావ్? నడు బయటికి’’ అన్నాడు కళ్లెర్రజేసి. ఆ వ్యక్తి కంగారు పడలేదు. ‘‘నా భార్యని, పిల్లల్ని చూడాలి’’ అన్నాడు ఎంతో సౌమ్యంగా. కానీ వార్డ్బాయ్ కనికరించలేదు. ‘‘అవన్నీ కుదరవ్. మాట్లాడకుండా దయచెయ్’’ అంటూ చెయ్యి పట్టుకుని బలంగా బయటకు లాక్కొచ్చాడు. మెయిన్ డోరు దగ్గర వదిలిపెట్టి ఇక వెళ్లు అన్నట్టు సైగ చేశాడు. విధి లేక వెనుదిరిగాడా వ్యక్తి. ‘‘ఎంత అన్యాయం? నా భార్యని, పిల్లల్ని నేను చూడకూడదా? ఎందుకని? నేనేం చేశానని?’’... తనలో తనే గొణుక్కుంటున్నాడు. ఆస్పత్రి సిబ్బందిని తిట్టుకుంటున్నాడు. తడబడుతోన్న అడుగులతో సాగిపోతున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? కుటుంబాన్ని కలిసే అవకాశం కూడా అతడికి ఎందుకు దొరకడం లేదు? అతడు నిజంగానే ఏదైనా చేశాడా? లేక అతడికే ఏదైనా అన్యాయం జరుగుతోందా? సెప్టెంబర్, 2009... ముంబై నీలాంబ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్.ఎస్సై ముఖం సీరియస్‌గా ఉంది. తనకి ఎదురుగా ఉన్న వ్యక్తి చెప్తోన్న విషయాలు శ్రద్ధగా వింటున్నాడు. ‘‘ఇప్పుడు అర్థమైంది కద సర్ విషయం. ఎలాగైనా మీరే ఈ విషయంలో సాయం చేయాలి. మనం త్వరపడకుంటే చాలా దారుణం జరిగిపోతుంది.’’ సరే అన్నట్టు తల పంకించాడు ఎస్సై. ‘‘పదండి వెళ్దాం’’ అంటూ సీట్లోంచి లేచాడు. కానిస్టేబుల్స్‌ని, ఆ వ్యక్తిని తీసుకుని నీలాంబ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి బయలుదేరాడు. పది నిమిషాల్లో వాళ్ల జీపు ఓ మూడంతస్తుల బిల్డింగ్ దగ్గర ఆగింది. అది ఓ మామూలు బిల్డింగ్. చూడ్డానికి రిచ్‌గానూ లేదు. అలా అని మరీ పాతగానూ లేదు. ‘‘ఇదే కదా?’’ అన్నాడు ఎస్సై దాన్ని చూస్తూనే. ‘‘అవును సర్’’ అన్నాడా వ్యక్తి. అందరూ కలిసి ముందుకు కదిలారు. ఫ్లాట్ నంబర్ 201కి చేరుకున్నారు. ‘‘తాళం వేసి ఉంది కద సర్’’ అన్నాడు కానిస్టేబుల్, తలుపునకు వేళ్లాడుతోన్న తాళం కప్పని చూసి. ‘‘పగలగొట్టండి’’ అన్నాడు ఎస్సై. క్షణాల్లో తాళం బద్దలయ్యింది. తలుపులు తెరుచుకున్నాయి. లోపల అడుగు పెడుతూనే అందరూ తుళ్లిపడ్డారు. అది ఇల్లులా లేదు. గోడౌన్లా ఉంది. ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ లేదు. అన్నీ చిందర వందరగా పడివున్నాయి. గోడల నిండా బూజులు. ఎక్కడ చూసినా దట్టంగా పేరుకున్న దుమ్ము. దానికి తోడు ముక్కు పుటాలను అదరగొట్టే దుర్వాసన. ‘‘ముంబైలాంటి మహా నగరంలో... ఓ మంచి హౌసింగ్ సొసైటీ మధ్యలో... ఇంత పెద్ద అపార్ట్మెంట్లో... ఇలాంటి ఫ్లాటా? అసలేం జరుగుతోందిక్కడ?’’... విస్తుపోతూ అన్నాడు ఎస్సై. గబగబా అందరూ ఇల్లంతా తిరిగారు. ఏ గదిలోనూ ఏమీ లేదు. కానీ ఒక గదికి మాత్రం తాళం పెట్టి ఉంది. ఆ గదిలోంచి భయంకరమైన వాసన వస్తోంది. దాన్ని తెరవమని సైగ చేశాడు ఎస్సై. కానిస్టేబుల్స్ తాళం పగులగొట్టి తలుపు తెరిచారు. అంతే... లోపల ఉన్న దృశ్యాన్ని చూసి అవాక్కయిపోయారంతా. అది గదిలా లేదు... చెత్తకుప్పలా ఉంది. మలమూత్రాలు కలిసిన వాసన పేగుల్ని మెలిపెడుతోంది. కిటికీలన్నీ మూసివున్నాయి. తెరవడానికి వీల్లేకుండా చెక్కలు అడ్డుగా పెట్టి, మేకులు కొట్టేసి ఉన్నాయి. ఒక్క లైటు కూడా లేక చీకటి గుహలా ఉంది. ఆ చీకట్లోంచి ఎవరివో మూలుగులు వినిపిస్తున్నాయి. బాధగా... ఆర్తిగా... ఆవేదనగా... ‘‘కానిస్టేబుల్... టార్చ్ తీసుకురా. క్విక్’’... అరిచినట్టే అన్నాడు ఎస్సై. కానిస్టేబుల్ పరుగెత్తుకెళ్లి టార్చ్ తెచ్చాడు. దాని వెలుగులో కనిపించిన రూపాలు బహుశా ఆ పోలీసులు ఎప్పటికీ మర్చిపోలేరేమో. ఒక తల్లి... ఇద్దరు కూతుళ్లు. ప్రాణాలతో ఉన్నారు అంతే. ఒంట్లో గుప్పెడు మాంసమైనా లేదు. చర్మం ఎముకలకు అతుక్కుపోయింది. కళ్లు పీక్కుపోయాయి. ఒకే భంగిమలో ఎక్కువ కాలం ఉండిపోవడంతో శరీరాలు వంగిపోయాయి. ఊపిరి సైతం కష్టంగా తీసుకుంటున్నారు. మృత్యువు వస్తే కౌగిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ల స్థితి చూసి ఖాకీల హృదయాలు సైతం కదిలిపోయాయి. వెంటనే అంబులెన్సును పిలిచారు. అందులోకి ఎక్కిస్తుంటే ఒక అమ్మాయి అతి కష్టమ్మీద గొంతు పెగల్చుకుని అంది... ‘‘మమ్మల్ని దూరంగా తీసుకెళ్లిపోండి సర్. మమ్మల్ని కాపాడండి సర్. లేదంటే మా నాన్న మమ్మల్ని చంపేస్తాడు.’’ విషయం అర్థమైంది ఎస్సైకి. వాళ్లని ఆస్పత్రికి పంపించి, తర్వాత చేయాల్సిన పనిలో మునిగిపోయాడు. ‘‘మీరు నన్ను అపార్థం చేసుకుంటు న్నారు సర్. నేను సైకోని కాదు. వాళ్ల తండ్రిని. వాళ్లు నా సొంత పిల్లలు. వాళ్లంటే నాకు ప్రాణం. వాళ్లని నేనెందుకు చంపుతాను?’’... అమాయకంగా ముఖం పెట్టి చెబుతోన్న ఫ్రాన్సిస్ గోమెజ్ చెంప ఛెళ్లుమనిపించాడు ఎస్సై. ‘‘నువ్వు తండ్రివా? తిండి కూడా పెట్టకుండా వాళ్లని చీకటి గదిలో బంధించావ్. చిత్రహింసలకు గురి చేశావ్. ఇంతకంటే చావే నయం అనుకునే స్థితికి తెచ్చావ్. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా?’’ అరిచాడు. ‘‘అలా అంటారేంటి సర్? నా పిల్లలను నేను కాపాడుకోవాలనుకోవడం తప్పా? రోజులు బాలేదు కద సర్. బయటికెళ్లినప్పుడు వాళ్లనెవరైనా రేప్ చేస్తే? అందుకే జాగ్రత్తగా దాచిపెట్టాను.’’ ఎస్సైకి బుర్ర గిర్రున తిరిగింది. అతగాడి ఆలోచనకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అతడికే కాదు, ఫ్రాన్సిస్ మాటలు వింటే ఎవరికైనా అలానే అని పిస్తుంది. నిజానికి ఒకప్పుడు అతడు అలా మాట్లాడేవాడు కాదు. ఎంతో హుందాగా ఉండేవాడు. అందంగా మాట్లాడేవాడు. తన భార్య థెరెసా... కూతుళ్లు జెనెవీవ్, ఎలిజబెత్, బార్బరాల కోసం ప్రాణమివ్వడానికైనా సిద్ధంగా ఉండేవాడు. కానీ ఓరోజు టీవీలో చూసిన ఒక వార్త అతడిని పూర్తిగా మార్చేసింది. ఆ మార్పు వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఓ అమ్మాయిని ఎవరో రేప్ చేసి చంపేశారంటూ టీవీలో ఒక వార్త చూసిన ఫ్రాన్సిస్, తన కూతుళ్లకు ఏ ప్రమాదం వస్తుందో ఏమోనని భయపడటం మొదలుపెట్టాడు. ఆ భయం మితిమీరి శాడిజంలా మారింది. సంరక్షణ పేరుతో సంకెళ్లు వేయడం మొదలెట్టాడు. పిల్లల్ని గడప దాటనిచ్చేవాడు కాదు. టీవీ కూడా చూడనిచ్చేవాడు కాదు. ఓసారి అతడు లేనప్పుడు ఓ కూతురు బయటకు వెళ్లి వచ్చింది. మరో కూతురు టీవీ చూసింది. ఆ సంగతి తెలియగానే టీవీ పగుల గొట్టేశాడు. ముగ్గుర్నీ గదిలో పడేశాడు. వాళ్లని సపోర్ట్ చేసిందని భార్యనీ వాళ్లతో పాటే బంధించాడు. తిండి పెట్టేవాడు కాదు. ఆకలి తాళలేక వాళ్లు న్యూస్ పేపర్లు తినేవారు. నీళ్లు లేక గొంతు పిడచకట్టుకు పోతుంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని విలవిల్లాడిపోయేవారు. ఆహారం లేక పిల్లల ఎదుగుదల ఆగిపోయింది. కొన్నాళ్లకు ఒంట్లో సత్తువ కూడా ఆవిరై పోయింది. కదల్లేని స్థితికి చేరుకున్నారు. దాంతో ఒకటికీ, రెంటికీ కూడా అక్కడే. వాళ్లనలా చూసి కూడా ఫ్రాన్సిస్ మనసు కరిగేది కాదు. ఇదంతా మీ మంచి కోసమే అనేవాడు. తన మానాన తను ఆఫీసుకు పోయి వచ్చేవాడు. ఎవరైనా కుటుంబ సభ్యుల గురించి అడిగితే ఊరు వెళ్లారనేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు... ఏడేళ్లు సమాజం ముందు నటించాడు. తన వాళ్లని, తననే నమ్ముకున్నవాళ్లని నరకయాతన పెట్టాడు. చివరికి ఓ రోజు ఎలాగో జెనెవీవ్ కిటికీ పగులగొట్టి తప్పించుకుంది. ఓ స్వచ్ఛంద సంస్థ చెంతకు చేరి, వారికి విషయం వివరించింది. వాళ్లు పోలీసుల సాయంతో మిగతా వారిని కూడా రక్షించగలిగారు. ఈ కేసు ముంబైనే కాదు... యావత్ దేశాన్నీ వణికించింది. ఆ తల్లీకూతుళ్ల దయనీయ స్థితి అందరితో కన్నీళ్లు పెట్టించింది. ఫ్రాన్సిస్ లాంటి సైకో తండ్రికి బతికే హక్కు లేదు చంపేయ మంటూ ప్రజానీకం గళమెత్తింది. చట్టం ఫ్రాన్సిస్ని అదపులోనికి తీసుకుంది. అయితే ఒక స్నేహితురాలు బెయిల్ ఇవ్వడంతో త్వరగానే బయటకు వచ్చేశాడు. కుటుంబాన్ని కలవాలను కున్నాడు. కానీ అవకాశం కలగలేదు. వాళ్లు అతని ముఖం చూడటానికి కూడా ఇష్టపడ లేదు. దాంతో ఎక్కడో మారుమూల ఓ చిన్న ఇంట్లో దిక్కుమాలినవాడిలా బతికాడు. కేసు పూర్తికాక ముందే కన్నుమూసి, కుళ్లిపోయిన స్థితిలో పోలీసులకు శవమై దొరికాడు. - సమీర నేలపూడి -
ఆ రాతిరంతా జాతరే...
నిద్రలేని రాత్రులు కంటి నిండా నిద్ర లేకపోతే మనిషి ఆరోగ్యమే కాదు, మనసూ అల్లకల్లోలమవుతుందని అందరూ అంటారు. అది ఎంతవరకూ నిజమో నాకు తెలీదు. ఎందుకంటే నేను నిద్రలేని రాత్రులు గడిపినా ఏనాడూ నా మనసు గతి తప్పలేదు. నిద్రలేని రాత్రి అనగానే నాకు మొదటగా చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గుర్తొస్తుంది. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నాను. ఎవరైనా బాగా చదువుతున్నావా అంటే చాలు... సూపర్‌గా చదివేస్తున్నాను, తప్పకుండా మంచి మార్కులతో పాసవుతాను అని గొప్పగా చెప్పేవాడిని. మా ఇంట్లో వాళ్లకే కాదు, ఊరందరికీ కూడా అదే చెప్పాను. నేనిచ్చిన బిల్డప్‌కి అందరూ నేను నిజంగానే మంచి మార్కులతో పాసైపోతాను అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నేను ఫెయిలయ్యాను. రిజల్ట్ చూసుకోగానే గుండె గుభేల్మంది. అందరూ కలిసి ఉతికేస్తారేమోనని భయమేసింది. దాంతో అప్పటికప్పుడు ఓ ప్లాన్ వేశాను. మా ఇంటి ముందున్న మామిడి చెట్టెక్కి కూచున్నాను. గంటో రెండు గంటలో కాదు. రాత్రంతా చెట్టు మీదే ఉన్నాను. మన సంగతి బాగా తెలుసు కాబట్టి... మావాళ్లు ఎక్కడెక్కడో వెతికి, వాడే వస్తాడ్లే అని వదిలేశారు. దాంతో నాకు ఆ రాతిరంతా జాతరే. తెల్లారే వరకూ చెట్టుమీదే జపం చేశాను. తర్వాత ఇక తప్పదని దిగి ఇంటికెళ్లా. పాపం పిల్లాడు రాత్రంతా నిద్ర లేకుండా అవస్థ పడ్డాడే అని మావాళ్లేమీ జాలి పడలేదు నా మీద. ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చి, వాళ్ల ఎమోషన్ చల్లార్చుకున్నాకే వదిలారు. ఆ సంఘటన, ఆ రాత్రి చెట్టుమీద నేను పడిన పాట్లు గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది నాకు. కెరీర్లో ఎదిగే క్రమంలో ఎవరికైనా పోరాటం ఉంటుంది. దాని కారణంగా కొన్ని నిద్ర లేని రాత్రులూ ఉంటాయి. కానీ వాటిలో బాధ ఉండదు. సంతోషమే ఉంటుంది. అవన్నీ మన బతుకు పుస్తకంలో మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అయితే నాకు ఆ సమయంలో గడిపిన రాత్రుల కంటే కృష్ణవంశీతో పని చేసినప్పుడు గడిపిన నిద్రలేని రాత్రులే ఎక్కువ గుర్తు. కృష్ణవంశీతో పని చేయడమంటే మాటలు కాదు. ఆయన సృష్టించే క్యారెక్టర్స్‌ని పండించడం అంత తేలికైన విషయం కాదు. ఆ క్యారెక్టరయి జేషన్ మామూలుగా ఉండదు. వాటిలో లీనమై చేసేసరికి ఒళ్లు హూనమైపోతుంది. ‘సముద్రం’ సినిమాలో నేను చేసింది చాలా క్లిష్టమైన పాత్ర. చాలా డిఫరెంట్ పాత్ర కూడా. అది చేసేటప్పుడు నేను పడిన కష్టం నాకు మాత్రమే తెలుసు. నిద్రపట్టేది కాదు. ఇరవై నాలుగ్గంటలూ ఆ పాత్ర మీదే ధ్యాస. ఎలా చేయాలి, ఎంత బాగా పండించాలి అన్నదే ఆలోచన. షూటింగ్ పూర్తయ్యాక మాత్రం ఆదమరిచి నిద్రపోయాను. అలసిపోయినందుకు కాదు. అంత గొప్ప పాత్ర చేశానే అన్న తృప్తితో. కృష్ణవంశీతో ఎప్పుడు పని చేసినా ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇక వ్యక్తిగత జీవితంలో అయితే... నేను స్వతహాగా అనవసర విషయాల జోలికి వెళ్లను. నా పనేంటో నేను చేసుకు పోతాను తప్ప, ఏవీ పట్టించుకోను. కానీ మొదటిసారి పట్టించుకున్నాను. అవే మొన్న జరిగిన ‘మా’ ఎలక్షన్స్. ఎంత పెద్ద విషయానికైనా చలించని నన్ను ఈ ఎన్నికలు చాలా కలవరపెట్టాయి. చాలా డిస్టర్బ్ చేశాయి. ఎందుకు ఇలాంటి మనుషుల మధ్యకి వచ్చానా, ఎందుకు ఇలాంటి వాళ్లతో పోటీకి నిలబడ్డానా అని నాలో నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఎప్పుడూ నన్ను ఏ విషయంలోనూ ఏమీ అనని, అడ్డుకోని మా ఇంట్లో వాళ్లు కూడా... ‘మీకు అవసరమా ఇవన్నీ’ అన్నారంటే నేనెంతగా మథనపడ్డానో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో ఎలక్షన్లు చూశాను కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. అయితే పోటీ బాధపెట్టినా, ఫలితాలు సంతోషాన్నే మిగిల్చాయి. ఇక మిగతా సమస్యలంటారా? అవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ముఖ్యంగా పక్కవాళ్ల సమస్యల్ని మన సమస్యల్లా ఫీలైపోయి, వాటిని మీద వేసుకుని, ఎలా పరిష్కరించాలా అని మల్లగుల్లాలు పడిపోయే నాలాంటి వాళ్లకు నిద్రలేని రాత్రులు లేకుండా ఉంటాయా! ఆలోచనలతో కొన్ని... ఆవేదనతో కొన్ని... ఎదురు దెబ్బలు తిన్న బాధతో కొన్ని... ఇలా కొన్ని కొన్ని కలిసి ఎన్నో ఉంటాయి. కానీ వాటి గురించి ఎప్పుడూ బాధపడను. ఎందుకంటే మరొకరి బాధను పంచుకోవడంలో ఆనందం ఉంటుంది. ఆ సంతోషం ముందు నాకు మరేదీ ఎక్కువ కాదనిపిస్తుంది. అందుకే ఒకరి కోసం నిద్ర లేకుండా గడిపిన ఏ రాత్రీ నన్ను బాధపెట్టదు. బాధను మిగల్చదు. - సమీర నేలపూడి -
ఆ రాత్రులే నన్ను మలిచాయి!
నిద్రలేని రాత్రులు జె.కె.భారవి సినీ రచయిత మా రోల్ మోడల్ ఆచార్య ఆత్రేయగారే అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ‘టాప్’ డైలాగ్ రైటర్లు, చంద్రబోస్ లాంటి ‘ఏస్’ లిరిక్ రైటర్లు స్టేట్మెంట్లివ్వడం మనకు తెలుసు. అలాంటి మహారచయిత దగ్గర దశాబ్దంపైగా శిష్యరికం చేసిన అదృష్టవంతుణ్ని నేను. ఆత్రేయగారికి ‘రాత్రేయ’ అనే నిక్‌నేమ్ ఉండేది. పాడుతా తీయగా చల్లగా... పసిపాపలా నిదురపో తల్లిగా, నిదురించవె తల్లి... ఈ వయసు దాటితే నిదురేది మళ్లీ, నిదుర రాని నాకు కలలు కూడా రావె... లాంటి పాటల కావ్యాలన్నీ తను నిదరపోకుండా రాసినవే. తపస్సు అంటే ఏమిటో మా గురువుగారు పాట కోసమో, మాట కోసమో ఆలోచించడం చూస్తే తెలుస్తుంది. రాత్రి తొమ్మిది గంటలకి పద్మాసనం వేసుకొని బెడ్‌మీద కూర్చునేవారాయన. కింద నేను రకరకాల ఆసనాలు మార్చుతూ ఉండేవాడిని. కట్ చేస్తే... కోడి కూసేది. ‘తెల్లారింది పడుకుందామా సార్’ అనేవాణ్ని నేను. ఓ చిరునవ్వు పువ్వు పూసేది ఆయన పెదాలపై. ఆయన దగ్గర పనిచేసినన్నినాళ్లు దాదాపు నిద్ర అనేది లేకుండా అలాగే గడిచిపోయింది. అసలన్ని రోజులు నిద్రపోకుండా ఎలా ఉండగలిగేవాళ్లమో తెల్సా? ఆ రోజుల్లో ‘డెక్సిడ్రిన్’ అనే టాబ్లెట్స్ దొరికేవి. అవి మా గురువుగారి దగ్గర బోలెడన్ని స్టాక్ ఉండేవి. ఒక్క మాత్ర వేసుకుంటే కళ్లకి క్లిప్పులు పెట్టినట్టు అయిపోయేది. ఇక నిద్ర అనే మాట వస్తే ఒట్టు (ఆ మాత్రలు ఇప్పుడు లేవు, నిషేధించారు). మా గురువుగారి దయవల్ల ఆ వివరాలన్నీ ఒక్కొక్కటే వంట పడుతూ... క్రమక్రమంగా ‘డెక్సిడ్రిన్’ లేకపోయినా సంకల్ప బలంతో కంటి కునుకు దూరమవుతూ వచ్చింది - అందువల్ల నాకు ఎంత లాభం వచ్చిందంటే... కొన్ని వేల పుస్తకాలు చదివే భాగ్యం. లెక్కలేనన్ని సినిమాలు చూసే అదృష్టం. ఫుల్ ఫ్లెడ్జెడ్గా రాసుకున్న బోలెడన్ని స్క్రిప్టులు. ఎల్ఐసీ శ్రీనివాస్, వసంత్ కుమార్ లాంటి నా సాహితీ మిత్రులతో మహారచయిత, మా బ్రదర్ శ్రీ వేదవ్యాసగారితో రోజుల తరబడి కొనసాగించిన చర్చలు. కూడబెట్టుకున్న జ్ఞానం. ఎలా వెలకట్టను వీటికి? నా జీవితంలో ‘ఇన్ని’ నిద్రలేని రాత్రులున్నా... ‘కొన్ని’ మాత్రం నా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. మా ఊరు... వరంగల్ జిల్లాలో కోమటిపల్లి అనే చిన్న అందమైన అగ్రహారం. నా రచనా జీవితం అక్కడే ప్రారంభమైంది. వందకు పైగా నాటకాలు రాశాను అక్కడే. అన్నమయ్య స్క్రిప్ట్ కూడా అక్కడే పురుడు పోసుకుంది. అప్పటికి ఎలక్ట్రిసిటీ రాలేదు మా ఊళ్లోకి. లాంతర్ దీపం పెట్టుకుని చకచకా రాసేస్తుండేవాణ్ని. మా అమ్మ గంటకోసారి లేచి ‘ఎంతవరకు అయింది బిడ్డా’ అని అడుగుతూండేది. అయినంతవరకూ చదివి వినిపిస్తుండేవాణ్ని. అన్నమయ్య కథనం విని తను పులకించిపోయేది. అన్నమయ్య స్క్రిప్ట్‌కి తొలి శ్రోత అయిన మా అమ్మతో పాటు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన పెద్దలూ చాలామంది ఉన్నారు మా ఊళ్లో. ఐతే అది సినిమాగా రావడానికి చాలా ఏళ్లు పట్టింది. ఎందరెందరో ప్రముఖులు అన్నమయ్య తీయడానికి నడుం బిగించారు. ప్రముఖ హాస్యనటులు పద్మనాభం నిర్మించాలని ప్రయత్నించారు, కుదర్లేదు. సి.ఎస్.రావు దర్శకత్వంలో సముద్రాల కంబైన్స్‌వారు మొదలుపెట్టారు. బాలమురళీకృష్ణగారి సంగీత దర్శకత్వంలో 18 పాటలు రికార్డ్ చేశాక ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఆచార్య ఆత్రేయగారు దర్శకత్వం చేయడానికి సంకల్పించారు. శ్రీకాంత్‌గారు నిర్మాతగా, కె.వి.మహదేవన్‌గారి నేతృత్వంలో 20 పాటలు కంపోజింగ్ అయ్యాయి. కొన్ని రికార్డ్ కూడా చేశారు. అదీ ఆగిపోయింది. చివరాఖరికి నా మిత్రుడు జొన్నవిత్తుల ద్వారా దర్శకేంద్రుడికి అన్నమయ్య కబురు అందింది. ఆయనకు నచ్చింది. నిర్మించడానికి దొరస్వామిరాజుగారు ముందుకు వచ్చారు. నాగార్జున కథ విన్న వెంటనే ఓకే అన్నారు. కీరవాణి సంగీత దర్శకత్వం, విన్సెంట్‌గారి ఛాయాగ్రహణం, వేంకటేశ్వరుడిగా సుమన్ హుందాతనం... అన్నమయ్యకు వన్నెలు దిద్దాయి. చిత్రం విడుదలైంది. అఖండ విజయం చేకూరింది. కానీ ఆ సినిమాను చూడకుండానే మా అమ్మ వెళ్లిపోయింది! ఆ వెలితి తెలీకుండా ఆదుకుంది నా మరో తల్లి ప్రముఖ నిర్మాత నారా జయశ్రీదేవి. అన్నమయ్య రచయిత నా కొడుకు అంటూ ఆమె గర్వంగా చూస్తుంటే... ఆ కళ్లల్లో నన్ను కన్న అమ్మ కనిపిస్తూ ఉంటుంది. ఆ కంటిలో ఒక అమ్మ... ఈ కంటిలో ఒక అమ్మ... హృదయంలో సరస్వతమ్మ... ఇక నిద్రతో ఏం పని చెప్పండి! - సమీర నేలపూడి -
జాక్... ద కిల్లర్
మిస్టరీ ప్రశాంతతకు నిలయంలా ఉండేది లండన్‌లోని ఆ ప్రాంతం. కానీ ఉన్నట్టుండి అక్కడ రక్తం ఏరులై పారడం మొదలుపెట్టింది. భయం రెక్కలు విప్పుకుని అందరినీ వణికించడం ప్రారంభించింది. అసలేం జరిగింది? ఏప్రిల్ 3, 1888... వైట్‌చాపెల్ డిస్ట్రిక్ట్... లండన్. ఆస్బార్న్ స్ట్రీట్... జీపు సైరన్లు, పోలీసుల బూట్ల టకటకలతో మార్మోగుతోంది. జనం ఒక్కొక్కరుగా వచ్చి గుమిగూడుతున్నారు. అక్కడి దృశ్యాన్ని చూసి భయంతో బిక్కచచ్చిపోతున్నారు. ‘‘ఓ గాడ్... ఇన్నేళ్ల సర్వీసులో ఇంత దారుణమైన హత్యని నేను చూడలేదు’’... ఇన్స్పెక్టర్ ఫ్రెడెరిక్ స్వరం వణికింది. ‘‘నిజం సర్. ఓ మనిషి మరో మనిషిని ఇంత కర్కశంగా చంపగలర ంటే నమ్మబుద్ధి కావడం లేదు’’... తన మనసులో భావాన్ని బయటపెట్టాడు అసిస్టెంట్. వాళ్లిద్దరూ రెప్ప వేయకుండా తమకు ఎదురుగా నేలమీద పడివున్న యువతి మృతదేహాన్నే చూస్తున్నారు. ఇరవై అయిదేళ్లు మించని వయసు. అందగత్తె అని చూడగానే తెలిసిపోతోంది. అయితే అంత అందమైన శరీరాన్ని చీల్చి పారేశాడు హంతకుడు. పొట్ట కోసి ఉంది. పేగులు బయటకు వచ్చాయి. రక్తం ధార కట్టింది. ఆమె రహస్యాంగాలను సైతం ఛిద్రం చేసిన విధానం చూస్తుంటే, ఎంత హింసించి చంపారో అర్థమవుతోంది. ఆ చంపినవాణ్ని పట్టుకుని వెంటనే మరణశిక్ష విధించాలనిపిస్తోంది. తక్షణం మృత దేహాన్ని పోస్ట్‌మార్టానికి పంపించి ఆ పనిలోనే పడ్డారు పోలీసులు. ఏప్రిల్ 22, 1888... జార్జ్ యార్డ్. ‘‘ఓ మై గాడ్... ఏంటిది?’’... నమ్మలేనట్టుగా అన్నాడు ఫ్రెడెరిక్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ చూస్తూ. ‘‘ముప్ఫై తొమ్మిది కత్తిపోట్లు సర్. బాడీ అంతా జల్లెడలా అయిపోయింది. ఒంట్లో ఒక్క చుక్క రక్తం మిగల్లేదు. మరో విషయమేంటంటే... పొట్ట కోసి తన గర్భసంచిని తొలగించారు.’’ ‘‘వ్వాట్’’... డాక్టర్ చెప్పింది వింటూనే షాకైపోయాడు ఫ్రెడెరిక్. వెంటనే అతనికి ఏప్రిల్ 3న జరిగిన హత్య గుర్తొచ్చింది. ఆ అమ్మాయి శరీరంలో ఒక కిడ్నీ లేదు. ఇప్పుడు గర్భసంచి లేదు. ఇదేమైనా అవయవాలను అక్రమ రవాణా చేసే ముఠా పని కాదు కదా! అదే అన్నాడు తన అసిస్టెంట్‌తో. ‘‘కాకపోవచ్చు సర్. ఎందుకంటే... అవయవాలే కావాలనుకుంటే అంత కసిగా చంపాల్సిన పని లేదు. అలాగే ఒక అవయవమే తీసుకెళ్లాల్సిన అవసరమూ లేదు. కళ్లు, కిడ్నీలు, లివర్... అన్నీ తీసుకుపోవచ్చు కదా!’’తన అసిస్టెంట్ అనాలసిస్‌కి ముచ్చటపడ్డాడు ఫ్రెడెరిక్. మెచ్చుకోలుగా చూశాడు అతనివైపు. అంతలోనే అతడికి ఓ విషయం గుర్తు వచ్చింది. నెలరోజుల క్రితం హత్యకు గురైన అమ్మాయి ఓ సెక్స్ వర్కర్. ఇప్పుడు చనిపోయిందీ సెక్స్ వర్కరే. ఇది యాదృచ్ఛికమా? లేక పక్కా ప్లానింగా? ఆరోజు ఇన్స్పెక్టర్ ఫ్రెడెరిక్ మనసులో తలెత్తిన ప్రశ్నలకు సమాధానం చాలా త్వరగానే దొరికింది. వారం తిరిగేసరికల్లా మరో సెక్స్ వర్కర్ హత్యకు గురయ్యింది. అదే రీతిలో. అంతే భయంకరంగా. లండన్ మొత్తం వణికిపోయింది. మహిళలు బయటకు రావాలంటే భయపడసాగారు. ఆడపిల్లల్ని బడికి పంపడానికి కూడా బెంబేలెత్తిపోయారు. ఇక సెక్స్ వర్కర్లయితే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతకసాగారు. ప్రజల పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. వీధుల్లో గస్తీ తిరగడం మొదలు పెట్టారు. అయినా కూడా... జరగాల్సిన అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి. వైట్ చాపెల్ ప్రాంతంలో వరుసగా హత్యలు జరగసాగాయి. ఒకటి కాదు రెండు కాదు.. పదమూడు హత్యలు. అందరూ సెక్స్ వర్కర్లే. వాళ్లనే ఎందుకు చంపుతున్నట్టు? ఆ వృత్తి పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్లెవరైనా అలా చేస్తున్నారా? హత్యకు గురైన ఏ అమ్మాయిపైనా అత్యాచారం జరగలేదు. కానీ తీవ్రమైన హింస మాత్రం జరిగింది. మెడ కోసి, కత్తులతో పొడిచి, చిత్రహింసలు పెట్టి చంపాడు హంతకుడు. పైగా ప్రతి అమ్మాయి శరీరంలోంచీ ఒక్కో అవయవాన్ని తీసుకెళ్లిపోతున్నాడు. అలా ఎందుకు చేస్తున్నట్టు? ప్రశ్నలే తప్ప జవాబులు లేకుండా పోయాయి పోలీసుల దగ్గర. హంతకుడెవ్వరో వాళ్లకి అంతు పట్టలేదు. స్పాట్లో కాకుండా ఆస్పత్రిలో చనిపోయిన ఇద్దరు అమ్మాయిలు తమను చంపిన వ్యక్తి లెదర్ కోటు, పొడవు బూట్లు, గ్లౌజులు వేసుకుని ఉన్నాడని, టోపీ పెట్టుకున్నాడని చెప్పారు. దాంతో అతడి చిత్రాన్ని గీయించి అన్ని స్టేషన్లకూ పంపారు. అన్నిచోట్లా పోస్టర్లు అంటించారు. కానీ ఫలితం లేకపోయింది. అనుమానించి కొందర్ని అరెస్ట్ చేసినా కానీ అతడే జాక్ అని నిరూపించలేక పోయారు. మరేం చేయాలా అని ఆలోచిస్తుండగా ఒక ఊహించని సంఘటన జరిగింది. వైట్ చాపెల్ విజిలెన్స్ కమిటీ అధ్యక్షుై డెన జార్జ్ లస్క్కి ఓ పార్శిల్ వచ్చింది. ఆ పార్శిల్ లోపల ఓ కిడ్నీ ముక్క ఉంది. హంతకుడు రాసిన ఒక లేఖ కూడా ఉంది. ఆ లేఖలో... కిడ్నీ ముక్క తను చంపిన ఓ అమ్మాయిదని, మిగతా ముక్క వండుకుని తినేశానని రాశాడు కిల్లర్. దమ్ముంటే తనను పట్టుకోమని చాలెంజ్ చేశాడు. ఆ ఉత్తరం తాను నరకం నుంచి రాస్తున్నానని పరిహాసం కూడా ఆడాడు. చివర్లో ‘జాక్ ద రిప్పర్’ అని సంతకం చేశాడు. ఆ ఉత్తరాన్ని చూసిన పోలీసులకి మతి పోయినట్టయ్యింది. అంతవరకూ వైట్‌చాపెల్ మర్డరర్ అని పిలిచిన అతణ్ని నాటి నుంచీ ‘జాక్ ద రిప్పర్’ అని సంబోధించడం మొదలుపెట్టారు. అతణ్ని పట్టుకోవాలని నిద్ర లేకుండా తిరిగారు. కానీ వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే... ఆ తర్వాత అక్కడ మరే అమ్మాయి హత్యా జరగలేదు. జాక్ జాడ కనిపించలేదు. అతడు ఏమైపోయాడో ఎవరికీ తెలియలేదు. దాంతో ‘జాక్ ద రిప్పర్ గాథ’... చరిత్రలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది! - సమీర నేలపూడి అతనే కిల్లరా...? క్యాథరీన్ ఎడ్డోస్ అనే యువతి మృతదేహం పక్కన ఓ శాలువా దొరికింది. అది చాలా యేళ్ల పాటు లండన్ క్రైమ్ మ్యూజియంలో ఉంది. 2007లో దాన్ని వేలం వేస్తే... రసెల్ ఎడ్వర్డ్స్ అనే వ్యాపారస్తుడు సొంతం చేసుకున్నాడు. అయితే అందరూ అనుకున్నట్టు అతడు దాన్ని క్యాథరీన్ శాలువా అనుకోలేదు. ఎందుకంటే ఆ షాల్ చాలా ఖరీదైనది. కానీ క్యాథరీన్ పేద అమ్మాయి. కడుపు నింపుకోవడం కోసం పడుపు వృత్తిలోకి దిగింది. అలాంటి అమ్మాయికి అంత ఖరీదైన శాలువా ఎలా వస్తుంది! కాబట్టి అది హంతకుడిది కూడా అయివుండొచ్చు కదా అనిపించింది రసెల్‌కి. వెంటనే దాన్ని డీఎన్ఏ పరీక్షకు పంపించాడు. గతంలో జాక్ అయివుంటాడు అని పోలీసులు అనుమానించినవారందరి డీఎన్ఏతోటీ దాన్ని మ్యాచ్ చేయించాడు. వారిలో ఒకడైన ఆరోన్ కాస్మిన్స్కీ డీఎన్ఏ మ్యాచ్ కావడంతో అతడే హంతుకుడని తేల్చాడు. మిస్టరీని ఛేదించానంటూ 2014లో ప్రపంచానికి సగర్వంగా తెలియజేశాడు. అయితే ఆ విషయాన్ని చాలామంది ఒప్పుకోవట్లేదు. డీఎన్ఏ మ్యాచ్ అయినంత మాత్రాన హంతకుడు అనేస్తే ఎలా, అయినా ఆ శాలువా హంతకుడితే ఎందుకయ్యుండాలి అంటున్నారు. పైగా ఆరోన్ స్కిజోఫ్రీనియా వ్యాధిగ్రస్తుడు. పోలెండ్ నుంచి వచ్చిన అతడు తన వాళ్లెవరో మర్చిపోయాడు. తానెవరో కూడా గుర్తు లేదు తనకి. అలాంటివాడు ఇంత దారుణమైన హత్యలెందుకు చేస్తాడు? పైగా సెక్స్ వర్కర్లనే ఎంచుకుని మరీ ఎందుకు చంపుతాడు? ఇలా ఆలోచించే అరెస్ట్ చేసినవాళ్లందర్నీ పోలీసులు వదిలేశారు. కానీ ఇన్నేళ్ల తర్వాత రసెల్ మళ్లీ ఆరోన్‌ని వేలెత్తి చూపిస్తున్నాడు. డీఎన్ఏ మ్యాచ్ అయ్యింది కాబట్టి అతడు చెప్పిందే నిజమని నమ్ముదామా? ఆ సాక్ష్యమొక్కటే సరిపోదు కాబట్టి నిజం కాదని అనుకుందామా?! వైట్‌చాపెల్ హత్యలు ప్రపంచం మొత్తాన్నీ వణికించాయి. ఆ ఉదంతాలను ఆధారంగా చేసుకుని పలు సినిమాలు, టెలివిజన్ షోలు రూపొందాయి. 1988లో ‘జాక్ ద రిప్పర్’ పేరుతో యూకే టెలివిజన్‌లో ఓ చిత్రం ప్రసారమైంది. 2001లో ‘ఫ్రమ్ హెల్’ అనే చలనచిత్రం విడుదలై సంచలనం సృష్టించింది. ప్రముఖ నటుడు జానీ డెప్ ప్రధాన పాత్రధారి కావడంతో మాంచి హిట్ అయ్యింది. బీబీసీ సైతం ‘రిప్పర్ స్ట్రీట్’ పేరుతో ఒక సిరీస్‌ని ప్రసారం చేసింది. -
రాత్రంతా కన్నీళ్లతో...
నిద్రలేని రాత్రులు ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలూ, రాత్రంతా కునుకుపట్టనివ్వని విషాదాలూ ఉంటాయి. అవి మనిషిని జీవితంలో రాటుదేల్చవచ్చునూ వచ్చు, ఆత్మీయతను పెంచనూ వచ్చు. ఆ జ్ఞాపకాలను సున్నితంగా తడిమే ప్రయత్నమే ఈ శీర్షిక. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకూ అవకాశాలు ఉండి కానీ, లేక కానీ, విజయాల వల్ల కానీ, పరాజయాల వల్ల కానీ... నిద్రలేని రాత్రులు నేనెప్పుడూ గడపలేదు. వ్యక్తిగతంగా మాత్రం చాలానే గడిపాను. ఆ రోజులు గుర్తొస్తే... ఇప్పటికీ నా కంటిమీది కునుకు ఎగిరిపోతుంది. ఆరోజు... ‘ఆగడు’ షూటింగ్లో ఉన్నాను. నాకు, మహేశ్బాబుకీ మధ్య కామెడీ సీన్ షూట్ చేస్తున్నారు దర్శకుడు శ్రీను వైట్ల. ఇన్వాల్వ్ అయి చేస్తున్నాం. చుట్టూ ఉన్నవాళ్లు, సహ నటీనటులు కూడా పడీ పడీ నవ్వుతున్నారు. అంతలో నా అసిస్టెంట్ కంగారుగా వచ్చి ఫోన్ నా చేతిలో పెట్టాడు. అక్క చేసింది. తను చెప్పింది వినగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. అప్పటిప్పుడు బయలుదేరి స్టార్ హాస్పిటల్‌కి వెళ్లిపోయాను. ప్రాణానికి ప్రాణమైన నా భార్య... ఐసీయూలో ఉంది. వెంటిలేటర్ పెట్టారు. సెలైన్లు ఎక్కిస్తున్నారు. తనని బతికించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు అంతా బ్లాంక్ అయిపోయింది. అంతవరకూ బాగానే ఉన్న మనిషి ఒక్కసారిగా ఊపిరందక కుప్పకూలిపోయిందట. మాట పడిపోయిందట. ఎందుకలా జరిగిందని అడిగితే... పాదాల నుంచి ఊపిరితిత్తుల వరకూ రక్తం గడ్డ కట్టేసిందన్నారు డాక్టర్లు. కాపాడటం కష్టమంటూ పెదవి విరిచేశారు. అప్పటికి సమయం సాయంత్రం ఆరయ్యింది. ‘మీరు ఇంటికి వెళ్లిపోండి. మీ భార్యకి ఏదైనా అయితే మీకు ఉదయం ఆరు గంటల లోపు ఫోన్ వస్తుంది. ఫోన్ రాలేదంటే అప్పుడు హోప్స్ పెట్టుకోవచ్చు’ అని చెప్పారు. సినిమా వాళ్లు తమ ఫోన్ ఎప్పుడూ మోగుతూ ఉండాలని కోరుకుంటారు. ఏ దర్శకుడో ఫోన్ చేసి అవకాశం ఇస్తున్నాను అని చెప్తాడేమోనని. కానీ ఆ రాత్రి నేను నా ఫోన్ మోగకూడదని కోరుకున్నాను. ఆ రాత్రి ఒక్కొక్క నిమిషం ఒక్కో సంవత్సరంలాగా గడిచింది. సాధారణంగా సినిమా వాళ్లంతా తమ ఫోన్ ఎప్పుడూ మోగుతూ ఉండాలని కోరుకుంటారు. ఏ దర్శకుడో ఫోన్ చేసి అవకాశం ఇస్తున్నానని చెబుతాడేమోనని. కానీ ఆ రోజు మాత్రం నేను ఫోన్ రాకూడదని కోరుకున్నాను. దేవుళ్లందరికీ మొక్కాను. రాత్రంతా కన్నీళ్లతో గడిపాను. తెల్లారింది. ఆరు దాటినా ఫోన్ రాకపోవడంతో హాస్పిటల్‌కి పరుగెత్తాను. అప్పటికి ఫరవాలేదు, కానీ ప్రమాదం పొంచే ఉందన్నారు. తనకొక ఇంజెక్షన్ ఇవ్వాలి. ఎక్కువ డోస్ ఇస్తే ప్రాణం పోతుంది. తక్కువ ఇస్తే క్లాట్స్ కరగకపోవచ్చు. కానీ రిస్క్ తీసుకోలే రు కాబట్టి తక్కువ డోసే ఇచ్చారు. డాక్టర్ల చలవ, దేవుడి దయ... నా లత బతికింది. కానీ తనకిక ఏం కాదు అన్న శుభవార్త నా చెవిన పడటానికి పది రోజులు పట్టింది. తర్వాత కూడా ఆరు నెలలు నరకమే. లత పొట్టని ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ కోసి సర్జరీ చేశారు. నూట యాభైకి పైగా కుట్లు పడ్డాయి. కదలటానికి వీల్లేదు. ఏమాత్రం కదిలినా కుట్లు విడిపోతాయని భయం. పడుకునే ఉంటే వీపంతా పుండ్లు పడతాయని భయం. ఆరు నెలల పాటు తను, తననలా చూస్తూ నేను చిత్రవధ అనుభవించాం. ఏదేమైతేనేం... చివరకు నా భార్య కోలుకుంది. నేను పోతానని తెలిసినా అంత టెన్షన్ పడేవాణ్ని కాదు. నేనే ప్రపంచంగా బతికే అమాయకురాలు నా భార్య. తననా పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాను. నా బెస్ట్ ఫ్రెండ్‌ని కోల్పోతానేమోనని అల్లాడిపోయాను. అదృష్టంకొద్దీ ఆ పరిస్థితి రాలేదు. కానీ ఆ రాత్రిని మాత్రం నేనింతవరకూ మర్చిపోలేదు. - సమీర నేలపూడి -
ఆరుగురు పోలీస్త్రీలు
అతివలు వంటింటి గడప దాటి చాలా కాలమైనా.. ఇప్పటికీ కొన్ని రంగాల్లో వారి ప్రవేశం ప్రశ్నార్థకమే. కుసుమ కోమలంగా ఉంటే కొన్ని రకాల బాధ్యతలు నిర్వర్తించలేరన్న భావన స్త్రీ శక్తికి అడ్డుగా నిలుస్తోంది. ఈ అభిప్రాయం తప్పని నిరూపిస్తూ తెలంగాణ రాష్ట్ర ట్రాఫిక్ నియంత్రణ విభాగంలో తొలిసారిగా ఆరుగురు మహిళలు నియమితులయ్యారు. హైదరాబాద్ ట్రాఫికర్‌ను కంట్రోల్ చేయడంతో సత్తా చాటుతున్న వారు అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. - సమీర నేలపూడి మాదాపూర్.. సైబర్ టవర్స్ దగ్గరలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్... రెడ్‌లైట్ పడింది. పరుగులు తీస్తోన్న వాహనాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. కానీ ఒక బైక్ మాత్రం ఆగినట్టే ఆగి మళ్లీ దూసుకుపోబోయింది. కానీ మరుక్షణంలో ఆగిపోయింది. ఎందుకంటే ఆ బైక్‌కి అడ్డుగా ఓ అమ్మాయి వచ్చి నిలబడింది. ఖాకీ ప్యాంటు, తెల్లని చొక్కా, నెత్తిమీద నీలిరంగు టోపీ.. ట్రాఫిక్ పోలీస్. ఆమెను చూస్తూనే అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. లేడీ ట్రాఫిక్ పోలీసులు కూడా ఉన్నారా అంటూ విస్మయం చెందారు. మాదాపూర్ పరిధిలోని ఆరు ప్రధాన కూడళ్ల దగ్గర ఆరుగురు మహిళా ట్రాఫిక్ పోలీసులు కొద్ది రోజులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే మొదటిసారి.. తెలంగాణ రాష్ట్రంలో మహిళా పోలీసులు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పటివరకూ ట్రాఫిక్ విభాగంలో ఒక్క మహిళా లేదు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ట్రాఫిక్ని నియంత్రించడం అంత తేలిక కాదు. ముఖ్యంగా సిటీలో అది మరింత కష్టం. దానికి తోడు రోజంతా నిలబడి ఉండాలి. రకరకాల మనస్తత్వాలున్న వాహనదారులను ఓ దారికి తేగలగాలి. ఇలాంటివి మగువలకు కష్టమనే ఉద్దేశంతో ట్రాఫిక్ విభాగంలో ఇన్నాళ్లూ మహిళలకు నో ఎంట్రీ ఉంది. అంతరిక్షంలో అడుగుపెట్టగల మహిళ.. ట్రాఫిక్‌ను నియంత్రించలేదా అని అనుకున్న సైబరాబాద్ కమిషనల్ సీవీ ఆనంద్ ట్రాఫిక్ విభాగంలో కొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టారు. శకుంతల, అశ్విని, లావణ్య, శ్రీవాణి, వెంకటమ్మ, వరలక్ష్మిలను ట్రాఫిక్ పోలీసులుగా నియమించారు. సవాళ్లను ఎదుర్కొంటూ... మండుటెండలో ఆరేడు గంటలపాటు నిలబడి.. వచ్చే పోయే వాహనాలను గమనిస్తూ... సిగ్నల్స్ ఉల్లంఘనులను అడ్డుకుంటూ.. ఫొటోలు తీస్తూ... చలానాలు రాస్తూ.. పురుషులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ... పై అధికారులతో శభాష్ అనిపించుకుంటున్నారు ఈ ఆరుగురు ఇంతులు. అయితే వారు ఈ స్థాయికి చేరుకోవడానికి కొన్ని నెలలు శ్రమించారు. రోడ్డు మధ్యన నిలబడటం.. వింత చూపులను తట్టుకోవడం.. మొదట్లో మనస్తాపాన్ని కలిగించినా.. వాటిని అధిగమించాం అంటారు వీరు. ‘మేం పురుషులకు తీసిపోమని నమ్మి అధికారులు మమ్మల్ని తీసుకున్నప్పుడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టాలి కదా’ అన్నారు ఆరుగురిలో ఒకరైన శకుంతల. ఇబ్బందులు అన్ని చోట్లా ఉంటాయి కదా! చేయలేం అనుకుంటే.. ఏమీ సాధించలేం’ అన్నారు శ్రీవాణి. ఈ ఇద్దరే కాదు. ఆరుగురిలోనూ ఒకటే పట్టుదల. ఒకటే ధైర్యం. అవే వాళ్లను సవాళ్లతో నిండిన ఈ ఉద్యోగాన్ని సమర్థంగా చేసేందుకు తోడ్పడుతున్నాయి. పాజిటివ్ రిజల్ట్స్.. సిటీలో ట్రాఫిక్ ఉల్లం‘ఘనులు’ తక్కువేం కాదు. అయితే ఓ మహిళా పోలీస్ ఆపేసరికి అటువంటి వారంతా దారిలోకి వచ్చేస్తున్నారు. ఇలాంటి కొన్ని పాజిటివ్ పరిణామాలు కనిపించడం, మహిళా పోలీసుల సామర్థ్యం కూడా నిరూపణ అవడంతో... త్వరలో మరికొంతమంది మహిళల్ని ట్రాఫిక్ పోలీసులుగా నియమించాలనుకుంటున్నారు అధికారులు. అదే జరిగితే.. త్వరలో తెలంగాణ రాష్ట్రమంతటా మహిళా ట్రాఫిక్ పోలీసులు కనిపించడం ఖాయం. ఎందులోనూ తీసిపోరు... ‘మా కమిషనర్‌గారి నమ్మకం నిలబడింది. ఆరుగురు అమ్మాయిలూ పురుషులకు తీసిపోకుండా పని చేస్తున్నారు. మేం కూడా వారికి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. వాష్‌రూమ్స్ అందుబాటులో ఉండే కూడళ్ల వద్దే డ్యూటీ వేస్తున్నాం. అలాగే ఇద్దరిద్దరు డ్యూటీ చేయాల్సిన చోట ఒక మేల్ కానిస్టేబుల్‌తో పాటు వీరికి డ్యూటీ వేస్తున్నాం. దానివల్ల వారికి కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది కదా’ అన్నారు మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ టి.నర్సింగరావ్. మొదట్లో డ్యూటీ కష్టమనిపించినా ఇప్పుడు అలవాటైపోయింది అంటున్నారు లేడీ ట్రాఫిక్ కానిస్టేబుల్ వరలక్ష్మి. ‘రాష్ట్రంలో మొదటిసారి తీసుకున్న మహిళా ట్రాఫిక్ పోలీసుల్లో నేనూ ఒకదాన్ని కావడం సంతోషంగా ఉంది. వాహన చోదకులు కూడా మమ్మల్ని గౌరవిస్తున్నారు’ అని చెప్పారామె. -
నేనేం పాపం చేశాను?
షీ అలర్ట్ ! మహిళలూ జాగ్రత్త! సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి... ‘ఆకలిగా ఉందమ్మా... కాస్త తినడానికి ఏమైనా పెడతావా?’... అలా అడుగుతున్నప్పుడు నా అణు వణువూ సిగ్గుతో చితికిపోయింది. నా గుండె బాధగా మూలిగింది. అడగకూడదని నా గొంతును చాలా సేపు నొక్కిపెట్టాను. కానీ ఆకలితో మెలికలు పడుతోన్న పేగుల ఆర్తనాదాల్ని భరించలేక పెదవి విప్పాను. రెండు క్షణాల్లో నా చేతుల్లో ఒక గిన్నె ఉంది. దాన్నిండా అన్నం ఉంది. పప్పు, ఏదో కూర, పచ్చడి... అదేమీ విందు కాదు. కానీ నా పాలిట అమృతంలా తోచింది. ఆబగా ముద్ద కలిపాను. ఆతృతగా నోటిలో పెట్టుకోబోయాను. కానీ నావల్ల కాలేదు. దుఃఖంతో గొంతు పూడుకుపోతోంది. ముద్ద మింగే శక్తి లేదనిపిస్తోంది. చేతిలోని గిన్నెను కింద పెట్టేశాను. చీరచెంగును చేతిలోకి తీసుకుని కళ్లొత్తుకున్నాను. కానీ ఆ తడి ఆరుతుందా? గుండెల్లోంచి పొంగుకొచ్చిన దుఃఖమది. చీరకొంగుతో తుడిపేస్తే తొలగిపోతుందా? ‘ఏమైందమ్మా... తినండి’ అందా అమ్మాయి. తల ఎత్తి తన కళ్లలోకి చూశాను. ఎవరో తెలియదు. ఎప్పుడూ చూసింది కూడా లేదు. తన ఇంటి అరుగు మీద కూర్చుంటే పలకరించింది. ఆకలి అనగానే అన్నం పెట్టింది. తినమని బతిమాలుతోంది. ముక్కూ ముఖం తెలియని నా మీద ఎందుకంత జాలి? జాలి, దయ, మంచితనం అన్న మాటలు ఈ లోకం నుంచి ఎప్పుడో వెళ్లిపోయాయి అనుకున్నాను. కానీ నా ఆలోచన తప్పు అని నిరూపించడానికే వచ్చినట్టుంది తను. ‘తినండి’ అంది మళ్లీ ఎంతో అనునయంగా. వద్దన్నట్టు తల అడ్డంగా ఊపాను. తినలేను. ఒక్క ముద్ద కూడా తినలేను. కడుపు ఆకలితో కాలిపో తున్నా.. మనసులోని మంట ముద్ద ముట్ట నివ్వదు నన్ను. లేచి నడకందుకున్నాను. వార్ధక్యం తరు ముకొస్తుంటే, ఒంట్లో సత్తువ పారిపో తుంది కదా! అందుకే కాళ్లు వణుకుతున్నాయి. అడుగులు తడబడుతున్నాయి. శక్తిని కూడదీసుకుని పాదాలను కదుపు తున్నాను. ప్రాణమున్న బొమ్మలా, గమ్యం తెలియని నావలా ముందుకు సాగుతున్నాను. పగలు తన ఉనికిని కోల్పోతోంది. రాత్రి తనను తాను పరిచయం చేసుకోవడానికి తొందరపడుతోంది. ఆ దృశ్యం చూస్తుంటే ముగింపు దశకు చేరుకున్న నా జీవితానికి ఓ ఉదాహరణలా అనిపిస్తోంది. నా అస్తమయం ఆసన్నమైందని నాకు గుర్తు చేస్తున్నట్టుగా తోస్తోంది. నేను ఇలా అస్తమించబోతున్నానా? నా బతుకును ఇలా ముగించబోతున్నానా? దీనంగా, హీనంగా, దిక్కు లేకుండా, కాటికి మోసుకెళ్లేందుకు, చితికి నిప్పు పెట్టేందుకు నా అన్న మనిషే లేకుండా... నడి రోడ్డుమీద, నడి నిశీధిలోన నేను కన్నుమూస్తానా?! ఆ ఆలోచనే నన్ను వణికిస్తోంది. నేనేం పాపం చేశాను? నాకెందుకిలాంటి ముగింపు? పేద ఇంట్లో ఆడపిల్లగా పుట్టాను. చదువుకు నోచుకోలేదు. నిండా పదహారేళ్లు కూడా నిండకుండానే తాళికి తల వంచకా తప్పలేదు. పెళ్లికి అర్థం పూర్తిగా తెలియకుండానే ఒక మనిషికి అర్ధాంగినయ్యాను. మధ్య తరగతి మనిషికి భార్యగా బాధ్యతల బరువులు మోశాను. తాగి వచ్చి కొడితే తట్టుకున్నాను. వాగి మనసును ముల్లులా పొడుస్తుంటే ఓర్చుకున్నాను. భార్యాభర్తల బంధమంటే తనువుల్ని పెనవేసేదే తప్ప మనసుల్ని ముడివేసేది కాదని అనుకునే ఓ కర్కశుడైన భర్తతో గుట్టుగా కాపురం చేశాను. ఆనందం లేకపోయినా సౌభాగ్యం ఉంటే చాలని సర్దుకుపోయాను. కానీ అది కూడా అత్యాశ అనుకున్నాడో ఏమో... ఆ దేవుడు ఆయన్ని రోడ్డు ప్రమాదంలో తీసుకుపోయాడు. అక్కడితో నా జీవితం ముగిసిపోయినట్టే అనుకున్నాను. కానీ అది ముగింపు కాదు, మొదలు అని కడుపులో పేగు కదిలినప్పుడుగానీ నాకు తెలియలేదు. నా భర్త చనిపోయేనాటికి నాకు మూడో నెల. ఓ బంధం తెగిపోయినందుకు పడిన బాధ, కొత్తగా ఏర్పడిన బంధం కలిగించిన సంతోషం ముందు తేలిపోయింది. నా బిడ్డ ఈ లోకంలో అడుగుపెట్టిన క్షణం.. నేను మళ్లీ కొత్తగా జన్మించాను. వాడి బుడి బుడి అడుగులతో పాటు నేనూ ముందుకు సాగడం నేర్చుకున్నాడు. వాడిని పెంచడంలో నా వయసును, బతుకును కొవ్వొత్తిలా కరిగించాను. కావలసినన్ని కాసులు కూడ గట్టుకోగల ఉద్యోగస్తుణ్ని చేశాను. కోరుకున్న అమ్మాయినిచ్చి కళ్యాణం జరిపించాను. వాడి ఆనందంలో నా జీవితానికి అర్థాన్ని వెతుక్కున్నాను. కానీ వాడు మాత్రం తన దారి తాను వెతుక్కున్నాడు. భార్య ప్రేమ కోసం అమ్మ ప్రేమను అలుసు చేశాడు. పెళ్లాం మాటలను నెగ్గించడం కోసం అమ్మను అన్ని విషయాల్లోనూ తగ్గించడం నేర్చుకున్నాడు. తమ జీవితాలకు నన్ను భారం అనుకున్నాడు. ఆ భారాన్ని దించేసుకోవడానికి నీఛమైన పని చేశాడు. ఓరోజు నన్ను దూరపు బంధువుల ఇంట్లో శుభకార్యానికి పంపించాడు. తిరిగి వచ్చేసరికి ఇల్లు ఖాళీ చేసి భార్యతో సహా ఎక్కడికో వెళ్లిపోయాడు. తన సెల్‌కి ఫోన్ చేశాను. ‘నీ కోడలిని కాదని నేనేం చేయలేనమ్మా’ అన్నాడు. కన్న పేగును కత్తితో కోస్తున్నట్టుగా అనిపిం చింది. సమాధానం చెప్పలేక మౌనం దాల్చాను. ఆ మౌనానికి అర్థం తెలియక ‘అర్థమైందా నేను చెప్పేది’ అన్నాడు. వాడిని కన్నదాన్ని, అడగకుండానే వాడికేం కావాలో అర్థం చేసుకున్నదాన్ని... ఇప్పుడు వాడు అడుగుతున్నదేంటో ఆమాత్రం అర్థం చేసుకోలేనా? నన్ను తనవైపు చూడవద్దంటున్నాడు. తన జ్ఞాపకా లను తుడిచేయమంటున్నాడు. తనను తలపులలోకి సైతం ఆహ్వానించవద్దంటున్నాడు. అని కాల్ కట్ చేసేశాడు. కాల్‌తో పాటు మా బంధాన్ని కూడా. నిలువ నీడలేక పిచ్చిదానిలా తిరిగాను. ఎండకి ఎండాను. చలికి వణికాను. ఆకలితో అల్లాడాను. చేయి చాచి అన్నం అడుక్కున్నాను. కానీ అభిమానాన్ని చంపుకుని ఆ అన్నాన్ని మాత్రం తినలేకపో యాను. చివరికి నీరసించి రోడ్డు పక్కన పడిపోయాను. ఒక ఎన్జీవో వాళ్లు నన్ను తీసుకెళ్లారు. నీడ కల్పిం చారు. వేళకి అన్నం పెడుతున్నారు. వారి ఆదరణ నా అస్తమయాన్ని వాయిదా వేసింది. కానీ నా కొడుకు చేసిన ద్రోహం నాకు బతుకు మీదే విరక్తి కలిగిస్తోంది. వాడిని పెంచడం కోసం నేను ఎన్నో భారా లను మోస్తే.. వాడు నన్నే భారమనుకున్నాడు. వాడి సంతోషం కోసం నేనెన్నో వదులుకుంటే... వాడు నన్నే వదిలించుకుపోయాడు. అమ్మ ప్రేమకు విలువ ఇంతేనా? ఈ లోకంలో నాలాంటి తల్లి స్థానం ఇదేనా?! - సుభద్ర (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి కడుపున మోసి, కని, పెంచి పెద్ద చేసిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకుండా వదిలేస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంతా కాదు. వయసు అయిపోతుంది. శక్తి ఉండదు. తమను తాము పోషించుకునే ఓపిక ఉండదు. దాంతో చాలా దీనమైన పరిస్థితికి చేరుకుంటారు. కొందరు పిల్లలు కనీసం పెయిడ్ హోమ్స్‌లో చేరుస్తుంటారు. కానీ అది కూడా చేయకుండా ఇలా గాలికి వదిలేయడం మాత్రం అన్యాయం. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు 125 సీఆర్పీసీ కింద పిల్లల మీద కేసు నమోదు చేయవచ్చు. కోర్టు ఇటువంటి కేసుల్ని సీరియస్‌గా తీసుకుంటుంది. వీలైనంత త్వరగానే తీర్పు ఇస్తుంది. తల్లిదండ్రులకు నివాస వసతి కల్పించడంతో పాటు, వారి పోషణకు అవసరమైన డబ్బు ఇవ్వమని చెబుతుంది. ఎక్కువమంది పిల్లలు ఉంటే... అందరినీ ఆ బాధ్యత పంచుకొమ్మని ఆదేశిస్తుంది. కాబట్టి సుభద్రగారు కూడా కావాలంటే తన కొడుకు మీద కేసు వేయవచ్చు. తన హక్కును సంపాదించుకోవచ్చు. -
అమెరికాలో ఆపద్బాంధవి
అడిగినా ఎదుటివాళ్లకు సాయపడరు కొందరు. కానీ అడగకపోయినా సాయం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు ఇంకొందరు. లక్ష్మి దేవినేని కూడా అంతే. ఎదుటివాళ్లకు సాయపడాలని అనుక్షణం తపన పడుతుంటారు. అదే ఆమెను అమెరికాలో చాలా పాపులర్ చేసింది. ఇమిగ్రేషన్ లా ఫర్మ్‌లో మేనేజర్‌గా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)లోని ఇమిగ్రేషన్ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఎంతో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తిస్తోన్న లక్ష్మి... అమెరికా వచ్చే తెలుగువాళ్లకు కొండంత అండగా ఉంటున్నారు. ‘తానా చైతన్య స్రవంతి’ కార్యక్రమం ద్వారా ఇండియాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వచ్చిన సందర్భంగా తన గురించి, తను చేస్తోన్న సేవ గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు... - సమీర నేలపూడి ‘తానా’లో ప్రముఖ పాత్రే పోషిస్తున్నట్టున్నారు? నేననే కాదు. తానాలోని ప్రతి సభ్యుడూ యాక్టివ్గానే ఉంటారు. ప్రతి రెండేళ్లకోసారి తానా కన్వెన్షన్ జరుగుతుంది. దానికి ముందు తానా సభ్యులందరం కలిసి ఇండియాలో నాలుగు వారాల పాటు ‘తానా చైతన్య స్రవంతి’ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. గ్రామాలకు వెళ్లి హెల్త్ క్యాంపులు పెట్టడం, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించడం వంటివి చేస్తుంటాం. ఇమిగ్రేషన్ కమిటీకి మీరు చైర్పర్సన్ కదా... ఈ కమిటీ ఏం చేస్తుంది? కొత్త దేశానికి వెళ్లినప్పుడు ఎవరికైనా అంతా కొత్తగానే ఉంటుంది. యూఎస్ వచ్చేవాళ్ల పరిస్థితి కూడా అంతే. అక్కడ స్థిరపడటానికి ఎలా ప్రయత్నించాలి, ఏయే లెసైన్సులు సంపాదించాలి వంటివేమీ అర్థం కావు. దాంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారందరికీ సహాయపడతాం. అమెరికా వెళ్లేవాళ్లంతా సాఫ్ట్వేర్ అంటారు. మీరు ఇమిగ్రేషన్ లా ఫర్మ్ వైపు ఎందుకు వెళ్లారు? దాని మీద అవగాహన, ఆసక్తి ఉండటం వల్ల. నేను పెరిగింది, చదివింది అంతా హైదరాబాద్‌లోనే. నాకు పదిహేనో ఏటే పెళ్లి చేశారు. పదహారో ఏట ఓ బిడ్డకు తల్లిని కూడా అయ్యాను. పెళ్లితో బ్రేక్ పడిన చదువుని, బాబు పుట్టాక పూర్తి చేశాను. ఇంజినీరింగ్ చేశాక, కొన్నాళ్లపాటు చాంబర్ ఆఫ్ కామర్స్‌లో పని చేశాను. ఆ సమయంలో విదేశీ దౌత్యవేత్తలతో పరిచయం పెరిగింది. అమెరికన్ కాన్సులేట్‌తో వ్యవహారాలు నడిపించడంతో వీసా, ఇమిగ్రేషన్ అంశాల మీద బాగా అవగాహన ఏర్పడింది. అయితే అంత అవగాహన ఉన్న నేను కూడా... ఉద్యోగ నిమిత్తం అమెరికా చేరుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజ్ అయ్యాను. చాలా విషయాలు అర్థం కాలేదు. ఒక లా ఫర్మ్ ద్వారా అన్నీ తెలుసుకున్నాను. అప్పట్నుంచీ ఎవరు ఇబ్బంది పడుతున్నా నన్ను గైడ్ చేసిన సంస్థ దగ్గరకు తీసుకెళ్లేదాన్ని. ‘ఇంతమందిని తీసుకొస్తారు కదా, మీరు మా దగ్గరే ఎందుకు పని చేయకూడదు’ అనడంతో వెంటనే అక్కడ చేరిపోయాను. పదిహేనేళ్ల పాటు పని చేసి, కొద్ది నెలల క్రితం సొంతగా నేనే ఓ సంస్థ పెట్టాను. పేదవారికి ఉచితంగా కూడా చేసి పెడుతుంటాను. ఉద్యోగుల కోసం, విద్యార్థుల కోసం చాలా చేస్తున్నారు. మరి ఓ మహిళగా మహిళలకు ఏదైనా చేస్తున్నారా? ఇరవయ్యేళ్లుగా చేస్తూనే ఉన్నాను. అమెరికా వెళ్లేంత విజ్ఞానం ఉన్నవాళ్ల గురించి మనం ఏదో ఊహించుకుంటాం. అయితే అలాంటి వాళ్లలో కొందరు గృహ హింసకు పాల్పడుతున్నారంటే నమ్ముతారా? కట్నం కోసమనో, ఆడపిల్ల పుట్టిందనో చిత్రహింసలు పెడుతుంటారు. కొందరైతే ఏదో వంకతో భార్యను మన దేశానికి పంపేసి, ఆనక అక్కడ కోర్టులో విడాకుల పిటిషన్ వేస్తుంటారు. ఆరోగ్యం సరిగా ఉండదనో, మతి స్థిమితం లేనిదనో ఏవేవో కారణాలు సృష్టిస్తుంటారు. ఒకసారి అక్కడ కోర్టులో కేసు రిజిస్టర్ అయ్యాక ఇక ఆమె ఇంకెక్కడా కేసు వేయడానికి ఉండదు. ఇది అన్యాయం కదా... మీలాంటి వాళ్లు, ప్రభుత్వం కలిసి ఈ పరిస్థితిని మార్చలేరా? కష్టం. ఎందుకంటే అమెరికాలో చట్టాలు చాలా బలంగా ఉంటాయి. వాటిలో ఎవరినీ ఇన్వాల్వ్ అవ్వనివ్వవు. పాపం ఆ అమ్మాయిల్ని చూస్తే చాలా జాలేస్తుంది. ఎక్కడికి వెళ్లాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ మహిళలు విలవిల్లాడిపోతారు. వాళ్లు నాకు ఫోన్ చేసినా, మరెవరి ద్వారా అయినా సమాచారం అందినా నేను వెంటనే వెళ్లిపోతాను. వీలైనంత వరకు ఇరువర్గాలతో మాట్లాడి కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీలుకాని పక్షంలో ‘తానా’ సభ్యుల సహకారంతో ఆ అమ్మాయికి చదువుకోవడానికో, చదువుకున్నవారైతే ఉద్యోగం చేయడానికో ఏర్పాటు చేస్తాను. వారు తమ కాళ్ల మీద తాము నిలబడేవరకూ సభ్యులలో ఎవరో ఒకరం వారికి ఆశ్రయం కూడా కల్పిస్తూ ఉంటాం. చట్టపరమైన సహాయం అవసరమైతే కనుక ఆయా రాష్ట్రాల్లో ఉన్న తానా సభ్యుల సాయంతో లాయర్లను ఏర్పాటు చేయడం, గెడైన్స్ ఇప్పించడం వంటివి చేస్తాను. విదేశాల్లో చాలా సేవ చేస్తున్నారు. మరి మన దేశం సంగతేంటి? తానా ‘మన పల్లె కోసం’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. దానిలో భాగంగా సభ్యులందరం ఇండియాలోని ఒక్కోగ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాం. నేను మా అమ్మమ్మగారి ఊరైన ‘నాయుడుగూడెం’ను దత్తత తీసుకున్నాను. ఏలూరు దగ్గర ఉన్న ఈ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి వైఫై విలేజ్‌గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాను. అమెరికా వెళ్లాలనుకుంటున్నారా? వీసా, ఇమిగ్రేషన్ల గురించి సందేహాలు ఉన్నాయా? వెంటనే మాకు రాయండి. అమెరికాలో మీకు సంబంధించిన మహిళలెవరైనా గృహ హింసకు గురవుతున్నారా? వారిని ఎలా కాపాడాలో తెలియడం లేదా? వారి సమస్యను మాకు తెలియజేయండి. మీ ప్రశ్నలన్నింటికీ లక్ష్మి దేవినేని సమాధానాలు ఇస్తారు. పరిష్కారాలను సూచిస్తారు. మా చిరునామా... గైడ్, సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స్, రోడ్ నం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34 ఈ మెయిల్: guide.sakshi@gmail.com -
విద్యార్థుల కష్టాలు తీర్చాడు...
ఆలోచనకు అనుభవంతో పని లేదు. ప్రతిభకు వయసుతో సంబంధం లేదు. కాసింత సృజనాత్మకత, ఇంకాస్త కృషి, మరికాస్త పట్టుదల ఉంటే చాలు... ఎవరూ ఊహించనివి చేయవచ్చు. అందరితో శభాష్ అనిపించుకోవచ్చు. సందేశ్ బెహెటీ ప్రతిభ గురించి, అతడు సాధించిన విజయం గురించి తెలిస్తే... ఈ మాటలు ఎంత సత్యమో తెలుస్తుంది! ఓసారి ఒక దినపత్రికలో ‘మీరూ సెలెబ్రిటీ కావాలనుకుంటున్నారా’ అన్న ప్రకటనకు ఆకర్షితుడై, పోటీకి అప్లికేషన్ పంపించాడు సందేశ్. దాదాపు రెండు లక్షల మంది పాల్గొన్న ఆ పోటీలో... ప్రతి రౌండ్లోనూ తన ప్రతిభతో విజయఢంకా మోగించాడు. దాంతో అతడికి హైదరాబాద్ మెట్రో రైలుకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది. తెలంగాణ ఏవియేషన్ అకాడెమీకి వెళ్తే... అకాడెమీని నడిపే ముఖ్యాధికారి దగ్గర్నుంచి, గేటు దగ్గర కాపలా కాసే వాచ్‌మేన్ వరకూ అందరికీ సుపరిచితుడు సందేశ్. పెలైట్ కోర్సు చదువుతోన్న ఈ కుర్రాడిని అంత పాపులర్ చేసింది... ముమ్మాటికీ అతడి ప్రతిభే. పైలట్ కోర్సులో టెక్నికల్ జనరల్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. అది చాలా కష్టంగా ఉంటుంది. ఎవ్వరూ ఒక్కసారి పరీక్ష రాసి పాసవ్వలేరు. ఆ విషయం సందేశ్‌కి బాగా తెలుసు. ఎందుకంటే అతడు కూడా మూడుసార్లు విఫలమై, నాలుగోసారి పాసయ్యాడు కాబట్టి. అప్పుడే సందేశ్ ఆలోచనలో పడ్డాడు. అప్పుడతడికి అర్థమైంది... లోపం సబ్జెక్టులో కాదు, దానికి సంబంధించిన పుస్తకాల్లో ఉందని. టెక్నికల్ జనరల్ గురించి ప్రచురించిన ప్రతి పాఠ్య పుస్తకమూ వందలు, వేల పేజీల్లో ఉంది. పైగా అవన్నీ కఠినమైన ఆంగ్లంలో ఉన్నాయి. వాటిని చదవడం, అర్థం చేసుకోవడం, గుర్తు పెట్టుకోవడం అంత తేలిక కాదు. ఈ విషయం అర్థం కాగానే ఓ ఆలోచన తళుక్కున మెరిసింది సందేశ్ మనసులో. వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేశాడు. అహరహం శ్రమించాడు. 45 రోజులు తిరిగేసరికల్లా టెక్నికల్ జనరల్ సబ్జెక్టు మొత్తాన్నీ కుదించి ‘హ్యాండ్‌బుక్ ఫర్ పైలట్స్’ పేరుతో ఓ చిన్న పుస్తకంగా వెలువరించాడు. పుస్తకం అంత చిన్నగా ఉన్నా, సబ్జెక్టులో ఉండాల్సిన ఏ ముఖ్యమైన పాయింటూమిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. సందేశ్ పాఠ్యాంశాలను కుదించాడు తప్ప, ఏ ముఖ్యమైన అంశాన్నీ విస్మరించలేదు. పాఠాలన్నిటినీ కూలంకషంగా చదివి, ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ జాగ్రత్తగా పేర్చాడు. అది కూడా సులభమైన ఆంగ్లంలో! పుస్తకంలో పేజీలకి ఒక పక్క మాత్రమే సబ్జెక్ట్ రాశాడు. ఎడమపక్కన పేజీలన్నీ ఖాళీగా ఉంచాడు... చదివేటప్పుడు నోట్స్ రాసుకోవడానికి. వెరసి ఈ పుస్తకం విద్యార్థులకు ఎంత బాగా ఉపయోగపడిందంటే... కళ్లు మూసి తెరిచేలోగా చాలా కాపీలు అమ్ముడైపోయాయి. కొందరు విద్యార్థులు సందేశ్ పుస్తకాన్ని చదివి వెంటనే పరీక్ష పాసైపోయారు కూడా. ఆ విషయం సందేశ్ దగ్గర ప్రస్తావిస్తే... ‘‘ పుస్తకం రాయడం వల్ల వచ్చిన పేరు, పాపులారిటీ కంటే... వాళ్లు నా పుస్తకం చదివి పరీక్ష పాసయ్యారన్న విషయమే నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చింది’’ అంటూ సంబరపడ్డాడు. సందేశ్‌కి ఎయిర్‌లైన్స్ అంటే పిచ్చి. రాజస్థాన్‌లో పుట్టినా... తండ్రి ఎం.రమేష్ కుమార్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగి కావడంతో చెన్నై, ఢిల్లీల్లో పెరిగాడు. ఇప్పుడాయన హైదరాబాద్ ఎయిర్ ఇండియా సంస్థలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా ఉండటంతో, కుటుంబమంతా హైదరాబాద్‌లోనే నివసిస్తోంది. జేఎన్టీయూలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్‌లో ఇంజినీరింగ్ చేసిన సందేశ్, ప్రస్తుతం తెలంగాణ ఏవియేషన్ అకాడెమీలో పైలట్ కోర్సు చేస్తున్నాడు. ఆకాశంలో విహరించడం తన ప్యాషన్ అని చెప్పే ఈ అబ్బాయికి, విమానాలకు సంబంధించిన అంశాలపై వయసుకు మించిన అవగాహన ఉంది. అదే ఈ పుస్తకం రాయడానికి ప్రేరేపించింది. అయితే ఇందులో తన గొప్పదనం ఏమీ లేదని, తండ్రి రమేష్, తల్లి శిఖాల ప్రోత్సాహమే తనను ప్రతి విషయంలోనూ విజేతను చేస్తోందని వినయంగా చెబుతాడు సందేశ్. త్వరలో ‘హ్యాండ్‌బుక్ ఫర్ పైలట్స్’ రెండో ఎడిషన్ కూడా వేయబోతున్నాడు. దేశంలోని విద్యార్థులందరికీ ఈ పుస్తకం అందుబాటులో ఉండేలా చూడాలనుకుంటున్నాడు. - సమీర నేలపూడి -
పసివాడి శాపం
నిజాలు దేవుడికెరుక జూన్ 6, 1985... బ్రిటన్. ‘‘త్వరగా పోనియ్. ఇప్పటికే ఆలస్యమైంది’’... తొందరపెడుతున్నాడు పీర్సన్. అతడలా అనడంతో మరింత వేగం పెంచాడు డ్రైవర్. మరో పది నిమిషాల్లో డెర్బీలోని ఓ ఇంటికి చేరుకున్నారు. ‘‘ఓ మై గాడ్... త్వరగా పని మొదలు పెట్టండి’’ అని అరుస్తూ వ్యాన్‌లోంచి కిందికి దూకాడు పీర్సన్. అందరూ చకచకా బండి దిగారు. పొడవాటి ట్యూబులను చేతుల్లోకి తీసుకుని నీళ్లు చిమ్మడం మొదలు పెట్టారు. ఎంతో అందంగా ఉందా ఇల్లు. ఏం జరిగిందో ఏమో కానీ... మంటల్లో చిక్కుకుంది. ఆ విషయం తెలియగానే తన టీమ్‌తో కలిసి అక్కడికి చేరుకున్నాడు ఫైర్ స్టేషన్ ఇన్చార్జి పీర్సన్. వాళ్లంతా శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు కానీ... మంటలు ఓ పట్టాన అదుపులోకి రావడం లేదు. ‘‘చాలా పెద్ద యాక్సిడెంట్ సర్’’ అన్నాడు ఫైర్‌మేన్ జాన్. ‘‘అవును. దాదాపు అన్నీ నాశనమైపోయి ఉంటాయి. మనుషులెవరికీ ఏం కాకుండా ఉంటే చాలు’’ అన్నాడు పీర్సన్. కాసేపటికి మంటలు చల్లారాయి. మాస్కులు తగిలించుకుని అందరూ లోపలికి నడిచారు. అదృష్టంకొద్దీ లోపల మనుషులెవరూ లేరు. కానీ ఇల్లు ధ్వంసమైపోయింది. అన్నీ మాడి మసైపోయాయి. ‘‘అనుకున్నట్టే అయ్యింది జాన్. ఏ ఒక్కటీ మిగల్లేదు’’ అన్నాడు పీర్సన్ పరిశీలిస్తూ. ‘‘అవును సర్’’ అంటూ ఎందుకో గోడవైపు చూసిన జాన్ అవాక్కయిపోయాడు. గోడకు ఓ చిన్నపిల్లాడి పెయింటింగ్ వేళ్లాడుతోంది. ఆ పిల్లాడు చాలా జాలిగా ఉన్నాడు. ఏడుస్తున్నాడు. చెక్కిళ్ల మీదుగా కన్నీళ్లు జాలువారుతున్నాయి. చక్కని రంగులతో, ఎంతో అందంగా ఉంది ఆ చిత్రం చూడ్డానికి. మెల్లగా దాని దగ్గరకు వెళ్లాడు జాన్. చిత్రాన్ని చేతితో తాకాడు. అంతే... ఉలిక్కిపడ్డాడు. ‘‘సార్... ఓసారిలా రండి... త్వరగా’’ అంటూ కేక పెట్టాడు. అతడి అరుపు వింటూనే అటువైపు పరుగు తీశాడు పీర్సన్. ‘‘ఏంటి జాన్... ఏం జరిగింది’’ అన్నాడు కంగారుగా. జాన్ కళ్లు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. ‘‘ఇటు చూడండి సర్’’ అంటూ పెయింటింగ్ వైపు చూపించాడు. దాన్ని చూస్తూనే విస్తుపోయాడు పీర్సన్. ‘‘ఏంటిది జాన్... ఇదెలా సాధ్యం? ఇల్లు మొత్తం బుగ్గైపోయింది. కానీ ఈ పెయింటింగ్ మాత్రం చెక్కు చెదరలేదు. దాని వెనక ఉన్న గోడ కూడా మసిబారిపోయింది. ఇది మాత్రం ఇలా ఎలా ఉంది?’’... తన అనుమానాలన్నింటినీ ప్రశ్నలుగా సంధించాడు పీర్సన్. ‘‘అంతకంటే విచిత్రం ఇంకొకటుంది సర్. ఇంత ఘోరమైన మంటల మధ్య ఉన్నా, ఈ పెయింటింగ్కున్న ఫ్రేమ్ కనీసం వేడి కూడా ఎక్కలేదు.’’ జాన్ అలా అనగానే ఫ్రేమును తాకి చూశాడు పీర్సన్. చల్లగా తగిలింది చేతికి. మరోసారి విస్తుపోయాడు. కాసేపటికి విస్మయం నుంచి తేరుకుని, ఆ చిత్రాన్ని తీసుకుని స్టేషన్‌కి బయలుదేరారు ఇద్దరూ. ఆ రోజు సాయంత్రం... ‘‘అబ్బ.. ఎంత బాగుందో పెయింటింగ్. బుజ్జిగాడు ఎంత ముద్దుగా ఉన్నాడో’’... భర్త తీసుకొచ్చిన చిత్రాన్ని చూస్తూనే సంబరపడిపోయింది పీర్సన్ భార్య మిలిండా. ‘‘కదా... నీకు నచ్చుతుందనే తెచ్చాను’’ అన్నాడు పీర్సన్. మిలిండా ఆ చిత్రాన్ని హాల్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న గోడ కు తగిలించింది. చూసుకుని మురిసిపోయింది. వారం రోజుల తర్వాత... ఫైర్ స్టేషన్లో పీర్సన్ పనిలో తలమునకలై ఉండగా ఫోన్ రింగయ్యింది. ‘‘పనిలో ఉన్నప్పుడే ఫోన్లు వస్తుంటాయి. ఇంకెవరి కొంప తగులబడిందో ఏమో’’ అనుకుంటూ రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. అవతలి వ్యక్తి చెప్పిన విషయం వినగానే అతడి ముఖం మ్లానమయ్యింది. చేస్తున్న పని వదిలేసి టీమ్‌ని తీసుకుని పరుగుదీశాడు. వాళ్లు వెళ్లేసరికి పీర్సన్ ఇల్లు తగులబడుతోంది. ‘‘దేవుడా... ఇలా ఎలా జరిగింది? మిలిండా లోపలే ఉండివుంటుంది... మిలిండా’’... పీర్సన్ అరుపులతో పరిసరాలు దద్దరిల్లాయి. సిబ్బంది మంటల్ని అదుపు చేయగానే లోపలకు పరుగెత్తాడు పీర్సన్. లోపల... హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న మిలిండా, ఉన్నది ఉన్నట్టుగా కాలిపోయింది. ఆమెనలా చూస్తూనే భోరుమన్నాడు పీర్సన్. ‘‘ఊరుకోండి సర్. అసలు ఇది ఎలా జరిగిందంటారు? మేడమ్ కూర్చున్న విధానాన్ని బట్టి ఆవిడ టీవీ చూస్తున్నట్టు అనిపిస్తోంది. కనీసం వంట చేసేటప్పుడు ప్రమాదం జరిగిందనుకోవడానికి లేదు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్లాంటిదేమైనా అయ్యిందేమో’’... ప్రమాదానికి కారణాలను అంచనా వేసే పనిలో పడ్డాడు జాన్. కానీ పీర్సన్ అవేమీ వినే పరిస్థితుల్లో లేడు. బూడిదశిల్పంలా ఉన్న భార్యవైపే చూస్తూ కూర్చున్నాడు. ఉన్నట్టుండి అతడి కళ్లు... ఎదురుగా ఉన్న గోడమీద పడ్డాయి. ఒక్కసారిగా అదిరిపడ్డాడు. ఆ పిల్లాడి పెయింటింగ్ అలానే ఉంది. చుట్టూ ఉన్న మిగతా పెయింటింగులు, ఫొటోలన్నీ కాలిపోయాయి. కానీ అది మాత్రం అలానే ఉంది. ‘‘జాన్... ఇలారా’’ ఇన్చార్జి అరుపు వింటూ అక్కడికి వచ్చిన జాన్ పిల్లాడి చిత్రాన్ని చూసి భయంతో వణికాడు. ‘‘ఏంటి సార్ ఈ విచిత్రం? నాకెందుకో ఆ పెయింటింగువల్లే ఇదంతా జరిగిందని అనిపిస్తోంది. దాన్ని వెంటనే ఎక్కడైనా పారేయండి సర్’’ అన్నాడు కంగారుగా. నువ్వు చెప్పేది కరెక్టే అన్నట్టు తలూపాడు పీర్సన్. వెంటనే దాన్ని తీసుకెళ్లి చెత్తబుట్టలో పారేశాడు. శని వదిలిందనుకున్నాడు. కానీ ఆ చిత్రం తనకి మరోసారి ఎదురవుతుందని అతడు ఊహించలేదు. నెల రోజుల తర్వాత... పీర్సన్ ఇంటికి రెండు వీధుల అవతల ఉన్న ఓ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ పీర్సన్ బృందానికి మళ్లీ ఆ పిల్లాడి పెయింటింగ్ కనిపించింది. మాడి మసైపోయిన వస్తువుల మధ్య, అందంగా, ఎంతో కళగా కనిపించింది. అది ఎక్కడిదని ఇంటి యజమానిని అడిగాడు పీర్సన్. రోడ్డుమీద వెళ్తూ అనుకోకుండా ఓ చెత్తబుట్ట వైపు చూస్తే, అందులో కనిపించిందని, అంత అందమైన చిత్రాన్ని అలా పారేయడం ఇష్టం లేక తెచ్చి ఇంట్లో పెట్టుకున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. దాన్ని ఇంటికి తెచ్చిన వారం రోజులకే ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు. పీర్సన్కి విషయం అర్థమైంది. కచ్చితంగా ఆ చిత్రం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని అతడికి అర్థమైంది. దాన్ని ఎక్కడైనా పారేయమని ఆ వ్యక్తికి చెప్పాడు. అతడు దాన్ని తీసుకెళ్లి, ఓ నిర్మానుష్య ప్రదేశంలో పారేశాడు. అయినా కథ ముగిసిపోలేదు. మళ్లీ మళ్లీ పునరావృతమవుతూనే ఉంది. కొన్ని సంవత్సరాల పాటు బ్రిటన్‌లో ఈ ‘క్రయింగ్ బాయ్’ పెయింటింగ్ కల్లోలాన్ని సృష్టించింది. ఆగ్ని ప్రమాదాలు జరిగిన చాలా ఇళ్లలో అగ్నిమాపక సిబ్బందికి ఈ చిత్రం కనిపించేది. అది కూడా చెక్కు చెదరకుండా. దాంతో ఆ చిత్రంలో ఏదో మర్మముందని, ఆ పిల్లాడు శపించడం వల్లే ఇలా జరుగుతోందనే వార్త బ్రిటన్ అంతటా షికార్లు చేయడం మొదలుపెట్టింది. అది నిజమా? ఆ పిల్లాడు నిజంగా ఉన్నాడా? అతడు శపించడం వల్లే ఇవన్నీ జరిగాయా? అమిడియో మరణించాక కొందరు డాన్ బానిల్లో చిత్రం గురించిన వాస్తవాలను బయటకు లాగేందుకు ప్రయత్నిం చారు. అమిడియో తన చిత్రాన్ని గీస్తున్నంతసేపూ డాన్ బానిల్లో ఏడుస్తూనే ఉన్నాడట. ఆ ఏడుపు చూసి కదిలిపోయిన అమిడియో... డాన్ని దత్తత తీసుకున్నాడట. డాన్ని ఇంటికి తీసుకొచ్చిన కొద్ది రోజులకే అమిడియో ఆర్ట్ స్టూడియో మంటల్లో చిక్కుకుందట. అక్కడే ఆడుకుంటోన్న డాన్ ఆ మంటల్లో చిక్కుకుని మరణించాడని, అతడి ఆత్మ ఆ పెయింటింగ్‌ని ఆవహించిందన్నది ఓ కథనం. ఇంకో కథనం ప్రకారం... అమిడియో అనాథ పిల్లల చిత్రాలు గీసి వచ్చేసిన తర్వాత అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం జరిగి, పిల్లలందరూ చనిపోయారు. దయ్యమైన డాన్ బానిల్లో తన చిత్రాన్ని ఆవహించాడు. అందుకే ఆ చిత్రాన్ని తీసుకెళ్లిన ప్రతి చోటకూ తనూ వెళ్లేవాడు. ఆ ఇంటిని శపించేవాడు. అందువల్లనే అన్ని ఇళ్లూ కాలిపోయాయి. ఇవన్నీ ఎవరెవరో చెప్పిన కథనాలు. ఇవి నిజాలో ఊహలో కూడా ఎవరికీ తెలియదు. అందుకే దేన్నీ నమ్మలేని పరిస్థితి. ద క్రయింగ్ బాయ్... ఈ చిత్రాన్ని గీసింది బ్రూనో అమిడియో అనే ఇటాలియన్ చిత్రకారుడు. నిజానికి అతడు దాదాపు 65 ‘క్రయింగ్ బాయ్స్’ చిత్రాలను వేశాడు. అవన్నీ కలిసి దాదాపు యాభై వేల కాపీలు అమ్ముడయ్యాయి. ఇంగ్లండ్‌లోని చాలా ఇళ్లలో గోడలను అలంకరించాయి. అయితే 64 చిత్రాల వల్ల ఏ సమస్యా రాలేదు. కానీ డాన్ బానిల్లో అనే పిల్లాడి చిత్రం మాత్రం చిత్రాలు చేసింది. దానిని ఎవరు ఇంట్లో పెట్టుకున్నా వారి ఇల్లు తగులబడిపోయేది. కానీ ఆ చిత్రానికి సెగ కూడా తాకేది కాదు. మొదట ఈ సంగతి ఎవరూ గమనించకపోయినా... ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రతి ఇంట్లోనూ ఆ పిల్లాడి పెయింటింగ్ కనిపించేసరికి ఈ ప్రమాదాలకీ ఆ చిత్రానికీ కచ్చితంగా సంబంధం ఉందనిపించింది. ఈ విషయం గురించి పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. దాంతో అందరూ తమ దగ్గర ఉన్న క్రయింగ్బాయ్ చిత్రాన్ని తీసుకెళ్లి పారేశారు. ఆ చిత్రం గురించిన కథనాలను పత్రికల్లో చదివాక, ఆ ప్రతులను సైతం తగులబెట్టేసేవారు. అంతగా ఆ పెయింటింగ్ అంటే భయం పట్టుకుంది. చాలామంది ఈ విషయాన్ని చిత్రకారుడు అమిడియో దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ అతడీ విషయాన్ని అంగీకరించేవాడు కాదు. ఆ పిల్లాడు ఎవరో, అతగాడి కథ ఏమిటో చెప్పమంటే చెప్పేవాడు కాదు. 1981లో తాను చనిపోయేవరకూ కూడా బానిల్లో గురించిన నిజాన్ని అమిడియో బయట పెట్టలేదు. దాంతో ‘క్రయింగ్బాయ్’ పెయింటింగ్ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది! - సమీర నేలపూడి -
హనీమూన్ హత్య
అందమైన, అమాయకమైన ఆడపిల్ల... కోరుకున్నవాడితో తాళి కట్టించుకుంది... ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది... భవిష్యత్తు గురించి ఆశలగూళ్లు అల్లుకుంది... అంతలోనే ఘోరం జరిగిపోయింది... అనుకోని పరిస్థితుల్లో ఆమె హత్యకు గురయ్యింది... అసలేం జరిగింది? కాళ్ల పారాణి ఆరకముందే ఆమె ఎందుకు కన్నుమూసింది? నవంబర్ 13, 2010... స్వీడన్... ‘‘ఎంతసేపు మురిసిపోతారు ఆ ఫొటోల్ని చూసి... ఇక పడుకోండి’’... గదిలోకి వచ్చిన నీలమ్, భర్తని కోప్పడింది. ‘‘ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు నీలమ్. చూడు నా చిట్టితల్లి పెళ్లి బట్టల్లో ఎంత బాగుందో. ఎక్కడలేని కళా వచ్చేసింది తనకి’’... ఇంకా మురిసిపోసాగాడు వినోద్. ‘‘అబ్బా... ఇక చాల్లే ఇటివ్వండి’’ అంటూ ఆల్బమ్ తీసుకెళ్లి అల్మారాలో పెట్టేసింది నీలమ్. భార్య చేసిన పనికి నవ్వేసి, మంచమ్మీద వాలాడు వినోద్. చిన్న కూతురు ఆనీ అంటే ప్రాణం వినోద్‌కి. అందుకే పదిహేను రోజులు కావస్తున్నా కూతురి పెళ్లి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఆమె గురించి ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించాడు. కొద్ది నిమిషాల్లోనే నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి దాటాక సెల్ రింగవడంతో లేచాడు వినోద్. ఈ సమయంలో ఎవరు చేశారబ్బా అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. స్క్రీన్ మీద కనిపించిన అల్లుడి పేరు చూసి ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆన్ చేసి... ‘‘హలో ష్రీన్... ఏం జరిగింది? ఈ టైమ్‌లో ఫోన్ చేశావేంటి’’ అన్నాడు కంగారుగా. ‘‘ఆనీని ఎవరో ఎత్తుకుపోయారు మావయ్యా? ఎవరో ఇద్దరు నన్ను కార్లోంచి తోసేసి తనని తీసుకెళ్లిపోయారు.’’ అల్లుడు చెబుతోన్న ఒక్కో మాటా గుండెల్లోకి గునపంలా దూసుకెళ్తోంది. ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియక బొమ్మలా ఉండిపోయాడు వినోద్. ‘‘ఏమైందండీ... ఆనీకి ఏమయ్యింది?’’ ఆత్రుతగా అడిగింది నీలమ్. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు వినోద్. ‘‘నేను వెంటనే కేప్‌టౌన్ వెళ్లాలి నీలమ్’’ అంటూ ఒక్క ఉదుటున మంచం దిగాడు. క్షణాల్లో తయారై బయలుదేరాడు. కేప్‌టౌన్... దక్షిణాఫ్రికా... ట్యాక్సీ వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది. కంగారుగా దిగి లోనికి పరుగెత్తాడు వినోద్. ఎమర్జెన్సీ యూనిట్ దగ్గరకు వెళ్లబోతుండగా పోలీసులు ఎదురు వచ్చారు. వాళ్లతో పాటు వినోద్ అల్లుడు ష్రీన్ దివానీ కూడా ఉన్నాడు. మామగారిని చూస్తూనే వచ్చి వాటేసుకుని బోరుమన్నాడు. ‘‘ఏమైంది ష్రీన్... ఆనీ ఎక్కడుంది? ఎలా ఉంది?’’ ష్రీన్ మాట్లాడలేకపోయాడు. వెక్కి వెక్కి ఏడవసాగాడు. ‘‘సారీ మిస్టర్ వినోద్ హిండోచా... ఆనీ చనిపోయింది.’’ ఇన్స్పెక్టర్ మాటతో అదిరిపడ్డాడు వినోద్. ‘‘ఆనీ చనిపోయిందా? ఏంటిది ష్రీన్? రాత్రి ఫోన్ చేసి ఎవరో ఎత్తుకుపోయారన్నావ్. పొద్దున్న ఎయిర్‌పోర్ట్‌లో దిగి ఫోన్ చేస్తే హాస్పిటల్ దగ్గరకు రమ్మన్నావ్. అసలేం జరిగింది?’’ ‘‘రాత్రి ఆనీని ఎవరో ఎత్తుకుపోయారని మీ అల్లుడు మాకు ఫోన్ చేశాడు. వెంటనే హెలికాప్టర్లో వేట మొదలెట్టాం. ఉదయం ఏడున్నరప్పుడు ఆనీని కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన ట్యాక్సీ కనిపించింది. కానీ అప్పటికే ఆమె..’’ ఇన్స్పెక్టర్ మాట పూర్తి కాకముందే కుప్పకూలిపోయాడు వినోద్. హనీమూన్కని వెళ్లిన కూతురు శవంగా మారుతుందని ఊహించని ఆ తండ్రి మనసు వాస్తవాన్ని జీర్ణించుకోలేక విలవిల్లాడుతోంది. జరిగింది, తాను విన్నది నిజం కాదేమో ఇంకా చిన్న ఆశతో రెపరెపలాడుతోంది. కానీ అది అర్థం లేని ఆశ అని అర్థం చేసుకోవడానికి కొన్ని గంటలు పట్టింది. డిసెంబర్ 8, 2010... ‘‘ఏం మాట్లాడుతున్నారు సర్... తను నా భార్య సర్. నా ప్రాణం. ప్రేమించి పెళ్లాడిన తనను చంపాల్సిన అవసరం నాకేముంటుంది సర్?’’ ‘‘అనవసరంగా అరవొద్దు మిస్టర్ ష్రీన్ దివానీ. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇక మీరు తప్పించుకోలేరు’’ అంటూ ఆ సాక్ష్యాలను ష్రీన్ ముందు పెట్టాడు ఇన్స్పెక్టర్. వాటిని చూడగానే ష్రీన్ ముఖం పాలిపోయింది. కాసేపు నీళ్లు నమిలాడు. కాసేపు ఏదో చెప్పబోయి తత్తరపడ్డాడు. తర్వాత మౌనంగా ఉండిపోయాడు. దాంతో అతడే నేరస్తుడన్న నమ్మకం బలపడింది పోలీసులకు. ష్రీన్‌ని కోర్టు ముందు హాజరు పర్చేందుకు రంగం సిద్ధం చేశారు. అసలింతకీ ఏరికోరి మనువాడిన ప్రేయసిని ష్రీన్ ఎందుకు చంపాడు? దేని కోసం చంపాడు? భారతీయ హిందూ సంతతికి చెందిన వినోద్ హిండోచా కుటుంబం చాలా యేళ్ల క్రితమే స్వీడన్లో స్థిరపడింది. వినోద్ ముగ్గురు పిల్లల్లో చిన్నది ఆనీ. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఉద్యోగం చేస్తోంది. 2009లో ఓరోజు స్నేహితురాలిని కలవడానికి లండన్ వెళ్లింది. అక్కడే తొలిసారి ష్రీన్‌ని కలిసింది. చార్టెడ్ అకౌంటెన్సీ చదివి, తన సొంత కంపెనీ వ్యవహారాలు చూస్తోన్న ష్రీన్ ఆమెకు నచ్చాడు. అతడూ ఆనీ మీద మనసు పడ్డాడు. స్నేహం కుదిరింది. ప్రేమ పెరిగింది. లండన్‌కీ స్టాక్హోమ్కీ మధ్య రాకపోకలు జరిగాయి. పెద్దల అనుమతులు లభించాయి. 2010, అక్టోబర్ 29న... ముంబైలోని ఓ రిసార్ట్‌లో, హిందూ మతాచారం ప్రకారం వారి వివాహం జరిగింది. తర్వాత హనీమూన్‌కి దక్షిణాఫ్రికా వెళ్లిపోయారు. నవంబర్ 7న కేప్‌టౌన్‌లో దిగిన తర్వాత క్రూగర్ జాతీయ పార్కుకి వెళ్లిపోయారు ఆనీ, ష్రీన్లు. అక్కడ అయిదు రోజులు (12 వరకు) బస చేసి కేప్‌టౌన్‌కు తిరిగొచ్చి, ఓ స్టార్ హోటల్లో దిగారు. 13 సాయంత్రం... ఆఫ్రికన్ సంస్కృతి కొట్టొచ్చినట్టు కనిపించే గుగులేథు టౌన్‌షిప్‌ని చూడ్డానికి బయలుదేరారు. దారిలో ఓ ఇద్దరు వ్యక్తులు కారుకు అడ్డుపడ్డారు. బలవంతంగా ఆపి కారెక్కారు. ష్రీన్ తలకి తుపాకీ గురిపెట్టి, తాము చెప్పిన దారిలో పోనివ్వమని డ్రైవర్ జోలా టాంగోని బెదిరించారు. ఇరవై నిమిషాల తర్వాత ష్రీన్‌ని కారులోంచి బయటకు నెట్టేసి, ఆనీని తీసుకుని వెళ్లిపోయారు. వెంటనే పోలీసులకు, ఆనీ తండ్రికి, తన కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి విషయం చెప్పాడు ష్రీన్. పోలీసులు హెలికాప్టర్ సాయంతో ట్యాక్సీని ట్రేస్ చేయడానికి ప్రయత్నించారు. ఉదయం ఏడున్నర కావస్తుండగా ఓ నిర్మానుష్య ప్రాంతంలో ట్యాక్సీ కనిపించింది. అందులో ఆనీ నిర్జీవంగా పడివుంది. మెడమీద తుపాకీతో కాల్చిన గుర్తు ఉంది. ఆమె ఒంటిమీది ఆభరణాలు, పర్స్, ఖరీదైన ఐఫోన్ కన్పించలేదు. ఆమె ఒంటి నిండా, ముఖ్యంగా తొడల మీద గాయాలు ఉన్నాయి. నడుం వరకూ దుస్తులు తొలగించి ఉండటంతో ఆత్యాచారం కూడా జరిగివుండొచ్చని పోలీసులు అనుమానించారు. కానీ అలాంటిదేమీ లేదని పోస్ట్‌మార్టమ్ నివేదికలో తేలింది. అత్యాచారం చేయబోగా ఎదురు తిరగడంతో చంపేశారని నిర్ధారణ అయ్యింది. ఆనీ మరణంతో ష్రీన్ కుంగిపోయాడు. మానసిక ఒత్తిడికి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో అతడి మీద ఎవరికీ అంతగా అనుమానం రాలేదు. అయితే పోలీసులు ట్యాక్సీ డ్రైవర్ టాంగోని అరెస్ట్ చేయడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ష్రీన్ దివానీయే తన భార్య హత్యకి కుట్ర పన్నాడనీ, అంతా అతడి ప్లానేననీ టాంగో చెప్పాడు. కిడ్నాప్‌నకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల వివరాలు కూడా ఇచ్చాడు. దాంతో పోలీసులు వాళ్లతో పాటు ష్రీన్‌ని కూడా అరెస్ట్ చేశారు. కోర్టు టాంగోకి 18 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. కానీ ష్రీన్ నేరం ఎంతకీ నిరూపణ కాలేదు. ఆనీ అక్క అమీ ... తన చెల్లెల్ని చంపింది ఆమె భర్తేనంటూ వాదించింది. హనీమూన్‌లో ఉండగా ఆనీ తనకి ఫోన్ చేసిందనీ, ఆమె తనకు చెప్పినదాని ప్రకారం ష్రీన్ ‘గే’ అనీ, ఆ విషయం తెలిసిపోయి నందుకే ఆనీని చంపేసివుంటాడనీ అమీ అంది. అయితే తగిన సాక్ష్యాలను సేకరించలేకపోయింది. దాంతో న్యాయస్థానం ఈ నెల 8న ష్రీన్‌ని నిర్దోషి అంటూ విడుదల చేసింది. కోర్టు తీర్పు ష్రీన్ దివానీ కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తిందేమో కానీ... సర్వత్రా నిరసనలు వెల్లువెత్తేలా చేసింది. ఎందుకంటే... ష్రీన్‌ని నేరస్తుడనడానికి చాలా సాక్ష్యాలున్నాయి. ఆనీ చనిపోయినరోజు ఉదయం, ముందురోజు రాత్రి కూడా డ్రైవర్ టాంగోని ష్రీన్ ట్యాక్సీ స్టాండులో కలిశాడు. అందుకు సాక్ష్యంగా సీసీ టీవీ ఫుటేజులు ఉన్నాయి. పైగా ఉదంతం గురించి అతడు చెప్పిన విషయాలు ఒక్కోసారీ ఒక్కోలా ఉన్నాయి. దుండగులు ట్యాక్సీలోకి ఎక్కాక ఇరవై నిమిషాల తర్వాత తనని తోసేశారని ఓసారి అన్నాడు. నలభై నిమిషాల తర్వాత అని ఇంకోసారి అన్నాడు. నీతో పని లేనప్పుడు అంతసేపు ఎందుకు కారులో ఉంచుకుని తిప్పారు అంటే సమాధానం లేదు. దోచుకునే ఉద్దేశంతోనే కిడ్నాప్ చేసివుంటే నీ ఫోన్, పర్స్ కూడా లాక్కోవాలి కదా అంటే మాట్లాడలేదు. అంత స్పీడుగా వెళ్తోన్న కారులోంచి తోసేస్తే నీకు దెబ్బలెందుకు తగల్లేదు అంటే కిక్కురుమనలేదు. వీటన్నిటినీ న్యాయస్థానం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఆనీకి అన్యాయం జరిగిందని ప్రపంచమంతా ఘోషిస్తోంది. ఆమెకు న్యాయం చేసేవరకూ పోరాడతామని ఆనీ కుటుంబం శపథం చేస్తోంది. తను ఎలాగూ తిరిగిరాదు, కనీసం తన పట్ల ఏం జరిగిందో తెలుసుకోండి చాలు అంటూ పోలీసులను, న్యాయస్థానాన్నీ వేడుకుంటోంది. వారి ఆవేదనను ఎవరు అర్థం చేసుకుంటారు? ఆనీకి ఎవరు న్యాయం చేస్తారు?! ఆనీ మరణించిన తర్వాత ష్రీన్ మానసిక ఒత్తిడికి గురయ్యాడని అతడి ఇంట్లోవాళ్లు చెబుతున్నా, తన ప్రవర్తన అలా అనిపించలేదంటారు చాలామంది. చివరికి అంత్యక్రియల సమయంలో కూడా అతడి కళ్ల నుంచి నీళ్లు రాలేదనీ, పైగా చలాకీగా తిరిగేవాడనీ, అందరితో నవ్వుతూ మాట్లాడేవాడనీ కొందరు చెప్పారు. మరోపక్క ష్రీన్ ‘గే’ అన్న విషయం ఆనీ సోదరి అమీ చెప్పగానే... పోలీసులు ఆ దిశగా కూడా ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ఆ క్రమంలో వారికి అమీ చెప్పిన విషయం నిజమేనని తేలింది. ష్రీన్కి చాలామంది పురుషులతో సంబంధాలు ఉన్నాయనీ, అతడు మేల్ ప్రాస్టిట్యూట్స్‌తో కూడా కలిసి తిరిగేవాడనీ నిరూపణ అయ్యింది. అయితే ఆ నిజం ఆనీకి తెలియడం వల్లే ఆమెను చంపాడు అనడానికి మాత్రం సాక్ష్యాలు లభించలేదు. దాంతో కేసు నుంచి బయటపడ్డాడు. - సమీర నేలపూడి -
మారదామనే అనుకున్నాను కానీ...
సన్నని గొంతుతో, విచిత్రమైన డైలాగ్ డెలివరీతో అందరినీ హాయిగా నవ్వించేస్తాడు చంటి. అయితే ఆ కామెడీ అంతా తెర వరకే పరిమితం. తెర వెనుక అతడి మాటల్లో ఆవేశం ఉప్పొంగుతుంది. ఆవేదన కదలాడుతుంది. తన కామెడీతో కడుపుబ్బ నవ్వించే చంటిలో ఉన్న మరో కోణమిది... కళారంగంవైపు ఎలా వచ్చారు? నా అసలు పేరు వినయ్ మోహన్. మాది హైదరాబాద్. చిన్నప్పట్నుంచీ కళల పట్ల మక్కువ ఎక్కువ. కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలు... ముందుండేవాణ్ని. ముందుండి నడిపించేవాణ్ని. ఏడో తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్ యాన్యువల్ డేకి నటి ఊహ అతిథిగా వచ్చారు. ఆవిడ స్టేజి మీదికి వచ్చేవరకూ అందరూ నేను చెప్పినట్టే విన్నారు. కానీ ఊహ స్టేజి ఎక్కగానే నన్ను పట్టించుకోవడమే మానేశారు. అప్పుడర్థమైంది... స్టేజిమీదికి వెళ్లేవారికి ఉండే గౌరవం ఏమిటో. నేనూ స్టేజి ఎక్కాలి, అందరి దృష్టీ నామీదే ఉండాలి. అలా జరగాలంటే ఊహగారిలాగా నేను కూడా సినిమాల్లోకి వెళ్లాలి అనుకున్నాను. అప్పుడు మొదలైంది తపన! వెంటనే ప్రయత్నాలు మొదలెట్టారా? అనుకోగానే అన్నీ చేసెయ్యలేం కదా! చదువుకుంటూనే మిమిక్రీ ప్రోగ్రాములు చేస్తుండేవాడిని. కానీ డిగ్రీకి వచ్చాక ఇక చదువు ఎక్కదని అర్థమైపోయింది. అందుకే ఫుల్స్టాప్ పెట్టేశాను. రకరకాల పనులు చేసి చివరకు ఓ గెస్ట్ హౌస్‌కి మేనేజర్‌గా చేరాను. అక్కడికి ఓసారి కొందరు వచ్చారు. వాళ్ల మాటల ద్వారా హైదరాబాద్‌లో రేడియో మిర్చిని ప్రారంభించబోతున్నారని తెలిసింది. నాకూ అవకాశమివ్వమని అడిగాను. ఆడిషన్లూ అయ్యీ అయ్యాక... యతిరాతి భూపాల్గారని, రచయిత... ఆయన ‘చంటి-బంటి’ షోలో చంటిగా నన్ను ఎంపిక చేశారు. ఇంతకీ సినిమాల్లోకి ఎలా వచ్చారు? అదీ భూపాల్గారి చలవే. తాను రచన చేసిన ‘జల్లు’ అనే సినిమాలో నాకో చాన్స్ ఇప్పించారాయన. ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత ‘భీమిలి కబడ్డీ జట్టు’లో చాన్స్ వచ్చింది. అది హిట్ అవడంతో నా గురించి అందరికీ తెలిసింది. కానీ తక్కువ సినిమాలే చేసినట్టున్నారు? అవును. అవకాశాలు రావట్లేదు. ఒకప్పుడు అదృష్టం ఉంటే వచ్చేవి. తర్వాత లాటరీ కొట్టినట్టు అనుకోకుండా వచ్చేవి. ఇప్పుడు పరిచయాలు ఉంటే వస్తున్నాయి. టీవీ షోల వల్ల నేను పాపులరయ్యాను.కాస్త డబ్బులు సంపాదించుకున్నాను. కానీ ఇలాంటి కార్యక్రమాల వల్ల చెడూ జరుగుతుంది. ఎంతోమంది నటీనటులు వచ్చేస్తున్నారు. స్టేజి ఎక్కిన ప్రతి ఒక్కరూ గొప్ప నటులమే అనుకుంటున్నారు. ఆప్షన్స్ ఎక్కు వైనప్పుడు ఆఫర్ చేసేవాడు కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. ఎవడు తక్కువకొస్తే వాడినే తీసుకుంటాడు. దానివల్ల నిజంగా ప్రతిభ ఉన్నవాళ్లు నష్టపోతున్నారు. అంటే మీకు పెద్దగా పరిచయాలు లేవా? ఉన్నా నాలాంటి వాడికి అవకాశాలు తక్కువే వస్తాయి. ఎందుకంటే నేను చాలా ముక్కుసూటి మనిషిని. తేడా ఉన్నా, తప్పు జరిగినా ముఖమ్మీదే మాట్లాడతాను. అది ఎవరికీ నచ్చదు. మాట్లాడినప్పుడు సూపర్ అంటారు. తర్వాత పక్కకు వెళ్లి నా గురించి చెడుగా మాట్లాడతారు. నాలాంటి వాడు ఇండస్ట్రీకి నచ్చడు. అది తెలిసీ ఎందుకలా ఉండటం? నేనూ మారదామనుకున్నాను. కానీ మారితే అవకాశాలు వస్తాయని గ్యారంటీ ఉందా? లేనప్పుడు నేను చేసేది కరెక్ట్ అని తెలిసీ ఎందుకు నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి? అవకాశాల కోసం భజనలు చేయడం, కాకా పట్టడం నేను చేయలేను. ఒకరి అవకాశాలు మరొకరికి వెళ్లడం కూడా జరుగుతుందా? జరుగుతుందనే అనిపిస్తుంటుంది. ఓ పాత్ర ఆఫర్ చేస్తారు. రెమ్యునరేషన్, డేట్లు అన్నీ మాట్లాడేసుకున్న తర్వాత కిక్కురుమనరు. ఆరాతీస్తే ఆ పాత్ర మరెవరో చేస్తున్నారని తెలుస్తుంది. దానికి వంద కారణాలు ఉండొచ్చు. నా కంటే తక్కువ రెమ్యురేషన్కి అతడు దొరికి ఉండొచ్చు, నాకంటే బాగా తెలిసినవాడై ఉండొచ్చు. కారణం ఏదైనా నాకు మాత్రం బాధే కదా! చాలా ఆవేదనతో ఉన్నట్టున్నారు...? ఆవేదన ఉండదా?! నేను నా సీనియర్లను గౌరవిస్తాను. కానీ నా జూనియర్లు నన్ను గౌరవించరు. ఎందుకంటే నా చేతిలో చాన్సుల్లేవు కాబట్టి. చాలాసార్లు అనిపిస్తుంది వెళ్లిపోదామని. కానీ నటనంటే పిచ్చి.. అందుకే వెళ్లలేకపోతున్నాను. ఇంతకీ మీకు పెళ్లయ్యిందా? ఇంకా లేదు. నేను చాలా పెద్దవాడినని అనుకుంటారంతా. కానీ నా వయసు ముప్ఫై దాటలేదు. ఆ విషయం చెప్పినా నమ్మరెందుకో. దానికితోడు కమెడియన్ అంటే అందరికీ కామెడీనే. ఓ అమ్మాయి దగ్గరకు వెళ్లి ‘మీరు నాకు చాలా నచ్చారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది’ అన్నాను. ‘మీరు భలే కామెడీ చేస్తారండీ’ అంది. మేము నవ్వినా, ఏడ్చినా, ప్రేమించినా కామెడీయే అనుకుంటే ఏం చేస్తాం! అయితే అమ్మాయి దొరకలేదన్నమాట... సినిమా వాళ్లకు పిల్ల దొరకడం అంటే ఎవరెస్ట్ ఎక్కినట్టే. సినిమా టిక్కెట్లు కావలిస్తే మమ్మల్ని అడుగుతారు. తమకూ కాస్త క్రేజ్ పెరుగుతుందని పబ్బులకీ ఫంక్షన్లకీ తీసుకెళ్తారు. వాళ్ల పనులకి మేం కావాలి. కానీ వాళ్ల పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి మాత్రం మేం పనికి రాం. సినిమావాళ్లు తాగుతారు, తిరుగుతారు అంటూ చిట్టా వినిపిస్తారు. ఇంకెలా దొరుకుతుంది పిల్ల! చూద్దాం. పైవాడు ఎవర్నో రాసిపెట్టి ఉంటాడు కదా... ఆమె ఎదురుపడినప్పుడు చేసుకుంటా! సంభాషణ: సమీర నేలపూడి -
స్కేరీ హౌస్
అమెరికా... 2013... ‘ద కన్జ్యూరింగ్’ సినిమా షూటింగ్ స్పాట్... ‘‘ఏంటిది వెరా... ఇక్కడికొచ్చి స్క్రిప్ట్ చదివితే ఎలా? ఇంటికి తీసుకెళ్లి చదివేసి ఉంటే ఈ టైమ్ సేవ్ అయ్యేది కదా’’... విసుగ్గా అన్నాడు డెరైక్టర్ జేమ్స్ వాన్. వెరా నుదురు చిట్లించింది. ‘‘సారీ సర్... కావాలంటే రేపట్నుంచి ఇంకాస్త త్వరగా వచ్చి డైలాగ్స నేర్చుకుంటాను. అంతేకానీ స్క్రిప్టు ఇంటికి తీసుకెళ్లను.’’ ‘‘తీసుకెళ్లడానికేంటి సమస్య?’’ వెరా క్షణంపాటు తటపటాయించి అంది... ‘‘ఇంతకుముందు తీసుకెళ్లాను. అప్పుడేం జరిగిందో చెబితే నమ్మలేరు. స్క్రిప్టు చదవడం మొదలుపెట్టగానే నాకు తలనొప్పి మొదలవుతోంది. కాసేపటికి తల పగిలిపోయేంతగా వస్తుంది నొప్పి. స్క్రిప్టు పక్కన పడేయగానే మంత్రం వేసినట్టుగా ఆగిపోతుంది. అంతే కాదు.. చదువుతున్నంతసేపూ గుండె పట్టేసినట్టు, ఊపిరి ఆగిపోతున్నట్టు... ఏదేదో అవుతోంది.’’ అప్పుడే వచ్చిన ప్యాట్రిక్, వెరా మాటలు విని నవ్వాడు. ‘‘మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావు వెరా. స్క్రిప్టుకీ దానికీ సంబంధమేంటసలు? అదంతా నీ భ్రమ. ఏమంటారు డెరైక్టర్గారూ?’’ వాన్ మాట్లాడలేదు. ఏదో ఆలోచనలో ఉన్నట్టు అతడి నుదుటిమీద పడిన మడతలు చెబుతున్నాయి. ఆ ఆలోచనల తీవ్రతను తెలుపుతూ పెదవులు బిగుసుకుంటున్నాయి. ‘‘ఏంటి వాన్.. తన మాటలు నమ్మేస్తున్నారా ఏంటి కొంపదీసి?’’ అన్నాడు ప్యాట్రిక్ నవ్వుతూ. ‘‘నమ్మక తప్పదు. ఎందుకంటే... ఈ సినిమా మొదలు పెట్టినప్పట్నుంచీ నాకూ ఇలాంటివే జరుగుతున్నాయి. రాత్రంతా కుక్క అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి నాకు. మా ఇంట్లో కుక్క లేదు. చుట్టుపక్కల వాళ్లెవ రూ కూడా కుక్కను పెంచుకోవడం లేదు. మరి ఆ అరుపులెక్కడివి?’’ ‘‘ఓహ్ మిస్టర్ వాన్... మీరు కూడా ఏంటి? నిన్నంతా మనం కుక్క సన్నివేశాలు షూట్ చేశాం కదా. అందుకే మీకు అలా అనిపించి ఉంటుంది. లైట్ తీసుకోండి’’ అంటూ వెళ్లిపోయాడు ప్యాట్రిక్. కానీ వాన్ లైట్‌గా తీసుకోలేకపోయాడు. సినిమా మొదలుపెట్టినప్పట్నుంచీ ఏవేవో జరుగుతూనే ఉన్నాయి. సెట్లో పెట్టిన వస్తువు పెట్టినట్టు ఉండటం లేదు. లైట్లు ఆన్ చేయకుండా లైటింగ్ వస్తూంటుంది. ఉన్నట్టుండి వాతావరణం చల్లగా అయిపోతుంది. అది కూడా... తాను ఎవరి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాడో, ఆ వ్యక్తులు స్పాట్‌కి వచ్చినప్పుడు. ఇదంతా యాదృచ్ఛికంగా జరుగుతున్నట్టు అనిపించడం లేదు. ‘‘ప్యాట్రిక్ చెప్పినట్టు ఇది భ్రమేనంటారా?’’... అనుమానంగా అంది వెరా. ‘‘లేదు వెరా... ఇది భ్రమ కాదు. హారర్ సినిమాలు తీయడం నాకు కొత్త కాదు. కానీ ఎప్పుడూ ఇలా అవలేదు. పెరాన్ ఫ్యామిలీకి ఎదురైన అనుభవాలని సినిమాగా తీస్తున్నాను. ఆ అనుభవాలు చాలా భయంకరమైనవి. వాటి ప్రభావం ఏమైనా ఉందా అని అనుమానం వస్తోంది ఒక్కోసారి’’ అంటూ మళ్లీ ఆలోచనల్లోకి జారిపోయాడు వాన్. నిజమే. పెరాన్ కుటుంబం ఎదుర్కొన్న అనుభవాలు సామాన్యమైనవి కావు. వాటిని విన్న గుండె భయంతో వణుకక మానదు. 1970... రోడ్ ఐల్యాండ్‌లోని ఓల్డ్ ఆర్నాల్డ్ ఎస్టేట్... ‘‘కమాన్ స్నూపీ... కమాన్’’... కుక్కను బలవంతంగా లోనికి లాగుతోంది సిండీ. కానీ అది కదలడం లేదు. ‘‘చూడు డాడీ... ఇది లోపలికి రావట్లేదు’’ అంది సిండీ బుంగమూతి పెట్టి. సామాన్లు లోపల పెడుతోన్న రోజర్ పెరాన్ స్నూపీ వైపు చూశాడు. అది మొరాయిస్తోంది. ‘‘వదిలెయ్ బేబీ... కొత్త ఇల్లు కదా, అందుకే అలా చేస్తోంది. వస్తుందిలే’’ అంటూ లోనికి వెళ్లిపోయాడు. ‘‘బ్యాడ్ స్నూపీ’’ అనేసి తనూ లోపలికి వెళ్లిపోయింది సిండీ. వెళ్తూనే తల్లి క్యారొలీన్ దగ్గరకు పరుగెత్తింది. ‘‘మమ్మీ... స్నూపీ లోపలికి రావడం లేదు’’ అంటూ కంప్లయింట్ చేసింది. ‘‘దాని గురించి బెంగపడకు బేబీ... నువ్వు అక్కయ్యవాళ్లతో వెళ్లి నీ రూమ్ చూసుకో’’ అందామె నవ్వుతూ. ఎక్కడలేని హుషారూ వచ్చేసింది సిండీకి. స్నూపీ సంగతి మర్చిపోయి గబగబా అక్కల దగ్గరకు వెళ్లిపోయింది. పాప సంబరం చూసి నవ్వుకుంది క్యారొలీన్. ప్రాణంగా ప్రేమించే భర్త, రత్నాల్లాంటి పిల్లలు... ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఈ డ్రీమ్హౌజ్లో కొత్త జీవితం... చాలా ఆనందంగా ఉంది క్యారొలీన్. కానీ పాపం తనకి తెలీదు... ఆ ఆనందం కొద్ది గంటలు కూడా నిలబడదని! తర్వాతి రోజు ఉదయం... ‘‘మమ్మీ... డాడీ...’’.. సిండీ అరుపుతో ఉలిక్కిపడి బయటకు పరుగెత్తారు రోజర్, క్యారొలీన్. సిండీ వెక్కి వెక్కి ఏడుస్తోంది. తనకి ఎదురుగా స్నూపీ పడివుంది... నిర్జీవంగా. రోజర్ పరుగున వెళ్లి స్నూపీని పరిశీలించాడు. ప్రాణం లేదు. ‘‘ఏంటిది రోజర్... నిన్న సాయంత్రం వరకూ బాగానే ఉంది కదా’’... దిగులుగా అంది క్యారొలీన్. అంతలో మిగతా నలుగురు పిల్లలూ వచ్చారు. స్నూపీని చూసి ఏడుపందుకున్నారు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు స్నూపీని తీసుకొచ్చాడు రోజర్. అదంటే పిల్లలకు చాలా ఇష్టం. ముఖ్యంగా నాలుగో అమ్మాయి సిండీ ఎప్పుడూ దానితోనే ఆడుకుంటుంది. దానికిలా అవడం అందరికీ బాధగానే ఉంది. ఏడుస్తూనే గొయ్యి తీసి స్నూపీని పాతిపెట్టారు. అది మొదలు... సంతోషమన్నది వాళ్ల దరికి వచ్చింది లేదు. రోజర్ దంపతులు ఒక గదిలో, పెద్దమ్మాయి ఆండ్రియా ఒక గదిలో, నాన్సీ-క్రిస్టీనాలు మరో గదిలో, సిండీ-ఏప్రిల్‌లు ఇంకో గదిలో పడుకునేవారు. రాత్రిళ్లు ఉన్నట్టుండి పిల్లల గదుల నుంచి కేకలు వినిపించేవి. వెళ్లి చూస్తే పిల్లలు ఎవరో ఈడ్చుతున్నట్టుగా నేలమీద పొర్లేవారు. గోడలకు గుద్దుకునేవారు. ఎవరో జుట్టు పట్టి లాగుతున్నారంటూ ఏడ్చేవారు. వాళ్లు గదిలో ఉన్నప్పుడు ఎవరో బయట తాళం వేసేసేవారు. సెల్లార్లోకి వెళ్లినప్పుడు తలుపులు మూసేసేవారు. ఉండేకొద్దీ క్యారొలీన్కు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవసాగాయి. హ్యారిస్విల్ హౌస్‌ని మొదట రీమోడల్ చేయాలనుకున్నాడు రోజర్. కానీ అది సాధ్యపడలేదు. పని చేయడానికి వచ్చినవారిని సైతం దెయ్యాలు బెదరగొట్టడంతో పనివాళ్లు బెదిరిపోయేవారు. దాంతో ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. చాలాకాలం ఎవరూ ముందుకు రాలేదు కానీ, తర్వాత ఒకరు కొనుకున్నారు. వారు కూడా ఇలాగే ఇబ్బందులు పడి మరొకరికి అమ్మేశారు. వారి పరిస్థితీ అంతే. ఇలా ఆ ఇల్లు చేతులు మారింది తప్ప, ఆ ఇంటిలో ఉన్న ఆత్మలను మాత్రం ఎవ్వరూ వెళ్లగొట్టలేకపోయారు. ఓరోజు ఉదయం ఆమె కళ్లు తెరిచేసరికి ఎదురుగా ఓ మహిళ ఉంది. గ్రే కలర్ గౌను వేసుకుని, జుట్టు విరబోసుకుని వుంది. ‘ఇక్కడ్నుంచి వెళ్లిపో. లేదంటే నిన్ను చంపేస్తాను’ అని బెదిరించి మాయమైపోయింది. షాకైపోయింది క్యారొలీన్. ఆ క్షణం నుంచీ ఆమె జీవితం నరకమైపోయింది. ఒంటరిగా పని చేసుకుంటున్నప్పుడు ఎవరో చెంప మీద ఛెళ్లున కొట్టేవారు. వెనుక నుంచి తోసేవారు. గిన్నెలు, గరిటెల్ని మీదికి విసిరేవారు. పిల్లలు పిలిచినట్టుగా పిలిచేవారు. వెళ్తే గదిలో బంధించేసేవారు. మాటిమాటికీ ఓ మహిళ స్వరం.. ఇల్లు వదిలి వెళ్లమంటూ బెదిరిస్తూ ఉండేది. ఓసారి సోఫాలో నిద్రపోతుంటే తొడలో తీవ్రమైన నొప్పి మొదలైంది. చూస్తే ఓ పెద్ద సూది తొడలోకి దిగివుంది. రక్తం కారిపోతోంది. హతాశురాలైందామె. తన భార్య, పిల్లలు పడుతున్న బాధ చూడలేక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అయిన ఎడ్ వారెన్, లోరైన్ వారెన్లకు కబురు చేశాడు రోజర్. వాళ్లు కొన్నేళ్లుగా దెయ్యాల మీద పరిశోధనలు చేస్తున్నారు. ఎన్నోచోట్ల దురాత్మలను వెళ్లగొట్టారు. ఆ అనుభవంతోనే... రోజర్ ఇంట్లో ఒకటీ రెండూ కాదు, ఎన్నో దురాత్మలున్నాయని కనిపెట్టారు. వాటన్నిటిలో ముఖ్యమైనది... బెత్షెబా ఆత్మ. బెత్షెబా ఆ ఇంట్లోనే ఉండేది. అతీంద్రియ శక్తుల్ని పొందాలని పూజలు చేసేది. దానికోసం తన నాలుగేళ్ల కూతుర్ని సైతం బలి ఇచ్చింది. ఆ పాప ఆత్మ కూడా అక్కడే సంచరిస్తోంది. తను ఏడుస్తూ ఇల్లంతా తిరగడం క్యారొలీన్ గమనించింది. ఒకసారి ఓ గదిలోకి వెళ్లేసరికి కుర్చీలో ఓ మహిళ, ఆమె ఒడిలో ఓ పాప కూర్చుని ఉండటం కూడా చూసింది. వాళ్లెవరో అప్పుడు తెలిసొచ్చిందామెకి. ఇంట్లో ఉన్న ఇతర ఆత్మలన్నీ ఆ ఇంట్లో ఇంతకు ముందు నివసించినవారేనని, వాళ్లందరూ బెత్షెబా వల్లే మరణించారని కూడా తెలిసింది. విచిత్రమేమిటంటే... బెత్షెబా రోజర్ని మాత్రం ఇబ్బంది పెట్టేది కాదు. పైగా ప్రేమ చూపించేది. తాకడం, తల నిమిరడం చేసేది. దాన్నిబట్టి ఆమె రోజర్ మీద ఆశపడిందని, అందుకే క్యారొలీన్ను బయటకు గెంటివేయాలని చూస్తోందని ఇన్వెస్టిగేటర్లు ఊహించారు. ఆమె ఆత్మను వెళ్లగొట్టాలని ప్రయత్నించారు. కానీ వారి వల్ల కాలేదు. తనను వెళ్లగొట్టాలని చూస్తున్నారని తెలియగానే బెత్షెబా రెచ్చిపోయింది. క్యారొలీన్ను గోడకేసి కొట్టింది. ఒక గదిలోంచి మరో గదిలోకి విసిరేసింది. తట్టుకోలేకపోయిన రోజర్ ఇన్వెస్టిగేటర్లను వెళ్లిపొమ్మన్నాడు. భార్యని, పిల్లల్ని తీసుకుని వేరే చోటికి వెళ్లిపోయాడు. రోజర్ కుటుంబం ఎదుర్కొన్న ఈ అనుభవాల గురించి అప్పట్లో పలు పేపర్లలో కథనాలు వెలువడ్డాయి. కొందరు నమ్మారు. కొందరు కట్టుకథలన్నారు. కానీ అవి కథలు కాదు నిజాలేనని ఎడ్, లోరైన్లు కుండ బద్దలుకొట్టారు. దానికి తోడు కొన్నాళ్లు గడిచిన తర్వాత రోజర్ పెద్ద కూతురు ఆండ్రియా హ్యారిస్విల్ హౌస్‌లో హింసను తెలుపుతూ ‘ద హౌస్ ఆఫ్ ద డార్క్నెస్ ద హౌస్ ఆఫ్ లైట్’ అనే పుస్తకం రాసింది. దాన్ని చదివినవాళ్లకి నిజాలు కళ్లకు కట్టాయి. ఆ సంఘటనలన్నింటినీ కూర్చి ‘ద కన్జ్యూరింగ్’ సినిమా తీశాడు దర్శకుడు జేమ్స్ వాన్. షూటింగ్ జరుగుతున్నన్నాళ్లూ సెట్లోను, చిత్రం సిబ్బంది జీవితాల్లోనూ కూడా చిత్రమైన సంఘటనలు జరిగాయి. ఎలాగో సినిమా పూర్తయ్యింది. విజయఢంకా మోగించింది. అందులోని దృశ్యాలన్నీ ఒకరి జీవితంలో నిజంగా జరిగినవేనని తెలిసి ప్రేక్షకులు హడలిపోయారు. ఇంత నరకం మరెవరూ చూడకూడదని మనసారా కోరుకున్నారు! - సమీర నేలపూడి -
నయవంచన
నమ్మకంతో ప్రేమిస్తారు. ఆ నమ్మకంతోనే జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడతారు. కానీ ఒక్కసారి కూడా ఆలోచించరు... ఆ వ్యక్తి నమ్మదగినవాడేనా అని! చాలామంది అమ్మాయిలు చేసే తప్పే ఇది. క్లేర్ ఉడ్ కూడా ఈ తప్పే చేసింది. ఫలితంగా జీవితాన్నే కోల్పోయింది. తనే లోకంగా బతుకుతోన్న తండ్రికి కన్నీటిని మిగిల్చి వెళ్లిపోయింది! ‘‘డాడ్... ఇతను జార్జ్. నేను తనని ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను... ఈ మాటలు అంటున్నప్పుడు నా చిట్టితల్లి క్లేర్ కళ్లలో మెరుపులు కనిపించాయి నాకు. సిగ్గుతో తన చెంపలు కందిపోయాయి. నావైపు సూటిగా చూడలేక నేల చూపులు చూడసాగింది. నేను జార్జ్వైపు చూశాను. పలకరింపుగా నవ్వాడు. చప్పున నా చేయి అందుకుని షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ఎందుకోగానీ... అతని స్పర్శ, చూపు, నవ్వు... ఏదీ నాకు నచ్చలేదు. అలా అనలేకపోయాను. కనీసం నా అయిష్టాన్ని ముఖ కవళికల ద్వారా కూడా వ్యక్తం చేయలేకపోయాను. ఎందుకంటే... ఎదురుగా నా కూతురు ఉంది. నేను కాదనను అన్న నమ్మకం కనిపిస్తోంది తనలో. అందుకే ధైర్యం చేయలేకపోయాను. ఎక్కువగా ఆలోచించకుండా ‘నీ ఇష్టం బేబీ’ అనేశాను. తను సంతోషంతో గంతులు వేసింది. ‘చూశావా జార్జ్... నేను చెప్పానుగా మా డాడీ గురించి. నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనరు’ అంది సంబరపడిపోతూ. జార్జ్ నవ్వాడు. అప్పుడు కూడా ఆ నవ్వులో స్వచ్ఛత కనిపించలేదు నాకు. జైలర్‌గా పని చేసిన అనుభవం ఎక్కడో నన్ను హెచ్చరిస్తున్నట్టుగా అనిపించింది. కానీ క్లేర్ మీద ఉన్న ప్రేమ నా విచక్షణను జయించింది. అలా జరగకుండా ఉండివుంటే... ఈ రోజు నా క్లేర్ నా దగ్గర ఉండివుండేది.’’ ‘‘నిజమే. ఆరోజే మీరు జాగ్రత్తపడివుంటే మీ కూతుర్ని కాపాడుకునేవారు.’’రిపోర్టర్ అన్న మాటకు కళ్ల నిండా నీళ్లు వచ్చేశాయి మైఖేల్‌కి. మాట్లాడలేకపోయాడు. మనసు గతంలోకి పరుగెత్తింది. జరిగిన దారుణం మదిలో మెదిలింది. 2009, ఫిబ్రవరి 2... స్టడీ రూమ్‌లో ఉన్న ఫోన్ రింగవుతోంది. వంటగదిలో కాఫీ కలుపుకోవడంలో మునిగిపోయిన మైఖేల్, వడివడిగా స్టడీరూమ్కి వెళ్లాడు. ఫోన్ తీసి హలో అన్నాడు. అవతలి వ్యక్తి చెప్పింది వినగానే అతడి ముఖం మ్లానమయ్యింది. చేతిలోని కప్పు జారి నేలమీద పడి భళ్లున బద్దలయ్యింది. దాని సంగతి పట్టించుకోలేదు. గబగబా తయారయ్యాడు. పర్స్ తీసి జేబులో పట్టుకుని, ఇల్లు తాళం వేసి బయలుదేరాడు. అరగంట తిరిగేసరికల్లా తన కూతురు క్లేర్ ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి ముందు కారు దిగుతూనే అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్కయిపోయాడు మైఖేల్. బోలెడంతమంది జనం గుమిగూడి ఉన్నారు. క్లేర్ ఇంటివైపు చూస్తూ ఏదో చర్చించుకుంటున్నారు. మైఖేల్ మనసు ఏదో కీడు శంకించింది. ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి వెంటనే మీ అమ్మాయి ఇంటికి రండి అన్నాడు తప్ప ఏం జరిగిందో చెప్పలేదు. కానీ ఇక్కడి పరిస్థితి చూస్తుంటే ఏదో జరిగినట్టే ఉంది. అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్లాడు మైఖేల్. లోపలికి అడుగు పెడుతుంటే కాలిన వాసన గుప్పుమంది. కడుపులో దేవినట్టయ్యింది. ఖర్చీఫ్ తీసి ముక్కుకు అడ్డు పెట్టుకున్నాడు. రెండు అడుగులు ముందు వేశాడో లేదో ఇన్స్పెక్టర్ ఎదురొచ్చాడు. ‘‘మైఖేల్ బ్రౌన్ అంటే మీరేనా?’’ అన్నాడు మైఖేల్‌ని పైనుంచి కిందకు పరికిస్తూ. అవునన్నట్టు తలూపాడు మైఖేల్. ఏం జరిగింది అని అడిగేలోపు ఇన్స్పెక్టరే అన్నాడు... ‘‘సారీ మిస్టర్ మైఖేల్. మీ అమ్మాయి క్లేర్ చనిపోయింది. ఎవరో హత్య చేశారు. మీకు ఫోన్ చేసింది నేనే. ఫోన్లో చెబితే తట్టుకోలేరని చెప్పలేదు.’’ హతాశుడయ్యాడు మైఖేల్. ఇన్స్పెక్టర్ ఇంకా ఏదేదో చెబుతున్నాడు. కానీ అతడి చెవులను అవి చేరడం లేదు. మౌనంగా నడుచుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్లాడు. అక్కడ... మంచం మీద... నల్లగా... కాలిపోయి... గుర్తు పట్టలేనట్టుగా ఉంది క్లేర్ మృతదేహం. దాన్ని చూస్తూనే ‘బేబీ’ అంటూ కుప్పకూలిపోయాడు. రెండు రోజుల తర్వాత... ‘‘ఎలా ఉన్నారు మైఖేల్?’’ ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నకు బాగున్నాను అన్నట్టు తలాడించాడు మైఖేల్. ‘‘నన్నెందుకు రమ్మన్నారు?’’ అన్నాడు నిర్లిప్తంగా. ‘‘జార్జ్ ఆపిల్టన్ ఆత్మహత్య చేసుకున్నాడు’’ ‘‘ఆత్మహత్య చేసుకున్నాడా?’’ అన్నాడు నమ్మలేనట్టుగా. ‘‘అవును. ఓ బార్లో అతని మృతదేహం దొరికింది.’’ ‘‘నో. నా కూతురిని ఘోరంగా చంపిన ఆ నీచుడు అంత సులభంగా చచ్చిపోవడానికి వీల్లేదు’’ అంటూ వెక్కివెక్కి ఏడుస్తోన్న మైఖేల్‌ని ఎలా ఓదార్చాలో తెలియలేదు ఇన్స్పెక్టర్కి. నిట్టూర్చి అన్నాడు.. ‘‘కంట్రోల్ యువర్సెల్ఫ్ మిస్టర్ మైఖేల్. మేము తనని అరెస్ట్ చేయాలని అనుకున్నాం. కానీ అంతలోనే ఇలా జరిగింది.’’అంతవరకూ ఏడ్చినవాడు, ఒక్కసారిగా వెర్రిగా నవ్వాడు మైఖేల్. ‘‘నా కూతుర్ని వాడు చిత్రహింసలు పెట్టాడు. తను ఎన్నిసార్లు కంప్లయింట్లు ఇచ్చిందో, ఎన్నిసార్లు తనని కాపాడమని మీ కాళ్లా వేళ్లా పడిందో ఈ రెండు రోజుల్లో నాకు తెలిసింది. మీరు నా కూతుర్ని నాకు కాకుండా చేశారు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి’’ అనేసి ఆవేశంగా వెళ్లిపోతోన్న మైఖేల్ వైపు బిత్తరపోయి చూస్తూండిపోయాడు ఇన్స్పెక్టర్.అంతకంటే ఏం చేస్తాడు? తప్పు తనదే. క్లేర్ బాధను ఒక్కసారైనా అర్థం చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆమె ప్రాణం పోయేదీ కాదు. క్లేర్‌కి ఇంటర్నెట్ ద్వారా పరిచయమయ్యాడు జార్జ్. ఇద్దరూ మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. అతడిని తన తండ్రికి పరిచయం చేసింది క్లేర్. నిజానికతడికి జార్జ్ నచ్చలేదు. కానీ ఆ విషయం చెప్పలేక పోయాడు. అప్పటికే భార్యను, కొడుకును ప్రమాదవశాత్తూ పోగొట్టుకుని ఉన్నాడు. దాంతో ఉన్న కూతురినైనా సంతోషంగా ఉంచాలనుకున్నాడు. సరే అన్నాడు. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది క్లేర్. కొన్నాళ్లు సంతోషంగా గడిపి అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ సంవత్సరం తిరిగే సరికల్లా జార్జ్ నిజస్వరూపం తెలిసి వచ్చిందామెకి. తనలాగే మరో ముగ్గురు అమ్మాయిలతో ఇంటర్నెట్ ద్వారానే ప్రేమాయణం నడుపుతున్నాడని తెలిసి షాకయ్యింది. ఇదేంటని నిలదీసింది. అతడు లెక్క చేయలేదు. దాంతో మనసు విరిగి, అతడికి దూరమైపోయింది. అది జార్జ్ తట్టుకోలేకపోయాడు. క్లేర్‌ని ముప్పుతిప్పలు పెట్టాడు. ఎంత రహస్యంగా బతుకుదామన్నా ఆమె జాడ కనుక్కునేవాడు. ఎక్కడుంటే అక్కడికి వెళ్లి మాటలు, చేతలతో హింసించేవాడు. తలుపు తీయకపోతే బద్దలు కొట్టేవాడు. తనతో మళ్లీ కలవమని పోరు పెట్టేవాడు. శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధించేవాడు. అది తట్టుకోలేక పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది క్లేర్. వాళ్లు కొన్నిసార్లు జార్జ్‌ని అరెస్ట్ చేశారు. కానీ అతడు సాయంత్రానికల్లా బెయిల్ తీసుకుని బయటికొచ్చేసేవాడు. మరికొన్నిసార్లు పోలీసులే లెక్కలేనట్టుగా ఉండేవారు. తనకు ప్రాణహాని ఉందని క్లేర్ మొత్తుకున్నా వాళ్లు ఆమెకి సెక్యూరిటీ ఇచ్చిన పాపాన పోలేదు. దాంతో ఘోరం జరిగిపోయింది. ఎప్పటిలాగే క్లేర్ ఇంటి మీద దాడి చేసిన జార్జ్... ఆమెను హింసించి, అత్యాచారం చేసి చంపేశాడు. ఆపైన పెట్రోలు పోసి కాల్చేశాడు. జరిగిన విషయాలన్నీ కూతురి డైరీ చూసినప్పుడు తెలిశాయి మైఖేల్‌కి. ‘నాన్నను బాధపెట్టడం ఇష్టం లేక తనకేమీ చెప్పడం లేదు’ అని రాసుకున్న మాటలు చదివి అల్లాడిపోయాడు. తన బిడ్డ పడిన నరకయాతన తలచుకుని కుమిలిపోయాడు. కూతురిని కాపాడుకోలేకపోయానే అని విలవిల్లాడాడు. అంతకంటే అతడిని బాధించిన విషయం మరొకటుంది. జార్జ్‌కి నేరచరిత్ర ఉందని, అంతకుముందే ఓ అమ్మాయిని ప్రేమలోకి దించాడని, ఆమెకి తన నిజస్వరూపం తెలిసిపోవడంతో కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టాడని, ఆ కేసులో అరెస్టయ్యి ఆరు నెలలు జైల్లో కూడా ఉన్నాడని తెలిసింది. జార్జ్ గురించి ముందే ఎంక్వయిరీ చేసివుంటే ఇలా జరిగివుండేది కాదు అనిపించింది. తన కూతురు కంప్లయింట్ ఇచ్చినప్పుడయినా అతడి గురించి విచారించని పోలీసుల మీద కోపం ముంచు కొచ్చింది. వెంటనే కోర్టులో పిటిషన్ వేశాడు. తన కూతురి చావుకి పోలీసులే కారణమని ఆరోపించాడు. అతడి నవ్వుకు కారణం అప్పుడు అర్థం అయింది ఇన్స్పెక్టర్కి. మైఖేల్ పిటిషన్ పెద్ద సంచ లనమే సృష్టించింది. బ్రిటన్ ప్రభుత్వాన్ని కదిలించింది. ఆడపిల్లల సంరక్షణ కోసం ‘క్లేర్ వుడ్’ పేరుతోనే ఓ చట్టం రూపొందింది. దీని ప్రకారం ఏ ఆడపిల్ల అయినా ఒక వ్యక్తితో అనుబంధం ఏర్పరచుకునే ముందు, పోలీసుల దగ్గరకు వెళ్లి, ఆ వ్యక్తి పూర్తి వివరాలు కావాలని అడగ వచ్చు. పోలీసులు నో చెప్పడానికి వీల్లేదు. వారం తిరిగేసరికల్లా ఆ వ్యక్తి గురించి విచారణ చేసి, నేర చరిత్ర ఉందేమో తిరగదోడి, పూర్తి వివరాలను సదరు అమ్మాయికి తెలియజెయ్యాలి. క్లేర్ మాదిరిగా మరే అమ్మాయీ పోలీసుల నిర్లక్ష్యానికి బలి అవ్వకూడదనే ఈ చట్టాన్ని తెచ్చారు. కూతురి ప్రాణాలను కాపాడుకోలేకపోయినా, తన కూతురులాంటి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను కాపాడేందుకు మైఖేల్ పడిన తపనకు, చేసిన పోరాటానికి ఫలితమిది. అయితే దీనికి గర్వపడటం లేదు మైఖేల్. కూతురి ఫొటోను చూసినప్పుడల్లా తనను కాపాడుకోలేకపోయానన్న అపరాధ భావంతో కుమిలిపోతున్నాడు. బహుశా ఆ బాధ ఎప్పటికీ తీరకపోవచ్చు. ఎంతయినా కన్నతండ్రి కదా! - సమీర నేలపూడి -
ఇండస్ట్రీ నాకు కావాలి... ఇండస్ట్రీకి నేను అక్కర్లేదు!
సంభాషణం తూర్పు గోదావరి యాసతో తెరమీద అదరగొట్టేసే నటులు చాలా కొద్దిమందే ఉన్నారు. వారిలో గౌతంరాజు ఒకరు. కొన్ని దశాబ్దాలుగా తన నటనతోటి, యాసతోటి ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్నారాయన. ఇన్నేళ్ల తన ప్రయాణం గురించి, గెలుపోటముల గురించి గౌతంరాజు మనసు విప్పి చెప్పిన మాటలు... మీకు గుర్తింపు తెచ్చింది గోదావరి యాసే. అలా మాట్లాడాలని మీరే అనుకున్నారా? ఎవరైనా సలహా ఇచ్చారా? అలా ఏం లేదు. మొదట్లో కొన్ని పాత్రల స్వభావం దృష్ట్యా అలా మాట్లాడాను. అది నచ్చడంతో దర్శకులందరూ అలాగే మాట్లాడమనేవారు. మీదే గోదావరి.. తూర్పా? పశ్చిమమా? తూర్పే. మాది రాజోలు. అయితే నాన్నగారి వ్యాపారం రీత్యా కాకినాడలో స్థిరపడ్డాం. పెరిగింది, చదివింది అంతా అక్కడే. నటుడిగా మారిందీ అక్కడే. నటన మీద ఆసక్తి ఎలా కలిగింది? చిన్నప్పట్నుంచీ మనసు కళల మీదే ఉండేది. అందుకే నాలుగో తరగతిలో ఉండగానే స్టేజి ఎక్కాను. వయసుతో పాటు ఆసక్తి కూడా పెరుగుతూ వచ్చింది. నాలుగో తరగతిలోనే మొదలు పెట్టేశారు. ఇంట్లోవాళ్ల ప్రోత్సాహమా? నటిస్తానంటే నాన్న తాట తీసేవారు. నాటకం మధ్యలో స్టేజి మీది నుంచి ఈడ్చుకొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అయినా నాకు ఆ పిచ్చి తగ్గలేదు. మా నాన్న దానధర్మాలు బాగా చేసేవారు. అందరినీ ఆదరించేవారు. దాంతో మా ఇల్లు ఎప్పుడూ మనుషులతో కిటకిటలాడేది. చదువుకోవడానికి కూడా కుదిరేది కాదు. దాంతో మా ఇంటికెదురుగా ఉన్న హోటల్ పై అంతస్తులోని గదిలో, నా ఫ్రెండ్‌తో కలిసి చదువుకునేవాడిని. అక్కడ్నుంచి మా ఇల్లు స్పష్టంగా కనిపించేది. నాన్న ఇంటికొచ్చి పడుకునేవరకూ చూసి, ఆ తర్వాత రిహార్సల్స్‌కి వెళ్లిపోయేవాడిని. మళ్లీ తెల్లవారుజామునే వచ్చి ఏమీ ఎరగనట్టు పుస్తకాలు పట్టుకునేవాడిని! నాటకాలకే ఒప్పుకోనివారు... సినిమాలకెలా ఒప్పుకున్నారు? ఒప్పుకున్నారని చెప్పలేను కానీ, నేను నా ఇష్టాన్ని గెలిపించుకున్నానంతే. బీఎస్సీ ఫైనలియర్లో ఉండగానే మా అక్క కూతురితో నా పెళ్లి జరిపించేశారు. నా భార్య ఝాన్సీ నన్ను బాగా అర్థం చేసుకునేది. తన ప్రోత్సాహంతోనే నేను అనుకున్నవన్నీ చేశాను. నటనను కొనసాగించగలిగాను. ఇంతవరకూ ఎన్ని సినిమాలు చేశారు? మూడువందల పైనే. ‘వసంతగీతం’ నా తొలిచిత్రం. మొదటిరోజు షూటింగ్లో తొలి సన్నివేశమే ఏఎన్నార్‌తో. భయంతో డైలాగ్ మర్చిపోయాను. ఆయన ధైర్యం చెప్పి నేను ఫ్రీ అయ్యేలా చేశారు. అంత గొప్ప నటుడితో సినీప్రయాణం మొదలవడం నా అదృష్టం. అయితే ఎన్టీయార్‌తో పనిచేయలేకపోవడం నా దురదృష్టం! ఇన్ని సినిమాలు చేశారు. తగిన గుర్తింపు వచ్చిందంటారా? లేదు. ఇప్పటికీ నేను గుర్తింపు కోసం ఆరాటపడుతూనే ఉన్నాను. నటుడంటే కైకాల సత్యనారాయణగారిలా అన్ని రకాల పాత్రలూ చేయగలగాలి. నేనూ చేయగలను. కానీ అంత గొప్ప పాత్రలు రాలేదు. నిరాశపడుతున్నారా? నిరాశేం లేదు. ఇక్కడ టాలెంట్ ఒక్కటీ చాలదు. అదృష్టం కూడా ఉండాలి. కోరుకున్నవి కాకపోయినా అవకాశాలైతే వచ్చాయి. కాస్తో కూస్తో సంపాదించుకుని జీవితంలో స్థిరపడ్డాను. అది చాలు. నిజానికి డబ్బు కంటే మనుషుల్ని సంపాదించుకోవడం ముఖ్యం అనుకుంటాన్నేను. అందుకే అందరితో మంచిగా ఉంటాను. నాలాంటివాళ్లు వస్తుంటారు, పోతుం టారు. కాబట్టి ఇండస్ట్రీకి నేను అక్కర్లేదు. నాకే ఇండస్ట్రీ కావాలి. అందుకే ఇండస్ట్రీకి, అందులోని వారికి విలువిస్తాను. మీ అబ్బాయి కృష్ణని హీరోని చేస్తున్నట్టున్నారు. అది మీ నిర్ణయమేనా? కాదు. పరిశ్రమలోని కష్టనష్టాల్ని చూసినవాణ్ని కాబట్టి నాకు పిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకురావడం ఇష్టం లేదు. కానీ తను హీరో అవ్వాలని ఆశపడ్డాడు. కాదనలేక పోయాను. నాటకాలు, సీరియళ్లకి దూరమైనట్టేనా? దూరమైపోలేదు కానీ, చేసే తీరిక లేక గ్యాప్ తీసుకున్నాను. నాకు నటుడిగా జన్మనిచ్చిన నాటకం, నా తల్లిలాంటిది. నా ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన టీవీ నాకు పినతల్లిలాంటిది. జీవితంలో నేను ముందుకు వెళ్లేలా చేసిన సినిమా నా తండ్రిలాంటిది. వీటిలో దేనికీ నేను దూరం కాలేను. భవిష్యత్ ప్రణాళికలేంటి? నా నటతృష్టను తీర్చే మంచి అవకాశాలు వస్తే చేయాలనుంది. అలాగే నటన తర్వాత నేను అంత ప్రాధాన్యతనిచ్చే విషయం... సేవ. ఉన్నదాంట్లో కొంత లేనివారికి పెట్టాలి. మా అమ్మానాన్నల నుంచి అబ్బింది నాకీ లక్షణం. అందుకే తీరిక దొరికినప్పుడల్లా ఏదో రకంగా సేవ చేస్తుంటాను. నేను నెలకొల్పిన ‘అభయ చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా వెనుకబడిన నటీనటులు, జర్నలిస్టులకు సహాయపడాలని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇవే నా ప్రణాళికలు, లక్ష్యాలు! - సమీర నేలపూడి -
అలీ తమ్ముడిగా ఇండస్ట్రీకి రాలేదు!
కోలముఖం, నవ్వితే బుగ్గన పడే సొట్ట, హుషారైన కదలికలు... చూడగానే ఆకర్షిస్తాడు ఖయ్యూం. కమెడియన్‌గా, కామెడీ విలన్‌గా అతడు చేసే పాత్రలు కూడా అంతే ఆకట్టుకుంటాయి. ప్రముఖ నటుడు అలీకి తమ్ముడే అయినా, తనకు తానుగా ఓ ఇమేజ్ సృష్టించుకోవడానికి తపనపడే ఖయ్యూం... తన గురించి, తన నట ప్రయాణం గురించి చెప్పిన విశేషాలు... అన్నయ్యను చూసి నటుడవ్వాలనుకున్నారా? అంతే కదా మరి! చిన్నప్పట్నుంచీ నటనంటే చాలా ఇష్టం. అన్నయ్యేమో నన్ను పైలట్‌ని చేయాలనుకున్నాడు. కానీ నా మనసు మాత్రం ఇటువైపే లాగింది. అలీ తమ్ముడిగా సులభంగానే పరిశ్రమలో ఎంటరయ్యారా? లేదు. చాలామంది అనుకుంటారు... వాళ్ల అన్నయ్య ఉన్నాడు కదా, ఈజీగా వచ్చేసి ఉంటాడు అని. కానీ నేను తొలిసారిగా ‘స్వాతికిరణం’లో బాలనటుడిగా ఎంపికైనప్పుడు అలీ తమ్ముడినన్న విషయం ఆ దర్శకుడు, నిర్మాతకి కూడా తెలియదు. ఎవరో బయటి వ్యక్తిగానే ఆడిషన్‌కి వెళ్లాను. సెలెక్ట్ అయ్యాను. ఎందుకని? అన్నయ్యని సహాయం అడగలేదా? లేదు. అడిగినా చేయడు. ఎవరి ప్రతిభని వాళ్లే నిరూపించుకోవాలి అన్నది అన్నయ్య పాలసీ. తన భావాలు ఎంత బలమైనవో తెలుసు కాబట్టే నేను తన సహాయం కోరలేదు. నాకు నేనుగా ప్రయత్నాలు చేశాను. అవకాశాలు సాధించాను. ఇప్పటి వరకూ వంద సినిమాలు చేశాను. వాటిలో ఒక్కటీ నాకు అన్నయ్య వల్ల రాలేదు. అయితే మీకు అన్నయ్య సపోర్ట్ లేదన్నమాట...? అలా అనడం లేదు. రికమెండ్ చేయడు తప్ప తన అండ, ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటాయి. ఎవరైనా ఇటుకలు మోస్తే, సిమెంటు వేసి ఇల్లు కట్టేసుకుందాం అని ఆలోచిస్తాం మనం. కానీ... ఇల్లు కట్టుకోవాలంటే నీ ఇటుకలు కూడా నువ్వే మోసుకోవాలి అనే తత్వం అన్నయ్యది. అంతే. సినిమాల విషయంలో మాత్రమే అలా. వ్యక్తిగత జీవితంలో అయితే అన్నీ తానే అయి చేస్తాడు. నాకు సినిమాలు చూడటమంటే ఇష్టమని నాకోసం ఇంట్లోనే హోమ్ థియేటర్ ఏర్పాటు చేశాడు. ఇంట్లో ప్రతి ఒక్కరి విషయంలోనూ ఎంతో బాధ్యతగా ఉంటాడు. సలహాలిస్తాడు. ముందుకు నడిపిస్తాడు. గొప్ప ఫ్యామిలీ పర్సన్ తను! మీలో అన్నయ్య పోలికలు ఎక్కువే. అది మీకు ప్లస్సా? మైనస్సా? రెండూను. అన్నయ్య పోలికలతో ఉండటం వల్ల ఎక్కడికెళ్లినా నేను తన తమ్ముడినని గుర్తు పట్టేస్తారు. తన మీద ఉన్న ఇష్టాన్ని, గౌరవాన్ని నా పట్ల కూడా ప్రదర్శిస్తారు. అందుకు చాలా ఆనందంగా ఉంటుంది. అయితే నటుడిగా అదే నాకు మైనస్. అన్నయ్య అన్ని రకాల పాత్రలూ చేసినా కమెడియన్‌గానే స్థిరపడ్డాడు. దానివల్లో , అన్నయ్య పోలికల వల్లో నాకు కూడా కామెడీ పాత్రలే ఆఫర్ చేస్తుంటారు. కమెడియన్ తమ్ముడు కమెడియనే అవ్వాలని లేదు కదా! నాకు అన్ని పాత్రలూ చేయాలనుంది, చేయగలను! డెరెక్షన్ కోర్సు కూడా చేసినట్టున్నారు? అవును. కావాలనే మధ్యలో గ్యాప్ తీసుకుని ముంబై వెళ్లాను. అక్కడ రెండేళ్లపాటు (2005-06) డెరైక్షన్ కోర్సు చేశాను. డెరైక్టర్ అవ్వాలనేం కాదు. ఓ నటుడిగా అన్ని విభాగాల మీద అవగాహన ఉంటే బాగుంటుందనిపించింది. అందుకే చేశాను. సినిమాలు కాకుండా ఇంకేమైనా...? ఒకప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని. అండర్ 14 క్రికెట్ ప్లేయర్‌ని నేను. ఇప్పుడైతే ఫుడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ ఉంది. ఫ్రీ టైమ్ దొరికితే బిజినెస్మీదే దృష్టి పెడుతుంటాను. మీరు చాలా మంచి ఫ్రెండ్ అని ఇండస్ట్రీలో చాలామంది అంటారు? నేను మంచి ఫ్రెండ్‌నో కాదో గానీ... నాకు మాత్రం పరిశ్రమలో అందరూ ఫ్రెండ్సే. అల్లరి నరేశ్ అయితే ప్రాణమిత్రుడు. గొప్ప స్నేహితుడికి నిర్వచనం తను. ఫ్రెండ్స్ కదా అని ఎప్పుడూ అతి చొరవ తీసుకోడు. ఎంతో గౌరవిస్తాడు. అన్నీ చెప్పకుండానే అర్థం చేసుకుంటాడు. ప్రతి ఒక్కరికీ అలాంటి ఫ్రెండ్ ఉండి తీరాలి. ఫ్రెండ్ సరే... గాళ్‌ఫ్రెండ్ సంగతి...? చాలామంది గాళ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. స్నేహం విషయంలో అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఒకే దృష్టితో చూస్తాను నేను. (నవ్వుతూ) మీరు వేరే ఉద్దేశంతో అడిగితే మాత్రం అలాంటి వాళ్లెవరూ లేరు. అయితే ఎవరినీ ప్రేమించలేదా? కాలేజీ రోజుల్లో ప్రేమించాను. ఫెయిలయ్యాను. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అప్పుడే నిర్ణయించుకున్నాను... మళ్లీ ప్రేమ జోలికి పోకూడదని. అందుకే నా పెళ్లి బాధ్యతను అమ్మానాన్నలకు అప్పగించాను. నాకు తగిన అమ్మాయిని వాళ్లే చూసి చేస్తారు. అప్పుడు ఆమెను ప్రేమిస్తా! - సమీర నేలపూడి -
కథ మారింది
ఆవేశం... మనిషిని మనిషిలా ఉండనివ్వదు.ఎంతకైనా దిగజారుస్తుంది.ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది.అది తెలిసి కూడా ఆవేశాన్ని అణచుకోలేకపోయాడు ఆస్కార్ పిస్టోరియస్. ‘బ్లేడ్న్న్రర్’గా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఆస్కార్... ఆవేశమనే శత్రువును అణచుకోలేక అదే ప్రపంచం ముందు దోషిలా నిలబడ్డాడు. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు! అక్టోబర్ 21, 2014... దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా కోర్టు కిటకిటలాడుతోంది. ఎప్పుడూ లేనంత నిండుగా ఉంది. అక్కడున్న అందరి ముఖాల్లోనూ ఆతృత కనిపిస్తోంది. ఏం జరగబోతోంది అన్న ప్రశ్న అందరి కళ్లలోనూ కదలాడుతోంది. దు వరుసలో బెంచీమీద కూర్చున్న వ్యక్తి ముఖమైతే బాగా పాలిపోయింది. టెన్షన్ పడుతున్నట్టుగా పెదవులు అదురుతున్నాయి. భీతితోనో, బాధతోనో గానీ... కళ్లు మాటిమాటికీ చెమ్మగిల్లు తున్నాయి. తల దించుకుని పదే పదే వేళ్లతో కళ్లను ఒత్తుకుంటున్నాడు. తలో హాలులో చిన్నపాటి అలికిడి. న్యాయమూర్తి రావడంతో అందరూ లేచి నిలబడ్డారు. ఆవిడ కూర్చోగానే కూర్చున్నారు. న్యాయమూర్తి కాసేపు తన దగ్గరున్న కాగితాలను తిరగేసింది. అప్పుడప్పుడూ తలెత్తి కోర్టులో వారందరినీ పరిశీలించింది. మధ్యమధ్యన ఆ వ్యక్తివైపు కూడా నిశితంగా చూసింది. కాసేపటి తర్వాత చేతిలోని కాగితాలను టేబుల్ మీద పెట్టి పెదవి విప్పింది. ‘‘కేసు పూర్వాపరాలను పరిశీలించిన మీదట... రీవా స్టీన్‌క్యాంప్‌ను తుపాకితో కాల్చి, ఆమె మరణానికి కారకుడైనందుకుగాను... ఆస్కార్ పిస్టోరియస్కు ఐదేళ్ల కారాగారశిక్ష విధించడమైనది.’’ అందరూ ఆశ్చర్యపోయారు. హతురాలి తల్లి అయితే హతాశురాలైంది. ‘‘ఇది అన్యాయం. నా కూతుర్ని పొట్టనబెట్టుకున్నవాడికి, ఓ నిండు జీవితాన్ని బలి తీసుకున్నవాడికి శిక్ష కేవలం అయిదేళ్లా?’’ అంటూ బావురుమంది. వేదనతో అక్కడ్నుంచి బయటకు వెళ్లిపోయింది.ఆ వ్యక్తి తన ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకున్నాడు. దుఃఖపడుతున్నాడనడానికి సాక్ష్యంగా అతడి భుజాలు రెండూ కదులుతున్నాయి. ‘‘మిస్టర్ పిస్టోరియస్... లేవండి వెళ్దాం’’ ఇన్స్పెక్టర్ గొంతు వినగానే కళ్లు తుడుచుకుని లేచాడా వ్యక్తి. ఓసారి చుట్టూ చూశాడు. దూరంగా నిలబడి తనవైపే చూస్తోన్న తల్లి, చెల్లిని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. బలవంతాన అదిమి పెట్టి, పోలీసుల వెంట వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయాడు. అతడు పోలీసుల వాహనంలోకి ఎక్కుతుంటే కాస్త దూరం నుంచి చూస్తోన్న హతురాలి తల్లి అరుస్తోంది... ‘‘వాడు రాక్షసుడు. నా కూతురి ప్రాణాలు హరించాడు. ఈ శిక్ష వాడికి చాలదు. చూస్తూండండి. వాడు త్వరలో మరో నేరం చేసినా చేస్తాడు’’. ఆమె మాటలకు కొందరు అవాక్క య్యారు. కొందరు జాలిపడ్డారు. కొందరు ఆమెను తప్పుబట్టారు. ఎందుకంటే ఆవిడ మాట్లాడింది ముక్కూ ముఖం తెలియని ఓ సామాన్య వ్యక్తి గురించి కాదు. ప్రపంచమే గొప్పగా చెప్పుకునే అథ్లెట్ గురించి. కాళ్లు లేకపోయినా కృత్రిమకాళ్లతో రికార్డులు సాధించిన పరుగుల వీరుడి గురించి. బ్లేడ్ రన్నర్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే... ఆస్కార్ పిస్టోరియస్ గురించి! త గొప్ప ఆటగాడు, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు... హత్య చేశాడా? ఎందుకు? అసలిది నిజమేనా? లేక తప్పుడు కేసా? అసలింతకీ ఏం జరిగింది? ఆస్కార్ నేరస్తుడా? అమాయకుడా? ఫిబ్రవరి 14, 2013... ‘‘ఏం జరిగింది సర్... అంబులెన్స్ కోసం ఫోన్ చేశారెందుకు?’’... లోపలకు అడుగు పెడుతూనే అడిగాడు అంబులెన్స్‌తో పాటు వచ్చిన మేల్ నర్స్. ఆస్కార్ మాట్లాడలేదు. నీళ్లు నిండిన కళ్లతో నిస్తేజంగా చూస్తున్నాడు. ‘‘చెప్పండి సర్. ఏం జరిగింది? మీ ఆరోగ్యం బాగానే ఉందా?’’ అన్నాడతను కంగారుగా. తన అభిమాన ఆటగాడికి ఏమయ్యిందోనన్న కంగారు అతడిలో. ఈసారి కూడా ఆస్కార్ సమాధానం చెప్పలేదు. అటు చూడమన్నట్టుగా చేతిని చాచాడు. చూసిన నర్స్ ఉలిక్కిపడ్డాడు. అక్కడ... నేలమీద... రక్తపు మడుగులో అచేతనంగా పడివుంది ఓ అమ్మాయి. ‘‘ఎవరు సర్... ఏమయ్యింది?’’ అన్నాడతను కంగారుగా. ప్రాణాలతో ఉందేమో చూద్దామని దగ్గరకు వెళ్లబోయాడు. అప్పుడు పెగిలింది ఆస్కార్ గొంతు. ‘‘తను చనిపోయింది’’ బ్రేక్ వేసినట్టు ఆగిపోయాడతడు. ‘‘ఎలా సర్?’’ అన్నాడు అయోమయంగా. ‘‘నేనే చంపేశాను’’ బావురుమన్నాడు ఆస్కార్. అవాక్కయిపోయాడా వ్యక్తి. వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. విషయం పోలీసుల చెవిని వేశాడు. ‘‘తల, నడుము, భుజం... మూడు చోట్ల బుల్లెట్లు దిగాయి. అంత దారుణంగా ఎలా చంపగలిగారు మిస్టర్ పిస్టోరియస్?’’ సూటిగానే అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘కావాలని చేయలేదు సర్. బాత్రూమ్లో అలికిడి అవుతుంటే దొంగ దూరాడేమో అనుకున్నా. బయటకు రమ్మన్నా రాకపోవడంతో షూట్ చేశా. కానీ...’’ ‘‘కానీ లోపల ఉన్నది దొంగ కాదు. మీ ప్రియురాలు రీవా. మిమ్మల్ని నమ్మి, మీతోనే కలిసి జీవిస్తోన్న రీవా. త్వరలోనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటోన్న రీవా. అంతే కదూ?’’ ‘‘మీ మాటల్లో వ్యంగ్యం నాకు అర్థమయ్యింది సర్. కానీ నేను చెప్పింది నిజం. నేను తనని చంపలేదు. దొంగ అనుకుని షూట్ చేస్తే తను చనిపోయింది.’’ ‘‘అవునా... అయినా దొంగ బాత్రూములో ఎందుకుంటాడు మిస్టర్ పిస్టోరియస్?’’ ‘‘బాత్రూమ్లో ఓ కిటికీ ఉంది. దానిగుండా జొరబడ్డాడేమో అనుకున్నాను.’’ వెటకారంగా నవ్వాడు ఇన్స్పెక్టర్. ఆస్కార్ ఎన్ని చెప్పినా అతడు నమ్మలేదు. ఎందుకంటే, అతడు చెప్పేది నమ్మశక్యంగా లేదు కాబట్టి. ఆస్కార్‌ని ప్రాణంగా ప్రేమించింది రీవా స్టీన్‌క్యాంప్. ప్రముఖ మోడల్ అయిన ఆమె ఆస్కార్‌కి అర్ధాంగి కావాలని ఆశపడింది. చివరికి అతడి చేతిలోనే హత్యకు గురయ్యింది. స్కార్ చెప్పినదాని ప్రకారం... ఫిబ్రవరి పద్నాలుగు తెల్లవారుజామున నిద్రలో ఉండగా... బాత్రూమ్లో ఏదో అలికిడి వినిపించి మెలకువ వచ్చింది ఆస్కార్‌కి. ఎవరూ అని అరిచాడు. సమాధానం రాలేదు. దాంతో తుపాకీ తీసుకుని బాత్రూమ్ దగ్గరకు వెళ్లాడు. తలుపు లోపల నుంచి గడియ పెట్టి వుంది. ఎంత పిలిచినా లోపలి వ్యక్తి తలుపు తీయలేదు. దాంతో తుపాకీతో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. తర్వాత ఎందుకో మంచం వైపు చూస్తే రీవా కనిపించలేదు. ఆస్కార్ అమాయకుడని అతడి అభిమానులు నమ్మినా... అతగాడి స్వభావం తెలిసినవాళ్లంతా అతడినే దోషి అంటున్నారు. బరిలో ఆత్మవిశ్వాసంలో పరుగులు తీసే ఆస్కార్... వ్యక్తిగత జీవితంలో ఆవేశంతో తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చాడు. రెండుసార్లు పబ్లిక్ ప్లేసుల్లో కొట్లాటలకు దిగి, కోపాన్ని అణచుకోలేక తుపాకీతో కాల్పులు జరిపాడు. కేసుల పాలయ్యాడు. మూడేళ్ల పాటు క్రీడా రంగంలో నిషేధానికి గురయ్యాడు. కోపం వస్తే కంట్రోల్ తప్పిపోయే అతగాడు, రీవాని కావా లనే ఎందుకు చంపివుండకూడదు అన్నది పలువురి సందేహం. అది నిజమే కావచ్చు. కానీ న్యాయస్థానం అలా ఆలోచించనప్పుడు చేసేదేముంది! అన్యాయం జరిగింది అని భావిస్తే... రీవా ఆత్మశాంతికి ప్రార్థించడం తప్ప! అనుమానం వచ్చి క్రికెట్ బ్యాట్‌తో తలుపు పగులగొట్టాడు. లోపల కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది రీవా. తనను ఎలాగైనా కాపాడుకోవాలని అంబులెన్సు కోసం ఫోన్ చేసి, ఆమెను చేతుల్లో ఎత్తుకుని హాల్లోకి తీసుకొస్తుండగానే సమయం మించిపోయింది. రీవా ఊపిరి ఆగిపోయింది. ఇదీ ఆస్కార్ పోలీసులకు, కోర్టుకు చెప్పిన విషయం. అయితే జరిగినదానికీ, దొరికిన సాక్ష్యాలకీ, ఆస్కార్ చెప్పినదానికీ ఏమాత్రం పొంతన కుదరలేదు. రీవాకి బుల్లెట్లు తగిలిన విధానాన్ని బట్టి ఆమె వెస్ట్రన్ కమోడ్ మీద కూర్చుని ఉంది. అప్పుడే ఆస్కార్ షూట్ చేశాడు. అతడి పిలుపు వినివుంటే ఆమె బదులు పలికేది కదా! లేచి తలుపు తీసేది కదా! అన్నిసార్లు పిలిచినా ఎందుకు మాట్లాడదు! పోనీ ఏదైనా గొడవ జరిగిందా? కోపంతో పలకలేదా? లేదంటే ఏ కారణం చేత అయినా అతడికి భయపడి దాక్కుని ఉందా? అలా అనుకున్నా నిలబడి ఉంటుంది కానీ ఎందుక్కూర్చుంటుంది? అలికిడి వినగానే కృత్రిమకాళ్లు అమర్చుకోకుండానే పాకుతూ బాత్రూమ్ దగ్గరకు వెళ్లానని, తర్వాత మంచం వైపు చూస్తే రీవా లేదని, దాంతో వెళ్లి కాళ్లు అమర్చుకుని వచ్చి తలుపు పగుల గొట్టానని, ఆమెను ఎత్తుకుని కిందికి తీసుకొచ్చానని ఆస్కార్ చెప్పాడు. నడవలేని వ్యక్తి ఎవరైనా.... తనతో పాటు ఒక మనిషి ఉన్నప్పుడు, అలికిడి అవగానే అదేంటో చూడమని ఆ మనిషితో చెప్తాడు కానీ, తనే ఎందుకు పాక్కుంటూ వెళ్తాడు? మరో విషయం... పిలిచినప్పుడు ఆమె కావాలని పలకకపోయినా, మొదటి బుల్లెట్ తగలగానే కేక పెడుతుంది కదా! అది విని అయినా ఇక కాల్చడం మానేయాలి కదా! ఈ ప్రశ్నల్లో వేటికీ ఆస్కార్ దగ్గర సమాధానం లేదు. దాంతో రీవా తల్లి చెప్పిన మాటలు నిజమేనేమో అనిపించింది పోలీసులకు. రీవా ఆస్కార్‌ని ప్రాణంగా ప్రేమించిందని, కానీ అతడు అసూయాపరుడని, పురుషాహంకారంతో రీవాని హింసించేవాడనీ ఆమె చెప్పింది. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన రీవా, అతడికి దూరమైపోవాలనుకుంటున్నట్టు ఆ రోజు రాత్రే తనతో చెప్పిందని అందామె. ఆ రాత్రి తెల్లవారకముందే రీవా మృత్యు వాత పడింది. బహుశా వదిలి వెళ్తానం దన్న కోపంతోనే రీవాని చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసిందామె. ఎలా చూసినా సాక్ష్యాలన్నీ ఆస్కార్‌కు వ్యతిరేకంగానే ఉన్నాయి. అందుకే అతడికి జీవితఖైదు పడొచ్చని చాలామంది అనుకున్నారు. కానీ కేవలం ఐదేళ్లు శిక్ష వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. న్యాయమూర్తి మసిపాకు ఆస్కార్ చేసింది హత్య అనిపించలేదు. దొంగ అనుకునే కాల్పులు జరిపాడని నమ్మిందామె. అందుకే ఐదేళ్లు శిక్ష విధిస్తున్నానని చెప్పింది. కానీ అది న్యాయమేనా? అతడు చెప్పేదానిలో ఏ మాత్రం వాస్తవం ఉన్నట్టు అనిపించకపోయినా, దొరికిన సాక్ష్యాలన్నీ అతడే దోషి అని నిరూపిస్తున్నా... పరిస్థితుల ప్రభావం వల్ల అలా చేశాడంటూ తక్కువ శిక్షను వేయడం సబబేనా? ఇరవై తొమ్మిదేళ్ల వయసులో చేయని తప్పుకు బలైపోయిన రీవాకు న్యాయం జరిగినట్టేనా?!! - సమీర నేలపూడి -
కూలీ నెం.15
ఆడపిల్లలు ఇలాగే ఉండాలి! ఈ పనులే చేయాలి! తరతరాలుగా ఈ మాటలు వింటూనే ఉన్నాం. ఆ ప్రకారం నడచుకుంటూనే ఉన్నాం. కానీ తరం మారింది. అవసరాలు మారుతున్నాయి. మరి ఆలోచనలూ మారాలి కదా! ఇదే ప్రశ్న వేసుకుంది మంజూదేవి. అనుకోకుండా జరిగిన ఓ సంఘటన తన జీవితాన్ని అల్లకల్లోలం చేస్తే... తప్పనిసరి పరిస్థితుల్లో సాహసోపేతమైన ఓ అడుగు వేసింది. ఏ మహిళా చేయని, చేయడానికి సాహసించని వృత్తిలో అడుగుపెట్టింది. దానిని సమర్థంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఎంతోమందికి ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తోంది! మంజూదేవికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. తన సంపాదనతో వాళ్లని చదివిస్తోంది. ఆమె అంటుంది... ‘ఎవరో ఆదుకోవాలని ఎదురు చూడటం కంటే... గౌరవంగా మనకు తోచిన పని మనం చేసుకోవడం ఉత్తమం’ అని! జైపూర్ రైల్వేస్టేషన్‌కి వెళ్లినవాళ్లకు ఓ అరుదైన దృశ్యం కనబడుతుంది. ఎర్రటి చొక్కాలు వేసుకుని, బ్యాడ్జిలు పెట్టుకుని, వరుసగా ఉన్న కూలీల మధ్య ఓ యువతి కనిపిస్తుంది. ఆమె వేసుకున్న దుస్తులు ఆమె కూడా రైల్వే కూలీ అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నా... నమ్మడానికి మాత్రం మన కళ్లు, మనసు ససేమిరా అంటాయి. ఎందుకంటే... కూలీ అంటే మనకు తెలిసి మగవాళ్లే. రైల్వేస్టేషన్లో, బస్టాపుల్లో లగేజీలు మోసేది వాళ్లే. అలాంటిది ఓ ఆడమనిషి ఆ పని చేస్తోందంటే ఆశ్చర్యం వేయక మానదు. పాపం ఎంత కష్టం వచ్చిందో అని జాలి వేయకా మానదు. నిజమే... ఆమెకి చాలా పెద్ద కష్టం వచ్చింది. అందుకే మహిళలు కలలో కూడా ఊహించని ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. సున్నితమైన చేతులతో బరువులు ఎత్తాల్సి వస్తోంది. ఆమె పేరు మంజూదేవి. జైపూర్‌లోనే కాదు... నార్త్ వెస్టర్న్ రైల్వేస్‌లోనే మొట్టమొదటి మహిళా కూలీ! విధిరాతకు తలవంచి... జైపూర్‌లోని సుందర్పురాలో భర్త, ముగ్గురు పిల్లలతో జీవించేది ముప్ఫై నాలుగేళ్ల మంజూదేవి. పూలపానుపు లాంటి జీవితం కాకపోయినా... కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి బట్టకు లోటు లేదు. ఉన్నదానితో తృప్తిపడే తత్వం ఆమెని ఏనాడూ దిగులు పడనివ్వనూ లేదు. మంజు భర్త మహదేవ్ జైపూర్ రైల్వేస్టేషన్లో కూలీ. సరిపడానే సంపాదించేవాడు. దాంతో కుటుంబం బాగానే గడిచిపోయేది. అయితే విధి వక్రించడంతో వారి జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. మహదేవ్ కాలేయ వ్యాధితో హఠాత్తుగా కన్నుమూశాడు. దాంతో బతుకంతా అంధకారమైపోయింది మంజుకి. సంపాదించే భర్త లేడు. తనకేమో సంపాదించే మార్గాలే తెలియదు. పిల్లలదేమో పరిస్థితులు అర్థం చేసుకునే వయసు కాదు. ఇప్పుడేం చేయాలి? తనలో తనే కుమిలిపోయింది. అప్పుడే ఆమెకు ఎవరో సలహా ఇచ్చారు... మీ ఆయన పని నీకిస్తారేమో అడుగు అని! ప్రాణం లేచొచ్చింది మంజుకి. భవిష్యత్తు మీద చిన్న ఆశ చిగురించింది. తన భర్త స్నేహితులతో కలిసి పోర్టర్ యూనియన్ని సంప్రదించింది. వారి సాయంతో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. మంజుకి ఉద్యోగమివ్వడానికి వారికి పెద్ద అభ్యంతరాలేమీ కనిపించలేదు. దాంతో భర్త స్థానం మంజుకి దక్కింది. అతడు ధరించిన బ్యాడ్జి ఆమె చేతిమీదికి చేరింది. దానిమీద రాసివున్న ‘పోర్టర్ నంబర్ 15’ అన్న అక్షరాలు చూసినప్పుడల్లా... భర్త జ్ఞాపకం వచ్చి కళ్లు చెమ్మగిల్లుతాయి మంజుకి. ‘నా భర్త ఈ రూపంలో నాకు అండగా ఉన్నాడు’ అంటుంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో! అయితే తొలినాళ్లలో ఆమె పని చేసినదాని కంటే ఏడుస్తూ గడిపిందే ఎక్కువ. అంతమంది మగవారి మధ్య కూర్చోవడం, తన వంతు కోసం ఎదురు చూడటం నరకంలా అనిపించేదామెకి. పైగా అందరూ తనని వింతగా చూస్తుంటే సిగ్గుతో చితికిపోయేది. దుఃఖాన్ని అదిమిపెట్టుకుని మౌనంగా చూస్తూ ఉండేది. సాయంత్రం ఇంటికి వెళ్లాక వెక్కి వెక్కి ఏడ్చేది. అలా చాలా రోజులు గడిపింది. అయితే ఓసారి మంజుని చూడటానికి వచ్చిన ఆమె తల్లి ఓ మాట చెప్పింది. ‘‘ఒక పని చేయడానికి సిద్ధపడిన తర్వాత దానిలోని మంచి చెడులను ఎదుర్కోవడానికీ సిద్ధపడాలి. విధి నీకు అన్యాయం చేసింది. నువ్వు నీ పిల్లలకు అన్యాయం చేయకు’ అని. ఆ మాటలు మంజుని ఆలోచింపజేశాయి. ఆ క్షణమే నిర్ణయించుకుంది... తన పిల్లలను పెంచుకోవడానికి దొరికిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని! మగవారికి దీటుగా... కూలీగా పని చేయాలనుకోవడం సులభమే. కానీ చేయడం మాత్రం చాలా కష్టం. ఆ సంగతి పనిలో చేరిన కొన్ని రోజులకే తెలిసివచ్చింది మంజుకి. చిన్న చిన్న సూట్‌కేసులు కూడా ఎత్తలేక తూలిపోయేది. ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు వాటిని చక్రాలబండి మీద వేసి లాక్కెళ్లడానికి కూడా ఆమె బలం సరి పోయేది కాదు. ఆమె అవస్థ చూడలేక ఒక్కోసారి తోటి కూలీలు వచ్చి సహకరించేవారు. అది ఆమెకు చాలా సంతోషమనిపించేది. వారితో పని చేయడానికి తనే అనవసరంగా మొహమాటపడుతున్నాను, వాళ్లు మంచి మనసున్నవాళ్లు అని అర్థం చేసుకుంది. ‘అన్నా..’ అంటూ అందరితో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. పని సులభంగా చేసే మెళకువల్ని వాళ్ల దగ్గర నేర్చుకుంది. ఆ వాతావరణానికి అలవాటు పడింది. వారికి దీటుగా పనిచేసే స్థితికి చేరుకుంది. ఇప్పుడు జైపూర్ రైల్వేస్టేషన్‌కి మంజు ఓ పెద్ద అట్రాక్షన్. ఆమె అంటే అక్కడి కూలీలకే కాదు, దుకాణదారులకి కూడా చాలా ఇష్టం, గౌరవం. అందరూ బెహన్ (సోదరి) అంటూ ప్రేమగా మాట్లాడుతుంటారు ఆమెతో. అయితే ఇప్పటికీ కొందరు ప్రయాణికులు మాత్రం ఆడమనిషి పోర్టరేంటి అని ముఖమ్మీదే జోకులేస్తుంటారు. నువ్వేం మోయగలవు అంటుంటారు. అలాంటప్పుడు ఏమీ మాట్లాడదు మంజు. నవ్వుతూ తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడర్థమయ్యిందా చేయగలనో లేదో అన్నట్టుగా చూస్తుంది. నిజమే... చేయాలి అనుకోవాలేగానీ చేయలేనిది ఏదీ లేదు. పనికి పురుషుడు, స్త్రీ అన్న తేడా లేదు. శారీరక బలానికి ఆత్మబలం తోడైతే... మనల్ని ఆపగలిగే శక్తి దేనికీ ఉండదు. ఆ విషయాన్ని మంజు నిరూపించి చూపించింది! - సమీర నేలపూడి -
తన నమ్మకమే నన్ను నిలబెట్టింది!
సంభాషణం: ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో హీరోకి ఫ్రెండ్‌గా నటించిన వ్యక్తి గుర్తున్నాడా? ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడానికి ఆరాటపడే అమాయకమైన అబ్బాయిగా అందరినీ ఆకట్టుకున్న ఆ అబ్బాయి పేరు... మధునందన్. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలతో చాలా బిజీ అయిపోయిన నందన్... తను ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన తపన గురించి ఇలా చెప్పుకొచ్చాడు... నట ప్రయాణం ఎలా మొదలైంది? నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. చిన్నప్పట్నుంచీ నటనంటే పిచ్చి. కానీ మా కుటుంబంలో అప్పటివరకూ ఎవరూ ఈ రంగంలోకి రాలేదు. దాంతో ఇంట్లోవాళ్లు ప్రోత్సహించేవారు కాదు. కానీ నేను పట్టువదల్లేదు. ఇంటర్ పరీక్షలు అయ్యాక తేజగారు కొత్తవాళ్లతో సినిమా తీయబోతున్నారని తెలిసి ఆడిషన్‌కి పరుగెత్తాను. లక్కీగా సెలెక్ట్ అయ్యాను. అదే... ‘నువ్వు-నేను’. ఆ సినిమా వచ్చి చాలా యేళ్లయ్యింది. కానీ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తర్వాతేగా మీరు అందరికీ తెలిసింది? అవును. నేనెవరో అందరికీ తెలియడానికి పదమూడేళ్లు పట్టింది. ఇన్నేళ్లలో పది, పదిహేను సినిమాలు చేసి ఉంటానంతే. అవకాశాలు ఎందుకు రాలేదు? మొదట నాకూ తెలియలేదు కానీ తర్వాత అర్థమైంది. నేనప్పటికి చిన్నవాణ్ని. ఆ వయసు పాత్రలు సినిమాల్లో పెద్దగా ఉండవు. యూత్ సినిమాలు తేజగారు తప్ప ఎవరూ తీసేవారు కాదు. కాబట్టి మిగతా వాళ్లెవరికీ నాతో పని లేదు. మరో కారణం... నేను చదువుకుంటున్నాను. సగం సమయం దానికే కేటాయించేవాడిని. మిగతా సమయంలో ప్రయత్నాలు చేసేవాడిని. పైగా నాకు ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలిసేది కాదు. ఈ కారణాలన్నింటి వల్లా నాకు అవకాశాలు రాలేదు. అందుకే ఎంబీయే పూర్తయ్యాక యూఎస్ వెళ్లిపోయాను. మళ్లీ ఇండియాకి ఎందుకొచ్చేశారు? ఏవో ప్రాబ్లెమ్స్ వల్ల సెటిలైపోదామనే ఉద్దేశంతో వెళ్లానే కానీ, మనసంతా నటన చుట్టూనే తిరిగేది. ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి సినిమాల గురించి, ఇండస్ట్రీ గురించి ఆరా తీసేవాడిని. అక్కడ నాతోవున్నవాళ్లు కూడా అనేవారు... నీకెందుకురా ఈ ఉద్యోగం, వెళ్లి నీకిష్టమైన నటననే కెరీర్‌గా ఎంచుకో అని. నా అదృష్టంకొద్దీ సాఫ్ట్వేర్ కూడా కుదేలైపోయింది. (నవ్వుతూ) దాంతో చక్కగా వెనక్కి వచ్చేశాను. మళ్లీ అవకాశాలు ఎలా వచ్చాయి? వచ్చీ రాగానే ‘ఇష్క్’ సినిమాలో చాన్స్ వచ్చింది. అయితే అది కేవలం నితిన్వల్లేలెండి. ‘నువ్వు-నేను’కి నితిన్ నాన్నగారు డిస్ట్రిబ్యూటర్. అప్పటికి నితిన్ హీరో కాలేదు. తను వాళ్ల నాన్నగారితో పాటు షూటింగ్ స్పాట్‌కి వచ్చేవాడు. అప్పుడే తనతో పరిచయం ఏర్పడింది. నాటి స్నేహం నేటికీ కొనసాగుతూనే ఉంది. అందుకే తను ‘ఇష్క్’ చాన్స్ ఇప్పించాడు. అంటే ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో కూడా..? అవును... అదీ నితినే ఇప్పించాడు. తనకి మొదట్నుంచీ నా మీద నమ్మకం. ఆ నమ్మకమే నన్ను నిలబెట్టింది. నన్ను రికమెండ్ చేస్తే ఏదో మంచి పాత్ర అయివుంటుంది అనుకున్నానే కానీ, అంత ప్రాముఖ్యత ఉన్న రోల్ అని అనుకోలేదు. సినిమా చూసిన తర్వాత చాలామంది డెరైక్టర్స్ ఫోన్ చేసి మెచ్చుకున్నారు. త్రివిక్రమ్‌గారయితే బన్నీతో చేస్తున్న సినిమాలో కావాలని నాకో పాత్ర ఇచ్చారు. నితిన్ దయో, ధైర్యమో... అంత మంచి పాత్రకు నన్ను తీసుకోవడం వల్లే నా కెరీర్, నా జీవితం మలుపు తిరిగాయి. కొత్తజంట, ప్యార్‌మే పడిపోయానే, గీతాంజలి, ఒక లైలా కోసం... వరుసగా చేస్తూనే ఉన్నాను. ఎలాంటి రోల్స్ కోరుకుంటున్నారు? ఏదో ఒక జానర్‌కి ఫిక్స్ అయిపోవడం ఇష్టం లేదు. కోట శ్రీనివాసరావుగారు, ప్రకాశ్‌రాజ్, బోమన్ ఇరానీల మాదిరిగా అన్ని రకాల పాత్రలూ చేయాలి. అందుకే డిఫరెంట్ పాత్రల్ని ఎంచుకుంటున్నాను. ‘పటాస్’లో హిజ్రా, ‘చిన్నదానా నీకోసం’లో ‘గే’ పాత్రల్లో నటిస్తున్నాను. హిజ్రా, గే పాత్రలు చేయడానికి గట్స్ కావాలి. వెంటనే ఒప్పుకున్నారా, తటపటాయించారా? హిజ్రా గురించి భయపడలేదు. సినిమాకి ఉపయోగపడే పాత్ర కావడంతో వెంటనే ఓకే అన్నాను. కానీ గే అనగానే కాస్త జంకాను. ఎంత నటనే అయినా ఆ ముద్ర పడుతుందేమోనని తటపటాయించాను. కానీ అది నితిన్ సినిమా. తను ఏం చేయమన్నా కళ్లు మూసుకుని చేసేస్తాను తప్ప ఏంటి, ఎందుకు అని జీవితంలో ఎప్పటికీ అడిగే ప్రసక్తే లేదు. అందుకే సరే అన్నాను. (నవ్వుతూ) అయినా పెళ్లి కాకపోతే భయపడాలి, నాకు పెళ్లై పాప కూడా ఉంది కాబట్టి ధైర్యంగా సరే అనేశాను. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి? నా భార్య హసిత నాకు కొలీగ్. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ‘ఇష్క్’ చేశాక మా పెళ్లి జరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’తో నా లైఫే మారిపోయింది. అందుకే తను నన్ను ఆటపట్టిస్తూ ఉంటుంది... నేను వచ్చేవరకూ అదృష్టం నీ దగ్గరకు రాలేదు అని. నేను కూడా అది నిజమేనని ఒప్పేసుకుంటా. డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా? ‘అరుంధతి’లో సోనూ సూద్ చేసిన అఘోరా పాత్ర. ‘గీతాంజలి’లో కాస్త నెగిటివ్ టచ్ ఉన్నది చేశాను కానీ... అఘోరా మాదిరిగా పూర్తిస్థాయిలో చేయాలి. భవిష్యత్ ప్రణాళికలు...? నటన... నటన... నటన. నా ప్రణాళికలన్నీ దీని చుట్టూనే తిరుగుతాయి. కనీసం ఇంకో పది, పదిహేనేళ్ల వరకూ చేతినిండా పనితో ఉక్కిరిబిక్కిరైపోవాలి. మంచి నటుడిగా ముద్ర వేసుకోవాలి! - సమీర నేలపూడి -
ఒక ప్రేమ ఒక పగ
జూలై 30, 2011... ఉదయం ఆరున్నర దాటుతోంది. సిడ్నీలోని సీబీడీ అపార్ట్మెంట్ ఆవరణ అంతా గందరగోళంగా ఉంది. ‘‘తప్పుకోండి... తప్పుకోండి... ఏం జరిగింది?’’... గుమిగూడిన జనాన్ని తోసుకుంటూ ముందుకు వచ్చాడో వ్యక్తి. నేలమీద ఉన్న రక్తపు మరకలు, వాటి చుట్టూ ఉన్న చాక్‌పీస్ మార్కులు, వాటిని పరిశీలిస్తున్న పోలీసుల్ని చూస్తూనే విస్తుపోయాడు. ‘‘ఏం జరిగింది?’’ అన్నాడు ఆతృతగా. ‘‘ఫ్లాట్ నంబర్ 1503లోని అమ్మాయి పై నుంచి పడిపోయింది’’ అది వింటూనే ‘లీసా’ అంటూ గావుకేక పెట్టాడా వ్యక్తి. పరిశోధనలో మునిగివున్న సార్జెంట్ కూపర్ వెంటనే ఆ అరుపు వచ్చినవైపు చూశాడు. ఖరీదైన జీన్స్, టీషర్ట వేసుకుని పాష్‌గా ఉన్నాడా వ్యక్తి. జరిగినదాన్ని నమ్మలేను అన్నట్టుగా అతడి కళ్లు విప్పారి ఉండిపోయాయి. పొంగుకొస్తున్న దుఃఖంతో పెదవులు అదురుతున్నాయి. క్షణంలో ముఖం కందిపోయింది. కన్నుల గుండా అశ్రుధారలు పొంగుకొస్తున్నాయి. మెల్లగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లాడు కూపర్. ‘‘ఆ అమ్మాయి మీకు తెలుసా?’’ అన్నాడు అతడి ముఖంలోకే చూస్తూ. ‘‘తెలుసు సార్. తను నాకు కాబోయే భార్య... లీసా ఆర్నమ్’’... బావురున్నాడు. ‘‘మీరు ఫేమస్ వ్యాపారి సైమన్ గిటానీ కదా!’’ అవునన్నట్టు తలూపాడు. ‘‘తనెక్కడుంది సార్... ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా?’’ అతడి ఆతృత చూసి జాలేసింది కూపర్‌కి. ‘‘సారీ మిస్టర్ గిటానీ... షి ఈజ్ నో మోర్. పదిహేనో అంతస్తు నుంచి పడటం వల్ల వెంటనే చనిపోయింది.’’ ‘‘నో... లీసా’’... వెక్కి వెక్కి ఏడవసాగాడు. ‘‘బాధపడకండి. ధైర్యంగా ఉండండి’’ అని భుజం తట్టాడు కూపర్. అంతలో సబార్డినేట్ వచ్చి... ‘‘సర్... అపార్ట్మెంట్ చూడాలన్నారు కదా’’ అన్నాడు. అవునన్నట్టు తలాడించి... ‘‘మిస్టర్ గిటానీ... మీరూ రండి’’ అన్నాడు. సరేనన్నట్టు తలూపి వారి వెంట నడిచాడు సైమన్ గిటానీ. వాళ్లు వెళ్లేసరికి 1503వ ఫ్లాట్‌లో ల్యాండ్ ఫోన్ రింగవుతోంది. కూపర్ ఫోన్ తీసి హలో అనేలోపే అవతలి గొంతు కంగారుగా పలికింది... ‘‘లీసా... ఎలా ఉన్నావమ్మా?’’ కూపర్ ‘‘హలో’’ అన్నాడు. ఒక్క క్షణం అవతలి నుంచి శబ్దం రాలేదు. ఆ తర్వాత ఆమె అడిగింది.. ‘‘ఎవరు మీరు? లీసా ఎక్కడ?’’ ‘‘మీరెవరు?’’ ‘‘లీసా వాళ్ల మమ్మీని.’’ ‘‘సారీ మేడమ్. మీ అమ్మాయి లీసా... ఆత్మహత్య చేసుకుంది.’’ ‘‘వ్వా...ట్’’... అరించిందామె. ‘‘లేదు. నా బంగారుతల్లి నన్ను వదిలి వెళ్లిపోదు. మీరు అబద్ధం చెబుతున్నారు. పిలవండి... నా లీసాని పిలవండి’’... పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ ఏడుస్తోంది. ‘‘కంట్రోల్ యువర్సెల్ఫ్ మేడమ్. నేను చెప్పేది నిజమే. తెల్లవారు జామున మీ అమ్మాయి పదిహేనో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నేను ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీసాఫీసర్ని.’’ ‘‘లేదు. తను ఆత్మహత్య చేసుకోదు. అంత పిరికిది కాదు తను. నిన్ననే నాతో మాట్లాడింది. నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా అంది. ఇంతలోనే ఎందుకు చనిపోతుంది! వాడే... వాడే తనని చంపేసి ఉంటాడు. వాణ్ని నేను వదలను.’’ కూపర్ భృకుటి ముడివడింది. ‘‘ఎవరి గురించి అంటున్నారు?’’ ‘‘ఇంకెవరు? వాడే... ఆ సైమన్... నా కూతురి జీవితాన్ని నరకం చేసేశాడు. వాడ్ని వదిలించుకుని వచ్చేస్తానని నిన్ననే నాతో చెప్పింది లీసా. కానీ ఇంతలోనే...’’ దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. మరుక్షణంలో ఫోన్ కట్ అయ్యింది. నిట్టూర్చాడు కూపర్. రిసీవర్ని క్రెడిల్ చేసి వెనక్కి తిరిగాడు. ‘‘మిస్టర్ సైమన్ గిటానీ... యు ఆర్ అండర్ అరెస్ట్’’ అంటూ అతడి చేతికి బేడీలు వేశాడు. ‘‘మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సర్. నేనెందుకు లీసాని చంపుతాను? తను నా ప్రాణం. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాన్నాళ్లుగా కలిసేవుంటున్నాం.’’ చురుక్కున చూశాడు కూపర్. ‘‘కలిసే ఉంటున్నారా? మరి తను చనిపోయిన రోజు నువ్వు ఫ్లాట్‌లో ఎందుకు లేవు?’’ గతుక్కుమన్నాడు సైమన్. బిత్తర చూపులు చూశాడు. తర్వాత తేరుకుని అన్నాడు. ‘‘నేను పనుండి ఆ రాత్రి ఇంటికి రాలేదు సర్. ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది చెప్పండి!’’ ‘‘తెలుసుకోకుండా నువ్వు ఉండలేవు కదా మిస్టర్ గిటానీ... ఆ అపార్ట్మెంట్లోకి చీమ వచ్చినా నీకు తెలిసిపోతుంది.’’ ‘‘ఏమంటున్నారు సర్?’’ ‘‘చాలు ఇక నటించకు’’... కూపర్ అరుపుతో ఉలిక్కిపడ్డాడు సైమన్. ‘‘అపార్ట్‌మెంట్స్‌లో బయటి నుంచి ఎవరు వచ్చినా తెలియడానికి సీసీ కెమెరా పెడతారు. ఒకటి రోడ్డు వైపు... ఒకటి అపార్ట్మెంట్ వైపు. మీ అపార్ట్మెంట్లోనూ అలానే ఉన్నాయి. అయితే అదేంటోగానీ... నీ ఫ్లాటు దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఒకటీ రెండూ కాదు... మూడు. మరీ విచిత్రం ఏమిటంటే... ఇక ఏ ఫ్లాటు దగ్గరా ఒక్క కెమెరా కూడా లేదు. ఎందుకంటావ్?’’ మాట్లాడలేదు సైమన్. లీసా అంటే తనకెంతో ఇష్టమని, ఆమెనెంతో ప్రేమించానని పోలీసులు, న్యాయస్థానం ముందు మొసలి కన్నీళ్లు కార్చాడు సైమన్ గిటానీ. అయితే అతడికి లీసా మీద ప్రేమ ఏమాత్రం ఉందో కొన్నాళ్లకే తేలిపోయింది. కేసు నడుస్తుండగానే రేచెల్ లూయిస్ అనే మరో అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఆమెతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. చివరికి కోర్టుకి కూడా ఆమెను తీసుకునే వచ్చేవాడు. తన ఐశ్వర్యం, పలుకుబడితో కేసు నుంచి బయటపడతాననుకున్న సైమన్ నమ్మకాన్ని న్యాయస్థానం పటాపంచలు చేసింది. అతడిని కటకటాల వెనక్కి నెట్టింది. ప్రేమను పగతో కాలరాసిన అతడికి తగిన శాస్తి జరిగింది! ‘‘ఏం మాట్లాడవ్. నీ గుట్టు రట్టయ్యిందనా? ఆ మూడు కెమెరాలూ నువ్వేంటో చెప్పాయి మిస్టర్ గిటానీ. ఇక నిన్నెవరూ కాపాడలేరు’’ అంటూ వెళ్లిపోతోన్న కూపర్ వైపు అయోమయంగా చూస్తూండిపోయాడు సైమన్ గిటానీ. అతడు ఊహించలేదు... తాను పెట్టిన కెమెరాలే తన నిజ స్వరూపాన్ని బయటపెడతాయని. అందుకే షాక్ తిన్నాడు. తనని తాను తిట్టుకున్నాడు. కానీ నిజాన్ని మాత్రం తనంతట తాను అంగీకరించకూడదని నిర్ణయించుకున్నాడు. కేసు నడిచిన మూడేళ్లూ అలానే వాదించాడు. తాను అమాయకుడినని అన్నాడు. లీసాని ప్రాణంగా ప్రేమించానన్నాడు. ఆమె ఎందుకు చనిపోయిందో తనకు తెలియదన్నాడు. కోటీశ్వరుడైన వ్యాపారి కాబట్టి తనను తాను కాపాడుకోగలనన్న నమ్మకంతో అడ్డంగా వాదించాడు. అయితే నిజం ముందు డబ్బు ఓడిపోయింది. న్యాయం ముందు అతడి పలుకుబడి తలదించుకుంది. లీసా ఎంత మంచిదో తెలిసిన కొందరు ధైర్యంగా ముందుకొచ్చి సాక్ష్యం చెప్పారు. ఆమెను సైమన్ ఎంతగా హింసించాడో కోర్టు ముందు వెల్లడించారు. అమాయకురాలైన లీసాకి అనుకోకుండా సైమన్‌తో పరిచయమైంది. అది ప్రేమగా మారి, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనకు దారి తీసింది. అందుకు సైమన్ కూడా ఒప్పుకున్నాడు. అయితే పెళ్లికి ముందు కొన్నాళ్లు కలిసుందామన్నాడు. సీబీడీ అపార్ట్మెంట్లోని ఖరీదైన 1503 ఫ్లాట్‌ను తమ ప్రేమ మందిరంగా మార్చేశాడు. తన ప్రేమతో లీసాని ఉక్కిరిబిక్కిరి చేశాడు. కానీ అతడు తన నిజమైన రూపాన్ని ఎక్కువకాలం దాచి పెట్టలేకపోయాడు. లీసాని తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని ఆరాటపడేవాడు. ఆమె ఎవరితో మాట్లాడకూడదు. ఎవరినీ కలవకూడదు. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే తిట్టేవాడు. జిమ్‌కి వెళ్తానంటే కాళ్లు విరగ్గొడతాననేవాడు. ఆమెకంటూ ప్రత్యేక ప్రపంచమనేది లేకుండా చేశాడు. నాలుగ్గోడల మధ్య బందీని చేసేశాడు. కుమిలిపోయింది లీసా. అతడి కంబంధ హస్తాల నుంచి తప్పించుకోవాలని ఆరాటపడింది. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక, సైమన్కి తెలియకుండా ఓ డాక్టర్ని ఇంటికి పిలిపించుకుని రహ స్యంగా చికిత్స తీసుకునేది. జిమ్ ట్రెయినర్‌ని కూడా ఇంటికే రమ్మనేది. కానీ అది సైమన్కి తెలిసిపోవడంతో వాళ్లకు ఫోన్లు చేసి వార్నింగ్ ఇచ్చాడు. మళ్లీ వస్తే మర్యాదగా ఉండదన్నాడు. దాంతో అల్లాడిపోయింది లీసా. అతడి పైశాచిక ప్రేమను భరించడం తన వల్ల కాదనిపించింది. ఇక అతడికి దూరంగా వెళ్లిపోవాలనుకుంది. ఆమె ఆలోచనను పసిగట్టి పగబట్టాడు సైమన్. ఏం జరిగినా సరే, ఆమెను వెళ్లనివ్వకూడదనుకున్నాడు. అతడి ఆలోచనలను తెలుసుకోలేకపోయింది లీసా. తల్లికి ఫోన్ చేసి, ఎలాగైనా అతడిని వదిలించుకుని వచ్చేస్తానని చెప్పింది. ఆ రోజు రాత్రి గడవక ముందే సైమన్ చేతిలో హత్యకు గురయ్యింది. పదిహేనో అంతస్తు నుంచి క్రూరంగా లీసాని తోసి చంపేశాడు సైమన్. తెల్లవారుజామున... ఆమె కంగారుగా ఫ్లాట్‌లోంచి బయటకు పరుగెత్తడం, పారిపోవాలని ప్రయత్నించడం, అతడు ఆమె నోరు మూసి బాల్కనీలోని రెయిలింగ్ దగ్గరకు లాక్కెళ్లడం ఒక కెమెరాలో రికార్డయ్యింది. ఆమెను అక్కడ్నుంచి తోసేయడం మసకమసకగా కనిపించింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు తయారయ్యి, బయటకు వెళ్లిపోవడం మరో కెమెరాలో రికార్డయ్యింది. వాటిని చూసిన ఆస్ట్రేలియా అత్యున్నత న్యాయ స్థానం సైమన్కి ఇరవయ్యారేళ్ల కఠిన కారా గార శిక్ష విధించింది. పద్దెనిమిదేళ్ల వరకూ ఏ కోర్టూ అతడికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. తీర్పు వెలువడగానే లీసాకి న్యాయం జరిగిందంటూ పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అది నిజమా? లీసాకి న్యాయం జరిగిందా? అతడిని ప్రాణంగా ప్రేమించింది. జీవితమంతా అతడి ప్రేమలో మునిగి తేలాలనుకుంది. అయితే అతడి ప్రేమ పాశవికమని, అతడి కౌగిలి సర్ప పరిష్వంగమని తెలిసి తప్పుకోవాలనుకుంది. అతడికి దగ్గరవడం ఆమె తప్పు కాదు. దూరమవ్వాలనుకోవడమూ తప్పు కాదు. ప్రేమను మాత్రమే ఆశించిన ఆ అమాయకురాలిని దారుణంగా పొట్టనబెట్టుకున్నాడు సైమన్. తప్పు చేసింది అతను. మరి ఆమెకెందుకు శిక్ష పడాలి? ఆమె ఎందుకు ప్రాణం పోగొట్టుకోవాలి? నూరేళ్లు బతకాల్సిన ఆమె, ముప్ఫయ్యేళ్లకే మృత్యు ఒడికి ఎందుకు చేరాలి? చెప్పండి... లీసాకి న్యాయం జరిగిందా?!! - సమీర నేలపూడి -
అవకాశం రావాలే గానీ...ఆడవాళ్లూ సాధించగలరు!
జీవితం ఎప్పుడూ ఒకలానే ఉండదు. ఊహించని ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎత్తూపల్లాలు ఎదురై ఇబ్బంది పెడతాయి. వాటిని తట్టుకుంటూ, అధిగమించుకుంటూ వెళ్లినవాళ్లే విజయ శిఖరాలను అందుకోగలరు. అందుకు అసలు సిసలు ఉదాహరణ... ఉమా అమర్నాథ్. ఒకప్పుడు సాధారణ గృహిణి అయిన ఆవిడ... ఇవాళ ఓ పెద్ద సంస్థను విజయవంతంగా నడపగలుగుతున్నారంటే అందుకు ఆమె పట్టుదల, శ్రమించే తత్వమే కారణం. టీఎంసీ సారథిగా తన పయనం గురించి ఉమా అమర్నాథ్ సాక్షితో జరిపిన సంభాషణ ఇది... దీపావళి అంటే వ్యాపారస్తులకు, కస్టమర్లకూ కూడా పండుగే. ఈ యేడు దీపావళి ఎలా ఉండబోతోంది? ఎప్పటిలాగే ఈసారి కూడా మా కస్టమర్లకు మేం మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నాం. వెయ్యి రూపాయల కొనుగోళ్లు చేసిన వాళ్లందరికీ కూపన్లు ఇస్తాం. దీపావళికి తీసే డ్రాలో పాతిక లక్షల నగదు బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. అలాగే బంపర్ డ్రా విజేతకు 45 లక్షల విలువ గల డ్యూప్లెక్స్ విల్లాను ఇటాలియన్ ఫర్నిచర్‌తో సహా ఇవ్వబోతున్నాం. 250 కోట్ల టర్నోవర్ ఉన్న టీఎంసీ సంస్థకి సీఎండీ స్థానంలో ఉండటమంటే మాటలు కాదు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నడిపిస్తున్నారు? ఈ సామ్రాజ్యాన్ని నా భర్త అమర్నాథ్ సృష్టించారు. ఆయన ఎంత మంచి వ్యాపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న వయసు నుంచీ పట్టుదలతో, స్వయంకృషితో ఎదిగిన వ్యక్తి ఆయన. టీఎంసీ ఆయన కలల పుత్రిక. నిద్రలో కూడా టీఎంసీ అనే కలవరించేవారు. రాత్రీపగలూ దీని అభివృద్ధి కోసం పాటు పడ్డారు. ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆయన లేరు. ఆయన కలల్ని నెరవేర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదే నన్ను నడిపిస్తోంది. ఆయన మీకు దూరమైన ఆ దురదృష్టకర సంఘటన గురించి...? అది 2011, డిసెంబర్ 4. ఆ రోజు ఉదయం మామూలుగానే లేచారు. ఒక ఫంక్షన్ ఉంటే దాని ఏర్పాట్ల గురించి ఫోన్లలో మాట్లాడుతున్నారు. అంతలో ఛాతిలో నొప్పి అన్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. కానీ ఆరోజు ఆదివారం కావడంతో స్పెషలిస్టులెవరూ అందుబాటులో లేరు. వాళ్లు వచ్చేసరికి ఆలస్యమైపోయింది. నా కళ్లముందే ఆయన ఊపిరి ఆగిపోయింది. ఒక్కసారిగా అంతా శూన్యమై పోయినట్టుగా అనిపించింది. ఆయన లేరన్న నిజాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఎప్పుడూ హుషారుగా, చలాకీగా ఉండే ఆయన అంత త్వరగా (44 యేళ్లు) వెళ్లిపోతారని ఊహించలేదు! టీఎంసీ బాధ్యతలు చేపట్టాలన్నది మీ నిర్ణయమేనా? ఎవరైనా అటు నడిపించారా? పిల్లలు చిన్నవాళ్లు. బాధ్యత తీసుకోవడానికి ఎవరూ లేరు. దాంతో ఆయన పోయిన పదిహేను రోజులకే నేను ఆయన స్థానంలోకి వెళ్లక తప్పలేదు. ఉన్నట్టుండి అంత పెద్ద బాధ్యత... భయం వేయలేదా? చాలా భయపడ్డాను. నిజానికి నేను వ్యాపారస్తుల కుటుంబం నుంచే వచ్చాను. ఓ వ్యాపారికే భార్యనయ్యాను. కానీ వ్యాపారం గురించి నాకేమీ తెలియదు. కేవలం డిగ్రీ చదివిన నేను, ఓ కంపెనీని నడపాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. దాంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. దేవుడి దయవల్ల ముందు నుంచీ మా దగ్గర మంచి స్టాఫ్ ఉన్నారు. వాళ్లంతా అండగా నిలబడ్డారు. వ్యాపార రంగం అనేది నేటికీ పురుషుల ప్రపంచమే. ఓ మహిళగా ఇక్కడ మీరెలా మనగలుగుతున్నారు? కొంతమంది అంటుంటారు... ఆడవాళ్లు ఏం చేయగలరు అని! అవకాశం రావాలేగానీ ఆడవాళ్లు కూడా అన్నీ సాధించగలరు. మావారు ఉన్నప్పుడు నేను దీపావళికి పూజ చేయడానికి మాత్రమే ఆఫీసుకు వచ్చేదాన్ని తప్ప, ఆఫీసులో ఏం జరుగుతుందో పట్టించుకునేదాన్నే కాదు. కానీ ఏం జరిగింది? ఇల్లు విడిచి ఓ కొత్త ప్రపంచంలోకి రావాల్సి వచ్చింది. ఇంతమందిని డీల్ చేయాల్సి వచ్చింది. వెనకడుగు వేసివుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేది? మా కంపెనీ ఏమయ్యేది?! మీ పిల్లల గురించి చెప్పండి...? బాబు పన్నెండో తరగతి చదువుతున్నాడు. పాప ఈ మధ్యనే లండన్‌లో డిగ్రీ పూర్తి చేసి వచ్చింది. ఓ రెండేళ్లు ఇక్కడే పని చేసి, మాస్టర్స్ కోసం మళ్లీ విదేశాలకు వెళ్లిపోతుంది. ఓ పక్క పిల్లలు... మరోపక్క కంపెనీ... లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఆయన హఠాత్తుగా దూరమైనప్పుడు నేను పిల్లల గురించి కంటే కంపెనీ గురించే ఎక్కువ ఆలోచించాను. కంపెనీని పైకి తీసుకెళ్లడం తర్వాత, ముందు పడిపోకుండా నిలబెట్టాలనుకున్నాను. అదృష్టం కొద్దీ పిల్లలు కూడా నా తపనను అర్థం చేసుకున్నారు. అంతేకాదు, నాకు ధైర్యం చెప్తూ ఉంటారు. మా పాప అంటుంది... ‘‘మమ్మీ... డాడీ మనకు అన్నీ ఇచ్చి వెళ్లారు. అందుకే మనం ఇవాళ ఇలా అయినా ఉన్నాం. డాడీ అనుకున్నవన్నీ మనం చేయాలి. కంపెనీని నిలబెట్టాలి’’ అని! ఇంత మంచి పిల్లలున్నందుకు గర్వంగా ఉంటుంది నాకు! అమర్నాథ్గారి పేరు మీద ‘అమర్నాథ్ ఎన్. ప్రమోషనల్ బ్లిట్జ్ అవార్డు’ ఇస్తున్నారు కదా... దాని గురించి చెప్పండి? బజాజ్ గ్రూప్‌వాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్లలో ఒక ఉత్తమ డీలర్‌ను ఎంపిక చేసి, వారికి మావారి పేరుమీద అవార్డునివ్వాలని నిర్ణయించుకున్నారు. అమర్నాథ్ ఎప్పుడూ కొత్త కొత్త స్కీములు ఆలోచించి, ముందు తను వాటిని ఆచరణలో పెట్టి విజయం సాధించి, తర్వాత మిగతా డీలర్లందరినీ కలిసి అలా చేయమని ప్రోత్సహించేవారట. అందుకే ఆయన పేరు మీద అవార్డును నెలకొల్పాలనుకుంటున్నామని వాళ్లు చెప్పగానే చాలా ఆనందపడ్డాను. మరీ సంతోషకరమైన విషయం ఏమిటంటే... నెలకొల్పిన తర్వాత వరుసగా రెండేళ్లూ మా కంపెనీయే ఆ అవార్డును గెలుచుకోవడం! మరి మీవారి గుర్తుగా మీరు కూడా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ప్రతి జిల్లాలోనూ టీఎంసీ ఉండాలనేది అమర్ నాథ్ కోరిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎనిమిది, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఒక్కోటి చొప్పున షోరూమ్స్ ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాల్లో కూడా మా షోరూములు ప్రారంభించడమే నా ముందున్న లక్ష్యం. అది మాత్రమే కాదు... ఆయన ఎప్పుడూ ఒక హాస్పిటల్ కట్టించాలి అనేవారు. ఆ పని నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. ఆయన కోరిక తీర్చడం కోసమే కాదు. ఆయనకి జరిగినట్టు ఎవరికీ జరగకుండా ఉండటం కోసం. బోలెడంత డబ్బు ఉంది. చికిత్స చేయించుకోగల స్తోమతా ఉంది. కానీ ఏం లాభం? సమయానికి డాక్టర్లు లేక మావారు ప్రాణాలు కోల్పోయారు. ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదు. వారం పొడవునా, ఏ సమయంలో ఏ రోగి వచ్చినా వైద్యం అందించే విధంగా ఓ ఉత్తమ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని ఉంది. దానికి కాస్త సమయం పట్టవచ్చు. కానీ ఎప్పటికైనా చేసి తీరతాను. ఆ రెండూ చేసిన రోజున, ఓ భార్యగా నా భర్త కలలను నిజంగా నిజం చేసినదాన్ని అవుతాను! - సమీర నేలపూడి మేమెప్పుడూ అలా ఆలోచించం. అమర్నాథ్ ఎప్పుడూ ఒకటే చెప్పేవారు... తక్కువ లాభం తీసుకోవాలి, కస్టమర్లను ఎక్కువ శాటిస్ఫై చేయాలి అని! అది ఏ వ్యాపారికోగానీ ఉండని గొప్ప దృక్పథం. ఎప్పుడూ కస్టమర్లను సంతోషపెట్టడానికే చూసేవారాయన. అదే మా కంపెనీని ఉన్నత స్థాయికి చేర్చింది. అందుకే నేనూ ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నాను. ఆయన పాలసీనే ఫాలో అవుతున్నాను. -
ఆ రోజు వాళ్లు నన్ను కొడతారనుకున్నా!
సంభాషణం: సినిమాల్లో నెగిటివ్రోల్స్ చేసేవాళ్లకు తక్కువేమీ లేదు. కానీ చూడగానే గుండె ఝల్లుమనిపించేలా నటించేవాళ్లు కొందరే ఉంటారు. అమిత్‌కుమార్ తివారీ ఆ కోవకు చెందిన నటుడే. సూపర్, అనుకోకుండా ఒకరోజు, యువసేన, రాఖీ, విక్రమార్కుడు తదితర చిత్రాల్లో క్రూరమైన పాత్రల్లో నటించి మెప్పించిన అమిత్ తన గురించి, తన కెరీర్ గురించి చెబుతోన్న విశేషాలు... సినిమాల్లో ఆడపిల్లలను వేధిస్తుంటాను కదా, అందుకే నా భార్య ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు చాలామంది. నేను సినిమాల్లోనే శాడిస్ట్‌ని. బయట చాలా సాఫ్ట్, కూల్. ఆ విషయం పూజకి బాగా తెలుసు. అందుకే నన్ను ప్రేమించింది. తను ముంబై అమ్మాయి. పెళ్లికి పదేళ్ల ముందు నుంచే మాకు పరిచయం ఉంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మాకిప్పుడో బాబు... విరాన్ష్ (2). అర్థం చేసుకునే భార్య, ముద్దొచ్చే కొడుకు... లైఫ్ హ్యాపీగా ఉంది! మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది? చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. కానీ నాన్నేమో... ముందు చదువు, తర్వాతే సినిమాలు అన్నారు. దాంతో డిగ్రీ అయ్యేవరకూ ఓపిక పట్టాను. ఆ తర్వాత ‘కల’ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ఫొటోలు పంపించాను. అవి నచ్చడంతో డెరైక్టర్ నన్ను ముంబై నుంచి హైదరాబాద్ రప్పించారు. సెలెక్ట్ అవడంతో నటుడినైపోయాను. ముంబై అంటున్నారు... మీరు తెలుగువారు కాదా? అచ్చమైన తెలుగువాడినే. కాకపోతే నాన్నగారి చిన్నప్పుడే మా కుటుంబం ముంబై వెళ్లి స్థిరపడింది. దాంతో నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. నెగిటివ్ రోల్స్ ఎందుకెంచుకున్నారు? నేను ఎంచుకోలేదు. ‘కల’ సెలెక్షన్స్ అప్పుడు నా పొడవాటి జుత్తు, గడ్డం చూసి నెగిటివ్ రోల్‌కి తీసుకున్నారు. ఆ తర్వాత అలాంటి పాత్రలే వచ్చాయి. బ్రేక్ ఇచ్చిన సినిమా? విక్రమార్కుడు. మొదటి సినిమా తర్వాత మూడేళ్లపాటు చాలా సినిమాలు చేశాను. గుర్తింపు వచ్చింది కానీ బ్రేక్ రాలేదు. కానీ ‘విక్రమార్కుడు’ నా కెరీర్‌నే మార్చేసింది. మిమ్మల్ని ప్రతినాయకుడిలా చూసినప్పుడు మీ ఇంట్లోవాళ్ల రియాక్షన్? మొదట షాకైపోయారు. అమ్మయితే... అదేంట్రా అలా చేశావ్ అంటూ బాధపడిపోయింది. సర్ది చెప్పడంతో ఊరుకుంది. తర్వాత అందరూ అలవాటు పడ్డారు. కానీ హీరో నన్ను అంతం చేసే సీన్ చూసినప్పుడు మాత్రం ఏడ్చేస్తుంటారు. బయటికెళ్లినప్పుడు జనాల స్పందన..? బయటికెళ్తే నన్ను చూసి అందరూ ఎలా రియాక్టవుతారో అన్న ఫీలింగ్ మొదట్లో ఉండేది. టీమ్‌తో కలిసి థియేటర్లో ‘విక్రమార్కుడు’ చూడ్డానికి వెళ్లా. సినిమాలో నేను చచ్చిపోగానే పక్కనే ఉన్న పదిమంది కుర్రాళ్లు లేచి చప్పట్లు కొడుతూ, నా పాత్రను బూతులు తిడుతూ ఉన్నారు. దాంతో భయమేసి ముఖం కప్పుకున్నాను. ఏమయ్యిందని రాజమౌళి అడిగితే, బయటికెళ్లాక వాళ్లు నన్ను కొడతారేమో సార్ అన్నాను. అప్పుడాయన... ‘వాళ్లు తిట్టేది నీ పాత్రని. అంతగా రియాక్ట్ అవుతున్నారంటే నువ్వంత బాగా నటించావని అర్థం. బయటికెళ్లాక వాళ్లే ఆ మాట చెప్తారు చూడు’ అన్నారు. నిజంగా అలానే జరిగింది. అందరూ వచ్చి చాలా బాగా చేశానని చెబుతుంటే సంతోషమేసింది. మేం చేసేది నటన అని, సినిమాకే పరి మితమనే విజ్ఞత ప్రేక్షకులకు ఉంది. కానీ సినిమాల్లో ఇంతటి క్రూరత్వాన్ని చూపించడం అవసరమా? అలాంటి పాత్రలు ప్రేక్షకుల మీద చెడు ప్రభావాన్ని చూపించవంటారా? అలా ఎందుకనుకోవాలి! ‘రాఖీ’లో నేను చేసిన పాత్రనే తీసుకోండి. అది కల్పిత పాత్ర కాదు. విజయవాడలో ఒకడు ఒకమ్మాయి పట్ల అంత దారుణానికి ఒడిగట్టాడు. దానినే సినిమాలో పెట్టారు కృష్ణవంశీ. ఎందుకని! ఇలాంటివాళ్లు సమాజంలో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి. ఇలా జరిగే ప్రమాదం ఉంది జాగ్రత్త అని చెప్పడానికి మా పాత్రలు ఉపయోగపడుతున్నందుకు నాకు ఆనందంగానే ఉంటుంది. కానీ అవే చేసి చేసి బోర్ కొట్టట్లేదా? ఒక్కోసారి అదే అనిపిస్తుంది. కానీ అందరూ నాకు అలాంటివే ఇస్తున్నారు. నాకేమో పాజిటివ్ రోల్స్ కూడా చేయాలని ఉంది. నేను కామెడీని కూడా పండించగలనని నా నమ్మకం. కానీ ఎవ్వరూ అలా ఆలోచించడం లేదు. త్రివిక్రమ్‌గారు మాత్రం తన ప్రతి సినిమాలోనూ నన్ను కాస్త కొత్తగా చూపించాలని ప్రయత్నిస్తుంటారు. అందుకాయనకు థ్యాంక్స్ చెప్పాలి. నెగిటివ్ రోల్స్ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. పోటీ పెరిగిపోలేదా? ఎవరి టాలెంట్‌కి తగ్గ పాత్రలు వారికి వస్తాయి. పోటీ పడాల్సిన అవసరం లేదు. అయినా నేనెవరితోనూ పోటీ పడను. నాకు నేనే పోటీ. దాదాపుగా ఒకేలాంటి పాత్రలొచ్చినా ప్రతి సినిమాలోనూ ఏదైనా కొత్తగా చేద్దామని ప్రయత్నిస్తుంటాను. నటన కాకుండా ఇంకేమైనా...? మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. బాగా పాడతాను కూడా. నా ఫ్రెండ్సందరూ సినిమాల్లో పాడొచ్చు కదా అంటుంటారు. అవకాశం వస్తే తప్పక ట్రై చేస్తాను. భవిష్యత్ ప్రణాళికలు...? ప్రస్తుతానికి మనసంతా నటన మీదే. చాలెంజింగ్ రోల్స్ చేసి మెప్పించాలి. సమాజానికి కూడా ఏదైనా చేయాలని ఉంది. ముఖ్యంగా బాల కార్మికుల్ని చూస్తే బాధేస్తుంది. అలాంటి పిల్లలకు సాయపడాలి. కాకపోతే దానికి కాస్త టైమ్ పడుతుంది. కెరీర్లో అనుకున్నది సాధించాక... దానిమీద దృష్టి పెడతాను! - సమీర నేలపూడి -
కోపముంటే నన్ను చంపాల్సింది...నా పిల్లలేం పాపం చేశారు?
ఏ బంధాన్నైనా తెంచుకోవడం సులభం... కలుపుకోవడం కష్టం. అది తెలిసే ఏ భార్యా తన వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని అనుకోదు. పిల్లల బాగు కోసమో... సమాజం ఏమంటుందో అన్న భయానికో ఆ అడుగు వేయదు. కానీ భర్త మృగంగా మారి హింసిస్తున్నప్పుడు కూడా అలా తలొగ్గి ఉండటం ఎంతవరకూ సబబు? జీవితమంతా కాపాడతాడనుకున్న మనిషి, జీవితాన్నే కాలరాస్తున్నప్పుడు... కీడెంచి మేలెంచకుండా మౌనంగా ఉండిపోవడం ఎంతవరకూ సమంజసం? కాస్త కష్టమైనా ముందే ఓ కఠిన నిర్ణయం తీసేసుకుంటే అనర్థాలు ఆగవా? మహిళల్ని సంరక్షించడానికే 498 ఎ చట్టాన్ని చేశానంటోంది ప్రభుత్వం. మహిళలు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఆ చట్టాన్ని రద్దు చేయమని అంటోంది పురుష సమాజంలోని ఓ వర్గం. అలా చేయడం ఎంతవరకూ సమర్థనీయం? ఇప్పుడివన్నీ మాట్లాడ్డానికి కారణం సుహాసిని. ఈ ప్రశ్నలన్నీ తలెత్తడానికి కారణం... ఆమె జీవితంలో సంభవించిన పెను విషాదం! సుహాసిని తన బిడ్డల కోసం నరకం లాంటి జీవితాన్ని స్తబ్దుగా నెట్టుకొచ్చింది. చివరికి ఆ స్తబ్దతే ఆమె జీవితంలో మిగిలింది. కట్టుకున్న భర్తే కాలయుముడై తన కన్నబిడ్డల ప్రాణాల్ని హరిస్తే... కన్నీరు మున్నీరవుతున్న ఆ కన్నతల్లితో ‘సాక్షి’ జరిపిన సంభాషణ ఇది! ఎలా ఉన్నారు సుహాసినిగారూ? సుహాసిని: కళ్లు మూసినా, తెరిచినా పిల్లలే గుర్తొస్తున్నారు. వాళ్లు నా పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. పోయినవారం... సరిగ్గా ఇదే రోజు (ఇంటర్వ్యూ చేసిన రోజు)... నా పిల్లల్ని నేను చూసుకున్న చివరి రోజు... అసలా రోజు ఏం జరిగిందో చెబుతారా? ఎప్పటిలానే వచ్చాడు. పిల్లల్ని తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత మళ్లీ ఒక్కడే వచ్చాడు. పిల్లలేరని అడిగితే, గుడిలో భోంచేస్తున్నారని చెప్పాడు. నన్నూ రమ్మన్నాడు. నేను రాను, పిల్లల్ని తీసుకు రమ్మని చెప్పాను. వెళ్లిపోయాడు. కానీ ఎంతసేపటికీ తీసుకురాలేదు. ఎన్ని మెసేజులు ఇచ్చినా రిప్లై లేదు. నాలుగున్నర వరకూ చూసి ఫోన్ చేశాను. పోలీసులు లిఫ్ట్ చేశారు. తను రైలుకింద పడి సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు. షాకయ్యాను. పిల్లలేమైపోయారో తెలియలేదు. నన్ను ఏడిపించడానికి ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడనుకున్నాను. కానీ తన ఫోన్లో ఉన్న మెసేజ్‌ని చూశాకగానీ అర్థం కాలేదు... జరిగిన దారుణం! పిల్లల్ని తీసుకెళ్లేపు్పుడు తనలో ఏ మార్పూ కన్పించలేదా? లేదు. ఎప్పటిలానే వచ్చాడు, తీసుకెళ్లాడు. ఇంత దారుణానికి ఒడిగడతాడనుకోలేదు. పిల్లలు సరదా పడ్డారని ఆ రోజు బ్యాంగ్‌బ్యాంగ్ సినిమాకి తీసుకెళ్తానన్నాను. దాంతో వెళ్లడానికి వాళ్లిష్టపడలేదు. వెళ్లిరండి, సినిమాకి సాయంత్రం తీసుకెళ్తాలే అని సర్దిచెప్పి పంపించాను. (కన్నీళ్లతో) కానీ వాళ్లు మళ్లీ రారని, నేనెప్పటికీ వాళ్లను చూడలేనని అనుకోలేదు. ఆయన ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నారంటారు? నేను తనకి దూరంగా వచ్చేశానని, తన దగ్గరకు వెళ్లడం లేదని నామీద కక్ష కట్టాడు. ఆ కసితోనే వాళ్లను పొట్టనబెట్టుకున్నాడు. వాళ్ల అమాయక ముఖాలు చూసయినా జాలి వేయలేదతనికి! తనలో హింసా ప్రవృత్తి ముందెప్పుడూ కనిపించలేదా? తను శాడిస్టని తెలుసు. కానీ పిల్లల్ని చంపుకునేంత కసాయివాడని మాత్రం తెలియలేదు. పెళ్లయిన నాటి నుంచీ నన్ను చిత్ర హింసలు పెట్టాడు. ఎంతసేపూ డబ్బు డబ్బు డబ్బు. సంపాదించినదంతా తన చేతిలోనే పెట్టేదాన్ని. నా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్కులు... అన్నీ తన దగ్గరే ఉండేవి. వారానికింత అని పాకెట్ మనీ ఇచ్చేవాడు. ఫోన్ రీచార్జ్ కూడా తనే చేసేవాడు. చివరికి నా సంతకాలు ఫోర్జరీ కూడా చేసేవాడు. అడిగితే చిత్రవధ చేసేవాడు. తొమ్మిదేళ్లు నరకం చూశాను. ఇంట్లోవాళ్లకు చెప్పలేదా? చెప్పినా సర్దుకుపొమ్మన్నారా? వాళ్లెప్పుడూ అలా చెప్పలేదు. నేనే సర్దుకుపోవడానికి ట్రై చేసేదాన్ని. మావాళ్లు మాట్లాడినప్పుడు బాగా చూసుకుంటాననేవాడు. వాళ్లు వెళ్లాక మళ్లీ మామూలే. అతని తరఫు వాళ్లయితే వాళ్ల ఎదురుగానే నన్ను కొడుతున్నా అడ్డుపడేవారు కాదు. మా అత్తగారుమాతోనే ఉండేది. నన్ను చిత్రహింస పెడుతున్నా ఏనాడూ కొడుకుని వారించలేదావిడ. ఇవాళ అతడు నా పిల్లల్ని పొట్టనబెట్టుకుంటే వాళ్లలో ఏ ఒక్కరూ ఫోన్ చేసి పలకరించలేదంటే ఏమనాలి! మీరొక ఇండిపెండెంట్ ఉమన్ అయివుండీ, పిల్లల్ని పెంచుకోగల స్తోమత ఉండీ ఆ హింస ఎందుకు భరించారు? ఇన్ని సంవత్సరాల తర్వాత కేసు ఎందుకు పెట్టారు? విడిపోతే ఎక్కువ సంపాదిస్తోందని అహంభావం అని అందరూ అనుకుంటారేమోనని భయం. దానికితోడు నా పిల్లలకు తండ్రిని దూరం చేయకూడదని కూడా అనుకున్నాను. కానీ తను పిల్లల్ని కూడా హింసించడం మొదలుపెట్టాడు. టీవీ చూడనిచ్చేవాడు కాదు. ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ ఏదీ తిననిచ్చేవాడు కాదు. రోజూ పప్పన్నమే. తినకపోతే కొట్టేవాడు. వాతలు పెట్టేవాడు. తట్టుకోలేక పోయాను. పైగా అతణ్ని చూసి వారిలోనూ అలాంటి ప్రవృత్తి పెరుగుతుందేమోనని భయపడ్డాను. అందుకే వచ్చేశాను. అయినా వదలకుండా వేధిస్తుంటే కేసు పెట్టక తప్పలేదు. కానీ అది తప్పుడు కేసంటూ ఉత్తరాలు రాశాడు కదా? తప్పుడు కేసు పెట్టేదాన్నే అయితే తొమ్మిదేళ్లు ఆ హింస భరించేదాన్ని కాదు. నేనెప్పుడూ కాపురాన్ని సరి చేసుకోవాలని, అతణ్ని మార్చుకోవాలనే చూశాను. ఇక భరించలేని పరిస్థితి వచ్చాక కేసు పెట్టాను. 498 ఎ చట్టాన్ని తీసేయమంటూ ఎవరెవరికో ఉత్తరాలు రాశాడు. కానీ ఆ చట్టం లేకపోతే నాలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి! చూశారుగా తనెంత దారుణమైన మనిషో! కాల్ రికార్డ్స్ చూస్తే... తాను చనిపోతానని ముందే హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది కదా? ఎప్పుడూ అలా బెదిరిస్తూనే ఉండేవాడు. నన్ను తన దారిలోకి తెచ్చుకోవడానికి అదొక అస్త్రం తనకి. అందుకే పట్టించుకోలేదు. అయినా ఆ రికార్డ్స్ ఇప్పటివి కావు. ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ రికార్డ్ చేసి, అన్నిటినీ అతికి మీడియా వాళ్లకు పంపించాడు. అందుకే అందులో నా మాటలేం సరిగ్గా ఉండవు. తను నన్ను బతిమాలుతున్న మాటలే ఉంటాయి. అవి కావాలని మాట్లాడి రికార్డ్ చేసుకున్నాడు, తాను మంచివాడినని నిరూపించుకోవడం కోసం. అందులో నిజమెంతో తెలుసుకోకుండా మీడియా ప్రసారం చేసేసింది. ఆ కాల్ రికార్డ్‌లో... కాగితం మీద సంతకం పెట్టనని పదే పదే అన్నాడు కదా, ఏమిటా కాగితం? తనకి నా మీదసలు ప్రేమే లేదు. నేను తన దగ్గరికి ఎందుకు వెళ్లను అని పంతం! అందుకే మా పెద్దవాళ్లు... నాకేదైనా అయితే తనదే బాధ్యత అని రాసిన కాగితం మీద సంతకం పెట్టమన్నారు. కానీ అతను పెట్టడని నాకు ముందే తెలుసు. ఎందుకంటే, హింసించడం అతడి తత్వం. అలా చేయకుండా అతడు ఉండలేడు. మరి ఇన్ని తెలిసీ పిల్లల కస్టడీకి మీరు ఎందుకు ఒప్పుకున్నారు? నేను ఒప్పుకోలేదు. అతను మంచివాడు కాదని మొత్తుకున్నాను. కానీ కోర్టు నా మాట వినలేదు. ఇప్పుడేమయ్యింది! నా పిల్లల్ని కోర్టు తెచ్చివ్వగలదా?! ఒకవేళ కేసు పెట్టకుండా ఉన్నా.. అతడితోనే కలిసున్నా పిల్లలు దక్కివుండేవారని ఇప్పుడనిపిస్తోందా? ఏది ఎందుకు జరిగిందో ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. నాకు నా పిల్లలు కావాలి. వాళ్లు లేని జీవితాన్ని నేను ఊహించలేకపోతున్నాను. వాళ్ల కోసం ఎన్నో భరించాను. వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు వాళ్లే లేకుండా పోయారు. ఇక నా జీవితానికి అర్థమేముంది? అతనికి అంతగా నామీద కోపముంటే నన్ను చంపాల్సింది. నా పిల్లల్నెందుకు చంపాలి? వాళ్లేం పాపం చేశారు? సుహాసిని సంధించిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి గురుప్రసాద్ బతికి లేడు. పోనీ ఆ ప్రశ్నకు సమాధానం మన దగ్గరయినా ఉందా?! అభం శుభం తెలియనివాళ్లు. అమ్మానాన్నలు ఎందుకు గొడవ పడుతున్నారో కూడా అర్థం చేసుకోలేని పసివాళ్లు. అన్యాయంగా అసువులు బాశారు. విరించి, విహారిలే కాదు... తల్లిదండ్రుల సమస్యలకి, వారి మధ్య కోపతాపాలకి మధ్య జీవితాలను, ప్రాణాలను కోల్పోతున్న చిన్నారులు చాలామందే ఉన్నారు. తల్లి పసుపుతాడు బిడ్డలకు ఉరితాడు అవ్వడం న్యాయమా? తండ్రి పంతం పిల్లల ప్రాణాలు తీసే యమపాశమవ్వడం ధర్మమా? ఆలోచించండి! సంభాషణ: సమీర నేలపూడి ఈ పరిస్థితిని ముందే అంచనా వేయవచ్చు! ఒక వ్యక్తి మానసిక స్థితిని బట్టి, ప్రవర్తనను బట్టి జరగబోయే అనర్థాలను ముందుగానే అంచనా వేయవచ్చు. భర్త హింసిస్తున్నా సమాజం ఏమనుకుంటుందోనన్న భయంతోనో, తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారన్న ఉద్దేశంతోనో మౌనంగా భరించే మహిళలు చాలామంది ఉన్నారు. అయితే అతడలా ప్రవర్తించడానికి కారణం వ్యక్తిత్వ లోపం కావచ్చు. ఏదైనా మానసిక వ్యాధి కావచ్చు. ఒక్కసారి వైద్యుడిని కలిసి భర్త ప్రవర్తన గురించి చెబితే, అతడికేదైనా మానసిక సమస్య ఉందా అన్నది వాళ్లు కనిపెడతారు. దానికి చికిత్స చేయిస్తే అతడు మంచిగా మారవచ్చు. ఇలాంటి ఘోరాలకు పాల్పడకపోవచ్చు. ఒకవేళ వారు ట్రీట్మెంట్కి ఒప్పుకోకపోతే, మెంటల్హెల్త్ యాక్ట్ (సెక్షన్ 23)ని ఆశ్రయించవచ్చు. దాని ప్రకారం... ఒక వ్యక్తిలో తనను తాను కానీ, ఇతరులను కానీ హింసించే లక్షణాలు ఉంటే అతడికి బలవంతంగా కూడా చికిత్స చేయించవచ్చు. కాబట్టి హింసాత్మక ప్రవృత్తి కనిపించగానే వైద్యుల సలహా తీసుకుంటే... ఇలాంటి ఘోరాలు జరగకుండా అడ్డుకునే అవకాశం దొరుకుతుంది. - డాక్టర్ శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై., సైకియాట్రిస్టు చట్టాల్ని తప్పు పట్టకూడదు! ఎంత నాణ్యమైన బియ్యంలోనైనా ఒకటో రెండో రాళ్లు ఉంటాయి. మంచి ముత్యాల్లో కూడా ఒకటి రెండు నకిలీవి తగులుతుంటాయి. అందుకని మొత్తాన్నీ పారేయలేం కదా! చట్టాలూ అంతే. అప్పటి పరిస్థితులను బట్టి, అంతవరకూ చూసిన కేసుల్ని బట్టి రూపొందుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఒకటో రెండో తప్పుడు కేసులు వచ్చాయని అసలు ఆ చట్టమే సరికాదంటే ఎలా? 498 ఎ అక్కడక్కడా దుర్వినియోగం అవుతోందన్నది నిజమే కావచ్చు. కానీ, కొందరలా చేశారని చట్టాన్నే లేకుండా చేస్తే నిజమైన బాధితుల పరిస్థితేం కావాలి! కాకపోతే మారుతున్న పరిస్థితులను బట్టి, మానసిక ప్రవృత్తులను బట్టి చట్టాల్లో మార్పులు జరగాలి. భర్త తనని వేధిస్తున్నాడని ఓ భార్య కేసు పెట్టినప్పుడు... అతడి ప్రవర్తన మీద నిఘా ఉంచాలి. ఆమె చెప్పింది నిజమని తేలితే ఆలస్యం చేయకుండా తీర్పు వెలువరించాలి. ఎందుకంటే ఆలస్యం జరిగేకొద్దీ మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. అది కొన్నిసార్లు హింసకు పాల్పడేలా ప్రేరేపిస్తుంది. ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణమవుతుంది! - ఎస్.ప్రదీప్ కుమార్, న్యాయవాది -
కెయిలీ... ఓ జవాబు దొరకని ప్రశ్న!
కేజీ అంత మంచిది కాదంటారు ఆమె గురించి తెలిసినవాళ్లు. పందొమ్మిదేళ్లకే గర్భం దాల్చి, కెయిలీకి జన్మనిచ్చింది కేజీ. కానీ ఆ బిడ్డకి తండ్రి ఎవరనేది తన తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. అయినా వాళ్లు కెయిలీని ప్రేమగా పెంచారు. కేజీ మాత్రం పాపను పట్టించుకునేదే కాదు. పబ్బులకీ, పార్టీలకీ తిరిగేది. దాంతో ఓ రోజు కూతురి మీద కోప్పడింది సిండీ. అది కేజీకి నచ్చలేదు. వెంటనే కూతుర్ని తీసుకుని వెళ్లిపోయింది. తన స్వేచ్ఛకు అడ్డుగా ఉందని ఆమే పాపను ఏదైనా చేసివుంటుందని అందరికీ అనుమానమే. కానీ ఎవరూ నిరూపించలేకపోయారు. దాంతో ఆమె కేసు నుంచి బయటపడింది. నిజాలు దేవుడికెరుక: జూన్ 15, 2008... అమెరికాలోని ఆరెంజ్ కౌంటీ... ఆఫీసులో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు డిటెక్టివ్ యూరీ మెలిష్. తలుపు దగ్గర శబ్దం కావడంతో అటు వైపు చూశాడు. యాభయ్యేళ్లు దాటిన ఓ మహిళ నిలబడి ఉంది. ‘‘సర్... నా పేరు సిండీ ఆంటోనీ...’’ అంది వినమ్రంగా. ‘‘ఓ మిసెస్ ఆంటోనీ... మీ కోసమే వెయిట్ చేస్తున్నారు. రండి, కూర్చోండి’’ అన్నాడు యూరీ నవ్వుతూ. ఆమె వచ్చి అతడికెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ‘‘ఏదో మాట్లాడాలని అన్నారు. చెప్పండి. ఏంటి విషయం?’’ యూరీ అలా అడగ్గానే దుఃఖం ముంచుకొచ్చింది సిండీకి. ‘‘నా రెండేళ్ల మనవరాలు కెయిలీ కనిపించడం లేదు సర్. ఏమయ్యిందో అర్థం కావడం లేదు’’ అంది బొంగురుపోయిన గొంతుతో.‘‘ఎప్పట్నుంచి?’’... వివరాలు నోట్ చేసుకోవడానికి పెన్నూ పుస్తకం చేతిలోకి తీసుకుంటూ అడిగాడు యూరీ. ‘‘నెల రోజుల్నుంచి?’’ ‘‘వ్వా...ట్... నెల రోజుల్నుంచీనా? మరిప్పటి వరకూ కంప్లయింట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు?’’‘‘తను మిస్సయ్యిందని నాకు తెలిస్తే కద సర్ కంప్లయింట్ ఇవ్వడానికి! వాళ్లమ్మ దగ్గరే ఉందనుకున్నాను. కానీ అది నిజం కాదని ఇప్పుడే తెలిసింది. తనేమయ్యిందో తెలియడం లేదు. మీరే నిజం తెలుసు కోవాలి... ప్లీజ్.’’‘‘అసలేం జరిగిందో వివరంగా చెప్పండి’’ అన్నాడు యూరీ. చెప్పడం ప్రారంభించింది సిండీ. ‘‘తెల్లవారగానే వచ్చి గార్డెన్లో పడిపోతావ్. విసుగైనా రాదా జార్జ్ నీకు’’... జ్యూస్ గ్లాసుతో వచ్చిన సిండీ విసుక్కుంది. ‘‘నో డియర్... నిన్ను ప్రేమించడం తర్వాత నాకు అంత ఇష్టమైన పని గార్డెనింగే’’... కన్నుగీటాడు జార్జ్. ‘‘చాల్లే... దీనికేం తక్కువ లేదు’’... ముద్దుగా విసుక్కుని, జ్యూస్ అతడి చేతిలో పెట్టి గేటువైపు నడిచింది. గేటుకు తగిలించివున్న పోస్ట్‌బాక్స్‌లో ఉన్న ఉత్తరం తీసుకుని వెనక్కి వచ్చింది. దాన్ని తెరచి చూస్తూనే... ‘‘జార్జ్, ఇలారా’’ అంది కంగారుగా. గబగబా ఆమె దగ్గరకు వచ్చి, ఉత్తరం అందుకుని చదివాడు. ‘‘మిస్టర్ అండ్ మిసెస్ జార్జ్ ఆంటోనీ... మీ అమ్మాయి కేజీ కారు ఇక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో, అడవిని ఆనుకుని ఉన్న రోడ్డులో పార్క్ చేసివుంది. వెళ్లి తెచ్చుకోండి.’’ దాన్ని చదువుతూనే భృకుటి ముడిచాడు జార్జ్. మనసు ఏదో కీడు శంకించింది. వెంటనే కూతురికి ఫోన్ చేశాడు. కనెక్ట్ కాలేదు. దాంతో పనివాణ్ని తీసుకుని వడివడిగా వెళ్లాడు. కాస్త నిర్మానుష్యంగా ఉన్న రోడ్డులో, ఓ పక్కగా పార్క్ చేసివుంది కేజీ కారు. డోరు లాక్ చేసి లేక పోవడంతో తెరచి చూశాడు. లోపల కేజీ పర్సు ఉంది. కేజీ కూతురు కెయిలీ ఆటబొమ్మలు కూడా ఉన్నాయి. కారు ఉన్న పరిస్థితిని బట్టి, దాన్ని అక్కడ పార్క్ చేసి చాలా రోజులయ్యిందనిపిస్తోంది. దానికి తోడు ఒకలాంటి వెగటు వాసన వస్తోంది. ‘‘రాబర్ట్... డిక్కీ చెక్ చెయ్’’ అన్నాడు ఆ వాసన ఏమిటా అని అంచనా వేస్తూ. యజమాని ఆదేశం అందగానే వెళ్లి చెక్ చేశాడు రాబర్ట్. ఏమీ లేదందులో. మరి వాసన ఎందుకొస్తోందో అర్థం కాలేదు. కారు తీసుకుని ఇంటికి వచ్చేశారు. ‘‘ఎందుకు మమ్మీ కంగారు పడతావ్? నా కారు కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఎవరో ఎత్తుకుపోయారు. కంప్లయింట్ కూడా ఇచ్చాను. వాళ్లే అక్కడ వదిలేసి ఉంటారు.’’కూతురి మాట నమ్మబుద్ధి కాలేదు సిండీకి. ‘‘కారు సంగతి సరే. ముందు కెయిలీని పిలు. నేను దానితో మాట్లాడి చాలా రోజులైంది’’ అంది కసిరినట్టుగా. ‘‘తను బేబీ సిట్టర్ దగ్గర ఉంది మామ్.’’ ‘‘షటప్ కేజీ... నెల రోజులుగా ఇదే చెప్తున్నావ్. రాత్రీ పగలూ కూడా పాపని అక్కడే ఉంచేస్తున్నావా ఏంటి? నేను దానితో వెంటనే మాట్లాడాలి.’’ ‘‘ఓ మామ్... యు ఆర్ క్రేజీ... ఎంత చెప్పినా అర్థం కాదు నీకు’’ అంటూనే ఫోన్ డిస్ కనెక్ట్ చేసింది కేజీ. దాంతో ఏదో అనుమానం కలిగింది సిండీకి. వెంటనే కంప్లయింట్ ఇవ్వడానికి బయలుదేరింది. సిండీ చెప్పిదంతా విని ఆలోచనలో పడ్డాడు యూరీ. కేజీ ఏదో దాచిపెడుతోందనిపించింది. దాంతో సిండీని తీసుకుని కేజీ దగ్గరకు బయలుదేరాడు. అరగంట తిరిగేసరికి ఆమె ఇంటి దగ్గరున్నాడు. పోలీసులతో వచ్చిన తల్లిని చూస్తూనే షాకయ్యింది కేజీ. ‘‘ఏంటి మమ్మీ ఇదంతా’’ అంది షాక్ తిన్నట్టుగా. ‘‘నేను చెప్తాను కేజీ ఆంటోనీ... మీ అమ్మగారు తన మనవరాలి కోసం బెంగ పెట్టుకున్నారు. తనని చూపిద్దామని తీసుకొచ్చాం. ఓసారి పాపని పిలవండి.’’ యూరీ మాటలు వింటూనే తత్తర పడింది కేజీ. ‘‘పాప లేదు.. బేబీ సిట్టర్ జేనీ ఫెర్నాండెజ్ దగ్గర ఉంది’’ అంది తడబడుతూ. ‘‘ఏం ఫర్లేదు. అక్కడికే వెళ్దాం’’ అన్నాడు యూరీ కూల్‌గా. కదల్లేదు కేజీ. ఏదో నసిగింది. బిత్తర చూపులు చూసింది. టెన్షన్‌గా అటూ ఇటూ తిరిగింది. ‘‘ఇక చాలు కేజీ... ఏం జరిగిందో చెప్పేస్తే మంచిది’’... ఈసారి యూరీ మాట కఠినంగా వచ్చింది. దాంతో కేజీ కంగారుపడింది. ‘‘అదీ... మరీ... నేను... మమ్మీ వాళ్ల దగ్గర్నుంచి వచ్చేశాక నా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి టూర్‌కి వెళ్లాలనుకున్నాను. అందుకే పాపని జేనీ దగ్గర ఉంచాను. కానీ తను పాపను తీసుకుని ఎక్కడికో పారిపోయింది. వెతికినా దొరకలేదు.’’ అది వింటూనే ఆవేశంగా వెళ్లి కూతురి చెంప పగులగొట్టింది సిండీ. ‘‘బుద్ధి లేదా నీకు? పాప విషయంలో ఇంత నిర్లక్ష్యమా?’’ అంటూ చీవాట్లు వేసింది. యూరీకి మాత్రం ఏదో తేడా కొట్టింది. కేజీ చెబుతోన్నదాంట్లో నిజం లేదని అతడి అనుభవం పదే పదే చెప్పసాగింది. దాంతో తన టీమ్‌ని రంగంలోకి దింపాడు. అతడు అనుమానించిందే నిజమైంది. మూడు రోజుల తర్వాత... సిండీ, జార్జ్ల ఇంటి వెనుక ఉన్న పెద్ద తోటలో... ఓ పాలిథీన్ సంచిలో ఒక పుర్రె, కొన్ని ఎముకలు దొరికాయి. అవి కెయిలీవే అని తెలుసుకోవడానికి యూరీకి పెద్ద సమయం పట్టలేదు. వెంటనే కేజీ చేతికి బేడీలు వేశాడు. మూడేళ్ల తర్వాత... జూలై 17, 2011... ‘‘తన కూతురు కెయిలీని కేజీయే హత్య చేసిందనడానికి తగిన ఆధారాలు లేవు. కాకపోతే కూతురి అదృశ్యం గురించి గోప్యంగా ఉంచడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటివాటికి శిక్షార్హురాలు. కానీ ఇప్పటికే మూడేళ్లు జైల్లో గడిపింది కాబట్టి ఆమెను విడుదల చేయడమైనది.’’ తీర్పు వింటూనే అమెరికా మొత్తం షాకైపోయింది. న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ఎలా ఎంచిందో ఎవరికీ అర్థం కాలేదు. ఎందుకంటే, ఏ రకంగా చూసినా కేజీయే నేరస్తురాలనడానికి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. గార్డెన్లో దొరికిన కెయిలీ పుర్రెను పరిశీలించినప్పుడు నోటిమీద టేపు కనిపించింది. ఎముకల మీద కూడా టేపు ఉంది. అంటే అరవకుండా, కదలకుండా పాపను బంధించారు. అధిక మొత్తంలో క్లోరోఫామ్ ఇచ్చి, ఊపిరాడకుండా చేసి హత్య చేశారని పోస్ట్‌మార్టమ్ నివేదికలో ఉంది. దానికి తగ్గట్టుగా కేజీ కారులో క్లోరోఫామ్ ప్యాకెట్ కనిపించింది. కేజీ కంప్యూటర్ హిస్టరీని చెక్ చేసినప్పుడు... క్లోరోఫామ్ గురించి ఆమె నలభైసార్లకు పైగా సెర్చ్ చేసినట్టు తెలిసింది. పైగా ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే. పాపను జేనీ ఫెర్నాండెజ్ దగ్గర పెట్టానంది. కానీ అసలలాంటి వ్యక్తే లేదని విచారణలో తేలింది. అడిగితే.. ‘ఎవరో స్త్రీ ప్లాన్ ప్రకారం నాతో ఆ పేరు చెప్పిందేమో. నేను నమ్మి పాపను అప్పగించాను, ఎత్తుకుపోతే నేనేం చేయను’ అంది. తాను యూనివర్సల్ స్టూడియోస్‌లో పని చేస్తున్నానని కేజీ పోలీసులతో చెప్పింది. అది కూడా అబద్ధమని, ఆమె ఉద్యోగం పోయి అప్పటికి చాలా కాలమే అయ్యిందని తెలిసింది. కారును ఎత్తుకుపోవడం అనేది కూడా నమ్మశక్యంగా అనిపించలేదు. కారు అక్కడుందని కేజీ తల్లిదండ్రులకు ఉత్తరం ఎవరు పంపారో కూడా తెలీలేదు. దానికి తోడు విచారణ సమయంలో కేజీ ప్రవర్తన సందేహాలను పెంచింది. కూతుర్ని పోగొట్టుకున్న బాధ లేకుండా నవ్వుతూ తుళ్లుతూ ప్రవర్తించడం ఆశ్చర్యపరిచేది. ఆమెకు వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తుంటే, ప్రతి విషయమూ అనుమానాస్పదంగా కనిపిస్తుంటే కేజీని నిర్దోషి అని ఎలా అంటారు అంటూ చాలామంది న్యాయస్థానాన్ని, ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. కేజీ ఇప్పుడు స్వేచ్ఛగా, సంతోషంగా జీవిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇన్సెమినేషన్ ద్వారా మరో ఇద్దరు పిల్లలకు జన్మనివ్వబోతోంది. కెయిలీ గురించి ఓ తల్లిగా ఆమె ఎప్పుడూ ఎక్కడా మాట్లాడదు. కానీ ప్రపంచం మాత్రం ఇప్పటికీ కెయిలీ గురించి మాట్లాడుతోంది. ఆమె పట్ల జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెడుతోంది. ముద్దులొలికే ఆ చిన్నారి ఉదంతం... జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది! అయితే కెయిలీ కేసు చూసిన తర్వాత అమెరికా ప్రభుత్వం ‘కెయిలీ లా’ పేరుతో ఓ చట్టాన్ని రూపొందించింది. దాని ప్రకారం... పన్నెండేళ్లలోపు పిల్లలు ఉన్నట్టుండి కనిపించకుండా పోయినా, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినా, ఇరవై నాలుగ్గంటల లోపు పోలీసులకు తెలియజేయాలి. లేదంటే మొదటి అనుమానితులు తల్లిదండ్రులే అవుతారు. ఈ చట్టాన్ని కొందరు తప్పుబట్టారు. తల్లిదండ్రుల్ని అనుమా నించడం కరెక్ట్ కాదు అన్నారు. కానీ ప్రభుత్వం తమ చట్టాన్ని సమర్థించుకుంది. చిన్నపిల్లలు అదృశ్యమవడం, వారి మరణాలు ఎక్కువ కావడాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ చట్టాన్ని అమలు చేసి తీరాలని నిర్ణయించుకుంది. - సమీర నేలపూడి -
అందుకే పెళ్లి చేసుకోలేదు!
సంభాషణం: అమాయకమైన ఇల్లాలిగా భర్తను విసిగించినా... ఉదాత్తమైన తల్లి పాత్రలో కన్నీళ్లు తెప్పించినా... కమెడియన్‌గా కడుపుబ్బ నవ్వించినా... ఏం చేసినా ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తారు రజిత. హీరోయిన్గా కెరీర్ మొదలు పెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది సినిమాలు చేసిన ఆమె... తన నట ప్రయాణం గురించి, తన అనుభవాల గురించి ఇలా పంచుకున్నారు. మీ కెరీర్‌కి పునాది ఎలా పడింది? మాది కాకినాడ. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మే పెంచి పెద్ద చేసింది. అమ్మ చెల్లెళ్లు కృష్ణవేణి, రాగిణి... ఇద్దరూ నటీమణులే. పదిహేనేళ్లున్నప్పుడు ఓసారి వేసవి సెలవుల్లో మద్రాస్ వెళ్లాను పిన్ని దగ్గరికి. షూటింగ్ చూడ్డానికి వెళ్తే పరుచూరి గోపాలకృష్ణ చూసి నటిస్తావా అనడిగారు. నటించను, చదువుకోవాలి అని చెప్పాను. కానీ ఆయన పట్టుబట్టి, దర్శకుడు రాఘవేంద్రరావుగారితో చెప్పి, ‘అగ్నిపుత్రుడు’లో ఏఎన్నార్‌గారి కూతురి పాత్ర చేయించారు. తర్వాత నేను మళ్లీ చదువులో పడిపోయాను. కానీ వరుసగా అవకాశాలు వస్తుండటంతో, ఎందుకు వదులుకోవాలి అనిపించింది. అందుకే ఇంటర్‌తో చదువు ఆపేసి, సినిమా రంగంవైపు వచ్చేశాను. హీరోయిన్‌గానూ చేసినట్టున్నారు...? అవును. ఒరియా, మలయాళం, తమిళ భాషల్లో చేశాను. కానీ పరాయి భాషలో చేస్తే ఎవరికి తెలుస్తుంది, మన భాషలో చేస్తే మనవాళ్లు గుర్తుపడతారు కదా అనిపించింది. అందుకే అక్కడ హీరోయిన్ పాత్రలు వదులుకుని, ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడటానికి సిద్ధపడ్డాను. పేరు తెచ్చిన పాత్రలు...? ‘పెళ్లికానుక’లో పాత్ర నాకు చాలా ఇష్టం. దానికి నంది అవార్డును కూడా అందుకున్నాను. ‘మల్లీశ్వరి’లో భరణిగారిని విసిగించే అమాయక భార్య పాత్ర, కొత్త బంగారులోకం, అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లోని పాత్రలు బాగా పేరు తెచ్చాయి. చేయకుండా ఉండాల్సింది అనుకునే పాత్ర ఏదైనా ఉందా? ‘కబడ్డీ కబడ్డీ’లో చేసింది. కొత్త దర్శకులైతే తప్ప నేను నా పాత్ర గురించి అడగను. నాకెలాంటివి ఇవ్వాలో వారికి తెలుసులే అనుకుంటాను. ఆ సినిమాకీ అదే చేశాను. తీరా షూటింగుకు వెళ్లాక నా పాత్ర అసభ్యంగా ఉంది. చేయలేనని అన్నాను. అయితే ఔట్‌డోర్ షూటింగ్, అప్పటికప్పుడు ఆర్టిస్టును మార్చలేని పరిస్థితి. అందుకే చేయక తప్పలేదు. కాకపోతే నాకోసం కాస్త మార్చారులెండి. ‘నవ్వుతూ బ్రతకాలిరా’లో చేసింది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే! కోవై సరళకు బ్రహ్మానందంలాగా రజితకెవరు తగిన జోడీ? ఆహుతీప్రసాద్గారితో నా జోడీ బాగుంటుందని చాలామంది అంటుంటారు. మేమిద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. అన్నీ బాగా పండాయి. నటిగా మీలో మైనస్లున్నాయా? నా హైట్. కమెడియన్లకు జోడీగా చేసినప్పుడు ఫర్లేదు కానీ హీరోయిన్లకు తల్లిగా చేసినప్పుడు మాత్రం, వాళ్ల పక్కన చాలా పొట్టిగా కనిపిస్తుంటాను. అలాంటప్పుడు ఇంకాస్త హైట్ ఉంటే బాగుణ్ననిపిస్తుంది. డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా? రమాప్రభగారు ఓ సినిమాలో రెండు జడలు వేసుకుని అమాయకంగా నటించారు. అలాంటిదొకటి చేయాలనిపిస్తుంది. అయితే ఆ అవకాశం దొరకడం కష్టమే. ఎందుకంటే, మన పరిశ్రమలో మగవారితో చేయించినంత కామెడీ, ఆడవాళ్లతో చేయించడం లేదు. ఎందుకంటారు? చాలా కారణాలున్నాయి. మేల్ కమెడియన్లు ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంది. దాంతో వాళ్లకోసం రకరకాల పాత్రలు పుట్టిస్తున్నారు. కానీ మాకు ఆ అవకాశమే ఉండటం లేదు. తల్లి అంటే ఇలానే ఉండాలి, వదిన ఇలానే ఉండాలి అని ఫిక్స్ చేసేస్తారు. దాంతో మాకు ఓ పరిధి మేరకే నటించే చాన్స్ ఉంటుంది. దానికి తోడు ఒకప్పటిలాగా ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ ఉండటం లేదు కాబట్టి పాత్రలు తక్కువే ఉంటున్నాయి. ఉన్నవాటికి కూడా ఏ ముంబై నుంచో, చెన్నై నుంచో, బెంగళూరు నుంచో ఆర్టిస్టుల్ని తీసుకొస్తారు. ఈ మధ్య అయితే హీరోలకు తల్లిగా, వదినగా చేయడానికి ఒకనాటి హీరోయిన్లను పెడుతున్నారు. అవి కూడా మాకు ఇవ్వకపోతే మేము ఏమైపోవాలి? మీ పిన్ని రాగిణిలాగా సీరియల్స్ కోసం ప్రయత్నించలేదా మీరు? లేదు. మంచి పాత్ర అని ‘అపరంజి’లో మాత్రం నటించాను. ఆ తర్వాత వీలు కాలేదు. కానీ సమయం వచ్చినప్పుడు నటించడానికి నాకే అభ్యంతరమూ లేదు. మీ వ్యక్తిగతం జీవితం గురించి..? చెప్పుకోదగ్గ ప్రత్యేకతలేమీ లేవు. నాకు మొదట్నుంచీ ఆథ్యాత్మిక ధోరణి ఎక్కువ. అందుకే పెళ్లి చేసుకోలేదు. బ్రహ్మకుమారిగా ఉండిపోయాను. షూటింగ్ లేకపోతే ఆధ్యాత్మిక చింతనలోనే ఎక్కువ గడుపుతాను. పార్టీలకవీ వెళ్లను. నా ఫ్రెండ్స్ ప్రగతి, సన, సురేఖావాణిలతో ఎప్పుడైనా సరదాగా గడుపుతాను. అంతే! - సమీర నేలపూడి -
లా లొరోనా
విన్న ప్రతిదాన్నీ నమ్మలేం. నమ్మిన ప్రతిదీ నిజమనీ చెప్పలేం. ముఖ్యంగా దెయ్యాల విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. దెయ్యాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ, వాటి గురించిన కథనాలు మాత్రం కోకొల్లలుగా ఉన్నాయి. వాటిలో ఇదొకటి... లా లొరోనా గురించి ఇంకో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇద్దరు పిల్లలకు తల్లయిన తర్వాత మారియా మరో వ్యక్తితో ప్రేమలో పడిందని, అతడి కోసం తన భర్తను, పిల్లలను కూడా చంపేసిందని, అప్పటికీ అతడు తనని స్వీకరించకపోవడంతో అవమానం భరించలేక మరణించిందని కొందరు అంటుంటారు. చనిపోయేముందు తన పిల్లలను చంపినందుకు ఎంతో కుమిలిపోయిందని, అందుకే ఆమె ఆత్మ వాళ్ల కోసం పరితపిస్తోందని చెబుతుంటారు. అయితే ఈ కథనాన్ని నమ్మేవాళ్లు తక్కువమందే ఉన్నారు. మెక్సికో నగరం (యు.ఎస్.ఎ)... టేబుల్ మీద భోజనాలను సర్దుతోంది బ్రెండా. ‘‘ఇవాన్... భోజనానికి రా’’ అంది ప్లేటులో ఆహారాన్ని వడ్డిస్తూ. ‘‘ఆ ఆ వస్తున్నా’’ అంటూ వచ్చి కూర్చున్నాడు ఇవాన్. అటూ ఇటూ చూసి... ‘‘బెన్ ఎక్కడ?’’ అన్నాడు. ‘‘ఏం చెప్పమంటారు మీ సుపుత్రుడి గురించి? ఉన్నచోట ఉండడు కదా! ఆడుకోవడానికని వెళ్లాడు. ఇంతవరకూ రానేలేదు’’ అంది తను కూడా కూర్చుంటూ. ‘‘రాకపోతే అలా వదిలేయడమేనా... నాకు చెబితే తీసుకొస్తాను కదా’’ అంటూ లేచాడు ఇవాన్.‘‘అరే... అంత కంగారుపడతావెందుకు? రోజూ బయటికెళ్లి ఆడుకోవడం వాడికలవాటే కదా’’ అంది బ్రెండా భర్తవైపు చూస్తూ. ‘‘ఆడుకోవడం అలవాటే కానీ ఈ టైమ్ వరకూ ఆడుకోవడం అలవాటు లేదు కదా... టైమ్ చూడు, తొమ్మిది దాటుతోంది’’ అంటూనే చెప్పులేసుకుని బయటకు నడిచాడు ఇవాన్. నిట్టూర్చింది బ్రెండా. ‘‘వాడూ మాట వినడు. ఈయనా వినడు. మధ్యలో నేను చస్తున్నాను’’ అంటూ భర్తకు భోజనం వడ్డించిన ప్లేటు మీద మరో ప్లేటు బోర్లించి లేచింది. భర్త, కొడుకు కోసం ఎదురుచూస్తూ గుమ్మం దగ్గరే కూలబడింది. అరగంట తర్వాత వచ్చాడు ఇవాన్... ఒంటరిగా. అతడి వెంట పిల్లాడు లేకపోవడం చూసి కంగారుపడింది బ్రెండా. ‘‘ఒక్కడివే వచ్చావేంటి? బెన్ ఏడీ?’’ అంది ఆతృతగా. మౌనంగా ఆమె ముఖంలోకి చూశాడు ఇవాన్. ఆమె చూపుల్లో కనిపిస్తోన్న ఆదుర్దాను చూసి మనసు అదోలా అయిపోయింది అతనికి. ‘‘బెన్ కనిపించలేదు’’ అన్నాడు నసుగుతున్నట్టుగా. ‘‘కనిపించడం లేదా? అంటే ఏంటి నీ ఉద్దేశం? మిసెస్ ఫెర్నాండాని అడిగావా... రోజూ వాళ్లింటికే వెళ్తాడు. వాళ్లమ్మాయితోనే ఆడుకుంటాడు.’’‘‘అక్కడికే వెళ్లాను. కానీ వాడు ఎప్పుడో వెళ్లిపోయాడని చెప్పిందావిడ. ఆ చుట్టుపక్కలంతా కూడా వెతికాను. ఎక్కడా కనిపించలేదు.’’ఆ మాట వింటూనే బావురుమంది బ్రెండా. ‘‘ఏమైపోయాడు? నా చిట్టితండ్రి ఎక్కడికెళ్లిపోయాడు? ఇవాన్... ఏం చేస్తావో తెలీదు. నాకు నా బెన్ కావాలి. తెచ్చివ్వు. వెంటనే తెచ్చివ్వు’’ అంటూ భర్తను వాటేసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇవాన్‌కి. మెల్లగా అన్నాడు... ‘‘ఒకవేళ మారియా ఏమైనా...’’ ఉలిక్కిపడింది బ్రెండా. గుండె ఝల్లుమంది. ఆ వణుకు ఒళ్లంతా పాకినట్టయ్యింది. ‘‘మారియానా? ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు?’’ అంది ఆవేశంగా భర్త కాలర్ పట్టుకుని. ‘‘కూల్ బ్రెండా... ఆవేశపడకు. మనింటికి రెండు దారులున్నాయి. మామూలు దారిలో వస్తే సమస్య లేదు. కానీ ఒకవేళ త్వరగా వచ్చేద్దామని బెన్ ఆ దారిలోకి కనుక వెళ్లుంటే...’’ ‘‘లేదు... అలా జరగదు’’ భర్త మాట పూర్తవ్వకుండానే అరిచింది బ్రెండా. ‘‘నువ్వంటున్నది నిజం కాదు ఇవాన్.. అలా జరగదు. జరగడానికి వీల్లేదు.’’ పిచ్చిదానిలా అరుస్తూ ఏడుస్తోన్న భార్యను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు ఇవాన్‌కి. గబగబా వెళ్లి చుట్టపక్కల వాళ్లను తీసుకొచ్చాడు. అందరూ కలిసి అక్కడికి కాస్త దూరంలో ఉన్న చెరువు దగ్గరకు చేరుకున్నారు. లాంతర్లు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు పట్టుకుని అంతా వెతికారు. ఈత బాగా వచ్చిన కొందరు చెరువులోకి కూడా దిగి చూశారు. ఫలితం శూన్యం. బెన్ జాడ దొరకలేదు. ‘‘ఇక లాభం లేదు. ఇంతకు ముందు జరిగినట్టుగానే ఇప్పుడూ జరిగింది’’ అన్నాడో వ్యక్తి పెదవి విరుస్తూ. ‘‘అవును. ఇక బెన్ జాడ తెలుసుకోవడం అసాధ్యం’’ అన్నాడు మరో వ్యక్తి. ‘‘అయినా మారియా చేతికి చిక్కినవాళ్లు మళ్లీ కనిపించడం ఎప్పుడైనా జరిగిందా’’ అందో మహిళ. ఆ మాటలు వింటూనే బేజారైపోయింది బ్రెండా. ‘బెన్’ అని అరుస్తూ సొమ్మసిల్లిపోయింది. ఆమెను చూసి అందరి మనసుల్లోనూ జాలి నిండిపోయింది. కానీ ఎవరేం చేయగలరు? అందుకే ఒక్కొక్కరుగా అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ బెన్ ఏమైనట్టు? ఏదో చేసింది అంటోన్న ఆ మారియా ఎవరు? ఆమె అతడిని ఏం చేసింది? తెలుసుకోవడం తేలికే. కానీ తెలుసుకున్న విషయాన్ని నమ్మడానికి మాత్రం చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే... మారియా మనిషి కాదు... దెయ్యం! మెక్సికో నగరానికి వెళ్లి, మారియా తెలుసా అని అడిగి చూడండి... అక్కడివాళ్లు ఉలిక్కిపడతారు. అంతగా వారిని భయపెట్టిందా దెయ్యం. మెక్సికో నగరంలోని ప్రధాన రహదారి మీద రాత్రిపూట ఒక సమయం దాటిన తర్వాత ప్రయాణించాలంటే భయపడేవాళ్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే... ఎక్కడైనా మారియా కనిపిస్తుందేమోనని భయం! చీకటి పడిన తర్వాత తమ పిల్లలను బయటకు పంపించేందుకు వాళ్లు అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే... వాళ్లని మారియా ఎత్తుకుపోతుందేమోనని! ఈ భయం వెనుక శతాబ్దం ముందునాటి కథ ఉంది. వందేళ్లకు పూర్వం... మెక్సికో నగరంలో మారియా అనే పేద యువతి నివసించేది. ఆమెకు తన పేదరికాన్ని చూసి చాలా వేదనగా ఉండేది. చినిగిన బట్టలు, నిండని కడుపులు, ఆగని కన్నీళ్లు ఆమెకు నచ్చేవి కావు. ఆ నిజాలను భరించలేక ఎక్కువగా ఊహల్లో విహరించేది. తన కోసం ఓ ధనికుడు గుర్రం మీద వస్తాడని, తనను మనువాడతాడని, మంచి జీవితాన్ని ఇస్తాడని కలలు గనేది. నిజంగానే ఓ రోజు ఓ ధనికుడు వ్యాపార నిమిత్తం గుర్రంమీద అక్కడకు వచ్చాడు. అతడిని చూస్తూనే వలపుల తోటలో విహారం మొదలుపెట్టింది మారియా. ఆమె కళ్లు రోజూ అతడినే వెతికేవి. అతడు వస్తున్నాడేమోనని దారివైపే చూస్తూ కాలం గడిపేది. గుర్రపు పాదాల సవ్వడి కోసం చెవులు రిక్కించేది. అతడు కనిపించిన ప్రతిసారీ అతడి కంట్లో పడాలని అక్కడక్కడే తచ్చాడేది. ఎలాగైతేనేం... ఆ యువకుడి దృష్టిని తనవైపు తిప్పుకుంది. దాంతో వ్యాపారం పెట్టేందుకు వచ్చిన అతగాడు... ఆమెను పెళ్లాడి ఆ నగరంలోనే కాపురం పెట్టాడు. ఆమె సౌందర్యారాధనలో మునిగి తేలాడు. ఇద్దరు బిడ్డలకు తండ్రయ్యాడు. అయితే ఆ తర్వాత అతడి మనసు మళ్లిపోయింది. మనసు కొత్త ఆనందాల కోసం వెతకసాగింది. ఒక డబ్బున్న మహిళను మనువాడేందుకు పరితపించాడు. అది తెలియని మారియా... వ్యాపార పనుల్లో పడి భర్త తనకోసం సమయం కేటాయించలేకపోతున్నాడేమో అనుకునేది. ఎలాగైనా అతడిని ఎప్పటిలాగా దగ్గర చేసుకోవాలని నానా తంటాలు పడేది. కానీ ఓరోజు పరస్త్రీతో తన భర్త నవ్వుతూ మాట్లాడటం దూరం నుంచి చూసింది. అతడు ఆమెను ముద్దాడటం భరించలేకపోయింది. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక, తన పిల్లల మీద చూపించింది. చెరువు దగ్గర ఆడుకుంటున్న వాళ్లిద్దరినీ నీటిలోకి తోసేసింది. ఆ తర్వాత తను ఎంత తప్పు చేసిందో అర్థమైంది ఆమెకి. పిల్లల కోసం అల్లాడిపోయింది. కళ్లముందే నీటిలో కొట్టుకుపోతున్న వాళ్లిద్దరినీ కాపాడుకోవాలని పరితపించింది. కానీ పూర్తిగా విఫలమయ్యింది. ఆమె చూస్తూండగానే వాళ్లు జలసమాధి అయిపోయారు. తాను ఎంతటి పాతకానికి ఒడిగట్టిందో తలచుకుని తలచుకుని కుమిలిపోయిందామె. అక్కడే కొన్ని గంటల పాటు ఏడ్చి ఏడ్చి, గుండె పగిలి చనిపోయింది. మారియా మృతదేహాన్ని అక్కడే గొయ్యి తీసి పాతిపెట్టారు చుట్టుపక్కలవాళ్లు. ఆ రోజు రాత్రి... అందరూ నిద్రపోతుండగా... ఉన్నట్టుండి ఓ ఏడుపు వినిపించింది.. ఎంతో భయంకరంగా, బాధాకరంగా! ‘‘బాబూ, ఏమైపోయార్రా, ఎక్కడున్నార్రా, నా దగ్గరకు రండిరా’’ అంటూ ఒకటే అరుపులు, ఏడుపులు! అందరూ ఉలిక్కిపడి లేచారు. ఏడ్చేది ఎవరా అని వెతికారు. ఎవరూ కనిపించలేదు. అలా రోజూ జరగసాగింది. దాంతో... ఆ ఏడుస్తోంది ఎవరో కాదు, మారియాయేనని అందరికీ అర్థమైంది. తెల్లని గౌను వేసుకుని, జుత్తు విరబోసుకుని చాలామందికి కనిపించేదామె. దాంతో ఆమె దెయ్యమైందని అర్థమైపోయింది అందరికీ. అందుకే ఆమెకు ‘లా లొరోనా’ అని పేరు పెట్టారు. అంటే... ‘వీపింగ్ ఉమన్ (దుఃఖించే మహిళ)’ అని అర్థం! అది మాత్రమే కాదు... ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పిల్లలు మాటిమాటికీ జడుసుకునేవారు. జ్వరాలు తెచ్చుకునేవారు. నిద్రలో పీడకలలు వచ్చి పెద్దగా ఏడ్చేవారు. అదంతా మారియా వల్లనేననే ప్రచారం మొదలైంది. పైగా కొందరు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా మాయమైపోవడం మొదలైంది. దాంతో మారియా పిల్లల్ని ఎత్తుకుపోతోందనే భయం మొదలైంది జనాల్లో. అయితే ఇదంతా భ్రమ అనేవాళ్లు లేకపోలేదు. ఇది ముమ్మాటికీ నిజమేనని నొక్కి వక్కాణించేవాళ్లూ ఉన్నారు. వీడియోలు, ఫొటోల్ని సాక్ష్యంగా చూపించేవాళ్లూ ఉన్నారు. కానీ దేన్ని నమ్మాలి అనేది... వారి వారి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది కదా! అందుకే లా లొరోనా కథ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది! - సమీర నేలపూడి -
పాతిక రూపాయలిచ్చినా నటిస్తాను!
సంభాషణం: కామెడీని పండించడంలో శ్రీనుకి ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అదే ఆయనను ఈ రోజు బిజీ ఆర్టిస్టును చేసింది. విక్రమార్కుడు, మిస్టర్ ఫర్ఫెక్ట్, గబ్బర్‌సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాల్లో తన విభిన్నమైన యాసతో, వైవిధ్య భరితమైన హావభావాలతో కడుపుబ్బ నవ్వించిన శ్రీను చెప్పిన విశేషాలివి... నటుడు అవ్వాలని అయ్యారా? అనుకోకుండా అయ్యారా? అది చెప్పాలంటే పెద్ద ఫ్లాష్‌బ్యాక్ చెప్పాలి. నేను ‘తగరపు వలస’లో పుట్టాను. హైదరాబాద్‌లో పెరిగాను. చిన్నప్పట్నుంచీ చదువు కంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీదే ఆసక్తి. ఓసారి నేను ఇంట్లో డ్యాన్స్ చేస్తుంటే అమ్మ చూసింది. ‘డ్యాన్స్ అంటే ఏమిటో చూపిస్తాను చూడు’ అంటూ క్లాసికల్ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. సాధారణ గృహిణిలా ఉండే అమ్మలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు కొన్నాళ్లపాటు నేర్చుకునే స్థోమత లేక వదిలేసిందట. దాంతో నేనైనా మంచి డ్యాన్సర్‌ని అవ్వాలనుకున్నాను. పెళ్లిళ్లకీ, ఫంక్షన్లకీ ప్రోగ్రాములివ్వసాగాను. అది చూసి నాన్నగారు, తన స్నేహితుడు శరత్‌బాబు (నటుడు) దగ్గర నా గురించి ప్రస్తావించారు. చదవడం లేదు, ఎప్పుడూ డ్యాన్సులవీ అంటాడు అని చెబితే... ఆయన నన్ను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్చమని సలహా ఇచ్చారు. నాన్న అది ఫాలో అయిపోయారు. నాన్న చెప్పింది నేను ఫాలో అయిపోయాను. అంటే మీకు ఆసక్తి లేకుండానే చేరారా? దాదాపు అంతే. అయితే అక్కడ చేరాక బాగా ఆసక్తి పెరిగింది. తర్వాత సత్యానంద్‌గారి దగ్గర శిక్షణకు చేరాను. అక్కడే నాకు ప్రభాస్ పరిచయమయ్యాడు. ఇద్దరం స్నేహితులమయ్యాం. తను చెప్పాడు, ‘నాతో ఉండు, పరిచయాలు పెరుగుతాయి, మెల్లగా మంచి అవకాశాలు వస్తాయి’ అని. దాంతో పదేళ్లపాటు ప్రభాస్ వెంటే ఉన్నాను. సర్వం చూశాను. అందుకేనా మిమ్మల్ని ‘ప్రభాస్ శ్రీను’ అంటారు? అవును. శ్రీను అనేది మామూలు పేరు కదా. ప్రభాస్ శ్రీను అంటే వెరైటీగా ఉంటుందని అలా కంటిన్యూ అయిపోయాను. నా ఫ్రెండ్స్ అంటూంటారు... ‘ఆడపిల్లకి పెళ్లయ్యాక ఇంటిపేరు మారుతుంది. కానీ ఇంటిపేరు మారిన మొట్టమొదటి మగాడివి నువ్వే’ అని. అంటే పదేళ్లపాటు అవకాశాలే రాలేదా? చిన్న చిన్న అవకాశాలు వస్తే చేశాను. ‘విక్రమార్కుడు’తో బ్రేక్ వచ్చింది. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత బిజీ అయిపోయాను. ఇంతమంది కమెడియన్స్ మధ్య ఎలా నిలబడగలుగుతున్నారు? మీ పళ్లు మెరిసిపోతాయి అంటూ బోలెడు పేస్ట్ కంపెనీలు ప్రకటనలిస్తాయి. కానీ ‘కాల్గేట్’ వాడే వాడు దాన్నే వాడతాడు. అలాగే ఎందరు నటులున్నా ఏ పాత్రకు పనికొచ్చే నటుడిని ఆ పాత్రకు తప్పక తీసుకుంటారు దర్శకులు. కాబట్టి నాకు తగ్గవి నాకే వస్తాయి. అయినా ఎవరి టాలెంట్ వారిది. ఒకరిలా అవ్వాలనుకుంటే అవ్వలేం. బ్రహ్మానందం గారినే తీసుకోండి. ఆయనలాంటివాడు మరొకడు లేడు, రాడు. ఆయన సరస్వతీ పుత్రులు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. కానీ ఆయన స్థాయికి చేరడం మాత్రం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా? ‘ఇలాంటిది చేయాలి’ అనుకోను కానీ, ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలనుకుంటాను. చిన్నదా పెద్దదా, రెమ్యునరేషన్ ఎక్కువా తక్కువా అని చూడను. పాతిక రూపాయలిచ్చినా నటిస్తాను. నాన్నగారిలా ఏ కలెక్టరో అయ్యుంటే బాగుండేదని అనిపించలేదా? లేదు. ఒకప్పుడు నన్ను ఎర్రయ్యగారి అబ్బాయనేవారు. ఇప్పుడు నాన్నను సిద్ధప్ప శ్రీను (గబ్బర్‌సింగ్‌లో పాత్ర) వాళ్ల నాన్నగారు అంటున్నారట. మేం కొన్నాళ్లు నరసన్నపేటలో ఉన్నాం. ఆ ఊరి వినాయకుడి వల్లే మేమంతా బాగున్నామని నమ్ముతాం. అందుకే ఇరవై మూడేళ్లుగా అక్కడ యేటా వినాయక చవితి ఘనంగా చేస్తున్నాం. నాన్న బిజీగా ఉండటం వల్ల ఈ యేడు పండుగ ఎలా చేయాలా అని టెన్షన్ పడ్డారు. దాంతో నేనే కొన్ని లక్షలు ఖర్చుపెట్టి మొత్తం చేయించేశాను. పండక్కి వచ్చిన నాన్న రైలు దిగుతూనే వచ్చి నన్ను వాటేసుకుని ఏడ్చేశారు. ‘ఇంకేం కావాల్రా నాన్నా నాకు’ అన్నారు. ఓ కొడుకుగా అంతకంటే గొప్ప ఆనందం ఏముంటుంది నాకు! భవిష్యత్ ప్రణాళికలేంటి? పెద్దగా ఏం లేవు. నేనెప్పుడూ నా కూతురు సాయివర్ణిక గురించే ఆలోచిస్తుంటాను. నటించినా, వ్యాపారం చేసినా, మరింకేదైనా చేసినా... నా కూతురికి ఓ గొప్ప జీవితాన్నివ్వడమే నా జీవిత లక్ష్యం. తననూ మీ దారిలో నడిపిస్తారా? లేదు. వెంకటేష్గారిలా ఒక్కసారి ఇంటికి చేరిన తర్వాత మళ్లీ సినిమా వాతావరణం కనిపించకూడదు అనుకుంటాను నేను. నా కూతుర్ని కూడా ఇండస్ట్రీకి దూరంగానే ఉంచుతాను. ఒకవేళ తను అవుతానంటే? ఐస్‌క్రీమ్ తింటే జలుబు చేస్తుందని చెబుతాం. అయినా మారాం చేస్తే ఏం చేస్తాం! తనను నాకు నచ్చినట్టుగా పెంచుతాను. తనకి నచ్చినవీ ఇస్తాను. ఏం చేసినా కానీ... నాకైనా, నా భార్య విజయకైనా పాప సంతోషమే ముఖ్యం. (నవ్వుతూ) అయినా తనకిప్పుడు మూడున్నరేళ్లే. ఇవన్నీ ఆలోచించడానికి చాలా టైముంది. చూద్దాం ఏం జరుగుతుందో! - సమీర నేలపూడి -
ఎవరు దోషి?
నిజాలు దేవుడికెరుక: కళ్లతో చూసేదంతా నిజం కాదు. నిజం అనుకుని పొరబడితే... ఆ పొరపాటు పెద్ద నష్టాన్నే చేస్తుంది. కొన్నిసార్లు జీవితాలనే నాశనం చేస్తుంది. అందుకు ఒకనాటి హాలీవుడ్ నటుడు రాస్కో అర్బకిల్ జీవితమే ఓ ఉదాహరణ. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే... రాస్కో జీవిత పుటల్ని ఓసారి తిరగేసి చూడాలి. సెప్టెంబర్ 8, 1921. శాన్ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రి. ఓ కారు శరవేగంగా వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది. ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు హడావుడిగా దిగారు. ముగ్గురూ కలిసి కారులోంచి ఓ అమ్మాయిని జాగ్రత్తగా దించారు. ఆమె నిలబడే స్థితిలో లేదు. అప్పటికే స్పృహ కోల్పోయినట్టుగా కాళ్లూ చేతులూ వేళ్లాడుతున్నాయి. ఆమెని తమ చేతులతో ఎత్తి పట్టుకుని లోనికి తీసుకొచ్చారు వాళ్లు. అది చూస్తూనే వార్డ్బోయ్ పరిగెత్తుకొచ్చాడు.‘‘ఏమైంది?’’ అన్నాడు కంగారుగా. ‘‘చెప్తాం. ముందు తనని డాక్టర్‌కి చూపించాలి. అర్జెంట్’’ అంది ఒకామె. ‘‘ఏంటి... ఏం జరిగింది’’... అప్పుడే అటుగా వెళ్తున్న డాక్టర్ ఇటు వస్తూ అన్నాడు. వాళ్ల దగ్గరకు వచ్చి ఆ అమ్మాయివైపు చూశాడు. ‘‘ఈమెనెక్కడో చూసినట్టుందే’’ అన్నాడు సాలోచనగా. ‘‘చూసేవుంటారు. తను నటి... వర్జీనియా ర్యాపే’’... చెప్పాడు తీసుకొచ్చిన అబ్బాయి. ‘‘ఎస్... కరెక్ట్. ఏమయ్యింది తనకి?’’ ముగ్గురూ ముఖాలు చూసుకున్నారు. నేను చెబుతాను అన్నట్టు సైగ చేసిందో అమ్మాయి. ‘‘తనని రేప్ చేశారు సర్’’ అంది తల దించుకుని. ‘‘వ్వా....ట్?’’ ‘‘అవును. తను రేప్‌కి గురయ్యింది. అప్పట్నుంచీ స్పృహలో లేదు. వెంటనే ఏదో ఒకటి చేయండి’’ ‘‘పోలీసులకి ఇన్ఫామ్ చేశారా?’’ ‘‘చేశాం. వచ్చేస్తూ ఉంటారు.’’ వర్జీనియా నాడి పరిశీలించాడు డాక్టర్. ‘‘నర్స్... థియేటర్ రెడీ చేయండి. బాయ్స్... ఆమెను తీసుకు రండి’’ అంటూ పరుగు తీశాడు. వెంటనే వార్డ్‌బోయ్స్ వచ్చి వర్జీనియాను స్ట్రెచర్ మీద వేసి తీసుకెళ్లారు. రెండు నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు. వాళ్లను చూస్తూనే ఒకమ్మాయి ఎదురెళ్లింది. ‘‘నేనే సర్ మీకు ఫోన్ చేసింది. నా పేరు బ్యాంబీనా. వర్జీనియా ఫ్రెండ్‌ని.’’ ‘‘అసలేం జరిగింది?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘ఈరోజు సెయింట్ ఫ్రాన్సిస్ హోటల్లో పెద్ద పార్టీ జరిగింది సర్. దానికి మేమంతా వెళ్లాం. వర్జీనియా ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. అంతా వెతికితే ఒక రూమ్‌లో కనిపించింది. మంచం మీద, రాస్కో చేతుల్లో... అచేతనంగా ఉంది’’... గడగడా చెప్పింది బ్యాంబీనా. ‘‘రాస్కోనా?’ ‘‘అవును సర్... రాస్కో అర్బకిల్. నటుడు, దర్శకుడు.’’ ఏదో అనబోతున్నవాడల్లా థియేటర్ తలుపులు తెరచుకోవడంతో ఆగిపోయాడు ఇన్స్పెక్టర్. డాక్టర్ బయటకు రావడం చూసి అతడి దగ్గరకు వెళ్లాడు. ‘‘డాక్టర్.. ఆమె ఎలా ఉంది?’’ పెదవి విరిచాడు డాక్టర్. ‘‘చాలా సీరియస్... ఇప్పుడే ఏ విషయం చెప్పలేం. బ్లాడర్ బాగా రప్చర్ అయ్యింది. ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా ఉంది.’’ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థమైంది ఇన్స్పెక్టర్కి. మళ్లీ కలుస్తానని చెప్పి బయలుదేరాడు. బెల్ పదే పదే మోగడంతో విసుక్కుంటూ లేచాడు రాస్కో. టైమ్ చూసుకున్నాడు. తెల్లవారుజాము మూడవుతోంది. ‘‘అబ్బా... ఈ టైమ్‌లో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు’’ అనుకుంటూ మంచం దిగి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా ఉన్న పోలీసులను చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘ఏంటి? ఏదైనా ప్రాబ్లెమా?’’ అన్నాడు అర్థం కానట్టుగా. ‘‘ప్రాబ్లెమే. మాక్కాదు, నీకు’’ అంటూ లోనికి వచ్చి గదంతా పరికించి చూశాడు ఇన్స్పెక్టర్. ‘‘ఈ టైమ్‌లో వచ్చి నా రూమ్ సోదా చేస్తున్నారేంటి?’’ అన్నాడు రాస్కో అయోమయంగా. ‘‘సాక్ష్యాలు కావాలి కదా మిస్టర్ రాస్కో’’... వెటకారంగా అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘సాక్ష్యాలా... దేనికి?’’ ‘‘నటి వర్జీనియా ర్యాపేని నువ్వు రేప్ చేశావని నిరూపించడానికి’’. ‘‘ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను తనని రేప్ చేయడమేంటి? అది నిజం కాదు’’ అరిచినట్టే అన్నాడు రాస్కో. ‘‘అరిస్తే నిజాలు అబద్ధాలైపోవు మిస్టర్... యు ఆర్ అండర్ అరెస్ట్’’ అంటూ రాస్కో చేతులకు బేడీలు వేశాడు ఇన్స్పెక్టర్. మర్నాడు... ‘‘నో... వర్జీనియాని నేనేం చేయలేదు’’... రాస్కో అరుపులతో ఇంటరాగేషన్ సెల్ దద్దరిల్లిపోయింది. అప్పటికి అరగంట నుంచి అడుగుతున్నారు పోలీసులు. కానీ ఎన్నిసార్లు అడిగినా అతడదే చెబుతున్నాడు. దాంతో ఇన్స్పెక్టర్కి కబురు చేశారు. అతడు వడివడిగా వచ్చాడు. ‘‘టైము, టైమింగ్ విలువ నటుడివి నీకు తెలిసింతగా ఇంకెవరికి తెలుస్తాయి రాస్కో! అనవసరంగా సమయం వృథా చేయకుండా నిజం ఒప్పేసుకో.’’ అతడంత కఠినంగా మాట్లాడటం చూసి మౌనంగా అయిపోయాడు రాస్కో. ‘‘నేను మంచివాణ్ని కాబట్టి ఇంకా చేతికి పని చెప్పలేదు. నన్ను రెచ్చగొట్టొద్దు. ఏ తాగిన మత్తులోనో తప్పు చేసుంటావ్. ఒప్పుకుంటే నీకే మంచిది. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? వర్జీనియా హాస్పిటల్లో చనిపోయింది. ఇప్పుడిది రేప్ కేసు కాదు, మర్డర్ కేస్.’’ ఉలిక్కిపడ్డాడు రాస్కో. ‘‘వర్జీనియా చచ్చిపోయిందా?’’ అన్నాడు బెదురుగా చూస్తూ. ఇన్స్పెక్టర్ తలాడించాడు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రాస్కోకి. రెండు క్షణాల తర్వాత అన్నాడు. ‘‘నేను నిర్దోషిని సర్. నన్ను నమ్మండి.’’ ‘‘నేరస్తులను నమ్మడం మొదలుపెడితే మేం యూనిఫాములు తీసేయాల్సి వస్తుంది మిస్టర్ రాస్కో. నీ సంగతి రేపు కోర్టు తేలుస్తుంది’’ అనేసి వెళ్లిపోయాడు ఇన్స్పెక్టర్. కటకటాల గదిలో ఒంటరిగా మిగిలిపోయాడు రాస్కో. ‘‘ఈ కేసును వచ్చే నెల పన్నెండో తేదీకి వాయిదా వేస్తున్నాను. ముద్దాయి రాస్కో అర్బకిల్ని రిమాండ్‌కు తరలించాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తున్నాను.’’జీవితం ఒక్కసారిగా చీకటైపోయినట్టు అనిపించింది రాస్కోకి. ఏం చేయాలో అర్థం కాక వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. చూస్తున్నవాళ్లంతా అవాక్కయిపోయారు. అతడికి శిక్ష పడాలి అని కోరుకున్నవాళ్లకు కూడా మనసు చలించింది ఆ ఏడుపు చూసి. అప్పుడైనా అతడి గురించి వేరే కోణంలో ఆలోచించి ఉంటే... రాస్కోకి న్యాయం జరిగివుండేది. కానీ ఎవ్వరూ అలా ఆలోచించలేదు. రాస్కో అర్బకిల్ మంచి నటుడు. చక్కని రచయిత. వైవిధ్యతను చూపించే దర్శకుడు. ఇండస్ట్రీలో అతడికి మంచి పేరుంది. పెద్ద సర్కిల్ ఉంది. కానీ అవన్నీ ఒక్క కేసుతో దూరమైపోయాయి. ఆరోజు షూటింగ్లో గాయపడటంతో విశ్రాంతి తీసుకోవడానికి, సెయింట్ ఫ్రాన్సిస్ హోటల్లో గది అద్దెకు తీసుకున్నాడు రాస్కో. తర్వాతి రోజు రాత్రి ఓ నటుడు ఇచ్చిన పార్టీలో తను కూడా పాల్గొన్నాడు. కాసేపటి తర్వాత తన గదికి వెళ్లాడు. అప్పుడే అనుకోకుండా వర్జీనియా ర్యాపే గదిలోకి దూసుకొచ్చింది. బాగా తాగివుంది. బాత్రూమ్లోకి వెళ్లి వాంతులు చేసుకోసాగింది. దాంతో గబగబా వెళ్లి ఆమెకి సహకరించాడు. తీసుకొచ్చి మంచం మీద కూచోబెట్టాడు. తాగడానికి నీళ్లిచ్చాడు. మత్తులో పిచ్చిపిచ్చిగా ఏడుస్తుంటే ఓదార్చే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అప్పుడే వర్జీనియా ఫ్రెండ్ బ్యాంబినో ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. రాస్కో గదిలో ఆమెను చూసి షాకయ్యింది. బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. బాగా ఏడ్చినట్టుగా చెంపల మీద కన్నీటి చారికలు ఉన్నాయి. దానికి తోడు ఆమె రాస్కో చేతుల్లో ఉంది. దాంతో ఆమె పట్ల ఏం జరిగివుంటుందో ఊహించుకుంది. అంతలో వర్జీనియా స్పృహ కోల్పోవడంతో గబగబా ఆస్పత్రికి తీసుకెళ్లిపోయింది. రేప్ జరిగింది అని బ్యాంబినా చెప్పిన ఒక్క మాటతో దర్యాప్తు మొత్తం ఆ దిశలోనే జరిగింది. రాస్కో గదిలో ఉంది కాబట్టి పోలీసులు అతడిని దోషిగా ఎంచారు. డాక్టర్ కూడా బ్లాడర్ గాయపడ డానికి, ఇంటర్నల్ బ్లీడింగ్‌కి దారుణంగా రేప్ చేయడమే కారణమని నిర్ణయించేశాడు. దాంతో కటకటాల వెనక్కి వెళ్లిపోయాడు రాస్కో. కొన్ని రోజులకు బెయిల్ దొరికినా... కోర్టుల చుట్టూ తిరగడంతోనే జీవితం గడిచిపోయింది. అవకాశాలు తగ్గి పోయాయి. పేరు ప్రఖ్యాతులు మంటగలిసిపోయాయి. సంపాదించినదంతా లాయర్ ఫీజులకు కరిగిపోయింది. కానీ అదృష్టం... నిజం నిలకడ మీద బయటకు వచ్చింది. పార్టీలో పాల్గొన్న కొందరు వర్జీనియా ప్రవర్తన గురించి ఇచ్చిన సాక్ష్యం, రాస్కో నిర్దోషిత్వాన్ని బయటపెట్టింది. ఎక్కడ పార్టీ జరిగినా విచిత్రమైన వస్త్రధారణలో వచ్చేది వర్జీనియా. పీకల దాకా తాగేది. రచ్చ రచ్చ చేసేది. విపరీతంగా ఏడ్చేది. ఎక్కడ పడితే అక్కడ కక్కుకునేది. ఆమెను కొందరు సంస్కారం లేని మనిషి అంటే, కొందరు అందరి కళ్లలో పడటానికే అలాంటివి చేస్తుందనేవారు. ఈ విషయాలన్నీ కొందరు కోర్టులో చెప్పారు. దానికి తోడు రాస్కో ఎంత నెమ్మదస్తుడో, ఎంత నిజాయతీపరుడో కూడా చెప్పారు. అతడి మీద అంతవరకూ ఒక్క రిమార్కు కూడా లేకపోవడం కూడా కలిసివచ్చింది. దాంతో రీ పోస్ట్‌మార్టమ్‌కి ఆదేశించింది న్యాయస్థానం. అప్పుడు తెలిసి వచ్చింది... వర్జీనియా మీద అసలు అత్యాచారమే జరగలేదని, కొన్ని రోజుల ముందు జరిగిన అబార్షన్ వల్ల బ్లాడర్ దెబ్బతిందని! ఓ అమాయకుడిని పోలీసులు, వైద్యులు కలిసి ఎలా నేరస్తుణ్ని చేశారో ప్రపంచానికి తెలిసివచ్చింది. న్యాయస్థానం కేసు కొట్టేసింది. జరిగిన తప్పుకి రాస్కోకి క్షమాపణ చెబుతూ ఓ లేఖ కూడా వెలువరించింది. కానీ ఏం లాభం? అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డబ్బు లేదు. పేరు లేదు. కెరీర్ లేదు. ఉన్నదల్లా... శూన్యం. ఆ శూన్యం అతడిని చాలా కుంగదీసింది. తన జీవితంపై పడిన నెత్తుటి మరకను తుడిచేసుకోలేక, పన్నెండేళ్లపాటు జీవచ్ఛవంలా బతికాడు. 1933, జూన్ 29న కన్నుమూశాడు. ఈ కేసులో అసలు దోషి ఎవరు? తన ఊహతో కథలు అల్లిన బ్యాంబినోనా? సరైన సాక్ష్యాలు లేకుండానే అతడిని నేరస్తుడిగా పరిగణించిన పోలీసులా? కనీస పరీక్షలు కూడా చేయకుండా అత్యాచారం జరిగిందని నిర్ధారించేసిన వైద్యుడా? ఎవరు?! - సమీర నేలపూడి -
తెలుగువాళ్లు నన్నుమరచిపోయారు!
సుధాచంద్రన్... మనోనిబ్బరంతో శారీరక వైకల్యాన్ని జయించిన సూపర్ ఉమన్! సినిమాలు, సీరియల్స్... డ్యాన్స్ స్కూల్స్, బొతిక్‌లు... ఇలా ఎందులో పాదం మోపినా, ఆమె ఇన్స్పైరింగ్గా నిలుస్తారు. ‘మయూరి’ తన జీవితానికే మైలురాయి అంటారు జైపూర్ పాదాల అందాల రవళి... సుధ! ‘మయూరి’ తన కెరీర్లో ఓ మైలురాయి అంటారు నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న సుధాచంద్రన్ స్పెషల్ ఇంటర్వ్యూలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం!! ‘మయూరి’ సుధగా మీరు మా మనసులో నిలిచిపోయారు... నిలిచిపోతే సంతోషమే కానీ అది నిజం కాదనిపిస్తోంది... అదేంటి అంత మాటన్నారు? ‘మయూరి’ విడుదలైనప్పుడు తెలుగువారు చూపించిన అభిమానం నేను ఇప్పటికీ మర్చిపోలేదు. కానీ మీరే నన్ను మర్చిపోయారనిపిస్తోంది. మీకు నేను గుర్తు ఉండివుండే తర్వాత కూడా తెలుగు సినిమాల్లో నటించి ఉండేదాన్నిగా! అంటే... మయూరి తర్వాత మీకు అవకాశాలే రాలేదా? ఒక్కటి కూడా రాలేదు. చాలా ఎదురు చూశాను... కనీసం ఒక్కరైనా పిలుస్తారేమో అని! ‘మయూరి’ని హిందీలో రీమేక్ చేస్తే... దాన్ని చూసి అక్కడి దర్శకులు వరుసగా అవకాశాలు ఇచ్చారు. తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ భాషల్లో కూడా నటించాను. కానీ తెలుగువాళ్లు మాత్రం నన్ను పక్కన పెట్టేశారు. (నవ్వుతూ) కనీసం ఈ ఇంటర్వ్యూ చదివాకయినా గుర్తు చేసుకుంటారేమో చూడాలి. తెలుగు సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటాను. ‘మగధీర’ నాకు చాలా నచ్చింది. ‘మనం’ కూడా బాగుందని ఈ మధ్యే ఎవరో చెప్పారు. తీరక లేక చూడలేదు. త్వరలోనే చూడాలి. ఒకప్పుడైతే విశ్వనాథ్‌గారి సినిమా అంటే వదలకుండా చూసేదాన్ని. హీరోయిన్స్‌ని చాలా ప్రత్యేకంగా చూపించేవారాయన. బాపుగారి సినిమాలన్నా చాలా ఇష్టం. ఆయన మరణం నాకు చాలా బాధ కలిగించింది. ఇక సింగీతం శ్రీనివాసరావుగారయితే నా నట గురువు! ఆయనవల్లే నేనీరోజున నటిగా ఇలా కొనసాగుతున్నాను! తెలుగులో నటించాలని ఉందంటున్నారు. ఎలాంటి పాత్రలు..? నా వయసుకు తగ్గట్టుగా తల్లిగానో, అత్తగానో చాన్స్ ఇస్తే చేస్తాను. జయసుధగారిలాగా మంచి మంచి తల్లి పాత్రలు చేయాలని ఉంది. ఇక సీరియల్స్ విషయానికొస్తే... మీరు నెగిటివ్ పాత్రలకు ఎక్కువ ఫేమస్ అయినట్టున్నారు? పాత్ర నెగిటివా, పాజిటివా అని ఏముంది! మన ప్రతిభను వెలికి తీసేది ఏదైనా మంచి పాత్రే. మొదట ఓసారి అలాంటి రోల్ చేశాను, బాగా పండటంతో అలాంటివే వచ్చాయి. మీరు కాస్త ఓవర్‌గా మేకప్ అవుతారని కొందరు అంటుంటారు... అలా అనేవాళ్లు ఒక్కసారి నాకు షూటింగ్ లేనప్పుడు వచ్చి చూస్తే... అసలు నేనా? కాదా? అని ఆశ్చర్యపోతారు. సాదా సీదా దుస్తులు వేసుకుంటాను. పౌడర్ కూడా రాసుకోను. కానీ సీరియళ్లలో, సినిమాల్లో ఇలా కనిపిస్తే చూస్తారా! హీరోయిన్ పూరి గుడిసెలో ఉంటుంది... హీరోతో డ్యూయెట్ మాత్రం స్విట్జర్లాండులో పాడుకుంటుంది. సీరియళ్లలో హీరోయిన్లు పట్టు చీరతోనే పడుకుని నిద్రపోతారు. ఏడుపు సీనులో కూడా ఫుల్లుగా మేకప్ వేసుకునే కనిపిస్తారు. ఎందుకంటే దృశ్యాలు కంటికి అందంగా లేకపోతే ప్రేక్షకులు చూడరు. ఇవాళ దక్షిణాది వాళ్లు హిందీ సీరియళ్లను పెద్ద యెత్తున డబ్ చేస్తున్నారంటే కారణమేంటి? ఉత్తరాది సీరియళ్లలో ఆర్టిస్టుల మేకప్, సెట్టింగ్స్‌కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వాటిని చూడ్డానికి తెలుగువారూ ఇష్టపడుతున్నారు కదా! ప్రేక్షకులకు నచ్చేది చేయడమే మా పని. మీరు పెట్టుకునే బొట్టుబిళ్లలు కూడా చాలా ఫేమస్ కదా? అవును. నా పేరుతో రకరకాల బొట్టుబిళ్లలు మార్కెట్లో కూడా దొరుకుతాయి. చాలామంది నా దుస్తుల గురించి కూడా అడుగుతుంటారు. నేనే డిజైన్ చేసుకున్నాను అని చెబితే ఆశ్చర్యపోతుంటారు. సలహాలు కూడా అడుగుతుంటారు. నా అభిరుచికి, ప్రతిభకి ప్రశంసలు దొరుకుతున్నప్పుడు వాటిని లైట్‌గా ఎందుకు తీసుకోవాలి! అందుకే ఈ మధ్యనే చెన్నైలో ‘సుధాచంద్రన్ కలెక్షన్స్’ పేరుతో ఓ బొతిక్ కూడా తెరిచాను. ఫ్యాషన్ అనేది పెద్ద ప్రపంచం. రాణించగలననుకుంటున్నారా? నేనేదో గొప్ప డిజైనర్‌గా పేరు తెచ్చేసుకోవాలనో, బోలెడన్ని డబ్బులు సంపాదించేయాలనో ఆ పని చేయలేదు. నాలో ఉన్న ఆసక్తిని, ప్రతిభని ఎందుకు వృథా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మాత్రమే బొతిక్ పెట్టాను. దానికి సాక్ష్యం నేను పెట్టిన రేట్లే. నేను మిడిల్‌క్లాస్ అమ్మాయిని. అందుకే మధ్య తరగతి వాళ్లకి, అంతకంటే దిగువన ఉన్నవాళ్లకి కూడా నా డిజైన్స్ అందుబాటులో ఉండేలా చూస్తున్నాను. ముందు ముందు మరికొన్ని నగరాల్లో కూడా నా బొతిక్‌ని విస్తరించాలనుకుంటున్నాను. మీకు డ్యాన్సే ప్రపంచం కదా! మరి నటన... డిజైనింగ్... వీటన్నిటి వల్ల నాట్యానికి దూరమవ్వడం లేదంటారా? డ్యాన్స్ నా ప్రపంచమే కాదు... జీవితం కూడా! మూడేళ్ల వయసు నుంచే డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాను. అది చూసి అమ్మానాన్నలు నన్ను మంచి డ్యాన్సర్‌ని చేయాలని ఆశపడ్డారు. కానీ అంత చిన్న పిల్లని మేం చేర్చుకోం అన్నారు మాస్టర్లు. చివరకు రామస్వామి భాగవతార్గారు నా టాలెంట్ చూసి ముచ్చటపడి తన ‘కళాసదన్’లో చేర్చుకున్నారు. అలా మొదలైన నా కళాప్రస్థానం వందల ప్రదర్శనలిచ్చేదాకా సాగింది. ఇప్పటికీ ఎంత బిజీగా ఉన్నా నెలకు రెండు మూడు ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నాను. ముంబైలో నా పేరుమీద డ్యాన్స్ అకాడెమీ కూడా ఉంది. దానికి రెండు బ్రాంచిలు కూడా ఉన్నాయి. వారానికి ఒక్కసారైనా వెళ్లి అక్కడ పిల్లలకు డ్యాన్స్ పాఠాలు చెబుతుంటాను. నాకు డ్యాన్స్ తర్వాతే ఏదైనా! అప్పట్లో (తొంభైల్లో) రాజకీయాల్లో కూడా చేరారు కదా... తర్వాత ఎందుకు దూరమయ్యారు? అది నా ఆసక్తి కాదు. వెంకయ్యనాయుడుగారు ఆహ్వానించడంతో బీజేపీలో చేరాను. అది కూడా నాలాంటి ఫిజికల్లీ చాలెంజ్డ్ కోసం ఏదైనా చేయాలన్న తపనతో! కానీ, అప్పట్లో ఆ పార్టీ పాలనలోకి రాకపోవడంతో నేను కోరుకున్నది సాధ్యం కాదని అర్థమై దూరంగా ఉండిపోయాను. మరిప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా... పిలుపు రాలేదా? లేదు. అప్పుడెప్పుడో జరిగినవన్నీ గుర్తు చేసుకుని వాళ్లు నన్ను మళ్లీ పిలవాలని నేనేమీ ఆశపడటం లేదు. కాకపోతే వ్యక్తిగతంగా నాకు మోడీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు దేశం ఆయన చేతుల్లోకి వెళ్లింది కాబట్టి ఏ విషయంలోనైనా అభివృద్ధి సాధించడం సాధ్యమనిపిస్తోంది. అవకాశం దొరికితే ఆయన హయాంలో నేననుకున్నది చేయగలుగుతానని నమ్మకం ఉంది. పదవి వరిస్తే... ఓ మహిళగా మహిళల కోసం ఏమైనా చేస్తారా? ఎవరో వచ్చి సాయం చేయాలని, మన జీవితాలు బాగు చేయాలని కోరుకోవడం నాకు నచ్చదు. ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదు. అలాంటప్పుడు ఎంపవర్మెంట్ గురించి చర్చలు, రిజర్వేషన్ బిల్లులు అవసరమా? నా దృష్టిలో బిల్లు అనేది ఓ కాగితం. అది జీవితాలను మార్చదు. కాబట్టి ఎవరి సాయం కోసం చూస్తూ కూచోకుండా, ఏమాత్రం చేసుకోగలిగినవాళ్లయినా, ఎవరికి వారే చైతన్యంతో ముందడుగు వేయాలి. ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు? కొంత నా తల్లిదండ్రుల వల్ల. కొంత నా జీవితం నాకు నేర్పిన పాఠాల వల్ల. పదహారేళ్ల వయసులో నా జీవితం ఒక్కసారిగా తారుమారైపోయింది. ఈ ఆత్మవిశ్వాసమే లేకపోతే అసలీ రోజు ఇక్కడ ఉండేదాన్నే కాదు. ఆ సంఘటన గురించి కాస్త వివరంగా... అది 1981వ సంవత్సరం... మే 2వ తేదీ. అమ్మానాన్నలతో కలిసి తిరుచ్చి వెళ్లి, దేవుడి దర్శనం చేసుకుని బస్సులో తిరిగొస్తున్నాను. ఉన్నట్టుండి పెద్ద శబ్దం! పెద్ద కుదుపు! మాకు యాక్సిడెంట్ అయ్యిందని అర్థం కావడానికి సమయం పట్టింది. డ్రైవర్ చనిపోయాడు. దాదాపు అందరూ గాయపడ్డారు. నేనొక్కదాన్నే కాస్త బాగున్నాననిపించింది. కానీ లేవాలని ప్రయత్నించినప్పుడు అర్థమైంది నా పరిస్థితి. నా కాళ్లు రెండూ సీట్ల కింద ఇరుక్కుపోయాయి. కొందరు వచ్చి అతి కష్టమ్మీద బయటకు లాగి, దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. నా కుడికాలుకు బాగా గాయమవడంతో డాక్టర్లు సిమెంటు కట్టు వేశారు. తర్వాత అమ్మానాన్నలు నన్ను చెన్నై తీసుకెళ్లిపోయారు. అంతా మామూలైపోతుందని అనుకున్నాం. కానీ కాలి నొప్పి ఎక్కువ కాసాగింది. కాలు రంగు కూడా మారసాగింది. దాంతో నన్ను మళ్లీ చెన్నైలోని విజయా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కట్టు విప్పుతూనే డాక్టర్... ‘ఓ గాడ్’ అన్నారు. అప్పుడే సెన్స్ చేశాను... ఏదో దారుణం జరగబోతోందని! తర్వాత...? ఏమయ్యిందని డాక్టర్ని అడిగితే... ఆయన నాతో ఏమీ చెప్పలేదు. తర్వాత అమ్మానాన్నలను బయటకు తీసుకెళ్లి, వాళ్లతో ఏదో మాట్లాడారు. నాన్న లోపలకు వచ్చి, నా చేయి పట్టుకుని, ‘సుధా... నీ మడమ దగ్గర చిన్న గాయముందని గమనించకుండా డాక్టర్లు నీకు సిమెంట్ కట్టు వేశారు. దానివల్ల నీ కాలు సెప్టిక్ అయ్యింది... కాలు తీసేయకపోతే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు డాక్టర్లు’ అంటూ మెల్లగా చెప్పారు. నాన్న ఆ విషయం అలా చెబుతుంటే... నా కలల ప్రపంచం నా కళ్లముందే కూలిపోతున్నట్టుగా అనిపించింది నాకు! ఎలా తట్టుకున్నారు అంతటి నిజాన్ని? తట్టుకోక తప్పని పరిస్థితి! అయితే కాలు తీసేస్తానన్నందుకు కాదు... కాలు లేకపోతే డ్యాన్స్ ఎలా చేయగలనన్నదే నా బాధ! ఇప్పుడు ఎవ్వరు అడిగినా చాలా సింపుల్‌గా చెప్పేస్తాను కానీ... ఆ సమయంలో నేను పడిన వేదన సామాన్యమైనది కాదు. కానీ మెలమెల్లగా జీవితంతో రాజీ పడసాగాను. ఇంతలో జైపూర్ లెగ్ గురించి ఓ పేపర్లో డాక్టర్ సేథీ ఇచ్చిన ఇంటర్వ్యూ చదివి, వెంటనే ఆయన దగ్గరకు వెళ్లాను. అప్పటిదాకా అసలు నడవగలనా అనుకున్నదాన్ని, ఆయన చెప్పిన మాటలతో, ఇచ్చిన ధైర్యంతో డ్యాన్స్ కూడా చేయగలనని నమ్మాను. తొలిసారి (కృత్రిమకాలితో) ప్రదర్శనిచ్చినప్పుడు మీ ఫీలింగ్..? ఇంతకు ముందులా చేయగలనో లేదోనని మొదట కంగారుపడ్డాను. నాన్న ధైర్యం చెప్పారు. మహా ఆయితే ఆడిటోరియంలో ఇరవై మందో ముప్ఫై మందో ఉంటారనుకుంటే, వెయ్యిమంది ఉన్నారు. వాళ్లంతా నన్ను చూస్తూనే లేచి నిలబడి చప్పట్లు కొట్టసాగారు. అప్పటికేమీ సాధించలేదు కానీ సాధించాలన్న నా పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పారు. దాంతో నాలో పట్టుదల పెరిగింది. ఒకటి కాదు, రెండు కాదు... మూడు గంటల పాటు డ్యాన్స్ చేశాను. ఆ తర్వాత కలిసినప్పుడు డాక్టర్ సేథీ అన్నారు... ‘మొత్తానికి చేసి చూపించావ్. కానీ ఎలా చేశావ్’ అని. ‘మీరే కదా అన్నారు, నేను డ్యాన్స్ చేయగలనని’ అన్నాను అయోమయంగా. ‘నేనేదో నిన్ను డిజప్పాయింట్ చేయకూడదని అలా అన్నాను, నువ్వు దాన్ని నిజం చేసి చూపించావ్’ అన్నారాయన. ఆయన నా పాలిట దేవుడు. ఆయనే లేకుండా సుధ ఇవాళ ఉండేది కాదు. అలాగే మా అమ్మానాన్నలు. నాకోసం ఎన్నో కలలు కన్నా, నాకిలా అయ్యిందన్న నిరాశ వాళ్ల ముఖంలో ఎప్పుడూ కనిపించలేదు. కానీ చుట్టూ ఉన్నవాళ్లు మాత్రం చాలా జాలిని ప్రదర్శించేవారు. ఒక్కతే కూతురు, ఎలా అయ్యిందో పాపం అని కొందరు... కూతుర్ని డ్యాన్సర్‌ని చేయాలనుకుంటే, నడవడానికే లేకుండా పోయిందే అని ఇంకొందరు... ఆ కామెంట్స్ వినకూడదనే అమ్మ రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత కూరగాయలు కొనడానికి వెళ్లేది. అవన్నీ గుర్తొస్తే ఇప్పటికీ తమ కళ్లు చెమరుస్తాయి. వాళ్లు బాధను మనసులో దాచుకుని నాకు ఆనందాన్ని పంచారు. అందుకే వాళ్ల కలను నెరవేర్చి తీరాలనుకున్నాను. మీ వారి గురించి... మా వారి పేరు రవి ఢంగ్. ఓ పంజాబీ సినిమా సెట్లో తొలిసారి చూశాను ఆయన్ని. ఆ సినిమాకి ఆయన అసిస్టెంట్ డెరైక్టర్. మా పరిచయం పరిణయానికి దారి తీసింది. ఆయనతో జీవితం బాగుంటుందనిపించింది. ఆ నమ్మకమే నిజమైంది. ఆయన నాకు చాలా పెద్ద సపోర్ట్! మాకు పిల్లలు లేరు. అయినా నాకేం బాధ లేదు. తను ఉన్నారు. అదే చాలు అనుకుంటాను. దత్తత తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదా? నాకు అడాప్షన్ మీద నమ్మకం లేదు. ఇష్టం కూడా లేదు. నాకు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. అందరూ నిజాయతీగా ఉండాలి. ఎవరు కాస్త తప్పుగా ప్రవర్తించినా దూరంగా పెట్టేస్తాను. నా బిడ్డ అయినా అంతే. అలాంటప్పుడు ఏ ఒక్క క్షణంలోనైనా... ‘వీడు నా బిడ్డ అయితే ఇలా చేసేవాడా’ అనుకున్నానంటే తనకి అంత ద్రోహం చేసినదాన్ని అవుతాను. అందుకే దత్తత చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. కానీ పిల్లలు లేని వెలితి ఎప్పుడైనా బాధిస్తే...? అలా జరగదు. బిడ్డల నిరాదరణకు గురై ఫుట్‌పాత్‌ల మీద, అనాథాశ్రమాల్లోను, రైల్వేస్టేషన్లలోనూ ప్రాణాలు విడుస్తున్న తల్లిదండ్రులెంతమందిని చూడటం లేదు! వాళ్లంతా కడుపు కట్టుకుని పిల్లల్ని పెంచుకుని ఉంటారు. వాళ్లమీదే ప్రాణాలు పెట్టుకుని వుంటారు. కానీ ఎలాంటి పరిస్థితి వచ్చింది! అందుకే పిల్లలు ఉండి తీరాలి అన్న ఆశ, వాళ్లు ఉంటేనే సంతోషంగా ఉంటామన్న అభిప్రాయం నాకెప్పుడూ లేవు. ఇప్పటి వరకూ గడిపిన జీవితం తృప్తి కలిగించినట్టేనా? ఎలాంటి రిగ్రెట్స్ లేవు. వచ్చినదాన్ని వచ్చినట్టుగా స్వీకరించడం, రేపు ఏం జరుగుతుందోనని చింతించకపోవడం నన్నెప్పుడూ హ్యాపీగా ఉంచుతాయి. అంతేకాదు, నేనెప్పుడూ సక్సెస్‌ని మెజర్ చేయను. చేస్తే అక్కడితో ఆగిపోతాం. అందుకే ఏం చేశాను అన్నదానికంటే, ఇంకా ఏం చేయగలను అనేదే ఆలోచిస్తాను. ఎప్పుడూ అదే చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను. ఎప్పుడూ అదే చేస్తాను! - సమీర నేలపూడి నా యాక్సిడెంట్, కాలు తీసేయడం, నేను ఆర్టిఫీషియల్ లెగ్‌తో మళ్లీ డ్యాన్స్ చేయడం మాత్రమే నిజం. మిగతాదంతా కల్పనే. అందులో చూపినట్టు నేను తల్లిలేని పిల్లనీ కాదు, నాకు సవతి తల్లి ఆరళ్లూ లేవు. మా నాన్న అంత అమాయకుడు, బలహీనుడు అంతకన్నా కాడు. సినిమా కోసం ఆ పాత్రను అలా తీర్చిదిద్దారంతే! అంతే కాదు... (నవ్వుతూ) ఆ సినిమాలోలాగా నాకు బాయ్‌ఫ్రెండ్ కూడా లేడు. సినిమా కోసం కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారంతే! -
లిప్ట్ ప్లీజ్...
దెయ్యం అన్న మాట వింటేనే గుండె గుభేల్మంటుంది. ఇక దెయ్యం ఎదురుపడితే? వచ్చి మన పక్కనే కూచుంటే? మనతో మాట కలిపితే? ఆలోచిస్తుంటేనే చెమటలు పట్టేయడం లేదూ! చికాగోలో ఓ దెయ్యం ఇలాగే అందరికీ చెమటలు పట్టించింది. కంటి మీద కునుకు లేకుండా చేసింది. నమ్మశక్యంగా లేదా? అయితే ఆ దెయ్యం కథని మీరూ చదవండి! అమెరికాలోని చికాగో... 1939వ సంవత్సరం. రాత్రి తొమ్మిది గంటలు దాటి పదిహేను నిమిషాలయ్యింది. ఒక తెల్లటి కారు వచ్చి ‘ఒ.హెన్రీ బాల్రూమ్’ ముందు ఆగింది (దీన్ని ఇప్పుడు విల్లోబ్రూక్ బాల్రూమ్ అంటున్నారు). లేత గ్రే కలర్ సూట్లో హుందాగా దిగాడు జెర్రీ పాల్యూస్. అతడిని చూస్తూనే వాచ్‌మేన్ ఆనందంగా సెల్యూట్ చేశాడు. అతడి అభివందనాన్ని స్వీకరించినట్టుగా తలాడించాడు జెర్రీ. లోనికి వెళ్తూ వాచ్‌మేన్ చేతిలో ఓ కరెన్సీ నోటు పెట్టాడు. నోటు చూడగానే అతగాడి ముఖం మరింత వికసించింది. కృతజ్ఞతగా మరో సెల్యూట్ కొట్టాడు. తనదైన స్టయిల్లో అందంగా నవ్వి లోనికి నడిచాడు జెర్రీ. ఓ కోటీశ్వరుడు తన పుట్టినరోజు ఫంక్షన్‌ని జరుపుకుంటున్నాడు ఆ రోజు. అతడి స్థాయి ఏమిటో ఆ హాల్ అలంకరణను బట్టే అంచనా వేసేయవచ్చు. అంత అద్భుతంగా ఉంది డెకొరేషన్. డిజైన్ చేసినవాడిని మనసులోనే మెచ్చుకుంటూ హాల్లోకి అడుగు పెట్టాడు జెర్రీ. అప్పటికే హాలంతా సందడి సందడిగా ఉంది. సముద్రంలో కెరటాలు ఎగసిపడుతున్నట్టుగా అందరిలోనూ హుషారు ఉరకలు వేస్తోంది. అలుపూ సొలుపూ లేకుండా ఆడా మగా కలిసి స్టెప్పులేస్తున్నారు. కొందరి చేతుల్లో వైన్ గ్లాసులున్నాయి. కొందరి చేతుల్లో కాక్టెయిల్ గ్లాసులున్నాయి. మధ్యమధ్యలో వాటిని సిప్ చేస్తూ మరీ హుషారెత్తిపోతున్నారు. అందరినీ ఓసారి పరికిస్తూ పుట్టినరోజు చేసుకుంటున్న వ్యక్తి దగ్గరకు వెళ్లాడు జెర్రీ. తాను తెచ్చిన గిఫ్టును చేతిలో పెట్టి, విషెస్ చెప్పాడు. తర్వాత ఓ వైన్ గ్లాస్‌ను అందుకుని, ఓ పక్కగా ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. డ్యాన్స్ చేస్తున్నవాళ్లను చూస్తూ వైన్‌ని సిప్ చేస్తున్నాడు. అనుకోకుండా అతడి చూపు... ఓ మూలన వేసున్న టేబుల్ వైపు మళ్లింది. అక్కడో అమ్మాయి ఒంటరిగా కూర్చుని ఉంది. పాల నురుగులాంటి తెల్లని గౌను వేసుకుంది. గాలికి ముంగురులు ఎగిరి ముఖమ్మీద పడుతుంటే మృదువుగా ఎగదోసుకుంటోంది. హోరెత్తుతున్న సంగీతానికి పాదాలను మెల్లగా కదిలిస్తోంది. జెర్రీ మనసులో చిన్న అలజడి. ఎంత ప్రయత్నించినా చూపు తిప్పుకోలేకపోయాడు. కోటీశ్వరుడైన తనను బుట్టలో వేసుకోవడానికి చాలామంది అమ్మాయిలే ప్రయత్నించారు. కానీ వాళ్లలో ఎవరిని చూసినప్పుడూ ఇలాంటి అనుభూతి కలగలేదు. ఆమె దగ్గరకు వెళ్లాలని మనసు పరితపిస్తోంది. కంట్రోల్ చేసుకోలేకపోయాడు. లేచి మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లి ‘హలో’ అన్నాడు. తల తిప్పి చూసిందామె. కింద నుంచి పైకి ఓసారి పరికించి చూసి ‘హలో’ అనేసి ముఖం తిప్పుకుంది. ‘‘నేనిక్కడ కూర్చోవచ్చా’’ అన్నాడు. ఆమె ఓసారి చుట్టూ ఉన్న టేబుల్స్ వైపు చూసింది. అవన్నీ ఉన్నాయిగా అన్నట్టున్నాయి ఆమె చూపులు. ఆ భావం అర్థమై... ‘‘అవన్నీ ఖాళీగానే ఉన్నాయనుకోండి. కానీ ఒక్కడినే కూర్చుంటే బోర్ కొడుతోంది. అందుకే ఇక్కడ కూర్చుందామని’’ అన్నాడు నవ్వుతూ. ఆమె కూర్చోమన్నట్టు సైగ చేసింది. హమ్మయ్య అనుకున్నాడు. మెల్లగా మాట కలిపాడు. కబుర్లలోకి దింపాడు. ఇంప్రెస్ చేశాడు. తనతో డ్యాన్స్ చేయడానికి ఒప్పించాడు.ఆమెతో సన్నిహితంగా మెలగడం జెర్రీ మనసును పులకింపజేస్తోంది. ఆమె నడుము చుట్టూ చేయి వేసి నర్తిస్తుంటే... హృదయం ఉప్పొంగిపోయింది. ఆ క్షణమే నిర్ణయించేసుకున్నాడు... ఆమెకి ఎప్పటికీ దూరం కాకూడదని! తెల్లవారుజా మున మూడు అవుతుండగా చెప్పాడు... ‘‘మేరీ... ఐలవ్యూ’’. ఆమె కళ్లలో మెరుపులు మెరిశాయి. సిగ్గుతో పెదవులు అదిరాయి. ‘‘ఇక నేను వెళ్తాను. చాలా టైమయ్యింది’’ అంది దూరం జరుగుతూ. ‘‘సమాధానం చెప్పవా’’ అన్నాడు ఆమె కళ్లలోకి చూస్తూ. సిగ్గుల మొగ్గయ్యిందామె. ‘‘సరేలే... టైమ్ తీసుకుని చెప్పు. నేను నిన్ను డ్రాప్ చేస్తాను పద’’ అన్నాడు జెర్రీ. అతని వెంట నడిచింది. ఇద్దరూ కారులో బయలుదేరారు. దారి పొడుగునా కబుర్లలో మునిగిపోయారు. కాసేపటి తర్వాత అంది... ‘‘ఇక్కడ ఆపండి. నేను దిగుతాను.’’ ‘‘ఓహ్... ఇక్కడేనా మీ ఇల్లు?’’ ‘‘అవును. మళ్లీ కలుద్దాం.’’ ‘‘ఎప్పుడు?’’ ‘‘మీరెప్పుడంటే అప్పుడు’’ అనేసి జింకపిల్లలా చెంగు చెంగున వెళ్లిపోతుంటే జెర్రీ మనసు విహంగమై ఊహాలోకాల్లోకి ఎగిరిపోసాగింది. తన పిచ్చికి తనలో తనే నవ్వుకుని చేతులు స్టీరింగ్ మీద వేశాడు. కారు స్టార్ట్ చేస్తూ మేరీ వెళ్లినవైపే చూశాడు. అంతే... అతడి ఒళ్లు ఝల్లుమంది. కారు ఆపి, గబగబా దిగాడు. ఎదురుగా ఉన్న బోర్డుమీద ఉన్న పెద్ద పెద్ద అక్షరాలు అంత చీకట్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి... ‘రిజరక్షన్ సిమెట్రీ’! హడలిపోయాడు జెర్రీ. చుట్టూ చూశాడు. అక్కడ ఇళ్లేమీ లేవు. అంతా శ్మశానమే. మేరీ అక్కడెందుకు దిగింది? ఎక్కడికి వెళ్లింది? కొంపదీసి కాటికాపరి కూతురా? లేక... ఇక ఒక్కక్షణం నిలబడలేకపోయాడు జెర్రీ. ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది. గుండె వేగం హెచ్చింది. గబగబా కారెక్కి స్టార్ట్ చేశాడు. క్షణాల్లో అక్కడ్నుంచి దూసుకుపోయాడు. పాపం జెర్రీకి తెలియదు... ఆమె ఎవరో. తెలిసివుంటే అసలు ఆమెతో పరిచయం చేసుకునేవాడు కాదు. ఆమెకు లిఫ్ట్ ఇచ్చేవాడు కూడా కాదు. ఇంతకీ ఆమె ఎవరు?????? ఆ రోజు రాత్రి జెర్రీకి జరిగిన అనుభవం అతడికి కొత్త కావచ్చు. కానీ అప్పటికే చాలామందికి అలా జరిగింది. కానీ ఎవరూ నోరు మెదపలేదు. తొలిసారిగా జెర్రీ తన అనుభవాన్ని అందరితో మేరీ కథ ప్రపంచానికి తెలిసి వచ్చింది. చికాగోలోని ఒ.హెన్రీ బాల్రూమ్కీ, రిజరక్షన్ సిమెట్రీకీ మధ్య ఉన్న దారిలో ప్రయాణించిన చాలామందికి తెలుసు మేరీ గురించి. తెల్లని గౌను వేసుకుని, రోడ్డు పక్కన నిలబడి లిఫ్ట్ అడిగేది. ఎక్కించుకున్నవాళ్లని శ్మశానం దగ్గరకు వచ్చాక ఆపమనేది. ఆమె ఆపమన్నది శ్మశానం దగ్గర అని వాళ్లు తెలుసుకునేసరికి మాయమైపోయేది. ఆ విషయాన్ని చాలామంది చాలాసార్లు చెప్పారు. కానీ అది భ్రమ కావచ్చు అని అంతా కొట్టి పారేశారు. కానీ జెర్రీకి కలిగిన అనుభవం గురించి విన్న తర్వాత అవాక్కయ్యారు. ఆమె తనతో రాత్రంతా డ్యాన్స్ చేసిందనీ, తాను ఆమెను ముద్దాడాననీ కూడా జెర్రీ చెప్పాడు. దాంతో అందరికీ మేరీ అనే దెయ్యం ఉందనే విషయం అర్థమైంది. దాంతో ఆ దారిలో వెళ్లాలంటేనే భయం మొదలైంది. విషయం తెలియని వాళ్లు వెళ్లేవారు. మేరీ బారిన పడేవారు. ఓసారి ఓ ట్యాక్సీ డ్రైవర్ ఆ దారిలో వస్తుంటే శ్మశానం గేటు లోపల ఓ అమ్మాయి కనిపించింది. గేటు ఊచలను వంచడానికి ప్రయత్నిస్తోంది. దాంతో వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఎవరో అమ్మాయి పొరపాటున శ్మశానంలో ఇరుక్కుపోయిందని, గేటు తెరవడానికి ప్రయత్నిస్తోందని చెప్పాడు డ్రైవర్. తక్షణం ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్లాడు. ఎవరూ కనిపించలేదు. కానీ రెండు ఊచలు వంగిపోయి ఉన్నాయి. వాటి మీద వేలిముద్రలు కనిపించాయి. అవి మనిషి ముద్రల్లా లేవు. విచిత్రంగా ఉన్నాయి. దాంతో పరిశోధన మొదలైంది. రిజరక్షన్ శ్మశానంలో సమాధి అయిన మేరీ పేరుగల మృతులందరి గురించీ ఆరా తీయడం మొదలుపెడితే తెలిసింది... ఆత్మగా సంచరిస్తోన్న మేరీ అసలు కథ! ఆమె పేరు మేరీ బ్రెగోవీ. చికాగోలోనే నివసించేది. 1934లో ఓ రోజు రాత్రి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఒ.హెన్రీ బాల్రూమ్కి వెళ్లింది. అక్కడ వారిద్దరికీ చిన్న తగాదా వచ్చింది. ఆ సమయంలో బాయ్‌ఫ్రెండ్ ప్రవర్తించిన తీరు ఆమెకి మనస్తాపం కలిగించింది. ఎంత గానో ప్రేమించిన వ్యక్తి తనతో అను చితంగా ప్రవర్తించడంతో తట్టుకోలేక పోయింది. ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసింది. ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. కాస్త దూరం నడిచిందో లేదో ఓ ట్రక్కు వచ్చి ఆమెను గుద్దేసింది. క్షణాల్లో మేరీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. మేరీని రిజరక్షన్ శ్మశానంలో పాతిపెట్టారు ఆమె తల్లిదండ్రులు. నాటి నుంచీ ఆమె ఆత్మ బాల్రూమ్కీ, శ్మశానానికీ మధ్య సంచరి స్తూనే ఉంది. లిఫ్ట్ అడిగి అందరినీ భయపెడుతూనే ఉంది. కానీ ఏ ఒక్క రోజూ ఎవరికీ హాని మాత్రం చేయలేదు.అయితే ఏమయ్యిందో ఏమోగానీ... 1999 తర్వాత కనిపించడం మానేసింది మేరీ. ఆమె ఆత్మకు విముక్తే లభించిందో లేక మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ... మేరీని చూశామని ఆ తర్వాత ఇంకెవరూ చెప్పలేదు. మేరీ ఏమయ్యింది? ఎక్కడికి వెళ్లింది?! - సమీర నేలపూడి మేరీ చికాగోలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన దెయ్యం. కొన్ని దశాబ్దాల పాటు ఆమె వార్తల్లో ఉంది. అలాంటి ఆత్మే లేదని నిరూపించడానికి ప్రయత్నించిన చాలామందికి సైతం ఆమె కనిపించింది. దాంతో మేరీ మళ్లీ లేచింది అంటూ పలు పత్రికలు కథనాలు ప్రచురించాయి. మేరీ బ్రెగోవీకి ‘రిజరక్షన్ మేరీ’ అంటూ ముద్దు పేరు పెట్టాయి! -
పాటను సీరియస్‌గా తీసుకుంది అప్పుడే!
సంభాషణం: అందమైన స్వరం దేవుడిచ్చిన వరం అంటారు. ఆ వరం పర్ణికకు దక్కింది. బాడీగార్డ్, తెలుగమ్మాయి, నిప్పు, గ్రీకువీరుడు, దేనికైనా రెడీ తదితర చిత్రాల్లో తన పాటతో శ్రోతల మనసులను దోచుకుందామె. పెదవులపై చిరునవ్వును ఎప్పుడూ చెరగనివ్వని ఈ గాయనీమణి తన కెరీర్ గురించి చెబుతోన్న కబుర్లు... మావారి పేరు నిఖిలేశ్వర్... మెరైన్ ఇంజినీర్. నాకెప్పుడూ ఒక భయం ఉండేది... నన్ను అర్థం చేసుకోనివాడు భర్తగా వస్తే ఏంటి పరిస్థితి అని. కానీ అదృష్టం కొద్దీ చాలా మంచి వ్యక్తి దొరికారు. మా ఇంట్లోవాళ్లు, మా అన్నయ్య నన్ను ఎంత ప్రోత్సహించేవారో, అంతకంటే ఎక్కువగా ప్రోత్సహిస్తారు మావారు. అలాంటి జీవిత భాగస్వామి ఉంటే ఏదైనా సాధించగలం! ఎంతైనా ఎదగగలం! కెరీర్ ఎలా ఉంది? బాగుంది. ఇటీవలే ‘రభస’ చిత్రంలో పాడాను. మరికొన్నిటికి పాడుతున్నాను. - ఇప్పటివరకూ ఎన్ని పాటలు పాడారు? తెలుగు, తమిళం, హిందీ, భోజ్‌పురి, లంబాడీ భాషల్లో కలిపి నలభై వరకూ పాడాను. - మీలో ఓ గాయని ఉందని ఎప్పుడు తెలిసింది? మా నాన్నమ్మ లక్ష్మీసుబ్రహ్మణ్యం కర్ణాటక సంగీత విద్వాంసురాలు. దాంతో మూడో తరగతిలోనే ఆవిడ దగ్గర స్వర సాధన మొదలుపెట్టాను. అయితే సరదాగానే నేర్చుకున్నాను తప్ప సింగర్ అయిపోవాలన్న లక్ష్యంతో కాదు. కానీ పదో తరగతిలో రామాచారి గారి దగ్గర చేరాక నా ఆలోచనలు మారిపోయాయి. ఆయన శిష్యులు కొందరు సినిమాల్లో ట్రాకులవీ పాడటం చూసి నాకూ అలా పాడాలన్న కోరిక కలిగింది. దాంతో పాటని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. - తొలిసారి గుర్తింపు ఎప్పుడు వచ్చింది? ‘జీ సరిగమప’లో పాల్గొనే అవకాశం వచ్చింది. దాంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక సూపర్ సింగర్స్ తెచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. - యాంకరింగ్ కూడా చేసినట్టున్నారు? అవును. అనుకోకుండా యాంకరింగ్ అవకాశాలు వచ్చాయి. అన్నీ పాటలకు సంబంధించిన కార్యక్రమాలే కావడంతో ఒప్పుకునేదాన్ని. చాలా షోలు చేశాను. అయితే సింగర్‌ని కావాలన్న అసలు లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తున్నానేమోనని భయమేసి యాంకరింగ్‌కి కామా పెట్టాను. - టాలెంట్ షోల పుణ్యమా అని కోకొల్లలుగా సింగర్లు వస్తున్నారు. ఇలాంటప్పుడు సరిపడినన్ని అవకాశాలు వస్తాయంటారా? ఎందుకు రావు! శ్రీకృష్ణ, గీతామాధురి, దీపు, రేవంత్, నేను.... మా అందరికీ అవకాశాలు బాగానే ఉన్నాయి. ఎంతమంది వచ్చినా అవకాశాలు ఇవ్వగలదు మన ఇండస్ట్రీ. లేదంటే నేనివాళ ఇక్కడ ఉండేదాన్నే కాదు. - కానీ బాలు, చిత్రల మాదిరిగా సింగిల్ కార్డులు పడే చాన్స్ లేదు కదా? కావచ్చు. కానీ అవకాశాలైతే ఉన్నాయి కదా! సినిమాకి ఒక్క పాట పాడినా కెరీర్‌కు వచ్చే ఢోకా ఏమీ ఉండదు. అందరికీ చాన్సులు రావాలి. అందరూ బాగుండాలి. - అవకాశాలు మిస్సై బాధపడిన సందర్భాలు ఉన్నాయా? మొదట్లో నేను పాడిన కొన్ని పాటల్ని చివరి నిమిషంలో తీసేసేవారు. బాగా పాడానే, ఎందుకిలా చేశారు అని బాధపడేదాన్ని. అయితే దానికి వాళ్ల కారణాలు వాళ్లకుంటాయి. అప్పట్లో ఇన్లే కార్డు మీద పడే పేరుకి వాల్యూ ఎక్కువ ఉండేది. ఓ పెద్ద సింగరో లేక ముంబై సింగరో పాడితే క్రేజ్ ఏర్పడుతుందని అనుకునేవారు. దాంతో అలా జరిగేది. ఇప్పుడలా లేదు. బయటి వాళ్లకు చాన్స్ ఇచ్చినా, తెలుగువాళ్లతో కూడా బాగానే పాడిస్తున్నారు. బలంగా ఉన్న కోరిక...? ఏ సింగర్‌కైనా తప్పక ఉండే కోరిక... ఇళయరాజా గారి దగ్గర పాడాలని. అయితే అంతకంటే ముందు ఆయన్ని చూడాలని ఉంది. రెండు మూడుసార్లు కలిసే అవకాశం వచ్చినా వేరే షోలు ఉండటం వల్ల మిస్ అయ్యాను. అప్పట్నుంచీ ఆ వెలితి అలానే ఉండిపోయింది. భవిష్యత్ ప్రణాళికలు? నాలెడ్జబుల్ గాయనిగా పేరు తెచ్చుకోవాలి. అంతకంటే ముఖ్యంగా మంచి మనిషి అనిపించుకోవాలి. ఎదగాలంటే టాలెంట్ ఒక్కటీ చాలదు. మంచి ప్రవర్తన కూడా ఉండాలి. నా వరకూ నేను ఎప్పుడూ నా ప్రవర్తనను కనిపెట్టుకుని ఉంటాను. దేవుడి దయ వల్ల ఎప్పుడూ ఏ రిమార్కూ తెచ్చుకోలేదు. అది చాలు నాకు. - సమీర నేలపూడి -
మాయాపటం
నిజాలు దేవుడికెరుక: మనిషి జీవితం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అంటుంటారు పెద్దలు. అసలు నమ్మకం అంటే ఏమిటి? ఉన్నదాన్ని ఉన్నదని అనుకోవడమా? లేనిదాన్ని కూడా ఉన్నదని ఒప్పుకోవడమా? మొదటి ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు. కానీ రెండో ప్రశ్నకు సమాధానం ఇంతవరకూ తెలియలేదు. అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ఎన్నో విషయాలు నమ్మదగనట్టుగా, అనుమానాస్పదంగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇదొకటి. ‘‘మెర్సీ... ఓసారి ఇలారా’’... ఇంట్లోకి వస్తూనే భార్యను పిలిచాడు వివియన్. ‘‘అబ్బా... ఎప్పుడూ ఏదో ఒక విధంగా తొందర పెడుతూనే ఉంటావు నువ్వు’’... ముద్దుగా విసుక్కుంటూ హాల్లోకి వచ్చింది మెర్సీ. ‘‘అంత విసుక్కోకోయ్... ప్రతిదీ నీకు చెప్పకుండా ఉండలేకపోవడం నా బలహీనత. ఏం చెయ్యమంటావ్ చెప్పు!’’ ‘‘ఆ చాలు కాకా పట్టింది. ఏంటి విషయం’’ అంది మెర్సీ నవ్వుతూ. ‘‘ఓసారి దీన్ని చూడు’’ అంటూ తన చేతిలోని ప్యాకెట్‌ని చూపించాడు. ‘‘ఏంటది’’ అందామె ఆసక్తిగా. తన చేతిలో ఉన్నదానికి చుట్టివున్న రంగు కాగితాన్ని జాగ్రత్తగా విప్పాడు వివియన్. ‘‘ఇప్పుడు చూడు’’ అన్నాడు ఆమెవైపు చూస్తూ. అతడి చేతిలో ఉన్న పెయింటింగ్‌ని చూస్తూనే... ‘‘వావ్, సూపర్బ్‌గా ఉంది వివ్’’ అంది సంబరంగా. ‘‘కదా... అందుకే నిన్ను పిలిచాను’’ అంటూ భార్య చేతికి దాన్ని అందించాడు. అపురూపంగా అందుకుందామె. దాన్ని శ్రద్ధగా పరిశీలించింది. ఓ చిన్నపిల్లాడు... లేత నీలం రంగు చొక్కా, ఆలివ్ రంగు నిక్కరు, అదే రంగు బూట్లు వేసుకున్నాడు. మూసివున్న తలుపు ముందు నిలబడివున్న ఆ బుజ్జిగాడి పక్కన ఓ ఆడపిల్ల ఉంది. ‘‘చాలా బాగుంది వివ్... దీన్ని చూసిందంటే రోజీ ఎగిరి గంతులేస్తుంది’’ అని... ‘‘రోజీ’’ అంటూ కేక పెట్టింది. ఆ పిలుపు వింటూనే లోపలి నుంచి పరుగులు దీస్తూ వచ్చింది నాలుగున్నరేళ్ల రోజీ. కూతుర్ని దగ్గరకు తీసుకుని.. ‘‘చూడు డాడీ ఏం తెచ్చారో’’ అంది పెయింటింగ్‌ని చూపిస్తూ. దాన్ని చూస్తూనే ‘‘బాగుంది మమ్మీ, ఇది నాకేనా’’ అంది ఆనందంగా. ‘‘నీకే డియర్. దీన్ని నీ రూమ్‌లోనే తగిలిద్దాం పద’’ అన్నాడు వివ్ కూతుర్ని ఎత్తుకుంటూ. ముగ్గురూ కలిసి రోజీ గదిలోకి వెళ్లారు. పాప మంచానికి ఎదురుగా ఉన్న గోడకి ఆ పెయింటింగ్‌ని తగిలించారు. కానీ ఆ పెయింటింగ్ తమ సంతోషాన్ని త్వరలోనే హరించబోతోందని వారికప్పుడు తెలియదు! మర్నాడు ఉదయం... ‘‘మమ్మీ...’’ కూతురి అరుపు వినగానే చేతిలో ఉన్న గిన్నెను వదిలేసింది మెర్సీ. గాజు గిన్నె నేలమీద పడి భళ్లున బద్దలయ్యింది. గాజు ముక్కలు గుచ్చుకుంటాయేమోనన్న ధ్యాస కూడా లేకుండా రోజీ గదికి పరుగుదీసింది మెర్సీ. రోజీ మంచం మీద కూర్చుని ఉంది. పెద్దగా ఏడుస్తోంది. కంగారుపడిపోయింది మెర్సీ. ‘‘ఏమైంది బేబీ... ఏమైనా కల వచ్చిందా?’’ అంది గుండెలకు హ త్తుకుంటూ.‘‘మమ్మీ... మమ్మీ... ఆ పాప, ఆ బాబుని చంపేస్తోంది’’ అంది కంగారుగా.అర్థం కాలేదు మెర్సీకి. ‘‘పాప బాబుని చంపేస్తోందా? ఏ పాప.. ఏ బాబుని’’ అంది అయోమయంగా. ‘‘అదిగో... ఆ పాపే, బాబుని చంపేస్తోంది’’ అంటూ పెయింటింగ్ వైపు చూపించింది రోజీ. భయంతో వెక్కిళ్లు వచ్చేస్తున్నాయి. కచ్చితంగా కలగని ఉంటుందని అనుకుంది మెర్సీ. ‘‘అవునా... నువ్వేం భయపడకు. అలా చేయొద్దని ఆ పాపకు నేను చెబుతాలే. సరేనా’’ అంది పాప కళ్లు తుడుస్తూ. సరేనన్నట్టు తలూపింది రోజీ. కానీ మర్నాడు ఉదయం కూడా అచ్చు అదే జరిగింది. నిద్రలేచి ఏడుస్తోన్న రోజీ దగ్గరకు వెళ్తే ముందురోజు చెప్పిన కథే చెప్పింది. ఒకే కల వరుసగా ఎందుకొస్తుందో అర్థం కాక కలవరపడింది మెర్సీ. విషయాన్ని వివియన్‌కు చెప్పింది. ‘‘అది చిన్నపిల్ల... ఏ టీవీలోనో ఏదో చూసి జడుసుకుని ఉంటుంది. ఒక పని చెయ్. నువ్వీ రోజు తనతోనే పడుకో’’ అన్నాడు వివియన్. సరేనంది మెర్సీ. ఆ రాత్రి కూతురి పక్కనే పడుకుంది. పాపని నిద్రపుచ్చేసి తనూ నిద్రలోకి జారుకుంది. మాంచి నిద్రలో ఉండగా పాప ఏడుపు వినిపించినట్టు అనిపించి ఉలిక్కిపడి లేచింది మెర్సీ. కానీ రోజీ ప్రశాంతంగా నిద్రపోతోంది. ఏడుపు మాత్రం వినిపిస్తూనే ఉంది. పైగా అంతకంతకూ ఎక్కువవుతోంది. ఆమెకి తెలిసి చుట్టుపక్కల ఇళ్లలో కూడా చిన్నపిల్లలు ఎవరూ లేరు. మరి ఈ ఏడుపు ఎక్కడి నుంచి వస్తు న్నట్టు?! ఆమె గుండెల్లో దడ. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ గదంతా పరికించి చూసింది. ఆమె కళ్లు ఎదురుగా గోడకు వేళ్లాడుతోన్న పెయింటింగ్ మీద పడ్డాయి. రెండు క్షణాలు దానివైపే తీక్షణంగా చూసింది మెర్సీ. అంతే... ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుకంటే... ఎందుకంటే పెయింటింగ్ ఖాళీగా ఉంది. అందులో పిల్లాడు కానీ, వాడి పక్కనే ఉండాల్సిన అమ్మాయి కానీ లేదు! తను చూస్తున్నది నిజమో కాదో ఒక్క క్షణం అర్థం కాలేదు మెర్సీకి. కళ్లు నులుముకుని మళ్లీ చూసింది. తాను చూసింది ముమ్మా టికీ నిజమే. ఏం జరుగుతోందసలు?గబగబా మంచం దిగింది. పాపను తీసుకుని బయటకు పరుగుదీసింది. అప్పటికింకా ఆఫీసు పని చూసుకుంటూనే ఉన్నాడు వివియన్. పాపతో కంగారుగా వచ్చిన మెర్సీని చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘ఏమైంది’’ అన్నాడు ఆతృతగా. ‘‘అక్కడ... ఎవరో ఏడుస్తున్నారు. చూస్తే ఎవరూ లేరు. పెయింటింగ్‌లో పిల్లాడు కానీ, పాప కానీ లేదు. ఖాళీగా ఉంది’’. అయోమయంగా చూశాడు వివియన్. ఆమె చెప్పేదేంటో అస్సలు అర్థం కాలేదు. ‘‘ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు’’ అంటూ పాప గదిలోకి నడిచాడు. అతడికే ఏడుపూ వినిపించడం లేదు. పెయింటింగ్ కూడా మామూలుగానే ఉంది. మెర్సీ భ్రమపడి ఉంటుందేమో అనుకున్నాడు. ధైర్యం చెప్పాడు. కానీ అతడి గుండె జారిపోయే సంఘటన ఒకటి కొన్ని రోజుల తర్వాత జరిగింది. ఆ రోజు రాత్రి మెర్సీ, పాప త్వరగా నిద్రపోయారు. వివియన్ చాలాసేపు టీవీ చూశాడు. కళ్లు మూతలు పడుతుండటంతో టీవీ ఆపి లేచాడు. గదిలోకి వెళ్లబోతుండగా రోజీ గదిలోంచి ఏవో శబ్దాలు వినిపించాయి. దాంతో అటుగా నడిచాడు. లోపలికి అడుగు పెడుతూనే అతడి ఒళ్లు ఝల్లుమంది. కిటికీ దగ్గర ఇద్దరు పిల్లలు నిలబడివున్నారు. అచ్చు... పెయింటింగ్‌లో మాదిరిగానే. కాళ్లు వణికాయి వివియన్కి. వెంటనే పెయింటింగ్ వైపు చూశాడు. అది ఖాళీగా ఉంది. భయంతో వెన్నులోనుంచి దడ పుట్టింది. మళ్లీ కిటికీ వైపు చూశాడు. ఈసారి పిల్లలు లేరు. ఏమయ్యారా అని చూస్తే పెయింటింగ్‌లో ఉన్నారు. అది ఎప్పటిలాగే ఉంది. అప్పుడర్థమయ్యింది వివియన్కి... మెర్సీ చెప్పేదంతా నిజమేనని. ఆ పెయింటింగ్‌లో ఏదో మాయ ఉందని, అది ఇంట్లో ఏదో అలజడి సృష్టిస్తోందని. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఆ పెయింటింగ్‌లోని పిల్లాడు వివియన్కి అక్కడక్కడా కనిపించాడు. నిజానికి చిత్రంలో బాబు పక్కన ఉన్నది పాప కాదు, పాప బొమ్మ. అయినా కూడా ఇంట్లో ఒక పాప అక్కడక్కడా కనిపించి మాయమవుతూ ఉండేది. పైగా ఒక్కోసారి ఆమె తుపాకీతో బాబుని తరుముతూ ఉండేది. వివియన్కి, మెర్సీకి, రోజీకి... అందరికీ కనిపించారు వాళ్లు. మెర్సీ హడలిపోయేది. పాప జడుసుకుని జ్వరం తెచ్చుకునేది. దాంతో ఆ పెయిం టింగ్‌ని తమ నుంచి దూరం చేయాలనుకున్నాడు వివియన్. దాన్ని తీసుకెళ్లి బయట పారేశాడు. అక్కడితో వారికి పీడ విరగడయ్యింది. కానీ ఆ పీడ ఆ తర్వాత చాలామందికి అంటుకుంది. ఎందరినో భయభ్రాంతులకు గురి చేసింది. అసలింతకీ ఆ పెయింటింగ్ ఎక్కడిది? ఎందుకిలా అందరినీ భయపెడుతోంది? ఎందరికో నిద్ర లేకుండా చేసిన ఆ చిత్రాన్ని బోస్టన్‌కు చెందిన బిల్ స్టోన్హామ్ అనే చిత్రకారుడు చిత్రించాడు. 1972లో అతడి మొదటి భార్య రాన్... ‘హ్యాండ్స్ రెసిస్ట్ హిమ్’ పేరుతో ఓ కవిత రాసింది. వెంటనే ఆ కవిత స్ఫూర్తితో ఈ చిత్రాన్ని గీశాడు. ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ నటుడు జాన్ మార్లీ భారీ మొత్తాన్ని చెల్లించి కొనుక్కున్నాడు. తర్వాత అతడు దాన్ని మరో వ్యక్తికి అమ్మేయడంతో ఆ పెయింటింగ్ చేతులు మారడం మొదలైంది. చివరికి ఎవరి దగ్గరకు చేరిందో తెలియకుండా పోయింది. 2000వ సంవత్సరంలో హఠాత్తుగా ఓ వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యింది. ఒక వ్యక్తి ఉన్నట్టుండి ‘ద హ్యాండ్స్ రెసిస్ట్ హిమ్’ పెయింటింగ్‌ను అమ్ముతానంటూ బేరం పెట్టాడు. మొదట చాలామంది కొనడానికి ఆసక్తి చూపిం చారు. కానీ తర్వాత వెనక్కి తగ్గారు. ఎందుకంటే అతగాడు ఆ పెయింటింగ్ కొనుక్కున్నవారికి ఎలాంటి వింత అనుభవాలు ఎదురవుతాయో ఏకరవు పెట్టాడు. (అతడు చెప్పిన వాటినే కథనంగా అందించాం). అది చదివి అందరి గుండెలూ గుభేల్మన్నాయి. పైగా పెయింటింగ్‌లోని పిల్లలు బయటకు వచ్చినప్పుడు తీసిన ఫొటోల్ని నెట్లో అప్లోడ్ చేశాడా వ్యక్తి. వాటిని చూశాక ఎవ్వరూ చిత్రాన్ని కొనడానికి ముందుకు రాలేదు. చివరికి మిషిగన్‌కు చెందిన ఓ గ్యాలరీ యజమాని స్మిత్ దాన్ని కొనుక్కున్నాడు. గ్రాండ్ ర్యాపిడ్స్ నగరంలో ఉన్న అతడి గ్యాలరీలో ఆ పెయింటింగ్ ఇప్పటికీ ఉంది. గ్యాలరీకి వచ్చేవాళ్లంతా ఏవైనా వింతలు జరుగుతుందేమోనని గంటలపాటు ఆ పెయింటింగ్ వైపే చూస్తూంటారు. స్మిత్ కూడా చాలాసార్లు దాన్ని పరిశీలించాడు. కానీ తనకు అలాంటివేమీ కనిపించలేదంటాడు. మరి ఈ పెయింటింగ్ గురించి దాన్ని అమ్మిన వ్యక్తి చెప్పిన మాటల సంగతేంటి? అవన్నీ అబద్ధాలా? మూఢనమ్మకాలా? పుకార్లా? ఆ కథలు ఎలా పుట్టుకొచ్చాయి? ఒకవేళ నిజం కాదనుకుంటే పెయింటింగ్‌లో మార్పులు జరుగుతున్నప్పుడు తీసిన ఫొటోల సంగతేంటి? అవి కూడా కల్పితాలేనా? ఏమో... నిజాలు దేవుడికెరుక! - సమీర నేలపూడి -
పీడకల
నిజాలు దేవుడికెరుక: కొన్ని జ్ఞాపకాలు పెదాల మీద చిరునవ్వులు పూయిస్తాయి. కొన్ని జ్ఞాపకాలు మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్లో గునపాలు దించుతుంటాయి. దురదృష్టం... స్టెఫానీ స్లేటర్కి ఈ రెండో తరహా జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. ఊహించని విధంగా ముంచుకొచ్చిన ఒక విపత్తు ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆమెను జీవమున్న బొమ్మగా మిగిల్చింది. స్టెఫానీ జీవితం వినడానికి కథలా ఉంటుంది. కానీ ఆ కథ నిండా బోలెడు వ్యథ ఉంది. సదా ఆమె పెదాలపై ఉండే తీయని చిరునవ్వు వెనుక కొండంత చేదు ఉంది! బ్రిటన్... 1993. టీవీ చానెళ్లు చకచకా మారుస్తోంది స్టెఫానీ. ఒక్క ప్రోగ్రామ్ కూడా ఆసక్తికరంగా అనిపించడం లేదు. కనీసం వార్తలైనా చూద్దామని న్యూస్ చానెల్ పెట్టింది. సరిగ్గా అప్పుడే స్క్రీన్ మీద ఓ వ్యక్తి ముఖం ప్రత్యక్షమయ్యింది. అది చూస్తూనే మంచుగడ్డలా బిగుసుకుపోయింది స్టెఫానీ. వాయిస్ ఓవర్ వినిపిస్తోంది. ‘‘మైఖేల్ శామ్ తన జీవితాన్ని పుస్తకంగా ఆవిష్కరించాలనుకుంటున్నాడు. స్టెఫానీ స్లేటర్‌తో నడిపిన ప్రేమాయణాన్ని ఇందులో రాయనున్నట్టు సమాచారం.’’ ఉలిక్కిపడింది స్టెఫానీ. ‘‘ప్రేమాయణమా?’’... గొణుక్కుంది. మరో చానెల్ పెట్టింది. అక్కడా అదే సమాచారం. టపటపా చానెళ్లు మార్చింది. అన్నింట్లోనూ అదే వార్త. టీవీ కట్టేసి రిమోట్ విసిరేసింది. సోఫాలో ముడుచుకుపోయింది. మోకాళ్లు ముడిచి, వాటి చుట్టూ చేతులు బిగించింది. బిత్తర చూపులు చూస్తూ వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమెనలా చూసి అప్పుడే అక్కడికి వచ్చిన వారెన్ హడలిపోయాడు. ‘‘స్టెఫీ’’ అంటూ పరుగున వెళ్లి కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. ‘‘ఏమైంది బేబీ... ఎందుకేడుస్తున్నావ్’’ అంటూ గుండెలకు హత్తుకున్నాడు. ఆయన మాట వింటూనే వంట గదిలోంచి కంగారుగా వచ్చింది తల్లి బెట్టీ. ‘‘స్టెఫీకి ఏమైంది?’’ అంది ఆతృతగా. ‘‘తనని చూసుకోకుండా ఏం చేస్తున్నావ్ నువ్వు?’’ అరిచాడు వారెన్. స్టెఫానీ మాట్లాడలేకపోతోంది. పెదవులు అదురుతున్నాయి. నాలుక పిడచ కట్టుకుపోతున్నట్టుగా అనిపిస్తోంది. వెక్కిళ్లు వచ్చేస్తున్నాయి. ఆమె పరిస్థితి తండ్రిని కంగారు పెట్టింది. వెంటనే ఫ్యామిలీ డాక్టర్‌కు ఫోన్ చేశాడు. క్షణాల్లో డాక్టర్ వచ్చింది. ఏదో ఇంజెక్షన్ ఇచ్చింది. భయం, కంగారు తగ్గాయి కానీ కన్నీళ్లు మాత్రం ఆగలేదు. ఆమెనలా చూసి ఆ వృద్ధ తల్లిదండ్రులకు కన్నీళ్లొచ్చేశాయి. అరగంట తర్వాత తేరుకుంది స్టెఫానీ. ‘‘ఇప్పుడెలా ఉంది బేబీ’’ అన్నాడు వారెన్ కూతురి తల నిమురుతూ. ఫరవాలేదన్నట్టు తలూపింది. ‘‘డాడ్... నన్ను బయటకు తీసుకెళ్తావా? నాకో పనుంది’’ అంది. ఎక్కడికి అని అడగలేదు వారెన్. సరేనంటూ తలూపాడు. పది నిమిషాల్లో తయారై స్టెఫానీని తీసుకుని బయలుదేరారు తల్లిదండ్రులిద్దరూ. కిడ్నాప్ కారణంగా శారీరకంగానే కాదు, మానసికంగా కూడా గాయపడింది స్టెఫానీ. టీవీలు, పేపర్లలో విరివిగా కథనాలు రావడంతో అందరూ గుర్తు పట్టేవారు. దాంతో బయటకు వెళ్లడమే మానేసింది. వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. పేరు కూడా మార్చుకుంది. ఉద్యోగం లేదు. నాటి హోదా లేదు. పెళ్లి కూడా చేసుకోలేదు. కూతురి పట్ల జరిగినదాన్ని జీర్ణించుకోలేక తల్లి మంచం పట్టి చనిపోయింది. స్టెఫానీ తండ్రితో పాటు బ్రిటన్‌లోనే ఒకచోట జీవిస్తోంది. ఇరవయ్యేళ్లు గడిచిపోయినా పీడకలలా వెంటాడుతున్న గతాన్ని తరిమేయలేకపోతోంది. కొత్త జీవితానికి పునాది వేసుకునే ధైర్యం చేయలేకపోతోంది. చానెల్ ఆఫీసును చూస్తూనే... ‘‘ఇక్కడ ఆపాలా? ఎందుకు?’’ అన్నాడు వారెన్ అర్థం కానట్టుగా. ‘‘పని ఉంది డాడ్’’ అంటూ కారు దిగింది స్టెఫానీ. ఆ వెనుకే వాళ్లూ దిగారు. ‘‘మమ్మీ... ఇప్పుడు నేనో పని చేయబోతున్నాను. దానివల్ల నీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. వాటిని నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. కానీ తప్పదు. నన్ను క్షమించు’’ అనేసి లోనికి నడిచింది స్టెఫానీ. ఇద్దరూ ఆమెను అనుసరించారు. అంతవరకూ హడావుడిగా, సందడిగా ఉన్న ఆ ఆఫీసు స్టెఫానీ రాకతో ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. కొందరి కళ్లలో ఆమె ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలన్న ఉత్సుకత. మరికొందరి కళ్లలో పాపం అన్న జాలి. ఆ చూపులను దాటుకుంటూ సీఈవో క్యాబిన్‌కు వెళ్లింది. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడతడు. ‘‘స్టెఫానీ స్లేటర్... మీరిక్కడ...’’ ‘‘నేను కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను సర్. దానికి మీ అనుమతి కావాలి. కాస్త సమయం కేటాయించాలి’’... తడుముకోకుండా చెప్పింది. కొన్ని నెలలుగా భీతహరిణిలా ఉంటున్న ఆమె, ఒక్కసారిగా సింహపు పిల్లలా రొమ్ము విరుచుకుని నిలబడటం చూసి విస్మయం చెందుతున్నారు వారెన్, బెట్టీలు. ‘‘తప్పకుండా మిస్ స్టెఫానీ. పదండి స్టూడియోకి వెళ్దాం’’ అన్నాడు సీఈవో. అతని వెనుకే నడిచింది స్టెఫానీ. మరో పది నిమిషాల్లో టీవీ స్క్రీన్ల మీద ప్రత్యక్షమయ్యిందామె. ‘‘అందరికీ నమస్కారం. నా పేరు స్టెఫానీ... స్టెఫానీ స్లేటర్. నాకు తెలుసు నన్ను నేను పరిచయం చేసుకోనక్కర్లేదని. ఎందుకంటే మీ అందరికీ నా కథ తెలుసు. ఇక తెలియాల్సింది నా వ్యథ మాత్రమే. అది చెప్పడానికే నేను వచ్చాను. కాసేపటి క్రితం ఇదే చానెల్లో ఒక వార్త చూశాను... నాతో నడిపిన ప్రేమాయణాన్ని తన ఆత్మకథలో రాస్తానని మైఖేల్ శామ్ చెప్పాడని. అతడు చెప్పాడు. వీళ్లు ప్రసారం చేశారు. మీరు చూశారు. నాకు తెలుసు... ఆ వార్త వింటూనే మీ అందరికీ హుషారొచ్చేసి ఉంటుంది. మా ఇద్దరి ప్రేమ గురించీ తెలుసుకోవాలన్న ఆతృత పెరిగిపోయి ఉంటుంది. కానీ మీరు చెప్పండి... కిడ్నాప్ చేసిన వ్యక్తికీ, కిడ్నాప్ అయిన అమ్మాయికీ మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? కళ్లకు గంతలు కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లూ చేతులూ కట్టేసి, నిలువునా వివస్త్రను చేసి, పచ్చిపుండు అయిన శరీరాన్ని పశువులా ఆక్రమించుకునేవాడిని ఏ ఆడపిల్ల అయినా ఎలా ప్రేమిస్తుంది?’’ నివ్వెరపోయింది బెట్టీ. ఏం చెబుతోంది తన కూతురు! తను రేప్‌కి గురయ్యిందా? ఆ తల్లి మనసు విలవిల్లాడిపోయింది. కూతురి చేతిని పట్టుకుంది. ఆ స్పర్శలోని ఆతృతను అర్థం చేసుకుంది స్టెఫానీ. తల్లి చేతిని ప్రేమగా తడిమింది. ‘‘నా కథ మీ అందరికీ తెలుసని మీరనుకుంటున్నారు. కానీ మీకు పూర్తిగా తెలియదు. నా తల్లిదండ్రుల మనసు గాయపడకూడదని నేను కొన్ని విషయాలు దాచిపెట్టాను. కానీ దానివల్ల నా వ్యక్తిత్వానికే కళంకం ఏర్పడుతుందని అనుకోలేదు. మైఖేల్‌తో నేను ప్రేమాయణం నడపలేదు. అతడి క్రూరత్వానికి బలయ్యాను. అతడు నా శరీరాన్ని మలినపరిచాడు. నా జీవితాన్ని నాశనం చేశాడు. నా అందమైన భవిష్యత్తును కాలరాశాడు. బతుకంతా వెంటాడే పీడకలలా మిగిలిపోయాడు’’. స్టెఫానీ గొంతు బొంగురుపోయింది. దుఃఖం పొంగుకొచ్చింది. దాన్ని అణచు కోలేక బావురుమంది. కానీ ఆమెకు తెలియదు... ఆ క్షణం లక్షలాది కళ్లు ఆమెను చూసి కన్నీళ్లు పెట్టాయని! అంతగా అందరి మనసులనూ కలచివేసిన స్టెఫానీ కథ ఇలా ప్రారంభం కాలేదు. అమ్మానాన్నల అనురాగంతో పువ్వులా పెరిగిందామె. చలాకీగా ఉండేది. చదువు పూర్తి చేస్తూనే ఓ పెద్ద కంపెనీలో రియల్ ఎస్టేట్ ఏజెంటుగా చేరింది. కస్టమర్లు ఆమె మాటలకు మంత్ర ముగ్ధులయ్యేవారు. ఫలితంగా కంపెనీకి లాభాల పంట పండేది. దాంతో ముఖ్యమైన కస్టమర్లందరినీ ఆమె చేతికే అప్పగించేవాడు బాస్. అలానే మైఖేల్ శామ్తో డీల్ కుదుర్చుకునే బాధ్యతను కూడా అప్పగించాడు. అది ఎంత పెద్ద తప్పో తర్వాత తెలిసిందతడికి. జనవరి 22, 1992. మైఖేల్ శామ్కి ఓ ఇంటిని చూపించడానికి వెళ్లింది స్టెఫానీ. ఇల్లంతా తిప్పి చూపిస్తుండగా ఆమె మీద దాడి చేశాడు శామ్. పీక మీద కత్తి పెట్టి, చేతులు వెనక్కి విరిచి వైరుతో కట్టేశాడు. కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లి కారులో పడేశాడు. నోట్లో గుడ్డలు కుక్కి ఎక్కడికో తీసుకుపోయాడు. ఏం జరుగుతోందో తెలియదు. తననేమి చేయబోతున్నాడో అర్థం కాదు. బిక్కచచ్చిపోయింది స్టెఫానీ. అతడు తనను వివస్త్రను చేస్తున్నా నోరు మెదపలేకపోయింది. బలవంతంగా అనుభవిస్తున్నా అరిచి గోల చేయలేకపోయింది. తప్పించుకోలేక, ఆ బాధను అనుభవించలేక విలవిల్లాడిపోయింది. ఆ రాక్షసుడు స్టెఫానీ శరీరాన్ని ఉండలా చుట్టేసి ఓ ఇరుకైన పెట్టెలో బంధించాడు. బాధతో మూలుగుతున్నా, చలితో వణుకుతున్నా కనికరించలేదు. ఎనిమిది రోజుల పాటు నరకం చూిపించాడు. తర్వాత శామ్ స్టెఫానీ పని చేసే ఆఫీసుకు ఫోన్ చేశాడు. 1,75,000 డాలర్లు ఇస్తే ఆమెను విడిచిపెడతానన్నాడు. బాస్ అంగీకరించాడు. పోలీసుల సాయంతో శామ్ని పట్టుకోడానికి పథకం రచించాడు. డబ్బు తీసుకుని వెళ్లాడు. కానీ అనుకోని అవాంతరాల వల్ల ప్లాన్ వర్కవుటవ్వలేదు. డబ్బు తీసుకుని శామ్ పారిపోయాడు. పోలీసులు గాలింపులు తీవ్రతరం చేశారు. దాంతో స్టెఫానీని చంపేయాలనుకున్నాడు శామ్. కానీ చంపలేకపోయాడు. ఎందుకంటే స్టెఫానీ తెలివిగా ప్రవర్తించింది. అతడి అధీనంలో ఉన్న ఎనిమిది రోజుల్లో అతడితో మాట కలిపింది. రియల్ ఎస్టేట్ ఏజెంటుగా అవతలి వ్యక్తిని ఇంప్రెస్ చేసేలా మాట్లాడే కళ ఆమెకు బాగా తెలుసు. దాన్నే ప్రయోగించింది. అతడు మెత్తబడ్డాడు. చంపకుండా తీసుకెళ్లి ఆమె ఇంటిముందు వదిలేశాడు. బ్రిటన్‌లోని అన్ని ప్రముఖ చానెళ్లలోనూ స్టెఫానీ కిడ్నాప్ ఉదంతం ప్రసారమయ్యింది. దాంతో పాటు స్టెఫానీ బాస్‌తో శామ్ ఫోన్లో మాట్లాడిన రికార్డుల్ని కూడా ప్రసారం చేశారు. వాటిని విన్న శామ్ భార్య పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఆ గొంతు తన భర్తదేనని చెప్పి, అతడెక్కడున్నాడో తెలిపింది. గతంలో జూలీ డార్ట్ అనే అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపింది కూడా అతడేనని అర్థం చేసుకున్న పోలీసులు ఇరవై నాలుగ్గంటలు తిరిగేలోగా శామ్‌ను అరెస్ట్ చేశారు. న్యాయస్థానం జీవితాంతం జైలులోనే ఉండమంటూ శిక్షించింది. కటకటాల మధ్య కఠిన శిక్షను అనుభిస్తూ కూడా తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు శామ్. స్టెఫానీ తనతో ప్రేమలో పడిందన్నాడు. తమ ప్రేమకథను ఆత్మకథగా రాస్తానని అన్నాడు. దాంతో కడుపు మండిన స్టెఫానీ అందరి ముందుకూ వచ్చింది. అంతవరకూ తనను చిత్రహింసలు మాత్రమే పెట్టాడని చెప్పిన ఆమె... తొలిసారిగా తనపై అత్యాచారం జరిగిందన్న విషయాన్ని బయటపెట్టింది. ‘‘నాకెందుకు చెప్పలేదురా... ఇంత బాధని మనసులో దాచుకున్నావా?’’... కూతురి కళ్లలోకి చూస్తూ అడిగాడు వారెన్. ‘‘సారీ డాడ్. చెప్పాలనే అనుకున్నాను. కానీ అప్పుడు కలిగిన బాధకంటే... ఆ నిజం విన్నప్పుడు మీరు పడే వేదనను చూడటమే పెద్ద బాధ. దాన్ని భరించే ఓపిక నాకు లేదు. అందుకే చెప్పలేదు.’’ చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకున్నాడు వారెన్. ఓ చేతితో కూతురిని, మరో చేతితో భార్యని దగ్గరకు తీసుకుని కారువైపు నడిచాడు. - సమీర నేలపూడి -
క్షమించలేను
అమ్మ... ఏ మనిషి జీవితానికైనా పునాది. జన్మనిచ్చిన నాటి నుంచి జన్మను చాలించే వరకూ కూడా బిడ్డే లోకంగా బతుకుతుంది తల్లి. కానీ మౌరీన్ అలా చేయలేదు. చేసి ఉంటే కొలెట్ జీవితం ఇలా ఉండేది కాదు. మౌరీన్ తనకు జన్మనిచ్చినా ఆమెను అమ్మా అని పిలవడానికి ఇష్టపడదు కొలెట్. ఎందుకని? అంతగా ఆ తల్లి ఏం చేసింది? ఈ బిడ్డ మనసు ఎందుకు విరిగింది? ‘‘వెరీగుడ్... నీకిక ఏ సమస్యా లేదు. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్రైట్’’ డాక్టర్ అన్న మాటకు నవ్వొచ్చింది నాకు. ఏ సమస్యా లేదట. నా జీవితమే ఒక సమస్యని ఆయనకు తెలియదు కదా.. అందుకే ఆ మాట అనివుంటాడు. లేదంటే ఆత్మహత్యాయత్నం చేసి, మృత్యుదేవత చిన్నచూపు చూస్తే బతికినదాన్ని పర్ఫెక్ట్లీ ఆల్రైట్ అని అంటారా ఎవరైనా! డాక్టర్ నన్ను పరీక్షిస్తూ ఉంటే నేను గుమ్మం దగ్గర నిలబడి ఉన్న మా అమ్మనే చూస్తున్నాను. నా కూతురు బాగయ్యిందో లేదోనన్న ఆతృత ఆమెలో కించిత్ కూడా లేదు. నా చావు తనకు చుట్టుకుంటుందని భయపడి చికిత్స చేయించి ఉంటుంది తప్ప, నేను బతికినందువల్ల ఆమెకు ఏ ఆనందమూ కలగదు.కన్నతల్లి గురించి ఇలా మాట్లాడుతోందేమిటి అనుకుంటున్నారా? నా కథ తెలిస్తే నా మాటలు తప్పనిపించవు మీకు. కన్నతల్లి ఒడి సైతం క్రూరమృగపు నీడ అయిన దౌర్భాగ్యం నాది. ఉప్పెనంత శోకసంద్రంలో గుప్పెడంత మమత కోసం వెతికిన వెత నాది. ఈ లోకమంతా ప్రేమే నిండి ఉంటుందని అంటారు. అంత ప్రేమలో రవ్వంత కూడా నాకు దొరకలేదంటే నమ్ముతారా?! అప్పుడు నాకు ఎనిమిదేళ్లు. సడెన్‌గా పోలీసులు వచ్చారు. నన్ను తమతో రమ్మన్నారు. ఎందుకు అని అడిగే ధైర్యం నాకు లేదు. అడగాలని కూడా అనిపించలేదు. మౌనంగా అనుసరించాను. వాళ్లు నన్ను తీసుకెళ్లి ఓ మహిళకు అప్పగించారు. ఆమె నన్ను తనతో తీసుకెళ్లింది. ‘దొంగతనం చేసినందుకు మీ అమ్మని అరెస్ట్ చేశారు, ఆమె వచ్చేవరకూ నువ్వు నా దగ్గరే ఉండాలి’ అంది. నా స్థానంలో మరెవ్వరూ ఉన్నా బెంబేలెత్తి ఉండేవారు. కానీ నేను మాత్రం సంతోషపడ్డాను. కొన్నాళ్లయినా మా అమ్మకు దూరంగా ఉండే అదృష్టం దక్కినందుకు పొంగిపోయాను. అక్కడ నాకో కొత్త ప్రపంచం పరిచయమయ్యింది. ఆ ప్రపంచం నిండా ఆనందమే! ఆ ఆంటీ నన్ను బాగా చూసుకునేది. కడుపు నిండా తిండి పెట్టేది. ఆడుకోనిచ్చేది. ప్రతి ఆదివారం చర్చ్‌కి తీసుకెళ్లేది. కారులో క్యాండీస్ ఇచ్చి తినమనేది. నాకు కళ్లలోంచి నీళ్లొచ్చేవి. అవి మా అమ్మమీద బెంగతో వచ్చాయని ఆమె అనుకునేది. కానీ తనలాంటి అమ్మ లేదనే బాధతో వచ్చాయని ఆమెకు అర్థమయ్యేది కాదు. ఆరు నెలల శిక్ష ముగిశాక మా అమ్మ వచ్చింది. ఈ అమ్మకాని అమ్మను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు నేను పడిన బాధ అంతా ఇంతా కాదు. ఎవరైనా తల్లికి దూరమైతే బాధపడతారు. నేను తల్లి దగ్గరకు వెళ్లడానికి ఎందుకు బాధపడుతున్నాను అనే సందేహం వచ్చింది కదూ! అది నివృత్తి కావాలంటే... నా బతుకు పుస్తకంలోని ప్రతి పేజీ మీకు తెలియాలి. భర్త స్కాట్‌తో సంతోషంగా కొలెట్ కొలెట్ ఇప్పటికీ కోలుకోలేదు. దుర్మార్గురాలైన తల్లి పెట్టిన బాధలు ఆమెను ఇంకా వేధిస్తూనే ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. అయితే భర్త, పిల్లల అనురాగం ఆమెను కాపాడుతోంది. మరో విషయం ఏమిటంటే... చిన్నప్పుడు తన గురించి ఎన్ని ఫిర్యాదులు అందినా పట్టించుకోకుండా వదిలేసిన ఎన్జీవో మీద కొలెట్ కేసు వేసింది. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న న్యాయస్థానం... కొలెట్కు భారీ నష్ట పరిహారాన్ని చెల్లించమంటూ సదరు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. పిల్లలను హింసించేవారిని, ఆ హింసను చూస్తూ కూడా పట్టించుకోని వారిని శిక్షకు అర్హులుగా ప్రకటిస్తూ యూకే ప్రభుత్వం ‘సిండ్రెల్లా చట్టం’ రూపొందించింది. బర్మింగ్‌హామ్ (ఇంగ్లండ్)... ఈ పేరు చెప్పగానే అందరికీ ప్యాలెస్ గుర్తొస్తుంది. కానీ అక్కడ రాజభవనాలే కాదు.. వెలుగు కూడా చొరబడని ఇరుకు నివాసాలూ ఉన్నాయి. అలాంటి ఓ ఇంట్లో ఉండేవాళ్లం మేము. నాకు ఊహ తెలిసేనాటికి మా అమ్మానాన్నలతో ఉన్నాను. కానీ ఊహ తెలిసిన కొన్నాళ్లకు మా నాన్న స్థానంలోకి మరో వ్యక్తి వచ్చాడు. తానే నాన్నని అన్నాడు. అమ్మ అదే నిజమంది. దాంతో అతడిని నాన్నా అని పిలవడం మొదలు పెట్టాను. కానీ తర్వాత అర్థమైంది, అతడు ‘నాన్న’ అన్న పిలుపునకు అనర్హుడని. అతగాడికి నామీద కోపమెందుకో అర్థమయ్యేది కాదు. నన్నెందుకు ద్వేషించేవాడో అంతు పట్టేది కూడా కాదు. నన్ను చూస్తేనే ముఖం తిప్పుకునేవాడు. దగ్గరికెళ్తే తోసేసేవాడు. ఎవరి మీద కోపమొచ్చినా నా మీద చూపించేవాడు. పసిదాన్నని చూడకుండా పిడిగుద్దులు గుద్దేవాడు. తట్టుకోలేక అమ్మ దగ్గరకు పరుగెత్తేదాన్ని. మీ అమ్మ అయితే ఏం చేస్తుంది? ‘నా తల్లీ, ఎందుకేడుస్తున్నావే’ అంటూ గుండెల్లో పొదువుకునేది. కానీ మా అమ్మ ఏం చేసేదో తెలుసా? నన్ను దూరంగా తోసేది. ‘ఎప్పుడూ ఏడుస్తూ ఉంటావేంటే ఏడుపుగొట్టుదానా’ అంటూ మొట్టేది. నా అరుపులు ఆమె చెవులను చేరేవి కాదు. నా కన్నీళ్లు ఆమె మనసును తడిపేవీ కావు. అమ్మ అంటే ఇలానే ఉంటుందా అనిపించేంది. ఇల్లంటే నరకమేనేమో అని నా మనసు తలిచేది. ఎవరితోనో ప్రేమలో పడి, అమ్మ వేసిన తప్పటడుగుకు ఫలితంగా పుట్టానట నేను. అందుకే ఆమెకు నేను నచ్చనట. నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేది, వద్దనుకున్నా బయటపడ్డావ్ అని ఆమె అంటున్నప్పుడు నా చిన్ని గుండె పడిన వేదన ఎలా చెప్పాలి?! తప్పు చేసింది తను. శిక్ష ఏమో నాకా?! నన్ను చూస్తే తన తప్పు గుర్తొచ్చి బాధపడుతుందేమో అనుకున్నాను మొదట. కానీ తప్పు చేయడమే తన జీవితం అని ఆమె జీవితంలోకి వచ్చిపోతున్న మగాళ్లను చూశాక అర్థమైంది. అసహ్యం పెరిగింది. అమ్మ గురించి ఇలా మాట్లాడటం తప్పేమో. కానీ ఏనాడైనా అమ్మలా ప్రవర్తిస్తే కదా గౌరవించడానికి! అమ్మ ప్రవర్తన నన్ను పిచ్చిదాన్ని చేసింది. ఓసారి మా పక్కింటావిడ చెప్పింది... ఊహ తెలియని వయసులో నేను మా వీధిలో ఏడుస్తూ తిరిగేదాన్నట. ఆకలితో గుక్కపెట్టి ఏడ్చేదాన్నట. చూసినవాళ్లు జాలిపడి ఎత్తుకునేవారట కానీ మా అమ్మ మాత్రం బయటికొచ్చి చూసేది కాదట. ఎలా చూస్తుంది? ఇంటిలోపల చీకటి గదుల్లో తప్పు చేయడంలో మునిగిపోయివుంటే?! వీధిలోని వాళ్లు విసిగిపోయి ఓ ఎన్జీవో వాళ్లకు విషయం చెప్పార్ట. వాళ్లు వచ్చి అడిగితే అంతా అబద్ధమని అమ్మ చెప్పిందట. దాంతో వాళ్లు వెళ్లిపోయారట. దొంగని దొంగతనం చేశావా అని అడగడంలో అర్థముందా? కడుపులో దాచుకునేది తల్లి. కళ్లలో పెట్టుకుని పెంచుకునేది తల్లి. కానీ కళ్లముందే తప్పులు చేయడానికి అలవాటు పడింది నా తల్లి. తన భర్త కాని భర్త పిల్లల మీద ప్రేమ కురిపించి, నన్ను ఎంగిలాకులాగ విసిరేయాలనుకునేది నా తల్లి. సాయంత్రమైతే నేను నా గదిలోకి వెళ్లిపోవాలి. మళ్లీ పొద్దున్నే కిందికి రావాలి. మధ్యలో కనిపించానో... ఒంటిమీద వాతలు పడేవి. బాత్రూమ్కి వెళ్లాలంటే మెట్లు దిగి వెళ్లాలి. కానీ వెళ్తే చంపేస్తారని భయపడి పక్క తడిపేసేదాన్ని. ఆ తడిలోనే పొర్లాడేదాన్ని. దాహంతో నాలుక పిడచకట్టుకు పోతున్నా, ఆకలితో పేగులు మెలికలు పడుతున్నా.. కాలు కింద పెట్టడానికి వీల్లేదు. నరకం... ఘోర నరకం! దేవుడా, ఎందుకిచ్చావు ఇలాంటి జన్మ అంటూ రాత్రంతా ఏడ్చి సోలిపోయేదాన్ని. పదే పదే ఇంటి నుంచి పారిపోయేదాన్ని. కానీ ఎక్కడికెళ్లాలో తోచక మళ్లీ ఆ నరక కూపానికే చేరేదాన్ని. మా టీచర్ దగ్గర నా బాధ చెప్పుకుని ఏడ్చేదాన్ని. ఆవిడ చాలాసార్లు ఎన్జీవోకి ఫిర్యాదు చేసింది. కానీ వారి నిర్లక్ష్యం నాకు శాపమైంది. నా జీవితం మా అమ్మ రాక్షస నీడలోనే మగ్గిపోయింది. బతుకు మీద ఆశ పోయింది. పదిహేనుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేశాను. కానీ మృత్యువు కూడా మా అమ్మలాంటిదే... నన్ను తృణీకరించింది! ఇక నావల్ల కాలేదు. ఆ ఈసడింపులు, చిత్రహింసలు భరించే శక్తి నాకు లేదనిపించింది. మళ్లీ ఆ ఇంటి గడప తొక్కకూడదని నిర్ణయించుకుని పద్దెనిమిదో ఏట ఇల్లు వదిలిపెట్టాను. ఓ చిన్న ఉద్యోగం చూసుకున్నాను. నా జీవితం నేను జీవించాలని నిర్ణయించుకున్నాను. శాపనార్థాలు వినబడవు. మూతి విరుపులు కనబడవు. ఆకలిని అణచుకోనక్కర్లేదు. స్వేచ్ఛను చంపుకోనక్కర్లేదు. కన్నీళ్లు లేవు. కష్టాలు గుర్తు రావు. నాకు నచ్చినట్టుగా బతకొచ్చు అనుకున్నాను. కానీ నేను శారీరకంగానే బయటికొచ్చాను తప్ప మానసికంగా కాదు. కన్నుమూస్తే పీడకలలు! అమ్మరూపం కదలాడగానే ఉలిక్కిపడి లేచేదాన్ని. ప్యానిక్ అటాక్స్ వచ్చి పిచ్చిదాన్ని అయ్యేదాన్ని. శాపగ్రస్తమైన నా బాల్యం నన్ను వెంటాడి భయపెట్టేది. ఆ జ్ఞాపకాలు పదే పదే నా జీవితంలోకి తొంగి చూసి వణికించేవి. అప్పుడే ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఆడ పిల్లలకు తల్లిని చేశాడు. కానీ అతడు మా అమ్మను మించిన క్రూరుడు. మొదట ప్రేమను ఒలకబోసినవాడు మెల్లగా హింసించడం మొదలు పెట్టాడు. నన్ను, నా పిల్లల్ని చంపేస్తానని బెదిరించేవాడు. పిల్లలతో పాటు బాత్రూమ్లో భయంగా దాక్కున్న రోజులు నాకింకా గుర్తున్నాయి. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న నా చిట్టి తల్లుల్ని గుండెలకు అదుముకుని వెక్కి వెక్కి ఏడ్చిన క్షణాలు ఇంకా నన్ను గుచ్చుతూనే ఉన్నాయి. ఎలాగైతేనేం... వాడి కబంధ హస్తాల నుంచి తప్పించుకున్నాను. వాడి నీడ పడని చోటికి నా పిల్లల్ని తీసుకుని పారిపోయాను. కష్టపడి వాళ్లను పెంచడం మొదలుపెట్టాను. వాళ్ల చుట్టూ అందమైన ప్రపంచాన్ని అల్లుకోవడం ప్రారంభించాను. అప్పుడే మా ప్రపంచంలోకి చొరబడ్డాడు స్కాట్ ఎలియట్. నా మీద మనసు పడ్డాడు. గత అనుభవాలు నన్ను హెచ్చరించడంతో దూరం జరిగాను. దగ్గర కాలేనని చెప్పాను. అర్థం చేసుకున్నాడు. అంగీకారం కోసం ఎదురు చూశాడు. చివరకు నా మనసును గెలుచుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకుని నా పిల్లలకు తండ్రిగా మారాడు. నాకంటే ఎక్కువగా నా పిల్లలను ముద్దు చేస్తాడు. మా ఇద్దరికీ ఇద్దరు పిల్లలు కలిగినా తనకు పుట్టని నా బిడ్డలను కూడా గుండెల్లో పెట్టుకుంటాడు. ఇప్పుడు నా చుట్టుపక్కలంతా సంతోషమే ఉంది. కానీ నా గుండెల్లో ఎక్కడో ఓ మూల మా అమ్మ ఇంకా ఉంది. అప్పుడప్పుడూ భయపెడుతూంటుంది. ప్యానిక్ అటాక్స్‌తో నేను వణికిపోతుంటే నా భర్త, పిల్లలు నన్ను హత్తుకుంటారు. ఆ స్పర్శలో నీకు మేమున్నామనే భరోసా కనిపిస్తుంది. అది చాలు నాకు గత జీవితపు చేదును మరచిపోవడానికి. అది చాలు బతుకులో అమృతాన్ని నింపుకోవడానికి! (పలు ఇంటర్వ్యూలు, తను రాసిన ‘అన్ ఫర్‌గివబుల్’ అనే పుస్తకంలో కొలెట్ చెప్పిన విషయాల ఆధారంగా) - సమీర నేలపూడి -
నా పిల్లల్ని మాత్రం ఇండస్ట్రీకి రానివ్వను!
సంభాషణం మా అమ్మాయి ఎంబీయే చదువుతోంది. బాబు ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నాడు. వాళ్లిద్దరూ ఇండస్ట్రీవైపు రాకూడదన్నదే నా కోరిక. ఇక్కడి లాభనష్టాలు, కష్టసుఖాలు చూసిన తరువాత నేనా నిర్ణయం తీసుకున్నాను. ముఖ్యంగా పాపకు అలాంటి ఆశ ఉంటే మాత్రం కచ్చితంగా అడ్డుపడిపోతాను. బాబు ఏమంటాడో చూడాలి. మావాళ్లు వద్దన్నా నేను వచ్చేశాను కదా... వాడూ అలా చేస్తే నేనేం చేయగలను! ‘కొండలా కోర్సువుంది ఎంతకీ తగ్గనంది’ అంటూ ‘శివ’ సినిమాలో పుస్తకాల రాశిని చూసి బెంగపడిపోతూ ప్రేక్షకులను నవ్వించాడు. ‘తులసీదళం’ సీరియల్లో శ్రీనివాస పిళ్లై పాత్రలో క్రూరత్వాన్ని ప్రదర్శించి అందరినీ భయపెట్టాడు. ‘మహాత్మ’ చిత్రంలో గాంధీ మహాత్ముడిని తలపిస్తూ హృదయాలను స్పృశించాడు. ఇంత వైవిధ్యతను ప్రదర్శిస్తాడు కనుకనే ‘రాం జగన్’ అందరి మనసుల్లో స్థానం సంపాదించాడు. తన నట ప్రయాణంలోని ఒడిదుడుకుల గురించి ఆయన మనసు విప్పి చెప్పిన మాటలివి... ఈ మధ్య మిమ్మల్ని చూడగానే ‘మహాత్మ’ సినిమా గుర్తొస్తోంది...? ఈ మధ్య అందరూ ఇలానే అంటున్నారు. ఆ సినిమాలో గాంధీ వేషం గురించే మాట్లాడుతున్నారు. కొందరైతే చేతులెత్తి దణ్నం కూడా పెట్టారు. అసలా పాత్ర ఆఫర్ చేసినప్పుడు మీకేమనిపించింది? మొదట ఓ చిన్న షాట్ కోసమే అడిగారు. నాకు శ్రీకాంత్ అంటే చాలా ఇష్టం. అందుకే ఒక్క షాట్ అయినా ఫర్వాలేదని చేశాను. కొన్ని రోజుల తర్వాత కృష్ణవంశీ నుంచి కబురొచ్చింది. వెళ్తే రకరకాల గెటప్పులు వేయించి షూట్ చేశారు. ‘ఇదంతా నీకోసం కాదు, గెటప్స్ టెస్ట్ చేయడానికే, వీలైతే నీకు వేరే ఏదైనా పాత్ర ఇస్తాలే’ అన్నారు. కానీ నాలుగు రోజుల తర్వాత పిలిచి నువ్వే చేస్తున్నావ్ అన్నారు. ఆనందంతో నోట మాట రాలేదు. చాలా యేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. అసలిటువైపు ఎలా వచ్చారు? మాది ప.గో. జిల్లాలోని చెరకువాడ. చిన్నప్పట్నుంచీ ఎన్టీయార్ అంటే పిచ్చి. ఆయన పోస్టర్లు కట్ చేసి, పుస్తకాలకు అట్టలు వేసుకునేవాడిని. ఇంటర్మీడియెట్ చేశాక మైన్స్ సర్వేయింగ్‌లో డిప్లొమో చేయడానికి గూడూరు వెళ్లాను. అక్కడ రూమ్మేట్స్తో కలిసి విపరీతంగా సినిమాలు చూశాను. అప్పుడే నటన మీద ఆసక్తి కలిగింది. మంచి కమెడియన్ని అవ్వగలనన్న నమ్మకంతో హైదరాబాద్ వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాను. తెరమీద ఎప్పుడు కనిపించారు? ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నప్పుడే శోభన్‌బాబు హీరోగా చేసిన ‘మాంగల్యబలం’ సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటికి ఇండస్ట్రీ ఇంకా మద్రాసులోనే ఉండటంతో... ఆ సినిమా పూర్తయ్యాక మద్రాస్ వెళ్లిపోయాను. కొన్ని సినిమాలు చేశాక ‘శివ’లో చాన్స్ వచ్చింది. ఆ సినిమాతోనే బ్రేక్ కూడా వచ్చింది. కొన్నాళ్ల తర్వాత డల్ అయ్యారెందుకు? ఇండస్ట్రీ హైదరాబాద్‌కు షిఫ్టయ్యాక ఇక్కడకు వచ్చేశాను. అప్పుడు ఓ చానెల్‌వారు సీరియల్స్‌లో వరుస అవకాశాలిచ్చారు. బుల్లితెర మీద బిజీ అయిపోవడంతో వెండితెర అవకాశాలు తగ్గాయి. మరి మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నించలేదా? నేనెప్పుడూ ఆల్బమ్స్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగలేదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ పోయాను. అయితే ఒక గుర్తింపు వచ్చిన తర్వాత ఏది పడితే అది చేయడానికి మనసొప్పలేదు. మహాత్మ తర్వాత మంచి అవకాశాలు వస్తాయనుకున్నాను కానీ అలా జరగలేదు. ఒకవేళ ప్రయత్న లోపమేమో? కావచ్చు. అయితే అవకాశాల కోసం ఒక హద్దు దాటి నేను ప్రయత్నించలేను. వెండితెర మీద వెలగడం కోసం విలువల్ని వదులుకోవడం నావల్ల కాదు. అలాగని పైకి వచ్చినవాళ్లంతా అలా చేశారనట్లేదు. నాకలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని మాత్రమే చెబుతున్నాను. కెరీర్ మీకు అసంతృప్తినే మిగిల్చిందన్నమాట? కాదని అంటే అబద్ధం చెప్పినట్టు అవుతుంది. హీరోని కావాలనుకోలేదు. సినిమా అంతటా కనిపించే పాత్రల్నీ కోరుకోలేదు. రెండు మూడు సన్నివేశాలే ఉన్నా, నా టాలెంటుకు తగిన రోల్స్ కోరుకున్నాను. నేను కోరుకున్నదే తక్కువ. ఆ తక్కువ కూడా దొరకలేదే అని ఫీలవుతుంటాను. ఓ ప్రెస్‌మీట్ జరిగితే... దర్శకుడు, హీరో, హీరోయిన్, విలన్‌లాంటి కొందరి పేర్లు రాసి, తదితరులు అంటూ వదిలేస్తారు తప్ప కనీసం మా పేర్లు కూడా రాయరు. అలా ఉంటుంది పరిస్థితి! సీరియల్స్ అయినా చేయవచ్చు కదా? చేస్తూనే ఉన్నాను. ఒక రకంగా సీరియళ్లు నాలోని నటుడిని తృప్తి పరిచాయి. కానీ ఎన్ని సీరియళ్లు చేసినా మనసంతా సినిమా మీదే ఉంటుంది. నటన కాకుండా ఇంకేమైనా...? నాకు నటన అంటేనే ఇష్టం. అదే చేస్తాను. సమాజానికి కూడా ఏదైనా చేయాలని ఉంది. ఏదో నాకున్న దానిలో కాస్త సేవకు వెచ్చిస్తుంటాను. ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్‌కి ప్రతి యేటా విరాళాలు పంపిస్తాను. థ్యాంక్స్ చెబుతూ వాళ్లు పంపిన ఉత్తరం చూసినప్పుడల్లా మరొకరికి సాయపడగలిగే స్థాయిలో ఉన్నందుకు సంతోషపడుతుంటాను. లేనిదానికి బాధపడే తత్వం కాదు నాది. నవ్వుతూనే బతికేస్తాను. నిజాయతీగా ఉంటే చాలనుకుంటాను. ఇక అంతా ఆ పైవాడి దయ! - సమీర నేలపూడి -
కాలిపోయిన వెన్నెల
నిజాలు దేవుడికెరుక జూన్ 1, 2013... ముంబై హాస్పిటల్... అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎమర్జెన్సీ రూమ్ బయట ఉన్న బెంచీ మీద ఓ యాభయ్యేళ్ల వ్యక్తి, నలభయ్యేళ్లు దాటిన మహిళ ఉన్నారు. ఆమె కళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. దుఃఖం పొంగుకొస్తుంటే ఆ శబ్దం బయటకు రాకూడదని చీర చెంగును నోటిలో కుక్కుకుంటోంది. ఆమె పక్కనే కూచున్న వ్యక్తి చూపులు శూన్యాన్ని కొలుస్తున్నాయి. బాధను దిగమింగుతున్నట్టుగా గొంతు దగ్గర నరాల కదలిక చెబుతోంది. అంతలో ఎమర్జెన్సీ రూమ్ తలుపులు తెరచుకున్నాయి. నర్స్ బయటకు వచ్చింది. వాళ్లవైపు చూసి, ‘‘లోపలికి రండి’’ అనేసి లోనికి వెళ్లిపోయింది. వణుకుతోన్న కాళ్లను అతి కష్టమ్మీద నేలకు అదిమి పెడుతూ ఇద్దరూ లోనికి నడిచారు. మంచమ్మీద ఓ ఇరవై మూడేళ్ల అమ్మాయి ఉంది. ఒళ్లంతా తెల్లని దుప్పటి కప్పేశారు. ముఖం మాత్రమే కనిపిస్తోంది. చూడలేనంత దారుణంగా ఉందా ముఖం. చర్మం కాలిపోయింది. కండరాలు ఉడికి పోయి, రక్తం ఉబికి వచ్చి దయనీయంగా ఉంది. ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు ఆమెను పరీక్షిస్తున్నారు. గబగబా వారి దగ్గరకు వెళ్లారు ఆ భార్యాభర్తలిద్దరూ. ‘‘ఏం జరిగింది’’ అనడిగారు కంగారుగా. ‘‘తను మీతో మాట్లాడాలనుకుంటోంది’’ అనేసి వెళ్లిపోయాడు డాక్టర్. నర్సులు దూరంగా జరిగి నిలబడ్డారు. ఆ మహిళ మంచం దగ్గరగా నడిచి, వంగి ఆ అమ్మాయి ముఖంలోకి చూసింది. సగం తెరిచిన కళ్లు... ఆ కళ్ల నుంచి జాలువారుతోన్న కన్నీళ్లు... కన్నబిడ్డను ఆ స్థితిలో చూడలేక ఆ తల్లి ఘొల్లుమంది. తండ్రి గుండె చిక్కబట్టుకున్నాడు. ‘‘ఏదో మాట్లాడాలన్నావంట, ఏమైనా కావాలా తల్లీ?’’ అడిగిందామె. ఆ అమ్మాయి బలవంతాన మాట కూడదీసుకుంది. పలుకులు మూటగట్టుకుంది. గొంతు పెగల్చుకుని చిన్నగా అంది... ‘‘ఎందుకిలా జరిగిందమ్మా? నేనేం పాపం చేశాను?’’ అంతే... మరుక్షణం ఆ మాట మూగబోయింది. ఆమె శ్వాస ఆగిపోయింది. ‘ప్రీతీ’ అన్న కేకతో ఆ ఆసుపత్రి దద్దరిల్లింది. ఆ తల్లిదండ్రుల ఆవేదన చూసి వైద్యులు, నర్సుల కళ్లు సైతం చెమ్మగిల్లాయి. అసలు ఎవరీ ప్రీతి? తనకేం జరిగిందో కూడా తెలియని స్థితిలో నిస్సహాయంగా ఎందుకు మరణించింది? మార్చ్ 28, 2013. బీబీఎంబీ కాలనీ (ఢిల్లీ)... రోషిణి వంట గదిలో ఉంది. ఆమె భర్త అమర్‌సింగ్ రాఠీ హాల్లో కూచుని ఏదో పత్రిక చదువుతున్నాడు. హితేష్ (21), తనూ (19) టీవీలో ఏ చానెల్ చూడాలా అని కొట్లాడుకుంటున్నారు. అప్పుడే బయటి నుంచి సుడిగాలిలా వచ్చింది ప్రీతి. చేతిలో ఉన్న కవర్ని చూపుతూ గంతులేయడం మొదలెట్టింది. ‘‘ఏంటక్కా అది’’... ఆతృతగా అడిగింది తనూ. ‘‘చెప్పనుగా. ముందు నాన్నకే చూపిస్తాను’’ అంటూ తండ్రి దగ్గరకు పరిగెత్తి ఆయన పక్కనే సోఫాలో కూర్చుంది. చేస్తున్న పని ఆపి కూతురివైపు మురిపెంగా చూశాడు అమర్‌సింగ్. ‘‘ఏంట్రా అది’’ అన్నాడు కవర్ని అందుకుంటూ. దాన్ని తెరచి చూసిన అతడి కళ్లు ఆనందంతో, ఆశ్చర్యంతో అరమోడ్పులయ్యాయి. కూతురి ముఖంలోకి నమ్మలేనట్టుగా చూశాడు. ప్రీతి నవ్వింది. ‘‘నాకు మిలిటరీలో నర్స్‌గా ఉద్యోగం వచ్చింది నాన్నా. ఇంకో నెల రోజుల్లో ముంబై వెళ్లి జాయినవ్వాలి’’ ఆ మాట వింటూనే హితేష్, తనూలు అక్క దగ్గరకు వచ్చేశారు. ‘‘వావ్ అక్కా... కంగ్రాట్స్’’ అన్నాడు హితేష్ ప్రీతిని పట్టి ఊపేస్తూ. ‘‘మరి నా పార్టీ సంగతేంటి’’ అంది తనూ చేతులు రెండూ నడుముకు ఆన్చి, డిమాండ్ చేస్తున్నట్టుగా. ‘‘ఇస్తాలేవే’’ అంటూ చెల్లెలి నెత్తిమీద మొట్టింది ప్రీతి. ఈ సందడికి వంటింట్లోంచి వచ్చిన రోషిణి కూతురి ప్రయోజకత్వాన్ని చూసి పొంగిపోయింది. ‘‘నాకు తెలుసురా నువ్వు అనుకున్నది సాధిస్తావని’’ అంది కళ్లొత్తుకుంటూ. ‘‘అమ్మో... అమ్మ మళ్లీ ట్యాప్ తిప్పింది’’ అన్నాడు హితేష్ భయం నటిస్తూ. అందరూ ఫక్కుమన్నారు. ఆ రోజంతా ఆ ఇంట నవ్వుల పువ్వులు విరబూశాయి. మే 2, 2013... ముంబై రైల్వేస్టేషన్. గరీబ్థ్ ్రవచ్చి ప్లాట్‌ఫామ్ మీద ఆగింది. ఎస్ 2 బోగీలోంచి ప్రీతి జింక పిల్లలా చెంగున దిగింది. ఆ వెనుకే ఆమె తల్లిదండ్రులు, బాబాయ్ వినోద్, పిన్ని సునీత దిగారు. అందరూ కలిసి ‘ఎగ్జిట్’వైపు నడవడం మొదలు పెట్టారు. కబుర్లు చెబుతూ హుషారుగా అడుగులు వేస్తోన్న ప్రీతి... తన భుజాన్ని ఎవరో తట్టినట్టు అనిపించడంతో ఆగి వెనక్కి చూసింది. ఎవరో వ్యక్తి. ముఖానికి గుడ్డ కట్టుకున్నాడు. కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అతడెవరో పోల్చుకుందామని ప్రయత్నిస్తుండగానే అతడి చేయి పైకి లేచింది. ప్రీతి శరీరం భగ్గుమంది. ‘అమ్మా’ అంటూ ప్రీతి అరిచిన అరుపు కొన్ని కిలోమీటర్ల మేర ప్రతిధ్వనించింది. నేలకూలింది ప్రీతి. ఒళ్లంతా మైనంలా కరిగిపోతోంది. రక్తం ఉబికి వస్తోంది. ఒళ్లు కాలిన వాసన గుప్పుమంటోంది. ‘‘ఎవరో యాసిడ్ పోశారు’’ అరిచాడో వ్యక్తి. అమర్‌సింగ్, రోషిణిల గుండెలు అదిరిపోయాయి. ‘ప్రీతీ’ అంటూ కూతురి దగ్గరకు పరుగులు తీశారు. ఒళ్లంతా మంటలు పుడుతోంటే తాళలేక హృదయ విదారకంగా ఏడుస్తోంది ప్రీతి. ‘‘నా బిడ్డని కాపాడండి’’... కేకలు పెట్టింది రోషిణి.అంతలో రైల్వే పోలీసులు వచ్చారు. ప్రీతిని బ్లాంకెట్‌లో చుట్టి చేతుల్లోకి తీసుకున్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ‘‘మీ అమ్మాయికి ఎవరైనా బాయ్‌ఫ్రెండ్ ఉన్నారా?’’... ఆ ప్రశ్న వింటూనే ఇబ్బందిగా కదిలాడు అమర్‌సింగ్. రోషిణి మాత్రం... ‘‘మా అమ్మాయి అలాంటిది కాదు సర్’’ అంది ఆవేశంగా. ‘‘ప్రేమించడం తప్పేమీ కాదమ్మా. సాధారణంగా యాసిడ్ దాడులకు పాల్పడేవాళ్లు ప్రేమికులో, ప్రేమిస్తున్నామని వెంటబడే రోమియోలో అయివుంటారు. పోనీ మీ అమ్మాయిని ఎవరైనా వేధిస్తున్నారా?’’ ‘‘లేదు సర్. అలాంటిదేమైనా ఉంటే తను మాకు చెప్పేది.’’ తల పంకించాడు ఇన్స్పెక్టర్. ‘‘సరే... మేం ఇన్వెస్టిగేట్ చేస్తాం’’ అంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అతడి దృష్టి మొత్తం ప్రీతికెవరైనా బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారా అన్నదాని మీదే ఉంది. ఆ దిశగానే ఎంక్వయిరీ మొదలు పెట్టాడు. విచారణలో ప్రీతికి ముగ్గురు అబ్బాయిలతో స్నేహం ఉందని తెలిసింది. కానీ ఆ ముగ్గురూ ఆమెకి మంచి స్నేహితులని నిరూపణ కూడా అయ్యింది. పైగా సంఘటన జరిగినప్పుడు వారిలో ఎవ్వరూ ముంబైలో కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో కానీ లేరు. దాంతో వారిని తన లిస్టు లోంచి తీసేశాడు. పలు కోణాల్లో పరిశోధించాడు కానీ ఫలితం లేకపోయింది. అంతలో ప్రీతి పరిస్థితి విషమించింది. ఒక కన్ను పోయింది. ముఖం, చెవులు, మెడ, మిగతా శరీరమంతా బాగా కాలిపో యింది. లోపలి అవయవాలు సైతం బాగా దెబ్బతినడంతో నెల రోజుల తర్వాత కన్నుమూసింది. చనిపోయే వరకూ ఆమె ఒక్కటే ప్రశ్న అడిగింది... ‘నాకెందుకిలా జరిగింది, నేనేం పాపం చేశాను’? ఆ ప్రశ్నకు సమాధానం దాదాపు 9 నెలల తరువాత తెలిసింది పోలీసులకు. గుర్గావ్ నుంచి రవి అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ప్రీతి మీద దాడి చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలుసన్నాడు. అతడిచ్చిన వివరాలను బట్టి, ప్రీతి పక్కింటి అబ్బాయి అంకుర్ పన్వర్ (21)ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రీతిని అంకుర్ ప్రేమించాడేమో అన్న ఆలోచనతో ఉన్న పోలీసులకు అతగాడు చెప్పిన కారణం విని ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు.అంకుర్ ప్రీతిని ప్రేమించలేదు. అతడికసలు ఆ ఆలోచన కూడా లేదు. అయినా కూడా ప్రీతిని చంపేయాలనుకున్నాడు. అందుకు కారణం... అసూయ. అంకుర్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాడు. కానీ దాని మీద శ్రద్ధ లేదు. ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో తిరుగుతాడు. పార్టీలంటూ టైమ్ వేస్ట్ చేస్తాడు. దాంతో అతడి తల్లిదండ్రులు కోప్పడుతూ ఉండేవారు. ‘ప్రీతిని చూసి నేర్చుకో, ఎంత చక్కగా చదువుతుందో’ అంటూ క్లాస్ పీకేవారు. వాళ్లు అలా అన్న ప్రతిసారీ ప్రీతి మీద కోపం ముంచుకొచ్చేది. అది కాస్తా ఆమెకు ఉద్యోగం వచ్చేసరికి హద్దులు దాటింది. ‘ప్రీతి అనుకున్నది సాధించింది, నీకు సెటిల్మెంట్ గురించి టెన్షనే లేదు’ అని ఇంట్లోవాళ్లు అనగానే రక్తం మరిగిపోయింది. ఆ ఆవేశంలోనే ప్రీతిని చంపేందుకు స్కెచ్ వేశాడు. ఆమెతోపాటు ముంబై బయలుదేరాడు. రైల్లోనే యాసిడ్ పోయాలనుకున్నాడు కానీ అందరూ ఉండటంతో కుదరలేదు. రైలు దిగాక తాను అనుకున్నది చేశాడు. తన పైశాచికత్వానికి ఆ బంగారు తల్లిని బలి తీసుకున్నాడు. ప్రీతి ఏ పాపం చేయలేదు. అంకుర్ అసూయ జ్వాలలకు ఆహుతైపోయింది... అంతే. కేవలం ద్వేషంతో అంకుర్ చేసిన పని... ఆమె కలల్ని మొదలంట నరికేసింది. ఆమె జీవితాన్నే అంతం చేసింది. ఆమెని అపురూపంగా పెంచుకున్న తల్లిదండ్రుల కడుపులో చిచ్చు పెట్టింది. ఓ క్షణం ఆలోచిస్తే... ఆవేశం చల్లారిపోతుంది. వాస్తవం స్ఫురిస్తుంది. కర్తవ్యం బోధపడుతుంది. మంచీ చెడుల విచక్షణ తెలుస్తుంది. ఆ ఒక్క క్షణం.. చాలా విలువైనది. అది... కొన్ని జీవితాలను నిలబెడుతుంది. కొన్ని జీవితాలను కూలదోస్తుంది. అందుకే ఏదైనా చేసేముందు ఒక్క క్షణం ఆలోచించండి. అప్పుడు మరో అంకుర్ తయారవ్వడు. మరో ప్రీతి బలవ్వదు. మరే తల్లీ కడుపుకోతతో విలవిల్లాడదు! - సమీర నేలపూడి -
దెయ్యాల వంతెన
నిజాలు దేవుడికెరుక: అమెరికాలోని ఇండియానా రాష్ట్రం... రాత్రి పన్నెండు గంటలు కొట్టడానికి గడియారాలు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ నెల కావడంతో దట్టంగా మంచు కురుస్తోంది. కౌంటీ రోడ్ 635 మీద తెల్లని కారు దూసుకుపోతోంది. అర్ధరాత్రి కావస్తుండటంతో నిర్మానుష్యంగా ఉంది. దాంతో ప్రమాదమేమీ ఉండదని అంతకంతకూ స్పీడు పెంచుతున్నాడు డ్రైవింగ్ సీట్లో ఉన్న జాక్సన్. ఓ సమయంలో ఎవన్ బ్రిడ్జి కారణంగా కౌంటీ రోడ్ 635 మూతపడే పరిస్థితి వచ్చింది. ఎవ్వరూ అటువైపు పోయేవారు కాదు. పగలు గుండె చిక్కబట్టుకుని తిరిగినా, సాయంత్రం అయ్యేసరికి అక్కడ పిట్ట కూడా కనిపించేది కాదు. దాంతో కొందరు అక్కడ నిజంగా దెయ్యాలున్నాయా అంటూ పరిశోధనకు దిగారు. కొందరు తీసిన వీడియోల్లో అస్పష్టమైన ఆకారాలు, అరుపులు, రోదనలు కనిపించడంతో ఉన్నాయని నిర్ధారించుకున్నారు. అయితే అవన్నీ పుకార్లని, నమ్మవద్దని అధికారులు పదే పదే వివరించారు. చాలామంది వాళ్ల మాటల్ని నమ్మారు. మిగతావాళ్లు దెయ్యాల్ని నమ్మారు. ఇప్పటికీ ఎవన్ బ్రిడ్జి అలానే ఉంది. దాని గురించిన భయం కూడా చాలామంది మనసుల్లో ఇంకా మిగిలేవుంది. ‘‘స్టాపిట్ జాక్... ఎందుకా స్పీడు, నాకు భయమేస్తోంది’’... అరిచినట్టే అంది పక్క సీట్లో కూర్చున్న బ్యూలా. ‘‘ఓహ్ డియర్... చలి రాత్రిలో, అదీ నువ్వు పక్కనుండగా లాంగ్ డ్రైవ్‌కి వెళ్తుంటే ఈ మాత్రం హుషారుండదూ, బీ రొమాంటిక్’’ అన్నాడు కన్ను గీటుతూ. ‘‘ఏడ్చినట్టుంది నీ రొమాన్స్. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే రొమాంటిక్‌గా ఉంటుంది కానీ, ఇలా వెళ్తే టెన్షన్‌గా ఉంటుంది’’ అంది కళ్లు విప్పార్చి. ఫక్కున నవ్వాడు జాక్. ‘‘మరీ ఇంత పిరికిదానివేంటి బ్యూలా నువ్వు! రేపు నన్ను పెళ్లి చేసుకుంటే ఇలాంటి సాహస యాత్రలు చాలానే చేయాల్సి ఉంటుంది మరి’’ అన్నాడు ఏడిపించడానికన్నట్టు. ‘‘అలా అయితే చచ్చినా చేసుకోను. ఇంకా మాట్లాడితే అసలు కారు డ్రైవింగే రానివాణ్ని చూసి చేసుకుంటాను. నువ్వు అన్నీ నీకిష్టమైనవే చేస్తావు తప్ప నా ఇష్టాయిష్టాలను ఎప్పుడూ పట్టించుకోవు’’... మూతి తిప్పింది. ఆమె అలక చూసి చప్పున బ్రేక్ వేశాడు జాక్. కాస్త దగ్గరగా జరిగి ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ‘‘ఏదీ... నా కళ్లలోకి చూసి చెప్పు. నన్ను కాకుండా వేరేవాడిని చేసుకోగలవా నువ్వు’’ అన్నాడు ప్రేమగా. ఆమె కరిగిపోయింది. సిగ్గుతో కళ్లు వాల్చేసింది. తల అడ్డంగా తిప్పి అతడి గుండెల మీద వాలిపోయింది. ఆమెని గట్టిగా గుండెకు అదుముకున్నాడు జాక్. అంతలో సన్నగా ఏడుపు వినిపించింది. ‘‘ఛ... ఏడుస్తున్నావా... నేనేదో సరదాకి అలా చేశాను. నీకిష్టం లేని పని నేనెందుకు చేస్తాను! మెల్లగానే డ్రైవ్ చేస్తాను. నీ ఇష్టాయిష్టాలనే నావి గా చేసుకుంటాను. నీ కళ్లలోంచి నీళ్లు వస్తే తట్టుకోలేను’’ అంటూ ఆమె ముఖాన్ని పైకి లేపిన జాక్ ఆశ్చర్యపోయాడు. బ్యూలా ఏడవడం లేదు. ఆమె కళ్లలో నీళ్లు లేవు. ముఖం ప్రసన్నంగా ఉంది. చిరునవ్వుతో పెదవులు విచ్చుకుని ఉన్నాయి. ‘‘నువ్వు ఏడవడం లేదా?’’ నవ్వింది బ్యూలా. ‘‘నా నవ్వు నీకు ఏడుపులాగా వినిపిస్తోందా’’ అంది అతడి చెవి మెలేస్తూ. జాక్ అరవలేదు. నవ్వనూ లేదు. చుట్టూ చూశాడు. చెవులు రిక్కించాడు. ఏడుపు ఇంకా వినిపిస్తోంది. ‘‘బ్యూలా... సరిగ్గా విను. ఎవరిదో ఏడుపు వినిపిస్తోంది.’’ బ్యూలా కూడా చెవులు రిక్కించింది. సన్నగా ఏడుపు వినిపిస్తోంది. ‘‘నిజమే జాక్... ఆడమనిషి ఏడుపు. యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందేమో’’ అంది కంగారుగా. ఆమె అలా అనడంతోనే గబగబా కారు దిగాడు. రోడ్డుకు ఆ పక్క, ఈ పక్క చూశాడు. ఎవ్వరూ లేరు. ఎదురుగా ఓ రోడ్ కమ్ రైలు బ్రిడ్జి కనిపించింది. అక్కడంతా చీకటిగా ఉంది. ‘‘అక్కడెవరైనా ఉన్నారేమో బ్యూలా’’ అన్నాడు అటే చూస్తూ. ఇద్దరూ అటువైపు నడిచారు. బ్రిడ్జి దగ్గరకు వెళ్లేసరికి ఓ మహిళ రోడ్డు పక్కన కూర్చుని కనిపించింది. జుట్టు విరబోసుకుని ఉంది. బాగా గాయపడినట్టుగా అనిపిస్తోంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. ‘‘ఏమైంది?’’ అన్నాడు జాక్ ఆతృతగా. చేయి ఎత్తి ముందుకు చూపించింది. అటువైపు చూసిన జాక్, బ్యూలాలకు రక్తపు మడుగులో పడివున్న ఓ చిన్నపిల్లాడు కనిపించాడు. ‘‘నా బాబు... నా బాబు’’ అంటూ ఏడుస్తోందామె. జాక్, బ్యూలాలు కదిలిపోయారు. ‘‘కంగారు పడకు, హాస్పిటల్‌కి వెళ్దాం’’ అంది బ్యూలా. ‘‘ఇక్కడే ఉండు, కారు తీసుకొస్తాం’’ అంటూ కదిలాడు జాక్. ఇద్దరూ గబగబా కారు దగ్గరకు పరుగెత్తారు. ఎక్కి స్టార్ట్ చేసి బ్రిడ్జి దగ్గరకు వచ్చారు. కారు దిగి, ‘‘రామ్మా... హాస్పిటల్‌కి వెళ్దాం’’ అంటూ వెళ్లబోయిన జాక్ కాళ్లకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఉన్నచోటనే ఉండిపోయాడు. ‘‘ఏరి బ్యూలా వాళ్లు?’’ అన్నాడు ఆయోమయంగా. అటువైపు చూసిన బ్యూలా ఉలిక్కిపడింది. అక్కడా మహిళ లేదు. పిల్లాడు కూడా లేదు. రక్తపు మడుగు లేదు. అసలక్కడ ఇంతకుముందు ఉన్న యాక్సిడెంట్ గురుతులేమీ లేవు. భయంతో జాక్ చేతిని గట్టిగా పట్టుకుంది బ్యూలా. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు జాక్. అంతలో... మళ్లీ ఏడుపు. గట్టిగా... బాధగా... మనసులను కదిలించేలా... అదే ఏడుపు. ‘‘నాకు భయంగా ఉంది జాక్... పద వెళ్లిపోదాం’’ అంది బ్యూలా వణికిపోతూ. ‘‘పద’’ అంటూ ఆమెను తీసుకుని వెళ్లి కారులో కూర్చోబెట్టాడు. తాను కూడా కారెక్కి స్టార్ట్ చేశాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పీడందుకున్నాడు. క్షణాల్లో వారి కారు దూసుకుపోయింది. బ్యూలా, జాక్లకే కాదు. ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్లే చాలామందికి ఆ ఏడుపు వినిపిస్తుంది. ఎంతోమందికి ఆ స్త్రీ కనిపిస్తుంది. కన్నీళ్లతో అందరినీ తన దగ్గరకు రప్పించుకుంటుంది. కన్నుమూసి తెరిచేలోగా మాయమై భయపెడుతుంది. అసలెవరామె? ఎందుకలా ఏడుస్తుంది? అంతలోనే ఎక్కడికి వెళ్లిపోతోంది? ఇండియానాలోని ఎవన్ పట్టణంలో ఉండటం వల్ల ఆ బ్రిడ్జిని అందరూ ఎవన్ బ్రిడ్జి అంటారు. 1906లో దీన్ని నిర్మించారు. కట్టిన కొన్ని రోజులకే అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి విని అమెరికా మొత్తం హడలిపోయింది. ఎవన్ బ్రిడ్జి కింది నుంచి ఇతరత్రా వాహనాలు వెళ్తాయి. పైనుంచి రైళ్లు పోతాయి. అయితే సరిగ్గా అక్కడికి వచ్చేసరికి రైళ్ల స్పీడు తగ్గిపోయేది. బ్రిడ్జి దాటగానే మళ్లీ దానంతటదే స్పీడు పెరిగేది. అంతేకాదు... ఆ బ్రిడ్జి దగ్గరకు రాగానే ఓ మహిళ ఏడుపు వినిపించేది. హృదయ విదారకంగా ఉండే ఆ ఏడుపు చాలా భయపెట్టేది. అయితే మనిషి మాత్రం కనిపించేది కాదు. కానీ... కింద రోడ్డుమీద వెళ్లే వాహనదారులకు మాత్రం చాలాసార్లు గాయాలపాలైన ఓ మహిళ కనిపించేది. ఆమెతో పాటు ఓ పసిబిడ్డ కూడా ఉండేవాడు. ఇట్టే కనిపించి అట్టే మాయమయ్యేవారు వాళ్లు. మొదట మనుషులని అనుకున్నా, ఆ తర్వాత తెలిసేది దెయ్యాలని. వాళ్లతో పాటు ఓ ఇద్దరు మగవాళ్లు కూడా కనిపిస్తుండేవారు. దాంతో కొన్నాళ్లకే ఆ బ్రిడ్జి దగ్గర దెయ్యాలున్నాయన్న వార్త అంతటా పాకింది. అక్కడికి వెళ్లడానికే అందరూ భయపడే పరిస్థితి మొదలైంది. ఏంటా అని ఆరా తీస్తే కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఎవన్ బ్రిడ్జి నిర్మించేటప్పుడు ఓ ఐరిష్ కార్మికుడు కాలు జారి రాళ్లమీద పడి చనిపోయాడు. అతడిని ఆ బ్రిడ్జికి ఉన్న నాలుగు స్తంభాల్లో ఒకదానిలో పెట్టి సిమెంటు చేసేశారు. అయితే ఓ చెయ్యి కాస్త బయటకు వచ్చింది. దాంతో దాన్ని నరికేసి నిర్మాణాన్ని పూర్తి చేశారట. అది భరించలేని అతడి ఆత్మ దెయ్యమై సంచరిస్తోందని కొందరు అన్నారు. మరో కథనం ప్రకారం... ఓ కార్మికుడు పని చేస్త్తూ పైనుంచి కింద పడిపోయాడట. నేరుగా సిమెంటు టబ్బులో పడటంతో ఎవరూ చూడలేదట. దాంతో ఊపిరాడక అందులోనే ప్రాణాలు విడిచాడట. అతడి ఆత్మ కూడా అక్కడే తిరుగుతోందట. అయితే ఎక్కువగా చెప్పేది, అందరూ నమ్మేది మరో కథ ఉంది. ఓ మహిళ తన బిడ్డతోపాటు రైలు పట్టాల పక్కనే నడుస్తోందట. సరిగ్గా బ్రిడ్జిని దాటుతుండగా రైలు కూత వినిపించింది. దాంతో ఆమె కంగారుగా బ్రిడ్జిని దాటేయాలని ప్రయత్నించింది. అంతలో కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. తీసుకునేలోపు రైలు వచ్చి గుద్దేసింది. చేతిలోని బిడ్డ ఎగిరి కింద రోడ్డు మీద పడి మరణించింది. ఆ మహిళ తీవ్ర గాయాలపాలయ్యింది. అప్పటికైతే బతికి బట్టకట్టింది గానీ... బిడ్డ మీద బెంగతో మంచం పట్టి నెల రోజులు తిరక్కుండా చనిపోయింది. ఆ తర్వాత ఆమె ప్రతిరోజూ అర్ధరాత్రి అయ్యేసరికి తన బిడ్డ చనిపోయిన బ్రిడ్జి దగ్గరకు వచ్చి భయానకంగా ఏడుస్తూ ఉంటుందని, తన బిడ్డతో సహా కనిపిస్తుందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మరో విషయం ఏమిటంటే... ఈ బ్రిడ్జి నుంచి ఒక్కోసారి నీటి చుక్కలు కారుతూ ఉంటాయి. అవి ఆమె కన్నీళ్లేనని అందరూ అంటూ ఉంటారు. ఇదంతా నిజమేనా అంటే... సమాధానం శూన్యం. కొందరు నిజమంటారు. కొందరు పుకార్లంటారు. భయపడేవాళ్లు కొందరున్నారు. కొట్టిపారేసేవాళ్లు కొందరున్నారు. కొందరు ఒక దెయ్యమే ఉందంటారు. కొందరు రెండు మూడు ఉన్నాయంటారు. ఎవరేమన్నా కానీ... ఆ బ్రిడ్జి దగ్గరకు వెళ్లడానికి మాత్రం చాలామంది జడుస్తూనే ఉంటారు. నిప్పు లేనిదే పొగ రానప్పుడు... ఏమీ లేకుండానే ఆ బ్రిడ్జికి హాంటెడ్ బ్రిడ్జ్ అన్న పేరు ఎలా వస్తుంది? ఈ లోకంలో దెయ్యం ఉనికి ఎప్పుడూ ప్రశ్నార్థకమే కాబట్టి... ఎవన్ బ్రిడ్జి ప్రేతాత్మ కథ కూడా ప్రశ్నార్థకమే! - సమీర నేలపూడి -
విషాద గీతిక
ప్రేమించడం తప్పు కాదు. గుడ్డిగా ప్రేమించడం తప్పు. ప్రేమ పేరుతో తప్పటడుగులు వేయడం తప్పు. గీతికాశర్మ... ఆ తప్పే చేసింది. కళ్లు మూసుకుని అడుగు వేసేసింది. ఆ అడుగును వెనక్కి తీసుకోలేక శాశ్వతంగా కన్నుమూసింది. కొన్ని తప్పులంతే... పరిహారంగా జీవితాలను కోరతాయి!! ‘‘ఆడపిల్లని పువ్వుతో పోలుస్తారు... సుకుమారంగా ఉంటుందని కాదు, పదిలంగా చూసుకోవాలని. కానీ ఈ మగవాళ్లకు ఆ సౌకుమార్యం బలహీనతలా కనిపిస్తున్నట్టుంది. అందుకే నలిపి పారేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా. నా కూతురేం పాపం చేసింది... దానినెందుకిలా చేశారు? వాళ్లని వదలకూడదు. కఠినంగా శిక్షించాలి. నా చిట్టితల్లి గుర్తొచ్చినప్పుడల్లా కడుపులో పేగు కదులుతున్నట్టుంది. తన స్వరం పదే పదే నా చెవులకు వినిపిస్తోంది. నాకు అన్యాయం జరిగిందమ్మా అని ఘోష పెడుతున్నట్టుగా ఉంది. తన రూపం నిరంతరం కళ్లముందు కనిపిస్తోంది. నాకు న్యాయం చేయలేవా అని దీనంగా ప్రశ్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈ నరక యాతన నేను భరించలేను. ఈ మనోభారాన్ని ఇక మోయలేను. జ్ఞాపకాలు బతికిస్తాయంటారు. కానీ నా కూతురి జ్ఞాపకాలు నాకు బతికే ధైర్యాన్నివ్వడం లేదు. తను లేని శూన్యంలో బతుకీడ్చలేనేమోనన్న భయాన్ని కలిగిస్తున్నాయి. అందుకే వెళ్లిపోతున్నాను. ఈ లోకం నుంచి, కడుపు శోకం నుంచి... శాశ్వతంగా వెళ్లిపోతున్నాను.’’ కూతురికి జరిగిన అన్యాయాన్ని సహించలేక, ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక ఓ కన్నతల్లి రాసిన మరణలేఖ ఇది. ఈ అక్షరాల వెనుక అంతులేని ఆవేదన ఉంది. ఆ ఆవేదన వెనుక వంచితురాలైన ఓ ఆమాయక ఆడపిల్ల కథ ఉంది. ఆగస్ట్... 2012... హర్యానా... కాలింగ్‌బెల్ మోగుతోంది. ‘‘ఏవండీ... తలుపు తీయొచ్చుగా. ఏరా... కాసేపు టీవీ దగ్గర్నుంచి లేచి వస్తే కొంపలు మునిగిపోతాయా’’... వంటింట్లోంచి విసుక్కుంటూ వచ్చింది అనూరాధ. భర్త, కొడుకుల బద్దకం చూసి కోపమొచ్చిందామెకి. ‘‘తలుపు తీయడం కూడా పెద్ద పనిలా ఫీలైపోతున్నారిద్దరూ’’ అని గొణుక్కుంటూ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. ‘‘గీతూ.. ఏంట్రా, మాట మాత్రమైనా చెప్పకుండా వచ్చేశావ్’’ అంది ఆనందం, అనురాగం కలగలిసిన గొంతుతో. ఆ మాట వింటూనే భర్త, కొడుకు కూడా గబగబా లేచి వచ్చేశారు. గుమ్మంలో నిలబడి ఉన్న గీతికను చూడగానే వాళ్ల ముఖాలు సంతోషంతో విప్పారాయి. అనూరాధ కళ్లు చాలాకాలం తర్వాత కూతుర్ని చూసిన ఆనందంలో వర్షిస్తూనే ఉన్నాయి. ‘‘ఏంటమ్మా నువ్వు... వెళ్లినా ఏడుస్తావ్, వచ్చినా ఏడుస్తావ్’’ అన్నాడు గీతిక తమ్ముడు తల్లిని ఆటపట్టిస్తూ. నవ్వుతూ అనూరాధ కళ్లొత్తుకుంది. అందరూ కలిసి గీతికను లోనికి తీసుకెళ్లారు. గీతిక రాకతో అందరి ముఖాల్లో నవ్వుల పువ్వులు పూసినట్టయ్యింది. ఇల్లంతా వెన్నెల విరజిమ్మినట్టయ్యింది. కానీ గీతిక కళ్లలో మాత్రం చీకటి. దాన్ని అనూరాధ మాత్రమే గుర్తించగలిగింది. కూతుర్ని పక్కకు తీసుకెళ్లి అడిగింది... ‘‘ఏమైందిరా.. అలా ఉన్నావేం?’’ తల్లి అలా అడగడంతోనే బావురుమంది గీతిక. గుండె బరువు తీరేలా వెక్కి వెక్కి ఏడ్చింది. తర్వాత మెల్లగా అంది... ‘‘నేను ఉద్యోగం మానేసి వచ్చేశానమ్మా.’’ అనూరాధ షాకయ్యింది. గీతిక పనిలో ఎంత నిజాయతీగా, నిబద్ధ్దతతో ఉంటుందో కూడా తెలుసు. అలాంటిది పని మానేసి వచ్చేసిందంటే ఏమై ఉంటుంది! అదే అడిగింది. ‘‘సమస్యేమీ లేదమ్మా. చేయబుద్ధి కావట్లేదు. ఇంకోటేదైనా ట్రై చేస్తాలేమ్మా.’’ గీతిక నిజం చెప్పట్లేదేమో అనిపిం చింది అనూరాధకి. తర్వాత చెబుతుందిలే అని ఇక రెట్టించలేదు. ‘‘నువ్వేమీ చేయకపోయినా మాకు నష్టం లేదురా. నీకెలా నచ్చితే అలా చెయ్’’ అంటూ కూతుర్ని గుండెలకు హత్తుకుంది. ‘‘గీతూ... టిఫిన్ చేద్దువుగాని రా’’... అప్పటికి మూడోసారి అనూరాధ పిలవడం. దిగులుగా ఉంది కదా, వస్తుందిలే అనుకుంది. కానీ ఎంతకీ తను రాకపోవడంతో కూతురి గదికి వచ్చింది. లోపలంతా చీకటిగా ఉంది. గీతికకి రూమ్ చీకటిగా ఉంటే ఇష్టం. పగటిపూట కూడా వెలుతురు లోనికి రాకుండా మూసేస్తుంది. ‘‘ఈ పిల్ల ఇంత చీకట్లో ఎలా ఉంటుందో ఏమో’’ అంటూ లైట్ వేసింది అనూరాధ. అంతే... ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. గీతిక నిర్జీవ శరీరం ఫ్యానుకు వేళ్లాడుతోంది. మెడచుట్టూ చున్నీ బిగుసుకుని ఉంది. కనుగుడ్లు పొడుచుకు వచ్చి భీతిగొల్పుతున్నాయి. ‘‘గీతూ’’... అనూరాధ అరుపుతో ఇల్లు దద్దరిల్లిపోయింది. భర్త, కొడుకు కంగారుగా వచ్చారు. ఆ దృశ్యం చూసి వాళ్లు కూడా కుప్పకూలిపోయారు. ఏదో జరిగి వుంటుందనుకున్నారు కానీ, ప్రాణాలు తీసుకునేంత దారుణం ఏదో గీతిక పట్ల జరిగిందని ఊహించలేదు వాళ్లు. లేదంటే ఆమెను ఒంటరిగా వదిలేవారు కాదు. ఇలా తమని వదిలి వెళ్లనిచ్చేవారూ కాదు. అసలు గీతిక విషయంలో ఏం జరిగిందో... ఆమె రాసిన సూసైడ్ నోట్ చూసేవరకూ వాళ్లకు తెలియనే లేదు. ఏముందా నోట్లో? గీతికాశర్మ... అందమైనది, తెలివైంది. ఎయిర్ హోస్టెస్ కావాలని కలలు కంది. ఆ కలల్ని నిజం చేసుకుంది. 2006లో ఎం.డి.ఎల్.ఆర్. గ్రూప్‌లో చేరింది. అప్పటికామెకి నిండా పద్దెనిమిదేళ్లు కూడా లేవు. అయినా ఆమె కల నెరవేరింది. దానికి కారణం... గోపాల్ గోయెల్ కందా. ఎం.డి.ఎల్.ఆర్. ఎయిర్‌లైన్స్ అధినేత. ఇంటర్వ్యూకి వెళ్లినరోజే గోపాల్ కళ్లు గీతికమీద పడ్డాయి. సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే అతడు గీతికకు ఉద్యోగం ఇచ్చాడు. బాగా పని చేస్తున్నావంటూ గిఫ్టులిచ్చాడు. తెలివైనదానివంటూ అందరికంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. కుటిలమైన ఆలోచనలతో ఆమె కుటుంబానికి కూడా దగ్గరయ్యాడు. అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టిన గీతిక అతడిలోని మరో మనిషిని గుర్తించలేకపోయింది. తెలిసీ తెలియని వయసు... ఎదిగీ ఎదగని మనసు... పెళ్లయ్యి, పిల్లలున్నవాడని తెలిసి కూడా ఆమెను గోపాల్ వలలో పడేలా చేశాయి. తనకంటే ఎన్నో యేళ్లు పెద్దవాడైన వ్యక్తికి దగ్గరైంది... అన్ని రకాలుగా. ఫలితంగా గర్భం దాల్చింది. పెళ్లి చేసుకొమ్మని అడిగింది. కానీ అతడు ఒప్పుకోలేదు. ఏదో చెప్పి కన్విన్స్ చేశాడు. కడుపులో బిడ్డను కరిగించేశాడు. ఇంత జరిగినా గోపాల్ మీద సందేహం రాలేదు గీతికకి. అతడు తనను పెళ్లి చేసుకుంటాడనే నమ్మింది. ఎయిర్ హోస్టెస్‌గా పని చేయవద్దు, తన ట్రస్ట్ పనులు చూసుకోమంటే సరే అంది. తాను ఎన్ని కలలు కని ఆ ఉద్యోగంలో చేరిందో కూడా మర్చిపోయి అతడు చెప్పిన చోటికి వెళ్లింది. కానీ అక్కడికెళ్లాక తెలిసింది... గోపాల్ నిజ స్వరూపం. ట్రస్ట్ ఆఫీసు అప్పటికే మరో మహిళ అధీనంలో ఉంది. ఆమె పేరు అంకిత... గోపాల్ రెండవ భార్య. వాళ్లకి ఓ కొడుకు కూడా ఉన్నాడు. హతాశురాలైంది గీతిక. తానెంత దారుణంగా మోసపోయిందో అర్థమైంది. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది. గోపాల్‌కి ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్లిపోయింది. అతడు చేసిన గాయం మానడానికి చాలా రోజులే పట్టింది. కానీ ఎలానో తేరుకుంది. మళ్లీ ఎయిర్ హోస్టెస్‌గా తన కెరీర్‌ని పునఃప్రారంభించింది. ఆ సంగతి తెలిసి రగిలిపోయాడు గోపాల్. ఆమెను వెతుక్కుంటూ వెళ్లాడు. తనతో రమ్మని బలవంత పెట్టాడు. కాదంటే బ్లాక్మెయిల్ చేశాడు. గోపాల్ గోయెల్ కందా తండ్రి మురళీధర్ ఎం.డి.ఎల్.ఆర్. కంపెనీని 2007లో స్థాపించారు. అయితే అది రెండేళ్లకే మూతబడింది. తర్వాత దాని బాధ్యతను గోపాల్ చేపట్టాడు. 2010లో తమ కంపెనీని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేశాడు. గీతిక చనిపోయేనాటికి హర్యానా రాష్ట్రానికి హోమ్ మినిస్టర్‌గా ఉన్నాడు గోపాల్ కందా. అరెస్టయిన తరువాత తన పదవికి రాజీనామా చేశాడు. 2013లో గీతిక తల్లి ఆత్మహత్య చేసుకున్న తరువాత 2014 మార్చిలో బెయిల్ మీద బయటికొచ్చాడు. ఇది అన్యాయమని, అతడే నేరస్తుడని స్పష్టంగా తెలుస్తున్నా విడుదల చేయడమేంటని మానవతావాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ కోర్టు పట్టించుకోలేదు. సరేమిరా అంటే పగతో బుసలు కొట్టాడు. తన కంపెనీ హెచ్.ఆర్.మేనేజర్ ద్వారా గీతిక పని చేస్తోన్న కంపెనీకి ఆమె గురించి తప్పుడు రిపోర్టులు పంపించాడు. ఆమె క్వాలిఫైడ్ కాదని, ఆమెవన్నీ తప్పుడు సర్టిఫికెట్లు అని, ఆమె ప్రవర్తన మంచిది కాదని అపనిందలు వేశాడు. దాంతో ఆ కంపెనీ గీతికను ఉద్యోగం నుంచి తొలగించింది. వచ్చి తన కంపెనీలో చేరమని మేనేజర్ అరుణా చద్దా ద్వారా గీతిక మీద ఒత్తిడి తెచ్చాడు గోపాల్. ఆ హింస తట్టుకోలేకపోయింది గీతిక. తనలో తనే కుమిలిపోయింది. తన బాధ ఇంట్లోవాళ్లకి చెప్పలేక, ఎలా దిగమింగుకోవాలో తెలియక, గోపాల్ చేతికి మళ్లీ చిక్కకుండా తనను తాను ఎలా కాపాడుకోవాలో తోచక అల్లాడిపోయింది. లోకాన్ని వదిలిపోవడమే పరిష్కారమని భావించింది. 2012 ఆగస్టు 5, న తన గదిలోని ఫ్యానుకు శవమై వేలాడింది. ఆమె సూసైడ్ నోట్లో రాసినదాన్ని బట్టి గోపాల్ గోయెల్ కందా, అరుణా చద్దాలను పోలీసులు అరెస్ట్ చేశారు. గీతిక తల్లి కూతురి మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. గీతిక మాదిరిగానే అదే గదిలో, అదే ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయింది. గీతిక జీవితాన్ని నాశనం చేసినవారిని శిక్షించమని సూసైడ్ నోట్లో కోరింది. కానీ అనూరాధ కోరిక నెరవేరలేదు. గోపాల్ బెయిల్ మీద విడుదలయ్యాడు. తన భార్యాపిల్లలతో సంతోషంగా బతుకుతున్నాడు. కనీసం ఎప్పటి కైనా అతడికి శిక్ష పడుతుందా అన్నది అందరికీ సందేహమే. అయినా మన దేశంలో ఆడపిల్లకి న్యాయం జరిగిందె ప్పుడు! అన్యాయంగా బలైపోయిన అమ్మాయిల కేసులు తేలిందెప్పుడు! - సమీర నేలపూడి -
నిజాలు దేవుడికెరుక: తప్పు ఎవరిది?
నమ్మకం బంధాల్ని నిలబెడుతుంది. కానీ అతడు నమ్మకానికి తూట్లు పొడిచాడు. బంధాన్ని కాలరాశాడు. కాలనాగై కాటు వేశాడు. అలాంటివాడిని శిక్షించాలా? క్షమించి వదిలేయాలా? ఈ ప్రశ్నలకు తనకు తానే సమాధానం వెతుక్కుంది ప్రజక్త. కానీ ఆమెకు దొరికిన సమాధానం ఆమె జీవితాన్నే మార్చేసింది. అసలు ప్రజక్త జీవితంలో ఏం జరిగింది? జూలై 9, 2009. ముంబైలోని డోంబ్వలీ. అనుపమ నగర్‌లోని ఆటస్థలం వద్ద జనం గుమిగూడి ఉన్నారు. గుసగుసలాడు కుంటున్నారు. అంతలో పోలీసు సైరన్ వినిపించింది. పోలీసు జీపు వేగంగా వచ్చి ఆగింది. ఇన్స్పెక్టర్ మెహతా కానిస్టేబుళ్లతో దిగాడు. వారిని చూడగానే ఓ వ్యక్తి ఎదురు వెళ్లాడు. ‘అక్కడ సర్’ అంటూ చూపిం చాడు. పోలీసుల అటువైపు నడిచారు. ఓ మూలగా... ఇసుకలో బోర్లా పడివుంది ఓ నలభయ్యేళ్ల వ్యక్తి మృతదేహం. మరణించి చాలా సమయం అయినట్టుగా ఉంది చూస్తుంటే. శరీరం మీద నల్లప్యాంటు, చారల చొక్కా ఉన్నాయి. చెప్పులు దూరంగా పడివున్నాయి. కానిస్టేబుళ్లు బోర్లా పడివున్న మృతదేహాన్ని తిప్పి వెల్లకిలా పడుకోబెట్టారు. కత్తిపోట్లు కానీ, తుపాకీతో కాల్చిన గుర్తులు కానీ లేవు. ముఖం రక్తంతో తడిసి ముద్దయ్యింది. తల పగిలిపోయి వుంది. అంటే ఏదో బరువైన వస్తువుతో తలమీద మోది చంపారని అర్థమైంది మెహతాకి. ఆ వస్తువు కోసం పెద్దగా గాలించాల్సిన పని లేకుండా పోయింది. మృతదేహానికి కాస్త దూరంలోనే ఓ బండరాయి కనిపించింది. ‘‘బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపండి. ఆ రాయిని కూడా ల్యాబ్‌కి పంపించండి’’ అంటూ జీపువైపు నడిచాడు. ఎక్కబోతూ ‘సర్’ అన్న పిలుపు వినిపిండంతో ఆగి చూశాడు. కానిస్టేబుల్ నిలబడి ఉన్నాడు. ‘‘వాళ్ల బాబాయ్ కనబడటం లేదని మొన్న కంప్లయింట్ ఇచ్చాడు కద సర్. అతనిచ్చిన ఫొటోలోని వ్యక్తి వేసుకున్న బట్టలు, ఇప్పుడీ బాడీ మీద ఉన్న బట్టలు ఒకేలా ఉన్నాయి సర్.’’ కానిస్టేబుల్ షార్పనెస్కి ముచ్చట పడ్డాడు మెహతా. ‘‘అతణ్ని పిలిపించు. బాడీని గుర్తుపడతాడేమో చూద్దాం’’ అంటూ జీపెక్కాడు. కానిస్టేబుల్ సెల్యూట్ చేశాడు. జీపు వేగంగా వెళ్లిపోయింది. ‘‘బాబాయ్’’... మృతదేహాన్ని చూస్తూనే ఘొల్లుమన్నాడా యువకుడు. ‘‘సర్... ఈయన మా బాబాయే సర్. నాలుగు రోజుల్నుంచీ కనిపించడం లేదు. ఇప్పుడేమో ఇలా...’’ దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. ఊరుకోమన్నట్టుగా అతడి భుజం తట్టాడు మెహతా. ‘‘కంట్రోల్ యువర్సెల్ఫ్ అర్జున్... నాకు కొన్ని వివరాలు కావాలి’’ కళ్లు తుడుచుకున్నాడు అర్జున్. అడగమన్నట్టుగా చూశాడు మెహతా వైపు. ‘‘మీ బాబాయ్ పేరు...’’ ‘‘సంతోష్ శంకర్ పవార్. మంత్రాలయం కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో పని చేస్తున్నారు.’’ ‘‘ఆయనకెవరైనా శత్రువులున్నారా?’’ ‘‘లేదు సర్. ఆయన అందరితోనూ ప్రేమగా ఉంటారు. చాలా మంచి వ్యక్తి.’’ ‘‘సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఎవరితోనైనా గొడవపడటం గానీ, ఎవరైనా ఆయనను బెదిరించడం లాంటివి గానీ జరిగాయా?’’ లేదన్నట్టుగా తలూపాడు అర్జున్. ‘‘మీరడిగినవేమీ జరగలేదు కానీ... కనిపించకుండా పోకముందు బాబాయ్ చివరిసారిగా శశికాంత్ ని కలిశారు.’’ ‘‘శశికాంత్ ఎవరు?’’ ‘‘మా బాబాయ్ సొంత తమ్ముడి అల్లుడు శశికాంత్. ఆ రోజు రాత్రి తనను కలవడానికే వెళ్తున్నానని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.’’ ‘‘మరి శశికాంత్‌ని అడగలేదా?’’ ‘‘అడిగాం సర్. కానీ తనను కలిశాక బాబాయ్ ఇంటికి వెళ్లిపోయారని చెప్పాడు. తనొక్కడే చెబితే అనుమానించేవాళ్లం. కానీ మా చెల్లి, అంటే శశికాంత్ భార్య ప్రజక్త కూడా అదే చెప్పింది.’’ ఒక్కసారిగా వెయ్యి ఆలోచనలు ముప్పిరిగొన్నాయి మెహతా పోలీసు బుర్రలో. అర్జున్‌ని తీసుకుని శశికాంత్ ఇంటికి బయలుదేరాడు. కానీ అక్కడ అతడు గానీ, అతడి భార్య కానీ లేరు. ఇద్దరూ నాలుగు రోజుల క్రితమే ఊరికెళ్లారని శశిధర్ తల్లి చెప్పింది. దాంతో మెహతా అనుమానాలు బలపడ్డాయి. నాలుగు రోజుల క్రితం అంటే... సంతోష్ పవార్ హత్య జరిగిన రోజే వాళ్లు వెళ్లిపోయి ఉంటారు. కాదు... పారిపోయి ఉంటారు. వెంటనే తన బలగాలను రంగంలోకి దింపాడు. శశిధర్ స్నేహితులు, ప్రజక్త స్నేహితులందరి గురించీ వాకబు చేశారు. శశిధర్వాళ్లు ఊరెళ్లినప్పట్నుంచీ అతడి స్నేహితులు ముగ్గురు ఊళ్లో కనిపించడం లేదని తెలిసింది. వాళ్ల వివరాలు కూడా చేతబట్టుకుని వెతకడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు వారి అన్వేషణ ఫలించింది. ముంబైలోని ఓ చిన్న హోటల్ గదిలో అందరినీ ఒకేసారి పట్టుకున్నారు. ‘‘పవార్‌ని ఎందుకు చంపారు?’’ మాట్లాడలేదు ప్రజక్త. మౌనంగా తల దించుకుని కూచుంది. ‘‘మౌనంగా ఉంటే కుదరదు ప్రజక్తా... ఆయన్నెందుకు చంపారు?’’ పెదవి మెదపలేదు ప్రజక్త. తల ఎత్తకుండా అలానే ఉంది. మెహతా కానిస్టేబుల్ వైపు చూశాడు. అతడు లాఠీ తీసుకుని సెల్‌లోకి వెళ్లాడు. శశికాంత్‌ని, అతడి ముగ్గురు స్నేహితుల్నీ చితకబాదడం మొదలుపెట్టాడు. ప్రజక్త కళ్లు కన్నీటి చెలమలయ్యాయి. తన భర్త బాధాపూరిత ఆర్తనాదాలు వినలేక చెవులు మూసుకుంది. అది చూసి కొట్టడం ఆపమన్నట్టు సైగ చేశాడు మెహతా. కానిస్టేబుల్ ఆపేశాడు. ‘‘చూశావ్‌గా ప్రజక్తా... నీ మౌనం నీ భర్తను హింసకు గురి చేస్తుంది. ఇప్పటికైనా నిజం చెప్పు. లేదంటే నీ భర్తని, అతడి స్నేహితులని మళ్లీ చూడలేవు.’’ ‘‘వద్దు’’ అరిచినట్టే అంది. ‘‘వాళ్లు నా కోసమే ఇదంతా చేశారు. వాళ్లని విడిచి పెట్టండి’’... చేతులు జోడించింది. ‘‘నువ్వు నిజం చెబితే మేం వాళ్ల ఒంటిమీద చేయి కూడా వెయ్యం. చెప్పు.’’ ‘‘అతణ్ని మేమేం చంపాం.’’ ఆశ్చర్యపోయాడు మెహతా. పెద్ద ఖరీదు చేయని జార్జెట్ చీర, వాలు జడ, కుంకుమతో సంప్రదాయబద్దంగా ఉంది ప్రజక్త. ఓ మనిషిని చంపేంత రాక్షసత్వం ఉందా ఆమెలో? ‘‘ఛ... నీలాంటివాళ్ల వల్లనే ఆడాళ్లందరికీ చెడ్డపేరు వస్తోంది. సొంత పెదనాన్నని, అందులోనూ నిన్ను పెంచినవాడిని చంపింది కాక, ఎంత తెగింపుతో చెబుతున్నావ్ చంపేశానని! నీలాంటివాళ్లని...’’ ‘‘ఏం చేయాలి సర్’’... అతడి మాట పూర్తి కాకుండానే అడ్డుపడింది ప్రజక్త. ‘‘ఏం చేయాలి సర్... ఉరి తీయాలా, నరికేయాలా? ఏం చేయాలంటే అది చేయండి. వాడికి తగిన శిక్ష నేను వేశాను. అందుకు నాకు శిక్ష మీరు వేయండి.’’ ‘‘శిక్ష వేశావా? అతడేం చేశాడు?’’ ‘‘నన్ను బతికున్న శవాన్ని చేశాడు. రాబందులు కూడా శవాలనే పీక్కు తింటాయి. కానీ వీడు బతికుండగానే నన్ను కాల్చుకు తిన్నాడు. వాడు మనిషి కాదు. పశువు. వాడికి అదే సరైన శిక్ష.’’ ప్రజక్త అరుపులకు కోపం రాలేదు మెహతాకి. తన సొంత పెదనాన్నని ఎందుకు చంపిందో ఆమె చెబుతుంటే విని విస్తుపోయాడు. ముంబైకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ప్రజక్త కుటుంబం నివసిస్తోంది. ప్రజక్త బడి చదువు మధ్యలోనే ఆగిపోయింది. దాంతో పిల్లలు లేని తన సొంత అన్న ఇంట్లో ఆమెను వదిలిపెట్టాడు తండ్రి. సంతోష్ పవార్ భార్య ప్రజక్తను ప్రేమగా చూసేది. పవార్ కూడా బాగానే చూసేవాడు. కానీ ఆ చూడటం వెనుక ఉన్న ఉద్దేశం వేరు. అతడి ప్రేమ మలినమైంది. అతడి మంచితనం కపటమైనది. వాటిని గుర్తించడం చిన్నపిల్ల అయిన ప్రజక్త వల్ల కాలేదు. అందుకే అతడి చేతిలో ఆటబొమ్మ అయ్యింది. కూతురని కూడా చూడకుండా కాటు వేస్తుంటే... కన్నీటిని దిగమింగుకుంది. ఎవరికైనా చెబితే నిన్నే తప్పుగా అనుకుంటారు అని అంటే నిజమేననుకుని నిజాన్ని గుండెల్లో దాచేసుకుంది. కొన్ని సంవత్సరాల పాటు నరక యాతన అనుభవించింది. అంతలో శశికాంత్ పరిచయమ య్యాడు. ఆమెను ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. అతడు ఆటో డ్రైవర్ కావడంతో ప్రజక్త తండ్రి ఒప్పుకోలేదు. కానీ సంతోష్ పవార్ మాత్రం పెద్ద మనసును ప్రదర్శించాడు. వాళ్లిద్దరి పెళ్లికీ తమ్ముడిని ఒప్పించాడు. అన్నకి తన కూతురి మీద ఉన్న అనురాగాన్ని చూసి మురిసిపోయాడు ప్రజక్త తండ్రి. వేరే ఎవరికైనా ఇచ్చి చేస్తే ప్రజక్త తన నుండి దూరమైపోతుందన్న ఉద్దేశంతో అన్నగారు ఆ పని చేశాడని అర్థం చేసుకోలేకపోయాడు. ప్రజక్తకు పెళ్లయ్యింది. తల్లిలా చూసుకునే అత్తగారు, గుండెల్లో దాచుకునే భర్త నీడలో కొత్త జీవితం మొదలుపెట్టింది. కానీ పాత జీవితపు నీడ ఆమెను వదిలిపెట్టలేదు. కూతురి మీద బెంగ అంటూ సంతోష్ పవార్ మాటిమాటికీ రావడం మొదలుపెట్టాడు. అందరూ ఉన్నప్పుడు పెదనాన్నలా... ఎవరూ లేనప్పుడు పశువులా ప్రవర్తించేవాడు. అతడికి ఎదురు చెప్పలేక, తన వేదనను ఎవరికీ చెప్పు కోలేక ప్రజక్త నలిగిపోసాగింది. ఆమె మథనాన్ని శశికాంత్ గమనించాడు. ఏం జరిగిందని నిలదీశాడు. అర్థం చేసుకుంటాను చెప్పమన్నాడు. దాంతో జరిగినదంతా వివరించింది ప్రజక్త. నిర్ఘాంతపోయాడు శశికాంత్. ఎలాగైనా మామగారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. తన భార్య, స్నేహితులతో కలిసి ప్లాన్ చేసి సంతోష్ పవార్‌ని అనుపమ నగర్ ఆటస్థలం వద్దకు రప్పించాడు. ఇంకోసారి తన భార్య జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చాడు. కానీ పవార్ వినలేదు. ఎదురు తిరిగాడు. దాంతో ఆవేశంలో అతణ్ని హతమార్చారు. ‘‘చెప్పండి సార్... నాలాంటివాళ్ల వల్లే ఆడవాళ్లందరూ చెడిపోతున్నారని అన్నారు కదా. మరి ఇలాంటి వాళ్ల వల్ల నాలాంటి వాళ్లు ఎందరో చెడిపోవడం లేదా సర్?’’ ప్రజక్త ప్రశ్న మెహతా గుండెల్లోకి దూసుకుపోయింది. ఏమీ మాట్లాడలేకపోయాడు. ‘‘నీకు చాలా అన్యాయమే జరిగింది ప్రజక్తా... కానీ అలాంటివాళ్లని చట్టానికి పట్టించాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. సారీ’’ అనేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. నిజమే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. కానీ ప్రజక్త లాంటి నిస్సహాయురాలు చట్టం గురించి ఎలా ఆలోచించగలుగుతుంది! తను చేసింది తప్పే. కానీ అది చేయడానికి ముందు ఆమె అనుభవించిన నరకం మాటేమిటి! ఆమే కాదు. ఆమెలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. తండ్రిలాంటి వాడని దగ్గరికెళ్తే తడిమి తడిమి ఇబ్బంది పెడతాడొకడు. అన్నయ్యా అని పిలిచినా పట్టించుకోకుండా ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వేస్తాడొకడు. అంకుల్ అంటూ పలకరిస్తే వంకర చూపులతో విసిగిస్తాడింకొకడు. బాస్ అని నమ్మి క్యాంప్కెళ్తే శీలాన్ని దోచుకుని బానిసను చేసుకోవాలని చూసేవాడు మరొకడు. ఎన్ని ఘోరాలు? ఎన్ని దారుణాలు? బలైపోయే సమయంలో ఏ చట్టమూ కాపాడదు. బలి తీసుకున్నవాడిని తిరిగి బాధపెడితే మాత్రం తప్పంటుంది. ఇదేనా న్యాయం? ఇది ప్రజక్త అడుగుతున్న ప్రశ్న. దీనికి సమాధానం ఎవరు చెబుతారు?! - సమీర నేలపూడి -
నిజాలు దేవుడికెరుక: ఎలసాని చంపిందెవరు?
దేశం కాని దేశంలో, ఓ స్టార్ హోటల్లో, ఊహించని విధంగా మరణించింది ఎలిసా ల్యామ్. ఆమె మృతికి కారణాలను అన్వేషిస్తే కొన్ని భయంకరమైన నిజాలు తెలిశాయి. కొన్ని నమ్మలేని వాస్తవాలు బయటపడి భయపెట్టాయి. అవి యావత్ ప్రపంచాన్నే వణికిస్తున్నాయి. అసలింతకీ ఎవరీ ఎలిసా ల్యామ్? ఎందుకు చనిపోయింది? ఆమె మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఫిబ్రవరి 19, 2013. లాస్ ఏంజిల్స్ (అమెరికా)లోని సెసిల్ హోటల్. గది తలుపులు తెరచుకుని ఆవేశంగా బయటకు వచ్చాడు నెల్సన్. వడివడిగా రిసెప్షన్ వైపు నడిచాడు. నైట్‌గౌన్ కూడా మార్చుకోకుండా వస్తోన్న అతడి ముఖంలోని భావాలను బట్టి కచ్చితంగా ఏదో కంప్లయింట్ చేయడానికే వస్తున్నాడని అర్థమైంది మేనేజర్‌కి. అయినా కూడా ముఖానికి నవ్వు పులుముకుని మర్యాదగా పలకరించాడు. ‘‘గుడ్‌మార్నింగ్ సర్’’. ‘‘వెరీ బ్యాడ్ మార్నింగ్ మేనేజర్. మీ సర్వీసెస్ ఇంత చెత్తగా ఉంటాయని అనుకోలేదు.’’ చురుక్కుమంది మేనేజర్‌కి. ‘‘ఏం సర్... ఏదైనా సమస్యా’’ అన్నాడు తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. ‘‘నిన్నట్నుంచీ చెబుతున్నాను... నీళ్ల రుచి ఏదో తేడాగా ఉందని, కొద్దిగా వాసన కూడా వస్తున్నాయని. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా ఏదైనా సమస్యా అని తీరిగ్గా అడుగుతున్నావ్?’’ నెల్సన్ అరుపులకు హాలు దద్దరిల్లింది. ‘‘సారీ సర్. ఇంకోసారి ఇలా జరగదు. ఇప్పుడే చెక్ చేయిస్తాను. కాసే పట్లో సమస్యను పరిష్కరిస్తాను. మీరు వెళ్లి ఫ్రెష్ అవ్వండి’’ అభ్యర్థించాడు మేనేజర్. నెమ్మదించాడు నెల్సన్. ‘‘సరే సరే... త్వరగా కానివ్వండి’’ అనేసి ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా వెళ్లిపోయాడు. బీపీ పెరిగిపోయింది మేనేజర్‌కి. వెంటనే బాయ్‌ని పిలిచాడు. ఆ పిలుపు అరుపులా ఉండటంతో పరిగెత్తుకు వచ్చాడతను. ‘‘పిలిచారా సార్?’’. ‘‘అరిచాను. అది వినిపించేగా వచ్చావ్. నీళ్లు ఏదో వాసన వస్తున్నాయట. రుచి కూడా తేడాగా ఉందట. వెంటనే క్లీనింగ్ సెక్షన్‌కి ఇన్ఫామ్ చేసి ట్యాంకులు ఎలా ఉన్నాయో చూడమను.’’ అతడి మాట పూర్తయ్యీ అవ్వడంతోనే పరుగున వెళ్లిపోయాడు బాయ్. ‘‘పేరుకి స్టార్ హోటల్. ఒక్కడూ సరిగ్గా పని చేసి చావడు. అందరి తరఫునా నేనే సమాధానం చెప్పాలి... ఖర్మ’’ విసుక్కుంటూనే తన పనిలో నిమగ్నమయ్యాడు మేనేజర్. ‘‘సార్... సార్... సార్...’’ ఆయాసపడుతూ వచ్చిన బాయ్వైపు విసుగ్గా చూశాడు మేనేజర్. ‘‘ఏంటా కంగారు? ఏం కొంప మునిగింది?’’ తన పనిని డిస్టర్బ్ చేశాడన్న కోపం ఉంది అతడి మాటల్లో. ‘‘ట్యాంకులు చూడమన్నారు కదా సార్. క్లీనింగ్ వాళ్లు వెళ్లి చూశారు. ఓ ట్యాంకులో నీళ్లు వాసన వస్తున్నట్టు అనిపించిందట. ఏంటా అని చూస్తే... అందులో... లోపల...’’ ‘‘ఏముంది లోపల?’’ ‘‘శవం ఉంది సార్’’ ఉలిక్కిపడ్డాడు మేనేజర్. ‘‘ఏంటీ... శవమా?’’ ‘‘అవును సార్. ఓ అమ్మాయి శవం ఉంది.’’ ఫైల్ మూసి లేచాడు మేనేజర్. బాయ్‌తో కలిసి హోటల్ పైకి పరుగుతీశాడు. పైన నాలుగు ట్యాంకులు ఉంటాయి. వాటిలో ఒక ట్యాంకువైపు చూపించారు స్టాఫ్. అందులోకి తొంగిచూసిన మేనేజర్ అవాక్కయిపోయాడు. నీటి అడుగున వుంది ఒక అమ్మాయి మృతదేహం. నలుపురంగు స్కర్ట్, ఎరుపురంగు కోట్ వేసుకుంది. చెప్పులు కాళ్ల నుంచి విడిపోయి కాస్త దూరంగా పడి ఉన్నాయి. శరీరం ఉబ్బిపోయి గుర్తుపట్టకుండా ఉంది. దాన్ని చూస్తూనే గుండె గుభేల్మంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. ఇరవై నిమిషాల్లో పోలీసులు హోటల్లో ఉన్నారు. అమ్మాయి శవాన్ని బయటకు తీయించి ఎంక్వయిరీ మొదలుపెట్టారు. విచారణలో చనిపోయిన అమ్మాయి ఎలిసా ల్యామ్ (21) అని తెలిసింది. కొద్ది రోజుల క్రితం ఆమె ఆ హోటల్లో దిగింది. ఉన్నట్టుండి మాయమయ్యింది. ఇప్పుడిలా శవమై తేలింది. అసలేం జరిగింది? ఎలిసా ఎందుకు మరణించింది? ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా హత్య చేశారా? ఏడు వందల గదులుండే సెసిల్ హోటల్లో అనుమానాస్ప దంగా మరణించినవారు ఎలిసా కంటే ముందు చాలామంది ఉన్నారు. ఓ మహిళ మూడో అంతస్తులోని తన గది నుంచి, ఇంకో మహిళ నాలుగో అంతస్తులోని గది నుంచి కింద పడి మరణించారు. మరో మహిళ అయితే పైనుండి తిన్నగా వచ్చి రోడ్డు మీద వెళుతోన్న ఒక వ్యక్తి మీద పడింది. ఇద్దరూ మరణించారు. ఇవన్నీ ఆత్మహత్యలని పోలీసులు అన్నా... ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారన్నది ఇప్పటికీ తెలీలేదు. ఎలిసా ఉదంతం మరీ భయానకంగా ఉండటంతో... సెసిల్ హోటల్లో దెయ్యాలున్నాయని, అవే ప్రాణాలు తీస్తున్నాయనే నమ్మకం బలపడింది! ‘‘నాకు తెలియదు సర్. నేను ఆ అమ్మాయిని ఒకట్రెండుసార్లు మాత్రమే చూశాను. జనవరి చివరి వారంలో తను హోటల్లో దిగింది. జనవరి 31న బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. బిల్లు కట్టలేక వెళ్లిపోయిందేమో అనుకున్నాం.’’ ఒళ్లు మండింది ఇన్స్పెక్టర్కి. ‘‘ఏంటీ... బిల్లు కట్టలేక వెళ్లిపోయిందని అనుకున్నారా? అలాంటి అమ్మాయి ఇంత పెద్ద హోటల్లో ఎందుకు బస చేస్తుంది? అయినా మీకు మీరు ఊహించేసు కోవడమేనా? ఆమెకేమైనా అయ్యిందేమో నని ఆలోచించక్కర్లేదా? తల దించుకున్నాడు మేనేజర్. ‘‘సారీ సర్. అంత ఆలోచించలేదు. బిల్లు ఎగ్గొట్ట డానికి చాలామంది అలా చేస్తుంటారు. అందుకే అలా ఆలోచించాం.’’ మేనేజర్ మాటల్లో అబద్ధం గోచరించలేదు పోలీసులకు. అలాగని ఎలిసా మరణానికి కారణం కూడా ఎంతకీ బోధపడలేదు. నీటిలో ఊపిరాడక ఆమె చనిపోయిందని పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ చెబుతోంది. కానీ అసలామె నీటిలో ఎలా పడింది? ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే పైనుంచి దూకొచ్చు. ఉరి వేసుకోవచ్చు. మరేదైనా మార్గం ఎంచుకోవచ్చు. కానీ అంత ఎత్తుకు వెళ్లి, బరువైన ట్యాంకు మూతను తీసి, అంత ఎత్తయిన ట్యాంకులోకి కష్టపడి దూకి మరణించాలని ఎందుకనుకుంటుంది? పైగా ట్యాంకులో దూకిన తరువాత మూత ఎలా వేస్తుంది? చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరీ అర్థం కాని విషయం ఏమిటంటే... ఎలిసా కెనడా అమ్మాయి. ఏదో ప్రాజెక్ట్ వర్క్ కోసం అమెరికాకి వచ్చింది. సెసిల్ హోటల్లో బస చేసింది. దేశం కాని దేశంలో ప్రాణాలు ఎందుకు తీసుకుంటుంది? ఒకవేళ ఎవరైనా చంపివుంటారా? ఆ దిశగా ఎంక్వయిరీ మొదలుపెట్టారు పోలీసులు. కానీ అనుమానించదగ్గ విషయాలేమీ తెలియలేదు. ఎలిసా చాలా మంచి అమ్మాయని, అజాతశత్రువని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహ విద్యార్థులు చెప్పారు. అలాంటి ఆమెని ఎవరు చంపుతారు? ఒకవేళ ఇక్కడే ఎవరైనా ఆమె మీద కన్నేశారా అంటే ఆమె మీద అత్యాచారం జరగలేదు. దాంతో ఆమె మరణానికి కారణాన్ని కనిపెట్టడంలో విఫలమయ్యారు పోలీసులు. ‘‘ఏంటి కేసు ఇంత కాంప్లికేటెడ్‌గా ఉంది? ఒక్క క్లూ కూడా లేదు’’... నుదురు రుద్దుకుంటూ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘నాకో డౌటు సర్. బయటకు వెళ్లిన ఎలీసా తిరిగి రాలేదని మేనేజర్ చెప్పాడు. కానీ ఆమె చనిపోయింది హోటల్లోనేగా! లోపలకు రాకుండా బిల్డింగ్ పెకైలా వెళ్లింది?’’ సబార్డినేట్ వైపు మెచ్చుకోలుగా చూశాడు ఇన్స్పెక్టర్. నిజమే. బయట చంపి, శవాన్ని తెచ్చి అక్కడ పారేయడం అసాధ్యం. పైగా నీటిలో మునిగే చనిపోయిందని రిపోర్ట్ చెబుతున్నాయి. అంటే ఆమె హోటల్‌కి వచ్చింది. ఇలా ఆలోచించగానే బుర్రలో తళుక్కున మెరిసింది ఓ ఆలోచన. వెంటనే సబార్డినేట్‌ను తీసుకుని సెసిల్ హోటల్‌కి బయలుదేరాడు. కానీ అక్కడ తాను ఊహించని, ఊహించలేని విషయం ఒకటి తనకోసం ఎదురు చూస్తోందని అతడికి తెలియదు. సెసిల్ హోటల్ లిఫ్టులోని సీసీ కెమెరా ఫుటేజ్ రన్ అవుతోంది. సబార్డినేట్, మేనేజర్‌తో కలిసి చూస్తున్నాడు ఇన్స్పెక్టర్. ఈ దెబ్బతో కచ్చితంగా నిజం తెలిసిపోతుంది. సెసిల్ ఎప్పుడు బయటకు వెళ్లింది, ఎప్పుడు వచ్చింది అన్న స్పష్టత వస్తుంది. అందుకే ఆతృతగా చూస్తున్నాడు. వీడియోలో సమయం సరిగ్గా 1:57 అయ్యింది. నల్ల స్కర్ట్, ఎర్ర కోట్ వేసుకుని ఎలిసా లిఫ్టులోకి నడచుకుంటూ వచ్చింది. వచ్చేటప్పుడు కూల్ గానే ఉంది. కానీ లోనికి అడుగు పెట్టీ పెట్టగానే లిఫ్టులో ఉన్న బటన్స్ అన్నీ టకటకా నొక్కేయడం మొదలుపెట్టింది. లిఫ్టు తలుపు మూసుకోలేదు. దాంతో తలుపువైపే క్షణంపాటు చూసి, మళ్లీ బటన్స్ అన్నీ నొక్కేసింది. అయినా తలుపు మూసుకోలేదు. తలుపు దగ్గరకు వెళ్లి బయటకు తొంగి చూసింది. మళ్లీ లోనికొచ్చి బటన్స్ నొక్కసాగింది. ఇన్స్పెక్టర్ భృకుటి ముడిపడింది. ఏంటిదన్నట్టు సబార్డినేట్ వైపు చూశాడు. అతడు అయోమయంగా చూస్తున్నాడు. మేనేజర్‌కి కూడా ఏమీ అర్థం కావట్లేదు. ముగ్గురూ ముఖాలు చూసుకుని మళ్లీ వీడియో వైపు దృష్టి సారించారు. లిఫ్టు బయటకు వెళ్లి నిలబడింది ఎలిసా. ఆ తర్వాత ఆమె ప్రవర్తన ఒక్కసారిగా మారిపోయింది. ఎవరితోనో మాట్లాడసాగింది. ఆమె చేతులు వంకర్లు తిరిగిపోతున్నాయి. ఎంతగా అంటే... మనుషులెవరూ తమ చేతుల్ని అలా తిప్పలేరు. ఆమె కాళ్లు కూడా వెనక్కి తిరిగి కనిపిస్తున్నాయి. ఏవోవో చేష్టలు చేస్తోంది. అక్కడ ఎవరూ లేకపోయినా ఏదేదో మాట్లాడేస్తోంది. తర్వాత మళ్లీ లిఫ్టులోకి వచ్చింది. బటన్స్ నొక్కింది. బయటకు వెళ్లింది. ఉన్నట్టుండి మాయమైపోయింది. విచిత్రం ఏమిటంటే... ఎలిసా మాయమవగానే లిఫ్టు తలుపు మూసుకుంది. ఇన్స్పెక్టర్ షాకైపోయాడు. ‘‘ఏం జరుగుతోందక్కడ? ఎలిసా ఎందుకలా ప్రవర్తించింది?’’ అన్నాడు అయోమయంగా. ‘‘చూస్తుంటే ఏదో దెయ్యం పట్టినట్టుగా అనిపిస్తోంది సర్...’’ సబార్డినేట్ మాటలకు విస్తుపోయాడు ఇన్స్పెక్టర్. దెయ్యం పట్టిందా? అంటే దెయ్యమే ఆమెని చంపిందా? అది సాధ్యమా? ఇన్స్పెక్టర్ మనసులో మెదిలిన ఈ ప్రశ్నలకు అతడికే కాదు... ఎవ్వరికీ సమాధానం దొరకలేదు. ఇప్పటికీ ఎలిసా మరణం ఓ మిస్టరీనే. వైద్యులేమో ఆమె ఉన్నట్టుండి బైపోలార్ డిజార్డర్ బారిన పడిందని, అందుకే అలా ప్రవర్తించిందని అన్నారు. కానీ ప్రపంచంలో సగానికి పైగా ఎలిసాని దెయ్యమే చంపిందని నమ్ముతున్నారు. అది నిజమేనా? ఆ లిఫ్టులో దెయ్యముందా? అదే ఎలిసాని చంపేసిందా? ఏమో... నిజాలు దేవుడికెరుక! - సమీర నేలపూడి -
భూత్ బంగ్లా
నిజాలు దేవుడికెరుక: బ్రిటన్... 1735. నార్ఫోక్లోని రేనమ్ హాల్ దీపాల కాంతితో వెలిగిపోతోంది. భవంతి అలంకరణ కళ్లు చెదరగొడుతోంది. ఆ వైభవం చూపరుల మతి పోగొడుతోంది. ‘‘ఏదేమైనా... ఇలాంటివి చేయాలంటే మీ తర్వాతే ఎవరైనా’’... వైన్‌ని సిప్ చేస్తూ అన్నాడు కల్నల్ లోఫ్తస్. లార్డ్ చార్ల్స్ టౌన్సెన్డ్ ముఖం ప్రసన్నమయ్యింది. ‘‘ఏదో మీ అభిమానంలెండి’’ అన్నాడు గ ర్వాన్ని కప్పిపుచ్చుతూ.‘‘భలేవారే... అభిమానంతో లేనిది చెబుతామా ఏంటి! క్రిస్మస్ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్‌గా చేయడం నేనెప్పుడూ వినలేదు, కనలేదు. ఎంతయినా మీరు గ్రేట్.’’ ఉప్పొంగిపోయాడు చార్ల్స్. అతడికీ కల్నల్కీ మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే అందరూ బయట లాన్లో ఉంటే, అతడిని మాత్రం లోనికి తీసుకొచ్చి ప్రత్యేక ఆతిథ్యం ఇస్తున్నాడు. ‘‘ఏంటి ఫ్రెండ్సిద్దరూ స్పెషల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు’’ అంటూ వచ్చిన హాకిన్స్‌ను చూసి ఆ ఆనందంలోంచి బయటకు వచ్చాడు చార్ల్స్. ‘‘అలాంటిదేమీ లేదు మిస్టర్ హాకిన్స్. మీరూ మాతో జాయిన్ కావచ్చు’’ అన్నాడు మరో వైన్ గ్లాస్‌ని చేతిలోకి తీసుకుని హాకిన్స్కి అందిస్తూ. ముగ్గురూ కబుర్లలో పడ్డారు. అంతలో ఎవరో పిలుస్తున్నారని పనివాడు వచ్చి చెప్పడంతో బయటకు వెళ్లాడు చార్ల్స్. లోఫ్తస్, హాకిన్స్ పెగ్గు మీద పెగ్గు వేస్తున్నారు. ‘‘పార్టీ అదిరిపోయింది లోఫ్తస్. లార్డ్ చార్ల్స్ దారి ఎవరికీ రాదనుకో’’... వైన్ గొంతు జారుతుంటే చార్ల్స్ మీద అభిమానం పొంగుకొచ్చింది హాకిన్స్కి. ‘‘అది సరే కానీ... ఆవిడెవరు’’ అన్నాడు హాకిన్స్ నోటికెత్తబోయిన గ్లాసుని అలాగే పట్టుకుని. అతడు చూస్తున్నవైపే దృష్టి సారించాడు లోఫ్తస్. వయ్యారంగా మెట్లు దిగుతోందో సౌందర్యరాశి. పాల నురుగు లాంటి తెల్లని గౌనులో దేవకన్యలా కనిపిస్తోంది. గాలికి ఎగురుతున్న ముంగురులు ఆమె ముఖాన్ని కప్పేస్తున్నాయి. ‘‘నిన్నే... ఎవరావిడ? చార్ల్స్ బంధువా?’’... లోఫ్తస్ మాట్లాడకపోయేసరికి రెట్టించాడు హాకిన్స్. అప్పటికీ సమాధానం రాకపోవడంతో లోఫ్తస్ వైపు చూశాడు హాకిన్స్. అంతే... షాక్ తిన్నాడు.లోఫ్తస్ వణికిపోతున్నాడు. ముఖమంతా చెమటలు పోస్తున్నాయి. కళ్లనిండా భయం. చేత్తో గుండెను పట్టుకుని విలవిల్లాడుతున్నాడు. అతణ్ని అలా చూడగానే భయం వేసింది హాకిన్స్కి. బయటకు పరుగెత్తి చార్ల్స్ని పిలిచాడు. అతిథుల్లో ఓ వైద్యుడు ఉండటంతో అతడిని తీసుకొచ్చాడు చార్ల్స్. వెంటనే చికిత్స చేయడంతో లోఫ్తస్ లేచి కూచున్నాడు. ‘‘ఏమైంది కల్నల్... సడెన్‌గా అలా అయిపోయావేంటి?’’... అడిగాడు చార్ల్స్ అనునయంగా. ‘‘నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి. అందరినీ బయటకు వెళ్లమను.’’ ‘‘ఒంటరిగానా... ఏమైంది?’’ ‘‘ప్లీజ్ చార్ల్స్. వెళ్లమను. నువ్వు మాత్రమే ఉండు నా దగ్గర. త్వరగా...’’ అందరికీ బయటకు పంపేశాడు చార్ల్స. ‘‘ఇప్పుడు చెప్పు... ఏమైంది?’’ అన్నాడు పక్కన కూచుని. ‘‘చార్ల్స్... డొరొతీ...’’ అతడి మాట పూర్తి కాకముందే చివ్వున లేచి నిలబడ్డాడు చార్ల్స్. ‘‘ఇప్పుడు తన గురించి ఎందుకు? కొంపదీసి తాగిన మత్తులో ఆ హాకిన్స్గాడి దగ్గర ఏదైనా వాగేశావా?’’ కోపంగా అన్నాడు. ‘‘కాదు. నేను డొరొతీని చూశాను.’’ ‘‘అవును చూశావు. ఒక్కసారి కాదు, బోలెడుసార్లు. అయితే ఏంటట?’’ ‘‘అరే భగవంతుడా... నేను చూసింది ఎప్పుడో కాదు. ఇప్పుడే... ఈ హాల్లోనే...’’ ‘‘వ్వా...ట్’’... కరెంట్ షాక్ తిన్నట్టు అదిరిపడ్డాడు చార్ల్స్. ‘‘నీకేమైనా మతిపోయిందా? డొరొతీని ఇప్పుడు చూడ్డమేంటి? అది చచ్చి తొమ్మిదేళ్లయ్యింది కదా?’’ విసుగ్గా అన్నాడు. ‘‘లేదు చార్ల్స్. తనే. కచ్చితంగా తనే. నేను చూశాను. తెల్ల గౌను వేసుకుని మెట్లమీది నుంచి దిగుతోంది. తనని చూసిన షాకులోనే నాకు ఛాతీనొప్పి వచ్చింది.’’ లోఫ్తస్ ముఖంలోని భయాన్ని చూస్తుంటే అతడు చెప్పింది ముమ్మాటికీ నిజమేనని అర్థమవుతోంది చార్ల్స్‌కి. పైగా అతడు పొరపాటు పడడు. ఎందుకంటే... డొరొతీ గురించిన నిజం అతడికి తెలుసు. అంటే డొరొతీ... దెయ్యమైందా? ఇక్కడిక్కడే తిరుగుతోందా? మరి తనకెందుకు కనిపించడం లేదు? తననింతవరకూ ఎందుకు ఏమీ చెయ్యలేదు? ఆలోచనలతో చార్ల్స్ మెదడు బరువెక్కింది. డొరొతీ రూపం కళ్లముందు కనిపించి కంగారుపెడుతోంది. అసలింతకీ ఎవరీ డొరొతీ? ఎవరీ చార్ల్స్? ఏం జరిగింది వారి మధ్య? ఎగసిపడే ఉత్సాహం, వర్ణనకు అందని సౌందర్యం, ఎంతటి వారినైనా కట్టిపడేసే ఆకర్షణ... ఇవన్నీ కలిస్తే డొరొతి. 1686లో బ్రిటన్‌లో పుట్టిన ఈ అతిలోక సుందరి... నాటి బ్రిటన్ ప్రధాని రాబర్ట్ వాల్పోల్ సోదరి. ఆమె అద్భుతమైన అందం యువరాజు చార్ల్స్ టౌన్షెన్డ్ని ఆకర్షించింది. డొరొతీ కూడా చార్ల్స్ని ప్రేమించింది. కానీ చార్ల్స తల్లిదండ్రులు చార్ల్స్‌కి ఎలిజబెత్ అనే మహిళతో వివాహం చేసేశారు. తట్టుకోలేకపోయింది డొరొతీ. నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయింది. అలాంటి సమయంలో ఆమె జీవితంలోకి వార్టన్ వచ్చాడు. అతడు డొరొతీని ఇష్టపడ్డాడు. ఆమెను మామూలు మనిషిని చేశాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. డొరొతీ అతడికి దగ్గరయ్యింది. అయితే అంతలో చార్ల్స్ మళ్లీ ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. తన భార్య ఎలిజబెత్ మరణించడంతో డొరొతీని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఈసారి ఎవరు కాదన్నా లెక్కచేయనంటూ ఆమె చేతిని అందుకున్నాడు. అయితే అప్పటికే డొరొతీ మనసులో అతడి స్థానాన్ని వార్టన్ ఆక్రమించుకున్నాడు. చార్ల్స్ బలవంతంగా పెళ్లయితే చేసుకున్నాడు గానీ, ఆమె మనసు నుంచి వార్టన్‌ను తీసేయలేకపోయాడు. ఆ విషయం అతడు గ్రహించలేకపోయాడు. పిల్లలు పుట్టారు. వాళ్లు పెద్దవాళ్లు అయ్యారు. అప్పటికి గానీ డొరొతీ, వార్టన్ల వ్యవహారం చార్ల్స్‌కి తెలియలేదు. కానీ తెలిశాక పెద్ద రణరంగమే సృష్టించాడు. డొరొతీ మీద విరుచుకుపడ్డాడు. ఆమెను చిత్రహింసలు పెట్టి రేనమ్ హాల్లోని ఓ గదిలో బంధించాడు. తిండి సరిగ్గా పెట్టేవాడు కాదు. ఎవరినీ కలవనిచ్చేవాడు కాదు. కనీసం పిల్లలను కూడా చూపించేవాడు కాదామెకి. దాంతో గదిలోపలే కృశించిపోయింది డొరొతీ. తన పరిస్థితికి లోలోపలే కుంగిపోయింది. పెద్దగా ఏడ్చేది. తనను క్షమించి వదిలిపెట్టమని గట్టిగట్టిగా అరిచేది. కానీ ఆమె ఆర్తనాదాలు, ఆవేదనాపూరిత కేకలు గోడలు దాటి వెలుపలికి వచ్చేవి కావు. రేనమ్ హాల్ అనేది టౌన్షెన్డ్ వంశస్థుల రాజప్రాసాదం కావడంతో అందులోకి బయటివాళ్లు వచ్చేవారు కూడా కాదు. దాంతో డొరొతీ గురించి ఎవరికీ తెలిసే అవకాశమే లేకపోయింది. కొన్ని రోజుల తరువాత డొరొతీకి పొంగు చూపింది. నరకం అనుభవించింది. ఒక్కసారి వైద్యుణ్ని పంపించమని ఆమె ఎంత బతిమాలినా చార్ల్స్ వినిపించుకోలేదు. దాంతో ఆరోగ్యం క్షీణించి, నలభయ్యేళ్ల వయసులో కన్నుమూసింది డొరొతీ. ఈ లోకం నుంచి, ఆ నరకం నుంచి శాశ్వతంగా విముక్తి పొందింది. అయితే రేనమ్ హాల్లో డొరొతీ పట్ల ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు... చార్ల్స్‌కి అత్యంత ఆప్తుడైన లోఫ్తస్కి తప్ప. అనారోగ్యంతో చాలాకాలం పాటు మంచానికే పరిమితమయ్యిందని, చివరికి అనారోగ్యంతోనే మరణించిందని ప్రపంచాన్ని నమ్మించారు. కానీ ఆ నిజం నీడలా తమని వెంటాడుతుందని వాళ్లు అప్పుడు ఊహించలేకపోయారు. చనిపోయిన తొమ్మిదేళ్ల తరువాత, క్రిస్మస్ పార్టీ చేసుకుంటున్నప్పుడు డొరొతీ ఆత్మ లోఫ్తస్కు కనిపించడంతో కలవరపడ్డాడు చార్ల్స్. అయితే అదంతా భ్రమ కూడా కావొచ్చనుకున్నాడు. కానీ ఆ తరువాత డొరొతీ వరుసగా కనిపిస్తూనే ఉంది. తెల్లని దుస్తులు వేసుకుని, జుత్తు విరబోసుకుని ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటే భయంతో వణికిపోయేవాడు చార్ల్స్. లోఫ్తస్కి కూడా ఆమె చాలాసార్లు కనిపించింది. ఎక్కువగా పైనుంచి హాల్లోకి రావడానికి ఉపయోగించే మెట్ల మీద కనిపిస్తుండేది. అయితే... 1738లో చార్ల్స్ చనిపోయేవరకూ కూడా ఆమె అతడిని ఏమీ చేయలేదు. అతడిననే కాదు... ఆమె ఎవరినీ ఏమీ చేయలేదు. చార్ల్స్ మరణించిన తరువాత అతడి తరువాతి వారసులు ఆ మహల్‌ని సొంతం చేసుకున్నారు. అయినా కూడా డొరొతీ అక్కడ్నుంచి వెళ్లిపోలేదు. అక్కడే ఉంది. ఇల్లంతా తిరుగుతూ ఉండేది. ఒక్కోసారి చేతిలో దీపం పట్టుకుని సంచరించేది. కొన్నిసార్లు బ్రౌన్ కలర్లో నీడలా అలా అలా కదిలిపోతూ కనిపించేది. అందుకే ఆమెను ‘బ్రౌన్ లేడీ ఘోస్ట్’ అనేవారు. కొందరు ఆమెని చూడటం కోసం కావాలని ఆ భవనంలో రాత్రుళ్లు గడిపేవారు. కొందరైతే ఆమె ఉందని, లేదని పందాలు వేసుకునేవారు. ఒకసారి ఇద్దరు ఫొటోగ్రాఫర్లు కూడా అలానే పందెం వేసుకున్నారు. ఓ రాత్రంతా కెమెరాలు పట్టుకుని రేనమ్ హాల్లో తిరిగారు. లోపల పలు ప్రదేశాల్లో వందలాది ఫొటోలు తీశారు. డొరొతీ ఆత్మను మాత్రం చూడలేకపోయారు. కానీ స్టూడియోకి వెళ్లి ఫొటోలు డెవెలప్ చేస్తున్నప్పుడు అదిరిపడ్డారు. ఓ ఫొటోలో మెట్లు దిగుతున్న దెయ్యం స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని చూసి షాకైపోయారిద్దరూ. ‘కంట్రీ లైఫ్ మ్యాగజైన్’లో ఆ ఫొటోని ప్రచురించారు. దాన్ని చూసి ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. ఇప్పటికీ ఆమె ఆత్మ రేనమ్ హాల్లో ఉందంటారు. అయితే ఆమె అక్కడ ఇంకా ఎందుకుంది, ఏం కోరుకుంటోంది, దేనికోసం వెతుకుతోంది అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. ఎవరికీ ఏ కీడూ ఎందుకు చేయదో కూడా అర్థం కాదు. ఆమె జీవితం ఎంత రహసంగా ముగిసిందో... నేటి ఆమె ఉనికి కూడా ఓ రహస్యంలా మిగిలింది! - సమీర నేలపూడి -
కట్టుబాట్లను కాలదన్నింది... ట్రోఫీలను చేతబట్టింది!
గెలుపుకి మనిషితో సంబంధం లేదు. పట్టుదలతో ప్రయత్నిస్తే అది ఎవరికైనా సొంతమవుతుంది. అడుగుకి గమ్యం గురించి తెలియాల్సిన పని లేదు. ఆ అడుగు ఎక్కడ పడాలో పాదం మోపే మనిషికి తెలిస్తే సరిపోతుంది. మనిషి తాను పుట్టి పెరిగిన పరిస్థితుల గురించి, ప్రదేశం గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఎక్కడ పుట్టినా, ఎక్కడ ఎలా పెరిగినా... చేరుకోవాల్సిన గమ్యం, సాధించాల్సిన లక్ష్యం స్పష్టంగా తెలిస్తే గెలుపు వచ్చి ఒళ్లో వాలుతుంది. ఇవన్నీ ఎంతటి అక్షర సత్యాలో తెలియాలంటే... భవానీ ముండా గురించి తెలుసుకోవాలి! భవానీ ముండా... పశ్చిమ బెంగాల్‌కి వెళ్లి ఈ అమ్మాయి పేరు చెబితే అక్కడివారి కళ్లలో గర్వం తొణికిసలాడుతుంది. ఆ రాష్ట్రంలోని జల్పాయిగుడి జిల్లాకు వెళ్లి ఆ అమ్మాయి గురించి అడిగితే... స్థానికుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆమె తమ గడ్డమీద పుట్టిన అమ్మాయి అన్న గర్వం, తమ జిల్లాకే పేరు తెచ్చిందన్న ఆనందం... రెండూ కలిసి భవానీ గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకతను మనలో రేపుతాయి. తెలుసుకునేంత వరకూ మనల్ని అక్కడ్నుంచి కదలకుండా చేస్తాయి. ఆట కోసం ఆరాటం... జల్పాయిగుడి జిల్లా అంత అభివృద్ధి చెందినదేమీ కాదు. టీ తోటల్లో పని చేసుకుని పొట్ట పోసుకునేవాళ్లే అక్కడ ఎక్కువ. వెనకబడిన జీవితాలు. నాగరికత అంతగా తెలియని మనుషులు. ఆడపిల్ల అంటే ఎక్కడ లేని కట్టుబాట్లూ పుట్టుకొచ్చేవి. అమ్మాయిలు సంప్రదాయ బద్ధంగా ఉండాలి. అన్ని పనులూ నేర్చుకోవాలి. దించిన తల ఎత్తకూడదు. పద్ధతిగా నడచుకోవాలి. ఇలాంటి ఆలోచనలు అక్కడివారి నరనరాల్లో జీర్ణించుకు పోయాయి. దానికి తోడు ఆర్థికంగా వెనుకబడటం ఒకటి. పిల్లల్ని చిన్నప్పుడే తమతో పాటు తోటల్లో పనులకు తీసుకెళ్లిపోయేవారు. కాస్త తమ పని తాము చేసుకోగలిగే వయసు వచ్చాక పెళ్లి చేసేసేవారు. అలాంటి చోట పుట్టింది భవానీ ముండా. అయితే అక్కడి పరిస్థితులు గానీ, కట్టుబాట్లు గానీ ఆమెను పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. ఏడేళ్ల వయసులో టీవీలో ఉమెన్ ఫుట్‌బాల్ మ్యాచ్ చూసినప్పుడు ఆమెను రెండు విషయాలు ఆకర్షించాయి. ఒకటి ఫుట్‌బాల్... రెండోది, ఆడపిల్లలు అంతమంది ముందు పోటాపోటీగా గేమ్ ఆడటం. ఆ రోజు నుంచి ఫుట్‌బాల్ పిచ్చి పట్టుకుంది భవానీకి. తన ఇష్టాన్ని ఇంట్లోవాళ్లతో చెప్పింది. ఫుట్‌బాల్ ఆడటం నేర్చుకుంటానని మారాం చేసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదు. కోప్పడ్డారు. ఆడపిల్లకి ఆటలేంటన్నారు. పొట్టి పొట్టి నిక్కర్లు వేసి ఆటలాడితే పరువు పోతుందని తిట్టారు. ఆడుతూ ఏ కాలో విరగ్గొట్టుకుంటే పెళ్లిఅవ్వదని అన్నారు. భవానీ ఆశల్ని ఆదిలోనే తుంచేసి టీ తోటలో పనికి చేర్చారు. అయితే వాళ్లు భవానీని కట్టడి అయితే చేయగలిగారుగానీ... ఆమె మనసు నుంచి ఫుట్‌బాల్ ఆడాలన్న ఆకాంక్షను మాత్రం తుడిచివేయలేకపోయారు. ఓ పక్క పని చేస్తూనే ఫుట్‌బాల్ ఎలా ఆడాలా అని ప్లాన్లు వేసేది భవాని. ఏళ్లు గడిచేకొద్దీ ఆ పిచ్చి మరింత పెరిగిపోయింది. తనతో పాటు పని చేసే ఇద్దరు ముగ్గురు అమ్మాయిల్ని జత చేసుకుని తోటల మధ్యలో రబ్బరు బంతితో ప్రాక్టీస్ చేస్తూండేది. అలా చేయడం వల్ల ఆమెలో ఆట పట్ల మక్కువ మరీ పెరిగిపోయింది. ఎలాగైనా ఓ టీమ్‌ను తయారు చేసుకోవాలని నిర్ణయించుకుంది. దాని కోసం పెద్ద సాహసమే చేసింది. ఊరి మనసు కరిగించింది... ఫుట్‌బాల్ టీమ్‌ని తయారు చేయడం మాటలు కాదని తెలుసు భవానీకి. అయినా చేసి తీరాలనుకుంది. అందరి ఇళ్లకూ వెళ్లి, ‘మీ అమ్మాయిని ఫుట్‌బాల్ ఆడటానికి పంపిస్తారా’ అని అడగడం మొదలుపెట్టింది. కొందరు కుదరదు అన్నారు. కొందరు విసుక్కున్నారు. అయినా కూడా విడిచిపెట్టలేదు. వెంటపడి విసిగించింది. కొందరిని ఒప్పించింది. ఎలాగైతేనేం... పదకొండు మందితో ఓ టీమ్ తయారు చేసుకుంది. సాధన మొదలుపెట్టింది. అయితే కొందరు ఊరి పెద్దలకు భవానీ చేస్తోంది నచ్చలేదు. ఆడపిల్లలు అలాంటి ఆటలు ఆడటం సరికాదని, ఏ కాలో చెయ్యో విరిగితే పెళ్లిళ్లు ఎలా అవుతాయని భవానీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి గొడవ చేశారు. దాంతో భవానీని ఇంట్లో బంధించారు వారు. ఏం చేసయినా లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ఉన్న భవానీని నాలుగ్గోడలు, రెండు తలుపులు ఏం ఆపగలవు! తప్పించుకుని పారిపోయింది. తన టీమ్ సభ్యుల దగ్గరకు వెళ్లి వాళ్లతోనే ఉండసాగింది. తన టీమ్ వెలుగులోకి రావాలంటే ఏం చేయాలో తెలుసుకుంది. మొదట జిల్లా తరఫున, తరువాత రాష్ట్రం తరఫున ఆడేందుకు అవకాశాలు సంపాదించింది. అవకాశాలతో పాటు ట్రోఫీలూ సాధించింది. ఆడపిల్లకు ఆటలేంటి అన్నవారే ఇప్పుడు భవానీని చూసి గర్వంగా మా అమ్మాయి అని చెప్పుకుంటున్నారు. పొట్టి బట్టలు వేసుకుంటే పెళ్లికాదు అంటూ నిందించినవారే పదికాలాలు పచ్చగా ఉండమని దీవిస్తున్నారు. తమ పిల్లలు కూడా భవానీలా కావాలి అని కోరుకుంటున్నారు. ఇది భవానీ సాధించిన విజయం. పరిస్థితులు అనుకూలించలే దంటూ కలలు చంపుకుని , కట్టుబాట్లకు తలవంచి బతుకుతున్న ఆడపిల్లలందరికీ ఆమె విజయం... ఓ ఆదర్శం! - సమీర నేలపూడి అందరూ భవానీలు కావాలి! పశ్చిమ బెంగాల్‌లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ పద్ధెనిమిదేళ్లు రాకముందే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. మహిళల అక్షరాస్యత కూడా చాలా తక్కువ. భవానీ పుట్టిన జల్పాయిగుడి జిల్లాలో అయితే ఇప్పటికీ కొందరు అమ్మాయిలు యుక్త వయసు వచ్చీరాగానే పెళ్లి అనే చట్రంలో ఇరుక్కుపోతున్నారు. ఈ పరిస్థితులు పూర్తిగా మారాలి అంటుంది భవానీ. తనలాగే అమ్మాయిలంతా ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే తప్ప అది సాధ్యం కాదు అని చెబుతోంది! -
అలా చదివింది..! జీవితంలో గెలిచింది
జీవితంలో ఎదురు దెబ్బలు తిననివాళ్లు బహుశా ఎవరూ ఉండరేమో. అయితే ఆ గాయాల్ని తలచుకుని బాధపడేవాళ్లు కొందరుంటారు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తుకు అందమైన బాటలు పరచుకునేవాళ్లు కొందరుంటారు. వెంకటలక్ష్మి రెండో కోవకు చెందిన మహిళ. తన జీవితంలో జరిగిన సంఘటన నుంచి ఆమె చాలా నేర్చుకుంది. తన జీవన గమనాన్ని ఓ గమ్యం వైపు తిప్పుకుంది! లక్ష్యం ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి. నమ్మకం ఎప్పుడూ ఆకాశమంతే ఉండాలి. కృషి ఎప్పుడూ నిరంతరం సాగుతుండాలి. ప్రయాణం ఎప్పుడూ ముందుకే సాగాలి. ఇవన్నీ వెంకటలక్ష్మికి బాగా తెలిసిన విషయాలు. అందుకే ఆమె ప్రయాణం ఎప్పుడూ ఆగింది లేదు. ఒడిదుడుకులు ఎదురైనా, అడుగడుగునా ముళ్లు గుచ్చుకున్నా ఆమె పాదాలు నిలబడిపోలేదు. ముందుకే నడిచాయి. ఆమెను ఉన్నత స్థాయికి చేర్చాయి. రెండేళ్ల క్రితం వరకూ వెంకటలక్ష్మి బెంగళూరు రోడ్ల మీద ఆటో నడుపుతూ కనిపించేది. కానీ ఇవాళ నల్లకోటు వేసుకుని, చేతిలో కేసు ఫైళ్లు పట్టుకుని బెంగళూరు కోర్టు మెట్లెక్కుతూ కనిపిస్తోంది. ఆటో స్టీరింగ్ పట్టుకున్న చేతులతోనే నల్లకోటు తొడుక్కునే స్థాయికి ఆమె చేరిన తీరు వింటే మనలోనూ స్ఫూర్తి ఏర్పడుతుంది. ఏదైనా సాధించాలన్న పట్టుదల కలుగుతుంది. సాహసమే ఊపిరిగా... ధైర్య సాహసాలు వెంకటలక్ష్మిని మొదట్నుంచీ వెన్నంటే ఉండేవి. హైస్కూల్లో చదివే రోజుల్లో ఆమె చేసిన ఓ సాహసం అందరినీ విస్మయపరిచింది. వేగంగా వస్తున్న ఓ బస్సు కింద పడబోతున్న విద్యార్థిని ఎంతో చాకచక్యంగా రక్షించింది వెంకటలక్ష్మి. ఆ ప్రయత్నంలో ఆమె బాగా గాయపడింది. ఆమె సాహసాన్ని మెచ్చి కర్ణాటక ప్రభుత్వం సాహస బాలిక అవార్డును కూడా ప్రకటించింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టడం వల్ల వెంకటలక్ష్మి జీవితంలోని ఎత్తుపల్లాలను దగ్గర్నుంచి చూసింది. అందుకే ఎప్పుడూ జీవితంలో స్థిర పడాలన్న పట్టుదలతోనే ఉండేది. చిన్నప్పట్నుంచీ చదివేది. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేది. కళల్లో రాణించేది. సంప్రదాయిక కుటుంబం కావడంతో కట్టుబాట్లు ఎక్కువ ఉండేవి. కానీ అవి లక్ష్మిని ఎప్పుడూ ఆపలేదు. ఆమె తనకు నచ్చింది చేసే తీరేది. సంగీతం, నృత్యం... అన్నీ నేర్చుకుంది. అయితే పదో తరగతి పూర్తి కాగానే పరిస్థితుల కారణంగా పని చేయాల్సి వచ్చింది వెంకటలక్ష్మికి. అప్పుడు కూడా ఆమె తన శైలిలోనే ఆలోచించింది. ఆటో నడపాలని నిర్ణయించుకుంది. చేయడానికి ఇంకేమీ దొరకలేదా అని ఇంట్లోవాళ్లు అంటే... ‘ఇందులో ఏముంది తప్పు’ అంటూ ఆటో స్టీరింగ్ పట్టుకుంది. బెంగళూరు రోడ్ల మీద దూసుకుపోయింది. అదో పెద్ద పాఠం... ఎంత తెగువ ఉన్నా, ఎంతగా మగాళ్లతో పోటీ పడినా మహిళ ఎప్పుడూ మహిళేనని గుర్తుచేసే సంఘటన ఒకటి లక్ష్మి జీవితంలో జరిగింది. అది ఆమెకు పెద్ద పాఠమే నేర్పింది.ఇరవయ్యేళ్ల వయసులో ఓ రోజు లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఉన్నట్టుండి ఓ అయిదుగురు వ్యక్తులు ఆమె ఇంట్లో జొరబడ్డారు. లక్ష్మిని బలవంతం చేయబోయారు. వెంటనే లక్ష్మిలోని సాహసి మేల్కొంది. వారిని చితకబాది తరిమి కొట్టింది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కానీ పోలీసులు అవతలివారి మాటలకు లొంగిపోయి కేసు రిజిస్టర్ చేయకుండా వదిలేశారు. దాంతో కమిషనర్ దగ్గరకు వెళ్లింది లక్ష్మి. ఆయన చొరవతో కేసు రిజిస్టర్ అయ్యింది కానీ, ఆమె జీవితం నరకప్రాయం అయిపోయింది. సదరు వ్యక్తులు ఆమెను వెంటపడి వేధించేవారు. ఆమె గురించి చెడుగా ప్రచారం చేసేవారు. దాంతో లక్ష్మిని అందరూ దూరం పెట్టేవారు. ఆమెకు ఇక పెళ్లి కాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఓ తోటి ఆటో డ్రైవర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతడికి ఇల్లాలై ఊరి చివర ఓ ఇల్లు కట్టుకుని కాపురం పెట్టింది లక్ష్మి. అయితే ల్యాండ్ మాఫియా ముఠా ఆమె ఇంటిని లాక్కోవాలని ప్రయత్నించింది. ఆమెను లైంగిక వేధింపులకు గురిచేసింది. దాంతో మరోసారి ఆమె కోర్టు మెట్లెక్కింది. లక్ష్మి తొమ్మిదేళ్లపాటు కోర్టు చుట్టూ తిరిగింది. కేసు మలుపులు తిరుగుతోందే తప్ప ఓ కొలిక్కి రావడం లేదు. దాంతో విసిగిపోయిన లక్ష్మి ఓ రోజు న్యాయస్థానంలో నోరు విప్పింది. తన కేసు తనే వాదించుకుంటాను, అనుమతినివ్వమంది. న్యాయమూర్తి ఆమె ఆవేదనను అర్థం చేసుకుని అనుమతినిచ్చారు. దాంతో న్యాయస్థానంలో దాదాపు మూడు గంటల పాటు తన వాదనను వినిపించింది లక్ష్మి. చివరికి కేసు గెలిచింది. ఆ రోజు అర్థమైంది లక్ష్మికి... అన్యాయం జరిగినంత వేగంగా న్యాయం జరగదని. న్యాయస్థానాలు, చట్టాలు తనలాంటి వారికి అందుబాటులో లేవని. తనలా ఇంకెందరో కోర్టుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ ఉంటారని. ఆ క్షణమే నిర్ణయించుకుంది... తాను లాయరై తీరాలని. కొందరికైనా న్యాయాన్ని చేకూర్చాలని. భర్త సహకారంతో లా కాలేజీలో చేరింది. ఓ పక్క ఆటో నడుపుతూ, మరోపక్క ఇంటి పనులు చేస్తూ, ఇంకో పక్క కూతురిని సాకుతూనే లా పూర్తి చేసింది. కర్ణాటక బార్ అసోసియేషన్‌లో తన పేరు నమోదు చేసుకుంది. ‘ఎదగాలన్న పట్టుదల ఉంటే ఎత్తుకే చేరతాం తప్ప పల్లానికి పడిపోం’ అని నిరూపించింది. అందరితో హ్యాట్సాఫ్ అనిపించుకుంటోంది! - సమీర నేలపూడి జీవితంలో కొన్నిసార్లు బలహీనపడిపోతాం. ఇక మన వల్ల కాదులే, వదిలేద్దాం అని రాజీ పడిపోతాం. ఒకటి రెండు సమయాల్లో నేనూ అలాగే అనుకున్నాను. కానీ ఆ ఆలోచనను మనసులో అలా ఉండనిస్తే నేను ఓడిపోయి ఉండేదాన్ని. నా పట్ల అన్యాయం జరిగింది. దాన్ని నిరూపించుకోవడానికి నేను పడిన కష్టం అంతా ఇంతా కాదు. నేను చేసిన ఆ పోరాటం నాలో పట్టుదలను పెంచింది. న్యాయం కోసం కష్టపడకూడదు అనిపించింది. ఆ ఆలోచనే నన్ను ‘లా’ చదివేలా చేసింది. -
సంభాషణం: ఇల్లాలిని విలన్‌గా చూపించడం నాకు నచ్చదు!
నటనను వృత్తిగా భావించేవాళ్లు కొందరుంటారు. నటనే జీవితం అనుకునేవాళ్లు కొందరుంటారు. శివపార్వతికి నటనే జీవితం. నాటకాలు, సినిమాలు, సీరియళ్లు... వేదిక ఏదైనా, పాత్రకు ప్రాణప్రతిష్ట చేయగల గొప్ప నటి ఆమె. రెండు వందల సినిమాలకు పైగా నటించిన శివపార్వతి ఇన్నేళ్ల తన నటనా జీవితం గురించి చెబుతోన్న విశేషాలు... నాటకాలకు ఇంకా ఆదరణ ఉందని అంటారా? ఎందుకు లేదు! నాటకం ఎప్పుడూ వెనుకబడిపోదు. దాన్ని ఆదరించే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. నాటకానికి ఇతివృత్తమే ప్రాణం. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా మంచి కథలను ఎంచుకుంటే ఆదరణ ఎప్పటికీ అలానే ఉంటుంది. మీరు నటిగా మారిన వైనం? మా నాన్నగారు రంగస్థల నటులు. నా చిన్నప్పుడు అనుకోకుండా ఓ నాటకంలో నన్ను నటించమన్నారు. నాటి నుంచి నేటి వరకూ నటిస్తూనే ఉన్నాను. ఆసక్తి లేకుండానే నటి అయ్యారా? ఆసక్తి లేకుండా కాదు, నటనంటే ఏంటో తెలీకుండా నటినయ్యాను. మాది తెనాలి. ఎందరో మహా నటీనటులకు జన్మస్థలం అది. అలాంటిచోట పుట్టడం వల్లనో ఏమో... ఆ కళ నాకు చిన్ననాటే అబ్బింది. మొదట అవకాశాలు రావడం వల్ల నటించేసినా, కొన్నాళ్లు పోయాక నటన మీద మక్కువ, గౌరవం పెరిగాయి. అప్పట్నుంచీ నటనే నా ఊపిరి అయ్యింది. సినిమాల వైపు ఎలా వచ్చారు? 1991లో పరుచూరి బ్రదర్స్ రఘురామ్ నాటక కళా పరిషత్తును పెట్టారు. నా నటన చూసి తమ పరిషత్తులోకి తీసుకున్నారు. వారి ద్వారా ‘సర్పయాగం’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నాటకం... సినిమా... ఎందులో నటించడం కష్టమంటారు? ఎక్కడైనా నటన ఒకటే. వాటిని ప్రదర్శించే తీరులో కాస్త తేడా ఉంటుంది. సినిమాల్లో నటించేటప్పుడు ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది చూసుకుని అప్పటికప్పుడు మార్పు చేసుకోవచ్చు. నాటకంలో ఆ అవకాశం లేదు. ఒక్కసారి వేదిక ఎక్కాక పర్ఫెక్ట్గా చేయాల్సిందే. ఆ పాత్రను పండించాల్సిన, నాటకాన్ని రక్తి కట్టించాల్సిన బాధ్యత మనదే. సినిమాల్లో డబ్బింగ్ వేరే వాళ్లతో అయినా చెప్పించుకోవచ్చు. కానీ నాటకంలో మనం చెప్పే ఆ డైలాగులు, పద్యాల మీదే విజయం ఆధారపడి ఉంటుంది. మీకు ఎక్కువ తృప్తి ఎక్కడ దొరికింది? రెండిటినీ ఎంజాయ్ చేశాను. నాటకరంగం కన్నతల్లిలా ఆదరిస్తే, సినిమా రంగం మంచి అవకాశాలిచ్చి ప్రోత్సహించింది. నాకు రెండూ రెండు కళ్లు. మరి ఆ రెంటినీ వదిలి సీరియల్స్‌కి ఎందుకొచ్చారు? సినిమాల్లో బిజీ అయ్యాక నాటకాలకు దూరమయ్యాను. సినిమాల్లో అవకాశాలు కొరవడటం వల్ల సీరియల్స్‌కి వచ్చాను. ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలు బాగా వచ్చేవి. అమ్మ, అక్క, అత్త, వదిన అంటూ రకరకాల పాత్రలుండేవి. ఇప్పుడలాంటి సినిమాలే రావడం లేదు. ఇక మాలాంటి వారికి అవకాశాలెలా వస్తాయి! ఇప్పుడు ట్రెండు మారిందిగా మరి? కావచ్చు. కానీ మార్పు కోసం మంచిని వదిలేసుకుంటామా? కమర్షియల్ సినిమాలు తీయొద్దనడం లేదు. కానీ విలువల్ని చెప్పే సినిమాలు కూడా తీయాలి. కుటుంబపు విలువల్ని, బాంధవ్యాల గొప్పదనాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకు సీరియల్స్ ఉన్నాయిగా? అవి మాత్రం ఏం చెబుతున్నాయి! సీరియల్స్‌లో కూడా యాభైశాతం వయొలెన్సే చూపిస్తున్నాం. పంచభక్ష పరమాన్నాలు భోంచేసి, పాయసం తిని, తాంబూలం వేసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో హీరోయిన్ పాత్రని చూస్తే అలా ఉండాలి. అలా కాకుండా ఇల్లాలిని విలన్ని చేసి ఓ రాక్షసిలాగా చూపిస్తే ఎలా! ఇంటి ఇల్లాలే కనుక అలా ఉంటే ఇక ఆ కుటుంబం ఏమైపోతుంది? ఇవన్నీ ఆలోచించాలి. ‘మంగమ్మగారి మనవరాలు’లో మీరు చేస్తోందీ విలన్ పాత్రేగా? కాదని అనడం లేదు. అలాంటివి ఉండకూడదు అని కూడా అనడం లేదు. ఎప్పుడూ అలాగే చూపించవద్దని అంటున్నాను. నటిగా నేను పాత్ర వరకే ఆలోచిస్తాను. కానీ పాత్రను సృష్టించేవారు ఆ పాత్ర సమాజానికి ఏ సందేశాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి. నటిగా నాకు అన్ని పాత్రలూ సమానమే అయినా వ్యక్తిగా మాత్రం అలాంటివాటినే ఇష్టపడతాను. నాటకాల నుంచి ఇక్కడి వరకూ వచ్చారు. మళ్లీ నాటకాల వైపు వెళ్లే ఆలోచనేమైనా ఉందా? ప్రస్తుతానికైతే లేదు. నాటకం అంటే అనుకోగానే వెళ్లి చేసేయడం కుదరదు. ఎంతో సాధన చేయాలి. ప్రస్తుతానికి అంత తీరిక నాకు లేదు. నటన కాకుండా వేరే లక్ష్యమేదైనా..? లేదు. నటనలోని మాధుర్యాన్ని తెలుసుకున్న తర్వాత నటనే జీవితం అనుకున్నాను. ఊపిరున్నంత వరకూ నటిస్తూనే ఉంటాను. - సమీర నేలపూడి -
నిజాలు దేవుడికెరుక: ఎలా ఉన్నవారు అలా శిలలైపోయారు!
అది 1599వ సంవత్సరం. ఇటలీలోని క్యాంపీనియాకి దగ్గర్లో ఉన్న ఒక అతి పెద్ద రాతి ప్రదేశంలో ఓ ముప్ఫైమంది కూలీలు తవ్వకాలు జరుపుతున్నారు. సర్నో నది నీటిని మళ్లించేందుకు గాను భూగర్భంలో ఓ కాలువను తవ్వుతున్నారు. ‘‘కానివ్వండి కానివ్వండి. మూడు రోజుల్లో పని ముగించాలి. ఇంత నెమ్మదిగా చేస్తే ఎలా?’’... పనివాళ్లని తొందర పెడుతున్నాడు కాంట్రాక్టర్ ఆల్బెట్రో. ‘‘చేస్తూనే ఉన్నాం కదరా, కంగారు పెడతాడెందుకు?’’... విసుక్కున్నాడు ఎన్జో. ‘‘ఎప్పుడూ అంతే కదరా... పట్టించుకోకు’’ అన్నాడు నెవియో. ‘‘ఆ... ఆ... నువ్వు కూడా ఎప్పుడూ ఇంతే. ఎవరేమన్నా పట్టించుకోవద్దం టావ్’’... అంటూనే గునపాన్ని ఎత్తి భూమిలో దిగేశాడు ఎన్జో. ఒక్కసారిగా ఠంగ్మన్న శబ్దం వినిపించింది. ‘‘ ఇక్కడ ఏదో ఉందిరా. గునపం దిగట్లేదు. ఒకవేళ ఏదైనా నిధిగానీ ఉందేమో’’ ఆశగా అన్నాడు.‘‘మన ముఖాలకి నిధులు కూడా దొరుకుతాయా... ఏ రాయో అడ్డుపడి ఉంటుంది, గట్టిగా దించు గునపం.’’ పాంపేయ్ పట్టణాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలు జరిగాయి. కానీ తొలగించలేనంతగా దుమ్ము పేరుకునిపోవటం చేత ఆ ప్రయత్నాలు ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. దాంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి సందర్శనీయ స్థలంగా మార్చారు. అవశేషాలన్నింటినీ మ్యూజియంలో పెట్టారు. ద లాస్ట్ డేస్ ఆఫ్ పాంపేయ్, షాడోస్ ఇన్ బ్రాంజ్ వంటి పుస్తకాలు, పలు సినిమాలు, డాక్యుమెంటరీలు పాంపేయ్ విషాదాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చాయి. అయితే అవన్నీ వారి వారి ఊహలకు అనుగుణంగా ఉంటాయి! నెవియో మాటలకి ఓసారి నిట్టూర్చి మళ్లీ ప్రయత్నించాడు ఎన్జో. ఊహూ... గునపం లోనికి పోవడం లేదు. కాంట్రాక్టర్‌ని పిలిచి విషయం చెప్పాడు.‘‘ఇదో పెద్ద విషయమా? ఇదంతా రాతినేల కదా... ఏ బండరాయో ఉండి ఉంటుంది. తవ్వి తీసి పారేసేదానికి ఇంత హడావుడి చేయాలా’’... విసుక్కుంటూ మరో ఇద్దరిని పిలిచాడు కాంట్రాక్టర్. అందరూ కలిసి అడ్డును తొలగించాలని ప్రయత్నించారు. అది తొలగలేదు కానీ దాని చుట్టు పక్కల పది అడుగుల మేర నేల బీటలు తీసి కుంగిపోవడం మొదలైంది. అందరి గుండెలూ ఝల్లుమన్నాయి. గునపాలు వదిలేసి దూరంగా పరుగెత్తారు.వాళ్లు చూస్తూండగానే నేల కుంగిపోయి అక్కడో పెద్ద గుంత ఏర్పడింది. కాంట్రాక్టర్ ధైర్యం చేసి గోతి దగ్గరకు వెళ్లాడు. లోపల ఏముందోనని తొంగి చూశాడు. మరుక్షణం అతడి గుండె దడదడలాడింది. ‘‘అందరూ త్వరగా రండి’’... అరిచినట్టే అన్నాడు. పనివాళ్లంతా బిలబిలమంటూ వచ్చి గోతి చుట్టూ చేరారు. లోపలకు చూసిన వారి ఒళ్లు జలదరించింది. ఒకటి కాదు, రెండు కాదు... కనీసం పదిహేను అస్థిపంజరాలైనా ఉండి ఉంటాయక్కడ. కొన్నయితే మట్టిలో కూరుకుపోయి అక్కడక్కడా తెలతెల్లగా కనిపిస్తున్నాయి. అన్ని అస్థిపంజరాలు అక్కడికెలా వచ్చాయో అంతు పట్టలేదు. వెంటనే అధికారులకు విషయం తెలియజేశారు. వాళ్లు వచ్చి అస్థిపంజరాలను బయటకు తీస్తుండగా ఆ చుట్టూ ఉన్న మట్టిదిమ్మలన్నీ ఫెళఫెళా విరిగిపోవడం మొదలైంది. అడుగేస్తే నేల కుంగిపోతోంది. దాంతో ఆ నేలలో ఏదో మర్మం దాగివుందనిపించింది. వెంటనే అక్కడి నేల మొత్తాన్నీ తవ్వడం మొదలుపెట్టారు. కొన్ని గంటల తర్వాత అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి వారి వెన్నుపూసలోంచి వణుకు పుట్టుకొచ్చింది. దాదాపు పాతిక అడుగుల లోతుకు తవ్విన తర్వాత... అక్కడో పెద్ద ప్రపంచమే కనిపించింది. అదేదో పట్టణంలా ఉంది. పైకప్పు లేని మొండి గోడలు, సగం కూలిన ఇళ్లు ఉన్నాయి. అయితే అందరినీ షాక్‌కి గురి చేసిన విషయం ఒకటుంది. ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా శవాలు ఉన్నాయి. రాళ్లలా బిగుసుకుపోయి, బూడిద రంగులో కనిపిస్తున్నాయి. పడుకుని, కూర్చుని, పరిగెడుతున్నట్టు... రకరకాల భంగిమల్లో ఉన్నాయవి. మొదట అవి సిమెంటు బొమ్మలో, రాతి బొమ్మలో అయివుంటాయనుకున్నారు. కానీ పరిశీలించగా తెలిసింది మానవ దేహాలని! అందరి బుర్రలూ తిరిగిపోయాయి. ఇక్కడో పట్టణం ఉండేదా? ఇలా ఎలా కప్పడిపోయింది? మనుషులంతా ఇలా గుంపులుగా ఎందుకు చనిపోయారు? యుద్ధం లాంటిదేమైనా జరిగిందా? అదే జరిగితే ఇలా రకరకాల భంగిమల్లో ఎలా ఉంటారు? ఉన్నవారు ఉన్నట్టుగా చనిపోయారంటే అసలేం జరిగివుంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కనుక్కోవాలని నిర్ణయించుకున్నారు అధికారులు. కనుక్కున్నారు కూడా. వారు చెప్పిన విషయాలు విన్న తర్వాత యావత్ ప్రపంచం కదలిపోయింది. గుండెల్ని పిండేసే ఆ నిజ సంఘటనను చాన్నాళ్లు తలచుకుని తలచుకుని కుమిలిపోయింది. క్రీ.శ. 79. ఆగస్టు 24 సాయంత్రం.... పనులకు వెళ్లినవాళ్లంతా ఇళ్లకు తిరిగొస్తున్నారు. ఇల్లాళ్లంతా భోజనాలు సిద్ధం చేయడంలో మునిగిపోయారు. పిల్లలు వీధుల్లో ఆటలాడుతున్నారు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఆ ముందు రోజు చేసుకున్న అగ్నిదేవుడి పండుగ గురించి ఆనందంగా చర్చించుకుంటున్నారు. చీకట్లు కమ్ముకుంటున్నాయి. మామూలుగా అయితే ఆ సమయానికి వాతావరణం చల్లబడుతుంది. కానీ ఈ రోజు ఏదో తేడా. ఉక్కబోస్తోంది. వేడి మెల్లమెల్లగా పెరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకిలా ఉందా అని ఆలోచిస్తుండగానే పెద్ద శబ్దం! వంద అణు బాంబులు ఒక్కసారి పేలినట్టు... వెయ్యి ఉరుములు ఒక్కసారి ఉరిమినట్టు! ఆ శబ్దం.... జరగనున్న ఘోర విధ్వంసానికి ప్రారంభం. పాంపేయ్ అంతానికి ముహూర్తం. అందరూ ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందా అని భయంగా ముఖాలు చూసుకున్నారు. ఏం జరిగిందో అంచనా వేసే ప్రయత్నం చేశారు. అంతలోనే దట్టమైన పొగ పట్టణంలోకి చొరబడింది. అందరినీ చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసింది. దుమ్ము వేగంగా ఎగిరొచ్చి పడుతోంది. అప్పుడర్థమయ్యింది వారికి ఏం జరిగిందో. ‘‘అగ్నిపర్వతం బద్దలైనట్టుంది’’ అన్నాడో వ్యక్తి భయంగా. అవును. అదే జరిగింది. పాంపేయ్ పట్టణానికి కాస్త దూరంలో ఉన్న వెసువియస్ అగ్నిపర్వతం బద్దలయ్యింది. దాని నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది. లావా శరవేగంగా పర్వతం మీది నుంచి జారిపడుతోంది. పట్టణాన్ని తాకాలని పరుగులు తీస్తోంది. దుమ్ము, ధూళి ఎగసి పట్టణమంతా పరుచు కుంటున్నాయి. ఇదంతా ఎంత వేగంగా జరిగిందంటే... ఇప్పుడేం చేద్దాం అని పట్టణవాసులు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే జరగరాని విధ్వంసం జరిగిపోయింది. లావా సునామీలా పాంపేయ్ని చుట్టేసింది. కొందరు భయంతో మూలల్లో దాగారు. కొందరు వాటి కిందా వీటి కిందా దూరి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎవ్వరి ప్రయత్నాలూ ఫలించలేదు. లావా వారిని ముంచేసింది. క్షణాల్లో శిలల్లా మార్చేసింది. కొద్ది నిమిషాల్లోనే పాంపేయ్ నగరం నిప్పుల కుంపటిలా మారింది. అయితే లావా సృష్టించిన విధ్వంసంతో కథ ముగిసిపోలేదు. లావాను మించిన దుమ్ము, ధూళి పట్టణాన్ని ముంచెత్తింది. రెండు రోజుల పాటు అలా వచ్చి పడుతూనే ఉంది. దాదాపు ఇరవై అయిదు అడుగుల మేర పేరుకుపోయింది. దాని కింద పాంపేయ్ పట్టణం సమాధి అయ్యింది. ఈ ప్రపంచం నుంచి, ప్రపంచ పటం నుంచి మాయమైపోయింది. ఇదంతా పరిశోధకుల ఊహ! అగ్నిపర్వతం బద్దలవడం వల్లే పాంపేయ్ సర్వనాశనమయ్యింది, దాని నుంచి వెలువడిన దుమ్ము కిందే పట్టణం సమాధి అయ్యింది అనేది వాస్తవం. అయితే ఇంత దారుణంగా ఎలా జరిగింది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే సాక్ష్యం చెప్పేందుకు ఏ ఒక్కరూ మిగల్లేదు. దాంతో పరిశోధనల్లో అవగతమైన విషయాలను బట్టి ఇలా జరిగివుంటుంది అని నిపుణులు అంచనా వేశారంతే. నిజానికి వెసువియస్ అగ్నిపర్వతం బద్దలైన విషయం పాంపేయ్కు కాస్త దూరంలో ఉన్న కొన్ని పట్టణాల వారికి తెలిసింది కానీ... పర్వతానికి అతి దగ్గరగా ఉన్న పాంపేయ్ పట్టణం ధ్వంసమై పోయిందన్న విషయం చాలాకాలం వరకూ ఎవరికీ తెలియలేదు. ఎందుకంటే... పర్వతం చల్లబడేవరకూ ఆ చుట్టుపక్కలకు ఎవ్వరూ పోలేదు. కొన్నాళ్ల తర్వాత వెళ్లిచూసిన వారికి పాంపేయ్ కనిపించలేదు. ఉన్నట్టుండి ఒక పట్టణం మాయం ఎలా అయ్యిందో అర్థమూ కాలేదు. కొన్నాళ్లు దాని గురించి చర్చించుకున్నారు. మెల్లగా మర్చిపోయారు. దాంతో పాంపేయ్ గురించి తర్వాతి తరాల వారికి తెలియకుండా పోయింది. 1599లో తవ్వకాల్లో బయటపడిన తర్వాతే పాంపేయ్ అనే ఒక పట్టణం ఉండేదన్న విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే అందరినీ కలచివేసిన విషయం ఏమిటంటే... శవాలు పడివున్న తీరు. ఎలా ఉన్నవాళ్లు అలా శిలలైపోయారు. పడుకున్నవాళ్లు పడుకున్నట్టే ఉన్నారు. నడుస్తున్నవాళ్లు నడుస్తున్నట్టే ఉన్నారు. భయంతో ముడుచుకుని కూచుని, మోకాళ్ల మీద తల పెట్టుకుని ఉన్న ఓ మహిళ శిలాజాన్ని చూసినప్పుడు పరిశోధకులకు సైతం కళ్లు చెమర్చాయి. తల్లి పక్కలో ఒత్తిగిలి పడుకుని ఉన్న చిన్నారి, వేడిమిని తాళలేక మెలికలు తిరిగిపోతూ మరణించిన కుక్క, నిద్ర పోవడానికి ఒరుగుతూ ఒరుగుతూ ప్రాణాలు విడిచిన వ్యక్తి, పరుగు పెడుతూ శిల అయిపోయిన పిల్లాడు... చూసినవాళ్ల గుండెలు కరిగి నీరయ్యాయి. చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఆ ఘోరకలి ఇది. సిరి సంపదలతో, సంతోష సౌభాగ్యాలతో విలసిల్లిన పాంపేయ్ కథ... ఓ కన్నీటి గాథగా, విషాదభరిత జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోయింది! - సమీర నేలపూడి -
కిటికీలోంచి టేకాఫ్!
కేవలం రాబర్ట్, రెపోలే కాదు... ఆ రోజు ప్రమాదంలో చనిపోయినవారిలో మరికొందరి ఆత్మలు కూడా ఆ విమానంలో సంచరించేవట. ముఖ్యంగా ఓ మధ్య వయస్కుడు, ఓ యువతి ఎక్కువగా కనిపించేవారట. తెల్లని గౌను వేసుకుని, జుట్టు విరబోసుకుని ఉన్న ఆ యువతిని చూసి కొందరు జడుసుకోవడం కూడా జరిగిందని చెబుతారు. ఆమె ఎప్పుడూ ఒకే సీట్లో కూర్చుని మౌనంగా ఏడుస్తూ ఉండేదట. మధ్య వయస్కుడు అయితే దేని కోసమో వెతుకుతూ ఉండేవాడట. ఇవన్నీ భ్రమలు అని కొందరు కొట్టి పారేశారు కానీ... అవన్నీ నిజమేనని కొందరు విమాన సిబ్బంది కూడా చెప్పడంతో నమ్మక తప్పలేదు! ఫ్లారిడా (అమెరికా)లోని మయామీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లండన్ వెళ్లాల్సిన విమానం రన్‌వే మీద ఆగివుంది. ప్రయాణికులంతా ఒక్కొక్కరుగా వచ్చి తమ సీట్లలో కూర్చుంటున్నారు. వారికి సహాయపడుతూ ఎయిర్ హోస్టెస్ అటూ ఇటూ తిరుగుతోంది. అంతలో... ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ... ఓసారి ఇలా వస్తారా?’’... అరిచినట్టే వినిపించిందో స్వరం. అటువైపు చూసింది Air Hostes. ఓ లావుపాటి స్త్రీ, చేతిలో హ్యాండ్బాగ్తో నిలబడి ఉంది. ముఖంలో విసుగు, కళ్లలో కాస్త కోపం. ఏమయ్యిందోననుకుంటూ కంగారుగా అటు వెళ్లింది హోస్టెస్. ‘‘చెప్పండి మేడమ్... ఏం కావాలి?’’ అంది అనునయంగా.‘‘నా సీటు కావాలి. ఆ విండో సీట్ నాది. వెళ్లి కూచుందామంటే ఇతడు అడ్డుగా ఉన్నాడు. లేవమంటే లేవడు. ఎన్నిసార్లు అడిగినా కదలడం లేదు’’... చెప్పలేనంత చిరాకు కనిపించిందామె మాటల్లో. ‘‘సారీ మేడమ్. నేను చెప్తానులెండి’’ అంటూ అటువైపు చూసింది హోస్టెస్. క్షణాల్లో ఆమె ముఖంలో రంగులు మారాయి. ‘‘ఎవరి గురించి చెప్తున్నారు మేడమ్?’’ అంది అయోమయంగా. ‘‘అరె... తమాషాగా ఉందా? ఎదురుగా ఉన్నాడుగా... కనిపించనట్టు అలా అడుగుతావేం’’ అందామె మరింత కోపంగా. బిక్కమొహం వేసింది హోస్టెస్. ‘‘సారీ మేడమ్. నాకెవరూ కనిపించడం లేదు’’ అంటూ గొణిగింది. ‘‘ఎందుకందరూ ఇలా ఇరిటేట్ చేస్తున్నారు? వాడేమో లేవడు. నువ్వేమో ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావడం లేదు. ఇప్పుడే నేను ఎయిర్పోర్ట్ అథారిటీస్‌కి కంప్లయింట్ చేస్తాను’’ అంటూ విసవిసా పైలట్ క్యాబిన్‌వైపు నడిచిందామె. ‘‘కెప్టెన్... కెప్టెన్’’ అంటూ కేకపెట్టింది. వెంటనే కెప్టెన్ వచ్చాడు. ‘‘ఏంటి మేడమ్... ఏం జరిగింది?’’ అన్నాడు కంగారుగా.సీట్లో కూర్చున్న వ్యక్తితో పాటు ఎయిర్ హోస్టెస్‌ని కూడా కలిపి తిట్టడం మొదలుపెట్టిందామె. ఏమిటన్నట్లు హోస్టెస్ వైపు చూశాడు కెప్టెన్. ‘‘నా తప్పేమీ లేదు సర్. ఎవరో కూర్చున్నారని అంటున్నారు. నాకక్కడ ఎవరూ కనిపించలేదు. అలా అంటే ఆవిడకి కోపమొచ్చేస్తోంది.’’ హోస్టెస్ మాట వినగానే కెప్టెన్ కనుబొమలు పైకి లేచాయి. భృకుటి ముడిపడింది. క్షణం తర్వాత అన్నాడు. ‘‘సారీ మేడమ్. మీరు వెళ్లి కూచోండి. ఈపాటికి అతడు వెళ్లిపోయి ఉంటాడు’’ అన్నాడు కూల్‌గా. ‘‘వెళ్లిపోయాడా... చూడకుండా ఎలా చెప్పేస్తున్నారు?’’ ‘‘చూడక్కర్లేదు. నాకు తెలుసు. కచ్చితంగా వెళ్లిపోయి ఉంటాడు. మీరు వెళ్లి కూచోండి’’ అని హోస్టెస్ వైపు తిరిగి తీసుకెళ్లమన్నట్టుగా సైగ చేశాడు. సరేనని హోస్టెస్ కదిలింది. సదరు ప్రయాణికురాలు కూడా వెంటే నడిచింది. సీటు దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడెవరూ లేరు. ఆమె తన సీట్లో కూచుంది. హోస్టెస్ తిరిగి కెప్టెన్ దగ్గరకు వచ్చింది. ‘‘నా మాట నిజం సర్. అక్కడెవరూ లేరు’’ అంది సంజాయిషీ ఇస్తున్నట్టుగా. ‘‘లేదు షీబా. ఉన్నారు. నీకు కనిపించలేదు, ఆమెకు కనిపించారు... అంతే తేడా.’’ ఉలిక్కిపడిందామె. ‘‘ఏమంటున్నారు సర్? తనకు కనిపించి నాకెందుకు కనిపించరు?’’ ‘‘ఆత్మలు అంతే... అందరికీ కనిపించవు. వెళ్లి పని చూసుకో’’ అనేసి వెళ్లిపోతున్న కెప్టెన్ వైపు కొయ్యబారిపోయి చూస్తూండిపోయింది హోస్టెస్. ఆత్మా? విమానంలో ఆత్మ ఉందా? ఎవరి ఆత్మ? ఇక్కడెందుకుంది? అంత కూల్‌గా మాట్లాడుతున్నారంటే ఈ విషయం కెప్టెన్‌కి తెలుసా? ఆయన కూడా దాన్ని చూశారా? చూసి కూడా ఏమీ చేయకుండా అలా ఎలా వదిలేశారు? ఆ ఆత్మ వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగితే? ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరైపోయింది హోస్టెస్. భయంతో చెమటలు పోశాయి. ఓసారి విమానమంతా పరికించింది. అందరూ ఎవరి సీట్లలో వారు కూర్చు న్నారు. ప్రశాంతంగా ఉన్నారు. కానీ తను మాత్రమే ఇలా భయంతో వణుకుతోంది. షీబా ఆ రోజే తొలిసారి విధుల్ని నిర్వహిస్తోంది. అందుకే ఆమెను ఆ విషయం భయపెడుతోంది. కానీ రెగ్యులర్‌గా ఆ విమానంలో వెళ్లేవారికి ఇలాంటి అనుభవాలు మామూలే. ఆ సంగతి ముందే తెలిసివుంటే పాపం అంత కంగారు పడేది కాదేమో. ఇంతకీ ఎవరిదా ఆత్మ? 1972, డిసెంబర్ 29... న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే విమానాశ్రయం. సమయం తొమ్మిదీ ఇరవై అయ్యింది.‘ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ఫ్లయిట్ - 401’ మెల్లగా గాల్లోకి లేచింది. 163 మంది ప్రయాణీకులు, పదమూడు మంది సిబ్బందితో బయలుదేరింది. కెప్టెన్ రాబర్ట్ లోఫ్ (55) ఓసారి విమానమంతా పరిశీలించి చూసుకున్నాడు. ప్రయాణికులంతా సౌకర్యంగా, ప్రశాంతంగా ఉండటంతో క్యాబిన్లోకి వెళ్లిపోయాడు. రాత్రి 11.32 అవుతుండగా విమానం ఫ్లారిడాలోని మయామీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువయ్యింది. అక్కడ దిగాల్సినవాళ్లు సమాయత్తమవుతున్నారు. మరికొద్ది నిమిషాల్లో విమానం ల్యాండ్ అయ్యేదే. కానీ అంతలోనే ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది. విమానాన్ని కిందికి దించేందుకు తోడ్పడే ల్యాండింగ్ గేర్ సిస్టమ్ పని చేయడం మానేసింది. పెలైట్ కంగారు పడ్డాడు. ఇంజినీర్ డోనాల్డ్ రెపోని పిలిచాడు. ‘‘ఏం జరిగింది?’’ అన్నాడు రెపో కంగారుగా. ‘‘ల్యాండింగ్ గేర్ సిస్టమ్ పని చేయడం లేదు’’ రెపోతో పాటు కెప్టెన్ రాబర్ట్ లోఫ్ కూడా ఉలిక్కిపడ్డాడు. ఏదో ఒకటి చెయ్యమన్నట్టుగా రెపో వైపు చూశాడు రాబర్ట్. రెపో వేగంగా కదిలాడు. చకచకా ల్యాండింగ్ గేర్ని బాగు చేయడం మొదలుపెట్టాడు. కానీ ఫలితం లేకపోయింది. అతడా పని చేసేలోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. విమానం క్రాష్ అయ్యింది. 99 మంది ప్రాణాలు అక్కడికక్కడే అనంత వాయువుల్లో కలిసిపోయాయి. రాబర్ట్, రెపోలు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలిస్తుండగా రాబర్ట్ మరణించాడు. మరునాడు రెపో కన్నుమూశాడు. అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో ఒకటిగా ఈ సంఘటన నిలిచిపోయింది. దాన్ని మర్చిపోవడానికి అందరికీ కొన్ని నెలలు పట్టింది. విమాన ప్రమాదానికి కారణాలను అన్వేషించారు అధికారులు. బ్లాక్‌బాక్స్ రికార్డింగులను బట్టి ల్యాండింగ్ గేర్ సిస్టమ్ పనిచేయకపోవడమే అసలు కారణమని తెలిసింది. విమానం బాగా ధ్వంసమైనా... కొన్ని పరికరాలకు మాత్రం ఎటువంటి నష్టం జరగలేదు. దాంతో వాటిని తీసి మరో విమాన తయారీలో వాడారు. అలా చేయడం వల్ల ముందు ముందు ఏం జరుగుతుందో అప్పుడు వారు ఊహించలేకపోయారు. కూలిపోయిన విమాన పరికరాలను అమర్చిన ‘ఎల్-1011’ విమానంలో ఊహించని సంఘటనలు జరగడం మొదలైంది. చాలాసార్లు పెలైట్ క్యాబిన్లో కెప్టెన్ రాబర్ట్ కనిపించేవాడు. చాలామంది పెలైట్లు ఆయన్ని చూసి భయపడ్డారు. విచిత్రమేమిటంటే ఆయన వాళ్లు చూస్తుండగానే మాయమయ్యేవాడు. రెపో కూడా విమానంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు. వీళ్లిద్దరూ ఒక్కోసారి ప్రయాణికుల సీట్లలో కూర్చుని ఉండేవారు. వాళ్లు మనుషులని అంతా అనుకునేవారు. కానీ అంతలోనే మాయమైపోతుంటే కంగారు పడేవారు. ఓసారైతే విమానంలో చిన్న సమస్య తలెత్తింది. అసిస్టెంట్ ఇంజినీర్ దాన్ని బాగు చేసేందుకు తంటాలు పడుతున్నాడు. అంతలో ఓ వ్యక్తి వచ్చాడు. తాను చీఫ్ ఇంజినీర్‌నని చెప్పాడు. ఎలా బాగు చేయాలో తెలియడం లేదంటూ బిక్కమొహం వేసిన అసిస్టెంట్ ఇంజినీర్కి ధైర్యం చెప్పి, దాన్ని అతడే బాగు చేశాడు. తర్వాత కనిపించకుండా పోయాడు. అసిస్టెంట్ ఇంజినీర్ ఎంత వెతికినా అతడు కనిపించలేదు. దాంతో అధికారులకు ఆ విషయాన్ని తెలియజేశాడు. అతడెలా ఉన్నాడని వాళ్లు అడిగితే గుర్తులు చెప్పాడు. అప్పటికే జరుగుతున్న సంఘటనల్ని పరిశీలిస్తున్న అధికారులు ఆ ఇంజినీర్కి రెపో ఫొటోని చూపించారు. తాను చూసింది అతడినే అన్నాడతడు. దాంతో రెపోనే వచ్చి రిపేర్ చేశాడని అర్థమైంది అధికారులకి. వచ్చింది మనిషి కాదు, ఆత్మ అని తెలిసిన అసిస్టెంట్ ఇంజినీర్ హడలి పోయాడు. ఇలాంటి విచిత్రమైన సంఘటనలు చాలానే జరిగాయి. కొందరు ఆ విమానం ఎక్కడానికి కూడా భయపడే పరిస్థితి తలెత్తింది. అయితే... రాబర్ట్, రెపోలు ఎప్పుడూ ఎవరికీ ఏ హానీ తలపెట్టలేదు. వచ్చి ఎక్కడో చోట కూర్చునేవారు. తర్వాత మాయమైపోయేవారు. అయితే అప్పుడప్పుడూ కొందరితో మాట్లాడేవారు. ‘‘మీరు కంగారుపడవద్దు. విమానానికి ఏమీ కాదు. మేము ఇక ఏ విమానాన్నీ కూలనివ్వం’’ అంటూ రాబర్ట్ కొందరితో చెప్పేవాడు. రెపో అయితే విమానంలో సమస్య తలెత్తినప్పుడు తప్పక వచ్చేసేవాడు. ఓసారయితే... ఇండికేటర్లో చిన్న సమస్య తలెత్తడాన్ని పైలట్ గమనించాడు. ఇంజినీర్‌తో ఆ విషయం చెప్పాడు. అతడు దాన్ని బాగుచేసేలోపే అది దానంతటదే బాగైపోయింది. దాంతో ఇంజినీర్ ఆశ్చర్యపోయాడు. కానీ అప్పటికే కొన్నేళ్లుగా పనిచేస్తోన్న పైలట్... అది రెపో పనేనని అర్థం చేసుకున్నాడు. రాబర్ట్, రెపోల వల్ల ఏ చెడూ జరగకపోయినా... ఆత్మలు కనిపించడమనేది జనాన్ని భయపెట్టే విషయమే కాబట్టి అధికారులు దాని గురించి తీవ్రంగా ఆలోచించారు. కూలిన విమాన భాగాలను అమర్చడం వల్లే ఇదంతా జరుగుతోందని అర్థం చేసుకుని వాటిని తొలగించి, కొత్త భాగాలను వేశారు. ఆ తరువాత రాబర్ట్, రెపోలు మళ్లీ కనిపించలేదు! - సమీర నేలపూడి -
సంభాషణం: అదే జరిగితే.. పాట రాయడం మానేస్తా!
ప్రతిభకు కొలమానం లేదు అన్న మాట విశ్వ విషయంలో అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. అతడు పాట రాస్తాడు, కంపోజ్ చేస్తాడు, పాడతాడు... పాటకు సంబంధించిన ప్రతి అంశం మీద తన ముద్ర వేయాలని తపిస్తాడు. మిగతావన్నీ ఎలా ఉన్నా... గీత రచయితగా అతడిదో ప్రత్యేక శైలి. వెస్టర్న్ సాంగ్‌కి సైతం తెలుగు సువాసనని అద్దే అతడిది ఓ వైవిధ్యభరితమైన దారి. పాటల పూబాటలో తన పయనం గురించి విశ్వ చెబుతోన్న విశేషాలు... మణిశర్మగారి దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు ఓ సినిమాలో టైటిల్సాంగ్ రాసి, పాడే చాన్సిచ్చారాయన. నా పర్ఫార్మెన్స్ నచ్చి... ‘నీలో మంచి గాయకుడే కాదు, రచయిత కూడా ఉన్నాడు’ అన్నారు. నేను పాట రాస్తాను, కంపోజ్ చేస్తాను, పాడతాను, కీబోర్డ్ వాయిస్తాను, రికార్డ్ చేస్తాను, మిక్సింగ్ కూడా చేస్తాను. ఇప్పటివరకూ ఎన్ని పాటలు రాశారు, ఎన్ని కంపోజ్ చేశారు, ఎన్ని పాడారు? ‘రేసుగుర్రం’లో రాసిన ‘డౌన్ డౌన్’ పాటతో నూట యాభై పూర్తయ్యాయి. హైదరాబాద్ నవాబ్స్, మంగళ, నేను నా రాక్షసి, పోలీస్ పోలీస్, క్షత్రియ చిత్రాలకు సంగీతాన్ని అందించాను. చాలా పాటలు పాడాను. ‘సంతోషం’లో మెహబూబా మెహబూబా, ‘అతడు’ టైటిల్సాంగ్, ‘నేను నా రాక్షసి’లో పడితినమ్మో మొదలైనవి పేరు తెచ్చాయి. అయితే రచయితగానే ఎక్కువ సక్సెస్ అయ్యాను. అసలు సంగీత, సాహిత్యాల మీద ఇంత ప్రీతి ఎలా ఏర్పడింది? నాన్న హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో ఉద్యోగి. ఆయనకు సాహిత్యమంటే చాలా మక్కువ. అమ్మకు శాస్త్రీయ సంగీతం మీద అవగాహన ఉంది. వాళ్లిద్దరి అభిరుచులూ కలిపి నాకు వచ్చాయి. బీహెచ్ఈఎల్లో ‘శ్రీకళా నిలయం’ అనే ఆర్ట్ అసోసియేషన్ ఉంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో నేను వాటిలో పాల్గొనేవాడిని. నెమలికంటి రాధాకృష్ణమూర్తిగారని యద్దనపూడి సులోచనారాణిగారి సోదరుడు... ఆయన ప్రోత్సాహంతో చిన్ననాటనే పలు నాటకాల్లో నటించాను. ఏడో యేటనే ఆంధ్ర నాటక కళా పరిషత్తు అవార్డును అందుకున్నాను. ఆ అనుభవం నాకు సంగీత, సాహిత్యాల పట్ల మక్కువను పెంచింది. ఆంధ్ర యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసేనాటికి ఆ పిచ్చి బాగా ఎక్కువైపోయింది. అందుకే ఇటు వచ్చేశాను. మరి మీ టాలెంట్‌కి తగిన సక్సెస్ వచ్చిందంటారా? నేనెప్పుడూ సక్సెస్‌ని ప్రామాణికంగా తీసుకోను. చేతి నిండా అవకాశాలు ఉంటే అంతకంటే పెద్ద సక్సెస్ ఏముంటుంది! మీరు ఆచితూచి పాటలు ఎంపిక చేసుకుంటారట... నిజమేనా? నిజమే. పాటకి ఓ స్థాయి ఉండాలనుకుంటాను. దిగజారి రాయలేను. అలా చేయలేక పెద్ద పెద్ద సంగీత దర్శకులిచ్చిన అవకాశాలు వదిలేసుకున్నాను. వారి దగ్గర పొగరుబోతుననిపించుకున్నాను. అంటే... దిగజారి రాయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారా? కచ్చితంగా ఉన్నాయి. ‘నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ’ అంటూ రాసిన వేటూరికే ‘ఆకు చాటు పిందె తడిసె’ అంటూ రాయాల్సి వచ్చింది. తన స్థాయికి తగని పాటలు రాయాల్సి వచ్చినందుకు వేటూరి గారు కూడా ఎన్నోసార్లు బాధపడటం మనం చూశాం కదా! అలా ఎందుకు జరుగుతోందంటారు? కొందరు సంగీత దర్శకులకు సాహిత్యం పట్ల అవగాహన ఉండదు. అయినా జోక్యం చేసుకుంటారు. కొన్ని పదాలు తీసేస్తారు. తమకు నచ్చినవి చేర్చేస్తారు. రచయితలకి స్వాతంత్య్రం లేదు. వారి అభిరుచికి విలువా లేదు. ఇది పాటకి శ్రేయస్కరం కూడా కాదు. మరి ఈ పరిస్థితి మారేదెలా? అది నేను చెప్పలేను. కానీ పాటకి నావంతు న్యాయం నేను చేస్తానని మాత్రం చెప్తాను. అందుకే నా పాటల్లో అశ్లీలత, అసభ్యత లేకుండా చూసుకుంటాను. మోడర్న్ సాంగ్స్ రాసినా కూడా అచ్చ తెలుగు పదాలనే వాడుతుంటాను. మంచి పాటను గుర్తించగలిగే విజ్ఞత ఉన్న శ్రోతలు... మంచి అభిరుచి ఉన్న దర్శకులు, సంగీత దర్శకులు కూడా మనకింకా ఉన్నారు కాబట్టి కాస్త ఫర్వాలేదు. మీరూ ప్రయోగాలు చేస్తారుగా? అవును. కానీ ఆ ప్రయోగం ప్రయోజనకరంగానే ఉండేలా చూసుకుంటాను. ఓసారి అన్నపూర్ణ స్టూడియోస్‌లో పాటలు రాస్తుంటే ఏఎన్నార్ వచ్చారు. ‘‘కొత్త పంథాలో పాటలు బాగానే రాస్తున్నావు’’ అంటూ కాళిదాసు శ్లోకం ఒకటి చెప్పారు. దాని భావమేమిటంటే... ‘‘కొత్త ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే కొత్తవన్నీ గొప్పవని కాదు, పాతవన్నీ తీసి పారేసేవీ కాదు. తెలివైన రచయిత పాతదనంలోని మంచిని తీసుకుని కొత్త ప్రయోగాలు చేస్తాడు. ప్రయోగాల పేరిట వింత పోకడలు పోకూడదు.’’ ఆయన చెప్పిన ఈ మాట ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే ఎన్ని ప్రయోగాలు చేసినా భాషను పాడు చేయను. ఎప్పటికీ ఈ మాట మీదే నిలబడతారా? కచ్చితంగా. దిగజారి రాయాల్సి వచ్చిన రోజున పాట రాయడం మానుకుంటాను. పాచిపని చేసుకుని అయినా బతుకుతాను గానీ కళకు ద్రోహం చేయను. - సమీర నేలపూడి -
సంభాషణం: నా సక్సెస్‌ని అదే ఆపుతోంది!
టీవీ, సినిమా రంగంలో ఉన్నవాళ్లు డిప్లొమేటిగ్గా మాట్లాడతారని అంటారంతా. కానీ సత్తెన్నను చూస్తే అది నిజం కాదని పిస్తుంది. తెరమీద కామెడీ చేసి కడుపుబ్బ నవ్వించే ఆయన... నిజానికి చాలా సీరియస్ మనిషి. ముక్కుసూటిగా మాట్లాడ తారు. అనుకున్న దారిలో మొండిగా సాగిపోతారు. తన ప్లస్సు, మైనస్సు కూడా అదేననే సత్తెన్న మనసులోని మాటలు... సత్తెన్న... మీ అసలు పేరు అదేనా? కాదు. నా అసలు పేరు సతీష్ కుమార్. ‘నైజాం బాబులు’ ప్రోగ్రామ్ కోసం పేరు మార్చారు. అసలు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు? పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లో. డిగ్రీ అయ్యాక ఉద్యోగం చేస్తూ మల్టీమీడియా కోర్సు చేశాను. ఓ కంపెనీ కూడా పెట్టాను కానీ నష్టపోయాను. తర్వాత మరో కంపెనీలో చేరాను. అక్కడ నాకు మా బాస్ మరదలు అనూరాధ పరిచయమయ్యారు. ఆవిడ జెమినీ చానెల్లో పని చేసేవారు. ఆవిడ ద్వారానే నేను టెలివిజన్ రంగంలో అడుగుపెట్టాను. అంటే... ఈ ఫీల్డ్ పట్ల మీకు మొదటి నుంచీ ఆసక్తి ఉందా? లేదు. నేను పని చేస్తున్న కంపెనీ మూతబడటంతో మళ్లీ ఉద్యోగ వేటలో పడ్డాను. కానీ ఎక్కడా నాకు తగిన ఉద్యోగం దొరకలేదు. దాంతో అనూరాధగారి ద్వారా పరిచయమైన నిర్మాత జీకే మోహన్ని కలిశాను. ఏదైనా ఉద్యోగం చూడమంటే... ఆయన నన్ను తన టీమ్‌లో పెట్టుకున్నారు. జోగి బ్రదర్స్ ప్రోగ్రామ్లాంటిదే మరో ప్రోగ్రామ్ చేయాలని నైజాంబాబులు మొదలుపెట్టారు. నేను తెలంగాణ యాస బాగా మాట్లాడతానని సత్తెన్నగా తీసుకున్నారు. తర్వాత ఇందులోనే ఉండాలని డిసైడైపోయారా? అవును. నిజానికి మొదట్లో ఎడిటింగ్ దగ్గర్నుంచి అన్ని డిపార్ట్మెంట్లూ ట్రై చేశాను. కానీ సక్సెస్ కాలేదు. ఎప్పుడైతే నైజాంబాబులుతో పేరొచ్చిందో ఇక యాంకర్‌గా సెటిలైపోవాలని నిర్ణయించుకున్నాను. 1999 నుంచి ఇప్పటి వరకూ చేస్తూనే ఉన్నాను. తెలుగు టెలివిజన్ రంగంలో ఇన్నేళ్లపాటు బ్రేక్ లేకుండా యాంకరింగ్ చేస్తోన్న మగ యాంకర్ని నేనొక్కడినే. కానీ ఇప్పుడిప్పుడే కాస్త ఒడిదుడుకులు వస్తున్నాయి. ఎందుకని? కొత్తవాళ్లు ఎక్కువగా వస్తున్నారు. మేం సీనియర్లం కాబట్టి ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలి. కొత్తవాళ్లయితే తక్కువకే చేసేస్తారు. అందుకని వాళ్లను ఎంచుకుంటారు. ఇంకో సమస్య కూడా ఉంది. డెరైక్టర్స్ కూడా కొత్తవాళ్లు వస్తున్నారు. వాళ్లేదో చెబుతారు. అది కరెక్ట్‌గా అనిపించదు. అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అంటాను. అంతే... వాళ్ల ఇగో హర్ట్ అవుతుంది. నన్ను తీసేసి వేరేవాళ్లని పెట్టుకుంటారు. మరి డెరైక్టర్ చెప్పినట్టు చేయాలి కదా? చేయాలి. కానీ తప్పులు చెబుతుంటే ఎలా చేస్తాం? నేనో ప్రోగ్రామ్ చేస్తే, అన్నీ తెలుసుకునే చేస్తాను. సమాజంలో ఏం జరుగుతోంది, రాజకీయాలు, సినిమాలు.. ఇలా అన్ని విషయాల మీద ఎప్పటికప్పుడు అవగాహన తెచ్చుకుని కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తుంటాను. అది నా ప్రత్యేకత. అవతలివాళ్లు చెప్పేది బాగోదని తెలిసి కూడా గుడ్డిగా చేయమంటే నావల్ల కాదు. ఇలా మాట్లాడితే ఇండస్ట్రీలో కష్టం కదా...? అందుకేగా నాకు అవకాశాలు తగ్గుతున్నాయి! రామ్‌గోపాల్ వర్మని చాలామంది తిడతారు. కానీ ఆయన మాటల్ని అంగీకరించేవాళ్లు కూడా ఉన్నారు కదా! నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. అది నచ్చక కొందరు నాకు పొగరు అంటారు. కానీ ఒక్కసారి నేను చేసిన ఇంటర్వ్యూలు చూడండి. నెగిటివ్ విషయాలు కూడా మాట్లాడతాను. సెలెబ్రిటీలకు కోపం వస్తుందని కొన్ని ప్రశ్నలు అడగడం మానేయలేదు. అలా చేయడం వల్లే నాకు పేరు వచ్చింది. ప్రేక్షకులకు నచ్చిన ఆ నైజాన్నే మార్చుకోమంటే ఎలా? పేరు వచ్చింది. కానీ ఇంతవరకూ సరైన బ్రేక్ రాలేదుగా? నేను కూడా దాని కోసమే ఎదురు చూస్తున్నాను. రోజులు మారుతున్నాయి. అవకాశాలు పెరుగుతున్నాయి. టాలెంట్‌ని దాచుకోవాల్సిన పని లేదు. ఎవరూ చాన్స్ ఇవ్వకపోతే మనమే ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టవచ్చు. మన ప్రతిభని నిరూపించుకోవచ్చు. సంపూర్ణేష్‌బాబు (హృదయకాలేయం హీరో) సక్సెస్ అయ్యింది అలానే కదా! మరి సినిమాల సంగతేంటి? అక్కడా సేమ్ ప్రాబ్లెమ్. సక్సెస్ అవ్వాలంటే ప్రతిభ ఉంటే చాలదు... అదృష్టం కూడా ఉండాలి. తెరమీద నవ్విస్తారు. కానీ బయట మీ మాట చాలా సీరియస్‌గా ఉంది? నేను బేసిగ్గా చాలా రిజర్వ్డ్గా ఉంటాను. ఎవరితోనూ పెద్దగా కలవను, మాట్లాడను, నవ్వను, నవ్వించను. ఇండస్ట్రీవాళ్లలో నాకెవరూ స్నేహితులు లేరు. ఎందుకంటే... ఇక్కడ చేతులు కట్టుకుని నిలబడాలి. వాళ్లు జోక్ వేస్తే నవ్వు రాకపోయినా నవ్వాలి. అన్ని బంధాలూ ఆర్టిఫిషియల్‌గా ఉంటాయిక్కడ. అందుకే నా కాలేజీ స్నేహితులతోనే ఉంటాను నేను. భవిష్యత్ ప్రణాళికలేంటి? పెద్దగా ఏమీ లేదు. యాంక ర్గా కెరీర్ బాగున్నా... నటుడిగానే నాకు తగినన్ని అవకాశాలు రావడం లేదు. అయినా పెద్ద టెన్షన్ లేదు. చెప్పానుగా టాలెంట్‌ని దాచలేమని! సంవత్సరమో... రెండు సంవత్సరాలో... బ్రేక్ వచ్చి తీరుతుంది. - సమీర నేలపూడి -
నేరం ఎవరిది ?
నిజాలు దేవుడికెరుక: ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలిస్తారు ఎవరైనా. కానీ ఆమె అతడి ప్రాణం తీసింది. తమ బంధానికే కాదు, అతడి జీవితానికి కూడా ముగింపు పలికింది. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమె ఎందుకలా చేసింది? భర్త ప్రాణాలు తీసేంతగా వారి మధ్య ఏం జరిగింది? జూలై 9, 1923. లండన్‌లోని సవాయ్ హోటల్. రాత్రి ఒంటిగంట దాటింది. హాల్లో మేనేజర్ అటూ ఇటూ ఆవేశంగా తిరుగుతున్నాడు. అతడికి ఎదురుగా నిలబడి ఉన్న స్వీపర్ బిత్తర చూపులు చూస్తున్నాడు. ‘‘నీకు మొన్నే చెప్పాను... పనిలో తేడా జరిగితే ఊరుకునేది లేదని. ఇవాళ మూడో ఫ్లోర్ నువ్వసలు సరిగ్గా శుభ్రం చేయలేదు. ఎక్కడ చూసినా దుమ్మే’’... అరిచినట్టే అన్నాడు మేనేజర్. ‘‘సారీ సర్. ఏదో హడావుడిలో పొరపాటు చేశాను. రేపు జాగ్రత్తగా చేస్తాను’’ సంజాయిషీ ఇచ్చాడు స్వీపర్. ‘‘రేపు కాదు. ఇప్పుడే తుడవాలి. అసలే ఇవాళ కస్టమర్స్ చిరాకు పడ్డారు. రేపు వాళ్లు లేచేసరికి శుభ్రంగా లేకపోతే మళ్లీ మాట పడాల్సి వస్తుంది. వెళ్లు... శుభ్రంగా తుడిచేసి అప్పుడు పడుకో.’’ చిర్రెత్తుకొచ్చింది స్వీపర్‌కి. కానీ నిస్సహాయత నోరు మెదపనివ్వలేదు. మౌనంగా అక్కడ్నుంచి కదిలాడు. మూడో అంతస్తుకి చేరుకుని కారిడార్ శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. ‘‘కాస్త కూడా జాలి లేదు ఈ మనిషికి. ఒంటి గంటన్నర అవుతోంది. అందరూ హాయిగా నిద్రపోతున్నారు. వీడు మాత్రం దుమ్ము, మురికి అంటూ నా వెంట పడ్డాడు. శాడిస్ట్గాడు’’... తిట్టుకుంటూ తుడుస్తున్నాడు. ఉన్నట్టుండి ఏవో మాటలు వినిపించడంతో పని ఆపి నిలబడ్డాడు. ఓ సూట్లోంచి ఆడ, మగ స్వరాలు కాస్త హెచ్చు స్థాయిలో వినిపిస్తున్నాయి. ‘‘నాకు చిరాకు తెప్పించకు. నోర్మూసుకుని పడుకో’’... అరుస్తున్నాడతను. ‘‘నోరు మూసుకోవాల్సింది నువ్వా నేనా? నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్? హింసించి చంపుదామనా?’’... అంతకంటే గట్టిగా అరుస్తోందామె. తలుపు కాస్త తెరిచి ఉండటంతో మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. స్వీపర్ నవ్వుకున్నాడు. ‘‘ఉన్నోళ్లయినా లేనోళ్లయినా మొగుడూపెళ్లాలంటే కొట్టుకోవాల్సిందేనన్నమాట’’ అనుకుంటూ మళ్లీ తన పనిలో పడ్డాడు. రెండు నిమిషాలు గడిచాయో లేదో... తుపాకీ పేలిన శబ్దం వినిపించి అదిరిపడ్డాడు. ఒక్కసారి కాదు... మూడుసార్లు వెంటవెంటనే పేలింది తుపాకీ. గబగబా ఆ గది దగ్గరకు పరిగెత్తాడు స్వీపర్. తలుపు తోసుకుని లోనికెళ్లాడు. నేలమీద పడివున్నాడా వ్యక్తి. తుపాకీ గుళ్లు ఒంటిని చీల్చడంతో రక్తం ఎగజిమ్మి అన్నిటిమీదా పడింది. గాయాల నుంచి రక్తం ఉబికి వస్తోంది. చేతిలో తుపాకీతో అతడి దేహం పక్కన కూర్చుని ఉందామె. ‘‘దేవుడా... ఇంత ఘోరం ఎలా చేశాను’’ అంటూ పిచ్చిగా అరుస్తూ ఏడుస్తోంది. క్షణంసేపు కొయ్యబారిపోయాడు స్వీపర్. తర్వాత తేరుకుని, పరుగున వెళ్లి విషయాన్ని మేనేజర్ చెవిన వేశాడు. అతడు వెంటనే పోలీసులకు కబురందించాడు. కొద్ది నిమిషాల్లో పోలీసులు హోటల్‌కి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో పడివున్న వ్యక్తిని చూసి షాక్ తిన్నారు. ‘‘ఇతడు ఫామీ బే కదూ’’ అన్నాడు ఇన్స్పెక్టర్ మృతదేహాన్ని చూస్తూ. అవునన్నట్టు తలూపాడు మేనేజర్. పోలీసులు ఫామీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి అతడి భార్యని అదుపులోకి తీసుకున్నారు. తెల్లారేసరికల్లా... ఈజిప్టు యువరాజు ఫామీ బేని, అతడి భార్య మార్గరెట్ చంపేసిందన్న వార్త దావానలంలా వ్యాపించింది! ‘‘మీ భర్తని ఎందుకు చంపారు?’’ తల దించుకుని, మౌనంగా కూర్చునివున్న మార్గరెట్‌ని అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘నేను తనని చంపకపోతే, తను నన్ను చంపేసేవాడు సర్. ఆత్మరక్షణ కోసం అనుకోకుండా కాల్చాను తప్ప తనని చంపాలన్న ఉద్దేశం నాకు లేదు.’’ ‘‘మీ భర్త మిమ్మల్ని ఎందుకు చంపుతాడు? మమ్మల్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారా?’’ చివ్వున తలెత్తి చూసింది మార్గరెట్. క్షణాల్లో ఆమె ముఖం ఎర్రబడింది. ‘‘అలాంటిదాన్నే అయితే అందరికీ తెలిసేలా చంపివుండేదాన్ని కాదు కదా. దానికి వేరే మార్గం ఎంచుకుని, ఎవరికీ దొరక్కుండా తప్పించుకుని ఉండేదాన్ని’’... ఆవేశంగా అంది. ‘‘కూల్ మిసెస్ ఫామీ... ఆరా తీస్తేనే ఆవేశపడిపోతున్నారే! ఇంతకీ మీ హస్బెండ్ మిమ్మల్నెందుకు చంపాలనుకున్నారో చెప్పనేలేదు’’... అతడి మాటలోని విరుపు కోపం తెప్పించినా తమాయించుకుంది. ‘‘మనిషయితే ప్రాణం పోస్తాడు. అతడు మృగం కాబట్టి ప్రాణం తీయాలనుకున్నాడు. ఇన్నాళ్లూ చిత్రహింసలు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా చంపేయాలనుకున్నాడు’’... ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది మార్గరెట్. ఇక ప్రశ్నించడం ఇష్టంలేక లేచాడు ఇన్స్పెక్టర్. అప్పటికే హోటల్ మేనేజర్ని వాళ్లిద్దరి గురించి ఆరా తీశారు. ఇద్దరూ వచ్చినప్పటి నుంచీ పోట్లాడుకుంటూనే ఉన్నారని, కలిసేవున్నా అపరిచిత వ్యక్తుల్లా ప్రవర్తించేవారని చెప్పాడతను. ముందురోజు ఉదయం టిఫిన్ చేయడానికి డైనింగ్ హాల్‌కి వచ్చినప్పుడు మార్గరెట్ ముఖం మీద కమిలిన గాయాలున్నాయని, వాటిని కవర్ చేయడానికి ఆమె దట్టంగా మేకప్ వేసుకుందని రెస్టారెంటులోని సర్వర్లు చెప్పారు. దాంతో మార్గరెట్ చెప్పేదాంట్లో నిజం లేకపోలేదనిపించింది ఇన్స్పెక్టర్కి. అందుకే ఆమెను మరీ ఎక్కువ విసిగించకుండా వదిలేశాడు. ప్రిన్స్ ఫామీ బే హత్య సంచలన వార్త అయ్యింది. అందులోనూ అతడిని భార్యే చంపేయడం అందరినీ షాక్‌కి గురి చేసింది. మార్గరెట్‌కి శిక్ష పడటం ఖాయం అని నిర్ధారించేసుకున్నారంతా. అయితే కోర్టుకెళ్లాక కథ అనుకోని మలుపు తిరిగింది. దానికి కారణం... మార్గరెట్ లాయర్ ఎడ్వర్డ్ మార్షల్ హాల్. హాల్ మామూలు లాయర్ కాదు. మరణశిక్ష పడుతుందనుకున్న ఎంతోమంది ఖైదీలను శిక్షే పడకుండా తప్పించిన ఘటికుడు. అందుకే అతడిని లాయర్‌గా ఎంచుకుంది మార్గరెట్. అతడు ఆమె నమ్మకాన్ని నిలబెట్టాడు. మార్గరెట్ తన భర్తను చంపడానికి కారణాలను చూపుతూ ఎవరికీ తెలియని కొత్త కథని విన్పించాడు. ఫామీ బే పూర్తి పేరు... అలీ కెమెల్ ఫామీ బే. ఈజిప్టు రాజకుమారుడు. ఓసారి ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు అతడికి మార్గరెట్ లోరాతో పరిచయమయ్యింది. ఆమె అతడికంటే పదేళ్లు పెద్దది. అప్పటికే పెళ్లయ్యి, భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. అవేమీ ఫామీని ఆమె ప్రేమలో పడకుండా ఆపలేకపోయాయి. అతడి ప్రేమను అంగీకరించినా పెళ్లి దగ్గర మాత్రం అభ్యంతరం చెప్పింది మార్గరెట్. ముస్లిం అయిన అతడు తమ సంప్రదాయాలతో తన ఆధునికతకు, స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తాడేమోనని దిగులుపడింది. అలాంటిదేమీ జరగదని అతడు హామీ ఇచ్చాడు. ఆధునిక వస్త్రాలు వేసుకోనిస్తానని, ఆమెతోనే జీవితాంతం ఉంటానని, తేడా వస్తే ఎప్పుడైనా తనకు విడాకులిచ్చి వెళ్లిపోవచ్చని అగ్రిమెంట్ రాసిచ్చాడు. దాంతో అతడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది మార్గరెట్. అయితే ఈజిప్టు వెళ్లిన తరువాతగానీ తానో పంజరంలో ఇరుక్కుపోయిందని అర్థం కాలేదు మార్గరెట్‌కి. ఫామీ పరమ దుర్మార్గుడు. మూర్ఖుడు. శాడిస్టు. ఆమెని ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టాడు. శృంగారం పేరుతో అతడు చేసే వికృత చేష్టలతో నరకం చూసిందామె. పచ్చిపుండులా మారిన శరీరానికి వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్‌తో తన ఆవేదనను చెప్పుకుంది. అయితే ఆ విషయం తెలిసి మరింత హింసించాడు ఫామీ. తనను వదిలేయమని ప్రాధేయపడింది. అగ్రిమెంట్ ప్రకారం విడాకులు తీసుకునే హక్కు తనకుందంది. కానీ అప్పుడే తెలిసిందామెకి... అగ్రిమెంట్ విషయంలో కూడా మోసం జరిగిందని. మొదట తనకి చూపించిన కాగితాల్లో ఉన్న అంశాల్ని మార్చేసి, వేరే కాగితాల మీద ఫామీ తనతో సంతకం పెట్టించుకున్నాడని తెలిసి విస్తుపోయింది. కానీ విధిలేక మౌనంగా ఉండిపోయింది. ఆమె పారిపోతుందని భయమేసి ఒక్కదాన్నీ వదిలిపెట్టేవాడు కాదు ఫామీ. ఎక్కడికెళ్లినా తనతో పాటే తీసుకెళ్లేవాడు. లండన్‌కి కూడా అలానే తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ గొడవపడ్డారు. ఆవేశం తట్టుకోలేక అతడు తుపాకీతో కాల్చబోతే, దాన్ని లాక్కుని అతడినే ఆమె కాల్చేసింది. ‘‘యువరానర్... ప్రిన్స్ ఫామీ శాడిజానికి నా క్లయింట్ నరకం అనుభవించింది. తనలో తనే కుమిలిపోయింది. సర్దుకుపోవడానికి సైతం ప్రయత్నించింది. కానీ ఎప్పుడైతే తన భర్త స్వలింగ సంపర్కుడు అని తెలిసిందో, తన మేనేజర్‌తోనే అతడికి సంబంధం ఉండటం కళ్లారా చూసిందో... అప్పుడు తట్టుకోలేకపోయింది. నిలదీస్తే అతడు కొట్టాడు. చిత్రహింసలు పెట్టాడు. చివరకు చంపబోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం అతడిని చంపింది. దయచేసి మానవతా దృక్పథంతో మార్గరెట్‌కు న్యాయం చేయండి.’’ అని మార్షల్ హాల్ వాదించాడు. హాల్ వాదనకు కోర్టు దద్దరిల్లింది. న్యాయస్థానం మార్గరెట్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత మార్గరెట్ ఫ్రాన్స్ వెళ్లిపోయింది. జీవితమంతా ఒంటరిగానే బతికి, ఎనభయ్యేళ్ల వయసులో (1971) కన్నుమూసింది. ఆమె పోయినా, ఆమె గురించిన సందేహాలు మాత్రం అందరి మనసుల్లోనూ అలానే నిలిచిపోయాయి. మార్గరెట్ నిజంగానే నిర్దోషా, ఆమె భర్త అంత పెద్ద శాడిస్టా, ఆమెను హింసించిన అతడు నేరస్తుడా లేక అతడిని చంపిన మార్గరెట్ నేరస్తురాలా, అసలు నేరం ఎవరిది అన్న ప్రశ్నలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. మార్గరెట్‌ని నిర్దోషిగా వదిలేయడం అన్యాయమన్నారు చాలామంది. దానికి కారణం మార్గరెట్ గతం. ఆమెకు చాలామందితో సంబంధాలున్నాయని, ఎంతోమందితో ప్రేమ వ్యవహారాలు నడిపిందని కొందరు సాక్ష్యాలు చూపించారు. డబ్బు మీద ఆమెకు వ్యామోహం ఎక్కువని కూడా అన్నారు. వాళ్ల మాట నిజమనే సంఘటన ఒకటి జరిగింది కూడా. విచారణకాలంలో తాను గర్భవతినని చెప్పింది మార్గరెట్. కానీ పరీక్ష చేస్తే అది అబద్ధమని తేలింది. కేవలం తన భర్త ఆస్తిలో వాటా కోసమే ఆమె అలా చేస్తోందని ఫామీ కుటుంబ సభ్యులు అన్నా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు హత్య చేసిన ఆమెకు ఆస్తి మీద ఎలాంటి హక్కూ లేదని అక్కడి చట్టాలు చెప్పడంతో సెలైంట్‌గా ఫ్రాన్స్‌కు చెక్కేసింది. ఒక్కసారి ఆమె గురించి ఆరా తీసివుంటే... ఫామీ హత్య కేసు మరో మలుపు తిరిగివుండేదని అంతా భావించారు. - సమీర నేలపూడి -
నిజాలు దేవుడికెరుక: ఏది నిజం? అబద్ధం?
నిజాన్ని ఎంతోకాలం దాచలేం. అబద్ధాన్ని నిజమని ఎక్కువకాలం నమ్మించనూలేం. కానీ జెన్నిఫర్ జాక్సన్ హత్య విషయంలో బయటకు రాకుండా ఎన్నో నిజాలు దాగివున్నాయి. ఎన్నో అబద్ధాలు నిజాలుగా చలామణీ అవుతున్నాయి. ఇంతకీ ఎవరీ జెన్నిఫర్ జాక్సన్? ఆమెను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? సంవత్సరం క్రితం జెన్నిఫర్ భర్త నజ్మీని కూడా ఎవరో చంపేశారు. అతడికి డ్రగ్స్, అమ్మాయిల ట్రాఫికింగ్ ముఠాలతో సంబంధాలు ఉండటంతో వాళ్లే చంపేశారని అనుకున్నారంతా. ఇప్పుడు జెన్నిఫర్‌ని కూడా వాళ్లే చంపేశారేమోనని అనుమానం వచ్చింది. కానీ జెన్నీకి అలాంటి వాళ్లెవరితోనూ సంబంధాలు లేవని, ఆమె చాలా గౌరవమైన జీవితం జీవిస్తోందని పరిశోధనలో తేలింది. జూన్ 5, 2005. షెల్బీ కౌంటీ (అమెరికా) ఉదయం అయిదున్నర దాటుతోంది. మెంఫిస్ ప్రాంతంలోని ఆ ఇంట్లో అప్పటికే హడావుడి మొదలైంది. పిల్లలతో కలిసి పిక్నిక్కి వెళ్లాలని ప్లాన్ చేసుకోవడంతో యజమానురాలు శారా ఐదు గంటలకే లేచి ఏర్పాట్లు మొదలెట్టింది. భర్త జాయ్ ఆమెకు సహకరిస్తున్నాడు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. ‘‘ఇంత పొద్దునే ఎవరొచ్చారు జాయ్, వెళ్లి చూడు’’ అంది శారా. ప్యాక్ చేస్తోన్న శాండ్విచెస్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్లాడు జాయ్. తలుపు తీయగానే ఎదురుగా కనబడిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ‘‘నోరా... నువ్వేంటి ఈ టైమ్‌లో... ఏమయ్యింది’’ అన్నాడు ఆతృతగా. నోరా కళ్లలో బెదురు స్పష్టంగా కనిపిస్తోంది. ‘‘అంకుల్... ఓసారి నాతో వస్తారా?’’ అంది నోరా వణుకుతున్న కంఠంతో. ‘‘ఏమయ్యింది నోరా?’’ ‘‘నేనిప్పుడే ఇంటికొచ్చానంకుల్. ఎంతసేపు కొట్టినా అమ్మ తలుపు తీయట్లేదు. భయంగా ఉంది.’’ ‘‘అవునా... పద చూద్దాం’’ అంటూ నోరాతో కలిసి రోడ్డుకు అవతల ఉన్న ఇంటివైపు నడిచాడు. ఇద్దరూ తలుపులు బాదారు. కానీ తలుపు తెరచు కోలేదు. ‘‘లాభం లేదు... తలుపు పగులగొడదాం’’ అన్నాడు జాయ్. ఇద్దరూ కలిసి తలుపులు పగులగొట్టారు. వెంటనే తల్లి గదిలోకి పరుగుదీసింది నోరా. మరుక్షణం కెవ్వున అరిచింది. జాయ్ గబగబా వెళ్లాడు. అక్కడ... బెడ్రూమ్లో... మంచం పక్కన... రక్తపు మడుగులో పడివుంది జెన్నిఫర్ జాక్సన్. అసలు ఆమె ఒంట్లో ఒక్కచుక్క రక్తమైనా మిగిలివుందా లేదా అన్నంతగా రక్తం ధారలు కట్టింది. పెదవులు చితికిపోయాయి. పొట్ట చీలిపోయి పేగులు బయటకు వచ్చేశాయి. ఒళ్లంతా తూట్లు పడిపోయి భయానకంగా ఉంది. ‘‘మమ్మీ’’ అంటూ భోరుమంది నోరా. జాయ్ నోరాని దగ్గరకు తీసుకున్నాడు. ‘‘నో మై చైల్డ్... భయపడకు. ముందు పోలీసులకు ఫోన్ చేద్దాం’’ అన్నాడు. అంత దుఃఖాన్నీ నియంత్రించుకుని నంబర్ డయల్ చేసింది నోరా. బాండ్ ట్రేడర్ అయిన జెన్నిఫర్ జాక్సన్ (39) గురించి ఎవరినడిగినా చెబుతారు. వ్యాపారం ఎంత కచ్చితంగా చేస్తుందో... వ్యక్తిత్వపరంగా అంత నిక్కచ్చిగా ఉంటుందంటూ సర్టిఫికెట్ ఇస్తారు. అలాంటి మంచి మనిషిని యాభైసార్లు పొడిచి చంపేంత పగ ఎవరికి ఉంటుందో అర్థం కాలేదెవరికీ. పోలీసులు ఇల్లంతా సోదా చేశారు. జెన్నిఫర్ బెడ్రూమ్ కిటికీ పగులగొట్టి ఉంది. హంతకుడు దానిగుండానే రాక పోకలు సాగించి ఉంటాడని అంచనా వేశారు. అయితే దాని మీద వేలిముద్రలేవీ దొరక్కపోవడం విస్మయపరిచింది. సంవత్సరం క్రితం జెన్నిఫర్ భర్త నజ్మీని కూడా ఎవరో చంపేశారు. అతడికి డ్రగ్స్, అమ్మాయిల ట్రాఫికింగ్ ముఠాలతో సంబంధాలు ఉండటంతో వాళ్లే చంపేశారని అనుకున్నారంతా. ఇప్పుడు జెన్నీని కూడా వాళ్లే చంపేశారేమోనని అనుమానం వచ్చింది. కానీ జెన్నీకి అలాంటి వాళ్లెవరితోనూ సంబంధాలు లేవని, గౌరవమైన జీవితం జీవిస్తోందని పరిశోధనలో తేలింది. దాంతో ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో అర్థం కాలేదు పోలీసులకి. వారు మౌనంగా ఉండటం నోరాకి కోపం తెప్పించింది. ‘‘ఏంటి సర్ ఇది? మా అమ్మని దారుణంగా చంపేశారు. మీరేమో... వాళ్లని పట్టుకోకుండా కాలయాపన చేస్తున్నారు.’’ నోరా మాటకి ఒళ్లు మండింది ఇన్స్పెక్టర్ డేవిడ్‌కి. ఆవేశంగా ఏదో అనబోయాడు. కానీ అధికారి లివింగ్స్టన్ ఆపడంతో గమ్మునుండిపోయాడు. ‘‘మిస్ నోరా... మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఎవరిని అడిగినా మీ అమ్మగారికి శత్రువులు లేరని చెబుతున్నారు. అనుమానాస్పదమైన వ్యక్తులెవరూ మీ అమ్మగారి జీవితంలో లేకపోవడం వల్ల కేసు కదలడం లేదు’’ అన్నాడు లివింగ్స్టన్ అనునయంగా. శాంతించింది నోరా. ‘‘ఒక్కసారి పాస్టర్ ఇర్విన్‌తో మాట్లాడండి. ఏదైనా క్లూ దొరుకుతుందేమో’’ అంది. ‘‘అతడెవరు?’’ ‘‘అమ్మ అతడిని ప్రేమించింది. కానీ కొద్దిరోజుల క్రితం ఏదో తేడా వచ్చి దూరమైపోయింది. అది మనసులో పెట్టుకుని అతడేమైనా...’’ ఆమె ఏం చెబుతోందో అర్థమైంది లివింగ్‌స్టన్‌కి. వెంటనే తన టీమ్‌తో పాస్టర్ మార్క్ ఇర్విన్ ఇంటికి బయలుదేరాడు. ‘‘వాట్ నాన్సెన్స్... నేను జెన్నీని చంపడమేంటి?’’ సూటిగా అన్నాడు ఇర్విన్. ‘‘అంటే మీకు జెన్నిఫర్ మీద కోపం లేదా’’... ఇర్విన్‌ని నఖశిఖ పర్యంతం పరిశీలిస్తూ అన్నాడు లివింగ్స్టన్. ‘‘లేదు, ఉండదు కూడా. మేమిద్దరం కొన్నాళ్లు డేటింగ్ చేసినమాట నిజమే. కానీ ఏవో పొరపొచ్చాలు వచ్చాయి. దూరంగా ఉందామనుకున్నాం... ఉంటున్నాం. ఇంత మాత్రానికే ఆమెని నేను చంపేశాననడం హాస్యాస్పదంగా ఉంది. నాకే కాదు... జెన్నీని చంపాలన్న ఆలోచన ఎవ్వరికీ రాదు... నోరాకి తప్ప.’’ ఉలిక్కిపడ్డాడు లివింగ్స్టన్. ‘‘ఏం మాట్లాడుతున్నారు?’’ అన్నాడు ఆశ్చర్యంగా. ‘‘నోరా చంపిందని అనడం లేదు. కానీ ఈ లోకంలో జెన్నీకి అతి పెద్ద శత్రువు నోరాయే. హత్య జరిగిన ప్రదేశంలో నోరా వేలిముద్రలు గానీ, పాదముద్రలు గానీ, ఆమెకు సంబంధించిన ఎటువంటి ఆధారం గానీ లభించలేదు. పైగా జెన్నీ చేతిలో ఎవరివో వెంట్రుకలు దొరికాయి. డీఎన్ఏ పరీక్ష చేస్తే అవి నోరావి కాదని తేలింది. అంటే చనిపోకముందు జెన్నీ ఎవరితోనో పెనుగులాడింది. అతడి తల వెంట్రుకలు ఆమె చేతిలో చిక్కుకున్నాయి. మరి అతడెవరో తెలుసుకోవాలి కదా! అది మానేసి నోరాని నిందితురాలిని చేయడమేంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ పోలీసులు గానీ, న్యాయస్థానం గానీ దానికి స్పందించడం లేదు. ఇరవయ్యేళ్ల వయసులో నోరాకి జన్మనిచ్చింది జెన్నీ. తర్వాత కొద్ది కాలానికే భర్తతో విడిపోయింది. కూతుర్ని కష్టపడి పెంచింది. కానీ ఆమె కష్టాన్ని నోరా అర్థం చేసుకోలేదు. డ్రగ్స్ అడిక్ట్ అయ్యింది. తిరుగుళ్లకు అలవాటు పడింది. తన కోసం జెన్నీ ఎంత ఆవేదన చెందేదో నాకు తెలుసు.’’ ‘‘అంత మాత్రాన తల్లిని చంపేస్తుందంటారా?’’ ‘‘చెప్పానుగా... నోరా చంపిందని నేను అనడం లేదని. తను తప్ప జెన్నీని బాధపెట్టేవాళ్లు ఎవరూ లేరని చెబుతున్నాను అంతే.’’ కేసును ముందుకు నడిపించడానికి పెద్ద ఆధారమే దొరికింది లివింగ్‌స్టన్‌కి. ‘‘మీకేమైనా పిచ్చి పట్టిందా... ఏం మాట్లాడుతున్నారు?’’... అరిచినట్టే అంది నోరా. లివింగ్స్టన్ నవ్వాడు. ‘‘పిచ్చి పట్టలేదు... నిజం తెలిసింది. ఆ రోజు ఉదయం ఐదు గంటల వరకూ ఎక్కడికెళ్లావ్?’’ అన్నాడు చాలా కూల్‌గా. ‘‘రాత్రి మా ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉంటే వెళ్లాను. లేటయ్యింది. అందుకే తెల్లవారు జామున వచ్చాను.’’ ‘‘అవును. తెల్లవారుజామున ఇంటికొచ్చావ్. అయితే ఐదు గంటలకి కాదు. నాలుగింటికే. మీ అమ్మని చంపేశావ్. ఎవరికీ అనుమానం రాకుండా లోపల గడియ పెట్టి, కిటికీ పగులగొట్టి పారిపోయావ్. తర్వాత ఏమీ ఎరగనట్టు ఎదురింటాయన దగ్గరకు వెళ్లి సాయమడిగావ్.’’ ‘‘నో నో నో’’... స్టేషన్ అదిరిపోయేలా అరిచింది నోరా. ‘‘అరిచినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. మీ అమ్మని నువ్వే చంపావ్. అప్పుడు నీ చేతిమీద కత్తిగాటు కూడా పడింది. నాలుగున్నర ప్రాంతంలో మీ ఇంటికి దగ్గరలో ఉన్న డిస్పెన్సరీకి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కొనుకున్నావ్. మీ ఇంటి దగ్గర, డిస్పెన్సరీ దగ్గర ఉన్న సీసీ టీవీ ఫుటేజుల్లో మొత్తం రికార్డయ్యింది.’’ ఏదో చెప్పాలనుకుంది నోరా. కానీ మాట తడబడింది. గొంతు వణికింది. దాంతో నేరం ఆమే చేసిందని నిర్ధారణ అయ్యింది. సెప్టెంబర్ 29, 2005న నోరా అరెస్ట్ అయ్యింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ వేగంగా జరిగిపోయింది. నోరా డ్రగ్స్‌కి అడిక్ట్ అయ్యిందని, దాని గురించి తల్లీకూతుళ్లకు ఎప్పుడూ గొడవ జరుగుతూ ఉండేదని చుట్టుపక్కలవాళ్లు చెప్పారు. నోరా చెడు తిరుగుళ్లతో జెన్నీ విసిగిపోయిందని, పద్ధతి మార్చుకోకపోతే వెళ్లి ఎక్కడైనా హాస్టల్లో ఉండమని నోరాకి జెన్నీ చెప్పేసిందని, ఆ కోపంతోనే తల్లిని చంపి ఉంటుందని జెన్నిఫర్ తల్లి చెప్పింది. జెన్నీకి ఏదైనా అయితే తనకు ఎంత ఆస్తి వస్తుందని నోరా అడిగిందని జెన్నిఫర్ సోదరుడు సాక్ష్యం చెప్పాడు. దాంతో నోరాయే జెన్నిఫర్‌ని చంపిందని కోర్టు నమ్మింది. ఇరవయ్యేళ్ల జైలుశిక్ష విధించింది. బెయిల్‌కు అప్లై చేయడానికి వీల్లేదంటూ కండిషన్ కూడా పెట్టింది. ప్రస్తుతం నోరా జైల్లో ఉంది. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన ఆమె... ఇనుప ఊచల వెనుక ఒంటరితనాన్ని అనుభవిస్తోంది. జీవితం నేర్పిన పాఠాన్ని జైలు గోడల మధ్య చదువుకుంటోంది. కానీ ఇప్పటికీ ఆమె తాను నిర్దోషిననే అంటోంది. ఆమే కాదు... నోరా నేరస్తురాలు కాదు అనేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. ఏ ఆధారం దొరకనందుకు నోరాని నేరస్తురాలిని చేశారని కొందరు అంటున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో జెన్నీ మాత్రమే చెప్పగలదు. కానీ ఆమె తిరిగిరాదు. మరి నిజం ఎలా తెలుస్తుంది? నోరా నేరం చేసిందో లేదో ఎలా తేలుతుంది? ఆమె నిర్దోషే అయితే ఏ శక్తి ఆమెను కాపాడుతుంది? ఏమో మరి... నిజాలు దేవుడికెరుక! - సమీర నేలపూడి -
ఆ బాధతోనే ఓసారి ఇండస్ట్రీని వదిలివెళ్లిపోయా!
‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’... ఈ ఒక్క డైలాగ్‌తోనే వంద సినిమాలు చేసినంత గుర్తింపును తెచ్చుకున్న నటుడు పృథ్వీ. ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నా... నటనపట్ల మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తాజాగా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘భీమవరం బుల్లోడు తదితర చిత్రాలతో అలరించారు. తన ఆటుపోట్ల సినీప్రయాణం గురించి పృథ్వీ చెప్పిన విశేషాలు... మా అబ్బాయిని చిన్నప్పుడు... ‘బాల రామాయణం’లో ఇంద్రజిత్ పాత్ర కోసం తీసుకున్నారు గుణశేఖర్. ట్రెయినింగ్ కూడా ఇచ్చాక వేరే అబ్బాయిని తీసుకున్నారు. దాంతో డిజప్పాయింట్ అయ్యాడు. ఇక సినిమాల జోలికి రాకూడదని అప్పుడే డిసైడ్ చేసేసుకున్నాడు. మా అమ్మాయి చెన్నై టీసీఎస్‌లో పని చేస్తోంది. తనకీ ఈ ఫీల్డ్ మీద ఆసక్తి లేదు. వాళ్లు వస్తానంటే నాకు అభ్యంతరమూ లేదు! థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ... ఎలా ఉంది ఎక్స్‌పీరియెన్స్? (నవ్వుతూ) నేను ఇండస్ట్రీకొచ్చి ఇంకా థర్టీ ఇయర్స్ అవ్వలేదండీ... ఇరవయ్యేళ్లే అయ్యింది. ‘ఖడ్గం’లోని ఆ డైలాగ్ మీ జీవితాన్నే మార్చేసింది కదా... అందుకని...? అవును. నిజానికి అది ముందు అనుకుని పెట్టిన డైలాగ్ కాదు. వేరే ఏదో అనుకున్నాం. కానీ రోజంతా ఎన్ని టేకులు చేసినా తృప్తికరంగా రాలేదు. సాయంత్రం సడెన్‌గా కృష్ణవంశీ ఆ డైలాగ్ చెప్పారు. అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చింది. నా కెరీర్‌ని మలుపు తిప్పింది. ఆ సిన్మాతోనే మీ గురించి అందరికీ తెలిసింది. అంతకుముందు ఏం సినిమాలు చేశారు? చాలానే చేశాను.‘గండిపేట రహస్యం’ చిత్రంలో హీరోగా చేశాను. అయితే అది పక్కా పొలిటికల్ చిత్రం కావడంతో విడుదల తరువాత చాలా గొడవలయ్యాయి. నేను ఎన్టీయార్‌ని ఇమిటేట్ చేశానని చాలామంది విమర్శించారు. చివరికి ఎన్టీయారే పిలిచి... ‘డెరైక్టర్ చెప్పింది చేశావ్, నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవారు, నీ తప్పేమీ లేదు’ అన్నారు. దాంతో నా టెన్షన్ తగ్గింది. మరికొన్ని చిత్రాల్లో కూడా నటించాను కానీ అంత గుర్తింపు రాలేదు. అసలు నటుడవ్వాలని ఎందుకనుకున్నారు? మాది తాడేపల్లిగూడెం. మా నాన్న సుబ్బారావు నటుడే. నాటకాలు, ఓ పదిహేను పౌరాణిక చిత్రాల్లో నటించారు. ఆయన ప్రభావం కొంత ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్.ఏ. చేస్తున్నప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేవాడిని. అప్పుడందరూ నటుడిగా ట్రై చేయొచ్చుగా అనేవారు. దాంతో ఆసక్తి ఏర్పడింది. నటుడు ప్రభాకర్‌రెడ్డిగారు నాన్న స్నేహితుడు. ఆయన సహకారంతో 1994లో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఆయనే నా నట గురువు. సక్సెస్ కావడానికి చాలా టైమ్ పట్టిందే? ఇండస్ట్రీ అలాంటిది. ఇప్పుడంటే చదువుకున్నవాళ్లు వస్తున్నారు, ఎవరి పని వాళ్లు చేసుకుపోతున్నారు, ఎదుటివారిని గౌరవిస్తున్నారు. అప్పట్లో అలా కాదు. చాలా యాటిట్యూడ్ ప్రాబ్లెమ్స్ ఉండేవి. నాకు ఇస్తామన్న రోల్స్ చివరి నిమిషంలో వేరేవాళ్లకి ఇచ్చేసేవారు. చాలా డిజప్పాయింట్ అయ్యేవాడిని. ఇంత చదువుకున్నాం, ఇలా అవమానాలు భరించడం అవసరమా అని కుమిలిపోయేవాడిని. చివరికి ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్లిపోయాను. వెళ్లిపోయారా.. మళ్లీ ఎలా వచ్చారు? నన్ను నటుడిగా చూడాలని మా అమ్మ కలలు కంది. కానీ తన కల నెరవేరకముందే కన్నుమూసింది. ఆ బాధతో కొంత ఇక సినిమాలు వద్దనుకుని, ఓ కాలేజీలో లెక్చెరర్‌గా చేరిపోయాను. కొన్నాళ్ల తర్వాత కృష్ణవంశీ ఫోన్ చేశారు. ఆయనది మా ఊరే కావడంతో నేను ఆయనకు బాగా తెలుసు. ‘ఖడ్గం’లో నటించడానికి రమ్మని పిలిచారు. ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్‌తో కొత్త జీవితాన్నిచ్చారు. ఇప్పుడు హ్యాపీనా...? హ్యాపీనే. ‘ఆగడు’, ‘అవతారం’తో పాటు మరికొన్ని చిత్రాలు చేస్తున్నాను. ‘గే’ల సమస్యల ఆధారంగా తీసిన ‘థర్డ్ మ్యాన్’ అనే కన్నడ సినిమాలో లీడ్ రోల్ చేశాను. ఇది తెలుగులో కూడా రానుంది. ఏదైనా డ్రీమ్‌రోల్ ఉందా? ‘అంతఃపురం’లో ప్రకాశ్‌రాజ్ పాత్రలాంటిది చేయాలి. అంతేకాదు... కైకాల సత్యనారాయణగారు నా రోల్ మోడల్. ఆయన చేయని పాత్ర లేదు. ఆయనలానే నేను కూడా రకరకాల రోల్స్ చేయాలి. నటన కాకుండా మీకున్న మరో లక్ష్యం? సమాజ సేవ. మనిషిగా పుట్టినందుకు సమాజానికి ఏదైనా చేయాలి. అందుకు రాజకీయాలు ఓ మంచి మార్గమని నా నమ్మకం. అందుకే వైఎస్సార్సీపీలో చేరాను. తీరిక దొరికినప్పుడల్లా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాను. వైఎస్సార్‌ని ఆరాధించేవాడిగానే కాదు... ఓ వ్యక్తిగా ఈ సమాజం పట్ల నా బాధ్యతను కాస్తయినా తీర్చుకోవాలన్నదే నా ఆశ, ఆశయం. - సమీర నేలపూడి -
సంభాషణం: అప్పుడే నటనకు గుడ్‌బై చెబుదామనుకున్నా!
అక్క, అమ్మ, వదిన... ఏ పాత్ర చేసినా ఒదిగిపోతారు ‘సన’. అందుకే దాదాపు రెండు దశాబ్దాలుగా వెండితెర మీద విజయవంతంగా వెలుగుతున్నారు. మూడొందల సీరియళ్లు, ఐదు వందలకు పైగా సినిమాలు చేసినా... ఇప్పటికీ తన నటదాహం తీరలేదనే సన... ఇన్నేళ్ల తన సినీప్రస్థానం గురించి చెబుతోన్న ముచ్చట్లు... మా వారు సయ్యద్ సాదత్ వ్యాపారి. మా అబ్బాయి సయ్యద్ అన్వర్ తెలుగు, తమిళ సీరియల్స్ నిర్మిస్తున్నాడు. ఈమధ్యనే కొన్ని తమిళ సీరియల్స్‌లో నటించాడు కూడా. తెలుగులో ఓ మంచి సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. మా పాప తబస్సుమ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. కొన్ని అంతర్జాతీయ డాక్యుమెంటరీలలో నటించింది. వాళ్లు ఏం చేయాలన్నది వాళ్లే నిర్ణయించుకున్నారు. వాళ్లేం చేస్తానన్నా నాకు అంగీకారమే, ఆనందమే! * మీ పేరు చూస్తే... మీరు తెలుగువారు కాదనిపిస్తుంది...? నేను ఆంధ్రప్రదేశ్ అమ్మాయినే కానీ తెలుగమ్మాయిని కాదు. హైదరాబాదీ ముస్లిమ్‌ని. నటనలోకి వచ్చాక తెలుగు మాట్లాడ్డం నేర్చుకున్నాను. కానీ ఇప్పటికీ చదవడం, రాయడం రాదు. * ముస్లిం అయివుండి ఆ రోజుల్లోనే ఈ రంగంలోకి రావడమంటే...? మామూలు విషయం కాదు. కానీ మా అత్తామామల వల్ల ఇది సాధ్యమైంది. నాకు పద్నాలుగేళ్లకే పెళ్లి చేశారు. మావా రిది జాయింట్ ఫ్యామిలీ. అన్ని సంప్రదాయాలూ పాటించేవారు. అయితే ఎస్సై అయిన మా మావయ్యగారు ఆధునిక భావాలు కలవారు. ఆయనే నన్ను చది వించి, ఓ స్కూల్ పెట్టిద్దామనుకున్నారు. * మరి ఇటెందుకొచ్చారు? ఓ ఆదివారం పేపర్లో మోడల్స్ కావాలని యాడ్ చూశాను. స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసిన అనుభవం ఉండటంతో ఆసక్తి కలిగింది. ఆ విషయం చెప్పగానే అందరూ కంగారుపడ్డారు. కానీ మావయ్యగారు నాకు నచ్చిందే చేయమన్నారు. మా అత్తగారిని తోడిచ్చి ఆడిషన్‌కి పంపారు. సెలెక్టయ్యి బిజీ అయి పోయాను. చానాళ్లపాటు మా కమ్యూనిటీ లో చాలా రకాలుగా మాట్లాడేవారు. మీ కోడలు మోడల్ అంటకదా, సినిమాల్లో చేస్తోందట కదా అని అదో రకంగా అనేవారు. కానీ అత్తయ్య, మావయ్య... ‘తనకి నచ్చింది చేస్తోంది, తన సంతోషమే మా సంతోషం’ అనేవారు. వాళ్లిద్దరూ లేకపోతే నేనీరోజు ఇలా ఉండేదాన్ని కాదు. * ఇప్పటికెన్నేళ్లయ్యింది ఇండస్ట్రీకొచ్చి? పద్దెనిమిదేళ్లు. యాడ్స, సీరియల్స్, సినిమాలు... ఇన్నేళ్లు ఎలా గడిచాయో తెలియనే లేదు. * అప్పటికీ ఇప్పటికీ పరిశ్రమలో ఎలాంటి మార్పులొచ్చాయి? టెక్నికల్ విలువలు బాగా పెరిగాయి. ఒకప్పుడు ఎక్కడ ఏ తప్పు జరుగుద్దో అని భయపడేవాళ్లం. ఎందుకంటే... షూట్ చేశాక రీలును స్టూడియోకి తీసుకెళ్లి, చూసి, తప్పులుంటే మళ్లీ రీ షూట్ ప్లాన్ చేసి తీసేవాళ్లు. దానికి చాలా టైమ్ పట్టేది. టైమ్ వేస్టు, రీల్ వేస్టు. ఇప్పుడా సమస్య లేదు. తీసింది వెంటనే చూసేసుకోవచ్చు. తేడాలుంటే అప్పటికప్పుడే సరి చేసుకోవచ్చు. కాకపోతే దీనివల్ల కాస్త సీరియస్‌నెస్ తగ్గిందేమోనని కూడా అనిపిస్తూ ఉంటుంది. సరి చేసుకోవడం ఈజీ అని తెలిశాక తప్పుల పట్ల భయం తగ్గుతుంది కదా! * క్యారెక్టర్ ఆర్టిస్టులు పెరుగుతున్నారు. పోటీ ఉంటోందా? ఎందుకుండదు! పోటీ అనేది ప్రతి చోటా ఉంటుంది. మాకూ ఉంది. కాకపోతే ఆ పోటీవల్ల నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు. నా అవకాశాలు నాకున్నాయి. * మనసుకు నచ్చిన, నచ్చని పాత్రలు? ఏదైనా మనసుకు నచ్చితేనే చేస్తాం. కానీ కొన్నిసార్లు ఒప్పుకున్నప్పుడు నచ్చుతుంది, చేసిన తర్వాత నచ్చదు. ఎందుకంటే చెప్పేటప్పుడు ఓ రేంజ్లో చెప్తారు. తీరా చూస్తే అంత ఉండదక్కడ. ఒక్కోసారి డిజప్పాయింట్ అవుతాను కానీ... ఏదైనా పనే కదా అని తర్వాత లైట్ తీసుకుంటా. * చాలా రకాల పాత్రలు చేశారు. ఇంకా ఫలానా పాత్ర చేయాలనేమైనా ఉందా? అమ్మ, అక్క, అత్త, వదిన అన్ని రకాల పాత్రలూ చేశాను. అమ్మవారి పాత్రలు, నెగిటివ్ రోల్స్ కూడా చేశాను. కానీ తృప్తి మాత్రం లేదు. ఇది అని చెప్పలేను కానీ... ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది. సినిమా, సీరియల్ ఏదైనా సరే... మంచి పాత్రలు వస్తే వదిలే ప్రసక్తే లేదు. * ఇన్నేళ్లుగా నటిస్తున్నారుగా... ఎప్పుడైనా ఇక ఆపేద్దాం అనిపించిందా? 2000వ సంవత్సరంలో అనుకున్నాను. కానీ సరిగ్గా అప్పుడే ‘కలిసుందాం రా’ రిలీజై హిట్టవడంతో మళ్లీ ఆలోచనలో పడ్డాను. మంచి మంచి అవకాశాలొస్తుంటే ఎలా కాదనగలను! అందుకే ఊపిరున్నంత వరకూ నటిస్తూనే ఉండాలి అని డిసైడ్ చేసేసుకున్నాను. - సమీర నేలపూడి -
నిజాలు దేవుడికెరుక: సూపర్‌మ్యాన్ శాపగ్రస్తుడా?
విజ్ఞానం ఎంత పెరిగినా ఇప్పటికీ విజ్ఞతకు అందని విషయాలు చాలానే ఉన్నాయి ప్రపంచంలో. ఏది ఎందుకు జరుగుతుందో తెలీదు. దాన్ని జరక్కుండా ఎలా ఆపాలో తెలీదు. ఆపకపోతే ఏం అనర్థం జరుగుతుందో అంచనాకు అందదు. సూపర్‌మ్యాన్ పాత్ర విషయంలో అదే పరిస్థితి! ఆ పాత్ర వేసిన నటులను ఏదో శాపం వెంటాడుతోంది. వారి జీవితాలను ఊహించని మలుపు తిప్పుతోంది. అలా ఎందుకు జరుగుతోంది? సూపర్‌మ్యాన్ పాత్రలు చాలామంది చేశారు. సూపర్‌మ్యాన్ చిత్రాలకు చాలామంది పని చేశారు. వారిలో చాలామంది జీవితాలు ఊహించని మలుపులు తిరిగాయి. కొందరు వ్యాధుల బారిన పడ్డారు. ప్రమాదాలకు గురయ్యారు. ప్రాణాలనూ కోల్పోయారు. అయితే ఎలాంటి ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా జీవించినవారు, జీవిస్తున్నవారూ ఉన్నారు. మరి సూపర్‌మ్యాన్ శాపం ఉన్నట్టా? లేనట్టా? మే 27, 1995. ఆ రోజు అమెరికా అంతా తీవ్రమైన షాక్‌కి గురయ్యింది. ఎవరూ ఊహించని ఓ దుర్వార్త అందరినీ కలచి వేసింది. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, సామాజికవాది అయిన క్రిస్టఫర్ రీవ్ పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. అత్యంత వేగంగా గుర్రపు స్వారీ చేస్తూ పట్టు తప్పి పడిపోయాడు. మెడ ఎముక, వెన్నెముక, ఇంకా అక్కడక్కడా కొన్ని ఎముకలు విరిగిపోయాయి. తలకి తీవ్రమైన గాయాలు అయ్యాయి. స్పృహ తప్పిపోయిన అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాణం దక్కింది. కానీ శరీరం పట్టు కోల్పోయింది. దాంతో రీవ్ చక్రాల కుర్చీకి పరిమితమవ్వాల్సిందే అని వైద్యులు తేల్చేశారు. సూపర్‌మ్యాన్ పాత్రలతో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన అతగాడికి... ఓ మామూలు వ్యక్తిగా కూడా జీవితాన్ని సాగించలేని దీన స్థితి ఏర్పడింది. ‘‘అయ్యో... ఎంత దారుణం జరిగిందిరా... పాపం రీవ్’’... నిట్టూర్పు విడిచాడు జాన్ టీవీ చూస్తూ. అతడు రీవ్కి వీరాభిమాని. పక్కనే కూర్చుని ఉన్న అతడి స్నేహితుడు నిక్సన్ భారంగా తలూపాడు. ‘‘సూపర్‌మ్యాన్ పాత్రలు చేసేవాళ్లకి ఆ గతి పట్టడంలో వింతేముంది?’’ అన్నాడు జాలిగా. చప్పున చూశాడు జాన్. ‘‘అదేంటి అలా అన్నావ్? ఆ పాత్రకీ యాక్సిడెంటుకీ సంబంధం ఏంటి?’’ అన్నాడు జాన్ ఆశ్చర్యంగా. ‘‘అదేంటంత ఆశ్చర్యపోతున్నావ్. సూపర్‌మ్యాన్ శాపం గురించి నీకు తెలియదా? ఆ పాత్ర చేయడమంటే ప్రాణాలతో ఆడుకోవడమే. ఇప్పటికే చాలామంది ఆ శాపానికి బలయ్యారు. ఇప్పుడు రీవ్ కూడా...’’ నిక్సన్ మాటలకు నిశ్చేష్టుడయ్యాడు జాన్. సూపర్‌మ్యాన్ శాపమా? ఆ పాత్ర చేస్తే ప్రాణాలకు ప్రమాదమా? ఇదంతా నిజమా లేక మూఢ నమ్మకమా? ఒక్క క్షణంలో వెయ్యి సందేహాలు తలెత్తాయతడికి. సూపర్‌మ్యాన్ శాపం గురించి చాలామందికి తెలుసు. కానీ అందులో ఎంత వాస్తవం ఉంది అన్నది మాత్రం ఎవరికీ కచ్చితంగా తెలియదు. కానీ జరిగిన సంఘటనలన్నీ పరిశీలిస్తే... దాన్ని వాస్తవం అని నమ్మడానికే ఎక్కువ అవకాశాలున్నాయనిపిస్తుంది. టెలివిజన్‌లో సూపర్‌మ్యాన్‌గా 1940 ప్రాంతంలో అదరగొట్టినవాడు కిర్క్ అలిన్. అతడు ఆ పాత్రని ఎంతగా పండించాడంటే... ఆ తర్వాత అతడు మామూలు రోల్స్ చేస్తే చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడలేదు. ఓసారి విలన్ పాత్ర వేస్తే అందరూ మండిపడ్డారు. సూపర్‌మ్యాన్ ఏంటి, అలాంటి రోల్ చేయడమేంటి అంటూ వ్యతిరేకతను తెలియజేశారు. దాంతో అతడి కెరీర్ డల్ అయిపోయింది. అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత అతడు అల్జైమర్స్ వ్యాధి బారినపడ్డాడు. నాటి నుంచి చనిపోయేవరకూ నరకం చూశాడు. అయితే అతడు మరణించేలోపే మరికొందరు సూపర్‌మ్యాన్ పాత్రధారుల జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. 1951లో వచ్చిన ‘సూపర్‌మ్యాన్ అండ్ ద మోల్ మెన్’ చిత్రంలో సూపర్‌మ్యాన్‌గా నటించాడు జార్జ్ రీవ్స్. ఆ సినిమా అతణ్ని చాలా పాపులర్ చేసింది. కెరీర్ ఊపందుకుంది. అయితే అంతలోనే ఊహించని దారుణం జరిగింది. ఇంకొద్ది రోజుల్లో రీవ్స పెళ్లి జరుగుతుందనగా... తన గదిలో విగతజీవిగా కనిపించాడు రీవ్స్. తుపాకీ గుండు అతడి ప్రాణాలను తీసిందని తెలిసింది. అయితే ఆ బుల్లెట్‌ను పేల్చింది ఎవరన్నది తెలియకపోవడంతో ఆత్మహత్యగా నమోదు చేశారు. కానీ విచిత్రం ఏమిటంటే... తుపాకీ మీద అతడి వేలిముద్రలు కూడా దొరకలేదు. మరి ఆత్మహత్య అని ఎలా నిర్ధారించారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. ఆ తరువాత బడ్ కాల్యర్, లీ క్విగ్లీల మరణాలతో సూపర్‌మ్యాన్ కథ మలుపు తిరిగింది. బడ్ కాల్యర్ కార్టూన్ షోలలో సూపర్‌మ్యాన్ పాత్రకి డబ్బింగ్ చెప్పాడు. బాగా పేరు వచ్చింది. సూపర్‌మ్యాన్ టీవీ షోలకి అతడు మాత్రమే డబ్బింగ్ చెప్పాలి అని దర్శకులంతా కోరుకునేంతగా సక్సెస్ అయ్యాడు. అయితే అంతుపట్లని అనా రోగ్యం అతణ్ని వేధించింది. రక్తప్రసరణలో సమస్యలు తలెత్తడంతో తన అరవయ్యవ యేట కన్ను మూశాడు. ఆ తరువాత లీ క్విగ్లీ వంతు. ఓ సినిమాలో బాల సూపర్‌మ్యాన్‌గా నటించాడు లీ. కొన్నేళ్ల తరువాత ఏదో అనారోగ్యానికి వేసుకున్న మందులు రియాక్షన్ ఇవ్వడంతో చనిపో యాడు. అప్పుడతడికి పద్నాలుగేళ్లు. ఈ సంఘటనలతో అందరిలోనూ అనుమానం రేకెత్తింది. సూపర్‌మ్యాన్ పాత్రతో సంబంధం ఉన్నవారందరినీ ఏదో శాపం వెంటాడుతోందని, అందుకే అందరూ ప్రాణాలు కోల్పోతున్నారనీ అనుకోవడం మొదలైంది. ఆ అనుమానం బలపడటానికి క్రిస్టఫర్ రీవ్స్ ఉదంతం దోహదపడింది. సూపర్‌మ్యాన్ పాత్రకి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు రీవ్. సూపర్‌మ్యాన్-ద మూవీ, సూపర్‌మ్యాన్ 2, సూపర్‌మ్యాన్ 3, సూపర్‌మ్యాన్ 4-ద క్వెస్ట్ ఫర్ పీస్ చిత్రాలతో ప్రభంజనం సృష్టించాడతడు. అలాంటివాడు గుర్రం మీద నుంచి పడి, ఎముకలు విరిగిపోయి, శరీరం చచ్చుబడిపోయి, చక్రాల కుర్చీకే పరిమితమైపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు జనం. కచ్చితంగా సూపర్‌మ్యాన్ పాత్ర శాపగ్రస్తమైనదని, అందుకే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని నిర్ధారించేసుకున్నారు. 2004, అక్టోబర్‌లో రీవ్ హార్ట్ ఫెయిలై మరణించాడు. వీళ్లు మాత్రమే కాదు. సూపర్‌మ్యాన్ చిత్రాలు, సీరియల్స్‌తో సంబంధం ఉన్న చాలామంది జీవితాల్లో ఊహించని సంఘటనలు జరిగాయి. సూపర్‌మ్యాన్ చిత్రంలో క్రిస్టఫర్ రీవ్తో కలిసి నటించిన మార్లన్ బ్రాండో... రీవ్ మరణించడానికి సరిగ్గా నాలుగు నెలల ముందు చనిపోయాడు. అతడు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. బ్రాండో కొడుకు క్రిస్టియన్, తన చెల్లెలు షెయేన్ బాయ్‌ఫ్రెండ్‌ని కాల్చి చంపాడు. దాంతో అతడికి యావజ్జీవిత ఖైదు విధించారు. ఆ బాధతో షెయేన్ ఆత్మహత్య చేసుకుంది. ఇది బ్రాండోని కుంగదీసింది. ఆ బాధతోనే చనిపోయాడు. క్రిస్టఫర్ రీవ్ సరసన ఒక చిత్రంలో నటించిన మార్గట్ కిడ్డర్ ఓరోజు సడెన్‌గా కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తరువాత మతి చలించిన స్థితిలో ఉన్న ఆమెని పోలీసులు పట్టుకుని, ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె బై పోలార్ డిజార్డర్‌తో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించారు. అయితే తర్వాత మెల్లగా తేరుకుందామె. సూపర్‌మ్యాన్ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులర్ అయిన రిచర్డ్ ప్రయర్ డ్రగ్స్‌కి బానిసయ్యాడు. ఆత్మహత్యకు ప్రయత్నించి విఫలమయ్యాడు. మానసిక వ్యాధి బారిన పడ్డాడు. చివరికి హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. సూపర్‌మ్యాన్ పాత్రను సృష్టించిన జెర్రీ సీగల్, అతడికి సహకరించిన జో షస్టర్లు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా చితికిపోయారు. దివాళా తీసి, బతకడం కోసం చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేయాల్సి వచ్చింది వారికి. జో అయితే అనారోగ్యంతో కంటిచూపును కూడా పోగొట్టుకున్నాడు. డీన్ కెయిన్, బ్రాండన్ రూత్, బాబ్ హాలీడే లాంటి వాళ్లయితే, సూపర్‌మ్యాన్ చిత్రాల్లో నటించాక తమ కెరీర్ నాశనమైపోయిందని అంటూ ఉంటారు. ఇవన్నీ చూసిన తరువాత సూపర్‌మ్యాన్ శాపం కచ్చితంగా ఉంది అని నమ్మేవాళ్ల సంఖ్య పెరిగింది. ఇన్ని సినిమాల్లో ఇంతమంది నటిస్తున్నారు, ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు, కేవలం సూపర్‌మ్యాన్ సినిమాల్లో నటించినవాళ్లకు మాత్రమే ఎందుకిలా జరుగుతోంది అంటూ వాళ్లు ప్రశ్నిస్తారు. అయితే దీన్ని కొట్టి పారేసేవాళ్లు కూడా బోలెడంత మంది ఉన్నారు. కిర్క్ అలిన్, బడ్ కాల్యర్ లాంటివాళ్లు వ్యాధుల బారిన పడినా, వయసు మీద పడిన తరువాతే చనిపో యారు, అప్పుడది శాపమెలా అవుతుంది అనేది కొందరి వాదన. చివరికి బైపోలార్ డిజార్డర్ బారినపడి, కొన్నాళ్లు కనిపించకుండా పోయిన మార్గట్ కూడా శాపం గీపం ఏదీ లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘అంతా ట్రాష్... ఓసారి నా కారుకు యాక్సిడెంట్ అయ్యి మూడు పల్టీలు కొట్టింది. అయినా నాకేమీ కాలేదు. శాపమనేదే ఉంటే నేను అప్పుడే చనిపోవాలి కదా, మతి చలించిన నేను మళ్లీ ఎలా కోలుకుంటాను’’ అందామె. కొందరు కాదంటారు. కొందరు అవునంటారు. ఎవరి మాట నమ్మాలి? ఈ శాపం నిజం కాదా? సూపర్‌మ్యాన్ పాత్ర వల్ల వచ్చిన ప్రమాదమేమీ లేదా? అది ఒక మూఢ నమ్మకమేనా? శాపమనేదే లేకపోతే ఇంతమంది జీవితాల్లో ఇన్ని అనర్థాలు ఎలా సంభవించాయి? శాపమే ఉండివుంటే... అందరికీ ప్రమాదాలు జరక్కుండా కొందరికే ఎందుకు జరిగాయి? ఏమో మరి... నిజాలు దేవుడికెరుక! - సమీర నేలపూడి -
నిజాలు దేవుడికెరుక: ముక్కలైంది దేహమా ? హృదయమా ?
ఇరవయ్యేళ్లు రాకుండానే మోడలింగ్ ప్రపంచాన్ని ఏలింది. ఇరవయ్యేళ్లు నిండకుండానే ప్రపంచాన్ని వదిలిపోయింది. ఇంకా ఎంతో ఎత్తుకు ఎదుగుతుందనుకున్న ఆమె... ఎత్తయిన భవనం మీద నుంచి పడి మరణించింది. అసలేం జరిగింది? ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా హత్య చేశారా? అమెరికాలో సంచలనం సృష్టించిన ప్రముఖ మోడల్ రుస్లానా మరణోదంతం... ఈవారం ‘నిజాలు దేవుడికెరుక’లో! జూన్ 28, 2008. మధ్యాహ్నం రెండున్నర కావస్తోంది. మన్‌హట్టన్ (అమెరికా)లోని 130 వాటర్స్ట్రీట్ రద్దీగా, వాహనాల రాకపోకలతో రొదగా ఉంది. ఎవరి పనుల మీద వాళ్లు హడావుడిగా తిరుగుతున్నారు. కార్లు వరుసకట్టి వస్తూ పోతూనే ఉన్నాయి. అంతలో... ఉన్నట్టుండి ఏదో బరువైన వస్తువు నేలమీద దబ్బున పడిన చప్పుడు. ఆ వెంటనే ఓ పెద్ద గావు కేక. అంత రొదలోనూ ఆ కేక అందరికీ స్పష్టంగా వినిపించింది. వేగంగా వెళ్లిపోతున్న కార్లకు సడెన్ బ్రేకులు పడ్డాయి. వడివడిగా సాగుతోన్న పాదాలు ఠక్కున ఆగిపోయాయి. అందరూ ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందా అని చూశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కక్షణం కొయ్యబారిపోయారు. పన్నెండంతస్తులు ఉన్న ఒక అపార్ట్మెంట్ ఆవరణలో... రక్తపు మడుగులో పడివుంది ఓ అమ్మాయి. బాగా ఎత్తునుంచి పడిందని ఆమె శరీరం ఉన్న స్థితిని బట్టి అర్థమవుతోంది. ఎముకలు విరిగిపోయాయి. తల పగిలి రక్తం ధారగా రోడ్డు మీద పరుచుకుంటోంది. అందరూ ఆ అమ్మాయి వద్దకు పరుగులు తీశారు. కానీ ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేకపోయింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. క్షణాల్లో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కానీ అప్పటికే ఆమె ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ‘‘మైగాడ్... ఈమె రుస్లానా కదూ’’ అన్నాడు ఇన్స్పెక్టర్ ఆమెను చూస్తూనే. అప్పుడుగానీ ఎవరూ ఆమెని పరిశీలనగా చూడలేదు. చూసిన తర్వాత ఎవరికీ నోటమాట రాలేదు. ‘‘రుస్లానా చనిపోయిందా’’ అంటూ షాకయిపోయారు. పోలీసులు రుస్లానా దేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించారు. ‘‘ప్రముఖ మోడల్ రుస్లానా చనిపోయింది. బహుశా సూసైడ్ కావచ్చు’’ అంటూ వార్త విడుదల చేశారు. రుస్లానా కొర్షునోవా... ఈ పేరుని ఎందరో యువకులు మంత్రంలా జపించారు. ఆమె రూపాన్ని మనసుల్లో నిలుపుకుని ఆరాధించారు. రష్యాలో పుట్టిన ఆ సౌందర్యం... అతి చిన్న వయసులోనే మోడలింగ్ ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంది. వోగ్ లాంటి ప్రముఖ పత్రికలన్నీ ఆమె చిత్రాన్ని కవర్ మీద ముద్రించేందుకు పోటీపడ్డాయి. కజకిస్తాన్ సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు అక్కడ పుట్టింది రుస్లానా. ఐదేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి, అన్నల సంరక్షణలో పెరిగింది. మహా తెలివైంది. రష్యన్, కజక్, ఇంగ్లిష్, జర్మన్ భాషలు అనర్గళంగా మాట్లాడేది. పదిహేనేళ్ల వయసులో రుస్లానాని చూసిన ఓ పత్రికవారు ఆమె ఫొటోని ప్రచురించారు. అంతే... ఆ ఒక్క ఫొటో ఆమె జీవితాన్ని మార్చేసింది. ప్రముఖ మోడలింగ్ ఏజె న్సీలు ఆమె ఇంటి తలుపు తట్టాయి. ఏడాది తిరిగేసరికి పెద్ద పెద్ద కంపెనీలకు మోడల్‌గా పనిచేసే స్థాయికి ఎదిగింది. పలు దేశాలు పర్యటించింది. చివరికి అమెరికాలో సెటిలయ్యింది. కన్నుమూసి తెరిచేలోగా ఇంత సాధించిన రుస్లానా... అర్ధంతరంగా కన్నుమూయడం అందరికీ పెద్ద షాక్! వర్ణించలేనంత అందం. ఇరవై నిండని లేత వయసు. బోలెడంత భవిష్యత్తు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? ఇంత చిన్న వయసులో బలంతంగా ప్రాణాలు తీసుకుందా? అందరిలోనూ ఇదే ఆలోచన... ఆవేదన. ‘‘ఇది ఆత్మహత్యేనంటారా సార్’’ సబార్డినేట్ అడిగిన ప్రశ్నకు చురుక్కున చూశాడు ఇన్స్పెక్టర్. ‘‘ఆ అనుమానం ఎందుకొచ్చింది?’’ అన్నాడు. ‘‘ఏం లేదు సార్. ఆ అమ్మాయి ఫేమస్ మోడల్ కదా? ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం తనకేముంటుంది?’’ తన సందేహాన్ని బయటపెట్టాడు. ‘‘మొదట నేనూ అలానే ఆలోచించాను. కానీ ఆమెది హత్య అనడానికి ఎలాంటి ఆధారాలూ లభించలేదు. సూసైడేనేమో అనిపిస్తోంది.’’ ‘‘అలాగైతే సూసైడ్ నోట్ పెట్టేది కద సార్’’ సమాధానం చెప్పలేదు ఇన్స్పెక్టర్. సూసైడ్ నోట్ కోసం చాలా వెతికారు. అలాంటిదేమీ దొరకలేదు. ఎవరికీ చెప్పకుండా, ఏ కారణం లేకుండా ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది? అంత అవసరం ఏమొచ్చింది? ఇలా ఆలోచిస్తుండగానే ఇన్స్పెక్టర్ మనసులో ఫ్లాష్‌లా మెదిలింది ఓ ఆలోచన. ‘‘రుస్లానాకి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉండాలి కదూ?’’ అన్నాడు సాలోచనగా. ‘‘అవున్సార్... మార్క్ కమిన్స్కీ. కొద్ది నెలల కిత్రమే బ్రేకప్ అయ్యారు. అంతకుముందు ఆటెమ్ పెర్షనాక్ అనే అతణ్ని ప్రేమించింది. అతడి నుంచి విడిపోయిన తరువాత మార్క్‌కి దగ్గరయ్యింది.’’ ‘‘ఇంకెందుకు లేటు... తీసుకురా ఇద్దరినీ’’ అంటూ ఫైల్లో తల దూర్చాడు ఇన్స్పెక్టర్. ‘‘చెప్పండి. రుస్లానా ఎందుకు చనిపోయింది?’’ ఇన్స్పెక్టర్ ప్రశ్నకి ముఖముఖాలు చూసుకున్నారు మార్క్, ఆర్టెమ్లు. ‘‘మాకేం తెలుసు సార్’’ అన్నారు ముక్త కంఠంతో. ‘‘మరెవరికి తెలుస్తుంది?’’... ఇన్స్పెక్టర్ గొంతు ఖంగుమంది. ‘‘ఐడియా లేదు సార్. నాకయితే తెలీదు’’ అన్నాడు ఆర్టెమ్. ‘‘అంటే నాకు తెలుసనా?’’ కంగారుపడ్డాడు మార్క్. ‘‘ఎవరికి తెలుసు, ఎవరికి తెలీదు అని మీలో మీరు వాదించుకోనక్కర్లేదు. అది మేం తేలుస్తాం’’... కాస్త కరుగ్గా అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘తనూ నేనూ విడిపోయి చాలా కాలమయ్యింది సర్. తన మరణవార్త విని షాకయ్యాను. మా ఇద్దరికీ సరిపడలేదన్నమాటే గానీ తను చాలా మంచి అమ్మాయి. ఇలా అవుతుందని అనుకోలేదు’’... ఆర్టెమ్ గొంతులో బాధ కారణంగా జీర వచ్చింది. అతడు చెప్పేది నిజమేనని అది నిర్ధారించింది. నీ సంగతేంటి అన్నట్టు చూశాడు ఇన్స్పెక్టర్ మార్క్ వైపు. ‘‘తను చాలా ఎమోషనల్ సర్. ప్రతి చిన్నదానికీ ఫీలవుతుంది. నేనేమో హుషారుగా ఉండే టైపు. దాంతో ఇద్దరికీ స్పర్థలు వచ్చాయి. విడిపోయాం.’’ సబార్డినేట్ వైపు చూసి పెదవి విరిచాడు ఇన్స్పెక్టర్. వాళ్లిద్దరికీ సంబంధం ఉంటుందని అతడు కూడా అనుకోలేదు. కానీ ఏదైనా ఉంటే బయటపడుతుంది కదా అని ఓ రాయి వేశాడంతే. చేసేదేమీ లేక వాళ్లని పంపేశాడు. అయితే, మార్క్ తనని వదిలేయడాన్ని తట్టుకోలేకే మరణించింది కాబట్టి ఆమె చావుకు మార్కే బాధ్యుడని కొందరు వాదించారు. అందుక్కారణం... రుస్లానా బ్లాగ్‌లో కన్పించిన వ్యాఖ్యలు. ‘‘ఒంటరినైపోయాను. హృదయం ముక్కలైతే ఇంత బాధా? దీన్నుంచి బయటపడాలని ఉంది. కానీ నావల్ల కావడం లేదు. నన్నెందుకు వదిలేశాడో అడగాలనుంది. కానీ ఫలితం ఉండదు’’... ఇలా ఎన్నో రాసింది రుస్లానా. కానీ ఎక్కడా మార్క్ పేరు రాయలేదు. అందుకే ప్రేమ విఫలమైన బాధతో ప్రాణాలు తీసుకుందంటూ కేసు క్లోజ్ చేశారు. రుస్లానాకి ఎత్తయిన ప్రదేశాలంటే భయమని, తొమ్మిదో అంతస్తునుంచి దూకే ధైర్యం ఆమె చేయలేదని స్నేహితులు అన్నారు. కొండ ప్రదేశాల్లో షూటింగ్ చేసేటప్పుడు ఆమె ఎంత టెన్షన్ పడేదో కొలీగ్స వివరించారు. కానీ ఆధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే చట్టం, వారి మాటలను విన్పించుకోలేదు. రుస్లానా మరణం గురించి మరో ఆలోచన చేయలేదు. కేసును మళ్లీ తెరవనూ లేదు. అందుకే రుస్లానా మరణం, చరిత్రలో ఆత్మహత్యగానే మిగిలిపోయింది. రుస్లానాని కొందరు సెక్స్ రాకెట్లో ఇరికించాలని చూశారని, ఆమె కాదనడంతో చాలా వేధించారని, వాళ్లే ఆమెను చంపి ఉండొచ్చని రుస్లానా ఫ్రెండ్ ఒకామె చెప్పింది. కానీ సాక్ష్యాలు దొరకలేదు. మార్కతో విడిపోయాక మనోవేదనతో ఆమె ఓ మెడికల్ సెంటర్లో కౌన్సెలింగ్ క్లాసులు తీసుకుందని తెలిసింది. దాంతో మానసిక వ్యథే ఆత్మహత్యకు పురికొల్పిందన్నారు పోలీసులు. - సమీర నేలపూడి -
నిజాలు దేవుడికెరుక: మహా సాగరంలో మృత్యుఘోష
బ్రిటిష్ కొలంబియా 1933. పషేనా బీచ్‌లోని లైట్‌హౌస్ వెలుతురులో కూర్చుని ఉన్నారు ఇద్దరు స్నేహితులు. రోజంతా చేపల వేటతో అలసిపోయిన వారికి... ఆ వెన్నెల్లో, చల్లగాలిలో కూర్చుని కబుర్లాడుకోవడం హాయినిస్తోంది. ‘‘ఇవాళ మన అదృష్టం పండిందిరా. ఈమధ్య కాలంలో ఇన్ని చేపలు ఎప్పుడూ పడలేదు’’ అన్నాడో వ్యక్తి ఆనందంగా. ‘‘మన సంగతి సరేరా... వాడెవడు ఇప్పటివరకూ వేటాడి ఇప్పుడొస్తున్నాడు?’’ అన్నాడు రెండో వ్యక్తి సముద్రంవైపు చూస్తూ. అతడు చూపించినవైపు చూశాడు మొదటి వ్యక్తి. ఓ పడవ అలలపై తేలుతూ మెల్లగా వచ్చి ఒడ్డున ఆగింది. ఇద్దరూ లేచి అటు నడిచారు. అయితే పడవలో మనుషులెవరూ లేకపోవడంతో ముఖముఖాలు చూసుకున్నారు. ‘‘ఎవరూ లేరేంట్రా?’’ ‘‘ఏమో... కొంపదీసి ఎవరైనా సముద్రంలో పడిపోయి ఉంటారంటావా? లేకపోతే పడవలో పడుకున్నాడా?’’ అంటూ పడవ అడుగు భాగంవైపు చూశాడు రెండో వ్యక్తి. అంతే... అతడి గుండె గుభేల్మంది. వామ్మో అంటూ రెండడుగులు వెనక్కి వేశాడు. ‘‘ఏమైంది’’ అంటూ పడవలోకి చూసిన స్నేహితుడి కళ్లు భయంతో వెడల్పయ్యాయి. ఇద్దరూ వెంటనే పోలీస్ స్టేషన్‌కి పరుగెత్తారు. ‘‘మైగాడ్... ఇది వ్యాలెన్సియాకి సంబంధించిన లైఫ్‌బోట్ కదూ...?’’... దాని మీద ఉన్న లోగోని చూస్తూనే అన్నాడు ఇన్స్పెక్టర్. ఆ మాట వింటూనే అందరూ షాకైపోయారు. ‘‘నిజమా?’’ అన్నారు ముక్తకంఠంతో. అవునన్నట్టుగా తలాడించి పడవలోకి చూశాడు ఇన్స్పెక్టర్. నాలుగు అస్థిపంజరాలు వెన్నెల్లో తెల్లగా మెరుస్తున్నాయి. ‘‘వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించమంటారా?’’... అడిగాడు సబార్డినేట్. ‘‘ఏం చేసుకోవడానికి... ఏం తెలుసుకోవడానికి? ఎప్పుడో ఇరవై ఏడేళ్ల క్రితం తప్పిపోయిన పడవ ఇది. ఇన్నాళ్ల తర్వాత ఇక్కడికెలా వచ్చింది? అయినా ఇన్నేళ్ల పాటు దాని పెయింట్గానీ, లోగో కానీ పోలేదు. ఇదెలా సాధ్యం? ఈ అస్థిపంజరాలు అప్పుడు చనిపోయినవారివేనా లేక...’’ వరుసగా ఆలోచనలు చొరబడుతూనే ఉన్నాయి ఇన్స్పెక్టర్ బుర్రలోకి. వాటన్నిటినీ ముడివేసే ప్రయత్నంలో అతడు ఇరవై ఏడేళ్లు వెనక్కి వెళ్లాడు. జనవరి 20, 1906... శాన్ ఫ్రాన్సిస్కో ఓడరేవు. సాయంత్రం కావస్తోంది. వెనిజులా వెళ్లాల్సిన ఎస్.ఎస్. వ్యాలెన్సియా సిద్ధంగా ఉంది. 108 మంది ప్రయాణీకులు, 65 మంది సిబ్బందితో కిటకిటలాడుతోంది. ప్రయాణీకులంతా సామాన్లు చక్కబెట్టుకోవడంలో మునిగిపోయారు. పిల్లలంతా డెక్ మీదికి చేరి సముద్రం వైపు చూస్తూ కేరింతలు కొడుతున్నారు. లంగరు పడింది. ఓడ కదిలింది. అలలపై ఊగుతూ, అలవోకగా ప్రయాణం ప్రారంభించింది వ్యాలెన్సియా. కాసేపటికి కారుచీకట్లు కమ్ముకున్నాయి. సముద్రం మీద నుంచి చల్లనిగాలి రివ్వున దూసుకొస్తుంటే... తలుపులు, కిటికీలు మూసేసి, బ్లాంకెట్లలో శరీరాల్ని దూర్చేశారంతా. సమయం పది గంటలు అయ్యేసరికి అందరూ నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి కావస్తోంది. ఓడంతా నిశ్శబ్దం. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. అంతలో... ఒక్కసారిగా పెద్ద కుదుపు. ఉలిక్కిపడి కళ్లు తెరిచారంతా. గబగబా గదుల్లోంచి బయటకు వచ్చారు. ఏమయ్యిందంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఎవరి దగ్గరా సమాధానం లేదు. మనసు ఏదో కీడు శంకించింది. ఒకరిద్దరు కెప్టెన్ దగ్గరకు వెళ్లారు. ‘‘కెప్టెన్... ఏంటా కుదుపు? ఏమయ్యింది?’’ కంగారుగా అడిగారు. ‘‘వియ్ ఆర్ ఇన్ డేంజర్. ఓడ మునిగిపోబోతోంది’’ కెప్టెన్ మాట వింటూనే ‘‘నో’’ అంటూ అరిచారు వాళ్లు. ఆ అరుపు విని అందరూ అక్కడకు చేరుకున్నారు. ‘‘ఎదురుగా మరో ఓడ వస్తోంది. దాన్ని తప్పించే ప్రయత్నంలో మన ఓడ రాళ్లను ఢీకొట్టింది.’’ అందరి కళ్లలో భయం. ముఖాల్లో అందోళన. ‘‘ఆలస్యం చేయవద్దు. లైఫ్ బోట్లు తీయండి. లేదంటే అందరం మునిగిపోతాం’’... అరిచినట్టే అన్నాడు కెప్టెన్. వెంటనే సిబ్బంది అలెర్ట్ అయ్యి లైఫ్ బోట్లు తీయసాగారు. అయితే దురదృష్టం ఆ ఓడలో పాగా వేసుకుని కూచుంది. పడవలను నీటిలోకి దించుతుండగా ఒకటి విరిగిపోయింది. రెండు జారి నీటిలో బోల్తాపడి క్షణాల్లో మునిగిపోయాయి. అందరూ వణికిపోయారు. సిబ్బంది మాత్రం మనోనిబ్బరంతో పని చేస్తున్నారు. ఓ రెండు బోట్లను జాగ్రత్తగా దించి, వాటిలోకి పట్టినంతమందిని ఎక్కించారు. ఓడను విడిచి అవి దూరంగా జరిగాయి. కాసింత దూరం వెళ్లాయో లేదో... పెద్ద అల ఒకటి వచ్చి ఆ పడవలను తాకింది. అంతే... రెండూ తిరగబడిపోయాయి. వాటిలోని ప్రయాణికులంతా మునిగిపోయారు. దాన్ని చూసి మిగతావారంతా బిక్కచచ్చిపోయారు. విధి తమమీద పగబట్టినట్టుగా అనిపిస్తోంది. సముద్రపు అలలు రక్కసి కోరలై తమను కాటేసేందుకు కాచుకుని కూర్చున్నట్టుగా ఉంది. మృత్యువు చెవి దగ్గర చేరి రమ్మని పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. కొందరు కాపాడమంటూ దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు. ఈదుకుని వెళ్లి అయినా ప్రాణాలు కాపాడుకుందామనే ఆశతో కొందరు నీటిలో దూకేస్తున్నారు. కానీ అది అత్యాశ అని వాళ్లకి దూకాకగానీ తెలియలేదు. నీళ్లు మంచు అంత చల్లగా ఉన్నాయి. ఆ చల్లదనం నరాల్ని కాల్చేస్తోంటే ఒళ్లంతా బాధతో భగ్గుమంటోంది. వారి శరీరాలు ఎంతోసేపు ఆ బాధను తాళలేకపోయాయి. బతుకుతామన్న నమ్మకంతో పాటు బతకాలన్న ఆశ కూడా చచ్చిపోయింది. కొద్ది నిమిషాల్లో వాళ్ల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఇక మిగిలింది నాలుగు లైఫ్ బోట్లు. వాటిలో మరికొందరిని ఎక్కించి వదిలారు సిబ్బంది. అవి రెండూ మెల్లగా దరి దారి పట్టాయి. మిగతా వారిని ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగానే ఓ పెద్ద శబ్దం. అదేంటా అని అందరూ చూస్తూండగానే... ఫెళఫెళమంటూ ఓడ ముక్కలైపోయింది. క్షణం పాటు పిల్లల కేకలు, పెద్దల ఆర్తనాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. మరుక్షణంలో ఆ శబ్దాలు సముద్రఘోషలో కలిసిపోయాయి. వారి శరీరాలు సాగరజలంలో సమాధి అయ్యాయి. పాతికేళ్లపాటు పసిఫిక్ సముద్రంలో మహారాణిలా హుందాగా తిరిగిన వ్యాలెన్సియా కథ అలా ముగిసింది. మహాసముద్రాన్ని శ్మశానవాటికగా మార్చి మరీ అది తన పేరు చరిత్రలో శాశ్వతంగా లిఖించుకుంది. అయితే ఆ రోజు ఆ నాలుగు లైఫ్ బోట్లలో రెండు మాత్రమే ఒడ్డుకు చేరాయి. ముప్ఫై ఏడుమందిని మాత్రమే సజీవంగా ప్రపంచం ముందు నిలిపాయి. మిగతా రెండు బోట్లూ అదృశ్యమయ్యాయి. వాటిలో ఒకటి కొన్ని వారాల తరువాత ఓ గుహలో దొరికింది. అందులో కొన్ని అస్థిపంజరాలు ఉన్నాయి. పడవ గుహలో ఇరుక్కుపోయి ఉంటుందని, ఊపిరాడక అందరూ చనిపోయి ఉంటారని అంచనా వేశారు. అయితే రెండో పడవ జాడ మాత్రం తెలియలేదు. అది ఇన్నేళ్ల తరువాత... ఇలా కనిపిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు! అప్పట్లో వ్యాలెన్సియా ఘటన యావత్ ప్రపంచాన్నీ వణికించింది. ఎందరి మనసులనో కదిలించింది. అందరూ దాన్ని ఘోర దుర్ఘటన అన్నారు. కానీ ప్రమాదం నుంచి తప్పించుకున్న కొందరు మాత్రం... దాన్ని ఓ హారర్ స్టోరీ అన్నారు. అలా అనడానికి కారణం ఉంది. ఓడ ప్రమాదానికి గురయ్యే ముందు మరో షిప్ ఎదురుగా వచ్చిందని, దాన్ని తప్పించే ప్రమాదంలో రాయిని ఢీకొందని చెప్పాడు కెప్టెన్. కానీ అసలలాంటిదేమీ జరగలేదు. ఆ రూట్లో మరో ఓడగానీ, పడవగానీ రాలేదు. మరి ఆ ఓడ ఎక్కడిది? దానికితోడు ఓడను ముక్కలు చేసేంత పెద్ద రాళ్లు అక్కడ లేవు. మరి అంత దారుణంగా ఎలా ముక్కలు చెక్కలయ్యింది. ఇంజిన్‌లో లోపాలు లేవు. అసలు ప్రమాదం జరగడానికి మరే కారణమూ కన్పించలేదు. దాంతో బోలెడన్ని అనుమానాలు రేకెత్తాయి. బ్రిటిష్ కొలంబియాలోని పషేనా బీచ్‌కి దగ్గర్లోనే వ్యాలెన్సియా ప్రమాదానికి గురయ్యింది. అప్పట్నుంచీ అక్కడ విచిత్రమైన అరుపులు వినిపిస్తుంటాయని, ప్రమాదంలో మరణించిన వారు దెయ్యాలై అక్కడ సంచరిస్తున్నారని ఆ చుట్టుపక్కల వారు కొందరు అంటుంటారు. ‘గ్రేవ్యార్డ ఆఫ్ ద పసిఫిక్’గా చరిత్రలో నిలిచిపోయిన ఓడ: ఎస్.ఎస్. వ్యాలెన్సియా అక్కడేవో దుష్టశక్తులు ఉన్నాయని, అవే ఈ ప్రమాదానికి కారణమని, లైఫ్బోట్లను కూడా అవి కదలనివ్వలేదని, చివర్లో బయలుదేరిన నాలుగు పడవల్లో రెండింటిని అవే దారి మళ్లించాయని ప్రమాదం నుంచి తప్పించుకున్న కొందరు ప్రయాణికులు చెప్పడం విశేషం. అదంతా భ్రమ అని అధికారులు చెబుతున్నా వాళ్లు ఒప్పుకోలేదు. లేని ఓడ ఉన్నట్టు ఎలా కనిపించింది అని ఎదురు ప్రశ్నించారు. అది కచ్చితంగా దెయ్యాల పనే అన్నారు. ప్రమాదానికి అసలైన కారణాలు తెలియనందున అధికారులు కూడా మాట్లాడలేకపోయారు. దాంతో వ్యాలెన్సియా సంఘటన ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇంతకీ ఆ ఘోరకలికి కారణం ప్రమాదమా? మానవ తప్పిదమా? దుష్టశక్తుల నీడా? ఏమో... నిజాలు దేవుడికెరుక! - సమీర నేలపూడి -
నిజాలు దేవుడికెరుక: క్రైమ్ & మిస్టరీ
నిజం నిజంగా నిప్పులాంటిదే. అది బయటకు వస్తే కొన్ని జీవితాలను కాల్చేస్తుంది. అయితే... మెరిడీత్ కర్చర్ హత్యకు సంబంధించిన నిజాలు మాత్రం... బయటకు రాక కొన్ని జీవితాలను కాల్చేస్తున్నాయి. కొన్ని గుండెల్ని మండిస్తున్నాయి. కొందరి బతుకుల్ని ప్రశ్నార్థంగా మార్చేశాయి. అసలెవరీ మెరిడీత్ కర్చర్? ఆమెనెవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? ఇవన్నీ ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలే! నవంబర్ 2, 2007... పెరూజియా, ఇటలీ ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. చలికాలం కావడంతో ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. రోడ్ల మీద అక్కడక్కడా తెల్లని మంచుముద్దలు కనిపిస్తున్నాయి. ఎముకల్ని కొరికేసేలా చల్లటి గాలి రివ్వున వీస్తోంది. రోడ్డు పక్కన, విసిరేసినట్టుగా ఉన్న ఆ ఇంటిముందు ఓ యువతి, యువకుడు తచ్చాడుతున్నారు. వారి చూపులు పదే పదే రోడ్డువైపు ప్రసరిస్తున్నాయి. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. అటూ ఇటూ పచార్లు చేస్తూ, మధ్య మధ్యన ఆగి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఓ పది నిమిషాల తరువాత వాయువేగంతో వచ్చి ఆగింది పోలీసు జీపు. బిలబిలమంటూ ఐదారుగురు పోలీసులు దిగారు. వారిని చూస్తూనే ఈ ఇద్దరూ అలర్ట్ అయ్యారు. ‘‘ఎక్కడ?’’ అన్నాడు ఇన్స్పెక్టర్ మరో మాట లేకుండా. ‘‘లోపల’’ అందామె ఇంటివైపు చూపిస్తూ. పోలీసులు లోనికి పరుగుతీశారు. ఈ ఇద్దరూ వారిని అనుసరించారు. ఇంటిలోకి అడుగు పెట్టగానే వెగటు వాసన గుప్పుమంది. యేళ్ల అనుభవం ఉన్న పోలీసులకు అది రక్తపు వాసన అని కనిపెట్టడానికి పెద్ద సమయం పట్టలేదు. హాలంతా పరికించి చూశారు. ప్రధాన ద్వారానికి దగ్గరలో ఓ చోట తెల్లని గచ్చుమీద ఎర్రటి రక్తపు మరక కనిపించింది. దాన్ని చూస్తూనే నుదురు చిట్లించాడు ఇన్స్పెక్టర్. ఇల్లంతా పరిశీలించమన్నట్టుగా సబార్డినేట్స్‌కి సైగ చేశాడు. ఆ ఇంట్లో నాలుగు గదులున్నాయి. మూడు గదులను పరిశీలించారు పోలీసులు. అనుమానించాల్సినవేమీ కనిపించలేదు. అయితే నాలుగో గది మాత్రం తాళం వేసి ఉంది. దాని తలుపు మీద, గొళ్లెం మీద రక్తపు మరకలు ఉన్నాయి. అసలు రహస్యం అక్కడే దాగి ఉందని అర్థమైంది పోలీసులకు. వెంటనే తలుపులు బద్దలు కొట్టారు. లోపల... నేలమీద... ఆకుపచ్చ రంగు బొంతలో చుట్టివుంది ఓ అమ్మాయి శవం. బొంతను తొలగించి చూసిన పోలీసులు నివ్వెరపోయారు. ఒంటి మీద దుస్తులు లేవు. కత్తితో పలుమార్లు పొడవడంతో మెడ దాదాపు తెగిపోయింది. గాయాలతో ఒళ్లు ఛిద్రమైపోయింది. దేహం నుంచి రక్తం కారి కారి బొంతను తడిపేసింది. అందులో చోటు చాలక నేల మీదకు కూడా పాకింది. ఎంతో అనుభవమున్న పోలీసులు కూడా ముఖాలు తిప్పుకోకుండా ఉండలేకపోయారు ఆ దృశ్యం చూసి. యువతీ యవకులిద్దరూ భయంతో నోళ్లు తెరచుకుని కొయ్యబొమ్మల్లా చూస్తూండిపోయారు. అంతలో ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలు పరుగు పరుగున వచ్చారు. వారిలో ఒకమ్మాయి అక్కడి దృశ్యాన్ని చూస్తూనే కెవ్వున కేకపెట్టింది. రెండో అమ్మాయి ‘‘మెరిడీత్కి ఏమయ్యింది’’ అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. యువకులిద్దరూ వాళ్లను బయటకు తీసుకెళ్లారు. పోలీసులు శవాన్ని పోస్టుమార్టమ్‌కి పంపించి, ఆధారాలను సేకరించే పనిలో మునిగిపోయారు. అరగంట తర్వాత.... లోపల పని పూర్తి చేసి, బయట వరండాలో ఉన్నవారి దగ్గరకు వచ్చాడు ఇన్స్పెక్టర్. ‘‘చూస్తుంటే హత్య రాత్రే జరిగినట్టు తెలుస్తోంది. అంతకుముందు అత్యాచారం కూడా జరిగిందని మా అనుమానం. తను మీకేమవుతుంది?’’... అడిగాడు. కాస్త తేరుకున్న ఒకమ్మాయి స్పందించింది. ‘‘మేమిద్దరం తన రూమ్మేట్స్మి సార్. నిన్న సాయంత్రం మా బాయ్‌ఫ్రెండ్స్‌తో పాటు డేట్‌కి వెళ్లాం. ఈ రోజు సాయంత్రం రావాల్సి ఉంది. కానీ అమండా ఫోన్ చేసి ఇంట్లో రక్తం ఉందని చెప్పింది. మేం కంగారుపడి వెంటనే మెరిడీత్కి ఫోన్ చేశాం. తను లిఫ్ట్ చేయలేదు. దాంతో కంగారుపడి వచ్చేశాం. తీరా వచ్చాక ఇలా...’’ భోరుమంది ఆ అమ్మాయి. ‘‘నాకు ఫోన్ చేసింది కూడా అమండాయే. తనకీ మీకూ ఏంటి సంబంధం?’’ ‘‘తను కూడా మా రూమ్మేటే సార్. మేమిద్దరం, అమండా, మెరిడీత్ నాలుగు గదుల్లో ఉంటాం’’ అందా అమ్మాయి. అప్పుడు గమనించాడు ఇన్స్పెక్టర్... అమండా అక్కడ లేదని. ఆమెతో పాటు ఉన్న యువకుడు కూడా కనిపించలేదు. దాంతో చుట్టూ చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడతడు. దూరంగా ఓ చెట్టుకింద నిలబడి ఉన్నారు అమండా, ఆమె బాయ్‌ఫ్రెండ్ రఫెలై సొలేసిటో. నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో వారు చేస్తోన్న పని చూసి అతడి పోలీసు బుర్రలో రకరకాల సందేహాలు తలెత్తాయి. అవి ఈ కేసును ముందుకు నడిపిస్తాయని ఆ క్షణం అతడు కూడా అనుకోలేదు. ‘‘మెరిడీత్ కర్చర్ని ఎందుకు చంపారు?’’ అని ప్రశ్నిస్తే చాలా నిర్లక్ష్యంగా స్పందించింది అమండా. ‘‘అసలు రాత్రి నేను ఇంట్లోనే లేను. నైటంతా నా బాయ్‌ఫ్రెండ్ రూమ్‌లో గడిపాను. పొద్దున్న స్నానం చేద్దామని రూమ్‌కి వెళ్తే, తలుపు తీసేవుంది. అప్పుడే ఎవరో బయటకు వెళ్లి ఉంటారనుకున్నా. బాత్రూములోను, హాల్లోను రక్తం కనిపించింది. అడుగుదామంటే ఎవరూ లేరు. అందుకే వెళ్లి నా బాయ్‌ఫ్రెండ్‌తో విషయం చెప్పాను. ఇద్దరం కలిసి మా రూమ్మేట్స్కి ఫోన్ చేస్తే వెంటనే మీకు ఇన్ఫామ్ చేయమన్నారు, చేశాను. అంతకుమించి నాకేమీ తెలియదు’’ అని చెప్పింది. అమండా చెప్పిన ఈ ఒక్క సమాధానం వెయ్యి సందేహాలు రప్పించింది పోలీసులకి. రూమ్మేట్స్ ముందు రోజు పిక్నిక్కి వెళ్లిపోయారని తెలుసు. అయినా తలుపు తీసివుంటే అనుమానం రాలేదు. రూమ్‌లో ఉండాల్సిన మెరిడీత్ గదికి తాళం పెట్టివున్నా, ఇంట్లో రక్తం కనిపించినా సందేహం కలగలేదు. తీరిగ్గా వెళ్లి బాయ్‌ఫ్రెండ్‌కి చెప్పింది. రూమ్మేట్స్ చేయమంటే తప్ప పోలీసులకు ఫోన్ చేయాలన్న ఆలోచనే రాలేదు. మెరిడీత్ కర్చర్ చాలా మంచి అమ్మాయని, ఆమెని చూసి అమండా జెలస్ ఫీలయ్యేదని రూమ్మేట్స్, ఫ్రెండ్స చెప్పారు. విచ్చలవిడిగా ఉండే అమండాని మెరిడీత్ హెచ్చరించేదని, అందుకే ద్వేషం పెంచుకుందని, ఆమే మెరిడీత్‌ని చంపించి ఉంటుందని అందరూ అంటున్నారు. డీఎన్ఏ రిపోర్ట్స కూడా ఉన్నాయి. పైగా అమండా అన్నీ పొంతన లేని సమాధానాలు చెబుతూ వచ్చింది. అయినా కోర్టు వారిని ఎందుకు వదిలేసిందన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఇవన్నీ విన్నాక పోలీసులు ఓ అభిప్రాయానికి వచ్చారు. వెంటనే సోలేసిటో ఫ్లాట్‌ని తనిఖీ చేశారు. అతడి గదిలో అమ్మాయిల మీద జరిగే అరాచకాల గురించిన పుస్తకాలు ఉన్నాయి. ఓ పుస్తకంలో ఉన్న ఫొటో చూసి ఉలిక్కిపడ్డారు పోలీసులు. మెరిడీత్ మృతదేహం ఎలా, ఏ పరిస్థితుల్లో ఉందో అలానే ఉందా ఫొటో. వంటగదిలో ఉన్న కూరలు తరిగే కత్తికి రక్తపు మరకలున్నాయి. వాటి గురించి అడిగితే... రాత్రి చేపల్ని కోసేటప్పుడు అంటిన రక్తమంటూ తడుముకోకుండా చెప్పింది అమండా. కానీ డీఎన్ఏ పరీక్ష చేస్తే ఆ రక్తం సొలేసిటో, అమండాలదని తేలింది. దాంతో ఇద్దరి చేతులకూ బేడీలు పడ్డాయి. ఇటలీలో చదువుకోవడానికి వచ్చిన ఓ బ్రిటన్ యువతిని, అదే మాదిరి చదువుకోవడానికి వచ్చిన మరో అమెరికన్ యువతి చంపేసిందన్న వార్త యావత్ ప్రపంచాన్నీ కుదిపేసింది. అయితే పోస్టుమార్టం రిపోర్టు... ఈ కథను మరో మలుపు తిప్పింది. మెరిడీత్ హత్యలో అమండా, సొలేసిటో కాకుండా, మూడో వ్యక్తి కూడా పాల్గొన్నాడు. అతడే మెరిడీత్పై అత్యాచారం చేశాడు. అతడెవరో చెప్పమని అమండాను నిలదీస్తే... రూడీ గ్వాయ్డా పేరు బయటికొచ్చింది. తాను రాత్రి ఇంటికి వెళ్లేసరికి ఇంటి బయట రూడీ కనిపించాడని, అతడు తమకు పరిచయస్తుడే కావడంతో లోనికి తీసుకెళ్లానని, తర్వాత రూడీయే మెరిడీత్‌ని చంపేశాడని కొత్త కథ చెప్పింది. ముందే ఎందుకు చెప్పలేదంటే కన్ఫ్యూజ్ అయ్యానంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది. సొలేసిటో అయితే తనకసలు సంబంధమే లేదన్నాడు. రూడీని అరెస్ట్ చేసి నిలదీస్తే... మెరిడీతే తనను ఇంట్లోకి ఆహ్వానించిందని, ఇద్దరూ శారీరకంగా కలిశారని, తర్వాత తాను బాత్రూమ్కి వెళ్లి బయటకు వచ్చేసరికి ఎవరో వ్యక్తి మెరిడీత్‌ని చంపి పారిపోతున్నాడని అన్నాడు. అయితే గట్టిగా అడిగేసరికి అత్యాచారం చేశాను కానీ చంపలేదని అన్నాడు. దాంతో కోర్టు అతడికి పదమూడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే అమండా, సొలేసిటోలు మాత్రం నిజంమంగీకరించలేదు. అయినా డీఎన్ఏ రిపోర్టులను బట్టి, హత్య జరిగినప్పుడు వాళ్లు అక్కడే ఉన్నారని నిర్ధారించిన కోర్టు అమండాకి 26, సొలేసిటోకి 25 యేళ్ల శిక్ష విధించింది. వాళ్లు పైకోర్టుకు వెళ్లారు. దాంతో సరైన ఆధారాలు లేవంటూ అమండాను, సొలేసిటోను నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. దాంతో అమండా అమెరికాకు వెళ్లిపోయింది. ఓ పబ్లిషింగ్ కంపెనీతో కలిసి తన జైలు జీవితం గురించి ఓ పుస్తకాన్ని వెలువరించింది. కానీ మెరిడీత్ ఫ్యామిలీ అభ్యర్థనను మన్నించిన ఇటలీ సుప్రీంకోర్టు కింది కోర్టు తీర్పును తప్పుబట్టింది. ఆధారాలు కోర్టుకి సమర్పించలేనంత మాత్రాన వారిని దోషులు కాదనడం కరెక్ట్ కాదని తేల్చింది. దాంతో కేసు మళ్లీ తెరిచారు. అమండా దోషా నిర్దోషా అన్నది ఈ యేడు తేలవచ్చేమో! - సమీర నేలపూడి -
అనంతరం: జూనియర్ ఫర్ఫెక్షనిస్ట్
కొడుక్కి తండ్రి పోలికలు రావడంలో పెద్ద విశేషమేమీ లేదు. కానీ అచ్చు గుద్దినట్టుగా అతడి గుణగణాలు రావడం మాత్రం విశేషమే. అందుకే జునైద్‌ని చూస్తే ఆమిర్‌ని చూసినట్టే ఉంటుంది అంటారంతా. ఆ మాట విన్నప్పుడల్లా ఆ కొడుకు చిన్నగా నవ్వుతాడు. అతడి తండ్రి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. బంధానికి తండ్రీకొడుకులే అయినా, చూడ్డానికి అన్నదమ్ముల్లా కనిపించే ఆ తండ్రీకొడుకులు... ఆమిర్‌ఖాన్, జునైద్‌ఖాన్! ‘పీకే’ సినిమా షూటింగ్ జరుగుతోంది. నిండా పాతికేళ్లు కూడా లేని కుర్రాడు స్క్రిప్టు పేపర్లు పట్టుకుని అటూ ఇటూ హడావుడిగా తిరుగుతున్నాడు. మధ్య మధ్యలో కెమెరామేన్ దగ్గరకు వెళ్లి సూచనలు ఇస్తున్నాడు. డెరైక్టర్ దగ్గరకు వెళ్లి డిస్కస్ చేస్తున్నాడు. నటీనటులతో ముచ్చటిస్తున్నాడు. కాస్త దూరంలో కూర్చుని ఉన్న ఓ నలభై ఎనిమిదేళ్ల వ్యక్తి ఆ కుర్రాడినే తదేకంగా చూస్తున్నాడు. కాసేపటి తర్వాత అతడి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. ఆ నవ్వులో కాసింత గర్వం. అంతా తానై, అన్నింటా తానై మసలుతున్న ఆ కుర్రాడి పేరు జునైద్. అతడిని చూసి మురిసిపోతోంది... ఆమిర్‌ఖాన్, జునైద్ తండ్రి! బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ గురించి చెప్పమంటే ఎవరైనా మొదట చెప్పే మాట... పర్ఫెక్షన్కు నిలువెత్తు రూపం, క్రమశిక్షణకు మరో రూపం అని. అవే మాటలు ఇప్పుడు జునైద్‌ని చూసి అంటున్నారంతా. అందుకే కొడుకుని చూసి గర్వంతో పొంగిపోతుంటాడు ఆమిర్. తన మార్గంలో నడిచి హీరో కాకపోయినా, తనకిష్టమైన డెరైక్షన్ రంగంలో ఎదిగేందుకు కొడుకు పడుతోన్న తపనకు తోడుంటాడు. ప్లస్సులను మెచ్చుకుంటూ, మైనస్‌లను అధిగమించడం నేర్పుతూ... కొడుకుని గొప్పవాణ్ని చేసేందుకు ఆరాట పడుతుంటాడు. ఆ బంధం బలమైనది... ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ చిత్రం చేస్తున్నప్పుడు, నటి రీనా దత్తాతో ప్రేమలో పడిన ఆమిర్, తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి జునైద్, ఇరా పుట్టారు. పిల్లలంటే ప్రాణం ఆమిర్‌కి. కానీ భార్యతో బంధమే... ఎందుకో బలహీన పడింది. పదిహేనేళ్లు గడిచాక పూర్తిగా తెగిపోయింది. పిల్లలు తల్లి చెంత చేరారు. కానీ... తండ్రి గుండెల్లో వారి స్థానం వారిదే. భార్యతో విడిపోయినా, మరో స్త్రీతో ప్రేమలో పడినా... పిల్లల బాధ్యతను విస్మరించలేదు ఆమిర్. అందుకే జునైద్, ఇరాలకు తండ్రి మీద రెండో అభిప్రాయం లేదు. అమ్మానాన్నలు విడిపోయినా తమకు ఇద్దరూ ఉన్నారన్న భావనలోనే ఉంటారు. అసిస్టెంట్ డెరైక్టర్ అయిన కిరణ్‌రావుని తండ్రి పెళ్లి చేసుకుంటుంటే... వచ్చి విష్ చేయగలిగేంత మెచ్యూరిటీ, వారికి పుట్టిన బిడ్డని తమ్ముడిగా ప్రేమించేంత మంచి మనసుంది వారిలో. అది వారిని తండ్రికి మరింత దగ్గర చేసింది. తండ్రికి జిరాక్స్ కాపీ... జునైద్‌ని చూస్తే ఆమిర్‌ని చూడక్కర్లేదు అంటారు వారి గురించి తెలిసినవారంతా. చేయాలనుకున్నది చేయడం, వెళ్లే దారిలో ముళ్లను ఏరిపారేసి పూలను పరచుకుంటూ పోవడం, వేలెత్తి చూపనివ్వని క్రమశిక్షణ... ఇవన్నీ తండ్రి నుంచే అబ్బాయి జునైద్‌కి. నటుడు కావాలన్న కోరిక అతడికెప్పుడూ లేదు. ఒకరు క్రియేట్ చేసినదాన్ని ఇంప్రవైజ్ చేసే నటుడికన్నా, క్రియేట్ చేసినవాడే గొప్పవాడన్న నమ్మకం అతడిది. అందుకే మెగాఫోన్ పట్టేందుకే మొగ్గు చూపాడు. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. విలువలకు కట్టుబడి సినిమా తీస్తాడు హిరానీ. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్ చిత్రాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఆమిర్ కూడా విలువల గురించి ఆలోచిస్తాడు. అతడికి కొడుకుగా పుట్టిన జునైద్ కూడా వాటి గురించే ఆలోచించాడు. అందుకే తన గురువుగా హిరానీని ఎంచుకున్నాడు. ప్రస్తుతం తన తండ్రి ఆమిర్‌తో హిరానీ తీస్తోన్న ‘పీకే’కి సహాయ దర్శకుడిగా పని చేస్తున్నాడు. నువ్వెప్పుడు దర్శకుడివవుతావు అంటే... ‘ముందు పని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి’ అంటాడు. ఆమిర్ కొడుకు కదా... పర్ఫెక్షన్ గురించి కాకుండా దేని గురించి మాట్లాడతాడు! - సమీర నేలపూడి -
అనంతరం: రేలంగి రాముడు
తండ్రి మాట విని రాముడు రాజ్యాన్ని వదలి అడవులకు పోయాడు. సత్యనారాయణబాబు కూడా రాముడిలా తండ్రి మాటకు విలువిచ్చారు. వద్దు అని ఒక్క మాట అనగానే తనకెంతో ఇష్టమైన నటనకు గుడ్‌బై చెప్పేశారు. అందుకాయన బాధపడరు. కొడుకుగా అది తన ధర్మం అంటారు. అంత మంచి కొడుకును కన్న ఆ తండ్రి... రేలంగి వెంకట్రామయ్య. నవంబర్ 27న రేలంగి వర్థంతి సందర్భంగా ఆయన కొడుకు తన ప్రేమ వచనాలతో తండ్రికి సమర్పించిన నివాళి ఇది... అమ్మానాన్నలకు నేనొక్కడినే. నాకు ఊహ తెలిసేనాటికే నాన్న సినిమాల్లో బిజీగా ఉన్నారు. నేను కూడా నాటకాల్లో నటించాను. మూడుసార్లు ఉత్తమ నటుడిగా మొదటి బహుమతి గెలుచుకున్నాను. సినిమాల్లో కూడా ప్రవేశించాను. నా తొలి సినిమా ‘బాలానందం’. ఆ సినిమాలో హీరోనీ, విలన్నీ నేనే. అయితే, రెండో సినిమాతో నాకో చిత్రమైన సమస్య వచ్చింది. కమెడియన్ కొడుకుని కాబట్టి నాలో కమెడియన్నే చూశారు. నాక్కూడా నగేశ్గారిలాంటి మంచి కమెడియన్ని కాగలననిపించేది. కానీ నాకు జంటగా పెట్టే అమ్మాయిల దగ్గరే వచ్చేది సమస్య. వాళ్లంతా నా వయసు వాళ్లే అయినా నాన్న పక్కన నటిస్తుండేవారు. వాళ్లను నా పక్కన పెట్టడం బాగోదేమో అనిపించేది. దాంతో నాకు సరిపడేవాళ్లు ఎవరూ ఉండేవారు కాదు. ఈ పరిస్థితి నాన్నకి విసుగు తెప్పించింది. వెంటనే మా ఊరు తాడేపల్లిగూడెంలో ఓ థియేటర్ కట్టించి... సినిమాలొద్దు, దాన్ని చూసుకోమన్నారు. దాంతో బాలానందమే నా మొదటి, చివరి సినిమా అయ్యింది. థియేటర్ని, ఆస్తుల్ని చూసుకోవడమే నా వృత్తి అయ్యింది. నాన్న థియేటర్‌ను మా ఊళ్లోనే నిర్మించడానికి మరో కారణం కూడా ఉంది. మాది కల్లుగీత కార్మికుల కుటుంబం. అప్పట్లో మావాళ్లెవరికీ అంత గౌరవం ఇచ్చేవారు కాదు. దాంతో మా కులస్థుల గౌరవాన్ని పెంచాలని, మమ్మల్నీ అందరూ గుర్తించాలనే ఉద్దేశంతో నాన్న కావాలని అక్కడే థియేటర్ కట్టారు. ఆయన అనుకున్నది నిజమే అయ్యింది. ఆ తర్వాత మా వాళ్లకు ఆ ఊరిలో గౌరవం పెరిగింది. ఆయన మాట నాకు వేదం... చాలామంది అంటుంటారు, నటన అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు, మీ నాన్నగారిని ఒప్పించాల్సింది అని. కానీ నాకా ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే, ఆయన మాట నాకు వేదం. ఆయన ఏం చేసినా ఆలోచించి చేస్తారనే నా నమ్మకం. ఆ నమ్మకమెప్పుడూ వమ్ము కాలేదు. నా పెళ్లి సమయంలో నాన్న చెప్పిన మాటలు నేనెప్పటికీ మర్చిపోను. నాకు కోటీశ్వరుల సంబంధాలు వచ్చాయి. కానీ నాన్న మా మావయ్య కూతుర్ని నాకిచ్చి చేయాలనుకున్నారు. ‘మన పరిస్థితి బాలేనప్పుడే తన కూతుర్ని నీకు చేసుకొమ్మని మావయ్య అడిగాడు, ఇవాళ వాళ్లు చితికిపోయారని, మనం బాగున్నామని వాళ్లను కాదనకూడదు’ అన్నారు. ‘నువ్వు అమ్మాయిని కోరుకుంటున్నావ్, నేను నీకు మంచి భార్యను ఇవ్వాలనుకుంటున్నాను, ఆ రెండిటి మధ్య తేడాని అర్థం చేసుకో’ అన్నారు. నేనర్థం చేసుకున్నాను. అందుకే మౌనంగా నా మరదలి మెడలో తాళి కట్టాను. నాన్న చెప్పింది నిజం... ఆయన నాకు చాలా మంచి భార్యనిచ్చారు. ఎవరి విషయంలోనైనా మంచే ఆలోచించేవారు నాన్న. తన-పర భేదమసలు తెలీదు ఆయనకి. నాన్న చనిపోయాక నేను థియేటర్ని పక్కన పెట్టి, సినీ నిర్మాతగా మారాలనుకున్నాను. అప్పుడు ఏవీఎం శరవణన్‌గారు... ‘మీ నాన్న ఎంతో ఆలోచించి థియేటర్ కట్టి ఇచ్చారు, దాన్ని వదిలేసి వేరేదానికి వెళ్తే ఏదైనా తేడా వచ్చిందనుకో, నీ పిల్లల పరిస్థితి ఏమిటి? ఏదైనా చేస్తే వాళ్లు స్థిరపడిన తర్వాత చెయ్యి’ అన్నారు. అది నిజమే అనిపించింది. ఆ తర్వాత ఎప్పుడూ థియేటర్ని వదిలిపెట్టాలని అనుకోలేదు. ఇప్పుడు దాన్ని పడగొట్టి, మల్టీప్లెక్స్‌గా మారుస్తున్నాను. నా చిన్న కొడుకు హేమంత్ నటనలో శిక్షణ తీసుకున్నాడు. తనతో ఎప్పటికైనా ఓ సినిమా నిర్మిస్తాను. మిగిలిపోయిన ఆ కలను కూడా నెరవేర్చుకుంటాను! - సంభాషణ: సమీర నేలపూడి -
అనంతరం: మిగిలింది అనుబంధమే!
అనంతరం: సోనాక్షిసిన్హా, సోనమ్‌కపూర్, శృతీహాసన్... ఆడపిల్లకు సెక్యూరిటీ ఉండదు అని అంతా ఫీలయ్యే సినీ పరిశ్రమలోకి, హీరోలైన తమ తండ్రుల ప్రోత్సాహంతో అడుగుపెట్టిన కూతుళ్లు వీళ్లు. నిజానికి ఈ పేర్ల పక్కన త్రిశల అనే మరో పేరు కూడా ఉండాల్సి ఉంది. కానీ బాలీవుడ్ టాప్ హీరో కూతురయిన ఆమె పేరు యువతారల లిస్టులో ఇంతవరకూ చేరలేదు. మరి త్రిశల ఏం చేస్తోంది? ఆమె ప్రయాణం ఎటువైపు సాగుతోంది? తల్లి లేదు. తండ్రి ఉన్నా... అతడికీ తనకూ మధ్య తరగని దూరం. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఎనిమిదేళ్ల చిన్నారి ఎలా ఆలోచిస్తుంది? ఎంత బాధపడుతుంది? సంజయ్‌దత్ కూతురు త్రిశలను అడిగితే తెలుస్తుంది... ఆ బాధ ఎలా ఉంటుందో. తల్లి రిచా బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయాక, తండ్రి ఒడిలో ఆడుకోవచ్చనుకుంది ఆ చిన్నారి. కానీ తండ్రి తన బాధ్యతలను నెరవేర్చేందుకు సిద్ధపడ్డాడే తప్ప, ఆమెను తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడలేదు (అలా అని త్రిశలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది). దాంతో అమ్మమ్మ ఇల్లే ఆమె ఇల్లయ్యింది. సప్త సముద్రాలకు ఆవలే ఆమె ఉండిపోయింది. తల్లిదండ్రులు లేని పిల్లలు పెంకివాళ్లవుతారని, చెడు సావాసాలకు చేరువవుతారని కూడా చెబుతారు. కానీ త్రిశలలో అలాంటి లక్షణాలు మచ్చుకు కూడా ఉండవంటారామె సన్నిహితులు. సౌమ్యంగా ఉంటుంది. సమస్యల్ని తెలివిగా పరిష్కరించుకుంటుంది. అందరితో సరదాగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది త్రిశల. ఇది ఎలా సాధ్యమయ్యిందని అడిగితే... ‘‘నాన్నా నాకిది కావాలి అంటే క్షణాల్లో నా ముందు ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు. పేరుకే సెలెబ్రిటీ కూతురిని. కానీ సెలెబ్రిటీల పిల్లలకుండే ఏ హక్కుల్నీ సంతోషాల్నీ నేను అనుభవించలేదు. అయినా నా మీద నాకు నమ్మకముంది. అందుకే సమస్యలను ఎదుర్కొంటూ ఎదగడం నేర్చుకున్నాను’ అంటుంది త్రిశల. తన తల్లి చనిపోవడంతోనే రియా పిళ్లై అనే మోడల్/నటిని పెళ్లాడాడు తండ్రి. ఆమెతో విడిపోయాక మాన్యతను మూడో భార్యగా చేసుకున్నాడు. ఇవన్నీ త్రిశల మనసుపై ఎలాంటి ప్రభావం చూపాయన్నది ఎవరికీ తెలియదు. ఎందుకంటే, ఆమె ఎవరికీ తెలియనివ్వలేదు. తండ్రితో ఎప్పుడూ మంచి అనుబంధమే ఉందామెకి. అప్పుడప్పుడూ ఇండియా వస్తుంది. నాన్నతో గడుపుతుంది. మాన్యతతో స్నేహంగా ఉంటుంది. వారి పిల్లలైన షహ్రాన్, ఇక్రాలతో ఆడిపాడుతుంది. ఉన్నన్ని రోజులూ సరదాగా, సంతోషంగా గడిపి అమెరికా వెళ్లిపోతుంది... ఒంటరిగా. ఆ నిర్ణయం తనదా... తండ్రిదా? త్రిశల మొదట్లో చాలా లావుగా ఉండేది. విపరీతంగా పెరిగిన ఒళ్లు ఆమెని ఇబ్బంది పెట్టేది. ఆ అవస్థను తగ్గించుకోవాలనుకుంది. కష్టపడి వర్కవుట్లు చేసింది. ఇప్పుడు త్రిశలను చూస్తే, ఈమె ఆ త్రిశలేనా అని అనుమానం రాక మానదు. అయితే త్రిశల స్లిమ్ అవ్వడం చూసినవాళ్లు ఆమె సినిమాల్లోకి వస్తుందేమో అనుకున్నారు. సోనాక్షి, సోనమ్‌ల మాదిరి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తుందేమో అనుకున్నారు. కానీ త్రిశల ఇండస్ట్రీలో అడుగుపెట్టలేదు. పెట్టనని చెప్పేసింది కూడా. దానికి కారణం తండ్రికిష్టం లేకపోవడమే అని అందరూ అంటున్నా, ఆమె మాట్లాడదు. నాన్న నో అంటే ఇక అంతే అన్నట్లు ఉండిపోతుంది. త్రిశల ఫ్యాషన్ ఐకన్లా ఉంటుంది. రకరకాల హెయిర్ స్టయిల్స్, సొంతగా డిజైన్ చేసుకునే కాస్ట్యూమ్స్, నడినెత్తి నుంచి పాదాల వరకూ ఎంత శ్రద్ధ తీసుకుంటుందో! ఆ శ్రద్ధే ఆమెను అటువైపు నడిపించింది. డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో తన సిగ్నేచర్‌ను నిలిపేందుకు తహతహలాడుతోంది త్రిశల. ఇండియా వచ్చి సెటిలవ్వాలన్న ఆలోచన ఆమెకి లేదు. బహుశా చిన్ననాటి నుంచీ ఎదుర్కొన్న పరిస్థితులే అందుకు కారణం కావచ్చు. వాటి గురించి అడిగినా తను చెప్పదు. చిన్నగా నవ్వి తప్పుకుంటుంది. జాగ్రత్తగా గమనిస్తే ఆమె నవ్వు వెనకాల లోతైన భావమేదో కనిపిస్తుంది. ఆ భావాన్ని చదవడంలో... ఈ సమాజం ఎప్పుడూ విఫలమవుతూనే ఉంది! - సమీర నేలపూడి -
మౌనం మన ఉద్యోగం కాదు
ఫిబ్రవరి 6, 2013... కోల్‌కతా. ట్రిబ్యునల్ కోర్టులో గంభీరమైన వాతావరణం నెలకొని ఉంది. దాదాపు పదేళ్లుగా సాగుతోన్న ఓ కేసు తీర్పు ఆ రోజు వెలువడనుంది. అందుకే అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కాసేపటికి జడ్జి పెదవి మెదిపారు. ‘‘కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట... రీనాముఖర్జీ మీద లైంగిక వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని నిర్థారణ అయ్యింది. తీసేసిన ఆమె ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వాలని, ఈ పదేళ్లలో ఆమెకు రావాల్సిన జీతం మొత్తాన్నీ ఆమెకు ఇవ్వాలని తీర్పు చెప్పడమైనది’’. తీర్పు వింటూనే రీనా ముఖం వెలిగిపోయింది. కోల్‌కతాలోని ఓ ప్రముఖ సంస్థలో సీనియర్ ఉద్యోగిని రీనా. భర్త, బిడ్డతో సంతోషంగా గడిచిపోయే ఆమె జీవితంలోకి బాస్ రూపంలో దురదృష్టం ప్రవేశించింది. అతడు లైంగికంగా వేధించడమే కాక, ఎదురు తిరిగినందుకు ఆమెను మానసిక హింసకు గురిచేశాడు. పై అధికారులకు కంప్లయింట్ చేయబోతే... రీనా సరిగ్గా పనిచేయట్లేదని మందలించినందుకు తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తోందని నమ్మబలికాడు. రీనాని ఉద్యోగం నుంచి తీయించేశాడు. నాటినుంచి పదేళ్ల పాటు న్యాయ పోరాటం చేసింది రీనా. చివరకు విజయాన్ని సాధించింది. అసలు లైంగిక వేధింపులంటే ఏమిటి? తన లైంగికేచ్ఛను ఓ వ్యక్తి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెలిబుచ్చడం, తన కోరిక తీర్చమని బలవంతపెట్టడం, కాదంటే మానసికంగా వేధించడం, తాకేందుకు ప్రయత్నించడం, సైగలు చేయడం, అసభ్యకరమైన చిత్రాలను చూపించడం, ద్వంద్వార్థాలతో మాట్లాడటం, ఒత్తిడికి తలవంచలేదన్న కసితో తక్కువ చేసి మాట్లాడటం... ఇవన్నీ లైంగిక వేధింపులే. మన సమాజంలో రీనాలు చాలామందే ఉన్నారు. అయితే వాళ్లు రీనాలా వేధింపులకు గురి అవుతున్నారే తప్ప, ఆమెలా పోరాడట్లేదు. బంధువో, టీచరో, సహోద్యోగో-బాసో వేధిస్తున్నా నోరు మెదపట్లేదు. పరువు పోతుందనో, ఉద్యోగం పోతుందనో భయపడి మౌనంగా సహిస్తున్నారు. లేదంటే ఎందుకొచ్చిన గొడవ అని ఉద్యోగం మానేసి వెళ్లిపోతున్నారు. కొన్నిసార్లు ఏదో ఒక నిర్ణయం తీసుకునేలోపే, జరగరాని ఘోరం కూడా జరిగిపోతుంది. తర్వాత అవమానంతో ఆత్మహత్యలు, ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోవడాలు. ఏం తప్పు చేశామని మనకీ శిక్ష? ఈ పరిస్థితి మారాలంటే... ముందు మహిళలు మారాలి. అతడి ధోరణి అభ్యంతరకరంగా మారినప్పుడు, నోరు తెరిచి అతడి దురుద్దేశ్యం గురించి అందరికీ చెప్పాలి. అతడు తెగించి మీ ఒంటి మీద చేయి వేయాలని ప్రయత్నించినప్పుడు, మీరు అతడి చేతికి బేడీలు వేయించాలి. ఇందుకోసమే ప్రభుత్వం ఓ చట్టాన్ని రూపొందించింది. ఐపీసీ 354... ఇది మహిళలకు ఓ వరం. పని చేసేచోట గాని, మరే ఇతర ప్రదేశాల్లో కానీ ఏ మహిళ అయినా లైంగిక వేధింపులకు గురయితే... సమీప పోలీస్ స్టేషన్లో కానీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో గానీ ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. ఒకవేళ వేధింపు ఆఫీసులో జరిగితే, దాని గురించి మీరెప్పుడైనా ఆ పై అధికారికి ఫిర్యాదు చేసి, అతడు పట్టించుకోకుండా ఉన్నట్లయితే... అతడి మీద కూడా ఐపీసీ 107 సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. తప్పు జరుగుతుందని తెలిసి కూడా పట్టించుకోనందుకు అతడికి సైతం శిక్ష పడుతుంది. కాబట్టి పోలీస్ స్టేషన్‌కి వెళ్లడమంటేనే పెద్ద తప్పు అన్న భావన వీడండి. కేసు పెడితే పరువు పోతుందేమో, అల్లరవుతామేమో అన్న భయాన్ని విడిచిపెట్టండి. సహించింది చాలు. భరించింది చాలు. భయపడి పరుగులెత్తింది చాలు. మౌనంగా కుమిలిపోయింది చాలు. ఇప్పటికైనా గళం విప్పండి. స్వరం పెంచండి. అన్యాయాన్ని ప్రశ్నించండి. అక్రమాన్ని అడ్డుకోండి. చట్టం అండతో... మిమ్మల్ని మీరు కాపాడుకోండి! - సమీర నేలపూడి సాక్ష్యాలతో మరింత బలం... లైంగిక వేధింపులకు గురవుతోన్న మహిళల్లో ఒకరిద్దరు కూడా సమస్యను పోలీసుల దృష్టికి తీసుకురావడం లేదు. అందుకు మొదటి కారణం... అసలు తమను కాపాడే చట్టమొకటి ఉందని తెలీక పోవడం. తెలిసినా... కేసు పెడితే.. అది తేలేసరికి ఎన్నేళ్లు పడుతుందో, కోర్టులచుట్టూ తిరగాల్సి వస్తుందేమోనన్న బెరుకు. అన్నిటికంటే ముఖ్యమైన సమస్య... సాక్ష్యాలు. ఒక మహిళ మీద వేధింపులు జరిగాయని నిరూపించాలంటే ఆ సంఘటనను చూసినవాళ్లెవరైనా సాక్ష్యం చెప్పాలి. వేధింపుల సమయంలో సదరు వ్యక్తి మాట్లాడిన మాటలు కానీ, చేతలు కానీ రికార్డు చేసి ఉండాలి. పై అధికారులకు కంప్లయింట్ చేసివుంటే, ఆ కంప్లయింట్ కాపీని జత చేయాలి. ఈ సాక్ష్యాలన్నీ మీ దగ్గర ఉంటే ధైర్యంగా కోర్టుకు వెళ్లండి. సమస్యను పరిష్కరించుకోండి. -
మణిరత్నం ఇంట్లో కార్ల్ మార్క్స్
అనంతరం: ప్రతి కొడుకూ తన తండ్రిని హీరోగా భావిస్తాడు. ఆయన అడుగుల్లో అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆయన మార్గంలో తానూ పయనించాలనుకుంటాడు. కానీ నందన్ అలా అనుకోలేదు. తండ్రి దేశం గర్వించదగ్గ దర్శకుడు. అయినా కూడా సినిమావైపు కన్నెత్తి చూడలేదు నందన్. పోనీ తల్లిలా మేకప్ వేసుకున్నాడా అంటే అదీ లేదు. తనదైన మార్గం ఎంచుకున్నాడు. తనకు నచ్చిన పంథాలో సాగిపోవాలని అనుకుంటున్నాడు. తను నమ్మిదాన్నే ఆచరిస్తానంటున్నాడు. ఇంతకీ సుహాసిని, మణిరత్నంల కొడుకు నందన్ ఏ దారిలో ఉన్నాడు? సినిమా తప్ప మరో మాటే వినిపించని కుటుంబంలో పుట్టినా, ఆ మూడక్షరాలూ నందన్ని ప్రభావితం చేయలేకపోయాయి. జాతీయ అవార్డుల్ని అలవోకగా తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకునే తల్లి లాలనలో పెరిగాడు. దర్శకుడు అనగానే అందరి మనసుల్లోనూ మెదిలేంత ప్రతిభావంతుడైన తండ్రి చేయి పట్టుకుని ఎదిగాడు. అయినా వారి ప్రభావం నందన్ మీద లేదు. వారి దగ్గర నడక నేర్చుకున్నాడే తప్ప, వారు వెళ్లిన దారిలో నడవాలనుకోలేదు. వాళ్లున్న రంగాన్ని గౌరవించాడే తప్ప, అటు వెళ్లిపోవాలని ఆశించలేదు. అలా అనుకుని ఉంటే... నందన్ గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు. వయసును మించిన మేధస్సు... రంగుల ప్రపంచం మధ్యలో పెరిగిన నందన్ని ఆ రంగుల కంటే అక్షరాలు ఎక్కువ ఆకర్షించాయి. అందుకే సినిమాలు చూస్తూ కాక, పుస్తకాలు చదువుతూ పెరిగాడు. పుస్తకం కనిపిస్తే పూర్తిగా చదివేదాకా నిద్రపోయేవాడు కాదు. పసితనపు ఛాయలు పోకముందే మార్క్సిజాన్ని అవగాహన చేసుకున్నాడు. యుక్త వయసు వచ్చేనాటికి లెనినిజాన్ని ఔపోసన పట్టాడు. పదిహేడేళ్లు వచ్చేప్పటికి మార్కిస్ట్-లెనినిస్టు ఐడియాలజీని ఒంటబట్టించుకుని, ‘ద కాంటూర్స్ ఆఫ్ లెనినిజం’ పేరుతో ఇరవయ్యేడు పేజీల పాంప్లెట్ను రూపొందించాడు. ‘తత్వ శాస్త్రానికి, రాజకీయ సంస్కరణ, ఆచరణలకు అతి మెరుగైన, సర్వకాల రూపమే మార్క్సిజం’ అంటూ ఓ అనుభవ జ్ఞుడైన ప్రొఫెసర్లా లోతుగా ఉన్న అతడి భావాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అప్పుడే తొలిసారి అతడు మణిరత్నం కొడుకుగా కాక, ఓ జీనియస్‌గా, అభ్యుదయ భావాలు కల యువకుడిగా ప్రపంచానికి పరిచమయ్యాడు. ఊహించని అడుగు... చిన్న వయసులోనే ఎవరూ ఊహించని అడుగులు వేశాడు నందన్. ఎప్పుడైతే సీపీఐ(ఎం) తరుఫున వాలంటీరుగా పనిచేయడం మొదలెట్టాడో... అప్పుడే అతడి మనసు రాజకీయాల వైపు లాగుతోందని అర్థమైంది తల్లిదండ్రులకి. వాళ్లెప్పుడూ కొడుకుని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకోలేదు. అతడేం చేసినా తోడుగా నిలవాలనుకున్నారు. ‘నందన్‌కి పాలిటిక్స్ అంటే ఇష్టం. తన ఇష్టాన్ని గౌరవించడం మాకిష్టం. అందుకే తన నిర్ణయాన్ని మేం ప్రోత్సహించాం’ అన్నారందుకే సుహాసిని ఓ ఇంటర్వ్యూలో. కానీ సుహాసినికి చిన్నాన్న, నందన్‌కి చినతాత అయిన నటుడు కమల్ హాసన్... నందన్ సినిమా రంగం వైపు రావాలని ఆశిస్తున్నారు. తనని ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో కలిసి పనిచేసే విధంగా ప్రోత్సహించారని, నందన్ కూడా అందుకు అంగీకరించాడని తెలుస్తోంది. అయితే రాజకీయాల మీద మనసు ఉన్న నందన్, సినిమా రంగంవైపు వెళ్లగలడా! పెద్దవాళ్ల మాటను కాదనలేక వెళ్లినా మనసు లేని చోట ఇమడగలడా! అతడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు... వేచి చూడాల్సిందే! - సమీర నేలపూడి -
మనోగళం: అంత గొప్ప ప్రశంసను ఎవరూ ఇవ్వలేరు!
ఎదుటివారిలో మీకు నచ్చేది? ఆప్యాయంగా మాట్లాడేవాళ్లను, సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాళ్లను ఇష్టపడతాను. ఎదుటివారిలో నచ్చనిది? నిజాయతీ లేనివాళ్లు అస్సలు నచ్చరు. మీలో మీకు నచ్చేది? నాది చిన్నపిల్ల మనస్తత్వం. చిన్నవాటికే సంబరపడిపోతాను. వీలైనంత హ్యాపీగా ఉంటాను. అనవసరమైన టెన్షన్లు మనసులోకి రానివ్వను. మీలో మీకు నచ్చనిది? కొంచెం పంక్చువాలిటీ తక్కువ. ఒక్కోసారి లేటైపోతుంటాను. మీ ఊతపదం? ఎవరేం చెప్పినా ‘రియల్లీ?’ అంటాను. ప్రతి చిన్నదానికీ ‘కూల్’ అన్నమాట వాడుతుంటాను. మీ గురించి ఎవరికీ తెలియని మూడు విషయాలు? నేను చాలా మొండిదాన్ని. పట్టు పడితే అనుకున్నది పూర్తయ్యే వరకూ వదలను. పుస్తకాలు విపరీతంగా చదువుతాను. ఎంత అలసిపోయినా సరే, తెల్లవారుజామునే లేస్తాను. మీ గురించి ఎదుటివాళ్లు తప్పుగా అనుకునేది? నేనేంటో నాకు తెలుసు. ఇతరులు నా గురించి ఏమనుకుంటారన్నది వాళ్లనే అడగాలి. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి? మా అమ్మమ్మ, అమ్మ. ఈ ఇద్దరి ప్రభావం నా మీద చాలా ఎక్కువ. ముఖ్యంగా మా అమ్మ. అన్నింటినీ పద్ధతిగా చక్కబెట్టుకుంటుంది. అసలు విసుగనేదే ఉండదు. అంతేకాదు... ఎలాంటి పరిస్థితుల్లోనైనా గుండె నిబ్బరంగా ఉంటుంది. అలా ఎలా ఉండగలదా అని ఆశ్చర్యం వేస్తుంది నాకు! మనసుకు నచ్చిన పాట? రఘుపతి రాఘవ రాజారాం...! చిన్నప్పుడు నన్ను ఒళ్లో పడుకోబెట్టుకుని మా అమ్మ ఈ పాట పాడేది. అప్పట్నుంచీ నాకా పాటంటే చాలా ఇష్టం. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాగే ‘జన గణ మన’ ఎప్పుడు విన్నా, చిన్నప్పుడు స్కూల్లో పాడిన సందర్భాలు గుర్తొస్తుంటాయి. సంతోషపెట్టిన ప్రశంస? మా అమ్మ నన్నెప్పుడూ ‘డాళింగ్’ అంటూ ఉంటుంది. దాన్నే నేను ప్రశంసలా ఫీలవుతాను. నాకు తెలిసి అంతకన్నా గొప్ప ప్రసంశను నాకెవరూ ఇవ్వలేరు. స్పోర్టివ్‌గా ఉంటారా? చాలా...! అన్నీ లైట్ తీసుకుంటాను. ఎవరో నాతో పోటీపడుతున్నారని కంగారుపడను. నేను ఎవరితోనో పోటీ పడాలని అనుకోను. నేను నేనే. నా పని నాదే. ఇలా చేయకుండా ఉండాల్సింది అనుకునేది ఏదైనా ఉదా? నాకు తెలిసి అలాంటివేమీ లేవు. ఏం చేసినా ఆలోచించుకునే చేస్తాం కదా! ఒకవేళ ఫలితం వ్యతిరేకంగా వచ్చినా దాని గురించి బాధపడి చేసేదేమీ లేదు. ఇంకోసారి అలా జరక్కుండా చూసుకుంటే సరిపోతుంది. అందుకే నేను దేని గురించీ పెద్దగా బాధపడను. మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? నేనెప్పుడూ సారీలు బ్యాంకులో వేసుకోను. సాధారణంగా ఎవరినీ బాధపెట్టను. కనీసం కోపంగా కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడుతుంటాను. పొరపాటున ఎవరినైనా నొప్పిస్తే, వెంటనే క్షమాపణ చెప్పేస్తాను. మీరు నమ్మే సిద్ధాంతం? ఫలితం గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుపోవాలి. వచ్చినదాన్ని వచ్చినట్టు స్వీకరించాలి. దీని ప్రకారమే నడుచుకుంటాను నేను. మన కంట్రోల్లో లేనిదాని గురించి కంగారుపడటం అనవసరం అన్నది నా ఉద్దేశం. మీ మనసుకు నచ్చిన ప్రదేశం? యూరోప్. అక్కడుంటే ఎంతో హాయిగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. కాలం గిర్రున వెనక్కి తిరిగి, మీరు హీరోయిన్ కాకపోయి ఉంటే... ఏం చేస్తుండేవారు? కచ్చితంగా డ్యాన్సర్ గా స్థిరపడి ఉండేదాన్ని. డ్యాన్స అంటే ప్రాణం నాకు. ఒక వేళ అది వీలు కాకపోయినా ఏదో ఒక క్రియేటివ్ ఫీల్డ్‌లోనే ఉండేదాన్ని! ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? చిన్నప్పుడు మా స్కూలు ఎదురుగా ఉన్న బ్లైండ్ స్కూల్ చూసి, అంధుల కోసం ఎప్పటికైనా ఏదైనా చేయాలని అనుకున్నాను. అది నెరవేరింది. నేను చేయగలిగింది చేస్తున్నాను. భవిష్యత్తులో కూడా అవసరంలో ఉన్నవారికి చేతనైనంత చేయగలిగితే చాలు. దేవుడు మీకేదైనా ప్రత్యేకమైన శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు? ఏదయినా సాధించాలంటే దేవుడు మనకి ప్రత్యేక శక్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు. అంటే, అంత శక్తి మన లోలోపల ఉన్నట్టే. కాబట్టి మనం తలచుకోవాలే గానీ, ఏదైనా సాధించగలుగుతాం. కాకపోతే గట్టిగా తలచుకోవాలంతే! మీ జీవితంలో ఒకే ఒక్కరోజు మిగిలివుందని తెలిస్తే, ఆ రోజును ఎలా గడుపుతారు? దేని గురించీ ఆలోచించకుండా, చావు ముందు ఉందని భయపడకుండా... నా ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతాను. - సమీర నేలపూడి -
మనోగళం: వాటికే ఎక్కువ ఖర్చు పెడుతుంటా!
ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది నిజాయితీ. నచ్చనిది... ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు ఇక్కడ చెప్పే తత్వం. మీలో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది కొత్తగా ఆలోచించడం, నాకు నచ్చినట్టు జీవించడం. నచ్చనిది కోపం. మీరు తరచుగా వాడే మాట/ఊతపదం? అందరినీ ‘అన్నయ్యా’ అంటుంటాను. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి? పూరీ జగన్నాథ్. నన్ను సొంత తమ్ముడిలా చూసుకుంటారాయన. అందరినీ నవ్వుతూ పలకరించడం, చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనకు కావలసినట్టు మలచుకోవడం వంటివి ఆయన్ను చూసే నేర్చుకోవాలి. కష్టంగా కాకుండా ఇష్టంగా పనిచేయడం నేనాయన నుంచే లవర్చుకున్నాను. ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? పరిచయస్తులెవరో, స్నేహితులెవరో గుర్తించడంలో ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటాను. అందరినీ స్నేహితులు అనేసుకుంటాను. ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడుతుంటాను. ఎందుకిలా చేశానా అని తర్వాత బాధపడుతుంటాను. అత్యంత సంతోషపడిన సందర్భం? సైకిల్ తొక్కడం కూడా రాని నేను, ఏకంగా కెనైటిక్ హోండా కొనుక్కున్నాను. ఆ బండెక్కి హైదరాబాద్ రోడ్ల మీద తిరిగిన తొలిరోజున ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలిగింది. అత్యంత బాధ కలిగించిన సందర్భం? పాటలు రాయడం మొదలుపెట్టిన తొలినాళ్లలో... ఒకే ట్యూన్‌ని చాలామందికి ఇచ్చి రాయించుకుంటారని నాకు తెలీదు. దాంతో రాత్రీ పగలూ కూర్చుని పాట రాసేవాణ్ని. బాగుంది అంటే ఎంతో సంతోషపడేవాణ్ని. తీరా క్యాసెట్ విడుదలయ్యాక నా పాట లేకపోవడం చూసి చాలా బాధ కలిగేది. ఇలాంటి నమ్మకద్రోహాలు జరిగిన ప్రతిసారీ ఏడుపొచ్చేది. మీరు నమ్మే సిద్ధాంతం...? బతికిన ప్రతి క్షణం నుంచీ మూల్యాన్ని రాబట్టుకోవాలి. ఏ క్షణాన్నీ వృథాగా పోనివ్వకూడదు. ఆకలి విలువ తెలిసిన క్షణం? నేను విపరీతమైన భోజన ప్రియుణ్ని. కానీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో కడుపు నిండా తినడానికి సరిపడా డబ్బుండేది కాదు. దాంతో ఖైరతాబాద్ ‘రెడ్‌రోజ్ కేఫ్’లో ఉదయం రెండు బిస్కట్లు తిని, టీ తాగేవాడిని. లంచ్ టైమ్‌లో ‘పెరిక భవన్’ దగ్గర రెండు రూపాయలకు నాలుగు అరటిపళ్లు తిని, నీళ్లు తాగేవాడిని. రాత్రిపూట మాత్రమే మెస్‌లో భోం చేసేవాడిని. ఆకలి బాధ ఏంటో అప్పుడే తెలిసింది. అందుకే ఆకలి అని ఎవరైనా అంటే... కడుపు నిండా భోజనం పెట్టేస్తాను. ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? మా అమ్మానాన్నలకి చెప్పాలి. తెలిసో తెలియకో చాలాసార్లు వాళ్ల మనసుని నొప్పించాను. అలాగే... వాళ్లతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. ఈ రెండు విషయాల్లోనూ వాళ్లకు క్షమాపణ చెప్పాలి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? నేను పాటల రచయితగానే అందరికీ తెలుసు. కానీ నేనో మంచి ఆర్టిస్టుని కూడా. బొమ్మలు చాలా బాగా గీస్తాను. చదువుకునే రోజుల్లో నేను వేసిన కార్టూన్లు కొన్ని పత్రికల్లో వచ్చాయి కూడా! మిమ్మల్ని భయపెట్టే విషయం ఏమైనా ఉందా? ఎత్తయిన ప్రదేశాల నుండి కిందికి చూడటమంటే మహా భయం. జెయింట్ వీలన్నా అంతే. అస్సలు ఎక్కను. ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు? మ్యూజిక్ ప్లేయర్స్‌కి. నా దగ్గర చాలా ఉన్నాయి. పెన్నులకి, డ్రెస్సులకి కూడా బాగానే ఖర్చుపెడుతుంటాను. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? చిన్నప్పుడే పాత్రికేయ వృత్తిలోకి రావడం వల్ల చదువు మధ్యలో ఆపేశాను. ఇప్పుడు మళ్లీ చదువుకోవాలనిపిస్తోంది. పీహెచ్డీ చేసి, డాక్టరేట్ తీసుకోవాలని ఉంది. దేవుడు ప్రత్యక్షమైతే ఏ వరం కోరుకుంటారు? ఇంత మంచి జన్మనిచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతాను తప్ప ఏమీ అడగను. ఎందుకంటే నాకు అంత పెద్ద పెద్ద కోరికలేమీ లేవు. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? మనసుకు నచ్చిన కవిత్వం రాసుకుంటూ గడిపేస్తా. మరణానికి భయపడతారా? ఎలాగూ తప్పదనుకున్నదాని గురించి భయపడటం అవసరమా! అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? తలలో నాల్కలా. మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే సైంటిస్టులా పుట్టి కొత్త కొత్త అన్వేషణలు చేస్తా. - సమీర నేలపూడి -
మనోగళం: నాకు చావంటే భయం లేదు!
ఇలా చేయాలి అలా చేయాలి అంటూ పని గట్టుకుని ఏదీ ప్లాన్ చేసుకునే అలవాటు లేదు నాకు. ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసెయ్యడమే. - నందినీరెడ్డి, దర్శకురాలు ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది నిజాయితీ. నచ్చనిది అబద్ధాలు చెప్పడం. మీలో మీకు నచ్చేది? నేనెప్పుడూ చాలా హ్యాపీగా ఉంటాను. ఎలాంటి టెన్షన్ పెట్టుకోను. అంతా మన మంచికే అనుకుంటాను. మీలో మీకు నచ్చనిది? బద్దకం. కాస్త ఎక్కువే ఉంది. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు? మా అమ్మ. ఎన్ని కష్టాలొచ్చినా ధైర్యం కోల్పోలేదు. ఎంత పెద్ద సమస్య అయినా, అందులోంచి పాజిటివ్ ఫలితాన్ని ఎలా రాబట్టాలా అని చూసేది. షి ఈజ్ మై ఇన్స్పిరేషన్! ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? ఎందుకుండవ్! అందరం తప్పులు చేస్తూనే ఉంటాం కదా! నేను కూడా చేశాను. కానీ వాటిని తలచుకుని బాధపడే తత్వం కాదు నాది. తప్పు చేస్తే దాన్నుంచి పాఠం నేర్చుకోవాలి తప్ప ఫీలవుతూ కూర్చోవడం నాకు నచ్చదు. అత్యంత సంతోషపడిన సందర్భం? చాలామంది అనుకుంటారు... ‘అలా మొదలైంది’ రిలీజైన రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైనదని చెబుతానేమో అని. కానీ చెప్పను. ఎందుకంటే, అది నా జీవితంలో ఓ ముఖ్యమైన సందర్భం తప్ప, అన్నిటికంటే సంతోషకరమైనదేమీ కాదు. స్కూల్, కాలేజీ రోజుల్లో అంతకన్నా ఆనందాన్ని పంచిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ హృదయం గాయపడిన సందర్భం? నన్ను అంత త్వరగా ఎవరూ హర్ట్ చేయలేరు. ఎందుకంటే, చిన్న వాటికే ఫీలైపోయే తత్వం కాదు నాది. కాకపోతే బాగా దగ్గరనుకున్నవాళ్లు నెగిటివ్‌గా మాట్లాడినప్పుడు మనసు చివుక్కుమంటుంది. చెప్పను కానీ అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకరకంగా అది మంచిదే. ఎందుకంటే, అప్పుడే మనవాళ్లెవరో బయటివాళ్లెవరో తెలుస్తుంది. ఆకలి విలువ తెలిసిన క్షణం? ఆ పరిస్థితి నాకెప్పుడూ లేదు. అదేంటో కానీ... ఎక్కడ ఎవరింట్లో ఉన్నా నాకు భోజనం క్షణాల్లో వచ్చేస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ ఎక్కడికైనా వెళ్తే చుట్టుపక్కల వాళ్లు ఎవరో ఒకరు భోజనం తెచ్చి పెట్టేసేవారు. ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద కోపమొచ్చినా దాన్ని ఇంటికొచ్చాక అమ్మ మీదనే చూపిస్తాను. పాపం మౌనంగా భరిస్తుంది. అందుకే తనకు క్షమాపణ చెప్పి తీరాలి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? నాకు ఎవరైనా వంట చేస్తుంటే చూడటం ఇష్టం. కానీ చేయడం మాత్రం ఇష్టం ఉండదు. తీరిక దొరికితే కుకరీ షోలు తెగ చూస్తుంటాను! మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం...? చిన్నప్పుడు దెయ్యాలంటే భయపడేదాన్ని. తర్వాత అది పోయింది. ఇప్పుడు పెద్దవాళ్లెవరికైనా ఒంట్లో బాగోకపోతే భయపడుతుంటాను... వాళ్లెక్కడ దూరమవుతారోనని! అబద్ధాలు చెబుతారా? భేషుగ్గా! ఇబ్బంది పెట్టే అబద్ధాలు కాదు, తప్పించుకునే అబద్ధాలు. ఫలానా టైముకి వస్తానని చెప్తాను. మావాళ్లు చూసి చూసి ఫోన్ చేస్తారు. వచ్చేశాను, మీ వీధి చివరే ఉన్నాను అంటాను. నిజానికి ఎక్కడో ఉంటాను. ఇలాంటివి బోలెడన్ని చెబుతాను. కానీ వాళ్లు కనిపెట్టేస్తారు. నా ఫ్రెండ్స్ అంటారు... అబద్ధం చెబితే నా ముక్కు ఎరుపెక్కుతుందని! మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి? నువ్వేంటో తెలుసుకో. నీ తప్పులు, ఒప్పులు ముందు బేరీజు వేసుకో. వాటిని సరిచేసుకుంటూ నిజాయితీగా ముందుకు సాగిపో. నిన్నెవరూ ఆపలేరు. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? ఒక ఓల్డేజ్ హోమ్ కట్టించాలని చిన్నప్పట్నుంచీ అనుకుంటున్నాను. అది ఎలాగైనా చేయాలి. దేవుడు మీకేదైనా ప్రత్యేక శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు? ఏ ఒక్కరూ ఆకలితో ఉండకుండా చూస్తాను. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? నాకు ఏ రోజైనా ఒకటే. ఇప్పుడెలా నా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో గడుపుతున్నానో ఆ రోజూ అలాగే గడుపుతాను. మరణానికి భయపడతారా? రెండుసార్లు చావు ముఖంలో ముఖంపెట్టి చూసొచ్చాను. చావంటే భయం లేదు నాకు! అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? నందిని కొన్ని చిరునవ్వులు పంచి వెళ్లిపోయిందని నా గురించి అందరూ చెప్పుకోవాలి. మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? డాల్ఫిన్‌గా పుడతాను. నాకు నీళ్లంటే ఇష్టం. నీటిలో ఉండే డాల్ఫిన్లంటే మరీ ఇష్టం. అవి చాలా సరదా జంతువులు. ఎప్పుడూ హ్యాపీగా ఉంటాయి. అందుకే నేనూ అలా పుడతా! - సమీర నేలపూడి -
మనోగళం: వచ్చే జన్మలో ఆవిడలా పుట్టాలి!
ఎదుటివాళ్లు మీ గురించి తప్పుగా అనుకునేది? నా పని నేను చేసుకుపోతాను తప్ప ఎవరి జోలికీ పోను. పైగా ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడేస్తాను. దాంతో కొందరు నాకు పొగరనుకుంటారు. అది నిజం కాదు. నాతో స్నేహం చేసిన వాళ్లను అడిగితే తెలుస్తుంది, నేనేంటో. ఒక్కసారి నాతో స్నేహం చేస్తే, నన్ను వదిలిపెట్టలేరు. ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది! నచ్చేది నిజాయితీ, పాజిటివ్ థింకింగ్. నచ్చనిది... మన ముందు మంచిగా మాట్లాడి, అటు వెళ్లగానే చెడుగా మాట్లాడే గుణం. అలాంటి వాళ్లను అస్సలు భరించలేను. మీలో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది ముక్కుసూటితనం. నచ్చనిది షార్ట్ టెంపర్. మీ ఊతపదం? ఆయ్, ఏమ్మా, అయ్యబాబోయ్... మద్రాస్ వెళ్లినా, హైదరాబాద్ వచ్చి సెటిలైనా... ఇవి నన్ను వదలడం లేదు. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు? నా భార్య అరుణ. చాలా సౌమ్యంగా ఉంటుంది. నేనేం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అంటూ ఆరాలు తీయదు. తన బాధ్యతలు తను సెలైంట్‌గా నెరవేరుస్తుంది. ఇలాక్కూడా ఉండవచ్చా అనిపిస్తుంది నాకు. చాలా ఇన్స్పైర్ అవుతుంటాను తనని చూసి. అత్యంత సంతోషపడిన సందర్భం? నా మొదటి సినిమా ‘కళ్లు’ ప్రివ్యూ చూడటం నా జీవితంలోనే గొప్ప సందర్భం. నన్ను నేను తెరమీద చూసుకున్నప్పుడు పడిన సంతోషం మాటల్లో చెప్పలేనిది. మీ హృదయం గాయపడిన సందర్భం? ఎందుకో తెలీదు కానీ... నా అనుకున్న వాళ్లు ఒకరితో ఎప్పుడు మాట్లాడినా సంభాషణ డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అది నా మనసును గాయపరుస్తూ ఉంటుంది. ఆకలి విలువ తెలిసిన క్షణం? కెరీర్ ప్రారంభంలో మద్రాస్‌లో ఉన్నప్పుడు ఆకలంటే ఏంటో తెలిసింది. అలాగని మరీ ఎక్కువ కష్టమేమీ పడలేదు. ఓసారి వారం పాటు వర్షం పడుతూనే ఉంది. మెస్ చాలా దూరం. వెళ్దామంటే జేబులో డబ్బుల్లేవు. రెండు మూడు రోజులు చాలా అవస్థ పడ్డాను. ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? తెలిసి నేనెవరినీ బాధపెట్టలేదు. కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉందనుకోను. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? పొద్దున్నే ఐదున్నరకు లేస్తాను. వాకింగుకి వెళ్దామని ట్రాక్ సూట్, షూస్ వేసుకుని రెడీ అయిపోతాను. తలుపు తీసి బయటకొస్తాను. పేపర్ కోసం చూస్తాను. అప్పటికింకా రాదు. ఏడున్నర వరకూ రాదని కూడా తెలుసు. అయినా పేపర్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంటాను. పేపర్ వచ్చాక చదువుతాను. మళ్లీ లోనికి వెళ్లి ట్రాక్‌సూట్, షూస్ తీసేసి పడుకుంటాను. అంత గొప్పగా ఉంటుంది నా వ్యాయామం! మిమ్మల్ని అత్యంత భయపెట్టే విషయం ఏమిటి? ప్రేమతో చేతులు కట్టేయడమంటారే... ఆ పరిస్థితి చాలా భయంగా ఉంటుంది. అటు నో అనలేం. ఇటు తేలిగ్గా ఎస్ అనీ అనలేం. అలాంటి ప్రేమకి తప్ప దేనికీ భయపడను. ఎలాంటి సమయాల్లో అబద్ధాలాడతారు? సాధారణంగా అబద్ధాలు చెప్పను, ఎవరినీ బాధపెట్టను. కానీ నా ఫ్రెండ్స్‌ని ఏడిపించడానికి ప్రాక్టికల్ జోక్స్ బాగా వేస్తాను. అవే నా అబద్ధాలు! మీరు నమ్మే సిద్ధాంతం ఏమిటి? ‘ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న’ అన్న మదర్ థెరిసా మాటలే నేను నమ్మే సిద్ధాంతం. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? వంద దేశాలు తిరగాలన్నది నా కల. ఓ అరవై తిరిగేశాను. ఇంకా నలభై ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయాలి. ఎలాంటి వాటికి ఖర్చు చేస్తారు? ఉపయోగం లేని వాటికి! అవసరం లేకపోయినా కంటికి నచ్చినదాన్ని కొనేస్తాను. అలా కొన్నవాటితో ఇంట్లోనే ఓ చిన్న మ్యూజియం పెట్టాను. (నవ్వుతూ) అందుకే నేనెక్కడికైనా వెళ్తుంటే మా ఆవిడ అంటుంది... దయచేసి శంఖాలు, ఫొటోఫ్రేముల్లాంటి అనవసర వస్తువులు కొనుక్కురాకండి అని. దేవుడు మీకేదైనా ప్రత్యేక శక్తినిస్తే... దానితో ఏం చేస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక అలాంటి శక్తి వస్తే... తెలుగువారంతా ఒక్కటిగా ఉండేలా చేస్తాను! ఎలాంటి ముగింపును కోరుకుంటారు? ఎవరికీ ఒక్క పైసా కూడా బాకీ ఉండకూడదు. ఎవరూ నన్ను తిట్టుకోకూడదు. అలాంటి పరిస్థితుల్లోనే నేను పోవాలి. మరో విషయం... (నవ్వుతూ) నాకో ఇద్దరు శత్రువులు ఉన్నారు. నాతోపాటు వాళ్లను కూడా తీసుకునే పోవాలి. అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? మంచి మనిషిగా! (నవ్వుతూ) అది అసాధ్యమని తెలుసనుకోండి. అయినా అదే నా కోరిక! మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? మదర్ థెరిసా పుట్టిన ఊరిలో, మదర్ థెరిసాలాగే పుట్టాలి. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి సేవ చేస్తూ బతికిందా దేవత. అంతకన్నా గొప్ప జన్మ ఏదైనా ఉంటుందా! - సమీర నేలపూడి -
రిలేషణం: అక్క నా బలం... నేను తన బలహీనత!
చిలిపి తగాదాలు, చిన్ని చిన్ని ఆనందాలు... అల్లరి చేష్టలు, ఆప్యాయతానురాగాలు... అన్నీ ఉన్నాయి తాప్సీ, షగున్ల జీవితంలో. వారిద్దరూ రక్తం పంచుకు పుట్టారు. అందుకేనేమో... సంతోషమైనా, విచారమైనా ఇద్దరూ కలసి పంచుకుంటారు. తమ అందమైన అనుబంధం గురించి, తనకన్నీ అయిన అక్కయ్య తాప్సీ గురించి... చెల్లెలు షగున్ పన్నూ ఇలా చెబుతున్నారు... అక్కకీ నాకూ నాలుగేళ్లు తేడా. అయితే అల్లరి చేయడంలో ఆ తేడా ఉండేది కాదు. ఇద్దరం పోటీపడి అల్లరి చేసేవాళ్లం. అలాగని ఇంట్లో ఫుల్లుగా ఫ్రీడమ్ ఉందనుకునేరు. నాన్న యమా స్ట్రిక్ట్. ఆయనకు అన్నీ పద్ధతిగా ఉండాలి. మేం క్రమశిక్షణతో మెలగాలి. లేదంటే అంతే సంగతులు. మేమేమో అలా ఉండే టైపు కాదు. కానీ నాన్నకు భయపడి ఆయన ఉన్నప్పుడు సెలైంట్‌గా ఉండేవాళ్లం. ఆయన లేనప్పుడు మాత్రం ఇల్లు పీకి పందిరేసేవాళ్లం. అప్పుడు నాకు ఏడేళ్లు. అక్కకీ నాకూ ఏదో తగాదా వచ్చింది. అంతే, అక్క కోపం పట్టలేక దేనితోనోగానీ కొట్టింది. కంటికి కాస్త దగ్గరగా చీరుకుపోయి రక్తం విపరీతంగా కారిపోసాగింది. అంతే, అమ్మానాన్నలు కంగారు పడిపోయారు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లిపోయారు. తర్వాత ఆ గాయం మానిపోయిందనుకోండి. అయితే, ఆ సంఘటన తరువాత అక్కలో చాలా మార్పు వచ్చింది. నన్నేమీ అనేది కాదు. నేను విసిగించినా మౌనంగానే ఉండేది. స్కూల్లో ఎవరైనా నన్ను ఏడిపించినా, కామెంట్ చేసినా విరుచుకుపడేది. మొదట్లో తెలియలేదు కానీ తర్వాత అర్థమైంది... నన్ను గాయపర్చినందుకు తనెంతో బాధపడిందని, అందుకే నాకెప్పుడూ ఏ బాధా కలుగకుండా చూసుకోవాలని అనుకుంటోందని! నేను ఎవరితోనూ అంతగా మాట్లాడేదాన్ని కాదు. ఎవరికీ త్వరగా దగ్గరయ్యేదాన్ని కూడా కాదు. కానీ అక్క అలా కాదు. ఎవరైనా చిన్న మాట మాట్లాడితే, తిరిగి తాను ఓ పేద్ద పేరాగ్రాఫంత మాట్లాడుతుంది. అందరితోనూ కలసిపోతుంది. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. కాకపోతే కాస్త పెంకిది. పడినా తనదే పై చేయి అంటుంది. అది కూడా నా విషయంలో మాత్రమే. తప్పు నాది కాదు తనదేనని తెలిసినా ఒప్పుకోదు. బాగా వాదిస్తుంది. నేను కాస్త బిక్కమొగం వేస్తే నవ్వేస్తుంది. చెప్పాలంటే, ఓ రకంగా నేనే తన బలహీనత! ఈ మధ్య నా పుట్టినరోజుకి నన్నో ఐల్యాండ్‌కి తీసుకెళ్లి డిన్నర్ ఇచ్చింది. అదో గొప్ప సర్ప్రైజ్ నాకు! అక్క సినిమాల్లోకి వస్తుందని అనుకోలేదు. నాన్న ఒప్పుకుంటారని కూడా అనుకోలేదు. కానీ తను అనుకున్నది సాధించింది. అంతేకాదు, నేను కోరుకున్న దారిలో నడవడానికి నాక్కూడా ఎంతో సాయం చేసింది. నేను డిగ్రీ అయ్యాక ఉద్యోగంలో చేరిపోవాలనుకున్నాను. కానీ నాన్న ససేమిరా అన్నారు. ఇంకా చదవమన్నారు. అప్పుడు అక్కే నాన్నను ఒప్పించింది. ఇప్పుడు నేను హైదరాబాద్‌లోని పీవీపీ సంస్థలో పని చేస్తున్నాను. నాకు నచ్చిన దారిలో సాగిపోతున్నాను. ఇదంతా అక్క వల్లనే. చాలామంది అడుగుతూ ఉంటారు, ‘మీ అక్కలాగా నటివవుతావా’ అని. నాకా ఉద్దేశం లేదు. తెర మీద కనిపించాలన్న ఆశ, ఆలోచన నాకెప్పుడూ లేవు. అయితే అక్కని తెరమీద చూసినప్పుడు మాత్రం చాలా మురిసిపోతుంటాను. ‘గుండెల్లో గోదారి’లో తన నటన, ‘మిస్టర్ పర్ఫెక్ట్’లోని తన రోల్ నాకు చాలా నచ్చాయి. తను ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలి. నేను తన చెల్లెల్ని అని చెప్పుకుని మురిసిపోవాలి. అదే నా కోరిక! తనేం కోరుకున్నా ఇస్తాను: తాప్సీ చిన్నప్పుడు మా చెల్లిని బాగా కొట్టేసేదాన్ని. కానీ ఓ సందర్భంలో అది తప్పని తెలుసుకున్నాను. అందుకే వీలైనంత వరకూ తనను కాచుకుని ఉంటాను. షగున్ చాలా నెమ్మదస్తురాలు. తన పనేంటో తను చేసుకుపోతుంది తప్ప మిగిలిన విషయాలు పట్టించుకోదు. అందుకే తనకి ఎలాంటి కష్టమూ రాకుండా చూసుకోవాలని ఆరాటపడుతుంటాను. తను ఏం కోరుకున్నా ఇవ్వడానికి ప్రయత్ని స్తాను. తను నటినవుతానన్నా ఆనందంగా ప్రోత్సహిస్తాను. ఎందుకంటే... తను కాస్త ఫీలయినా నేను తట్టుకోలేను! - సమీర నేలపూడి