మౌనం మన ఉద్యోగం కాదు
ఫిబ్రవరి 6, 2013... కోల్‌కతా. ట్రిబ్యునల్ కోర్టులో గంభీరమైన వాతావరణం నెలకొని ఉంది. దాదాపు పదేళ్లుగా సాగుతోన్న ఓ కేసు తీర్పు ఆ రోజు వెలువడనుంది. అందుకే అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కాసేపటికి జడ్జి పెదవి మెదిపారు. ‘‘కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట... రీనాముఖర్జీ మీద లైంగిక వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని నిర్థారణ అయ్యింది. తీసేసిన ఆమె ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వాలని, ఈ పదేళ్లలో ఆమెకు రావాల్సిన జీతం మొత్తాన్నీ ఆమెకు ఇవ్వాలని తీర్పు చెప్పడమైనది’’. తీర్పు వింటూనే రీనా ముఖం వెలిగిపోయింది.
కోల్‌కతాలోని ఓ ప్రముఖ సంస్థలో సీనియర్ ఉద్యోగిని రీనా. భర్త, బిడ్డతో సంతోషంగా గడిచిపోయే ఆమె జీవితంలోకి బాస్ రూపంలో దురదృష్టం ప్రవేశించింది. అతడు లైంగికంగా వేధించడమే కాక, ఎదురు తిరిగినందుకు ఆమెను మానసిక హింసకు గురిచేశాడు. పై అధికారులకు కంప్లయింట్ చేయబోతే... రీనా సరిగ్గా పనిచేయట్లేదని మందలించినందుకు తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తోందని నమ్మబలికాడు. రీనాని ఉద్యోగం నుంచి తీయించేశాడు. నాటినుంచి పదేళ్ల పాటు న్యాయ పోరాటం చేసింది రీనా. చివరకు విజయాన్ని సాధించింది.
అసలు లైంగిక వేధింపులంటే ఏమిటి? తన లైంగికేచ్ఛను ఓ వ్యక్తి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెలిబుచ్చడం, తన కోరిక తీర్చమని బలవంతపెట్టడం, కాదంటే మానసికంగా వేధించడం, తాకేందుకు ప్రయత్నించడం, సైగలు చేయడం, అసభ్యకరమైన చిత్రాలను చూపించడం, ద్వంద్వార్థాలతో మాట్లాడటం, ఒత్తిడికి తలవంచలేదన్న కసితో తక్కువ చేసి మాట్లాడటం... ఇవన్నీ లైంగిక వేధింపులే.
మన సమాజంలో రీనాలు చాలామందే ఉన్నారు. అయితే వాళ్లు రీనాలా వేధింపులకు గురి అవుతున్నారే తప్ప, ఆమెలా పోరాడట్లేదు. బంధువో, టీచరో, సహోద్యోగో-బాసో వేధిస్తున్నా నోరు మెదపట్లేదు. పరువు పోతుందనో, ఉద్యోగం పోతుందనో భయపడి మౌనంగా సహిస్తున్నారు. లేదంటే ఎందుకొచ్చిన గొడవ అని ఉద్యోగం మానేసి వెళ్లిపోతున్నారు. కొన్నిసార్లు ఏదో ఒక నిర్ణయం తీసుకునేలోపే, జరగరాని ఘోరం కూడా జరిగిపోతుంది. తర్వాత అవమానంతో ఆత్మహత్యలు, ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోవడాలు. ఏం తప్పు చేశామని మనకీ శిక్ష?
ఈ పరిస్థితి మారాలంటే... ముందు మహిళలు మారాలి. అతడి ధోరణి అభ్యంతరకరంగా మారినప్పుడు, నోరు తెరిచి అతడి దురుద్దేశ్యం గురించి అందరికీ చెప్పాలి. అతడు తెగించి మీ ఒంటి మీద చేయి వేయాలని ప్రయత్నించినప్పుడు, మీరు అతడి చేతికి బేడీలు వేయించాలి. ఇందుకోసమే ప్రభుత్వం ఓ చట్టాన్ని రూపొందించింది.
ఐపీసీ 354... ఇది మహిళలకు ఓ వరం. పని చేసేచోట గాని, మరే ఇతర ప్రదేశాల్లో కానీ ఏ మహిళ అయినా లైంగిక వేధింపులకు గురయితే... సమీప పోలీస్ స్టేషన్లో కానీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లో గానీ ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. ఒకవేళ వేధింపు ఆఫీసులో జరిగితే, దాని గురించి మీరెప్పుడైనా ఆ పై అధికారికి ఫిర్యాదు చేసి, అతడు పట్టించుకోకుండా ఉన్నట్లయితే... అతడి మీద కూడా ఐపీసీ 107 సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. తప్పు జరుగుతుందని తెలిసి కూడా పట్టించుకోనందుకు అతడికి సైతం శిక్ష పడుతుంది.
కాబట్టి పోలీస్ స్టేషన్‌కి వెళ్లడమంటేనే పెద్ద తప్పు అన్న భావన వీడండి. కేసు పెడితే పరువు పోతుందేమో, అల్లరవుతామేమో అన్న భయాన్ని విడిచిపెట్టండి. సహించింది చాలు. భరించింది చాలు. భయపడి పరుగులెత్తింది చాలు. మౌనంగా కుమిలిపోయింది చాలు. ఇప్పటికైనా గళం విప్పండి. స్వరం పెంచండి. అన్యాయాన్ని ప్రశ్నించండి. అక్రమాన్ని అడ్డుకోండి. చట్టం అండతో... మిమ్మల్ని మీరు కాపాడుకోండి!
- సమీర నేలపూడి
సాక్ష్యాలతో మరింత బలం...
లైంగిక వేధింపులకు గురవుతోన్న మహిళల్లో ఒకరిద్దరు కూడా సమస్యను పోలీసుల దృష్టికి తీసుకురావడం లేదు. అందుకు మొదటి కారణం... అసలు తమను కాపాడే చట్టమొకటి ఉందని తెలీక పోవడం. తెలిసినా... కేసు పెడితే.. అది తేలేసరికి ఎన్నేళ్లు పడుతుందో, కోర్టులచుట్టూ తిరగాల్సి వస్తుందేమోనన్న బెరుకు. అన్నిటికంటే ముఖ్యమైన సమస్య... సాక్ష్యాలు. ఒక మహిళ మీద వేధింపులు జరిగాయని నిరూపించాలంటే ఆ సంఘటనను చూసినవాళ్లెవరైనా సాక్ష్యం చెప్పాలి. వేధింపుల సమయంలో సదరు వ్యక్తి మాట్లాడిన మాటలు కానీ, చేతలు కానీ రికార్డు చేసి ఉండాలి. పై అధికారులకు కంప్లయింట్ చేసివుంటే, ఆ కంప్లయింట్ కాపీని జత చేయాలి. ఈ సాక్ష్యాలన్నీ మీ దగ్గర ఉంటే ధైర్యంగా కోర్టుకు వెళ్లండి. సమస్యను పరిష్కరించుకోండి.