tribunal court
-
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రవిప్రకాశ్!
సాక్షి, హైదరాబాద్: టీవీ9 యాజమాన్య బదిలీని నిలువరించేందుకు ప్రయత్నించిన కేసులో.. ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశే సూత్రధారనే అంశం తేలిపోయింది. సినీ నటుడు శివాజీకి తన షేర్లు కొన్ని విక్రయించినట్లుగా రవిప్రకాశ్ నకిలీ పత్రాలు సృష్టించిన వైనం బట్టబయలైంది. ఈ మొత్తం వ్యవహారాన్ని æతెరవెనక ఉండి నడిపింది రవిప్రకాశేనని సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో వెల్లడైంది. షేర్ల బదిలీ అంటూ కొత్త వ్యక్తి శివాజీని తెరపైకి తెచ్చిందీ.. పాత తేదీలతో పత్రాలు సృష్టించిన రవిప్రకాశ్ తనపైన తానే కేసు వేయించుకున్నారని స్పష్టమైంది. ఈ వ్యవహారం మొత్తానికి ప్రణాళిక రచించి, అమలు చేయడం, ఎవరేపనిచేయాలో నిర్దేశించడం వరకు అన్నీ రవిప్రకాశ్ కనుసన్నల్లోనే జరిగాయి. ఈ మేరకు రవిప్రకాశ్, శివాజీ, మాజీ ఉద్యోగుల మధ్య ఈ–మెయిల్ సంభాషణలను తెలంగాణ పోలీసులు వెలికి తీయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు ఏ క్షణాన్నైనా రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే అవకాశముందని సమాచారం. దీంతో కొంతకాలం క్రితం టీవీ9ని టేకోవర్ చేసిన అలందా మీడియా సంస్థ ఆరోపిస్తున్నట్టుగా ఈ వ్యవహారం మొత్తం నడిపిందీ రవిప్రకాశేనని తేటతెల్లమైంది. అసలేం జరిగింది? 2018 ఆగస్టులో టీవీ9 మాతృ సంస్థ ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి మేఘా ఇంజినీరింగ్స్, మైంహోమ్ గ్రూప్ సంయుక్త వెంచర్ టీవీ9 దాని అనుబంధ చానెళ్లను కొనుగోలు చేసింది. ఈ డీల్‌ను రవిప్రకాశ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. రవిప్రకాశ్, తన అనుచరులతో కలిపి 8.5% షేర్లను కలిగి ఉండటమే దీనికి కారణం. సంస్థ సీఈఓ కూడా కావడంతో రవిప్రకాష్ ఈ డీల్‌ను భగ్నం చేసేందుకు తనకున్న అన్ని అవకాశాలను వినియోగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతిచ్చినా.. కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమించేందుకు అభ్యంతరం చెప్పడం, సంస్థ కార్యదర్శి కౌశిక్‌రావు సంతకాన్ని ఫోర్జరీ చేయడం, శివాజీ అనే సినీనటుడిని తెరపైకి తీసుకవచ్చి రవిప్రకాశ్‌పై కేసు వేయడం అన్నింటిపైనా అలందా మీడియా మొదట నుంచి గుర్రుగానే ఉంది. దీంతో రవిప్రకాశ్ ఆగడాలకు కళ్లెం వేసేందుకు నిర్ణయించి ఫోర్జరీ, డేటాచౌర్యం, నిధుల మళ్లింపుపై సైబరాబాద్ పోలీసులకు కౌశిక్‌రావు ద్వారా ఫిర్యాదు చేయించింది. ఆ రోజు మాత్రం టీవీ9 స్టూడియోలో తానెక్కడీ పారిపోలేదని, తన వార్తలను తానే చదువుకున్న రవిప్రకాశ్ ఇప్పటివరకూ పరారీలోనే ఉండటం గమనార్హం. కుట్ర బయటపడిందిలా! తాను నిరపరాధినని రవిప్రకాశ్ పైకి చెబుతున్నా.. పోలీసుల విచారణకు హాజరుకాకపోవడంతో అతని తీరుపై అనుమానం పెరుగుతోంది. దీంతో కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. రవిప్రకాశ్, శివాజీ, మాజీ ఉద్యోగులు ఎంవీకేఎన్ మూర్తి, మరో అధికారి మూర్తి, న్యాయవాది శక్తి మధ్య సర్క్యులేట్ అయిన ఈ–మెయిల్స్ పోలీసుల చేతికి అందినట్లు ప్రచారం జరిగింది. ఈ ఆధారాలు దొరక్కుండా సర్వర్ల నుంచి ఈ–మెయిల్స్ సంభాషణను తొలగించినప్పటికీ పోలీసులు వాటిని తిరిగి సంపాదించారంటూ బుధవారం ఉదయం వార్తలొచ్చాయి. 2018 ఫిబ్రవరి 20న రవిప్రకాశ్ రూ.20 లక్షలకు 40వేల షేర్లు విక్రయించారంటూ ఆరోపిస్తూ సినీనటుడు శివాజీ నేషనల్ కంపెనీ లా ఆఫ్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందుకు ఆధారంగా చూపించిన డ్రాఫ్ట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 13న సృష్టించినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఆ ఈ–మెయిల్‌ను అదేరోజు సాయంత్రం 5.46 గంటలకు టీవీ9 మాజీ సీఎఫ్ఓ ఎంవీఎన్కే మూర్తికి, రవిప్రకాశ్‌కు, ఆయన సన్నిహితుడు హరికిషన్‌కు.. రవి లాయర్ శక్తి మెయిల్ చేశారని సమాచారం. ఈ డ్రాఫ్ట్ మాత్రం 2018 ఫిబ్రవరి 20 తేదీతో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఈ బృందం అందరి మధ్యా రాత్రి 9.35 గంటల వరకు పలు రకాల మెయిల్స్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. ఈ కేసు దాఖలు చేయడానికి అవసరమైన డ్రాఫ్ట్‌ను విజయవాడకు చెందిన ఓ లాయర్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 14న ఉదయం 5.38 గంటలకు ఆ పిటిషన్ కాపీని, మార్పులు చేర్పులు సరిచూసుకున్నాక ఉదయం 9గంటలకల్లా లాయర్ వద్దకు పంపాలని రవిప్రకాశ్ తన అనుచరులకు ఆదేశించారని.. పక్కా ఆధారాలు లభించిన తర్వాతే పోలీసులు ఈనెల 13న సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే పోలీసులు మాత్రం ఈ అంశాలను ధ్రువీకరించలేదు. రవిప్రకాశ్‌ను కచ్చితంగా అరెస్టు చేసే అవకాశాలు ఉండటంతో ఆయన నేటికీ పరారీలో ఉన్నారు. బుధవారం ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఏపీలో తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రవిప్రకాశ్ స్నేహితుడు, లాయర్ శక్తి, నటుడు శివాజీ కూడా పరారీలో ఉన్నారు. ట్రిబ్యునల్‌లోనూ దక్కని ఊరట టీవీ9 కొనుగోలు డీల్‌ని నిలిపివేయాలంటూ నటుడు శివాజీ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. శివాజీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇపుడు విచారణ జరపలేమని తేల్చిచెప్పింది. రవిప్రకాశ్ తనకు 40వేల షేర్లు విక్రయించానని చెప్పి మోసగించారని.. ఏబీసీఎల్ కంపెనీ యాజమాన్య మార్పుల విషయమై తనకు సమాచారం అందించలేనందున.. ఈ డీల్‌ను నిలిపివేయాలని కోరుతూ.. శివాజీ ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు టీవీ9 డైరెక్టర్ల పదవుల్లో నుంచి కొత్త యాజమాన్యం తమను తొలగించకుండా చూడడంతో పాటు, కొత్తవారిని విధులు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ రవిప్రకాశ్, ఆయన సన్నిహితులు కలిసి హైదరాబాద్‌లోని ఎన్సీఎల్టీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై కొత్త యాజమాన్యం అలందా మీడియా ఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా ఆఫ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన త్రిసభ్య ధర్మాసనం రవిప్రకాశ్ వేసిన పిటిషన్‌పై జూన్ 9 వరకు స్టే విధిస్తూ.. తీర్పునిచ్చింది. దీంతో ఇదేరోజు హైదరాబాద్‌లోని ఎన్సీఎల్ఏటీ ధర్మాసనం కూడా రవిప్రకాశ్ వాజ్యంపై విచారణను వాయిదా వేసింది. ఎన్సీఎల్ఏటీ తరువాత ప్రొసీడింగ్స్ వచ్చేవరకు అంటే జూన్ 12 వరకు కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రవిప్రకాశ్ వెనక పెద్ద తలలు తానెక్కడికి పారిపోలేదని ప్రకటనలు ఇచ్చిన రవిప్రకాశ్ తాజాగా గురువారం సైబరాబాద్ పోలీసులకు ఓ సందేశం పంపినట్లు సమాచారం. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత గడువు కావాలని, ఈ–మెయిల్ పంపినట్లు వార్తలొచ్చినా.. పోలీసులు వీటిని ధ్రువీకరించడం లేదు. వాస్తవానికి రవిప్రకాశ్ ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అతని వెనక ఏపీలోని అధికార పార్టీకి చెందిన పలువురు పెద్దతలల అండ ఉందని, వారి సాయంతోనే రవిప్రకాశ్ అక్కడ తలదాచుకుంటున్నాడని సమాచారం. దీనికితోడు రవిప్రకాశ్, అతని సన్నిహితులు టీవీ9 నుంచి నిధులను ఇతర మార్గాల్లో మళ్లించాడన్న ఆరోపణల్లో రవిప్రకాశ్ సన్నిహితుడు హరికిషన్‌పై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. -
27న ఎండోమెంట్ ట్రిబ్యునల్
కర్నూలు(న్యూసిటీ) : దేవాదాయ ధర్మాదాయ శాఖ ట్రిబ్యునల్ కోర్టును ఈనెల 27 ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అతిథిగృహంలో నిర్వహిస్తామని ఆ శాఖ సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. కార్యక్రమానికి జస్టిస్ రమణ ముఖ్యతిథిగా విచ్చేస్తారన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములు, అర్చకులు, అధికారుల సమస్యలపై విచారణ జరుగుతుందన్నారు. కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల పరిధిలోని కక్షిదారులు హాజరై సమస్యలు కోర్టు దృష్టికి తేవాలని కోరారు. -
ఇదేం ‘పంచాయతీ’
ఇందూరు, న్యూస్‌లైన్: జిల్లాలో 29 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయడానికి 2013 డిసెంబర్ మెదటి వారంలో అధికారులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర కేటగిరీల అభ్యర్థులు మొత్తం 5,500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. నిరుద్యోగ అభ్యర్థులతో పాటు పని చేస్తున్న కాంట్రాక్టు కార్యదర్శులు కూడా ఇం దులో దరఖాస్తు చేసుకోవాలని, సర్వీసును గుర్తించి డిగ్రీ మార్కులే కాకుండా 25 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, తమను రెగ్యులర్ చేస్తానని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇపుడు అన్యాయం చేస్తోందంటూ జిల్లాలో పనిచేస్తున్న సుమారు 24 మంది కాంట్రాక్టు కార్యదర్శులు డిసెంబర్ 10న ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని, వారు పని చేస్తున్న పోస్టులను భర్తీ చేయకూడదని ట్రిబ్యునల్ జనవరి మొదటి వారం లో తీర్చు నిచ్చింది. కాంట్రాక్టు కార్యదర్శులుగా పని చేస్తున్న వారిలో ఇంటర్ అర్హత ఉంటే వారికి డిగ్రీ పూర్తి చేసే వరకు సమయాన్ని ఇచ్చి, ఆ తరువాత వారిని రెగ్యులర్ చేస్తూ నియమక పత్రాలు ఇవ్వాల ని సూచించింది. ఈ తీర్పు కాంట్రాక్టు కార్యదర్శులకు అనుకూలంగానే ఉన్నప్పటికీ 29 పోస్టుల భర్తీకి అధికారులు జారీ చేసిన నోటిపికేషన్ విషయంలో ఏం చేయాలో ట్రిబ్యునల్ ఎలాంటి స్పష్టత ఇవ్వలే దు. దీంతో జిల్లా పంచాయతీ అధికారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది. అయితే ట్రిబ్యునల్ ఉత్తర్వులు తమకు ఇంకా చేరలేదని చెబుతున్నారు. దరఖాస్తులు చేసుకున్నవారి పరిస్థితేంది ట్రిబ్యునల్ కాంట్రాక్టు కార్యదర్శులకు అనుకూలం గా ఇవ్వడంతో.. 29 పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న నిరుద్యోగుల పరిస్థితి అయోమయంగా మా రింది. దూర ప్రాంతాల నుంచి ప్రయాణ ఖర్చులు పెట్టుకుని జిల్లా కేంద్రానికి వచ్చి ఎంతో ఆశతో దరఖాస్తులు చేసుకున్నారు. బీసీలు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.50 డీడీ కూడా కట్టారు. ఈ మొత్తం నిధులు రూ.2లక్షలకు పైగా డీపీఓ ఖాతాలో జమ అయ్యాయి. ఉచితంగా దరఖాస్తులు చేసుకున్న వారేమేగాని,డబ్బులు ఖర్చు చేసి దరఖాస్తు చేసుకున్న వారినుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నా యి. ఈ తికమకపై పంచాయతీ అధికారులు జిల్లా కలెక్టర్‌తో లేదా ప్రభుత్వంతో చర్చించనున్నారు. స్పష్టత వచ్చే వరకు భర్తీ చేయం - సురేశ్‌బాబు, జిల్లా పంచాయతీ అధికారి ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పు కాంట్రాక్టు కార్యదర్శులకు అనుకూలంగా ఉంది. కాని 29 పోస్టుల భర్తీకి మేం ఇచ్చిన నోటిఫికేషన్, పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల విషయంలో ఏం చేయాలని కోర్టు సూచించిందో తెలియదు. ఉత్తర్వులను పరిశీలించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అప్పటి వరకు కాంట్రాక్టు కార్యదర్శులను రెగ్యులర్ గాని, పోస్టుల భర్తీ గాని చేయబోం. -
కోర్టు కొలువుల పేరుతో కుచ్చుటోపీ
హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తానంటూ ఓ కేటుగాడు నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టాడు. సుమారు 25 మంది నుంచి భారీగా డబ్బు వసూలు చేసి నకిలీ జాయినింగ్ ఆర్డర్ కాపీలిచ్చి పరారయ్యాడు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ రంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 2010లో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కోర్టు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించగా, 2011లో ఫలితాలు వెలువడ్డాయి. ఈ సమయలో ఉత్తీర్ణత కాని అభ్యర్థుల జాబితాను తీసుకున్న ఓ వ్యక్తి 25 మందికి ఉద్యోగం ఇప్పించేందుకు రూ. 50 వేలకు బేరం కుదుర్చుకొని ముందస్తుగా రూ. 25 వేల చొప్పున వసూలు చేశాడు. ఇందులో 15 మంది గురువారం పురానీహవేళీలోని ట్రిబ్యూనల్ కోర్టులో ఉద్యోగంలో చేరేందుకై జాయినింగ్ ఆర్డర్ కాపీతో వచ్చారు. ఈ ఆర్డర్ కాపీలను గమనించిన కోర్టు రిజిస్ట్రార్ చలపతి రావు నకిలీవని గుర్తించి డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
మౌనం మన ఉద్యోగం కాదు
ఫిబ్రవరి 6, 2013... కోల్‌కతా. ట్రిబ్యునల్ కోర్టులో గంభీరమైన వాతావరణం నెలకొని ఉంది. దాదాపు పదేళ్లుగా సాగుతోన్న ఓ కేసు తీర్పు ఆ రోజు వెలువడనుంది. అందుకే అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. కాసేపటికి జడ్జి పెదవి మెదిపారు. ‘‘కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట... రీనాముఖర్జీ మీద లైంగిక వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని నిర్థారణ అయ్యింది. తీసేసిన ఆమె ఉద్యోగాన్ని తిరిగి ఇవ్వాలని, ఈ పదేళ్లలో ఆమెకు రావాల్సిన జీతం మొత్తాన్నీ ఆమెకు ఇవ్వాలని తీర్పు చెప్పడమైనది’’. తీర్పు వింటూనే రీనా ముఖం వెలిగిపోయింది. కోల్‌కతాలోని ఓ ప్రముఖ సంస్థలో సీనియర్ ఉద్యోగిని రీనా. భర్త, బిడ్డతో సంతోషంగా గడిచిపోయే ఆమె జీవితంలోకి బాస్ రూపంలో దురదృష్టం ప్రవేశించింది. అతడు లైంగికంగా వేధించడమే కాక, ఎదురు తిరిగినందుకు ఆమెను మానసిక హింసకు గురిచేశాడు. పై అధికారులకు కంప్లయింట్ చేయబోతే... రీనా సరిగ్గా పనిచేయట్లేదని మందలించినందుకు తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తోందని నమ్మబలికాడు. రీనాని ఉద్యోగం నుంచి తీయించేశాడు. నాటినుంచి పదేళ్ల పాటు న్యాయ పోరాటం చేసింది రీనా. చివరకు విజయాన్ని సాధించింది. అసలు లైంగిక వేధింపులంటే ఏమిటి? తన లైంగికేచ్ఛను ఓ వ్యక్తి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెలిబుచ్చడం, తన కోరిక తీర్చమని బలవంతపెట్టడం, కాదంటే మానసికంగా వేధించడం, తాకేందుకు ప్రయత్నించడం, సైగలు చేయడం, అసభ్యకరమైన చిత్రాలను చూపించడం, ద్వంద్వార్థాలతో మాట్లాడటం, ఒత్తిడికి తలవంచలేదన్న కసితో తక్కువ చేసి మాట్లాడటం... ఇవన్నీ లైంగిక వేధింపులే. మన సమాజంలో రీనాలు చాలామందే ఉన్నారు. అయితే వాళ్లు రీనాలా వేధింపులకు గురి అవుతున్నారే తప్ప, ఆమెలా పోరాడట్లేదు. బంధువో, టీచరో, సహోద్యోగో-బాసో వేధిస్తున్నా నోరు మెదపట్లేదు. పరువు పోతుందనో, ఉద్యోగం పోతుందనో భయపడి మౌనంగా సహిస్తున్నారు. లేదంటే ఎందుకొచ్చిన గొడవ అని ఉద్యోగం మానేసి వెళ్లిపోతున్నారు. కొన్నిసార్లు ఏదో ఒక నిర్ణయం తీసుకునేలోపే, జరగరాని ఘోరం కూడా జరిగిపోతుంది. తర్వాత అవమానంతో ఆత్మహత్యలు, ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోవడాలు. ఏం తప్పు చేశామని మనకీ శిక్ష? ఈ పరిస్థితి మారాలంటే... ముందు మహిళలు మారాలి. అతడి ధోరణి అభ్యంతరకరంగా మారినప్పుడు, నోరు తెరిచి అతడి దురుద్దేశ్యం గురించి అందరికీ చెప్పాలి. అతడు తెగించి మీ ఒంటి మీద చేయి వేయాలని ప్రయత్నించినప్పుడు, మీరు అతడి చేతికి బేడీలు వేయించాలి. ఇందుకోసమే ప్రభుత్వం ఓ చట్టాన్ని రూపొందించింది. ఐపీసీ 354... ఇది మహిళలకు ఓ వరం. పని చేసేచోట గాని, మరే ఇతర ప్రదేశాల్లో కానీ ఏ మహిళ అయినా లైంగిక వేధింపులకు గురయితే... సమీప పోలీస్ స్టేషన్లో కానీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో గానీ ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. ఒకవేళ వేధింపు ఆఫీసులో జరిగితే, దాని గురించి మీరెప్పుడైనా ఆ పై అధికారికి ఫిర్యాదు చేసి, అతడు పట్టించుకోకుండా ఉన్నట్లయితే... అతడి మీద కూడా ఐపీసీ 107 సెక్షన్ కింద కేసు నమోదు చేయవచ్చు. తప్పు జరుగుతుందని తెలిసి కూడా పట్టించుకోనందుకు అతడికి సైతం శిక్ష పడుతుంది. కాబట్టి పోలీస్ స్టేషన్‌కి వెళ్లడమంటేనే పెద్ద తప్పు అన్న భావన వీడండి. కేసు పెడితే పరువు పోతుందేమో, అల్లరవుతామేమో అన్న భయాన్ని విడిచిపెట్టండి. సహించింది చాలు. భరించింది చాలు. భయపడి పరుగులెత్తింది చాలు. మౌనంగా కుమిలిపోయింది చాలు. ఇప్పటికైనా గళం విప్పండి. స్వరం పెంచండి. అన్యాయాన్ని ప్రశ్నించండి. అక్రమాన్ని అడ్డుకోండి. చట్టం అండతో... మిమ్మల్ని మీరు కాపాడుకోండి! - సమీర నేలపూడి సాక్ష్యాలతో మరింత బలం... లైంగిక వేధింపులకు గురవుతోన్న మహిళల్లో ఒకరిద్దరు కూడా సమస్యను పోలీసుల దృష్టికి తీసుకురావడం లేదు. అందుకు మొదటి కారణం... అసలు తమను కాపాడే చట్టమొకటి ఉందని తెలీక పోవడం. తెలిసినా... కేసు పెడితే.. అది తేలేసరికి ఎన్నేళ్లు పడుతుందో, కోర్టులచుట్టూ తిరగాల్సి వస్తుందేమోనన్న బెరుకు. అన్నిటికంటే ముఖ్యమైన సమస్య... సాక్ష్యాలు. ఒక మహిళ మీద వేధింపులు జరిగాయని నిరూపించాలంటే ఆ సంఘటనను చూసినవాళ్లెవరైనా సాక్ష్యం చెప్పాలి. వేధింపుల సమయంలో సదరు వ్యక్తి మాట్లాడిన మాటలు కానీ, చేతలు కానీ రికార్డు చేసి ఉండాలి. పై అధికారులకు కంప్లయింట్ చేసివుంటే, ఆ కంప్లయింట్ కాపీని జత చేయాలి. ఈ సాక్ష్యాలన్నీ మీ దగ్గర ఉంటే ధైర్యంగా కోర్టుకు వెళ్లండి. సమస్యను పరిష్కరించుకోండి.