సాక్షి, హైదరాబాద్: టీవీ9 యాజమాన్య బదిలీని నిలువరించేందుకు ప్రయత్నించిన కేసులో.. ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశే సూత్రధారనే అంశం తేలిపోయింది. సినీ నటుడు శివాజీకి తన షేర్లు కొన్ని విక్రయించినట్లుగా రవిప్రకాశ్ నకిలీ పత్రాలు సృష్టించిన వైనం బట్టబయలైంది. ఈ మొత్తం వ్యవహారాన్ని æతెరవెనక ఉండి నడిపింది రవిప్రకాశేనని సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో వెల్లడైంది. షేర్ల బదిలీ అంటూ కొత్త వ్యక్తి శివాజీని తెరపైకి తెచ్చిందీ.. పాత తేదీలతో పత్రాలు సృష్టించిన రవిప్రకాశ్ తనపైన తానే కేసు వేయించుకున్నారని స్పష్టమైంది. ఈ వ్యవహారం మొత్తానికి ప్రణాళిక రచించి, అమలు చేయడం, ఎవరేపనిచేయాలో నిర్దేశించడం వరకు అన్నీ రవిప్రకాశ్ కనుసన్నల్లోనే జరిగాయి. ఈ మేరకు రవిప్రకాశ్, శివాజీ, మాజీ ఉద్యోగుల మధ్య ఈ–మెయిల్ సంభాషణలను తెలంగాణ పోలీసులు వెలికి తీయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు ఏ క్షణాన్నైనా రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే అవకాశముందని సమాచారం. దీంతో కొంతకాలం క్రితం టీవీ9ని టేకోవర్ చేసిన అలందా మీడియా సంస్థ ఆరోపిస్తున్నట్టుగా ఈ వ్యవహారం మొత్తం నడిపిందీ రవిప్రకాశేనని తేటతెల్లమైంది.
అసలేం జరిగింది?
2018 ఆగస్టులో టీవీ9 మాతృ సంస్థ ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి మేఘా ఇంజినీరింగ్స్, మైంహోమ్ గ్రూప్ సంయుక్త వెంచర్ టీవీ9 దాని అనుబంధ చానెళ్లను కొనుగోలు చేసింది. ఈ డీల్‌ను రవిప్రకాశ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. రవిప్రకాశ్, తన అనుచరులతో కలిపి 8.5% షేర్లను కలిగి ఉండటమే దీనికి కారణం. సంస్థ సీఈఓ కూడా కావడంతో రవిప్రకాష్ ఈ డీల్‌ను భగ్నం చేసేందుకు తనకున్న అన్ని అవకాశాలను వినియోగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతిచ్చినా.. కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమించేందుకు అభ్యంతరం చెప్పడం, సంస్థ కార్యదర్శి కౌశిక్‌రావు సంతకాన్ని ఫోర్జరీ చేయడం, శివాజీ అనే సినీనటుడిని తెరపైకి తీసుకవచ్చి రవిప్రకాశ్‌పై కేసు వేయడం అన్నింటిపైనా అలందా మీడియా మొదట నుంచి గుర్రుగానే ఉంది. దీంతో రవిప్రకాశ్ ఆగడాలకు కళ్లెం వేసేందుకు నిర్ణయించి ఫోర్జరీ, డేటాచౌర్యం, నిధుల మళ్లింపుపై సైబరాబాద్ పోలీసులకు కౌశిక్‌రావు ద్వారా ఫిర్యాదు చేయించింది. ఆ రోజు మాత్రం టీవీ9 స్టూడియోలో తానెక్కడీ పారిపోలేదని, తన వార్తలను తానే చదువుకున్న రవిప్రకాశ్ ఇప్పటివరకూ పరారీలోనే ఉండటం గమనార్హం.
కుట్ర బయటపడిందిలా!
తాను నిరపరాధినని రవిప్రకాశ్ పైకి చెబుతున్నా.. పోలీసుల విచారణకు హాజరుకాకపోవడంతో అతని తీరుపై అనుమానం పెరుగుతోంది. దీంతో కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. రవిప్రకాశ్, శివాజీ, మాజీ ఉద్యోగులు ఎంవీకేఎన్ మూర్తి, మరో అధికారి మూర్తి, న్యాయవాది శక్తి మధ్య సర్క్యులేట్ అయిన ఈ–మెయిల్స్ పోలీసుల చేతికి అందినట్లు ప్రచారం జరిగింది. ఈ ఆధారాలు దొరక్కుండా సర్వర్ల నుంచి ఈ–మెయిల్స్ సంభాషణను తొలగించినప్పటికీ పోలీసులు వాటిని తిరిగి సంపాదించారంటూ బుధవారం ఉదయం వార్తలొచ్చాయి. 2018 ఫిబ్రవరి 20న రవిప్రకాశ్ రూ.20 లక్షలకు 40వేల షేర్లు విక్రయించారంటూ ఆరోపిస్తూ సినీనటుడు శివాజీ నేషనల్ కంపెనీ లా ఆఫ్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందుకు ఆధారంగా చూపించిన డ్రాఫ్ట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 13న సృష్టించినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.
ఆ ఈ–మెయిల్‌ను అదేరోజు సాయంత్రం 5.46 గంటలకు టీవీ9 మాజీ సీఎఫ్‌ఓ ఎంవీఎన్‌కే మూర్తికి, రవిప్రకాశ్‌కు, ఆయన సన్నిహితుడు హరికిషన్‌కు.. రవి లాయర్ శక్తి మెయిల్ చేశారని సమాచారం. ఈ డ్రాఫ్ట్ మాత్రం 2018 ఫిబ్రవరి 20 తేదీతో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఈ బృందం అందరి మధ్యా రాత్రి 9.35 గంటల వరకు పలు రకాల మెయిల్స్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. ఈ కేసు దాఖలు చేయడానికి అవసరమైన డ్రాఫ్ట్‌ను విజయవాడకు చెందిన ఓ లాయర్ రూపొందించినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 14న ఉదయం 5.38 గంటలకు ఆ పిటిషన్ కాపీని, మార్పులు చేర్పులు సరిచూసుకున్నాక ఉదయం 9గంటలకల్లా లాయర్ వద్దకు పంపాలని రవిప్రకాశ్ తన అనుచరులకు ఆదేశించారని.. పక్కా ఆధారాలు లభించిన తర్వాతే పోలీసులు ఈనెల 13న సీఆర్‌పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే పోలీసులు మాత్రం ఈ అంశాలను ధ్రువీకరించలేదు. రవిప్రకాశ్‌ను కచ్చితంగా అరెస్టు చేసే అవకాశాలు ఉండటంతో ఆయన నేటికీ పరారీలో ఉన్నారు. బుధవారం ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఏపీలో తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రవిప్రకాశ్ స్నేహితుడు, లాయర్ శక్తి, నటుడు శివాజీ కూడా పరారీలో ఉన్నారు.
ట్రిబ్యునల్‌లోనూ దక్కని ఊరట
టీవీ9 కొనుగోలు డీల్‌ని నిలిపివేయాలంటూ నటుడు శివాజీ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. శివాజీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇపుడు విచారణ జరపలేమని తేల్చిచెప్పింది. రవిప్రకాశ్ తనకు 40వేల షేర్లు విక్రయించానని చెప్పి మోసగించారని.. ఏబీసీఎల్ కంపెనీ యాజమాన్య మార్పుల విషయమై తనకు సమాచారం అందించలేనందున.. ఈ డీల్‌ను నిలిపివేయాలని కోరుతూ.. శివాజీ ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు టీవీ9 డైరెక్టర్ల పదవుల్లో నుంచి కొత్త యాజమాన్యం తమను తొలగించకుండా చూడడంతో పాటు, కొత్తవారిని విధులు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ రవిప్రకాశ్, ఆయన సన్నిహితులు కలిసి హైదరాబాద్‌లోని ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై కొత్త యాజమాన్యం అలందా మీడియా ఢిల్లీలోని నేషనల్ కంపెనీ లా ఆఫ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించింది. దీన్ని విచారించిన త్రిసభ్య ధర్మాసనం రవిప్రకాశ్ వేసిన పిటిషన్‌పై జూన్ 9 వరకు స్టే విధిస్తూ.. తీర్పునిచ్చింది. దీంతో ఇదేరోజు హైదరాబాద్‌లోని ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం కూడా రవిప్రకాశ్ వాజ్యంపై విచారణను వాయిదా వేసింది. ఎన్‌సీఎల్‌ఏటీ తరువాత ప్రొసీడింగ్స్ వచ్చేవరకు అంటే జూన్ 12 వరకు కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
రవిప్రకాశ్ వెనక పెద్ద తలలు
తానెక్కడికి పారిపోలేదని ప్రకటనలు ఇచ్చిన రవిప్రకాశ్ తాజాగా గురువారం సైబరాబాద్ పోలీసులకు ఓ సందేశం పంపినట్లు సమాచారం. విచారణకు హాజరయ్యేందుకు తనకు మరింత గడువు కావాలని, ఈ–మెయిల్ పంపినట్లు వార్తలొచ్చినా.. పోలీసులు వీటిని ధ్రువీకరించడం లేదు. వాస్తవానికి రవిప్రకాశ్ ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అతని వెనక ఏపీలోని అధికార పార్టీకి చెందిన పలువురు పెద్దతలల అండ ఉందని, వారి సాయంతోనే రవిప్రకాశ్ అక్కడ తలదాచుకుంటున్నాడని సమాచారం. దీనికితోడు రవిప్రకాశ్, అతని సన్నిహితులు టీవీ9 నుంచి నిధులను ఇతర మార్గాల్లో మళ్లించాడన్న ఆరోపణల్లో రవిప్రకాశ్ సన్నిహితుడు హరికిషన్‌పై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment