![Donald Trump Sanctions International Criminal Court](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/donaldtrump.jpg.webp?itok=oDhFMjdK)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)పై ఆంక్షలు విధించారు. ఐసీసీ అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో పాటు కోర్టు దర్యాప్తులకు సహకరించారని తేలితే వారి ఆస్తుల్ని స్తంభింప చేయడంతో పాటు వారి ప్రయాణాలపై నిషేధం విధించారు.
అమెరికా, తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ లక్ష్యంగా ఐసీసీ నిరాధారమైన దర్యాప్తులు చేస్తున్నందుకు గాను ట్రంప్ చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా గురువారం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.
ట్రంప్‌తో నెతన్యాహు భేటీ
మంగళవారం ట్రంప్‌తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ జారీ చేశారు. ఆ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్‌లో నెదర్లాండ్‌లోని హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. అందుకే చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా సర్వీస్ సభ్యులపై, గాజాలో ఇజ్రాయెల్ దళాలు చేసిన యుద్ధ నేరాలపై ఐసీసీ దర్యాప్తుల్ని ప్రస్తావించారు. మాపై, మా మిత్రదేశం ఇజ్రాయెల్‌పై ఐసీసీ చట్టవిరుద్ధమైన, నిరాధారమైన చర్యలకు పాల్పడిందని ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు.
నెతన్యాహుపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ
నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) గతేడాది అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాజీ మంత్రి యోవ్ గల్లాంట్‌తోపాటు పలువురు హమాస్ నేతలపైనా వారెంట్లు జారీ చేసింది. బెంజమిన్, గల్లాంట్ గాజాలో మారణహోమం సాగించారని, మానవత్వంతో దాడి చేశారని ఐసీసీ ఆక్షేపించింది. హత్యలు చేయడం, సాధారణ ప్రజలను వేధించడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది.
గాజాలో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు, విద్యుత్, ఇంధనం, ఇతర నిత్యావసరాలు అందకుండా ఆంక్షలు విధించారని, అమాయకుల మరణానికి కారకులయ్యారని మండిపడింది. నెతన్యాహు, గల్లాంట్ చర్యల వల్ల ఎంతోమంది మహిళలు, చిన్నారులు బలయ్యారని ఉద్ఘాటించింది. పౌష్టికాహారం, నీరు అందక, డీహైడ్రేషన్‌తో పసిబిడ్డలు మరణించారని పేర్కొంది.
నెతన్యాహు, గల్లాంట్ ఉద్దేశపూర్వకంగానే సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసినట్లు చెప్పడానికి సహేతుకమైన ఆధారాలను గుర్తించామని వివరించింది. గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభానికి నెతన్యాహు, గల్లాంట్ బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. యుద్ధ నేరాల్లో నెతన్యాహు నిందితుడని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment