టీవీ, సినిమా రంగంలో ఉన్నవాళ్లు డిప్లొమేటిగ్గా మాట్లాడతారని అంటారంతా. కానీ సత్తెన్నను చూస్తే అది నిజం కాదని పిస్తుంది. తెరమీద కామెడీ చేసి కడుపుబ్బ నవ్వించే ఆయన... నిజానికి చాలా సీరియస్ మనిషి. ముక్కుసూటిగా మాట్లాడ తారు. అనుకున్న దారిలో మొండిగా సాగిపోతారు. తన ప్లస్సు, మైనస్సు కూడా అదేననే సత్తెన్న మనసులోని మాటలు...
సత్తెన్న... మీ అసలు పేరు అదేనా?
కాదు. నా అసలు పేరు సతీష్ కుమార్. ‘నైజాం బాబులు’ ప్రోగ్రామ్ కోసం పేరు మార్చారు.
అసలు ఈ ఫీల్డ్‌కి ఎలా వచ్చారు?
పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లో. డిగ్రీ అయ్యాక ఉద్యోగం చేస్తూ మల్టీమీడియా కోర్సు చేశాను. ఓ కంపెనీ కూడా పెట్టాను కానీ నష్టపోయాను. తర్వాత మరో కంపెనీలో చేరాను. అక్కడ నాకు మా బాస్ మరదలు అనూరాధ పరిచయమయ్యారు. ఆవిడ జెమినీ చానెల్లో పని చేసేవారు. ఆవిడ ద్వారానే నేను టెలివిజన్ రంగంలో అడుగుపెట్టాను.
అంటే... ఈ ఫీల్డ్ పట్ల మీకు మొదటి నుంచీ ఆసక్తి ఉందా?
లేదు. నేను పని చేస్తున్న కంపెనీ మూతబడటంతో మళ్లీ ఉద్యోగ వేటలో పడ్డాను. కానీ ఎక్కడా నాకు తగిన ఉద్యోగం దొరకలేదు. దాంతో అనూరాధగారి ద్వారా పరిచయమైన నిర్మాత జీకే మోహన్‌ని కలిశాను. ఏదైనా ఉద్యోగం చూడమంటే... ఆయన నన్ను తన టీమ్‌లో పెట్టుకున్నారు. జోగి బ్రదర్స్ ప్రోగ్రామ్‌లాంటిదే మరో ప్రోగ్రామ్ చేయాలని నైజాంబాబులు మొదలుపెట్టారు. నేను తెలంగాణ యాస బాగా మాట్లాడతానని సత్తెన్నగా తీసుకున్నారు.
తర్వాత ఇందులోనే ఉండాలని డిసైడైపోయారా?
అవును. నిజానికి మొదట్లో ఎడిటింగ్ దగ్గర్నుంచి అన్ని డిపార్ట్‌మెంట్లూ ట్రై చేశాను. కానీ సక్సెస్ కాలేదు. ఎప్పుడైతే నైజాంబాబులుతో పేరొచ్చిందో ఇక యాంకర్‌గా సెటిలైపోవాలని నిర్ణయించుకున్నాను. 1999 నుంచి ఇప్పటి వరకూ చేస్తూనే ఉన్నాను. తెలుగు టెలివిజన్ రంగంలో ఇన్నేళ్లపాటు బ్రేక్ లేకుండా యాంకరింగ్ చేస్తోన్న మగ యాంకర్‌ని నేనొక్కడినే. కానీ ఇప్పుడిప్పుడే కాస్త ఒడిదుడుకులు వస్తున్నాయి.
ఎందుకని?
కొత్తవాళ్లు ఎక్కువగా వస్తున్నారు. మేం సీనియర్లం కాబట్టి ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలి. కొత్తవాళ్లయితే తక్కువకే చేసేస్తారు. అందుకని వాళ్లను ఎంచుకుంటారు. ఇంకో సమస్య కూడా ఉంది. డెరైక్టర్స్ కూడా కొత్తవాళ్లు వస్తున్నారు. వాళ్లేదో చెబుతారు. అది కరెక్ట్‌గా అనిపించదు. అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అంటాను. అంతే... వాళ్ల ఇగో హర్ట్ అవుతుంది. నన్ను తీసేసి వేరేవాళ్లని పెట్టుకుంటారు.
మరి డెరైక్టర్ చెప్పినట్టు చేయాలి కదా?
చేయాలి. కానీ తప్పులు చెబుతుంటే ఎలా చేస్తాం? నేనో ప్రోగ్రామ్ చేస్తే, అన్నీ తెలుసుకునే చేస్తాను. సమాజంలో ఏం జరుగుతోంది, రాజకీయాలు, సినిమాలు.. ఇలా అన్ని విషయాల మీద ఎప్పటికప్పుడు అవగాహన తెచ్చుకుని కొత్త కొత్త అప్‌డేట్స్ ఇస్తుంటాను. అది నా ప్రత్యేకత. అవతలివాళ్లు చెప్పేది బాగోదని తెలిసి కూడా గుడ్డిగా చేయమంటే నావల్ల కాదు.
ఇలా మాట్లాడితే ఇండస్ట్రీలో కష్టం కదా...?
అందుకేగా నాకు అవకాశాలు తగ్గుతున్నాయి! రామ్‌గోపాల్ వర్మని చాలామంది తిడతారు. కానీ ఆయన మాటల్ని అంగీకరించేవాళ్లు కూడా ఉన్నారు కదా! నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. అది నచ్చక కొందరు నాకు పొగరు అంటారు. కానీ ఒక్కసారి నేను చేసిన ఇంటర్వ్యూలు చూడండి. నెగిటివ్ విషయాలు కూడా మాట్లాడతాను. సెలెబ్రిటీలకు కోపం వస్తుందని కొన్ని ప్రశ్నలు అడగడం మానేయలేదు. అలా చేయడం వల్లే నాకు పేరు వచ్చింది. ప్రేక్షకులకు నచ్చిన ఆ నైజాన్నే మార్చుకోమంటే ఎలా?
పేరు వచ్చింది. కానీ ఇంతవరకూ సరైన బ్రేక్ రాలేదుగా?
నేను కూడా దాని కోసమే ఎదురు చూస్తున్నాను. రోజులు మారుతున్నాయి. అవకాశాలు పెరుగుతున్నాయి. టాలెంట్‌ని దాచుకోవాల్సిన పని లేదు. ఎవరూ చాన్స్ ఇవ్వకపోతే మనమే ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టవచ్చు. మన ప్రతిభని నిరూపించుకోవచ్చు. సంపూర్ణేష్‌బాబు (హృదయకాలేయం హీరో) సక్సెస్ అయ్యింది అలానే కదా!
మరి సినిమాల సంగతేంటి?
అక్కడా సేమ్ ప్రాబ్లెమ్. సక్సెస్ అవ్వాలంటే ప్రతిభ ఉంటే చాలదు... అదృష్టం కూడా ఉండాలి.
తెరమీద నవ్విస్తారు. కానీ బయట మీ మాట చాలా సీరియస్‌గా ఉంది?
నేను బేసిగ్గా చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటాను. ఎవరితోనూ పెద్దగా కలవను, మాట్లాడను, నవ్వను, నవ్వించను. ఇండస్ట్రీవాళ్లలో నాకెవరూ స్నేహితులు లేరు. ఎందుకంటే... ఇక్కడ చేతులు కట్టుకుని నిలబడాలి. వాళ్లు జోక్ వేస్తే నవ్వు రాకపోయినా నవ్వాలి. అన్ని బంధాలూ ఆర్టిఫిషియల్‌గా ఉంటాయిక్కడ. అందుకే నా కాలేజీ స్నేహితులతోనే ఉంటాను నేను.
భవిష్యత్ ప్రణాళికలేంటి?
పెద్దగా ఏమీ లేదు. యాంక ర్‌గా కెరీర్ బాగున్నా... నటుడిగానే నాకు తగినన్ని అవకాశాలు రావడం లేదు. అయినా పెద్ద టెన్షన్ లేదు. చెప్పానుగా టాలెంట్‌ని దాచలేమని! సంవత్సరమో... రెండు సంవత్సరాలో... బ్రేక్ వచ్చి తీరుతుంది.
- సమీర నేలపూడి
సంభాషణం: నా సక్సెస్‌ని అదే ఆపుతోంది!
Published Sun, Apr 20 2014 2:28 AM | Last Updated on Sat, Aug 11 2018 8:27 PM
Advertisement
Advertisement