తెలుగువాళ్లు నన్నుమరచిపోయారు! | Sudha Chandran birthday special interview | Sakshi
Sakshi News home page

తెలుగువాళ్లు నన్నుమరచిపోయారు!

Published Sun, Sep 21 2014 12:44 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

Sudha Chandran birthday special interview

సుధాచంద్రన్... మనోనిబ్బరంతో శారీరక వైకల్యాన్ని జయించిన సూపర్ ఉమన్!
 సినిమాలు, సీరియల్స్... డ్యాన్స్ స్కూల్స్, బొతిక్‌లు... ఇలా ఎందులో పాదం మోపినా, ఆమె ఇన్‌స్పైరింగ్‌గా నిలుస్తారు.
 ‘మయూరి’ తన జీవితానికే మైలురాయి అంటారు
  జైపూర్ పాదాల అందాల రవళి... సుధ!
 ‘మయూరి’ తన కెరీర్‌లో ఓ మైలురాయి అంటారు
 నేడు పుట్టినరోజు జరుపుకొంటున్న సుధాచంద్రన్ స్పెషల్ ఇంటర్వ్యూలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం!!

 
‘మయూరి’ సుధగా మీరు మా మనసులో నిలిచిపోయారు...
నిలిచిపోతే సంతోషమే కానీ అది నిజం కాదనిపిస్తోంది...
 
 అదేంటి అంత మాటన్నారు?
‘మయూరి’ విడుదలైనప్పుడు తెలుగువారు చూపించిన అభిమానం నేను ఇప్పటికీ మర్చిపోలేదు. కానీ మీరే నన్ను మర్చిపోయారనిపిస్తోంది. మీకు నేను గుర్తు ఉండివుండే తర్వాత కూడా తెలుగు సినిమాల్లో నటించి ఉండేదాన్నిగా!
 
అంటే... మయూరి తర్వాత మీకు అవకాశాలే రాలేదా?
ఒక్కటి కూడా రాలేదు. చాలా ఎదురు చూశాను... కనీసం ఒక్కరైనా పిలుస్తారేమో అని! ‘మయూరి’ని హిందీలో రీమేక్ చేస్తే... దాన్ని చూసి అక్కడి దర్శకులు వరుసగా అవకాశాలు ఇచ్చారు. తమిళం, మలయాళం, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ భాషల్లో కూడా నటించాను. కానీ తెలుగువాళ్లు మాత్రం నన్ను పక్కన పెట్టేశారు. (నవ్వుతూ) కనీసం ఈ ఇంటర్వ్యూ చదివాకయినా గుర్తు చేసుకుంటారేమో చూడాలి.
 
 తెలుగు సినిమాలు చూస్తుంటారా?
 చూస్తుంటాను. ‘మగధీర’ నాకు చాలా నచ్చింది. ‘మనం’ కూడా బాగుందని ఈ మధ్యే ఎవరో చెప్పారు. తీరక లేక చూడలేదు. త్వరలోనే చూడాలి. ఒకప్పుడైతే విశ్వనాథ్‌గారి సినిమా అంటే వదలకుండా చూసేదాన్ని. హీరోయిన్స్‌ని చాలా ప్రత్యేకంగా చూపించేవారాయన. బాపుగారి సినిమాలన్నా చాలా ఇష్టం. ఆయన మరణం నాకు చాలా బాధ కలిగించింది. ఇక సింగీతం శ్రీనివాసరావుగారయితే నా నట గురువు! ఆయనవల్లే నేనీరోజున నటిగా ఇలా కొనసాగుతున్నాను!
 
 తెలుగులో నటించాలని ఉందంటున్నారు. ఎలాంటి పాత్రలు..?
 నా వయసుకు తగ్గట్టుగా తల్లిగానో, అత్తగానో చాన్స్ ఇస్తే చేస్తాను. జయసుధగారిలాగా మంచి మంచి తల్లి పాత్రలు చేయాలని ఉంది.
 
 ఇక సీరియల్స్ విషయానికొస్తే... మీరు నెగిటివ్ పాత్రలకు ఎక్కువ ఫేమస్ అయినట్టున్నారు?
 పాత్ర నెగిటివా, పాజిటివా అని ఏముంది! మన ప్రతిభను వెలికి తీసేది ఏదైనా మంచి పాత్రే. మొదట ఓసారి అలాంటి రోల్ చేశాను, బాగా పండటంతో అలాంటివే వచ్చాయి.
 
 మీరు కాస్త ఓవర్‌గా మేకప్ అవుతారని కొందరు అంటుంటారు...
 అలా అనేవాళ్లు ఒక్కసారి నాకు షూటింగ్ లేనప్పుడు వచ్చి చూస్తే... అసలు నేనా? కాదా? అని ఆశ్చర్యపోతారు. సాదా సీదా దుస్తులు వేసుకుంటాను. పౌడర్ కూడా రాసుకోను. కానీ సీరియళ్లలో, సినిమాల్లో ఇలా కనిపిస్తే చూస్తారా! హీరోయిన్ పూరి గుడిసెలో ఉంటుంది... హీరోతో డ్యూయెట్ మాత్రం స్విట్జర్లాండులో పాడుకుంటుంది. సీరియళ్లలో హీరోయిన్లు పట్టు చీరతోనే పడుకుని నిద్రపోతారు. ఏడుపు సీనులో కూడా ఫుల్లుగా మేకప్ వేసుకునే కనిపిస్తారు. ఎందుకంటే దృశ్యాలు కంటికి అందంగా లేకపోతే ప్రేక్షకులు చూడరు. ఇవాళ దక్షిణాది వాళ్లు హిందీ సీరియళ్లను పెద్ద యెత్తున డబ్ చేస్తున్నారంటే కారణమేంటి? ఉత్తరాది సీరియళ్లలో ఆర్టిస్టుల మేకప్, సెట్టింగ్స్‌కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వాటిని చూడ్డానికి తెలుగువారూ ఇష్టపడుతున్నారు కదా! ప్రేక్షకులకు నచ్చేది చేయడమే మా పని.
 
 మీరు పెట్టుకునే బొట్టుబిళ్లలు కూడా చాలా ఫేమస్ కదా?
 అవును. నా పేరుతో రకరకాల బొట్టుబిళ్లలు మార్కెట్లో కూడా దొరుకుతాయి. చాలామంది నా దుస్తుల గురించి కూడా అడుగుతుంటారు. నేనే డిజైన్ చేసుకున్నాను అని చెబితే ఆశ్చర్యపోతుంటారు. సలహాలు కూడా అడుగుతుంటారు. నా అభిరుచికి, ప్రతిభకి ప్రశంసలు దొరుకుతున్నప్పుడు వాటిని లైట్‌గా ఎందుకు తీసుకోవాలి! అందుకే ఈ మధ్యనే చెన్నైలో ‘సుధాచంద్రన్ కలెక్షన్స్’ పేరుతో ఓ బొతిక్ కూడా తెరిచాను.
 
 ఫ్యాషన్ అనేది పెద్ద ప్రపంచం. రాణించగలననుకుంటున్నారా?
 నేనేదో గొప్ప డిజైనర్‌గా పేరు తెచ్చేసుకోవాలనో, బోలెడన్ని డబ్బులు సంపాదించేయాలనో ఆ పని చేయలేదు. నాలో ఉన్న ఆసక్తిని, ప్రతిభని ఎందుకు వృథా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మాత్రమే బొతిక్ పెట్టాను. దానికి సాక్ష్యం నేను పెట్టిన రేట్లే. నేను మిడిల్‌క్లాస్ అమ్మాయిని. అందుకే మధ్య తరగతి వాళ్లకి, అంతకంటే దిగువన ఉన్నవాళ్లకి కూడా నా డిజైన్స్ అందుబాటులో ఉండేలా చూస్తున్నాను. ముందు ముందు మరికొన్ని నగరాల్లో కూడా నా బొతిక్‌ని విస్తరించాలనుకుంటున్నాను.
 
 మీకు డ్యాన్సే ప్రపంచం కదా! మరి నటన... డిజైనింగ్... వీటన్నిటి వల్ల నాట్యానికి దూరమవ్వడం లేదంటారా?
 డ్యాన్స్ నా ప్రపంచమే కాదు... జీవితం కూడా! మూడేళ్ల వయసు నుంచే డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాను. అది చూసి అమ్మానాన్నలు నన్ను మంచి డ్యాన్సర్‌ని చేయాలని ఆశపడ్డారు. కానీ అంత చిన్న పిల్లని మేం చేర్చుకోం అన్నారు మాస్టర్లు. చివరకు రామస్వామి భాగవతార్‌గారు నా టాలెంట్ చూసి ముచ్చటపడి  తన ‘కళాసదన్’లో చేర్చుకున్నారు. అలా మొదలైన నా కళాప్రస్థానం వందల ప్రదర్శనలిచ్చేదాకా సాగింది. ఇప్పటికీ ఎంత బిజీగా ఉన్నా నెలకు రెండు మూడు ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నాను. ముంబైలో నా పేరుమీద డ్యాన్స్ అకాడెమీ కూడా ఉంది. దానికి రెండు బ్రాంచిలు కూడా ఉన్నాయి. వారానికి ఒక్కసారైనా వెళ్లి అక్కడ పిల్లలకు డ్యాన్స్ పాఠాలు చెబుతుంటాను. నాకు డ్యాన్స్ తర్వాతే ఏదైనా!
 
 అప్పట్లో (తొంభైల్లో) రాజకీయాల్లో కూడా చేరారు కదా... తర్వాత ఎందుకు దూరమయ్యారు?
 అది నా ఆసక్తి కాదు. వెంకయ్యనాయుడుగారు ఆహ్వానించడంతో బీజేపీలో చేరాను. అది కూడా నాలాంటి ఫిజికల్లీ చాలెంజ్‌డ్ కోసం ఏదైనా చేయాలన్న తపనతో! కానీ, అప్పట్లో ఆ పార్టీ పాలనలోకి రాకపోవడంతో నేను కోరుకున్నది సాధ్యం కాదని అర్థమై దూరంగా ఉండిపోయాను.
 
 మరిప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది కదా... పిలుపు రాలేదా?
 లేదు. అప్పుడెప్పుడో జరిగినవన్నీ గుర్తు చేసుకుని వాళ్లు నన్ను మళ్లీ పిలవాలని నేనేమీ ఆశపడటం లేదు. కాకపోతే వ్యక్తిగతంగా నాకు మోడీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు దేశం ఆయన చేతుల్లోకి వెళ్లింది కాబట్టి ఏ విషయంలోనైనా అభివృద్ధి సాధించడం సాధ్యమనిపిస్తోంది. అవకాశం దొరికితే ఆయన హయాంలో నేననుకున్నది చేయగలుగుతానని నమ్మకం ఉంది.
 
 పదవి వరిస్తే... ఓ మహిళగా మహిళల కోసం ఏమైనా చేస్తారా?
ఎవరో వచ్చి సాయం చేయాలని, మన జీవితాలు బాగు చేయాలని కోరుకోవడం నాకు నచ్చదు. ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదు. అలాంటప్పుడు ఎంపవర్‌మెంట్ గురించి చర్చలు, రిజర్వేషన్ బిల్లులు అవసరమా? నా దృష్టిలో బిల్లు అనేది ఓ కాగితం. అది జీవితాలను మార్చదు. కాబట్టి ఎవరి సాయం కోసం చూస్తూ కూచోకుండా, ఏమాత్రం చేసుకోగలిగినవాళ్లయినా, ఎవరికి వారే చైతన్యంతో ముందడుగు వేయాలి.
 
 ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు?
 కొంత నా తల్లిదండ్రుల వల్ల. కొంత నా జీవితం నాకు నేర్పిన పాఠాల వల్ల. పదహారేళ్ల వయసులో నా జీవితం ఒక్కసారిగా తారుమారైపోయింది. ఈ ఆత్మవిశ్వాసమే లేకపోతే అసలీ రోజు ఇక్కడ ఉండేదాన్నే కాదు.
 
 ఆ సంఘటన గురించి కాస్త వివరంగా...
అది 1981వ సంవత్సరం... మే 2వ తేదీ. అమ్మానాన్నలతో కలిసి తిరుచ్చి వెళ్లి, దేవుడి దర్శనం చేసుకుని బస్సులో తిరిగొస్తున్నాను. ఉన్నట్టుండి పెద్ద శబ్దం! పెద్ద కుదుపు! మాకు యాక్సిడెంట్ అయ్యిందని అర్థం కావడానికి సమయం పట్టింది. డ్రైవర్ చనిపోయాడు. దాదాపు అందరూ గాయపడ్డారు. నేనొక్కదాన్నే కాస్త బాగున్నాననిపించింది. కానీ లేవాలని ప్రయత్నించినప్పుడు అర్థమైంది నా పరిస్థితి. నా కాళ్లు రెండూ సీట్ల కింద ఇరుక్కుపోయాయి. కొందరు వచ్చి అతి కష్టమ్మీద బయటకు లాగి, దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. నా కుడికాలుకు బాగా గాయమవడంతో డాక్టర్లు సిమెంటు కట్టు వేశారు. తర్వాత అమ్మానాన్నలు నన్ను చెన్నై తీసుకెళ్లిపోయారు. అంతా మామూలైపోతుందని అనుకున్నాం. కానీ కాలి నొప్పి ఎక్కువ కాసాగింది. కాలు రంగు కూడా మారసాగింది. దాంతో నన్ను మళ్లీ చెన్నైలోని విజయా హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కట్టు విప్పుతూనే డాక్టర్... ‘ఓ గాడ్’ అన్నారు. అప్పుడే సెన్స్ చేశాను... ఏదో దారుణం జరగబోతోందని!
 
 తర్వాత...?
ఏమయ్యిందని డాక్టర్‌ని అడిగితే... ఆయన నాతో ఏమీ చెప్పలేదు. తర్వాత అమ్మానాన్నలను బయటకు తీసుకెళ్లి, వాళ్లతో ఏదో మాట్లాడారు. నాన్న లోపలకు వచ్చి, నా చేయి పట్టుకుని, ‘సుధా... నీ మడమ దగ్గర చిన్న గాయముందని గమనించకుండా డాక్టర్లు నీకు సిమెంట్ కట్టు వేశారు. దానివల్ల నీ కాలు సెప్టిక్ అయ్యింది... కాలు తీసేయకపోతే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు డాక్టర్లు’ అంటూ మెల్లగా చెప్పారు. నాన్న ఆ విషయం అలా చెబుతుంటే... నా కలల ప్రపంచం నా కళ్లముందే కూలిపోతున్నట్టుగా అనిపించింది నాకు!
 
 ఎలా తట్టుకున్నారు అంతటి నిజాన్ని?
తట్టుకోక తప్పని పరిస్థితి! అయితే కాలు తీసేస్తానన్నందుకు కాదు... కాలు లేకపోతే డ్యాన్స్ ఎలా చేయగలనన్నదే నా బాధ! ఇప్పుడు ఎవ్వరు అడిగినా చాలా సింపుల్‌గా చెప్పేస్తాను కానీ... ఆ సమయంలో నేను పడిన వేదన సామాన్యమైనది కాదు. కానీ మెలమెల్లగా జీవితంతో రాజీ పడసాగాను. ఇంతలో జైపూర్ లెగ్ గురించి ఓ పేపర్లో డాక్టర్ సేథీ ఇచ్చిన ఇంటర్వ్యూ చదివి, వెంటనే ఆయన దగ్గరకు వెళ్లాను. అప్పటిదాకా అసలు నడవగలనా అనుకున్నదాన్ని, ఆయన చెప్పిన మాటలతో, ఇచ్చిన ధైర్యంతో డ్యాన్స్ కూడా చేయగలనని నమ్మాను.
 
 తొలిసారి (కృత్రిమకాలితో) ప్రదర్శనిచ్చినప్పుడు మీ ఫీలింగ్..?
 ఇంతకు ముందులా చేయగలనో లేదోనని మొదట కంగారుపడ్డాను. నాన్న ధైర్యం చెప్పారు. మహా ఆయితే ఆడిటోరియంలో ఇరవై మందో ముప్ఫై మందో ఉంటారనుకుంటే, వెయ్యిమంది ఉన్నారు. వాళ్లంతా నన్ను చూస్తూనే లేచి నిలబడి చప్పట్లు కొట్టసాగారు. అప్పటికేమీ సాధించలేదు కానీ సాధించాలన్న నా పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పారు. దాంతో నాలో పట్టుదల పెరిగింది. ఒకటి కాదు, రెండు కాదు... మూడు గంటల పాటు డ్యాన్స్ చేశాను. ఆ తర్వాత కలిసినప్పుడు డాక్టర్ సేథీ అన్నారు... ‘మొత్తానికి చేసి చూపించావ్. కానీ ఎలా చేశావ్’ అని. ‘మీరే కదా అన్నారు, నేను డ్యాన్స్ చేయగలనని’ అన్నాను అయోమయంగా. ‘నేనేదో నిన్ను డిజప్పాయింట్ చేయకూడదని అలా అన్నాను, నువ్వు దాన్ని నిజం చేసి చూపించావ్’ అన్నారాయన. ఆయన నా పాలిట దేవుడు. ఆయనే లేకుండా సుధ ఇవాళ ఉండేది కాదు. అలాగే మా అమ్మానాన్నలు. నాకోసం ఎన్నో కలలు కన్నా, నాకిలా అయ్యిందన్న నిరాశ వాళ్ల ముఖంలో ఎప్పుడూ కనిపించలేదు. కానీ చుట్టూ ఉన్నవాళ్లు మాత్రం చాలా జాలిని ప్రదర్శించేవారు. ఒక్కతే కూతురు, ఎలా అయ్యిందో పాపం అని కొందరు... కూతుర్ని డ్యాన్సర్‌ని చేయాలనుకుంటే, నడవడానికే లేకుండా పోయిందే అని ఇంకొందరు... ఆ కామెంట్స్ వినకూడదనే అమ్మ రాత్రి ఎనిమిది గంటలు దాటిన తర్వాత కూరగాయలు కొనడానికి వెళ్లేది. అవన్నీ గుర్తొస్తే ఇప్పటికీ తమ కళ్లు చెమరుస్తాయి. వాళ్లు బాధను మనసులో దాచుకుని నాకు ఆనందాన్ని పంచారు. అందుకే వాళ్ల కలను నెరవేర్చి తీరాలనుకున్నాను.
 
మీ వారి గురించి...
మా వారి పేరు రవి ఢంగ్. ఓ పంజాబీ సినిమా సెట్లో తొలిసారి చూశాను ఆయన్ని. ఆ సినిమాకి ఆయన అసిస్టెంట్ డెరైక్టర్. మా పరిచయం పరిణయానికి దారి తీసింది. ఆయనతో జీవితం బాగుంటుందనిపించింది. ఆ నమ్మకమే నిజమైంది. ఆయన నాకు చాలా పెద్ద సపోర్ట్! మాకు పిల్లలు లేరు. అయినా నాకేం బాధ లేదు. తను ఉన్నారు. అదే చాలు అనుకుంటాను.
 
దత్తత తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదా?
నాకు అడాప్షన్ మీద నమ్మకం లేదు. ఇష్టం కూడా లేదు. నాకు అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. అందరూ నిజాయతీగా ఉండాలి. ఎవరు కాస్త తప్పుగా ప్రవర్తించినా దూరంగా పెట్టేస్తాను. నా బిడ్డ అయినా అంతే. అలాంటప్పుడు ఏ ఒక్క క్షణంలోనైనా... ‘వీడు నా బిడ్డ అయితే ఇలా చేసేవాడా’ అనుకున్నానంటే తనకి అంత ద్రోహం చేసినదాన్ని అవుతాను. అందుకే దత్తత చేసుకోకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను.
 
కానీ పిల్లలు లేని వెలితి ఎప్పుడైనా బాధిస్తే...?
అలా జరగదు. బిడ్డల నిరాదరణకు గురై ఫుట్‌పాత్‌ల మీద, అనాథాశ్రమాల్లోను, రైల్వేస్టేషన్లలోనూ ప్రాణాలు విడుస్తున్న తల్లిదండ్రులెంతమందిని చూడటం లేదు! వాళ్లంతా కడుపు కట్టుకుని పిల్లల్ని పెంచుకుని ఉంటారు. వాళ్లమీదే ప్రాణాలు పెట్టుకుని వుంటారు. కానీ ఎలాంటి పరిస్థితి వచ్చింది! అందుకే పిల్లలు ఉండి తీరాలి అన్న ఆశ, వాళ్లు ఉంటేనే సంతోషంగా ఉంటామన్న అభిప్రాయం నాకెప్పుడూ లేవు.
 
ఇప్పటి వరకూ గడిపిన జీవితం తృప్తి కలిగించినట్టేనా?
ఎలాంటి రిగ్రెట్స్ లేవు. వచ్చినదాన్ని వచ్చినట్టుగా స్వీకరించడం, రేపు ఏం జరుగుతుందోనని చింతించకపోవడం నన్నెప్పుడూ హ్యాపీగా ఉంచుతాయి. అంతేకాదు, నేనెప్పుడూ సక్సెస్‌ని మెజర్ చేయను. చేస్తే అక్కడితో ఆగిపోతాం. అందుకే  ఏం చేశాను అన్నదానికంటే, ఇంకా ఏం చేయగలను అనేదే ఆలోచిస్తాను. ఎప్పుడూ అదే చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను. ఎప్పుడూ అదే చేస్తాను!
 
 - సమీర నేలపూడి
 
నా యాక్సిడెంట్, కాలు తీసేయడం, నేను ఆర్టిఫీషియల్ లెగ్‌తో మళ్లీ డ్యాన్స్ చేయడం మాత్రమే నిజం. మిగతాదంతా కల్పనే. అందులో చూపినట్టు నేను తల్లిలేని పిల్లనీ కాదు, నాకు సవతి తల్లి ఆరళ్లూ లేవు. మా నాన్న అంత అమాయకుడు, బలహీనుడు అంతకన్నా కాడు. సినిమా కోసం ఆ పాత్రను అలా తీర్చిదిద్దారంతే! అంతే కాదు... (నవ్వుతూ) ఆ సినిమాలోలాగా నాకు బాయ్‌ఫ్రెండ్ కూడా లేడు. సినిమా కోసం కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారంతే!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement