
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే దిల్‌రుబాతో ప్రేక్షకులను అలరించారు. ఈనెల 14న థియేటర్లలోకి వచ్చిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు విశ్వకరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా కనిపించింది.
అయితే మన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే తాను గర్భంతో ఉన్నట్లు ప్రకటించి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఇవాళ తన సతీమణి బర్త్ డే కావడంతో కిరణ్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన భార్య నుదుటన బొట్టు పెడుతున్న ఫోటోలను షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మా.. అంటూ సతీమణికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం కిరణ్ అబ్బవరం భార్యకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా.. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయమైన కిరణ్-రహస్య.. ఆ తర్వాత స్నేహితులుగా మారారు. కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. అయితే తమ బంధాన్ని చాలా రహస్యంగా ఉంచారు. గత ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకుని అధికారికంగా ప్రకటించారు. 2024 ఆగష్టు నెలలో పెళ్లితో ఒక్కటయ్యారు.