Television Industry
-
రూ. 10 వేల కోట్లకు టీవీ స్పోర్ట్స్ మార్కెట్
న్యూఢిల్లీ: టీవీ స్పోర్ట్స్ మార్కెట్ 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 9,830 కోట్లకు చేరనుంది. అలాగే స్పోర్ట్స్ డిజిటల్ ఆదాయం రూ. 4,360 కోట్ల స్థాయిని తాకనుంది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ, ఇండియా బ్రాడ్‌కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంచనాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం టీవీ స్పోర్ట్స్ మార్కెట్ రూ. 7,050 కోట్లుగాను, డిజిటల్ మార్కెట్ ఆదాయం రూ. 1,540 కోట్లుగా ఉంది. ఐపీఎల్ వంటి టోర్నీలతో దేశీయంగా స్పోర్ట్స్ వ్యూయర్షిప్లో క్రికెట్ అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. కబడ్డీ, ఫుట్బా ల్, ఖో–ఖో వంటి క్రికెట్‌యేతర ఫ్రాంచైజీ ఆధారిత ఆటలకు కూడా క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో భారత్‌లో స్పోర్ట్స్ వ్యూయర్షిప్ 72.2 కోట్లుగా నమోదైంది. ఏడాది మొత్తం మీద చూస్తే కోవిడ్ పూర్వం (2019లో) నమోదైన 77.6 కోట్ల వ్యూయర్షిప్ను దాటేసే అవకాశాలు ఉన్నాయని నివేదిక అంచనా వేసింది. ఓటీటీ ఊతం..: ఎక్కడైనా, ఎప్పుడైనా చూసుకునే సౌలభ్యం కారణంగా ఓటీటీ (ఓవర్–ది–టాప్) ప్లాట్‌ఫామ్‌లపై స్పోర్ట్స్ వ్యూయర్షిప్ పెరుగుతోంది. అడ్వర్టయిజర్లు కూడా డిజిటల్ మాధ్యమంపై ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ పెరుగుతుండటం స్పోర్ట్స్‌కి లాభించనుంది. అయితే, గడిచిన కొన్నేళ్లుగా డిజిటల్ వినియోగం పెరుగుతున్నా.. ఇప్పటికీ టీవీ స్పోర్ట్స్ మార్కెట్ ఆధిపత్యమే కొనసాగుతోందని నివేదిక తెలిపింది. మధ్య నుండి దీర్ఘకాలికంగా ఇది .. మొత్తం డిజిటల్ స్పోర్ట్స్ మార్కెట్‌కి రెండింతల స్థాయిలో ఉంటుందని పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► స్పోర్ట్స్ డిజిటల్ ఆదాయం ఏటా 22 శాతం మేర వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది మూడు రెట్లు పెరగనుంది. టీవీ స్పోర్ట్స్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7 శాతం మేర వృద్ధి చెందుతోంది. ► టీవీల వినియోగం పెరిగే కొద్దీ స్పోర్ట్స్ సబ్స్క్రిప్షన్ ఆదాయాలకు ఊతం లభించవచ్చని అంచనా. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అంచనాల ప్రకారం 2020లో 21 కోట్ల కుటుంబాల్లో టీవీలు ఉన్నాయి. సుమారు 90 కోట్ల మంది వీక్షిస్తున్నట్లు అంచనా. టీవీల వినియోగం ఎక్కువగానే ఉన్నప్పటికీ వాటిలో స్పోర్ట్స్ కార్యక్రమాల వ్యూయర్షిప్ మాత్రం ఇంకా భారీ స్థాయిలో లేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మొత్తం టీవీ కార్యక్రమాల వీక్షణలో స్పోర్ట్స్ వాటా 10 శాతంగా ఉండగా భారత్‌లో ఇది 3 శాతంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో వృద్ధికి మరింత ఆస్కారముంది. భారతీయ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపిస్తుండటంతో ఆయా ఈవెంట్లను టీవీల్లో చూసేందుకు వీక్షకుల్లో ఆసక్తి పెరగవచ్చు. ► భారత్‌లో స్పోర్ట్స్‌కి సంబంధించి క్రికెట్ ఆధిపత్యమే కొనసాగుతోంది. ఐపీఎల్ సీజన్ అత్యంత ప్రభావవంతంగా ఉంటోంది. 2022లో 44వ వారం వరకూ 16,217 గంటల మేర లైవ్ క్రికెట్ కంటెంట్ టెలికాస్ట్ అయ్యింది. 2021లో ఇది 15,506 గంటలుగా నమోదైంది. పరిమాణంపరంగానూ అలాగే విస్తృతిపరంగాను ఇతరత్రా ఏ క్రీడలు కూడా క్రికెట్‌కు దరిదాపుల్లో లేవని నివేదిక పేర్కొంది. అయితే, కబడ్డీ వంటి క్రికెట్‌యేతర స్పోర్ట్స్‌ను చూడటం కూడా క్రమంగా పెరుగుతోందని వివరించింది. దీంతో ఏడాది పొడవునా ఏదో ఒక క్రీడల కార్యక్రమం వీక్షకులకు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొంది. -
టీవీ రేట్లకు రెక్కలు..!!
న్యూఢిల్లీ: టీవీలకు కూడా కరోనా వైరస్ (కోవిడ్–19) సెగ తగలనుంది. టీవీల్లో కీలకమైన ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానళ్ల సరఫరా తగ్గి, కొరత పెరిగిపోతుండటంతో మార్చి నుంచి రేట్లు 10 శాతం దాకా ఎగియనున్నాయి. ప్రధానమైన ఈ భాగాన్ని దేశీ సంస్థలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. టీవీ యూనిట్ రేటులో దాదాపు 60 శాతం భాగం టీవీ ప్యానళ్లదే ఉంటుంది. చైనా కొత్త సంవత్సరం సెలవులను దృష్టిలో ఉంచుకుని చాలామటుకు కంపెనీలు ముందస్తుగానే వీటిని నిల్వ చేసుకున్నాయి. కానీ ఊహించని విధంగా కరోనా వైరస్ ప్రబలడం, ఉత్పత్తి.. సరఫరా దెబ్బతినడంతో ప్యానళ్ల కొరత ఏర్పడింది. చైనాలో కొన్ని ఫ్యాక్టరీలు తిరిగి తెరుచుకున్నప్పటికీ, అర కొర సిబ్బందితోనే పనిచేస్తున్నాయి. దీంతో ప్యానళ్ల ధరలు దాదాపు 20 శాతం దాకా పెరిగినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. ‘చైనాలో కరోనా వైరస్ సంక్షోభం వల్ల ముడిసరుకులకు భారీ కొరత నెలకొంది. ఓపెన్ సెల్ ప్యానళ్ళ ధరలు ఏకంగా 20 శాతం ఎగిశాయి. దీంతో మార్చి నాటికి టీవీల ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి‘ అని ఎస్పీపీఎల్ సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా చెప్పారు. భారత్‌లో థామ్సన్ టీవీలకు ఈ సంస్థ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ లైసెన్సీగా వ్యవహరిస్తోంది. టీవీ ప్యానళ్ల కొరత కారణంగా టీవీల రేట్లూ పెరగవచ్చని పానాసోనిక్ ఇండియా సీఈవో మనీష్ శర్మ తెలిపారు. ‘పరిస్థితి మెరుగుపడితే ఏప్రిల్ నుంచి రేట్లు స్థిరంగానైనా ఉండవచ్చు లేదా ఇదే ధోరణి కొనసాగితే 3–5% దాకా పెరగవచ్చు‘ అని చెప్పారు. ఫ్రిజ్‌లు.. ఏసీలు కూడా.. రాబోయే వారాల్లో ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు కూడా పెరుగుతాయని హయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా చెప్పారు. ‘మార్చి ప్రారంభం నుంచి టీవీల రేట్లు పెరుగుతాయి. ఆ తర్వాత ఫ్రిజ్‌లు, ఏసీల ధరలూ పెరుగుతాయి. డీప్ ఫ్రీజర్ల రేట్లు ఇప్పటికే 2.5 శాతం పెరిగాయి‘ అని ఆయన చెప్పారు. చాలా కంపెనీలు ఏసీ, రిఫ్రిజిరేటర్లకు అవసరమైన కంప్రెసర్లను ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. మరో 3 నెలల్లో సాధారణ స్థాయికి... ఉత్పత్తి, సరఫరా మళ్లీ సాధారణ స్థాయికి రావాలంటే కనీసం ఒక త్రైమాసికమైనా పడుతుందని మార్వా వివరించారు. కన్సల్టెన్సీ సంస్థ ఫ్రాస్ట్ అండ్ సలివాన్, పరిశ్రమ సమాఖ్య సీఈఏఎంఏ అధ్యయనం ప్రకారం.. 2018–19లో 1.75 కోట్ల యూనిట్లుగా ఉన్న టీవీ మార్కెట్ 2024–25 నాటికి 2.84 కోట్లకు చేరగలదని అంచనా. టీవీలో కీలకమైన ఓపెన్ సెల్ ప్యానల్, చిప్స్ ప్రధానంగా చైనాతో పాటు తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి మార్కెట్ల నుంచి దిగుమతవుతున్నాయి. భారత్‌లో అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతోంది. దేశీ తయారీని ప్రోత్సహించేందుకు, టీవీల ఖరీదును తగ్గించేందుకు ఓపెన్ సెల్ ప్యానళ్లపై కేంద్రం దిగుమతి సుంకాలను తొలగించిందని నివేదిక వివరించింది. -
భారత్‌కు మళ్లీ వస్తాం..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 135 కోట్లు దాటిన జనాభా. కోట్లాది మంది యువ కస్టమర్లు. ఉద్యోగులు, వ్యాపారులకు పెరుగుతున్న వ్యయం చేయదగ్గ ఆదాయం. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే వినియోగదార్లు.. ఇంకేముంది ఈ అంశాలే తయారీ, రిటైల్ కంపెనీలకు భారత మార్కెట్ బంగారు బాతుగా నిలుస్తోంది. ముఖ్యంగా టెలివిజన్, స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థలకైతే ఇండియా ప్రధాన మార్కెట్ కూడా. దీంతో భారత్ నుంచి వెనుదిరిగిన ఈ రంగ కంపెనీలు మళ్లీ రీ–ఎంట్రీ ఇస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త ఫీచర్లతో రంగంలోకి దిగుతున్నాయి. కొన్ని బ్రాండ్లు అయితే ఏకంగా ప్రైస్ వార్‌కు తెరతీస్తున్నాయి కూడా. ఐవా: దేశీయ టెలివిజన్ మార్కెట్లో ఆగస్టు 1న రీ–ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ ఏకంగా 75 అంగుళాల 4కే స్మార్ట్ టీవీతో దర్శనమిచ్చింది. వాయిస్ కమాండ్‌తో పనిచేసే ఆరు రకాల స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. టీవీల ధరల శ్రేణి రూ.7,999తో మొదలుకుని రూ.1,99,000 వరకు ఉంది. వీటితోపాటు స్మార్ట్ హోం ఆడియో సిస్టమ్స్, వైర్లెస్ హెడ్‌ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్, పర్సనల్ ఆడియో ఉత్పత్తులను సైతం అందుబాటులోకి తెచ్చింది. వినూత్న, ఆధునిక ఫీచర్లతో ప్రొడక్టులను అన్ని ధరల శ్రేణిలో తీసుకొస్తామని ఐవా ఇండియా ఎండీ మన్మిత్ చౌదరి తెలిపారు. రానున్న రోజుల్లో రూ.200 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. నూబియా: టెక్నాలజీ కంపెనీ జెడ్‌టీఈ అనుబంధ బ్రాండ్ అయిన నూబియా తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రెండేళ్ల క్రితం భారత్ నుంచి నిష్క్రమించిన ఈ బ్రాండ్ రెడ్ మేజిక్–3 పేరుతో గేమింగ్ ఫోన్ ప్రవేశపెట్టింది. 8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ మెమరీ, 6.65 అంగుళాల డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సోనీ సెన్సార్‌తో 48 ఎంపీ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను జోడించింది. ప్రపంచంలో తొలిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో ఇంటర్నల్ టర్బో ఫ్యాన్ పొందుపరిచారు. ఇక ఆల్ఫా పేరుతో అద్దిరిపోయే స్మార్ట్‌వాచ్‌తో ఎంట్రీ అదరగొట్టింది. ఫోల్డబుల్ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకత. హెచ్‌టీసీ: తైవాన్‌కు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ భారత్‌లో రెండవ ఇన్నింగ్స్‌కి సిద్ధమైంది. వైల్డ్‌ఫైర్ ఎక్స్ పేరుతో కొత్త మోడల్‌ను రెండు వేరియంట్లలో ఆవిష్కరించింది. వెనుకవైపు 12, 8, 5 ఎంపీ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా పొందుపరిచింది. ధర 4 జీబీ ర్యామ్ రూ.12,999 కాగా, 3 జీబీ ర్యామ్ మోడల్ రూ.9,999 ఉంది. ఆగస్టు 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. రానున్న రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వినూత్నమైన ఫీచర్లను పరిచయం చేయనున్నట్టు కంపెనీ వర్గాల సమాచారం. 2018లో కంపెనీ భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రీమియం లుక్, నాణ్యమైన మోడళ్లతో కస్టమర్ల మది దోచిన ఈ బ్రాండ్‌కు ఇప్పటికీ మంచి ఇమేజ్ ఉంది. ఎల్జీ: డబ్ల్యూ సిరీస్‌తో భారత్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఎల్జీ మొబైల్స్ ఈ ఏడాది మరో అయిదు కొత్త స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టనుంది. డబ్ల్యూ సిరీస్‌తోపాటు విదేశాల్లో విక్రయిస్తున్న ‘జీ’, ‘క్యూ’ సిరీస్ మోడళ్లను పరిచయం చేయనుంది. ప్రస్తుతం సంస్థ ఖాతాలో అయిదు మోడళ్లున్నాయి. 2020 ఏడాది ద్వితీయార్ధానికి దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఎల్జీ మొబైల్స్ బిజినెస్ హెడ్ అద్వైత్ వైద్య సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఏడాది తర్వాత 5జీ స్మార్ట్‌ఫోన్ ‘వి–50’ని భారత్‌లో ఆవిష్కరించనుంది. 5జీలో నాయకత్వ స్థానాన్ని దక్కించుకోవాలన్నదే కంపెనీ లక్ష్యం. దక్షిణ కొరియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎల్జీ.. భారత్‌లో తొలిసారిగా డబ్ల్యూ సిరీస్ ద్వారా ఫోన్ల అభివృద్ధితో పాటు తయారీ కూడా చేపట్టింది. -
‘పెళ్లి పిలుపులు రాని తల్లి’
టెలివిజన్ రంగంలో ఎన్ని ఘన విజయాలు సాధించినప్పటికీ ఏక్తా కపూర్ సాంఘికంగా ‘పెళ్లి కాని తల్లి’గానే గుర్తింపబడుతోంది. ఆమె ఎదురుపడితే మొదలయ్యే మొదటి ప్రశ్న ‘పెళ్లెప్పుడు?’ అనే!ఏక్తా కపూర్‌కు 43 ఏళ్లు వచ్చాయి. కాని ఇప్పటికీ ఆమె బంధువులకు ఎదురు పడటానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళిళ్లకు హాజరవ్వడానికి ఇంకా ఇబ్బందిపడుతూ ఉంటుంది. దానికి కారణం ఆ పెళ్లిలో ‘నెక్ట్స్ నీ పెళ్లే’ అని బంధువులు ఆమెతో అంటూ ఉంటారు. అదీ ఆమె భయం. దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియదు ఆమెకు. ‘స్త్రీ ఎన్ని ఘనవిజయాలు సాధించినా పెళ్లితోనే ఆమె జీవితం సంపూర్ణమవుతుందనే సాంఘిక అభిప్రాయానికి కాలం చెల్లాల్సి ఉంది’ అని ఏక్తా అంటుంది. పెళ్ళిళ్లకు తీసుకెళితే పెళ్లి మీద మనసు పుడుతుందేమోనని ఏక్తా తల్లి శోభా కపూర్ గతంలో ఏక్తాను పెళ్ళిళ్లకు పిలుచుకుని వెళ్లేది. కాని అక్కడ ఏక్తాను ఇలా అర్థం లేని ప్రశ్నలు అడుగుతుంటే దానికి ఏక్తా అర్థం లేని సమాధానాలు చెప్పడం చూసి, ఆ సమాధానాలకు ఎదుటివారు హర్ట్ అవడం గమనించి ఏక్తాను పెళ్లిళ్లకే తీసుకెళ్లడం మానుకుంది. ఎలాగూ రాదు కదా అని అసలు పెళ్లి పిలుపులు ఆమెకు పంపడం కూడా మానేశారు బంధువులు.ఏక్తా కపూర్ జనవరి 2019లో సరొగసి ద్వారా ఒక మగబిడ్డకు తల్లయ్యింది. ‘నా జీవితంలో నేను చూసిన అన్ని విజయాలకంటే గొప్పది నా కుమారుణ్ణి నా జీవితంలోకి ఆహ్వానించడం’ అని ఏక్తా అంది. ఏక్తా మొదట తనే ఐవిఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చి బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంది. అయితే అందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దాంతో డాక్టర్లు సరొగసి ద్వారా ఆమె తల్లయ్యే ఏర్పాటు చేశారు. ఏక్తా తండ్రి జితేంద్ర, ఏక్తా సోదరుడు తుషార్ కపూర్ మాత్రమే కాదు ఏక్తా స్నేహితులు కూడా ఈ నిర్ణయాన్ని ఆహ్వానించారు. ఏక్తా తన కుమారుడికి ఘనంగా నామకరణం కూడా చేసింది. జితేంద్ర అసలు పేరైన ‘రవి కపూర్’ను తన కుమారుడికి పెట్టుకుంది. తుషార్ కపూర్ కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా సరొగసి ద్వారా తండ్రైన సంగతి తెలిసిందే.ఈ ఘట్టం ఇలా ముగిసినా పెళ్లి గురించి వెంటపడే బంధువులు మాత్రం అలాగే ఉన్నారు. ‘మా అమ్మా నేను ఈ విషయమై లక్ష సార్లు మాట్లాడుకున్నాం’ అంటుంది ఏక్తా. ‘నేను చేయాల్సిన పనులు చాలా ఉండగా పెళ్లెలా చేసుకోను’ అంటుందామె. ‘కాని గత పదేళ్లుగా మా బంధువుల్లో చాలా మంది ఆడపిల్లలు విడాకులు తీసుకున్నారు. అది చూసి మా అమ్మ నయం... నీకింకా పెళ్లి కాలేదు... నీ నిర్ణయమే సరైనదిలా ఉంది అని నిట్టూర్చింది’ అని నవ్వింది ఏక్తా.జితేంద్ర బంగ్లా ఇప్పుడు ఇద్దరు చిన్నారుల కేరింతలతో కళకళలాడుతోంది. అది కోడలు లేని బంగ్లా, అల్లుడు లేని బంగ్లా కావచ్చు. కాని మనుమలు ఉన్న బంగ్లా. వారంతా సంతోషంగా ఉన్నారు. సమాజానికి ఒక కొత్తపద్ధతి చూపించారు. ఈ దారిలో అందరూ నడవక పోవచ్చు.... ఈ దారి ఒకటి అంగీకారం పొందుతోంది అని తెలుసుకుంటే సరిపోతుంది. -
సంభాషణం: నా సక్సెస్‌ని అదే ఆపుతోంది!
టీవీ, సినిమా రంగంలో ఉన్నవాళ్లు డిప్లొమేటిగ్గా మాట్లాడతారని అంటారంతా. కానీ సత్తెన్నను చూస్తే అది నిజం కాదని పిస్తుంది. తెరమీద కామెడీ చేసి కడుపుబ్బ నవ్వించే ఆయన... నిజానికి చాలా సీరియస్ మనిషి. ముక్కుసూటిగా మాట్లాడ తారు. అనుకున్న దారిలో మొండిగా సాగిపోతారు. తన ప్లస్సు, మైనస్సు కూడా అదేననే సత్తెన్న మనసులోని మాటలు... సత్తెన్న... మీ అసలు పేరు అదేనా? కాదు. నా అసలు పేరు సతీష్ కుమార్. ‘నైజాం బాబులు’ ప్రోగ్రామ్ కోసం పేరు మార్చారు. అసలు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు? పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లో. డిగ్రీ అయ్యాక ఉద్యోగం చేస్తూ మల్టీమీడియా కోర్సు చేశాను. ఓ కంపెనీ కూడా పెట్టాను కానీ నష్టపోయాను. తర్వాత మరో కంపెనీలో చేరాను. అక్కడ నాకు మా బాస్ మరదలు అనూరాధ పరిచయమయ్యారు. ఆవిడ జెమినీ చానెల్లో పని చేసేవారు. ఆవిడ ద్వారానే నేను టెలివిజన్ రంగంలో అడుగుపెట్టాను. అంటే... ఈ ఫీల్డ్ పట్ల మీకు మొదటి నుంచీ ఆసక్తి ఉందా? లేదు. నేను పని చేస్తున్న కంపెనీ మూతబడటంతో మళ్లీ ఉద్యోగ వేటలో పడ్డాను. కానీ ఎక్కడా నాకు తగిన ఉద్యోగం దొరకలేదు. దాంతో అనూరాధగారి ద్వారా పరిచయమైన నిర్మాత జీకే మోహన్ని కలిశాను. ఏదైనా ఉద్యోగం చూడమంటే... ఆయన నన్ను తన టీమ్‌లో పెట్టుకున్నారు. జోగి బ్రదర్స్ ప్రోగ్రామ్లాంటిదే మరో ప్రోగ్రామ్ చేయాలని నైజాంబాబులు మొదలుపెట్టారు. నేను తెలంగాణ యాస బాగా మాట్లాడతానని సత్తెన్నగా తీసుకున్నారు. తర్వాత ఇందులోనే ఉండాలని డిసైడైపోయారా? అవును. నిజానికి మొదట్లో ఎడిటింగ్ దగ్గర్నుంచి అన్ని డిపార్ట్మెంట్లూ ట్రై చేశాను. కానీ సక్సెస్ కాలేదు. ఎప్పుడైతే నైజాంబాబులుతో పేరొచ్చిందో ఇక యాంకర్‌గా సెటిలైపోవాలని నిర్ణయించుకున్నాను. 1999 నుంచి ఇప్పటి వరకూ చేస్తూనే ఉన్నాను. తెలుగు టెలివిజన్ రంగంలో ఇన్నేళ్లపాటు బ్రేక్ లేకుండా యాంకరింగ్ చేస్తోన్న మగ యాంకర్ని నేనొక్కడినే. కానీ ఇప్పుడిప్పుడే కాస్త ఒడిదుడుకులు వస్తున్నాయి. ఎందుకని? కొత్తవాళ్లు ఎక్కువగా వస్తున్నారు. మేం సీనియర్లం కాబట్టి ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాలి. కొత్తవాళ్లయితే తక్కువకే చేసేస్తారు. అందుకని వాళ్లను ఎంచుకుంటారు. ఇంకో సమస్య కూడా ఉంది. డెరైక్టర్స్ కూడా కొత్తవాళ్లు వస్తున్నారు. వాళ్లేదో చెబుతారు. అది కరెక్ట్‌గా అనిపించదు. అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అంటాను. అంతే... వాళ్ల ఇగో హర్ట్ అవుతుంది. నన్ను తీసేసి వేరేవాళ్లని పెట్టుకుంటారు. మరి డెరైక్టర్ చెప్పినట్టు చేయాలి కదా? చేయాలి. కానీ తప్పులు చెబుతుంటే ఎలా చేస్తాం? నేనో ప్రోగ్రామ్ చేస్తే, అన్నీ తెలుసుకునే చేస్తాను. సమాజంలో ఏం జరుగుతోంది, రాజకీయాలు, సినిమాలు.. ఇలా అన్ని విషయాల మీద ఎప్పటికప్పుడు అవగాహన తెచ్చుకుని కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తుంటాను. అది నా ప్రత్యేకత. అవతలివాళ్లు చెప్పేది బాగోదని తెలిసి కూడా గుడ్డిగా చేయమంటే నావల్ల కాదు. ఇలా మాట్లాడితే ఇండస్ట్రీలో కష్టం కదా...? అందుకేగా నాకు అవకాశాలు తగ్గుతున్నాయి! రామ్‌గోపాల్ వర్మని చాలామంది తిడతారు. కానీ ఆయన మాటల్ని అంగీకరించేవాళ్లు కూడా ఉన్నారు కదా! నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. అది నచ్చక కొందరు నాకు పొగరు అంటారు. కానీ ఒక్కసారి నేను చేసిన ఇంటర్వ్యూలు చూడండి. నెగిటివ్ విషయాలు కూడా మాట్లాడతాను. సెలెబ్రిటీలకు కోపం వస్తుందని కొన్ని ప్రశ్నలు అడగడం మానేయలేదు. అలా చేయడం వల్లే నాకు పేరు వచ్చింది. ప్రేక్షకులకు నచ్చిన ఆ నైజాన్నే మార్చుకోమంటే ఎలా? పేరు వచ్చింది. కానీ ఇంతవరకూ సరైన బ్రేక్ రాలేదుగా? నేను కూడా దాని కోసమే ఎదురు చూస్తున్నాను. రోజులు మారుతున్నాయి. అవకాశాలు పెరుగుతున్నాయి. టాలెంట్‌ని దాచుకోవాల్సిన పని లేదు. ఎవరూ చాన్స్ ఇవ్వకపోతే మనమే ఓ వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టవచ్చు. మన ప్రతిభని నిరూపించుకోవచ్చు. సంపూర్ణేష్‌బాబు (హృదయకాలేయం హీరో) సక్సెస్ అయ్యింది అలానే కదా! మరి సినిమాల సంగతేంటి? అక్కడా సేమ్ ప్రాబ్లెమ్. సక్సెస్ అవ్వాలంటే ప్రతిభ ఉంటే చాలదు... అదృష్టం కూడా ఉండాలి. తెరమీద నవ్విస్తారు. కానీ బయట మీ మాట చాలా సీరియస్‌గా ఉంది? నేను బేసిగ్గా చాలా రిజర్వ్డ్గా ఉంటాను. ఎవరితోనూ పెద్దగా కలవను, మాట్లాడను, నవ్వను, నవ్వించను. ఇండస్ట్రీవాళ్లలో నాకెవరూ స్నేహితులు లేరు. ఎందుకంటే... ఇక్కడ చేతులు కట్టుకుని నిలబడాలి. వాళ్లు జోక్ వేస్తే నవ్వు రాకపోయినా నవ్వాలి. అన్ని బంధాలూ ఆర్టిఫిషియల్‌గా ఉంటాయిక్కడ. అందుకే నా కాలేజీ స్నేహితులతోనే ఉంటాను నేను. భవిష్యత్ ప్రణాళికలేంటి? పెద్దగా ఏమీ లేదు. యాంక ర్గా కెరీర్ బాగున్నా... నటుడిగానే నాకు తగినన్ని అవకాశాలు రావడం లేదు. అయినా పెద్ద టెన్షన్ లేదు. చెప్పానుగా టాలెంట్‌ని దాచలేమని! సంవత్సరమో... రెండు సంవత్సరాలో... బ్రేక్ వచ్చి తీరుతుంది. - సమీర నేలపూడి