న్యూఢిల్లీ: టీవీ స్పోర్ట్స్ మార్కెట్ 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 9,830 కోట్లకు చేరనుంది. అలాగే స్పోర్ట్స్ డిజిటల్ ఆదాయం రూ. 4,360 కోట్ల స్థాయిని తాకనుంది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ, ఇండియా బ్రాడ్‌కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంచనాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం టీవీ స్పోర్ట్స్ మార్కెట్ రూ. 7,050 కోట్లుగాను, డిజిటల్ మార్కెట్ ఆదాయం రూ. 1,540 కోట్లుగా ఉంది. ఐపీఎల్ వంటి టోర్నీలతో దేశీయంగా స్పోర్ట్స్ వ్యూయర్‌షిప్‌లో క్రికెట్ అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. కబడ్డీ, ఫుట్‌బా ల్, ఖో–ఖో వంటి క్రికెట్‌యేతర ఫ్రాంచైజీ ఆధారిత ఆటలకు కూడా క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో భారత్‌లో స్పోర్ట్స్ వ్యూయర్‌షిప్ 72.2 కోట్లుగా నమోదైంది. ఏడాది మొత్తం మీద చూస్తే కోవిడ్ పూర్వం (2019లో) నమోదైన 77.6 కోట్ల వ్యూయర్‌షిప్‌ను దాటేసే అవకాశాలు ఉన్నాయని నివేదిక అంచనా వేసింది.
ఓటీటీ ఊతం..: ఎక్కడైనా, ఎప్పుడైనా చూసుకునే సౌలభ్యం కారణంగా ఓటీటీ (ఓవర్–ది–టాప్) ప్లాట్‌ఫామ్‌లపై స్పోర్ట్స్ వ్యూయర్‌షిప్ పెరుగుతోంది. అడ్వర్టయిజర్లు కూడా డిజిటల్ మాధ్యమంపై ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ పెరుగుతుండటం స్పోర్ట్స్‌కి లాభించనుంది. అయితే, గడిచిన కొన్నేళ్లుగా డిజిటల్ వినియోగం పెరుగుతున్నా.. ఇప్పటికీ టీవీ స్పోర్ట్స్ మార్కెట్ ఆధిపత్యమే కొనసాగుతోందని నివేదిక తెలిపింది. మధ్య నుండి దీర్ఘకాలికంగా ఇది .. మొత్తం డిజిటల్ స్పోర్ట్స్ మార్కెట్‌కి రెండింతల స్థాయిలో ఉంటుందని పేర్కొంది.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
► స్పోర్ట్స్ డిజిటల్ ఆదాయం ఏటా 22 శాతం మేర వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది మూడు రెట్లు పెరగనుంది. టీవీ స్పోర్ట్స్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7 శాతం మేర వృద్ధి చెందుతోంది.
► టీవీల వినియోగం పెరిగే కొద్దీ స్పోర్ట్స్ సబ్‌స్క్రిప్షన్ ఆదాయాలకు ఊతం లభించవచ్చని అంచనా. బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అంచనాల ప్రకారం 2020లో 21 కోట్ల కుటుంబాల్లో టీవీలు ఉన్నాయి. సుమారు 90 కోట్ల మంది వీక్షిస్తున్నట్లు అంచనా. టీవీల వినియోగం ఎక్కువగానే ఉన్నప్పటికీ వాటిలో స్పోర్ట్స్ కార్యక్రమాల వ్యూయర్‌షిప్ మాత్రం ఇంకా భారీ స్థాయిలో లేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మొత్తం టీవీ కార్యక్రమాల వీక్షణలో స్పోర్ట్స్ వాటా 10 శాతంగా ఉండగా భారత్‌లో ఇది 3 శాతంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో వృద్ధికి మరింత ఆస్కారముంది. భారతీయ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపిస్తుండటంతో ఆయా ఈవెంట్లను టీవీల్లో చూసేందుకు వీక్షకుల్లో ఆసక్తి పెరగవచ్చు.
► భారత్‌లో స్పోర్ట్స్‌కి సంబంధించి క్రికెట్ ఆధిపత్యమే కొనసాగుతోంది. ఐపీఎల్ సీజన్ అత్యంత ప్రభావవంతంగా ఉంటోంది. 2022లో 44వ వారం వరకూ 16,217 గంటల మేర లైవ్ క్రికెట్ కంటెంట్ టెలికాస్ట్ అయ్యింది. 2021లో ఇది 15,506 గంటలుగా నమోదైంది. పరిమాణంపరంగానూ అలాగే విస్తృతిపరంగాను ఇతరత్రా ఏ క్రీడలు కూడా క్రికెట్‌కు దరిదాపుల్లో లేవని నివేదిక పేర్కొంది. అయితే, కబడ్డీ వంటి క్రికెట్‌యేతర స్పోర్ట్స్‌ను చూడటం కూడా క్రమంగా పెరుగుతోందని వివరించింది. దీంతో ఏడాది పొడవునా ఏదో ఒక క్రీడల కార్యక్రమం వీక్షకులకు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment