KPMG Survey
-
రూ. 10 వేల కోట్లకు టీవీ స్పోర్ట్స్ మార్కెట్
న్యూఢిల్లీ: టీవీ స్పోర్ట్స్ మార్కెట్ 2026 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 9,830 కోట్లకు చేరనుంది. అలాగే స్పోర్ట్స్ డిజిటల్ ఆదాయం రూ. 4,360 కోట్ల స్థాయిని తాకనుంది. పరిశ్రమల సమాఖ్య సీఐఐ, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ, ఇండియా బ్రాడ్‌కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ (ఐబీడీఎఫ్) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంచనాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం టీవీ స్పోర్ట్స్ మార్కెట్ రూ. 7,050 కోట్లుగాను, డిజిటల్ మార్కెట్ ఆదాయం రూ. 1,540 కోట్లుగా ఉంది. ఐపీఎల్ వంటి టోర్నీలతో దేశీయంగా స్పోర్ట్స్ వ్యూయర్షిప్లో క్రికెట్ అగ్రస్థానంలో కొనసాగుతోండగా.. కబడ్డీ, ఫుట్బా ల్, ఖో–ఖో వంటి క్రికెట్‌యేతర ఫ్రాంచైజీ ఆధారిత ఆటలకు కూడా క్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో భారత్‌లో స్పోర్ట్స్ వ్యూయర్షిప్ 72.2 కోట్లుగా నమోదైంది. ఏడాది మొత్తం మీద చూస్తే కోవిడ్ పూర్వం (2019లో) నమోదైన 77.6 కోట్ల వ్యూయర్షిప్ను దాటేసే అవకాశాలు ఉన్నాయని నివేదిక అంచనా వేసింది. ఓటీటీ ఊతం..: ఎక్కడైనా, ఎప్పుడైనా చూసుకునే సౌలభ్యం కారణంగా ఓటీటీ (ఓవర్–ది–టాప్) ప్లాట్‌ఫామ్‌లపై స్పోర్ట్స్ వ్యూయర్షిప్ పెరుగుతోంది. అడ్వర్టయిజర్లు కూడా డిజిటల్ మాధ్యమంపై ఆసక్తి చూపుతున్నారు. ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ పెరుగుతుండటం స్పోర్ట్స్‌కి లాభించనుంది. అయితే, గడిచిన కొన్నేళ్లుగా డిజిటల్ వినియోగం పెరుగుతున్నా.. ఇప్పటికీ టీవీ స్పోర్ట్స్ మార్కెట్ ఆధిపత్యమే కొనసాగుతోందని నివేదిక తెలిపింది. మధ్య నుండి దీర్ఘకాలికంగా ఇది .. మొత్తం డిజిటల్ స్పోర్ట్స్ మార్కెట్‌కి రెండింతల స్థాయిలో ఉంటుందని పేర్కొంది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► స్పోర్ట్స్ డిజిటల్ ఆదాయం ఏటా 22 శాతం మేర వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది మూడు రెట్లు పెరగనుంది. టీవీ స్పోర్ట్స్ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 7 శాతం మేర వృద్ధి చెందుతోంది. ► టీవీల వినియోగం పెరిగే కొద్దీ స్పోర్ట్స్ సబ్స్క్రిప్షన్ ఆదాయాలకు ఊతం లభించవచ్చని అంచనా. బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అంచనాల ప్రకారం 2020లో 21 కోట్ల కుటుంబాల్లో టీవీలు ఉన్నాయి. సుమారు 90 కోట్ల మంది వీక్షిస్తున్నట్లు అంచనా. టీవీల వినియోగం ఎక్కువగానే ఉన్నప్పటికీ వాటిలో స్పోర్ట్స్ కార్యక్రమాల వ్యూయర్షిప్ మాత్రం ఇంకా భారీ స్థాయిలో లేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మొత్తం టీవీ కార్యక్రమాల వీక్షణలో స్పోర్ట్స్ వాటా 10 శాతంగా ఉండగా భారత్‌లో ఇది 3 శాతంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో వృద్ధికి మరింత ఆస్కారముంది. భారతీయ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపిస్తుండటంతో ఆయా ఈవెంట్లను టీవీల్లో చూసేందుకు వీక్షకుల్లో ఆసక్తి పెరగవచ్చు. ► భారత్‌లో స్పోర్ట్స్‌కి సంబంధించి క్రికెట్ ఆధిపత్యమే కొనసాగుతోంది. ఐపీఎల్ సీజన్ అత్యంత ప్రభావవంతంగా ఉంటోంది. 2022లో 44వ వారం వరకూ 16,217 గంటల మేర లైవ్ క్రికెట్ కంటెంట్ టెలికాస్ట్ అయ్యింది. 2021లో ఇది 15,506 గంటలుగా నమోదైంది. పరిమాణంపరంగానూ అలాగే విస్తృతిపరంగాను ఇతరత్రా ఏ క్రీడలు కూడా క్రికెట్‌కు దరిదాపుల్లో లేవని నివేదిక పేర్కొంది. అయితే, కబడ్డీ వంటి క్రికెట్‌యేతర స్పోర్ట్స్‌ను చూడటం కూడా క్రమంగా పెరుగుతోందని వివరించింది. దీంతో ఏడాది పొడవునా ఏదో ఒక క్రీడల కార్యక్రమం వీక్షకులకు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొంది. -
డబ్బే డబ్బు.. భారత్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫిన్‌టెక్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద సాగుతోంది. 2021 జనవరి–జూన్ కాలంలో రూ.14,900 కోట్లకుపైగా నిధులు వెల్లువెత్తాయని కేపీఎంజీ తన నివేదికలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో వచ్చిన ఫండింగ్‌తో ఇది దాదాపు సమానం కావడం గమనార్హం. పైన్‌ల్యాబ్స్ రూ.2,860 కోట్లు, క్రెడ్ రూ.1,597 కోట్లు, రేజర్‌పే రూ.1,189 కోట్లు, క్రెడిట్‌బీ రూ.1,137 కోట్లు, ఆఫ్‌బిజినెస్ రూ.817 కోట్లు, భారత్‌పే రూ.802 కోట్లు అందుకున్నాయి. కంపెనీలు డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేజిక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇన్సూరెన్స్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. టర్టిల్‌మింట్ రూ.342 కోట్లు, రెన్యూబీ రూ.334 కోట్లు, డిజిట్ ఇన్సూరెన్స్ రూ.134 కోట్లు స్వీకరించాయి. చిన్న స్థాయి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఈ స్టార్టప్స్‌లో పెట్టుబడులు చేశాయి. టాప్–10లో నాలుగు.. ఆసియాలో టాప్–10 డీల్స్‌లో పైన్‌ల్యాబ్స్ మూడవ స్థానంలో, క్రెడ్ నాల్గవ, రేజర్‌పే ఎనమిదవ, క్రెడిట్‌బీ 10వ స్థానంలో నిలిచింది. ఇక ఐపీవోలు కొనసాగుతాయని కేపీఎంజీ నివేదిక తెలిపిం ది. పాలసీ బజార్ రూ.6,500 కోట్లు, పేటీఎం రూ.16,500 కోట్ల ఐపీవో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనం, కొనుగోళ్ల విషయంలో ఫిన్‌టెక్ కంపెనీలను బ్యాంకులు, ఈ రంగంలోని పెద్ద సంస్థలు, సర్వీసులు అందిస్తున్న దిగ్గజాలు లక్ష్యంగా చేసుకున్నాయి. రానున్న ఏడాదిలో ముందు వరుసలో ఉన్న ఫిన్‌టెక్ యూనికార్న్ కంపెనీలు క్యాపిటల్ మార్కెట్‌పై దృష్టిసారిస్తాయి. బ్యాంకులు సైతం ఫిన్‌టెక్ కంపెనీలు, కొత్త బ్యాంకులు, వెల్త్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా సైతం.. తొలి ఆరు నెలల్లో అంతర్జాతీయంగా నిధులు వెల్లువెత్తాయి. రూ.7,28,140 కోట్లు ఫిన్‌టెక్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. 2020లో ఈ మొత్తం రూ.9,02,745 కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి–జూన్‌లో యూఎస్ కంపెనీల్లోకి రూ.3,78,930 కోట్లు, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా రూ.2,90,513 కోట్లు, ఆసియా పసిఫిక్ సంస్థల్లోకి రూ.55,725 కోట్లు వచ్చి చేరాయి. విలీనాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ.3,02,400 కోట్ల విలువైన 353 డీల్స్ జరిగాయి. 2020లో 502 డీల్స్ నమోదయ్యాయి. వీటి విలువ రూ.5,49,820 కోట్లు. జూలై–డిసెంబరు కాలంలోనూ అన్ని ప్రాంతాల్లో ఇదే స్థాయిలో పెట్టుబడులు, డీల్స్ ఉండొచ్చని కేపీఎంజీ అంచనా వేస్తోంది. పేమెంట్స్, ఫైనాన్షియల్ సొల్యూషన్స్, బ్యాంకింగ్ యాజ్ ఏ సర్వీస్, బీ2బీ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌లో పెట్టుబడులు ఉంటాయని వివరించింది. చదవండి: భారత్ ఎగుమతులు ట్రిలియన్ డాలర్లకు చేరడం ఖాయం -
ఎకానమీపై మహమ్మారి పంజా!
కరోనా వైరస్ మహమ్మారి మరింతగా విస్తరించి, లాక్‌డౌన్‌ను పొడిగించడంతో పాటు ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకున్న పక్షంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 3 శాతం లోపునకు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. జీడీపీలో ప్రధానమైన ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు, విదేశీ వాణిజ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. మూడు రకాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కేపీఎంజీ దీన్ని రూపొందించింది. ఒకవేళ ఏప్రిల్ ఆఖరు నుంచి మే మధ్య నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా అదుపులోకి వస్తే.. 2020–21లో భారత వృద్ధి రేటు 5.3–5.7 శాతం స్థాయిలో ఉండవచ్చని.. కానీ ప్రస్తుతం ఇది జరిగే అవకాశమైతే లేదని పేర్కొంది. ఇక రెండో కోణంలో.. కరోనా వైరస్‌ను భారత్ కట్టడి చేసినా అంతర్జాతీయంగా మాంద్యం వస్తే.. భారత వృద్ధి రేటు 4–4.5 శాతం మధ్యలో ఉండవచ్చు. అలా కాకుండా మహమ్మారి మరింత ముదిరి, మాంద్యం వస్తే మాత్రం భారత వృద్ధి 3 శాతం లోపునకు పడిపోవచ్చని కేపీఎంజీ పేర్కొంది. దీంతో పాటు వివిధ రంగాలపై కరోనా వైరస్ ప్రభావాల గురించి విశ్లేషించింది. వాటిలో ముఖ్యమైన కొన్ని రంగాలు.. టెక్స్టైల్స్ 10–12 శాతం డౌన్ కరోనా వైరస్ వ్యాప్తి దెబ్బకు ఏప్రిల్–జూన్ క్వార్టర్లో దేశీ టెక్స్టైల్స్, అపారెల్ రంగ ఉత్పత్తి 10–12 శాతం పడిపోవచ్చు. అలాగే రాబోయే మరికొన్ని త్రైమాసికాలు టెక్స్టైల్ ఎగుమతులు దెబ్బతినొచ్చు. తయారీ రంగ కోణంలో చూస్తే దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోవడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. చిన్న, మధ్య తరహా సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చు. లాక్డౌన్ నాలుగు వారాలు మించి కొనసాగిన పక్షంలో దేశీయంగా 7.5 కోట్ల ఎంఎస్ఎంఈల్లో దాదాపు పావు వంతు సంస్థలు మూతబడవచ్చు. ఇది ఎనిమిది వారాలు పైగా కొనసాగితే ఏకంగా 43 శాతం సంస్థలు మూతపడే అవకాశం ఉందని అఖిల భారత తయారీ సంస్థల సమాఖ్య (ఏఐఎంవో) అంచనా. ఆటోకు కష్టకాలం.. ఆహారం, ఔషధాలు వంటి నిత్యావసరాల కొనుగోళ్లకు గణనీయంగా వెచ్చించాల్సి రావడం వల్ల ప్రజలు.. వాహనాల్లాంటి వాటి కొనుగోళ్లను వాయిదా వేసుకునే అవకాశముంది. కేవలం తప్పనిసరి రిపేర్ సంబంధ ఆఫ్టర్ మార్కెట్ సర్వీసులకు మాత్రమే కాస్త డిమాండ్ ఉండవచ్చు. కొనుగోలు శక్తి, సెంటిమెంటు బలహీనపడటం వల్ల ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, కార్లకు డిమాండ్ అంతంతే ఉంటుంది. నిత్యావసరాలు కాని సేవలన్నీ నిలిపివేయడం వల్ల వాణిజ్య వాహనాలకు డిమాండ్ మరింత పడిపోతుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల్లో సంక్షోభం, బ్యాంకింగ్‌లో నెలకొన్న పరిస్థితులతో రుణ లభ్యత సమస్యల వల్ల అమ్మకాలు దెబ్బతినొచ్చు. నిర్మాణ రంగం..పెట్టుబడుల మందగమనం.. డిమాండ్ ఒక మోస్తరుగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం గణనీయంగా తగ్గిపోతుంది. అమెరికా, యూరప్ దేశాల్లో మందగమనంతో కమర్షియల్ రియల్ ఎస్టేట్ విభాగంలో పెట్టుబడులు తగ్గవచ్చు లేదా ద్వితీయార్ధానికి వాయిదా పడొచ్చు. దేశీ రియల్ ఎస్టేట్ రంగంలోకి కొత్త పెట్టుబడులు మందగించడం వల్ల అనుబంధ రంగాలన్నీ కూడా సంక్షోభంలో పడే అవకాశం ఉంది. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వంటి రంగాలు స్వల్పకాలికంగా దెబ్బతిన్నా, కంపెనీలు చైనా నుంచి ఇతర ఆసియా దేశాలకు (భారత్, వియత్నాం, కాంబోడియా వంటివి) తమ తయారీ బేస్‌ను మార్చుకునే యోచనలో ఉన్నందున.. వేగంగా పుంజుకోవచ్చు. రిటైల్.. ఈకామర్స్‌కు సవాళ్లు.. బియ్యం, పప్పు ధాన్యాలు వంటి వాటిపై ప్రజల ఖర్చుల సరళిని కరోనా పరిణామాలు నిర్దేశించనున్నాయి. సరఫరా వ్యవస్థలకు రాబోయే రెండు, మూడు వారాలు పరీక్షా సమయంలాంటిది. ఈ–కామర్స్ రంగం వృద్ధి మందగించవచ్చు. నిత్యావసరయేతర ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పడిపోవచ్చు. వీటికి సంబంధించి ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి రావడం కూడా పెద్ద రిస్కే. అపారెల్, డ్యూరబుల్స్, రెస్టారెంట్లు, జిమ్‌లు మొదలైన విభాగాలు పెను సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చు. బలహీన బ్యాంకులకు ఇబ్బందే... సొమ్ము భద్రత కోసం ఖాతాదారులు పటిష్టమైన పెద్ద బ్యాంకుల్లోకి డిపాజిట్లను మళ్లించుకుంటూ ఉండటం వల్ల బలహీన ప్రైవేట్ బ్యాంకులు, కో–ఆపరేటివ్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులపై లిక్విడిటీపరంగా ప్రతికూల ప్రభావం పడవచ్చు. మారటోరియం ఎత్తివేశాక రెండు, మూడో త్రైమాసికాల్లో మొండిపద్దులు పెరిగే పక్షంలో బ్యాంకులపై భారం పెరగవచ్చు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీలేమీ ఇప్పటివరకూ లేకపోవడంతో ఏవియేషన్, ఆటోమొబైల్, నిర్మాణ తదితర రంగాల సం స్థలు రుణాల చెల్లింపుల్లో సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆ ప్రభావం ఆర్థిక సంస్థలపైనా పడే అవకాశం ఉంది. ఇక రిటైల్ రుణాల విషయానికొస్తే అఫోర్డబుల్ హౌసింగ్, ద్విచక్ర వాహనాల ఫైనాన్సింగ్, సూక్ష్మ రుణాల విభాగాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఫార్మాకు ముడి వనరుల సమస్యలు.. చైనా నుంచి సరఫరా తగ్గిపోవడంతో ముడివనరుల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే జనరిక్ డ్రగ్స్ తయారీ సంస్థలపై ప్రభావం పడుతోంది. చైనాలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం అవుతుండటంతో ఈ సమస్య కాస్త తగ్గవచ్చు. ఇక లాక్డౌన్ కారణంగా కార్మికులు దొరక్కపోవడం, ప్యాకింగ్ మెటీరియల్ లభ్యతపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలతో ఉత్పత్తి దెబ్బతింటోంది. ముడిఉత్పత్తులు ఫ్యాక్టరీలకు చేరకపోవడం కూడా తయారీని దెబ్బతీస్తోంది. అత్యవసర ఔషధాలు, శానిటైజర్లు, పీపీఈల (మాస్కులు, గ్లవ్స్ మొదలైనవి) సరఫరా, పంపిణీపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాలు ఔషధాలను నిల్వ చేసుకుంటూ ఉండటం వల్ల స్వల్పకాలికంగా ఎగుమతులకు డిమాండ్ పెరగవచ్చు. ఈసారి వృద్ధి 1.6 శాతమే... గోల్డ్‌మాన్ శాక్స్ అంచనా ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు పలు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోనుందని అమెరికన్ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ హెచ్చరించింది. 2020–21లో ఇది 1.6 శాతమే ఉండవచ్చని పేర్కొంది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత విధానకర్తలు అవసరమైనంత దూకుడుగా వ్యవహరించడం లేదని, ఇకనైనా జోరు పెంచాల్సి ఉంటుందని గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది. ‘విధానాలపరంగా ప్రభుత్వం ఎంత తోడ్పాటు అందిస్తున్నా.. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్, వైరస్ గురించి ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో మార్చిలో ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పడిపోయాయి. తదుపరి క్వార్టర్లో కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది‘ అని వివరించింది. గతంలో వచ్చిన మాంద్యాలతో పోలిస్తే ప్రస్తుతం భిన్న పరిస్థితి నెలకొందని, అప్పట్లో లేనంతగా ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే పలు రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాలను సుమారు 2 శాతం స్థాయికి కుదించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీ సరిపోదు.. కరోనా సవాళ్లను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ, ముప్పావు శాతం మేర రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోత సరిపోదని.. అంతకు మించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) 60% ఉండే వినియోగం.. లాక్డౌన్ కారణంగా గణనీయంగా పడిపోవచ్చని పేర్కొంది. -
ఆఫీసు సమయంలోనే ఆన్లైన్లో!!
స్మార్ట్ఫోన్లు వచ్చాక ఇంటర్నెట్లో విహరించడం సులువు అయింది. భారతీయుల్లో అత్యధికులు ఆఫీసు సమయంలోనే.. అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆన్లైన్ కంటెంట్‌ను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారని కేపీఎంజీ, ఇరోస్ నౌ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫామ్స్‌పై సగటున రోజుకు 70 నిముషాలకుపైగా సమయం వెచ్చిస్తున్నారట. హైదరాబాద్ సహా 16 నగరాల్లో చేపట్టిన ఈ సర్వేలో 1,458 మంది ఓవర్ ద టాప్ యూజర్లు పాల్గొన్నారు. వీరిలో 87 శాతం మంది ఆన్లైన్ కంటెంట్‌ను తమ ఫోన్లలోనే వినియోగిస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 మధ్య వీడియోలు, చిత్రా లను చూస్తున్నవారు 28 శాతం మంది ఉన్నారు. వీరు మూవీస్‌నే ఎక్కువగా వీక్షిస్తున్నారు. ఒరిజినల్, కొత్త కంటెంట్‌ను ఆస్వాదించేందుకే ఇష్టపడుతున్నారు. -
కార్పొరేట్ మోసాల్లో మహిళలు కూడా కింగ్లేనట
కార్పొరేట్ కంపెనీల్లో మోసాలంటే ఇప్పటివరకూ పురుషులకే సొంతం అనుకునేవాళ్లు. కానీ ఈ మోసాల్లో మహిళల శాతం కూడా నెమ్మదిగా పెరుగుతుందట. టాక్స్, ఆడిట్, రిస్క్ మేనేజ్ మెంట్ సంస్థ కేపీఎమ్‌జీ వెల్లడించిన రిపోర్టులో ఈ నిగ్గుతేలని నిజాలు వెల్లడయ్యాయి. అయితే కార్పొరేట్ మోసాల్లో నేరస్తులుగా పురుషులే అగ్రస్థానంలో ఉన్నారని రిపోర్టు నివేదించింది. 2013 మార్చి నుంచి 2015 ఆగస్టు వరకూ 750 మంది ఈ మోసాలకు పాల్పడితే, వారిలో 17శాతం మంది మహిళలే ఉన్నారని పేర్కొంది. అయితే ఈ శాతం 2010లో 10శాతమేనట. 68శాతం నేరస్తులు ప్రపంచవ్యాప్తంగా ఉంటే, 59శాతం మంది భారత్ లో ఉన్నారని తెలిపింది. మోసాలకు పాల్సడే 45 శాతం మంది మహిళలు 36-45 మధ్య వయస్కులేనని రిపోర్టు నివేదించింది. అదేవిధంగా 32శాతం మంది 26-35 మధ్య వయస్కులని, ఈ శాతం గ్లోబల్ గా 14శాతమేనని పేర్కొంది. గ్లోబల్ గా పోల్చుకుంటే భారత్ లో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వారు యువకులు ఎక్కువగా ఉంటున్నారని రిపోర్టు వెల్లడించింది. జూనియర్ స్టాఫ్ లకంటే మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగులే ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారని, కేపీఎమ్ జీ తెలిపింది. ఆస్తులను తప్పుగా చూపడం, ఫైనాన్సియల్ రిపోర్టింగ్ లాంటి వాటిని మోసాలుగా ఎంచుకుంటున్నారని, సైబర్ మోసం అతిప్రధానమైన టెక్నాలజీ ఆధారిత మోసంగా ఉందని రిపోర్టు నివేదించింది. సైబర్ మోసాల హాని క్రమేపీ పెరుగుతుందని, ఆర్గనైజేషన్స్ దీనిపై ఎక్కువగా దృష్టిసారించాలని సూచించింది.