ఎకానమీపై మహమ్మారి పంజా! | India is Growth May Slip Below 3Percent In FY21 if COVID-19 Proliferates | Sakshi
Sakshi News home page

ఎకానమీపై మహమ్మారి పంజా!

Published Thu, Apr 9 2020 5:31 AM | Last Updated on Thu, Apr 9 2020 5:33 AM

India is Growth May Slip Below 3Percent In FY21 if COVID-19 Proliferates - Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారి మరింతగా విస్తరించి, లాక్‌డౌన్‌ను పొడిగించడంతో పాటు ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకున్న పక్షంలో..  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 3 శాతం లోపునకు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. జీడీపీలో ప్రధానమైన ప్రైవేట్‌ వినియోగం, పెట్టుబడులు, విదేశీ వాణిజ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. మూడు రకాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కేపీఎంజీ దీన్ని రూపొందించింది.

ఒకవేళ ఏప్రిల్‌ ఆఖరు నుంచి మే మధ్య నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా అదుపులోకి వస్తే.. 2020–21లో భారత వృద్ధి రేటు 5.3–5.7 శాతం స్థాయిలో ఉండవచ్చని.. కానీ ప్రస్తుతం ఇది జరిగే అవకాశమైతే లేదని పేర్కొంది. ఇక రెండో కోణంలో.. కరోనా వైరస్‌ను భారత్‌ కట్టడి చేసినా అంతర్జాతీయంగా మాంద్యం వస్తే.. భారత వృద్ధి రేటు 4–4.5 శాతం మధ్యలో ఉండవచ్చు. అలా కాకుండా మహమ్మారి మరింత ముదిరి, మాంద్యం వస్తే మాత్రం భారత వృద్ధి 3 శాతం లోపునకు పడిపోవచ్చని కేపీఎంజీ పేర్కొంది. దీంతో పాటు వివిధ రంగాలపై కరోనా వైరస్‌ ప్రభావాల గురించి విశ్లేషించింది. వాటిలో ముఖ్యమైన కొన్ని రంగాలు..


టెక్స్‌టైల్స్‌ 10–12 శాతం డౌన్‌
కరోనా వైరస్‌ వ్యాప్తి దెబ్బకు ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌లో దేశీ టెక్స్‌టైల్స్, అపారెల్‌ రంగ ఉత్పత్తి 10–12 శాతం పడిపోవచ్చు. అలాగే రాబోయే మరికొన్ని త్రైమాసికాలు టెక్స్‌టైల్‌ ఎగుమతులు దెబ్బతినొచ్చు. తయారీ రంగ కోణంలో చూస్తే దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్‌ పడిపోవడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. చిన్న, మధ్య తరహా సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చు. లాక్‌డౌన్‌ నాలుగు వారాలు మించి కొనసాగిన పక్షంలో దేశీయంగా 7.5 కోట్ల ఎంఎస్‌ఎంఈల్లో దాదాపు పావు వంతు సంస్థలు మూతబడవచ్చు. ఇది ఎనిమిది వారాలు పైగా కొనసాగితే ఏకంగా 43 శాతం సంస్థలు మూతపడే అవకాశం ఉందని అఖిల భారత తయారీ సంస్థల సమాఖ్య (ఏఐఎంవో) అంచనా.


ఆటోకు కష్టకాలం..
ఆహారం, ఔషధాలు వంటి నిత్యావసరాల కొనుగోళ్లకు గణనీయంగా వెచ్చించాల్సి రావడం వల్ల ప్రజలు.. వాహనాల్లాంటి వాటి కొనుగోళ్లను వాయిదా వేసుకునే అవకాశముంది. కేవలం తప్పనిసరి రిపేర్‌ సంబంధ ఆఫ్టర్‌ మార్కెట్‌ సర్వీసులకు మాత్రమే కాస్త డిమాండ్‌ ఉండవచ్చు. కొనుగోలు శక్తి, సెంటిమెంటు బలహీనపడటం వల్ల ప్యాసింజర్‌ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, కార్లకు డిమాండ్‌ అంతంతే ఉంటుంది. నిత్యావసరాలు కాని సేవలన్నీ నిలిపివేయడం వల్ల వాణిజ్య వాహనాలకు డిమాండ్‌ మరింత పడిపోతుంది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థల్లో సంక్షోభం, బ్యాంకింగ్‌లో నెలకొన్న పరిస్థితులతో రుణ లభ్యత సమస్యల వల్ల అమ్మకాలు దెబ్బతినొచ్చు.


నిర్మాణ రంగం..పెట్టుబడుల మందగమనం..
డిమాండ్‌ ఒక మోస్తరుగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం గణనీయంగా తగ్గిపోతుంది. అమెరికా, యూరప్‌ దేశాల్లో మందగమనంతో కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ విభాగంలో పెట్టుబడులు తగ్గవచ్చు లేదా ద్వితీయార్ధానికి వాయిదా పడొచ్చు. దేశీ రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి కొత్త పెట్టుబడులు మందగించడం వల్ల అనుబంధ రంగాలన్నీ కూడా సంక్షోభంలో పడే అవకాశం ఉంది. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్‌ వంటి రంగాలు స్వల్పకాలికంగా దెబ్బతిన్నా, కంపెనీలు చైనా నుంచి ఇతర ఆసియా దేశాలకు (భారత్, వియత్నాం, కాంబోడియా వంటివి) తమ తయారీ బేస్‌ను మార్చుకునే యోచనలో ఉన్నందున.. వేగంగా పుంజుకోవచ్చు.  


రిటైల్‌.. ఈకామర్స్‌కు సవాళ్లు..
బియ్యం, పప్పు ధాన్యాలు వంటి వాటిపై ప్రజల ఖర్చుల సరళిని కరోనా పరిణామాలు నిర్దేశించనున్నాయి. సరఫరా వ్యవస్థలకు రాబోయే రెండు, మూడు వారాలు పరీక్షా సమయంలాంటిది. ఈ–కామర్స్‌ రంగం వృద్ధి మందగించవచ్చు. నిత్యావసరయేతర ఉత్పత్తులకు డిమాండ్‌ గణనీయంగా పడిపోవచ్చు. వీటికి సంబంధించి ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి రావడం కూడా పెద్ద రిస్కే. అపారెల్, డ్యూరబుల్స్, రెస్టారెంట్లు, జిమ్‌లు మొదలైన విభాగాలు పెను సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చు.


బలహీన బ్యాంకులకు ఇబ్బందే...

సొమ్ము భద్రత కోసం ఖాతాదారులు పటిష్టమైన పెద్ద బ్యాంకుల్లోకి డిపాజిట్లను మళ్లించుకుంటూ ఉండటం వల్ల బలహీన ప్రైవేట్‌ బ్యాంకులు, కో–ఆపరేటివ్‌ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులపై లిక్విడిటీపరంగా ప్రతికూల ప్రభావం పడవచ్చు. మారటోరియం ఎత్తివేశాక రెండు, మూడో త్రైమాసికాల్లో మొండిపద్దులు పెరిగే పక్షంలో బ్యాంకులపై భారం పెరగవచ్చు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీలేమీ ఇప్పటివరకూ లేకపోవడంతో ఏవియేషన్, ఆటోమొబైల్,  నిర్మాణ తదితర రంగాల సం స్థలు రుణాల చెల్లింపుల్లో సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆ ప్రభావం ఆర్థిక సంస్థలపైనా పడే అవకాశం ఉంది. ఇక రిటైల్‌ రుణాల విషయానికొస్తే అఫోర్డబుల్‌ హౌసింగ్, ద్విచక్ర వాహనాల ఫైనాన్సింగ్, సూక్ష్మ రుణాల విభాగాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చు.


ఫార్మాకు ముడి వనరుల సమస్యలు..

చైనా నుంచి సరఫరా తగ్గిపోవడంతో ముడివనరుల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే జనరిక్‌ డ్రగ్స్‌ తయారీ సంస్థలపై ప్రభావం పడుతోంది. చైనాలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం అవుతుండటంతో ఈ సమస్య కాస్త తగ్గవచ్చు. ఇక లాక్‌డౌన్‌ కారణంగా కార్మికులు దొరక్కపోవడం, ప్యాకింగ్‌ మెటీరియల్‌ లభ్యతపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలతో ఉత్పత్తి దెబ్బతింటోంది. ముడిఉత్పత్తులు ఫ్యాక్టరీలకు చేరకపోవడం కూడా తయారీని దెబ్బతీస్తోంది. అత్యవసర ఔషధాలు, శానిటైజర్లు, పీపీఈల (మాస్కులు, గ్లవ్స్‌ మొదలైనవి) సరఫరా, పంపిణీపై ప్రతికూల ప్రభావం పడుతోంది.  అమెరికాతో పాటు యూరోపియన్‌ యూనియన్‌లోని పలు దేశాలు ఔషధాలను నిల్వ చేసుకుంటూ ఉండటం వల్ల స్వల్పకాలికంగా ఎగుమతులకు డిమాండ్‌ పెరగవచ్చు.


ఈసారి వృద్ధి 1.6 శాతమే...

గోల్డ్‌మాన్‌ శాక్స్‌ అంచనా
ముంబై: కరోనా వైరస్‌ మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధి రేటు పలు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోనుందని అమెరికన్‌ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ హెచ్చరించింది. 2020–21లో ఇది 1.6 శాతమే ఉండవచ్చని పేర్కొంది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత విధానకర్తలు అవసరమైనంత దూకుడుగా వ్యవహరించడం లేదని, ఇకనైనా జోరు పెంచాల్సి ఉంటుందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అభిప్రాయపడింది. ‘విధానాలపరంగా ప్రభుత్వం ఎంత తోడ్పాటు అందిస్తున్నా.. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్, వైరస్‌ గురించి ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో మార్చిలో ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పడిపోయాయి. తదుపరి క్వార్టర్‌లో కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది‘ అని వివరించింది. గతంలో వచ్చిన మాంద్యాలతో పోలిస్తే ప్రస్తుతం భిన్న పరిస్థితి నెలకొందని, అప్పట్లో లేనంతగా ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే పలు రేటింగ్‌ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాలను సుమారు 2 శాతం స్థాయికి కుదించిన సంగతి తెలిసిందే.  


ఈ ప్యాకేజీ సరిపోదు..

కరోనా సవాళ్లను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ, ముప్పావు శాతం మేర రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల కోత సరిపోదని.. అంతకు మించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ తెలిపింది. స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) 60% ఉండే వినియోగం.. లాక్‌డౌన్‌ కారణంగా గణనీయంగా పడిపోవచ్చని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement