Pestilences
-
ఎకానమీపై మహమ్మారి పంజా!
కరోనా వైరస్ మహమ్మారి మరింతగా విస్తరించి, లాక్‌డౌన్‌ను పొడిగించడంతో పాటు ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకున్న పక్షంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 3 శాతం లోపునకు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. జీడీపీలో ప్రధానమైన ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు, విదేశీ వాణిజ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. మూడు రకాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కేపీఎంజీ దీన్ని రూపొందించింది. ఒకవేళ ఏప్రిల్ ఆఖరు నుంచి మే మధ్య నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా అదుపులోకి వస్తే.. 2020–21లో భారత వృద్ధి రేటు 5.3–5.7 శాతం స్థాయిలో ఉండవచ్చని.. కానీ ప్రస్తుతం ఇది జరిగే అవకాశమైతే లేదని పేర్కొంది. ఇక రెండో కోణంలో.. కరోనా వైరస్‌ను భారత్ కట్టడి చేసినా అంతర్జాతీయంగా మాంద్యం వస్తే.. భారత వృద్ధి రేటు 4–4.5 శాతం మధ్యలో ఉండవచ్చు. అలా కాకుండా మహమ్మారి మరింత ముదిరి, మాంద్యం వస్తే మాత్రం భారత వృద్ధి 3 శాతం లోపునకు పడిపోవచ్చని కేపీఎంజీ పేర్కొంది. దీంతో పాటు వివిధ రంగాలపై కరోనా వైరస్ ప్రభావాల గురించి విశ్లేషించింది. వాటిలో ముఖ్యమైన కొన్ని రంగాలు.. టెక్స్టైల్స్ 10–12 శాతం డౌన్ కరోనా వైరస్ వ్యాప్తి దెబ్బకు ఏప్రిల్–జూన్ క్వార్టర్లో దేశీ టెక్స్టైల్స్, అపారెల్ రంగ ఉత్పత్తి 10–12 శాతం పడిపోవచ్చు. అలాగే రాబోయే మరికొన్ని త్రైమాసికాలు టెక్స్టైల్ ఎగుమతులు దెబ్బతినొచ్చు. తయారీ రంగ కోణంలో చూస్తే దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోవడం వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. చిన్న, మధ్య తరహా సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవచ్చు. లాక్డౌన్ నాలుగు వారాలు మించి కొనసాగిన పక్షంలో దేశీయంగా 7.5 కోట్ల ఎంఎస్ఎంఈల్లో దాదాపు పావు వంతు సంస్థలు మూతబడవచ్చు. ఇది ఎనిమిది వారాలు పైగా కొనసాగితే ఏకంగా 43 శాతం సంస్థలు మూతపడే అవకాశం ఉందని అఖిల భారత తయారీ సంస్థల సమాఖ్య (ఏఐఎంవో) అంచనా. ఆటోకు కష్టకాలం.. ఆహారం, ఔషధాలు వంటి నిత్యావసరాల కొనుగోళ్లకు గణనీయంగా వెచ్చించాల్సి రావడం వల్ల ప్రజలు.. వాహనాల్లాంటి వాటి కొనుగోళ్లను వాయిదా వేసుకునే అవకాశముంది. కేవలం తప్పనిసరి రిపేర్ సంబంధ ఆఫ్టర్ మార్కెట్ సర్వీసులకు మాత్రమే కాస్త డిమాండ్ ఉండవచ్చు. కొనుగోలు శక్తి, సెంటిమెంటు బలహీనపడటం వల్ల ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు, కార్లకు డిమాండ్ అంతంతే ఉంటుంది. నిత్యావసరాలు కాని సేవలన్నీ నిలిపివేయడం వల్ల వాణిజ్య వాహనాలకు డిమాండ్ మరింత పడిపోతుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల్లో సంక్షోభం, బ్యాంకింగ్‌లో నెలకొన్న పరిస్థితులతో రుణ లభ్యత సమస్యల వల్ల అమ్మకాలు దెబ్బతినొచ్చు. నిర్మాణ రంగం..పెట్టుబడుల మందగమనం.. డిమాండ్ ఒక మోస్తరుగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం గణనీయంగా తగ్గిపోతుంది. అమెరికా, యూరప్ దేశాల్లో మందగమనంతో కమర్షియల్ రియల్ ఎస్టేట్ విభాగంలో పెట్టుబడులు తగ్గవచ్చు లేదా ద్వితీయార్ధానికి వాయిదా పడొచ్చు. దేశీ రియల్ ఎస్టేట్ రంగంలోకి కొత్త పెట్టుబడులు మందగించడం వల్ల అనుబంధ రంగాలన్నీ కూడా సంక్షోభంలో పడే అవకాశం ఉంది. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వంటి రంగాలు స్వల్పకాలికంగా దెబ్బతిన్నా, కంపెనీలు చైనా నుంచి ఇతర ఆసియా దేశాలకు (భారత్, వియత్నాం, కాంబోడియా వంటివి) తమ తయారీ బేస్‌ను మార్చుకునే యోచనలో ఉన్నందున.. వేగంగా పుంజుకోవచ్చు. రిటైల్.. ఈకామర్స్‌కు సవాళ్లు.. బియ్యం, పప్పు ధాన్యాలు వంటి వాటిపై ప్రజల ఖర్చుల సరళిని కరోనా పరిణామాలు నిర్దేశించనున్నాయి. సరఫరా వ్యవస్థలకు రాబోయే రెండు, మూడు వారాలు పరీక్షా సమయంలాంటిది. ఈ–కామర్స్ రంగం వృద్ధి మందగించవచ్చు. నిత్యావసరయేతర ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పడిపోవచ్చు. వీటికి సంబంధించి ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి రావడం కూడా పెద్ద రిస్కే. అపారెల్, డ్యూరబుల్స్, రెస్టారెంట్లు, జిమ్‌లు మొదలైన విభాగాలు పెను సవాళ్లు ఎదుర్కొనాల్సి రావొచ్చు. బలహీన బ్యాంకులకు ఇబ్బందే... సొమ్ము భద్రత కోసం ఖాతాదారులు పటిష్టమైన పెద్ద బ్యాంకుల్లోకి డిపాజిట్లను మళ్లించుకుంటూ ఉండటం వల్ల బలహీన ప్రైవేట్ బ్యాంకులు, కో–ఆపరేటివ్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులపై లిక్విడిటీపరంగా ప్రతికూల ప్రభావం పడవచ్చు. మారటోరియం ఎత్తివేశాక రెండు, మూడో త్రైమాసికాల్లో మొండిపద్దులు పెరిగే పక్షంలో బ్యాంకులపై భారం పెరగవచ్చు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీలేమీ ఇప్పటివరకూ లేకపోవడంతో ఏవియేషన్, ఆటోమొబైల్, నిర్మాణ తదితర రంగాల సం స్థలు రుణాల చెల్లింపుల్లో సమస్యలు ఎదుర్కోవచ్చు. ఆ ప్రభావం ఆర్థిక సంస్థలపైనా పడే అవకాశం ఉంది. ఇక రిటైల్ రుణాల విషయానికొస్తే అఫోర్డబుల్ హౌసింగ్, ద్విచక్ర వాహనాల ఫైనాన్సింగ్, సూక్ష్మ రుణాల విభాగాలపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఫార్మాకు ముడి వనరుల సమస్యలు.. చైనా నుంచి సరఫరా తగ్గిపోవడంతో ముడివనరుల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడే జనరిక్ డ్రగ్స్ తయారీ సంస్థలపై ప్రభావం పడుతోంది. చైనాలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం అవుతుండటంతో ఈ సమస్య కాస్త తగ్గవచ్చు. ఇక లాక్డౌన్ కారణంగా కార్మికులు దొరక్కపోవడం, ప్యాకింగ్ మెటీరియల్ లభ్యతపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలతో ఉత్పత్తి దెబ్బతింటోంది. ముడిఉత్పత్తులు ఫ్యాక్టరీలకు చేరకపోవడం కూడా తయారీని దెబ్బతీస్తోంది. అత్యవసర ఔషధాలు, శానిటైజర్లు, పీపీఈల (మాస్కులు, గ్లవ్స్ మొదలైనవి) సరఫరా, పంపిణీపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్‌లోని పలు దేశాలు ఔషధాలను నిల్వ చేసుకుంటూ ఉండటం వల్ల స్వల్పకాలికంగా ఎగుమతులకు డిమాండ్ పెరగవచ్చు. ఈసారి వృద్ధి 1.6 శాతమే... గోల్డ్‌మాన్ శాక్స్ అంచనా ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు పలు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోనుందని అమెరికన్ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ హెచ్చరించింది. 2020–21లో ఇది 1.6 శాతమే ఉండవచ్చని పేర్కొంది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత విధానకర్తలు అవసరమైనంత దూకుడుగా వ్యవహరించడం లేదని, ఇకనైనా జోరు పెంచాల్సి ఉంటుందని గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది. ‘విధానాలపరంగా ప్రభుత్వం ఎంత తోడ్పాటు అందిస్తున్నా.. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్, వైరస్ గురించి ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో మార్చిలో ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పడిపోయాయి. తదుపరి క్వార్టర్లో కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది‘ అని వివరించింది. గతంలో వచ్చిన మాంద్యాలతో పోలిస్తే ప్రస్తుతం భిన్న పరిస్థితి నెలకొందని, అప్పట్లో లేనంతగా ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే పలు రేటింగ్ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాలను సుమారు 2 శాతం స్థాయికి కుదించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీ సరిపోదు.. కరోనా సవాళ్లను ఎదుర్కొనే దిశగా ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ, ముప్పావు శాతం మేర రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోత సరిపోదని.. అంతకు మించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. స్థూల దేశీయోత్పత్తిలో(జీడీపీ) 60% ఉండే వినియోగం.. లాక్డౌన్ కారణంగా గణనీయంగా పడిపోవచ్చని పేర్కొంది. -
రోకలి దండు
ధాన్యం దంచుకునే రోకలి.. పసుపుకొమ్ములను పొడిగొట్టే రోకలి..ఎండుమిర్చిని ఎర్రకారం చేసే రోకలి.. కన్నెర్ర చేస్తే?!‘ఓనకే ఒబవ్వ’ అవుతుంది. 18 వ శతాబ్దంలో హైదర్ అలీ సేనల మాడు పగలగొట్టిన ఆ రోకలిని ఇప్పుడు..ఖాకీ బ్రాండుగా మార్చుకుంది కన్నడదేశం.ఆమె పేరుతో ఓ పోలీసు దండునుతయారు చేసింది!మహిళారక్షణ కోసం రోకలిదండును పంపింది. పద్దెమినిదో శతాబ్దం.. కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతం. ఆ రాజ్యాన్ని మాదకారి నాయక పాలిస్తున్న కాలం (1754 – 1779). హైదర్ అలీ ఆ రాతికోటను ఆక్రమించుకోవాలని పథకం వేస్తుంటాడు. పటిష్టమైన సైనిక కాపలాను ఛేదించుకొని ఆ దుర్గాన్ని వశం చేసుకోవడం వల్లకాదెలా అనుకుంటాడు. ఆ కోటలోకి వెళ్లే దారి కోసం పరిశోధన మొదలుపెడ్తాడు. అప్పుడు కనపడుతుంది ఓ గుహ మార్గం చిత్రదుర్గానికి ఒకవైపున. ఆ గుహ ద్వారా దుర్గాన్ని చేరుకోవచ్చు. అయితే సన్నని రంధ్రం లాంటి ఆ మార్గం దగ్గర కూడా మాదకారి నాయక ఓ కాపలాదారుడిని నియమిస్తాడు. ఆ కాపలాదారు పేరు హనుమ. అన్నం పెట్టి.. నీళ్ల కోసం వచ్చింది కాపలా కాస్తున్న హనుమ ఒకరోజు మధ్యాహ్నం విపరీతంగా ఆకలివేయడంతో భోజనానికని గుహకు దగ్గర్లోనే ఉన్న ఇంటికి వెళ్లాడు. ‘‘ఆకలేస్తోంది అన్నం పెట్టు.. భోజనం ముగించుకుని త్వరగా వెళ్లాలి.. కాపలా వదిలి వచ్చాను’’ అంటూ హడావిడి పెట్టాడు భార్యను. హనుమ భార్య పేరు ఓబవ్వ. భర్త వేగిరం అర్థం చేసుకొని గబగబా భోజనం వడ్డించింది. తొందరగా తింటుండడంతో హనుమకు పొలమారింది. మంచినీళ్లు ఇద్దామని చూస్తే కుండలో నీళ్లు అడుగంటాయి. వాటినే దొప్పలో పోసి భర్త పక్కన పెట్టి.. ‘‘తింటూ ఉండు నీళ్లు తెస్తా ’’నని పదడుగుల దూరంలో ఉన్న చెరువుకి వెళ్లింది. కుండను వదిలి రోకలి ఎత్తింది ఎదురుగా ఉన్న కాలినడకన ఓ వ్యక్తి రావడం ఓబవ్వ కంటపడింది. అతని నడక, వ్యవహారం అంతా అనుమానాస్పదంగా అనిపించింది. కుండను వదిలేసి అక్కడే బండ మీదున్న రోకలిదుడ్డును తీసుకొని దారికాచింది. దగ్గరకు రాగానే రోకలి బండతో తలను బాదింది. రక్తమోడుతూ కుప్పకూలాడతను. దారి నుంచి పక్కకు లాగేసింది అతనిని. కొన్ని క్షణాలు గడిచామో లేదో అదే చిత్రమైన ప్రవర్తనతో ఇంకో వ్యక్తి రావడం చూసింది. ఆ వ్యక్తినీ అలాగే రోకలితో బాది చంపేసి పక్కకు లాగింది. రెండో మనిషి తర్వాత మూడో మనిషి.. ఆనక నాలుగో మనిషి.. ఇలా వరుసగా పదుల సంఖ్యలో వచ్చారు. నాలుగో మనిషికే వాళ్లంతా శత్రు సైన్యమని అర్థమైంది ఓబవ్వకు. ఒక్కొక్కర్నీ రోకలితో మోది చంపేసింది. తేలని మిస్టరీ నీళ్లు తెస్తానని వెళ్లిన భార్య ఇంకారాలేదేంటనే భయం, సందేహంతో చెరువు దగ్గరకు వచ్చాడు హనుమ. రక్తం ఓడుతున్న రోకలి దుడ్డుతో కనిపించిన ఆలిని చూసి హతాశుడయ్యాడు. విషయం తెలిసింది. తాను చేయలేని పని భార్య చేసింది. అయితే ఆ రోజు రాత్రే ఓబవ్వ మరణించింది. అంతమందిని చంపిన షాక్ తోనో.. హైదర్ అలీ మనుషులు చంపి ఉంటారో తేలక అది మిస్టరీగానే ఉండిపోయింది. ఆమె సాహసం చిత్రదుర్గాన్ని కొన్ని రోజుల వరకైతే రక్షించింది కాని ఆ తర్వాత ఆ కోట హైదర్ అలీకి బందీ కాక తప్పలేదు. ఓబవ్వ వీరనారిగా చరిత్రలో మిగిలిపోయింది. కన్నడనేల మీద కత్తిపట్టి యుద్ధం చేసిన అబ్బక్క రాణి, కేలడి చెన్నమ్మ, కిట్టూరు చెన్నమ్మల సరసన ఒనకే ఓబవ్వ నిలిచిపోయింది. ఒనకే అంటే కన్నడలో రోకలి దుడ్డు అని. నాటి ఓబవ్వ.. నేటికీ స్ఫూర్తి ఇది జానపద కథ కాదు.. నిజం! చరిత్రగా మారిన సత్యం. ఆమె పుట్టిన నేల పరాధీనం కాకుండా తనకు చేతనైనా పోరాటం చేసింది ఓబవ్వ. ఒంటి చేత్తో చిత్రదుర్గాన్ని రక్షించింది. ఆమె స్ఫూర్తిని కర్ణాటక పోలీసులు ఇప్పటికీ పంచుకుంటున్నారు. ఆడపిల్లల పట్ల పెరుగుతున్న నేరాలు, హింసను అరికట్టడానికి ఆమె ధైర్యాన్ని తలచుకుంటున్నారు. ‘ఓబవ్వ పడే’ పేరుతో ఓ ప్రత్యేకమైన విమెన్ పోలీస్ స్క్వాడ్‌ను తయారు చేశారు. ఈ మహిళా పోలీసులంతా అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్లు. మొత్తం 45 మంది. అందరూ 40 ఏళ్ల లోపు వాళ్లే. ఆత్మరక్షణ విద్యల్లో ఆరితేరినవాళ్లే. బహిరంగ స్థలాలైన బస్‌స్టాండులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, పార్కులు, సినిమా హాళ్ల దగ్గర వీరు నిత్యం పహారాకాస్తున్నారు. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టే అల్లరి మూకల నుంచి అమ్మాయిల మీద దాడులుచేసే సైకోల దాకా అందరి తాటా తీస్తున్నారు. అంతేకాదు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి అమ్మాయిలకు ఆత్మరక్షణ మెళకువలను నేర్పిస్తున్నారు. ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో)యాక్ట్, నేరాలను అరికట్టేందుకున్న ఇతర చట్టాలు, సైబర్ క్రైమ్స్, మొబైల్ ద్వారా జరిగే వేధింపులు వంటి వాటి మీద అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో అయితే గ్రామ పంచాయత్‌లు, ఆశా వర్కర్లు, స్త్రీ శక్తి గ్రూప్స్అన్నిటితో కలిసి మహిళలను చైతన్యం చేసే పనిలో బిజీగా ఉన్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా బెంగుళూరులో ఈ యేడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ స్పెషల్ స్క్వాడ్ తక్కువ సమయంలోనే మంచి ఫలితాన్నిచ్చింది. దాంతో త్వరలోనే దీన్ని కర్నాటక అంతటా విస్తరింపచేసే ఆలోచనలో ఉందట ఆ రాష్ట్ర పోలీస్ శాఖ. నేరగాళ్లలో ఒకరకమైన భయాన్ని సృష్టించడానికి ఈ ప్రత్యేక బృందంలోని పోలీసులకు మిలటరీని పోలిన యూనిఫామ్‌ను కేటాయించినట్టు తెలిపారు చిత్రదుర్గ ఎస్పీ (సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్) శ్రీనాథ్ జోషి. మనకూ ఓ(బవ్వ) టీమ్ ఉండాలా?! మన తెలుగు నేల మీదా ఉన్నారు సాహస వనితలు.. వీరనారీమణులు బ్రిటిషర్స్‌తో పోట్లాడిన దుర్గాబాయి దేశ్‌ముఖ్, సరోజినీ నాయుడు, తెలంగాణ గడ్డమీదైతే నిజామ్కు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మా ఉన్నారు. ఆ స్ఫూర్తిని ఇప్పుడు మన దేశంలోని మగవాళ్ల నుంచి రక్షణ కోసం ఉపయోగించుకోవడమే విషాదం. స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఒక్కయేళ్లయింది. ఆడవాళ్లు ఇంకా గడప దాటేందుకు భయపడే పరిస్థితి. స్వాతంత్య్రం దేశంలోని పురుషులకే కాదు.. మహిళలకు కూడా. దేశమంటే అందరూ! ఆ స్వేచ్ఛను.. కాపాడుకోవడానికి స్త్రీలు గౌరవం పరిరక్షించుకోవడానికి అహర్నిశల పహారా అవసరమా? మన షీటీమ్స్ కూడా.. ఓనకే ఓబవ్వ వంటి స్పెషల్ స్క్వాడ్స్లా ఉండాలా? మగవాళ్లూ ఆలోచించండి! స్వతంత్ర భారత్ అర్థం ఇదేనా? ఆలోచించండి. -
మామిడిని కాపాడుకుందాం!
వాతావరణం మారిపోయింది. అసాధారణ వాతావరణం మామిడిౖ రైతు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. సంక్రాంతి సమయంలో చుట్టుముట్టిన దట్టమైన పొగమంచు పూతను దెబ్బతీసింది. ఇప్పుడేమో రాత్రి పూట వణికించే చలి, పగటి పూట అధిక ఉష్ణోగ్రత మామిడి రైతుపై పగబట్టినట్టే కనిపిస్తున్నాయి. పూత ఆలస్యం కావడం, తీరా వచ్చిన పిందెలు కూడా రాలిపోతుండడంతో రైతులు కలవరపడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు తక్కువగా ఉండటం.. పగటి ఉష్ణోగ్రత సాధారణం కన్నా ఎక్కువగా ఉండటం వంటి విపరిణామాలు ఆశలను తుంచేస్తున్నాయి. తేనెమంచు, తదితరæ చీడపీడలు రసాయనిక మందులు చల్లే రైతులను అల్లాడిస్తున్నాయి. అయితే, ప్రకృతి వ్యవసాయదారుల పరిస్థితి మెరుగ్గానే ఉంది. సేంద్రియ తోటల్లో చీడపీడల బెడద లేదు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కోవచ్చని, మామిడి తోటలను కాపాడుకోవచ్చని వీరి అనుభవాలు చెబుతున్నాయి.. చలి పెరిగినా పూత బాగుంది.. గత ఏడాది ఆగస్టు తర్వాత వర్షాలేవు. కరువొచ్చింది. చలి కూడా తక్కువే. ఈ ఏడాది వర్షాలు బాగున్నాయి. చలి పెరిగింది. పూత బాగుంది. గత ఏడాదికన్నా రెట్టింపు దిగుబడి వస్తుందనుకుంటున్నాను. మా తోట పదెకరాలు. 14 ఏళ్ల నాటిది. మొదటి నుంచీ మనసబు ఫుకుఒకా ప్రకృతి వ్యవసాయ పద్ధతిని పాటిస్తున్నా. అసలు నీరు పెట్టలేదు. కలుపు తీయకుండా సజీవ ఆచ్ఛాదన చేస్తున్నాం. వాన నీటి సంరక్షణకు ఇంకుడుగుంటలు తీశాం. కలుపుమందులు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడట్లేదు. మా చెట్లకు ఎటువంటి తెగుళ్లూ లేవు. వేపనూనె కూడా పిచికారీ చేయట్లేదు. నీరు ఎప్పుడూ పెట్టలేదు. మా ప్రాంతంలో నీరు పెట్టిన తోటలు చిగుళ్లతో గుబురుగా ఉన్నాయి, తేనెమంచు పురుగు వచ్చింది. రసం పీల్చే పురుగుల వల్ల ఆకులు కూడా రాలిపోతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వల్ల రోగనిరోధక శక్తి ఆ చెట్లకు తక్కువగా ఉండటం వల్ల అన్ని రకాల పురుగులు, తెగుళ్లూ వస్తుంటాయి. మాకు ఆ బెడద లేదు. మా తోటలో ఎకరానికి 99 చొప్పున చిన్న రసం చెట్లున్నాయి. మాది కరువు ప్రాంతాలకూ సరిపోయే అధిక సాంద్రత పద్ధతి. ఎటు చూసినా 21 అడుగులకో చెట్టు నాటాం. పంట అయిపోగానే ప్రూనింగ్ చేస్తాం. గాలిదుమ్ములను తట్టుకుంటుంది. కాయ రాలుడు చాలా తక్కువ. కరువును తట్టుకొని, గాలులను తట్టుకొని దీర్ఘకాలం దిగుబడులనిచ్చే విధంగా ఇన్‌సిటు గ్రాఫ్టింగ్ పద్ధతిని అనుసరిస్తున్నాం. – ఎల్.జి.బి.ఎస్. రామరాజు (94401 06567), కొత్తూరు తాడేపల్లి, విజయవాడ రూరల్ మండలం ఆవు పిడకల పొగ వేస్తున్నాం.. మా 20 ఎకరాల తోట 30 ఏళ్ల నాటిది. వెయ్యి చెట్లున్నాయి. ఐదేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. 80% బేనిషాన్(బంగినపల్లి) చెట్లున్నాయి. ఈ ఏడాది చాలా చెట్లకు 80% పూత వచ్చింది. పిందె బాగానే వచ్చింది. అయితే, కొన్ని చెట్లకు చిగుళ్లు వచ్చాయి, పూత 25% మాత్రమే వచ్చింది. గత ఏడాది పూత ఎక్కువగానే వచ్చినా నిలబడింది తక్కువ. ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియటం లేదు. ఇప్పటికి మా తోటకు తెగుళ్లు ఏమీ రాలేదు. పూత రాకముందు పది రోజులకోసారి ఆవు మూత్రం కలిపిన నీటిని పిచికారీ చేశాం. ఇప్పుడు పిచికారీలు చేయడం లేదు. నీరు ఇవ్వడం లేదు. చీడపీడలు రాకుండా పది రోజులకోసారి పిడకల పొగ వేస్తున్నాం. సాయంత్రపు వేళలో ఐదెకరాలకు ఒక చోట కిలో ఆవు పిడకలు, పావు కిలో నెయ్యి, పచ్చి ఆకులు వేసి పిడకల పొగ వేస్తున్నాం. పూత, పిందెలు రాలిపోకుండా రక్షించుకోవడానికి పిడకల పొగ ఉపయోగపడుతున్నది. తేనెమంచు పురుగు కూడా రాలేదు. ఏ చెట్టుపైనైనా వచ్చిందన్న అనుమానం వస్తే ఆ దగ్గర్లో పిడకల పొగ పెడుతున్నాం. పిచికారీలు చేయడం లేదు. వడగళ్ల వాన రాకుండా ఉంటే ఈ ఏడాది మంచి దిగుబడే వస్తుందనుకుంటున్నాం. – సుధామోహన్ (93947 47100), బొమ్మరాజుపేట, శామీర్‌పేట మండలం, మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా వేస్ట్ డీ కంపోజర్ వల్ల తోట బాగుంది.. మా 60 ఎకరాల సేంద్రియ తోటలో 1500 మామిడి చెట్లు, 1500 కొబ్బరి చెట్లున్నాయి. 1995 నుంచి సేంద్రియ, బయోడైనమిక్ పద్ధతిలో సాగు చేస్తున్నాం. ఇప్పుడు జీవామృతం, ఘనజీవామృతం, వేస్ట్ డీ కంపోజర్‌ను విరివిగా వాడుతున్నాం. జాతీయ, అంతర్జాతీయ సేంద్రియ సర్టిఫికేషన్లు ఉన్నాయి. మా తోటలో పల్ప్ రకం మామిడి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. రసాలు తక్కువ. గత మూడేళ్లుగా మా చెట్లకు ఎటువంటి తెగుళ్లూ ఎరుగం. కాయకు చివరన ముడ్డిపుచ్చు వస్తుంటుంది. మాకు అది అసలు లేనే లేదు. ‘సాక్షి సాగుబడి’ ద్వారా వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం గురించి తెలుసుకొని గత అక్టోబర్ నుంచి దాదాపు రోజు మార్చి రోజు వాడుతున్నాం. వెయ్యి లీటర్ల ట్యాంకులు 24 చోట్ల ఏర్పాటు చేసి.. పావు గంటలో చెట్లన్నిటికీ ఈ ద్రావణాన్ని ఇచ్చే ఏర్పాటు చేశాం. ఇప్పుడు తోట చాలా ఆరోగ్యంగా ఉంది. ఏ తెగుళ్లూ లేవు. అప్పుడప్పుడూ ఘనజీవామృతం వేస్తున్నాం. జీవామృతం ఇస్తున్నాం. అయితే, వేస్ట్ డీ కంపోజర్‌ను జీవామృతంతో కలపకుండా విడిగా ఇస్తున్నాం. మా తోటలో మామిడి చెట్లు ప్రతి ఏటా కాస్తున్నాయి. కాయకోతలు పూర్తవ్వగానే ప్రూనింగ్ చేసి, ఎండుపుల్ల తీసేసి.. సక్రమంగా పోషణ ఇస్తాం. మళ్లీ ఏడాదీ కాపు వస్తుంది. వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహకు అందటం లేదు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు మామిడి తోటల్లో ఈ ఏడాది తెగుళ్లతో పిందె రాలిపోతున్నది. ఇప్పటికే 8,9 సార్లు పురుగుమందులను పిచికారీ చేసినా, పిందె రాలుతూనే ఉంది. వాతావరణ మార్పులను దీటుగా ఎదుర్కోవడానికి సేంద్రియ వ్యవసాయం తోడ్పడుతుంది. – చలసాని దత్తు (94414 73246), నూజివీడు, కృష్ణా జిల్లా పది రోజులకోసారి కషాయం పిచికారీ.. ఈ ఏడాది జనవరిలో 3 రోజుల పాటు దట్టమైన పొగమంచు కురిసి మామిడి పూతను దెబ్బతీసింది. దీని ప్రభావం వల్ల కొన్ని చెట్లకు పూత 50% వస్తే, మరికొన్నిటికి ఇంకా తక్కువే వచ్చింది. మాకున్న 30 ఎకరాలలో చాలా ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయాన్నే చేస్తున్నాను. 310 మామిడి చెట్లున్నాయి. గత ఏడాది 70% చెట్లకు పూత, కాత చాలా బాగా వచ్చింది. లోకల్‌గా కిలో రూ. 100–120 వరకు అమ్మాం. అమెరికా, జర్మనీ, సింగపూర్‌కు కూడా పంపాం. ఖర్చులు పోను రూ. 8 లక్షల నికరాదాయం వచ్చింది. ఈ ఏడాది పూతే తక్కువగా వచ్చింది. పూతరాక ముందు నవంబర్ నుంచే 15 రోజులకోసారి కషాయాలు, జీవామృతం పిచికారీ చేస్తున్నాం. తేనెమంచు పురుగు రాలేదు. 20 ఆకులను కుళ్లబెట్టి తయారు చేసుకున్న కషాయం, జీవామృతం, పులిసిన మజ్జిగ, దేశీ ఆవు పాలు–శొంఠి–ఇంగువ ద్రావణం, కొబ్బరి నీరు, సప్తధాన్యాంకుర కషాయం.. అదొకసారి ఇదొకసారి 7–10 రోజులకోసారి పిచికారీ చేస్తున్నాం. పిందె రాలడం ఆగే వరకు, పిందెలు గోలికాయ సైజుకు పెరిగే వరకు కొడుతూ ఉంటాం. అయినా గత ఏడాది బూడిద తెగులు కంట్రోల్ కాలేదు. – బీరం వెంకట్రామారెడ్డి (98498 04527), సింగోంటం, మహబూబ్‌నగర్ జిల్లా వాతావరణం మారింది.. పూత, లేత పిందె మాడిపోతున్నది.. మా 8 ఎకరాలలోని 18 ఏళ్ల మామిడి తోటలో 500 చెట్లున్నాయి. సొంతంగా తయారు చేసుకునే జీవన ఎరువులు, జీవామృతంతో వ్యవసాయం చేస్తున్నాను. సగటున 40 టన్నుల దిగుబడి వచ్చేది.. రెండేళ్లుగా 25 టన్నులకు పడిపోయింది. మూడేళ్లుగా వాతావరణం మారిపోయింది. ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు మరీ ఎక్కువై.. పూత, పిందెకు గొడ్డలిపెట్టులా మారాయి. ఈ రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రత(సాధారణంగా 23–24 డిగ్రీలు ఉండాల్సింది) 19 డిగ్రీలకు తగ్గింది. పగటి ఉష్ణోగ్రత (ఉగాది లోపల 35 డిగ్రీలు ఉండాల్సింది) 38–39 డిగ్రీలకు పెరిగింది. గత రెండేళ్లు దిగుబడి తగ్గినా పూత సమయానికి వచ్చింది. ఈ ఏడాది పూత 25–30 రోజులు ఆలస్యంగా వచ్చింది. దశేరి, హిమాయత్ కన్నా బంగినపల్లి పూత ఆలస్యంగా వస్తుంది. బంగినపల్లి చిన్న పిందె దశలో ఉంది. ఇప్పుడున్న లేత పిందె, లేత ఆకులు కూడా మాడి, రాలిపోతున్నాయి. ఇందులో 80% రాలిపోయే అవకాశం ఉంది. పిందెలను నిలబెట్టుకునేందుకు మామిడి చెట్లపై వేప నూనె, వర్టిసెల్లం లఖానియా(జీవన శిలీంధ్ర నాశిని)లను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 20,000–50,000 పీపీఎం గల వేపనూనె అర లీటరు, వర్టిసెల్లం లఖానియా 0.5% ద్రావణం అర లీటరు చొప్పున 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వారం వ్యవధిలో మరోసారి పిచికారీ చేయాలి. ఇందులో ఎమల్సిఫయర్ కలపకూడదు. ఎమల్సిఫయర్ కలిపితే వేడి పెరుగుతుంది. 10,000 పీపీఎం లోపు ఉండే వేప నూనె నీటిలో కరగదు కాబట్టి ఎమల్సిఫయర్ కలుపుతుంటాము. 20,000–50,000 పీపీఎం వేపనూనెకు అవసరం లేదు. వర్టిసెల్లం లఖానియా.. రసం పీల్చే పురుగులన్నిటినీ సమర్థవంతంగా అరికడుతుంది. తేనెమంచు పురుగు, బూడిద తెగులు, పేనుబంక, పాముపొడ(లీఫ్‌మైనర్)లను అరికడుతుంది, నిరోధిస్తుంది. – కొక్కు అశోక్‌కుమార్ (98661 92761), సేంద్రియ మామిడి రైతు, ఒగులాపురం, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
అల్లాడిస్తున్న తెల్లదోమ!
విదేశాల నుంచి దిగుమతయ్యే వ్యవసాయోత్పత్తులు,మొక్కలు, పండ్లు, కాయలపై సరైన నిఘాలేకపోవడం వల్ల కొత్త రకం చీడపీడలు మన దేశంలోకి ప్రవేశించి రైతులకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. ‘రూగోస్ వలయాకారపు తెల్లదోమ’ తాజాగా ఈ జాబితాలోకి చేరింది. ఫ్లోరిడా నుంచి ఏడాదిన్నర క్రితం కేరళకు దిగుమతైన రూగోస్ తెల్లదోమ అక్కడి కొబ్బరి తోటలను చావుదెబ్బ తీíసింది. తమిళనాడు, కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్, గోవాలకు పాకింది. ఉభయ గోదావరి జిల్లాల్లో నర్సరీలకు, కొబ్బరి, పామాయిల్ తోటలకు సోకింది. ఈ తోటలను కేరళకు చెందిన కేంద్రీయ వన్యతోట పంటల పరిశోధనా కేంద్రం ముఖ్య శాస్త్రవేత్త డా. జోసెఫ్ రాజ్‌కుమార్ ఇటీవల పరిశీలించారు. రసాయనిక పురుగుమందులు చల్లకుండా ఉండటమే పరిష్కారమని ‘సాగుబడి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.. ముఖ్యాంశాలు.. ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి తోటలను తీవ్రంగా నష్టపరుస్తున్న కొత్త రకం తెల్లదోమ గురించి రైతాంగంలో ఇటీవల ఆందోళన నెలకొంది. ఈ తెల్లదోమ కేరళ మీదుగా ఇతర రాష్ట్రాలకు వ్యాపించిందని చెబుతున్నారు. ఇది కేరళకు ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చింది? 2016 జూలైలో కేరళలో కొబ్బరి తోటలపై ‘రూగోస్ వలయాకారపు తెల్లదోమ’(అల్యూరోడికస్ రుగియో పెర్యులేటస్) కనిపించింది. అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతం నుంచి తెచ్చిన పూల మొక్కల ద్వారా ఇది మన దేశంలోకి వచ్చింది. కేరళలోని అనేక జిల్లాల్లో కొబ్బరి తోటలను ఇది తీవ్రంగా నష్టపరిచింది. ఇక్కడి నుంచి తమిళనాడు, ఆంధ్రపదేశ్, కర్ణాటక, గోవాలకు పాకింది. ముఖ్య శాస్త్రవేత్త డా. జోసెఫ్ రాజ్‌కుమార్ ► రూగోస్ తెల్లదోమను గుర్తించడమెలా? రూగోస్ తెల్లదోమ.. దక్షిణ భారత రాష్ట్రాల్లో విరివిగా జామ, కొబ్బరి తోటల్లో కనిపించే వలయాకార తెల్లదోమ(స్పైరలింగ్ వైట్ఫ్లై)ని పోలి ఉంటుంది. ఈ దోమ రెక్కల మీద గోధుమ రంగు పట్టీలను బట్టి రూగోస్ తెల్లదోమను గుర్తించవచ్చు. దీన్ని 2009లో ఫ్లోరిడా(అమెరికా)లో కొన్ని పూల మొక్కలపై తొలుత గుర్తించారు. మెక్సికో, గౌటెమాలాకు కూడా పాకింది. మన దేశంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కేరళలోని అన్ని జిల్లాలకు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవాలకు వ్యాప్తిచెందింది. కోస్తా తీర ప్రాంతాల్లోని కొబ్బరి తోటలను ఆశిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి, హైబ్రిడ్ రకాల కొబ్బరి తోటలు, కొబ్బరి మొక్కలకు సోకింది. అయితే, కేరళలో ఎత్తయిన కొబ్బరి తోటలకు కూడా సోకినా, నష్టం తక్కువగా ఉంది. ► రూగోస్ తెల్లదోమ పంటలను ఎలా నష్టపరుస్తుంది? రూగోస్ తెల్లదోమ ఒక రకమైన రసంపీల్చే తరగతికి చెందిన రెక్కల పురుగు. ఇది సుమారు 2.5 మి.మీ. పొడువుతో మిగతా తెల్లదోమల కంటే పెద్దదిగా ఉంటుంది. ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల చెట్లు ఒత్తిడికి గురవుతాయి. ఆకుల మీద అర్ధవృత్తాకారంలో వలయాలు వలయాలుగా గుడ్లు పెడుతుంది. ఈ వలయాలు తెల్లని దూదిలాంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి... అంతేకాక, రెక్కల పురుగులు తేనె వంటి జిగురును విసర్జిస్తాయి. ఈ జిగురుకు నల్లరంగులో ఉండే ఒక శిలీంధ్రం(సూటి మౌల్డ్) ఆకర్షితమై.. ఆకులపై నల్లగా పరుచుకుంటుంది. దాని వల్ల కిరణజన్య సంయోజక క్రియ తగ్గి, చెట్టు బలహీన పడుతుంది. తెల్లదోమ తాకిడి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఆకులేకాక, రెమ్మ మొదళ్లు, లేత కొబ్బరికాయలు సైతం తెల్లని దూదిలాంటి పదార్థంతో నిండిపోయి ఉంటాయి. ► తెల్లదోమ తీవ్రత ఎలా ఉంది? దీన్ని ప్రకృతిసిద్ధమైన జీవనియంత్రణతోనే అదుపు చేయగలం. రసాయనిక పురుగుమందుల ద్వారా నియంత్రించలేం. రసాయనిక పురుగుమందుల వాడకం తక్కువ కాబట్టి కేరళలో 3–5 నెలల్లో రూగోస్ తెల్లదోమ తీవ్రత తగ్గింది. అయితే, తమిళనాడులో రసాయనిక పురుగుమందుల వాడకం ఎక్కువ కాబట్టి అక్కడ అదుపులోకి రాలేదు. ► సహజ పద్ధతుల్లో తెల్లదోమను అదుపు చేసేదెలా? కందిరీగ జాతికి చెందిన చిన్న దోమ పరిమాణంలో ఉండే ఒక పరాన్నజీవి రూగోస్ తెల్లదోమ వృద్ధిని అదుపులో పెడుతుండటం గమనించాం. దీన్ని ఎన్‌కార్సియ గోడెలోపి అంటారు. వీటితోపాటు కొన్ని టెంకరెక్క పురుగులు (బీటిల్స్), సాలెపురుగులు కూడా ఈ తెల్లదోమ నియంత్రణలో తోడ్పడతాయి. రసాయనిక పురుగుమందులు ఎక్కువగా వాడిన తోటల్లో ఈ సహజ శత్రువులు తక్కువ సంఖ్యలో ఉంటున్నట్లు గమనించాం. ► ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకోవాలి? తెల్లదోమ మరీ తీవ్రస్థాయిలో ఉంటే 0.5 శాతం వేపనూనె(లీటరు నీటికి 5 గ్రాముల వేపనూనె)ను పిచికారీ చేయాలి. నల్లని శిలీంధ్రం ఉధృతంగా పరచుకున్న ఆకుల మీద 1% మైదా పిండి (లీటరు నీటికి 10 గ్రాముల మైదా పిండి) ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. తెల్లదోమ సహజ శత్రువులను బాగా వృద్ధి అయిన తోటల్లో నుంచి ఆకు ముక్కలను తీసుకెళ్లి.. ఉధృతంగా ఉన్న తోటల్లో చెట్లపైన ఉంచాలి. జిగురుతో కూడిన పసుపు అట్టలను చెట్ల మొదళ్లకు చుట్టాలి. తద్వారా కొంతవరకు ఈ దోమలను దిగ్బంధించవచ్చు. నల్ల శిలీంధ్రాన్ని తినే టెంకరెక్క పురుగులను గుర్తించి, పరిరక్షించాలి. ► ఇంకా పాటించాల్సిన నియమాలేమైనా ఉన్నాయా? తెల్లదోమ తాకిడి గల ప్రాంతం నుంచి కొబ్బరి మొక్కలుగానీ, ఆకులు గానీ, కాయలుగానీ లేదా పామ్ సంతతికి చెందిన అలంకారపు మొక్కలు గాని వేరే ప్రాంతాలకు తరలించకూడదు. దోమ తాకిడి గల ప్రదేశాల నుంచి తాకిడి లేని ప్రదేశాలకు వెళ్లే రవాణా వాహనాలను పూర్తిగా శుద్ధి చేయాలి. విమానాశ్రయాలలో/నౌకాశ్రయాలలో మొక్కలు, కాయల తరలింపుపై కఠిన నియమాలను అమలు చేయడం ద్వారా హానికర చీడపీడల వ్యాప్తిని అరికట్టాలి. ► నర్సరీల నుంచి కొబ్బరి మొక్కల అమ్మకాలను ఆపెయ్యాల్సిన అవసరం ఉందా? పూర్తిగా ఆపెయ్యనక్కరలేదు. అయితే, రూగోస్ తెల్లదోమ లేదని నిర్ధారణ జరిగిన తర్వాతే నర్సరీ నుంచి కొబ్బరి మొక్కలను బయటకు పంపాలి. తెల్లదోమ ఆశించిన మొక్కలను ఇవ్వకూడదు. ► రసాయనిక పురుగుమందులను నిషేధించాలా? పశ్చిమ గోదావరి జిల్లాలో తెల్లదోమ ఉధృతంగా ఉన్న కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో, ఆ పరిసరాల్లో కనీసం 4–5 నెలల పాటు రసాయనిక పురుగు మందుల వాడకాన్ని కచ్చితంగా ఆపెయ్యాలి. ప్రభుత్వ పర్యవేక్షణలో రైతులు స్వచ్ఛందంగా ఈ జాగ్రత్త పాటించాలి. ఇలా జాగ్రత్తపడిన రైతుల తోటల్లో తెల్లదోమ అదుపులోకి వచ్చింది. ► రూగోస్ తెల్లదోమ ఆశించే ఇతర పంటలేవి? ఇది ప్రపంచవ్యాప్తంగా 43 కుటుంబాలకు చెందిన 118 పంటలకు, మొక్కలకు ఆశిస్తుంది. దక్షిణ భారతదేశంలో కొబ్బరితోపాటు మామిడి, జామ, అరటి, రామాఫలం, పనస చెట్లతోపాటు, కరివేపాకుపైన, హెలికోనియా అనే పూల జాతి మొక్కలపైన రూగోస్ తెల్లదోమ కనిపించింది. అయితే, వీటిలో ఒక్క అరటి మొక్కల మీద మాత్రమే ఇది తన పూర్తి జీవిత చక్రాన్ని పూర్తి చేయగలదు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉంది? పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో రూగోస్ తెల్లదోమ సోకిన కొబ్బరి తోటలను ఇటీవల పరిశీలించాను. రూగోస్ తెల్లదోమలు సోకిన చెట్ల మీద వీటిని సహజంగా అదుపు చేసే ఎన్కార్పియా గౌడలోపే రకం కందిరీగల్లాంటి పురుగులు కూడా కనిపించాయి. కాబట్టి, మరీ భయపడనక్కరలేదు. తెల్లదోమ తోటలను చంపెయ్యదు. రసాయనిక పురుగుమందులు అసలు వాడకుండా జాగ్రత్తలు పాటిస్తే కొన్నాళ్లలో తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. రసాయనిక పురుగుమందులను చల్లితే మిత్రపురుగులూ చనిపోయి.. తెల్లదోమ ఉధృతి పెరుగుతుంది. ‘‘ బదనికలు వదిలిన తర్వాత తెల్లదోమ తగ్గింది.. మా కొబ్బరి తోటకు సోకిన రూగోస్ తెల్లదోమ వలన దిగుబడి తగ్గుతుందని ఆందోళనగా ఉంది. ఆరు ఎకరాల్లో గోదావర గంగా టీఅండ్‌డీ రకం కొబ్బరిని సాగు చేస్తున్నాను. మొదటిసారిగా 2017 అక్టోబర్ నెలాఖర్లో కొబ్బరి తోటను తెల్లదోమ ఆశించింది. కొవ్వూరు, అంబాజీ పేట కొబ్బరి పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించి, తెల్లదోమ నివారణకు వేపనూనెను పిచికారీ చేయమని సూచించారు. మళ్లీ డిసెంబర్లో మరోసారి తెల్లదోమ విజృంభించింది. నిడదవోలు, చాగల్లు మండలాల్లో సుమారు 12 వందల హె క్టార్లో కొబ్బరికి, ఆరు వందల హెక్టారుల్లో పామాయిల్ తోటలకు తెల్లదోమ ఆశించింది. శాస్త్రవేత్తలు కేరళ నుంచి బదనికలు తీసుకువచ్చి జనవరి మొదటి వారంలో నా వ్యవసాయక్షేత్రంలో వదిలారు. బదనికలు వదిలాక తెల్లదోమ తీవ్రత తగ్గింది. తెల్లదోమను పూర్తి స్థాయిలో అరికట్టకపోతే పంట దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయే అవకాశాలున్నాయి. ముళ్లపూడి మురళీకృష్ణ (94405 83725), కొబ్బరి రైతు, కలవలపల్లి, చాగల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లా – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‘‘ -
తెగుళ్ల దిగులొద్దు
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో సాగవుతున్న పలు పంటల్లో ప్రస్తుత తరుణంలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లాలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 3.5 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 2.1 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఆయా పంటల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు ఇలా ఉన్నాయి. పత్తి పత్తి సాధారణ విస్తీర్ణం 1.62 లక్షల హెక్టార్లు కాగా ప్రస్తుతం జిల్లాలో 1.57 లక్షల హెక్టార్లలోనే దీన్ని సాగు చేస్తున్నారు. పత్తి పెరుగుదల లోపించటం, రసంపీల్చు పురుగులు, ఎండుతెగులు వంటివి వస్తున్నాయని రైతులు అంటున్నారు. దీనిపై డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పెరుగుదల తక్కువగానే ఉంటుంది. పోషకాలను ఉపయోగిస్తే పంట సాధారణ స్థాయికి చేరుకుంటుంది. మొక్క వయసును బట్టి 10-20 గ్రాముల యూరియా లేదా 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13-0-45) లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. రసం పీల్చు పురుగులు, పేనుబంక, తామర పురుగులు, పచ్చదోమ ఉధృతి అధికంగా ఉంటే నివారణకు మోనోక్రొటోఫాస్ నీరు 1:4 నిష్పత్తిలో కలిపి మొక్క వయస్సు 30, 45, 60 రోజుల దశలో కాండానికి మందు పూయాలి. వీటి నివారణకు పిచికారీ మందులైతే మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిటామెసిడ్ 0.2 గ్రాములు లేదా ఫాప్రోనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి మందులను మార్చి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. పిండినల్లి ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 3 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీనితో పాటు లీటరుకు 0.5 గ్రాముల సర్ఫ్ పౌడర్ కలిపితే ఫలితం బాగుంటుంది. తెల్లదోమ ఉధృతి అధికంగా ఉంటే టైజోఫాస్ 2 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి జిల్లాలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 1.32 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 31,083 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. నారుమళ్లలో, నాటిన పొలాల్లో జింక్ధాతులోపం ఎక్కువగా ఉంది. దీని నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ప్రస్తుతం నాటు వేసిన వరిలో కలుపు నివారణకు నాటిన 3-5 రోజుల దశలో బుటాక్లోర్ 1.25 లీటర్లు లేదా అనిలోఫాస్ 500 మి.లీ లేదా ప్రిటిలాక్లోర్ 600 మి.లీ లేదా ఆక్సాడయార్జిల్ 35 గ్రాములు, 20-25 కిలోల ఇసుకలో కలిపి ఎకరం పొలంలో చల్లాలి. మొక్కజొన్న మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 14 వేల హెక్టార్లు ప్రస్తుతం పది వేల హెక్టార్లలో ఈ పంటను సాగు చేస్తున్నారు. జింక్ లోపం, కాండం తొలిచే పురుగులు వ్యాపిస్తున్నాయి. జింక్ లోపం నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటితో కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. కాండం తొలిచే పురుగు నివారణకు 10-12 రోజుల పైరుపై మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 20-25 రోజుల దశలో గమనిస్తే కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలు ఎకరాకు మూడు కిలోల చొప్పున ఆకు సుడులలో వేసుకోవాలి. పెసర పెసర ఖరీఫ్ విస్తీర్ణం 8.8 వేల హెక్టార్లు ఉండగా 5.7 వేల హెక్టార్లలో విత్తారు. పెసరలో మరూకా మచ్చల పురుగు, సల్లాకు తెగులు గమనించ దగినవి. మరూకా మచ్చల పురుగు నివారణకు 2.5 మి.లీ క్లోరిఫైరిఫాస్ లేదా 2.0 మి.లీ క్వినాల్ఫాస్ లేదా 1.0 మి.లీ నోవల్యూరాన్ లేదా 0.3 మి.లీ స్పైనోసాడ్ లేదా ఫ్లూబెండిమైడ్ 0.2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సల్లాకు తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. దీన్ని అరికట్టడానికి ట్రైజోఫాస్ 1.25 మి.లీ లేదా ఎసిఫేట్ గ్రాము లేదా ఎసిటామిప్రెడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఉధృతిని బట్టి 7-10 రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారీ చేయాలి. మిరప నారుమడి దశలో ఉన్న మిరపలో నారుకుళ్లు తెగులు ఆశిస్తుంది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు లేదా రిడోమల్ ఎంజెడ్ రెండు గ్రాములు లీటరు నీటిలో కలిపి నారు మళ్లను తడపాలి. కొన్ని ప్రాంతాల్లో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించింది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములతో స్ట్రెప్టోమైసిన్ లేదా ప్లాంటామైసిన్ గ్రాము 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.