తెగుళ్ల దిగులొద్దు | do not fear on pestilences | Sakshi
Sakshi News home page

తెగుళ్ల దిగులొద్దు

Published Mon, Aug 18 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

do not fear on pestilences

 ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో సాగవుతున్న పలు పంటల్లో ప్రస్తుత తరుణంలో కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లాలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 3.5 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 2.1 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఆయా  పంటల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు ఇలా ఉన్నాయి.

 పత్తి
 పత్తి సాధారణ విస్తీర్ణం 1.62 లక్షల హెక్టార్లు కాగా ప్రస్తుతం జిల్లాలో 1.57 లక్షల హెక్టార్లలోనే దీన్ని సాగు చేస్తున్నారు. పత్తి పెరుగుదల లోపించటం, రసంపీల్చు పురుగులు, ఎండుతెగులు వంటివి వస్తున్నాయని రైతులు అంటున్నారు.

దీనిపై డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు..
 వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పెరుగుదల తక్కువగానే ఉంటుంది. పోషకాలను ఉపయోగిస్తే పంట సాధారణ స్థాయికి చేరుకుంటుంది.  మొక్క వయసును బట్టి 10-20 గ్రాముల యూరియా లేదా 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13-0-45) లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.
 రసం పీల్చు పురుగులు, పేనుబంక, తామర పురుగులు, పచ్చదోమ ఉధృతి అధికంగా ఉంటే నివారణకు మోనోక్రొటోఫాస్ నీరు 1:4 నిష్పత్తిలో కలిపి మొక్క వయస్సు 30, 45, 60 రోజుల దశలో కాండానికి మందు పూయాలి.

 వీటి నివారణకు పిచికారీ మందులైతే మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిటామెసిడ్ 0.2 గ్రాములు లేదా ఫాప్రోనిల్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి మందులను మార్చి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.
 పిండినల్లి ఎక్కువగా ఉంటే ప్రొఫెనోఫాస్ 3 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. దీనితో పాటు లీటరుకు 0.5 గ్రాముల సర్ఫ్ పౌడర్ కలిపితే ఫలితం బాగుంటుంది.

 తెల్లదోమ ఉధృతి అధికంగా ఉంటే టైజోఫాస్ 2 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

 వరి
 జిల్లాలో ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 1.32 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 31,083 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. నారుమళ్లలో, నాటిన పొలాల్లో జింక్‌ధాతులోపం ఎక్కువగా ఉంది. దీని నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లీటరు నీటిలో కలిపి 5 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
 ప్రస్తుతం నాటు వేసిన వరిలో కలుపు నివారణకు నాటిన 3-5 రోజుల దశలో బుటాక్లోర్ 1.25 లీటర్లు లేదా అనిలోఫాస్ 500 మి.లీ లేదా ప్రిటిలాక్లోర్ 600 మి.లీ లేదా ఆక్సాడయార్జిల్ 35 గ్రాములు, 20-25 కిలోల ఇసుకలో కలిపి ఎకరం పొలంలో చల్లాలి.

 మొక్కజొన్న
 మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 14 వేల హెక్టార్లు ప్రస్తుతం పది వేల హెక్టార్లలో ఈ పంటను సాగు చేస్తున్నారు. జింక్ లోపం, కాండం తొలిచే పురుగులు వ్యాపిస్తున్నాయి.

 జింక్ లోపం నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటితో కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

 కాండం తొలిచే పురుగు నివారణకు 10-12 రోజుల పైరుపై మోనోక్రొటోఫాస్ 1.6 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 20-25 రోజుల దశలో గమనిస్తే కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలు ఎకరాకు మూడు కిలోల చొప్పున ఆకు సుడులలో వేసుకోవాలి.

 పెసర
 పెసర ఖరీఫ్ విస్తీర్ణం 8.8 వేల హెక్టార్లు ఉండగా 5.7 వేల హెక్టార్లలో విత్తారు. పెసరలో మరూకా మచ్చల పురుగు, సల్లాకు తెగులు గమనించ దగినవి.

 మరూకా మచ్చల పురుగు నివారణకు 2.5 మి.లీ క్లోరిఫైరిఫాస్ లేదా 2.0 మి.లీ క్వినాల్‌ఫాస్ లేదా 1.0 మి.లీ నోవల్యూరాన్ లేదా 0.3 మి.లీ స్పైనోసాడ్ లేదా ఫ్లూబెండిమైడ్ 0.2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.


 సల్లాకు తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. దీన్ని అరికట్టడానికి ట్రైజోఫాస్ 1.25 మి.లీ లేదా ఎసిఫేట్ గ్రాము లేదా ఎసిటామిప్రెడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఉధృతిని బట్టి 7-10 రోజుల వ్యవధిలో మందులను మార్చి పిచికారీ చేయాలి.

 మిరప
 నారుమడి దశలో ఉన్న మిరపలో నారుకుళ్లు తెగులు ఆశిస్తుంది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు లేదా రిడోమల్ ఎంజెడ్ రెండు గ్రాములు లీటరు నీటిలో కలిపి నారు మళ్లను తడపాలి.

 కొన్ని ప్రాంతాల్లో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఆశించింది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములతో స్ట్రెప్టోమైసిన్ లేదా ప్లాంటామైసిన్ గ్రాము 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement