విదేశాలకు తగ్గిన ఎగుమతులు
భారీగా పేరుకుపోతున్న నిల్వలు
మార్కెట్‌లోకి కొత్తగా వస్తున్న మిర్చి
గతేడాదితో పోలిస్తే 40–50 శాతం తగ్గిన ధరలు
కోల్డ్ స్టోరేజీలో నిల్వచేసి నష్టపోయిన రైతులు
ధరల తగ్గుముఖంతో సాగు చేసిన రైతుల్లో ఆందోళన
మిర్చి ధరలు పతనమవుతున్నాయి. గతేడాదితో పోల్చితే అన్ని రకాల మిర్చి ధరలు 40–50% మేర తగ్గాయి. విదేశాలకు ఎగుమతులు తగ్గడం, నిల్వలు పెరగడం, కొత్త మిర్చి మార్కెట్‌లోకి వస్తుండటంతో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతేడాది రాష్ట్రంలో మిరప పంట 5.93 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాది తెగుళ్లు తదితర ప్రభావంతో కొంత మేర దిగుబడులు తగ్గాయి. ఈ ఏడాది 3.64 లక్షల ఎకరాల్లో మిరప పంట సాగైంది.
వాతావరణ పరిస్థితులు, కొంత మేర వైరస్, నల్లదోమ ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది పంట దిగుబడులు కొంత ఆశాజనకంగా ఉంటాయనే భావన మార్కెట్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. తగ్గుతున్న ధరల దృష్ట్యా తాజాగా మిర్చి పంట సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చికి ఎకరాకు పెట్టుబడి రూ1.5 లక్షల వరకు అవుతుంది. క్వింటా మిర్చి కోసేందుకే తేజ వంటి రకాలకైతే రూ.4,000కు పైగా ఖర్చు అవుతుంది.
మూడేళ్లుగా మిర్చి ధరలు స్థిరంగా ఉండటంతో మిర్చి పంటకు మంచి ధర వస్తుందని ఆశతో గతేడాది రైతులు కోల్డ్ స్టోరేజిల్లో నిల్వ చేశారు. ధరలు పతనం కావడంతో వీరంతా భారీగా నష్టపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీల్లో 50–60 లక్షల మిర్చి బస్తాలు నిల్వలున్నట్లు సమాచారం. గుంటూరు పరిసర ప్రాంతాల్లో 30 లక్షల బస్తాల మిర్చి నిల్వలు ఉన్నాయి. – సాక్షి ప్రతినిధి, విజయవాడ
మందకొడిగా ఎగుమతులు..
ప్రపంచవ్యాప్తంగా చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, బర్మా, థాయిలాండ్, మలేసియా, ఇండోనేíÙయా దేశాలకు మిర్చిని ఎగుమతి చేస్తారు. ఏపీ నుంచి కోటికిపైగా బస్తాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. దేశవ్యాప్తంగా తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, అసోం రాష్ట్రాలకు మిర్చి వెళుతుంది. భారత్‌లో మిరప పంట ప్రధానంగా ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పండుతోంది.
అయితే ఈ ఏడాది ఈ సీజన్‌లో లోకల్‌గా చైనా, బంగ్లాదేశ్ మిరప ఉత్పత్తులు మార్కెట్‌లో రావడంతో ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది. దీంతో మిర్చి ధరలు పతనమవుతున్నాయి. దేశవ్యాప్తంగా తగ్గిన ధరల ప్రభావంతో రూ.10 వేల కోట్లకు పైగా రైతులు, వ్యాపారులు నష్టపోతున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా. గుంటూరు మార్కెట్‌లోనే రూ.3,000 కోట్లకు పైగా నష్టపోయే అవకాశం ఉంది.
సరాసరిన కోల్ట్ స్టోరేజిలో నిల్వ చేసిన రైతుకు ఖర్చు క్వింటాకు రూ.3,000–4,000 వస్తుంది. ఈ లెక్కన ఓ క్వింటాకే రూ.13,000–14,000 నష్టపోతున్నారు. జనవరి, ఫిబ్రవరిలో మార్కెట్‌లో మిర్చి భారీగా వస్తుంది. అప్పటికిగానీ ధరలపైన పూర్తి స్పష్టత రాదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
గత ప్రభుత్వం మంచి ధర ఇచ్చింది
గతేడాది 8 ఎకరాల్లో మిర్చి పంట సాగుచేశా. కొంత మిర్చి అమ్మగా మంచి ధర వచ్చిoది. కానీ ఇంకా ఎక్కువ ధర వస్తుందని 50 క్వింటాళ్లు వరకు స్టోరేజ్‌లో నిల్వ ఉంచాను. అయినా «గిట్టుబాటు ధర లేకపోవటంతో రూ.8,500కు తక్కువ ధరకు విక్రయించా. కోల్డ్ స్టోరేజ్‌లో అద్దె ఎక్కువ చెల్లించాల్సి వచ్చిoది. దీంతో భారీగా నష్టపోయాను.
గత ప్రభుత్వం మిర్చికి మంచి ధర ఇచ్చిoది. ఈ ఏడాది మిర్చి సాగుకు ఎక్కువ ఖర్చు అయింది. ఇప్పుడైనా ప్రభుత్వం మిర్చి పంటకు మంచి గిట్టుబాటు ధర కల్పిస్తుందని ఆశపడుతున్నా. లేకపోతే అప్పుల్లో కూరుకుపోతాను. – మార్కపూడి అశోక్, రైతు, కంచికచర్ల మండలం గండేపల్లి
నిల్వ చేసి నష్టపోయా...
గతేడాది 4 ఎకరాల్లో మిర్చిని సాగుచేశా. దళారులు వచ్చి కళ్లాల్లో క్వింటా మిర్చిని రూ.14,000కు కొనుగోలు చేశారు. అయితే కొంతమేరకు మిర్చిని శీతల గిడ్డంగిలో «ధర వస్తుందని నిల్వ చేశా. డబ్బులు అవసరమై మిర్చిని రూ.9,000కు అమ్మాను. చేసిన అప్పులు తీరలేదు. ఏం చేయాలో తోచటం లేదు. – బెల్లంకొండ వెంకట సుబ్బారావు, గండేపల్లి, కంచికచర్ల మండలం
Comments
Please login to add a commentAdd a comment