సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉపాధే లక్ష్యంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం పలు ప్రైవేటు కంపెనీల నుంచి పెట్టుబడుల ఆకర్షణకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. అందులో భాగంగా కాస్టిక్ సోడా, క్లోరిన్ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్‌ను ఏర్పాటు చేసింది. రూ.2,700 కోట్లతో ఏటా 1.50 లక్షల టన్నుల కాస్టిక్ సోడాను ఉత్పత్తి చేసే క్లోర్ ఆల్కాలి యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2022, ఏప్రిల్ 21న ప్రారంభించారు.
ఈ యూనిట్ ద్వారా ప్రస్తుతం 1,300 మంది ఉపాధి పొందుతుండగా.. యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరో 1,100 మందికి ఉపాధి కలి్పంచవచ్చు. దేశంలోనే అతిపెద్ద యూనిట్ బలభద్రపురంలో ఏర్పాటు కావడంతో ఈ ప్రత్యేక రసాయనాలు ముడి సరుకుగా తయారుచేసే అనేక ఉత్పత్తుల్ని తయారు చేసే సంస్థలకు కాకినాడ ప్రధాన హబ్‌గా మారనుంది. ఫార్మాస్యూటికల్స్, ఆగ్రో కెమికల్స్, ఆక్వా కల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక యూనిట్లు రావడం ద్వారా కాకినాడ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి.
తూర్పు తీరంలో ఇదే తొలి యూనిట్
ఆదిత్య బిర్లా గ్రూపునకు దేశవ్యాప్తంగా ఏడు క్లోర్ ఆల్కాలి యూనిట్లు ఉండగా, తూర్పుతీర ప్రాంతంలో తొలి యూనిట్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో లాక్‌డౌన్ సమయంలో కూడా పనులు వేగంగా జరిగాయి. కీలక అనుమతులు తీసుకురావడంలో అధికారులు వేగంగా స్పందించడంతో రికార్డు సమయంలోనే ఉత్పత్తిని ప్రారంభించారు. ఎలాంటి కాలుష్య కారకాలు లేకుండా జర్మన్ టెక్నాలజీ సాయంతో ఈ యూనిట్‌ను అభివృద్ధి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడంతో ఉత్పత్తి ప్రారంభించిన వెంటనే విస్తరణ పనులు ప్రారంభించారు.
ఎగుమతుల దిశగా..
మనం తినే అహార పదార్థాల నుంచి శుభ్రం చేయడానికి వినియోగించే ప్రతి వస్తువులోనూ కాస్టిక్ సోడా చాలా కీలకం. కాగిత పరిశ్రమ, టెక్స్‌టైల్స్, అల్యూమినియం, ఫార్మా, ఫెస్టిసైడ్స్, మంచినీటిని శుభ్రం చేయడం, స్విమ్మింగ్ పూల్స్‌లో నీటిని పరిశుభ్రంగా ఉంచడంలో, ఆయిల్ రిఫైనరీలు, సబ్బులు, డిటర్జెంట్ల తయారీ ఇలా అన్నింటా కాస్టిక్ సోడా ముఖ్యమైంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పండ్లు, కూరగాయలను శుభ్రం చేయడానికి కూడా కాస్టిక్ సోడానే వినియోగిస్తారు.
కోవిడ్ సమయంలో ఆస్పత్రులు శుభ్రం చేసేందుకు, శానిటైజేషన్ వంటి వాటిల్లో ఈ యూనిట్‌లో తయారయ్యే సోడియం హైపో క్లోరైడ్ కీలకపాత్ర పోషించిందని ఆల్కలీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మన దేశంలోప్రస్తుతం కాస్టిక్ సోడా డిమాండ్ 35.6 లక్షల టన్నులుండగా 2035 నాటికి అది 55 లక్షల టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తాజా గణాంకాల మేరకు 2021 నాటికి దేశంలో వివిధ యూనిట్ల ద్వారా 47.63 లక్షల టన్నుల కాస్టిక్ సోడా ఉత్పత్తి సామర్థ్యం ఉంది. పూర్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చాక ఈ కెమికల్స్‌ను పలు దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ అధికారులు
వెల్లడించారు.
మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ కీలకం
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు మద్దతిస్తూ కొత్తగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది. – ఏప్రిల్ 21, 2022న కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంబోత్సవంలో ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా
Comments
Please login to add a commentAdd a comment