Production
-
గత ఆర్థిక ఏడాదిలో పండ్ల ఉత్పత్తిలో ఏపీదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: రైతుకు వెన్నుదన్నుగా నిలిస్తే పంటల దిగుబడి ఎంతగా పెరుగుతుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరూపించింది. ధాన్యం, వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటలకూ వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాధాన్యతనిచి్చ, అడుగడుగునా రైతుకు అండదండగా నిలిచింది. దీంతో రాష్ట్రంలో పంటల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. పండ్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో తలసరి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. వివిధ రాష్ట్రాలు, దేశంలో తలసరి పండ్లు, కూరగాయల ఉత్పత్తిపై నివేదికను విడుదల చేసింది. గత ఆరి్థక ఏడాదిలో దేశంలో మొత్తం తలసరి పండ్ల ఉత్పత్తి 80 కిలోలు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 333 కిలోలు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే 2023–24లో ఆంధ్రప్రదేశ్ తలసరి కూరగాయల ఉత్పత్తి 119 కిలోలుందని తెలిపింది. గత దశాబ్ద కాలంలో దేశంలో తలసరి పండ్ల ఉత్పత్తి 7 కిలోలు, కూరగాయల ఉత్పత్తి 12 కిలోలు పెరిగినట్లు నివేదిక తెలిపింది. 2013–14లో దేశంలో తలసరి పండ్ల ఉత్పత్తి 73 కిలోలుండగా 2023–24లో 80 కిలోలకు, కూరగాయల ఉత్పత్తి 135 కిలోల నుంచి 147 కిలోలకు పెరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో తలసరి పండ్లు, కూరగాయల ఉత్పత్తి గత దశాబ్ద కాలంలో గణనీయంగా తగ్గిందని నివేదిక తెలిపింది. దేశంలో మొత్తం ఒక వ్యక్తి సంవత్సరానికి పండ్లు, కూరగాయలు 146 కిలోలు తీసుకోవాలని సాధారణ సిపార్సు ఉందని నివేదిక తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఒక వ్యక్తికి సంవత్సరానికి పండ్లు, కూరయలు కలిపి 227 కిలోలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే పంట కోత అనంతరం, నిల్వ, గ్రేడింగ్, రవాణా, ప్యాకేజింగ్‌లో 30 నుంచి 35 శాతం తగ్గుతోందని, ఇది మొత్తం వినియోగంపై ప్రభావం చూపుతోందని నివేదిక తెలిపింది. -
ఇది కదా అసలైన రికార్డ్!.. ఒక ఏడాదిలో 20 లక్షల కార్లు
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) మొదటిసారి ఒక సంవత్సరంలో 2 మిలియన్స్ (20 లక్షలు) వాహనాలను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. ఇది కంపెనీ చరిత్రలోనే గొప్ప రికార్డ్. ప్యాసింజర్ వెహికల్ ఉత్పత్తిలో ఈ మార్కును సాధించిన భారతదేశంలోని ఏకైక బ్రాండ్ మారుతి సుజుకి కావడం గమనార్హం.ఈ ఏడాది ఉత్పత్తి అయిన 20 లక్షల కారుగా ఎర్టిగా నిలిచింది. ఇది హర్యానాలోని మనేసర్ ప్లాంట్‌లో ఈ కారు తయారైనట్లు సమాచారం. కంపెనీ తాయారు చేసిన రెండు మిలియన్ యూనిట్లలో 60 శాతం హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్ సౌకర్యాలలో తయారయ్యాయి. మిగిలినవి గుజరాత్‌లోని హన్సల్పూర్ ప్లాంట్‌లో తయారైనట్లు కంపెనీ వెల్లడించింది.మారుతి సుజుకి మూడు ప్లాంట్లు 2.35 మిలియన్ యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. కాగా కంపెనీ హర్యానాలోని ఖర్ఖోడాలో మరో ప్లాంట్ ప్రారభించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమైతే.. కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 4 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది.మారుతి సుజుకి తన కార్లను ఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. 100 ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇందులో సుమారు 17 మేడ్ ఇన్ ఇండియా కార్లు ఉన్నట్లు సమాచారం. మారుతి ఫ్రాంక్స్, జిమ్నీ, బాలెనో, డిజైర్, స్విఫ్ట్ వంటి కార్లను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. -
వేసవి వస్తోంది.. బీర్ల ఉత్పత్తి పెంచండి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఏటా వేసవిలో బీర్ల కొరత ఏర్పడుతుంది. ఎండల తీవ్రతను తట్టుకునేందుకు మద్యం ప్రియులు బీర్ల వైపు మొగ్గు చూపుతారు. సాధారణ రోజుల్లో కంటే ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. ఏటా ఫిబ్రవరి వచ్చిందంటే చాలు క్రమంగా బీర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఏప్రిల్, మే మాసాల్లో బీర్ల కొరత ఏర్పడుతుంది. ప్రధానంగా బ్రాండెడ్ బీర్లు దొరక్క బీరు ప్రియులు అల్లాడుతుంటారు. రానున్న వేసవిలో ఈ సమస్య తలెత్తకుండా ఎక్సైజ్‌శాఖ ము(మ)ందస్తు జాగ్రత్త తీసుకుంటోంది. బీర్ల ఉత్పత్తిని పెంచాలని బెవరేజెస్ కంపెనీలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచుతోంది. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేస్తున్న యూనిట్లలో ఉత్పత్తి పెంచాలని ఎక్సైజ్‌శాఖ బెవరేజెస్ విభాగం అధికారులు ఆయా బీర్ల కంపెనీలను ఆదేశించారు.డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి.. సంగారెడ్డి సమీపంలో ఉన్న ఓ బెవరేజెస్ కంపెనీలో నెలకు సుమారు మూడు లక్షల కేసుల నుంచి నాలుగు లక్షల కేస్ల బీర్లు ఉత్పత్తి ఉంటుంది. ఎక్సైజ్ అధికారుల ఒత్తిడి మేరకు ఈ కంపెనీ తన ఉత్పత్తిని ఏకంగా ఐదు లక్షల కేస్లకు పెంచింది. ఒక్కో కేస్‌లో 12 సీసాలు (650 ఎంఎల్) ఉంటాయి. మరో మల్టీనేషనల్ బెవరేజెస్ కంపెనీ నెలకు సుమారు 25 లక్షల కేస్ల బీరు ఉత్పత్తి చేస్తుంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్పత్తిని సుమారు 30 లక్షల కేస్ల వరకు పెంచినట్టు ఎక్సైజ్‌వర్గాలు చెబుతున్నాయి. లిక్కర్ మాదిరిగా కాకుండా, బీర్లకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఉత్పత్తి జరిగిన తేదీ నుంచి ఆరు నెలల లోపే వినియోగం జరగాలి. దీంతో ఇప్పటి నుంచి ఉత్పత్తిని పెంచుకుంటూ వెళితేనే వేసవి డిమాండ్‌కు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచొచ్చని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది.డిమాండ్‌కు తగినట్టుగా ‘బీర్ల డిమాండ్‌ను ముందుగా అంచనా వేసి బెవరేజెస్ కంపెనీలు ఉత్పత్తిని పెంచుకుంటాయి. సాధారణంగా బ్రాండెడ్ బీర్లకు వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని పెంచుకుంటాయి’అని ఎక్సైజ్‌శాఖ బ్రూవరీస్ విభాగం అధికారి తెలిపారు.సంగారెడ్డి నుంచే రాష్ట్రమంతటికీ సరఫరా.. సంగారెడ్డి జిల్లాలో ఆరు కంపెనీలకు చెందిన బీర్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. యూబీ కంపెనీకి చెందినవి రెండు, కల్స్‌బర్గ్, క్రౌన్, లీలాసన్స్, ఏబీ ఇన్‌బీవ్ అనయూసర్–బుష్, వంటి బ్రీవరేజెస్ కంపెనీలు ఇక్కడ బీర్ల ఉత్పత్తి చేస్తాయి. రాష్ట్రమంతటికీ బీర్ల సరఫరా సంగారెడ్డి జిల్లా నుంచే జరుగుతుంది. ఎక్సైజ్‌శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ఉన్న బెవరేజెస్ కంపెనీల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 6,800 లక్షల లీటర్లు. అయితే ఈ బీర్ల తయారీకి అవసరమైన నీటి కోసం ఆయా కంపెనీలు ఏకంగా పైప్లైన్లనే వేసుకున్నాయి. కొన్ని కంపెనీలు మంజీర నదీ జలాలనే వినియోగిస్తున్నాయి. -
కాళేశ్వరం లేకున్నా రికార్డు వరి పంట
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు అందించకపోయినా రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఈ ఏడాది 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందని ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రులు మీడియాతో మాట్లాడారు. అధికార దాహంతో ఉన్న బీఆర్ఎస్ పారీ్ట.. రైతులకు మేలు చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రెండోస్థానం కోసం బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు. 40 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు రాష్ట్రంలో గతంలో 25 లక్షల ఎకరాల్లో సన్నవడ్లు సాగు చేస్తే, ఈ ఏడాది సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో 40 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు సాగు చేశారని మంత్రులు తెలిపారు. వచ్చే సంక్రాంతి నుంచి రేషన్ షాపులు, గురుకులాలు, హాస్టళ్లలో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. ‘గత ఏడాది ఇదే సమయానికి 17 జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తే.. ఈ ఏడాది 25 జిల్లాల్లో కొనుగోళ్లు చేస్తున్నాం.గత ఏడాది ఈ కాలానికి 9.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగులో చేస్తే.. ఈ ఏడాది 9.58 లక్షలు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. వాస్తవాలు ఇలా ఉంటే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. హింస ప్రేరిపిస్తోంది విపక్షాలే.. ప్రతిపక్షాలు రైతులను, ప్రజలను రెచ్చగొట్ట హింసను ప్రేరిపిస్తున్నాయని మంత్రులు విమర్శించారు. పరిశ్రమలకు భూములు సేకరించే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణను నేరుగా ముఖ్యమంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు చేపట్టడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని, దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడంగల్‌లో ఫార్మా కంపెనీల ఏర్పాటు విషయంలో రైతులతో మాట్లాడేందుకు సీఎం, మంత్రులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.ధాన్యంలో తేమ 17 శాతానికి మించరాదన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రులు తెలిపారు. ఈ నిబంధన సడలించేలా రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. తేమశాతాన్ని పక్కనపెట్టి ప్రైవేటు వ్యాపారులు అధిక ధరకు రైతుల నుంచి ధాన్యం కొంటున్నారని చెప్పారు. -
ట్రా లా లాలో రెండో సినిమా?
హీరోయిన్ సమంత ఇటీవల ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ‘సినిమా బండి’ చిత్రంతో ప్రేక్షకుల మనసు గెలిచి, ఇటీవల ‘పరదా’ (ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది) చిత్రాన్ని పూర్తి చేసిన దర్శకుడు ప్రవీణ్ కంద్రేగుల కథకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. తన సొంత నిర్మాణసంస్థ ‘ట్రా లా లా’పై ఈ సినిమాను సమంత నిర్మిస్తున్నారని, త్వరలోనే ప్రకటన రానుందని భోగట్టా. ‘ట్రా లా లా’ బ్యానర్‌పైనే ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను గతంలో ప్రకటించారు సమంత. కానీ ఆ తర్వాత మరో అప్డేట్ రాలేదు. ఈలోపు ఈ బేనర్‌పై మరో సినిమా అంటూ... రెండో సినిమా గురించిన వార్త ప్రచారంలోకి వచ్చింది. -
ఒకేచోట కోటి కార్లు: మారుతి సుజుకి సరికొత్త రికార్డ్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి తన మానేసర్ ప్లాంట్‌లో ఏకంగా కోటి కార్లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. ఒకే ప్లాంట్‌లో ఇన్ని కార్లను ఉత్పత్తి చేయడానికి 18 సంవత్సరాల సమయం పట్టింది.600 ఎకరాల్లో విస్తరించి ఉన్న మానేసర్ సదుపాయంలో కార్యకలాపాలు అక్టోబర్ 2006లో ప్రారంభమయ్యాయి. ఈ ప్లాంట్‌లో మారుతి బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6, సియాజ్, డిజైర్, వ్యాగన్ఆర్, ఎస్-ప్రెస్సో, సెలెరియో కార్లను తయారు చేశారు. ఈ కారు భారతదేశంలో మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు కూడా ఎగుమతి అయ్యాయి.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కీలక మార్పుజపాన్కు ఎగుమతి చేసిన మారుతి సుజుకి మొట్టమొదటి ప్యాసింజర్ కారు బాలెనో కూడా మనేసర్ ఫెసిలిటీలో తయారు చేశారు. మానేసర్, గురుగ్రామ్, గుజరాత్ ప్లాంట్లలో కార్ల మారుతి సుజుకి ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 23.50 లక్షల యూనిట్లుగా ఉంది. ఈ సదుపాయాల్లో కార్ల తయారీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3.11 కోట్ల వాహనాలు ఉత్పత్తి అయినట్లు సమాచారం. -
ఐఫోన్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత
తమిళనాడులోని హొసూరు వద్ద యాపిల్ ఐఫోన్ భాగాలను తయారు చేసే టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిరవధికంగా నిలిచిపోయింది. రెండు రోజుల క్రితం ఇక్కడ అగ్నిప్రమాదం జరిగింది. దీని తర్వాత మరింత నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి ఇప్పుడప్పుడే కొనసాగే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది.ప్రమాదం సమయంలో పడిపోయిన షెడ్లను తొలగిస్తున్నప్పుడు మళ్లీ అగ్ని ప్రమాదం లేదా పొగ వచ్చే అవకాశాలు ఉన్నందున ప్లాంట్‌లో ఫైరింజన్లను అందుబాటులో ఉంచినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.వేలు రాయిటర్స్‌తో అన్నారు. అగ్నిప్రమాదానికి కారణాన్ని ఇంకా నిర్ధారించలేదని చెప్పారు.ప్లాంట్‌లో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఉత్పత్తిని నిలిపివేశారు. యాపిల్ చైనాను దాటి భారత్‌ను కీలక వృద్ధి మార్కెట్‌గా చూస్తున్న నేపథ్యంలో ఐఫోన్ సరఫరా గొలుసును ప్రభావితం చేసే తాజా సంఘటన ఇది. ఈ సంఘటనపై యాపిల్ వ్యాఖ్యానించలేదు. మరోవైపు టాటా మాత్రం అగ్నిప్రమాదానికి కారణం ఏంటన్నదానిపై దర్యాప్తు జరుగుతోందని, ప్లాంట్‌లోని ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ..ఈ ప్లాంట్‌లో ఐఫోన్లకు క్లిష్టమైన బ్యాక్ ప్యానెల్లతోపాటు కొన్ని ఇతర భాగాలను తయారు చేస్తారు. ఇదే కాంప్లెక్స్‌లోని మరో భవనంలో ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ ఈ ఏడాది చివర్లో ప్రారంభించాల్సి ఉంది. అయితే అగ్ని ప్రమాద ప్రభావం దీనిపై ఎంత మేరకు పడిందో స్పష్టంగా తెలియలేదు. -
భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SAVWIPL) పూణేలోని చకన్లోని తన తయారీ కేంద్రంలో 15 లక్షల మేడ్-ఇన్-ఇండియా వాహనాలను తయారు చేసి.. ఉత్పత్తిలో ఓ సరికొత్త మైలురాయిని దాటేసింది.స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో స్థానికంగా తన కార్యకలాపాలను 2007లో ప్రారంభించి.. తమ మొదటి ఉత్పత్తిగా 'స్కోడా ఫాబియా' లాంచ్ చేశారు. ఆ తరువాత స్కోడా రాపిడ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో, అమియో వంటి కార్లను లాంచ్ చేశాయి. ప్రస్తుతం ఈ కార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.ప్రస్తుతం సంస్థ కుషాక్, టైగన్, స్లావియా, వర్టస్ కార్లను మాత్రమే చకాన్ ఫెసిలిటీలో ఇండియా 2.0 ఉత్పత్తులుగా ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ స్థానికంగా ఉత్పత్తి చేసిన కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. ఉత్పత్తిలో సుమారు 30 శాతానికి పైగా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు బ్రాండ్ ప్రకటించింది.స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ స్థానికంగా కార్లను మాత్రమే కాకుండా.. ఇంజిన్లను కూడా తయారు చేస్తోంది. అప్పట్లో పోలో హ్యాచ్‌బ్యాక్ కారులో అందించే 1.5 లీటర్ టీడీఐ డీజిల్ ఇంజిన్‌ను కంపెనీ తయారు చేసిందే. ఆ తరువాత 2.0 లీటర్ టీడీఐ డీజిల్, 1.0 లీటర్, 1.2 ఎంపీఐ పెట్రోల్ ఇంజిన్లను చేసింది. ఇప్పటికి స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ ఏకంగా 3.80 లక్షల ఇంజిన్లను ఉత్పత్తి చేసినట్లు సమాచారం. -
టాటా స్టీల్ సరికొత్త రికార్డ్‌లు
స్టీల్ ఉత్పత్తుల్లో టాటా స్టీల్ సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తోంది. టాటా స్టీల్‌కు రిటైల్, ఆటోమోటివ్, రైల్వే విభాగాల నుండి భారీ ఆర్డర్లు రావడంతో ఉత్పత్తుల్ని పెంచేస్తుంది. ఫలితంగా ఆర్ధిక సంవత్సరం 2024లో మొత్తం స్టీల్ డెలివరీలలో 6 శాతం వృద్ధిని 19.90 మిలియన్ టన్నులని నివేదించింది. మునుపటి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 18.85 మిలియన్ టన్నుల (ఎంటీ) ఉక్కును ఉత్పత్తి చేసినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. ఆటోమోటివ్, ప్రత్యేక ఉత్పత్తుల సెగ్మెంట్ డెలివరీలు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 2.9 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. ఫలితంగా ఆర్ధిక సంవత్సరం 2023 మునుపటి రికార్డును అధిగమించింది. బ్రాండెడ్ ఉత్పత్తులు, రిటైల్ సెగ్మెంట్ డెలివరీలు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో డెలివరీలు 11 శాతం పెరిగి 6.5 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు & ప్రాజెక్టుల సెగ్మెంట్ డెలివరీలు 6 శాతం పెరిగి 7.7 మిలియన్ టన్నులకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ అగ్రగామి
ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండటంతో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ రూపాల్లో సాయం అందిస్తుండటంతో పండ్ల రైతులు ఈ ఘనత సాధించారు. దేశవ్యాప్తంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11,20,77,190 టన్నుల పండ్లు ఉత్పత్తి కాగా.. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 16.16 శాతంగా ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వారీగా పండ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణంపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలి ముందస్తు అంచనాలను సోమవారం వెల్లడించింది. - సాక్షి, అమరావతి 1.81 కోట్ల టన్నులతో మనమే టాప్ 2023–24 ఆర్థిక ఏడాదిలో 1,81,11,600 టన్నుల పండ్ల ఉత్పత్తితో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత మహారాష్ట్ర 1,42,78,250 టన్నుల పండ్లు ఉత్పత్తితో రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 1,27,02,060 టన్నుల పండ్ల ఉత్పత్తితో మూడో స్థానంలో నిలిచింది. అరటి ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు రెండో స్థానంలో, ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. బత్తాయి ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో తెలంగాణ నిలిచాయి. నిమ్మ ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి. మామిడి ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. బొప్పాయి ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ విస్తీర్ణమే ఉన్నా పండ్ల ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉండటం విశేషం. ఆంధ్రఫ్రదేశ్‌లో పండ్లు సాగు విస్తీర్ణం 7,80,310 హెక్టార్లు ఉండగా.. మహారాష్ట్రలో 8,48,370 హెక్టార్లలో పండ్ల సాగు విస్తీర్ణం ఉంది. -
రంజాన్ నెలలో ఖర్జూరం ఎందుకు తింటారు? ఏ దేశంలో ఉత్పత్తి అధికం?
ప్రపంచవ్యాప్తంగా ఖర్జూరాన్ని ఇష్టంగా తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. రంజాన్ మాసంలో ఖర్జూరానికి డిమాండ్ మరింత పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. ఇది మన శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉపవాసం ఉండేవారికి తగిన బలాన్ని అందిస్తుంది. ఖర్జూరం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు ఖర్జూరంతో ఉపవాసాన్ని విరమించడానికి ఇదే ప్రధాన కారణం. అయితే మన తినే ఖర్జూరాలు ఏ దేశం నుండి వచ్చాయనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అలాగే ఏ దేశం అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తుందనేది కూడా చాలామందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముస్లిం దేశాలు అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్జూరాన్ని ఉత్పత్తి చేసే దేశం ఈజిప్ట్. ఈ దేశంలో ఏడాదికి దాదాపు 1,733,432 టన్నుల ఖర్జూరాన్ని ఉత్పత్తి చేస్తారు. ఖర్జూరం ఉత్పత్తిలో సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి 1,610,731 టన్నుల ఖర్జూరం ఉత్పత్తి అవుతుంది. ఏడాదిలో 1,247,403 టన్నుల ఖర్జూరాలు పండే అల్జీరియా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. నాల్గవ స్థానంలో ఇరాన్ ఉండగా, ఇక్కడ ఒక సంవత్సరానికి 1,030,459 టన్నుల ఖర్జూరం ఉత్పత్తి అవుతుంది. ఈ జాబితాలో పాకిస్తాన్ ఐదవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి 7,32,935 టన్నుల ఖర్జూరం పండుతుంది. ఈ దేశాల నుంచి విదేశాలకు ఖర్జూరాలు ఎగుమతి అవుతాయి. -
మాగాణుల్లో మిథేన్‌కు చిరు చేపలతో చెక్!
వాతావరణాన్ని వేడెక్కిస్తున్న మిథేన్, కార్బన్ డయాక్సయిడ్ కన్నా 86 రెట్లు ఎక్కువ పర్యావరణానికి హాని చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోకి విడుదలవుతున్న మిథేన్ వాయువులో 10శాతం మేరకు వరి పొలాల నుంచే వెలువడుతోందని అంచనా. అయితే, వరి పొలాల్లోని నీటిలో చిరు చేపల (గోల్డెన్ షైనర్ రకం)ను పెంచితే మూడింట రెండొంతుల మిథేన్ వాయువు తగ్గిందని కాలిఫోర్నియాకు చెందిన రిసోర్స్ రెన్యువల్ ఇన్స్టిట్యూట్(ఆర్ఆర్ఐ) అనే స్టార్టప్ కంపెనీ చెబుతోంది. ‘ఫిష్ ఇన్ ద ఫీల్డ్స్’ పేరిట పైలట్ ప్రాజెక్టు ద్వారా రెండేళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ఇటీవల ‘ద జెఎం కప్లన్ ఇన్నోవేషన్ ప్రైజ్’ను గెల్చుకొని ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ‘వరి రైతులకు చేపల ద్వారా అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. సముద్ర చేపలను దాణాల్లో వాడే బదులు ఈ పొలాల్లో పెరిగే చేపలను వాడటం ద్వారా భూతాపాన్ని తగ్గించడానికి, చేపల జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి మా పరిశోధనలు ఉపకరిస్తాయి. 1,75,000 డాలర్ల ప్రైజ్ మనీతో మేం చేపట్టిన ప్రయోగాత్మక సాగుకు ఊతం వచ్చింది..’ అన్నారు ఆర్.ఆర్.ఐ. వ్యవస్థాపకులు దెబోరా మోస్కోవిట్జ్, ఛాన్స్ కట్రానో. ఆసియా దేశాల్లో అనాదిగా సాగు చేస్తున్న వరి–చేపల మిశ్రమ సాగులో అదనపు ప్రయోజనాన్ని కొత్తగా వారు శోధిస్తున్నారు. సుస్థిర ఆక్వా సాగుతో పాటు రైతుల ఆదాయం పెరుగుదలకు, భూతాపం తగ్గడానికి ఉపకరిస్తుందంటున్నారు. మాగాణుల్లో వరితో పాటు చేపలు పెంచితే ‘కార్బన్ క్రెడిట్స్’ ద్వారా కూడా అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. మరికొన్ని సంగతులు ప్రపంచంలోని గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో నాలుగింట ఒక వంతు ఆహారం , వ్యవసాయం నుంచి వస్తున్నవే. వీటిల్లో నైట్రస్ ఆక్సైడ్ , మీథేన్దే అగ్రభాగం. ప్రపంచ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో 13 శాతం వ్యవసాయం, అటవీ భూ వినియోగంనుంచి వస్తుండగా, 21 శాతం ఇంధన కాలుష్యం. వరి పంట, పశువుల పెంపకం వంటి పద్ధతులు నేరుగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు దోహదం చేస్తాయనేది నిపుణుల వాదన. పంటకోత, నాటడం, రవాణా ద్వారా కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు, అలాగే యూరియాతో పండించిన గడ్డితినే పశువుల ద్వారా, పేడ నిర్వహణ ద్వారా ద్వారా మీథేన్ విడుదలవుతుంది. ఎరువుల వాడకం, నేల శ్వాసక్రియ వలన నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ-స్మార్ట్ వ్యవసాయం ద్వారా ఉద్గారాల ప్రభావాలను తగ్గించాలనేది ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా సమర్థవంతమైన పశువుల పెంపకం, శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం, జంతు-ఆధారిత ఆహార పదార్థాల నిర్వహణ లాంటివి ప్రధానంగా ఉన్నాయి. ఇవి సుస్థిర ఆహార వ్యవస్థకు దోహదపడతాయి కూడా. గ్రీన్హౌస్ వాయువులపై వ్యవసాయ ప్రభావాన్ని తగ్గించడం మన భూగ్రహ మనుగడకు చాలా అవసరం. -
కోరమాండల్ కాకినాడ ప్లాంట్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ కాకినాడ యూనిట్లో ఫాస్ఫరిక్, సల్ఫరిక్ యాసిడ్ ప్లాంట్ల ఏర్పాటుకు బోర్డు ఆమోదం పొందింది. రోజుకు ఫాస్ఫరిక్ యాసిడ్ 750 టన్నులు, సల్ఫరిక్ యాసిడ్ 1,800 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నూతన కేంద్రాలను జోడించనున్నారు. ఇందుకోసం రూ.1,029 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. 24 నెలల్లో ఈ విస్తరణ పూర్తి కానున్నట్టు వెల్లడించింది. కాకినాడ యూనిట్ సామర్థ్యం రోజుకు ఫాస్ఫరిక్ యాసిడ్ 1,550 టన్నులు, సల్ఫరిక్ యాసిడ్ 4,200 టన్నులు ఉంది. ప్రస్తుతం పూర్తి సామర్థ్యాన్ని కంపెనీ వినియోగించుకుంటోంది. ఎరువుల తయారీలో ఈ యాసిడ్స్‌ను ఉపయోగిస్తారు. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, తయారీ సామర్థ్యం పెంపొందించుకునేందుకు విస్తరణ చేపడుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. పూర్తి స్థాయి ప్లాంటుగా.. పాస్ఫేటిక్ ఎరువుల తయారీ, విక్రయంలో భారత్‌లో కోరమాండల్ రెండవ స్థానంలో నిలిచింది. ముడిసరుకు, ఎరువుల తయారీలో పూర్తి స్థాయి ప్లాంటుగా కాకినాడ కేంద్రాన్ని తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని కోరమాండల్ ఇంటర్నేషనల్ తెలిపింది. ప్రతిపాదిత విస్తరణతో కంపెనీ వ్యయ సామర్థ్యాలను, ముడిసరుకు భద్రతను మరింత మెరుగుపరుస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ వివరించారు. డ్రోన్స్ తయారీలో ఉన్న తమ అనుబంధ కంపెనీ ధక్ష బలమైన ఆర్డర్ బుక్ నమోదు చేసిందని చెప్పారు. రక్షణ రంగం, వ్యవసాయంతోపాటు వివిధ కంపెనీల నుంచి ఆర్డర్లు పొందామన్నారు. గ్రోమోర్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని కంపెనీ ప్రోత్సహిస్తోంది. -
కాస్టిక్ సోడా ఉత్పత్తుల హబ్‌గా కాకినాడ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉపాధే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పలు ప్రైవేటు కంపెనీల నుంచి పెట్టుబడుల ఆకర్షణకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. అందులో భాగంగా కాస్టిక్ సోడా, క్లోరిన్ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్‌ను ఏర్పాటు చేసింది. రూ.2,700 కోట్లతో ఏటా 1.50 లక్షల టన్నుల కాస్టిక్ సోడాను ఉత్పత్తి చేసే క్లోర్ ఆల్కాలి యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2022, ఏప్రిల్ 21న ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా ప్రస్తుతం 1,300 మంది ఉపాధి పొందుతుండగా.. యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరో 1,100 మందికి ఉపాధి కలి్పంచవచ్చు. దేశంలోనే అతిపెద్ద యూనిట్ బలభద్రపురంలో ఏర్పాటు కావడంతో ఈ ప్రత్యేక రసాయనాలు ముడి సరుకుగా తయారుచేసే అనేక ఉత్పత్తుల్ని తయారు చేసే సంస్థలకు కాకినాడ ప్రధాన హబ్‌గా మారనుంది. ఫార్మాస్యూటికల్స్, ఆగ్రో కెమికల్స్, ఆక్వా కల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అనేక యూనిట్లు రావడం ద్వారా కాకినాడ ప్రాంత రూపురేఖలు మారనున్నాయి. తూర్పు తీరంలో ఇదే తొలి యూనిట్ ఆదిత్య బిర్లా గ్రూపునకు దేశవ్యాప్తంగా ఏడు క్లోర్ ఆల్కాలి యూనిట్లు ఉండగా, తూర్పుతీర ప్రాంతంలో తొలి యూనిట్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో లాక్డౌన్ సమయంలో కూడా పనులు వేగంగా జరిగాయి. కీలక అనుమతులు తీసుకురావడంలో అధికారులు వేగంగా స్పందించడంతో రికార్డు సమయంలోనే ఉత్పత్తిని ప్రారంభించారు. ఎలాంటి కాలుష్య కారకాలు లేకుండా జర్మన్ టెక్నాలజీ సాయంతో ఈ యూనిట్‌ను అభివృద్ధి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడంతో ఉత్పత్తి ప్రారంభించిన వెంటనే విస్తరణ పనులు ప్రారంభించారు. ఎగుమతుల దిశగా.. మనం తినే అహార పదార్థాల నుంచి శుభ్రం చేయడానికి వినియోగించే ప్రతి వస్తువులోనూ కాస్టిక్ సోడా చాలా కీలకం. కాగిత పరిశ్రమ, టెక్స్టైల్స్, అల్యూమినియం, ఫార్మా, ఫెస్టిసైడ్స్, మంచినీటిని శుభ్రం చేయడం, స్విమ్మింగ్ పూల్స్‌లో నీటిని పరిశుభ్రంగా ఉంచడంలో, ఆయిల్ రిఫైనరీలు, సబ్బులు, డిటర్జెంట్ల తయారీ ఇలా అన్నింటా కాస్టిక్ సోడా ముఖ్యమైంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పండ్లు, కూరగాయలను శుభ్రం చేయడానికి కూడా కాస్టిక్ సోడానే వినియోగిస్తారు. కోవిడ్ సమయంలో ఆస్పత్రులు శుభ్రం చేసేందుకు, శానిటైజేషన్ వంటి వాటిల్లో ఈ యూనిట్లో తయారయ్యే సోడియం హైపో క్లోరైడ్ కీలకపాత్ర పోషించిందని ఆల్కలీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మన దేశంలోప్రస్తుతం కాస్టిక్ సోడా డిమాండ్ 35.6 లక్షల టన్నులుండగా 2035 నాటికి అది 55 లక్షల టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తాజా గణాంకాల మేరకు 2021 నాటికి దేశంలో వివిధ యూనిట్ల ద్వారా 47.63 లక్షల టన్నుల కాస్టిక్ సోడా ఉత్పత్తి సామర్థ్యం ఉంది. పూర్తి సామర్థ్యం అందుబాటులోకి వచ్చాక ఈ కెమికల్స్‌ను పలు దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ కీలకం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు మద్దతిస్తూ కొత్తగా భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూపు రెండు నెలల్లో రెండు యూనిట్లు ఏర్పాటు చేయడమే దీనికి నిదర్శనం. రెండు నెలల క్రితం వైఎస్సార్ జిల్లాలో గార్మెంట్స్ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేశాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. మా గ్రూపునకు ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. ఇప్పటికే ఆరు వ్యాపారాలకు సంబంధించి రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాం. వీటి ద్వారా 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉంది. – ఏప్రిల్ 21, 2022న కాస్టిక్ సోడా యూనిట్ ప్రారంబోత్సవంలో ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ కుమార్ మంగళం బిర్లా -
సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల ఆర్వీఎం ఆర్డర్లు
సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) వ్రస్తోత్పత్తి ఆర్డర్లు రానున్నాయి. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వ్రస్తానికి గిట్టుబాటు ధర లేక నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో ‘ఆధునిక మగ్గాలు ఆగాయి’శీర్షికన ఈనెల 3న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర జౌళి శాఖ అధికారులు స్పందించి సిరిసిల్ల టెక్స్‌టైల్‌పార్క్ వ్రస్తోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు టెక్స్‌టైల్‌పార్క్‌లోని యూనిట్లకు ఆర్వీఎం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తామని జౌళి శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్‌రావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు. 1.30 కోట్ల మీటర్ల వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నామని వివరించారు. టెక్స్టైల్ పార్క్‌లోని ఆధునిక మగ్గాలపై షరి్టంగ్ వస్త్రం, సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌పై సూటింగ్, ఓనీ వ్రస్తాన్ని ఉత్పత్తి చేసే ఆర్డర్లు ఇవ్వనున్నామని చెప్పారు. ఆర్వీఎం ఆర్డర్ల విలువ రూ.130 కోట్లు ఉంటుందని అంచనా. 50 శాతం కాటన్‌తో వ్రస్తాల ఉత్పత్తి గతానికి భిన్నంగా 50 శాతం కాటన్ నూలుతో కలిపి ఆర్వీఎం వ్రస్తాలను ఉత్పత్తి చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ కోసం ఈ వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నారు. వ్రస్తోత్పత్తికి ముందే నూలును వార్పిన్ చేసి, సైజింగ్ చేసిన తరువాత మగ్గాలపై వ్రస్తాన్ని ఉత్పత్తి చేయనున్నారు. సిరిసిల్లలో తొలిసారి ఈ ప్రయోగం చేస్తున్నారు. గతంలో ప్లెయిన్ వస్త్రాన్ని ఉత్పత్తి చేసి ప్రింటింగ్ చేయించేవారు. కానీ ఈసారి వీవింగ్లోనే డిజైన్లు వచ్చేలా ఉత్పత్తి చేస్తున్నారు. -
ఇథనాల్ తయారీలో చెరకు రసం వినియోగంపై నిషేధం
న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తిలో చెరకు రసం, షుగర్ సిరప్‌ల వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ప్రారంభమైన 2023–24 సరఫరా సంవత్సరానికి (డిసెంబర్–నవంబర్ మధ్య కాలం) ఇది వర్తిస్తుంది. దేశీయంగా వినియోగానికి తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూసేందుకు, అలాగే ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇథనాల్ ఉత్పత్తి కోసం ’బి–మొలాసిస్’ను వినియోగించడానికి అనుమతించింది. చక్కెర పరిశ్రమ దీన్ని స్వాగతించింది. అయితే ప్రత్యేకంగా చెరకు రసం, షుగర్ సిరప్‌ల ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లు పని చేయకపోతే అవి ఖాయిలా పడే అవకాశం ఉందని పేర్కొంది. 2023–24 మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్–సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అంచనాల ప్రకారం 2023–24 మార్కెటింగ్ సంవత్సరంలో స్థూలంగా చక్కెర ఉత్పత్తి 9 శాతం తగ్గి 337 లక్షల టన్నులకు పరిమితం కానుంది. 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో భారత్ 61 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. అంతక్రితం ఏడాది రికార్డు స్థాయిలో 112 లక్షల టన్నుల చక్కెర ఎగుమతైంది. ధరలను అదుపులో ఉంచే ఉద్దేశంతో ఈ మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతించలేదు. -
రైతుల మోముల్లో ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను మించి రికార్డు స్థాయి ధరలు లభిస్తున్నాయి. ముఖ్యంగా మిరప, మినుము, పసుపు, పెసలు, కందులు ఎమ్మెస్పీని మించి మంచి ధర పలుకుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల పాటు కనీస మద్దతు ధరలు దక్కని రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకుంది. దీని ద్వారా ఎమ్మెస్పీ దక్కని వ్యవసాయ, వాణిజ్య పంటలను మార్కెట్లో జోక్యం చేసుకొని మరీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. తద్వారా ప్రధాన వ్యవసాయ, వాణిజ్య పంటలకు మద్దతు ధర దక్కింది. నాలుగున్నరేళ్లలో 6.17 లక్షల మంది రైతుల నుంచి రూ.7,751.43 కోట్ల విలువైన 21.60 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసింది. ఇలా ధర తగ్గిన ప్రతీసారి ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా మార్కెట్లో ప్రస్తుతం ఆయా ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. ఖరీఫ్ పంట ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే వేళ అపరాలు, చిరుధాన్యాలు, ఉద్యాన, వాణిజ్య పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి రికార్డు స్థాయిలో పలుకుతుండడం శుభపరిణామన్నారు. మిరప, పసుపులకు రికార్డు స్థాయి ధర అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్‌తో మిరప రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఎమ్మెస్పీ క్వింటా రూ.7 వేలు కాగా, కాస్త నాణ్యత ఉంటే చాలు రూ.20 వేలకు పైగా లభిస్తోంది. గరిష్టంగా రూ.27,525 పలుకుతోంది. ప్రతికూల వాతావరణంలో సాగు చేసిన మిరపపై ఈసారి నల్లతామర ప్రభావం పెద్దగా కనిపించకపోవడం, మార్కెట్లో రికార్డు స్థాయిలో ధరలు ఉండడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించే పరిస్థితులు ఉన్నాయి. పసుపు ఎమ్మెస్పీ క్వింటా రూ.6,850 కాగా గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్లో బుధవారం గరిష్టంగా క్వింటా రూ.10,650 పలికింది. ఈసారి రూ.15 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక పత్తి పొడుగు పింజ రకం ఎమ్మెస్పీ క్వింటా రూ.7,020 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.7,453 పలుకుతోంది. మధ్యస్థ పింజ రకం ఎమ్మెస్పీ రూ.6,620 కాగా మార్కెట్లో రూ.7 వేలు లభిస్తోంది. మిగిలిన పంట ఉత్పత్తులకు సైతం మార్కెట్లో డిమాండ్ ఉండడంతో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఇచ్చేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. క్వింటా రూ.10 వేలు దాటిన అపరాలు అపరాలకు మార్కెట్లో రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. మినుము ఎమ్మెస్పీ క్వింటా రూ.6,950 కాగా, మార్కెట్లో రూ.11,500 పలుకుతోంది. కందులు ఎమ్మెస్పీ రూ.7 వేలు కాగా రూ.10,500, పెసలు ఎమ్మెస్పీ రూ.8,558 ఉండగా మార్కెట్లో రూ.10,500 వరకు ధరలు పలుకుతున్నాయి. రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాలకు కూడా మంచి ధరలు లభిస్తున్నాయి. ఇక ఉల్లి ఎమ్మెస్పీ క్వింటా రూ.700 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.5,500 వరకు రైతుకు ధర లభిస్తోంది. వేరుశనగ కూడా ఎమ్మెస్పీ రూ.6,377 కాగా, గరిష్టంగా మార్కెట్లో రూ.7,596 పలుకుతోంది. అరటి ఎమ్మెస్పీ క్వింటా రూ.800 కాగా, మార్కెట్లో గరిష్టంగా రూ.2,880 లభిస్తోంది. బత్తాయి ఎమ్మెస్పీ రూ.1,400 కాగా మార్కెట్లో గరిష్టంగా రూ.4,200 వరకు పలుకుతోంది. ఖరీఫ్ పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వచ్చే వేళ ఇలా వ్యవసాయ, వాణిజ్య పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి పలుకుతుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. -
మెమరీ చిప్ ఉత్పత్తిలో సహస్ర.. తొలి భారతీయ కంపెనీగా రికార్డ్
రాజస్థాన్‌కు చెందిన 'సహస్ర సెమీకండక్టర్స్' (Sahasra Semiconductors) మెమరీ చిప్‌లను ఉత్పత్తి చేసిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో భివాడి జిల్లాలోని సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ అండ్ ప్యాకేజింగ్ యూనిట్లో ఉత్పత్తిని ప్రారంభించి.. వివిధ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఇప్పటికే మొదటి షిప్మెంట్ చేసింది. 2023 చివరి నాటికి కంపెనీ భివాడి యూనిట్ 30 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని, 2024లో ఇది మరింత ఎక్కువగా ఉండనున్నట్లు సహస్ర గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'అమృత్ మన్వానీ' వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా మైక్రో ఎస్డి కార్డ్‌లను విక్రయించే మొదటి కంపెనీగా మారినందుకు ఆనందంగా ఉందని, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి స్పందన లభిస్తోందని మన్వానీ ఈ సందర్భంగా చెప్పారు. సహస్ర సెమీకండక్టర్స్ రెండు ప్రముఖ ప్రభుత్వ కార్యక్రమాల (PLI, SPECS) నుంచి ఆమోదం పొందింది. అంతే కాకుండా కంపెనీ తన తయారీ సౌకర్యాన్ని విస్తరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్.. టూ వీలర్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి! సెమీకండక్టర్ వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. గ్లోబల్ చిప్‌మేకర్ మైక్రాన్, గుజరాత్లో కొత్త అసెంబ్లీ అండ్ టెస్ట్ సదుపాయాన్ని స్థాపించడానికి 825 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అనుకున్న విధంగా అన్నీ జరిగితే 2024 నాటికి ఉత్పత్తి అధికమవుతుందని, తద్వారా కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ఘనత
ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్–2 (కృష్ణ) విభాగంలో ఉత్పత్తి 50 మిలియన్ టన్నులకు చేరింది. ఈ విభాగం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 50 మిలియన్ టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి సాధించి మరో మైలురాయికి చేరుకుంది. ఈ విభాగంలో ఉత్పత్తి 1992 మార్చి 21న ప్రారంభమైంది. 50 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరుకున్న సందర్భంగా విభాగంలో గురువారం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ అతుల్ భట్ మాట్లాడుతూ ప్లాంట్‌కు అత్యంత కీలక విభాగమైన బ్లాస్ట్ ఫర్నేస్ మరో మైలురాయికి చేరుకోవడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషి ఫలితంగా ఈ విజయం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ.కె.బాగ్జి, సీజీఎం (వర్క్స్) ఎన్.వి.స్వామి, సీజీఎం (ఐరన్) ఆర్.మొహంతి, విభాగాధిపతి ఉదయ్‌నాగ్ పాల్గొన్నారు. -
భారత్‌లో తయారీ పెంచుతున్న టయోటా
టోక్యో: వాహన తయారీలో ఉన్న జపాన్ దిగ్గజం టయోటా మోటార్ కార్పొరేషన్.. భారత్‌లో పూర్తి సామర్థ్యంతో ప్లాంట్లు నడుస్తుండడంతో తయారీని పెంచే ప్రక్రియను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా టయోటా మోటార్ కంపెనీ, కిర్లోస్కర్ గ్రూప్ సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన టయోటా కిర్లోస్కర్ మోటార్‌కు బీదడి వద్ద రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఈ కేంద్రాల స్థాపిత సామర్థ్యం ఏటా 3.42 లక్షల యూనిట్లు. ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చూనర్, లెజెండర్, కామ్రీ హైబ్రిడ్, అర్బన్ క్రూజర్ హైరైడర్, హైలక్స్ మోడళ్లను తయారు చేస్తోంది. సుజుకీ కార్పొరేషన్‌తో ఉన్న భాగస్వామ్యంలో భాగంగా గ్లాంజా, రూమియన్ మోడళ్లను సైతం ఉత్పత్తి చేస్తోంది. పూర్తిగా తయారైన వెల్ఫైర్, ఎల్సీ 300 మోడళ్లను దిగుమతి చేసుకుంటోంది. కొన్ని మోడళ్లకు ఎక్కువ కాలం వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీంతో మెరుగైన డిమాండ్ కారణంగా భారత్‌లో మూడవ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. 2023 ప్రారంభంలో కొన్ని మోడళ్ల కోసం వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 30 శాతం పెంచడానికి బీదడిలో మూడవ షిఫ్ట్‌ని ప్రారంభించింది. 2023 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కంపెనీ 1,23,939 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 35 శాతం ఎక్కువ. డిమాండ్ బలంగా ఉంది.. భారత్‌లో పూర్తి ప్లాంట్ సామర్థ్యాన్ని వినియోగిస్తున్నట్టు టయోటా మోటార్ కార్పొరేషన్ బోర్డు సభ్యుడు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యోయిచి మియాజాకి జపాన్ మొబిలిటీ షో సందర్భంగా తెలిపారు. దేశంలో సామర్థ్య పెంపుపై తాజా పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చలు మొదలయ్యాయని వెల్లడించారు. ‘కోవిడ్ తర్వాత భారత ఆటోమొబైల్స్ రంగంలో ముఖ్యంగా పెద్ద కార్లకు డిమాండ్ పెరిగింది. కోవిడ్ తర్వాత ఇతర దేశాలతో పోలిస్తే మార్కెట్ రికవరీ భారత్‌లో చాలా బలంగా ఉంది. కాబట్టి డిమాండ్ కూడా బలంగా ఉందని మేము నమ్ముతున్నాము. మార్కెట్లో పెద్ద కార్ల పట్ల ఆసక్తి క్రమంగా పెరగడం కంపెనీకి మంచి సంకేతం’ అని వివరించారు. భారతీయ కార్ల విపణి చిన్న కార్ల నుండి పెద్ద కార్ల విభాగాలకు మారడం వల్ల మార్కెట్‌ను టయోటా మరింత ఆకర్షణీయంగా మారుస్తుందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. టయోటాకు సమయం ఆసన్నమైందని అన్నారు. -
టెస్లాకు క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే?
అమెరికన్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' (Tesla) గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ప్రవేశించడానికి సరైన సమయం కోసం వేచి చూస్తోంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇటీవలే కొన్ని ఆంక్షలతో సుముఖత చూపించింది. తాజాగా కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కు ఓ స్పష్టమైన సందేశం అందించారు. భారతదేశం టెస్లాకు స్వాగతం పలుకుతుంది, కానీ కంపెనీ స్థానికంగా కార్లను తయారు చేస్తే ఇతర సంస్థలకు లభించే అన్ని రాయితీలు లభిస్తాయి. చైనాలో తయారు చేసి భారతదేశంలో విక్రయించాలనుకుంటే రాయితీలు లభించవని గడ్కరీ స్పష్టం చేశారు. గతంలో సీబీయూ మార్గం ద్వారా దిగుమతైన కార్లపై ప్రభుత్వం దిగుమతి సుంకాను తగ్గించింది. ప్రస్తుతం స్థానిక ఉత్పత్తులను పెంచడానికి, విదేశీ దిగుమతులను తగ్గించడానికి కేంద్రం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే భారతదేశంలో తయారీ కార్యకలాపాలను ప్రారంభించడానికి కట్టుబడి ఉన్న సంస్థలకు కొన్ని ప్రత్యేక రాయితీలను కల్పిస్తోంది. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారభించాలనుకుంటే మొదటి రెండు సంవత్సరాల్లో దాదాపు 20 శాతం భాగాలను స్థానికంగా సోర్సింగ్ చేయాలి, ఆ తరువాత ఇది 40 శాతానికి పెరిగే అవకాశం ఉంది. సంస్థలకు బ్యాంకు గ్యారెంటీలు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న విధంగా అన్నీ జరిగితే టెస్లా, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి కంపెనీలకు గణనీయమైన ప్రయోజనాన్ని పొందుతాయి. ఇదీ చదవండి: కొత్త హంగులతో మెరిసిపోతున్న 'ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్' - ఫోటోలు చూశారా? కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం భారతదేశంలో వాహన తయారీని పెంచడమే. ప్రస్తుతం టెస్లా కంపెనీ భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి తమ ప్రణాళికలకు సంబంధించి, ప్రభుత్వంతో సానుకూల చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే సంస్థ భారతదేశంలో సంవత్సరానికి 5,00,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఒక కర్మాగారాన్ని స్థాపించాలనే ఉద్దేశాన్ని వెల్లడించారు. టెస్లా ఫ్యాక్టరీ, ఉత్పత్తికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడవుతాయని భావిస్తున్నాము. -
బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు!
నిర్మాణ రంగం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతమైన భవనాలు ఈ రోజుకీ పురుడుపోసుకుంటున్నాయి. ఇలాంటి భవనాలు లేదా నగరాల నిర్మాణానికి కావాల్సిన ప్రధానమైన ముడిపదార్ధాలు సిమెంట్, ఉక్కు (స్టీల్), ఇసుక. 2020లో ప్రపంచంలో ఈ ముడిపదార్ధాల ఉత్పత్తి ఎంత? ఏ దేశంలో ఎక్కువ ఉత్పత్తి ఉంది.. వంటి ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సిమెంట్ అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, 2020లో అత్యధికంగా సిమెంట్ ఉత్పత్తి చేసిన దేశాల జాబితాలో చైనా (2200 మిలియన్ టన్నులు) అగ్ర స్థానంలో, రెండవ స్థానంలో భారత్ (340 మిలియన్ టన్నులు) నిలిచాయి. చివరి స్థానంలో సౌత్ కొరియా మొదలైన దేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం సిమెంట్ ఉత్పత్తి 2020లో 4.1 బిలియన్ టన్నులు. ప్రపంచలోని అన్ని దేశాలు ఉత్పత్తి చేసిన సిమెంటుతో ఒక దిమ్మె నిర్మిస్తే.. అది 1,195 మీటర్ల పొడవు, 1.7 బిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణం ఉంటుంది. బరువు ఏకంగా 4.1 బిలియన్ టన్నులు ఉంటుంది. ఈ దిమ్మె పొడవు బుర్జ్ ఖలీఫా కంటే 365 మీటర్లు ఎక్కువ ఉంటుందన్నమాట. సిమెంట్ తయారు చేసేటప్పుడు టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్ (CO2) విడుదలవుతుంది, అధిక మొత్తంలో నీరు అవసరమవుతుంది. కాంక్రీట్ ఉత్పత్తిలో అధిక కార్బన్ ఉద్గారాలు, నీటి వినియోగాన్ని తగ్గించేందుకు, స్వీడిష్ పవర్ కంపెనీ వాటెన్ఫాల్ ఓ ప్రత్యేకమైన కాంక్రీట్ మిశ్రమాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా CO2 ఉద్గారాలు బాగా తగ్గుతాయి. ఉక్కు (స్టీల్) సిమెంట్ తరువాత నిర్మాణానికి కావాల్సిన ముఖ్యమైన లోహం ఉక్కు. 2020లో ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి మొత్తం 180 కోట్ల టన్నుల బరువైన ఉక్కుని ఉత్పత్తి చేశాయి. అంతకు ముందు 1900 నుంచి ఉక్కు పరిశ్రమ 2500 కోట్ల టన్నుల స్టీల్ స్క్రాప్‌ను రీసైకిల్ చేసింది. దీని వల్ల 3500 కోట్ల టన్నుల ఇనుము వినియోగం, 1800 కోట్ల టన్నుల బొగ్గు వినియోగం తగ్గింది. ప్రపంచ దేశాల్లో ఉత్పత్తి అయిన ఉక్కుతో ఓ దిమ్మె నిర్మిస్తే.. అది 610 మీటర్ల ఎత్తు, 227.8 మిలియన్స్ ఘనపు మీటర్ల పరిమాణం, 180 కోట్ల టన్నుల బరువుతో నిర్మితమవుతుంది. ఇదీ చదవండి: గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు! రంగాల వారీగా రికవరీ రేట్లు ఇసుక నిర్మాణ రంగంలో మరో ముఖ్యమైన మెటీరియల్ ఇసుక, కంకర (చిన్న రాళ్లు). 2020లో ఉత్పత్తి అయిన ఇసుక 26.5 కోట్ల టన్నులు. ఇంత ఇసుకతో ఏకంగా 555 మీటర్ల ఎత్తు, 171 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణంతో ఓ దిమ్మె నిర్మించవచ్చు. ప్రస్తుతం చాలా నగరాల్లో ఇసుక అవసరం లేకుండానే పెద్ద పెద్ద భవనాలను గాజు, ఇతర మెటీరియల్స్ ఉపయోగించి ఎంతో అందంగా నిర్మిస్తున్నారు. -
ఏపీలో కోరమాండల్ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నెలకొలి్పన సల్ఫరిక్ యాసిడ్ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించింది. విశాఖపట్నం వద్ద ఉన్న కంపెనీకి చెందిన ఫెర్టిలైజర్ కాంప్లెక్స్‌లో రూ.400 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని స్థాపించారు. ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 1,650 మెట్రిక్ టన్నులని కోరమాండల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ బుధవారం వెల్లడించారు. నూతన కేంద్రం చేరికతో సంస్థ సల్ఫరిక్ యాసిడ్ తయారీ సామర్థ్యం ఏటా 6 లక్షల టన్నుల నుంచి 11 లక్షల టన్నులకు చేరిందని పేర్కొన్నారు. -
‘మామిడి’లో మనమే ఘనం
సాక్షి, అమరావతి : దేశంలో అత్యధికంగా మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అలాగే జాతీయ స్థాయి సగటు హెక్టార్‌కు మామిడి ఉత్పాదకతను మించి రాష్ట్రంలో సగటు హెక్టార్‌కు మామిడి ఉత్పాదకత అత్యధికంగా ఉంది. దేశంలో ఏపీ తర్వాత మామిడి ఉత్పత్తిలో ఒడిశా రాష్ట్రం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలో మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మేలుతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేశారు. నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు జాతీయ స్థాయిలో హెక్టార్‌కు సగటున 9.6 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా, ఏపీలో హెక్టార్‌కు సగటున 12 టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఒడిశాలో హెక్టార్‌కు సగటున 4 నుంచి 6.3 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. ఏపీలో ఉత్పత్తయ్యే మామిడి పండ్లలో 16% ఫ్రూట్ ప్రాసెస్ చేపడుతున్నారు. ఇలా ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల డిమాండ్‌ను పెంచాల్సి ఉంది. ఏపీలో బంగినపల్లి, సువర్ణ రేఖ, నీలం, తోతాపురి రకాలు ఎక్కువగా పండుతుండగా, ఎగుమతికి అనువైన ఇమామ్ పసంద్, బంగినపల్లి, సువర్ణరేఖ వంటి గుజ్జు రకాలూ ఎక్కువగానే పండుతున్నాయి. ఏపీలో ఉత్పత్తి అయ్యే గుజ్జు రకాల పండ్లలో దాదాపు 54 శాతం ఎగుమతి అవుతున్నాయి. ప్రాసెస్ చేసిన పండ్ల ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. గుజ్జు రకాల మామిడి పండ్ల ఉత్పత్తి ఏపీ, ఒడిశాలో అత్యధికంగా ఉంది. పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా అధిక ఉద్యోగాలు కల్పించవచ్చు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్‌లో కీలకమైన పరిమితులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నాణ్యమైన ముడి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ పథకాలను అందుబాటులో ఉంచడంతో పాటు త్వరగా అనుమతులివ్వాలి. పండ్ల ప్రాసెసింగ్‌లో 75 శాతం మహిళలకు, 25 శాతం పురుషులకు ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3.39 మిలియన్ ఎంఎస్ఎంఈలను ఉండగా, ఒడిశాలో 1.98 మిలియన్ ఎంఎస్‌ఎంఈలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎంఎస్‌ఎంఈల్లోనే 111 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. నమోదైన ప్రాసెసింగ్ యూనిట్ల కన్నా ఏపీ, ఒడిశాల్లో నమోదుకాని యూనిట్లు 26 నుంచి 80 రెట్లు ఉంటాయి. ఏపీ ప్రభుత్వం 2020–25 లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని తెచ్చింది.. కొత్త సాంకేతిక బదిలీలను ప్రోత్సహించడం, సాంకేతికతను అప్‌గ్రేడేషన్ చేయడం, ముడి సరుకు సక్రమంగా సరఫరా అయ్యేలా సరైన పంటల ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయడం.యువతకు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలతో బ్యాక్వర్డ్ లింక్‌లను ఏర్పరచుకోవడం వంటివి లక్ష్యంగా విధానాన్ని రూపొందించుకుంది. -
ఏపీలో గ్రీన్‌లామ్ ప్లాంటు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లామినేట్ షీట్స్ తయారీలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పిన ప్లాంటులో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేట వద్ద ఉన్న ఈ అత్యాధునిక తయారీ కేంద్రానికి ఏటా 35 లక్షల లామినేట్ షీట్స్, కాంపాక్ట్ బోర్డులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. నూతన ప్లాంటు కోసం కంపెనీ రూ.239 కోట్లు వెచ్చించింది. పూర్తి సామర్థ్యానికి చేరుకుంటే ఈ ఫెసిలిటీ ద్వారా రూ.600 కోట్ల వార్షికాదాయం సమకూరగలదని కంపెనీ ప్రకటించింది. 4 ప్లాంట్లలో కలిపి వార్షిక స్థాపిత సామర్థ్యం 2.45 కోట్ల లామినేట్ షీట్స్, కాంపాక్ట్ బోర్డులకు చేరిందని గ్రీన్‌లామ్ ఎండీ, సీఈవో సౌరభ్ మిత్తల్ వెల్లడించారు.