ఆక్వా రంగంలో విప్లవం.. ఏపీలోకి కొత్త రకం రొయ్య రంగ ప్రవేశం | New Type Prawns Production In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆక్వా రంగంలో విప్లవం.. ఏపీలోకి కొత్త రకం రొయ్య రంగ ప్రవేశం

Published Sun, Dec 26 2021 11:07 AM | Last Updated on Sun, Dec 26 2021 4:30 PM

New Type Prawns Production In Andhra Pradesh - Sakshi

సాక్షి, కాకినాడ: ఆక్వా రంగంలోకి సరికొత్త రకం రొయ్య(స్కాంపీ) రంగ ప్రవేశం చేయనుంది. దేశంలో తిరిగి మంచినీటి రొయ్యల సాగును ప్రోత్సహించాలని కేంద్రం మంచి నీటి రొయ్యల సాగుకు సంస్థ (సీఐఎఫ్‌ఏ) ఆదేశించింది. రైతులకు నాణ్యమైన సీడ్‌ అందించేందుకు సీఐఎఫ్‌ఏ తోడ్పాటు అందించనుంది. ఈ మేరకు పిల్ల ఉత్పత్తికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు హేచరీలకు అనుమతులు మంజూరు చేసింది. అందులో కాకినాడలో ఓ హెచరీ ఉంది. ఇప్పటికే హేచరీలో సీడ్‌ ఉత్పత్తి ప్రారంభమైంది.

ఏప్రిల్‌ నాటికి రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక లాభాలు వస్తాయన్న ఆశతో ఎనిమిదేళ్లుగా వనామీ సాగుకే పరిమితమైన రైతులు వైరస్‌లు తట్టుకునే, తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ రకం సాగుదిశగా అడుగులు వేస్తున్నారు.  

అసలేంటీ స్కాంపీ.. 
స్కాంపీ మంచినీటిలో పెరిగే రొయ్య. రెండు దశాబ్దాల క్రితం వరకు ఈ రకం రొయ్యల ఉత్పత్తిలో మన దేశం అగ్రస్థానంలో ఉండేది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా రెండు వేల ఎకరాల్లో ఈ రకం రొయ్యలు పండించేవారు. కొన్నాళ్లు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. రాను రాను ఆశించిన స్థాయిలో దిగుబడులు, లాభాలు రావడం లేదని భావించిన రైతులు సాగుకు దూరమయ్యారు.

వాటి స్థానంలో టైగర్, వనామీ రొయ్యల వైపు వెళ్లారు. ప్రస్తుతం వనామీ పెంపకంలో అనేక అసమానతలు, నష్టాలు వస్తుండటంతో కేంద్రం నూతన పద్ధతుల ద్వారా తెగుళ్లు తక్కువగా ఉండే స్కాంపీ సాగును ప్రోత్సహించాలని భావించింది. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌ కేంద్రంగా పనిచేసే సీఐఎఫ్‌ఏ శాస్త్రవేత్తలు స్కాంపీ బ్రూడ్‌ బ్యాంకును అభివృద్ధి చేస్తున్నారు. మేకిన్‌ ఇండియా రొయ్యల బ్రూడ్‌ బ్యాంకు నినాదంతో ముందుకు వెళుతున్నారు.  

నాలుగు హేచరీలకు అనుమతులు 
స్కాంపీ పిల్ల ఉత్పత్తికి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు హేచరీలకు అనుమతులు ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన మహారాజా ఆక్వాటిక్స్, బీకేఎంఎస్‌ స్కాంపీ హెచరీ, ఏఎస్‌ఆర్‌ స్కాంపీ హేచరీ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎంఎస్‌ఆర్‌ స్కాంపీ హేచరీతో ఒప్పందం చేసుకుంది. సీఐఎఫ్‌ఏ–జీఐ స్కాంపీ పిల్లలను సంస్థ హేచరీలకు అందజేసింది. హేచరీలు రొయ్య సీడ్‌ ఉత్పత్తి చేపట్టి రానున్న ఏప్రిల్‌ నెల నుంచి రైతులకు విక్రయించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నాయి. పలువురు రైతులకు ఇప్పటికే ఆక్వా నిపుణులను సంప్రదించి స్కాంపీ రొయ్యలు సాగు చేయడానికి చెరువులను సిద్ధం చేసుకుంటున్నారు. 

తక్కువ పెట్టుబడి:  
 ►   వనామీ రొయ్యల సాగుతో పోలిస్తే స్కాంపీ సాగుకు పెట్టుబడి తక్కువ.  
 ►   ఎకరాకు రూ.2 లక్షలు సరిపోతుంది. వైరస్‌లను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది.  
 ►   మందుల అతి వినియోగం ఉండదు. రొయ్య పిల్ల ధర రూపాయి.  50,000  పిల్లలు కొనుగోలు చేసి అర ఎకరా చెరువులో పోయాలి.  
 ►   50 రోజుల అనంతరం ఐదు గ్రాముల బరువు ఉండే రొయ్యలు తీసి పది వేలు చొప్పున రెండు ఎకరాల చెరువుల్లో పోయాలి. 
 ►   ఈ సమయంలోనే ఆడ, మగ రొయ్య పిల్లలను వేరు చేయాల్సి ఉంటుంది.  
 ►   నాలుగు నెలల్లో రెండు టన్నుల మేత అవసరం అవుతుంది.  మగ రొయ్య 140 గ్రాములు, ఆడ రొయ్య 80 గ్రాముల బరువు పెరుగుతుంది.  
 ►  రెండు టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. ఎకరాకు రూ.4 లక్షల చొప్పున ఆదాయం లభిస్తుంది. ఖర్చులకు పోను రైతుకు రెండు లక్షల వరకు మిగులుతుందని ఆక్వా నిపుణులు స్పష్టీకరిస్తున్నారు.  
 ►   నీటిలో లవణీయత సున్నా నుంచి ఐదు వరకు ఉన్నా ఎలాంటి ఇబ్బంది రాదంటున్నారు. 
 ►  ఏడు నుంచి పదిహేను కౌంట్‌ రొయ్యలు వస్తాయని భావిస్తున్నారు. 

ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించాం 
స్కాంపీ సీడ్‌ ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించాం. ఇందుకు అవసరమైన అనుమతులు వచ్చాయి. సీఐఎఫ్‌ఏ సంస్థ 110 బ్రూడర్స్‌(తల్లి రొయ్య)ను సరఫరా చేసింది. వాటి ద్వారా పిల్లల ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ప్రక్రియ మార్చి మొదటి వారం వరకు ఉంటుంది. ఏప్రిల్‌ మాసంలో రైతులకు సీడ్‌ అందించేందుకు కృషి చేస్తున్నాం. రైతుల నుంచి మంచి డిమాండ్‌ ఉంది. కొత్త రకం తమకు కావాలని సంప్రదిస్తున్నారు.  
- ఎం.వెంకటరమణ, డైరెక్టర్‌ ఎంఎస్‌ఆర్‌ హేచరీస్‌  

 చదవండి: రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్‌ డిమాండ్‌.. దీనికో ప్రత్యేకత ఉంది


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement