బంగాళాదుంప తొక్కలు, వ్యర్థాల నుంచి ఇథనాల్
ల్యాబ్ పరీక్షలు విజయవంతం.. టెక్నాలజీ టెస్టింగే తరువాయి
ప్రయోగాత్మక ప్లాంటును ఏర్పాటు చేయనున్న సీపీఆర్‌ఐ
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆలు ఉత్పత్తిదారు భారత్
ఉత్పత్తిలో 10–15% నిరుపయోగంగా పారేస్తున్న వైనం
తొక్కే కదా అని అలుసుగా చూడొద్దు! ఏమో రేపు అవే మన బైకులు.. కార్లు.. లారీలను నడిపే ఇం‘ధనం’గా మారొచ్చు! దేనిగురించి అనుకుంటున్నారా? అదేనండీ మనం కరకరలాడించే చిప్స్.. ఫ్రై.. కూరల్లో లొట్టలేసుకుంటూ లాగించే బంగాళాదుంపల సంగతిది. ఈ ఆలుగడ్డ తొక్కలు, వ్యర్థాల నుంచి బయో ఇంధనాన్ని ఉత్పత్తి(Biofuel Production) చేసే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టారు మన శాస్త్రవేత్తలు. దీన్ని పరీక్షించేందుకు త్వరలో ప్రయోగాత్మక (పైలట్) ప్లాంటును కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది విజయవంతమైతే.. బంగాళా దుంపలతో బైక్ నడిపేయొచ్చన్నమాట!!
సాక్షి, బిజినెస్ డెస్క్: బంగాళాదుంపల(potato) ఉత్పత్తిలో ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది భారత్. అయితే, సరైన నిల్వ సదుపాయాల్లేక పంట చేతికొచ్చాక పాడైపోయే ఆలుగడ్డలు మొత్తం ఉత్పత్తిలో 10–15 శాతం ఉంటాయని అంచనా. మరోపక్క పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ప్రాసెస్డ్ ఆహారోత్పత్తులను పెద్ద ఎత్తున తయారుచేసే స్నాక్స్ కంపెనీల నుంచి తొక్కలు ఇతరత్రా రూపంలో వేల టన్నుల వ్యర్థాలు వెలువడుతుంటాయి. వీటి నుంచి జీవ ఇంధనాన్ని (బయో ఫ్యూయల్–ఇథనాల్) ఉత్పత్తి చేసే టెక్నాలజీని సిమ్లాలోని సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీఆర్‌ఐ) రూపొందించింది. ల్యాబ్ పరీక్షలు కూడా పూర్తి కావడంతో, ఈ టెక్నాలజీని టెస్ట్ చేయడం కోసం పైలట్ ప్లాంటును నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది.
బంగాళాదుంప తొక్కలు, వ్యర్థాల నుంచి ఇథనాల్
చెరకు, మొక్కజొన్నతో పాటు..
దేశంలో ప్రస్తుతం చెరకు, మొక్కజొన్న నుంచి పెద్ద ఎత్తున ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వీటితోపాటు బంగాళాదుంపల వ్యర్థాలను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఫీడ్ స్టాక్‌గా ఉపయోగించేందుకు జాతీయ జీవ ఇంధన పాలసీలో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ లభించింది. ‘ఆలుగడ్డల నుంచి గణనీయమైన వ్యర్థాలు ఉంటున్న నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తికి వీటిని విలువైన ప్రత్యామ్నాయాలుగా పరిగణించవచ్చు’అని సీపీఆర్‌ఐ శాస్త్రవేత్త ధర్మేంద్ర కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఏటా సగటున సుమారు 5.6 కోట్ల టన్నుల ఆలుగడ్డలు ఉత్పత్తి అవుతున్నాయి.
ఇందులో 8–10 శాతం, అంటే 50 లక్షల టన్నులను పొటాటో చిప్స్, ఫ్రైస్, ఇంకా డీహైడ్రేటెడ్ ప్రాడక్టులుగా ప్రాసెస్ చేస్తున్నారు. ఆయా ప్లాంట్ల నుంచి భారీ మొత్తంలో తొక్కలు, ఇతరత్రా వ్యర్థాలు బయటికొస్తాయి. ఇక పంట చేతికొచ్చాక ఉత్పత్తి నష్టాలు 20–25 శాతం, అంటే సుమారు 1.1–1.4 కోట్ల టన్నుల మేరకు ఉంటాయని అంచనా. ప్రధానంగా సరైన నిల్వ సదుపాయాలు లేకపోవడం, సరిగ్గా రవాణా చేయకపోవడం వంటివి దీనికి కారణం. ‘అత్యధికంగా బంగాళాదుంపలను ఉత్పత్తి చేస్తున్న ఉత్తరప్రదేశ్ లేదా పశ్చిమ బెంగాల్, అలాగే భారీగా ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్న గుజరాత్ వంటి చోట్ల పొటాటో ద్వారా ఇథనాల్ తయారు చేసే పైలట్ ప్లాంటును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం’అని కుమార్ తెలిపారు.
20% ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్..
క్రూడ్ ఆయిల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడం, కాలుష్యాన్ని నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపే బయో ఫ్యూయల్ పాలసీని పక్కాగా అమలు చేస్తోంది. 2013–14 ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈఎస్‌వై)లో 38 కోట్ల లీటర్ల ఇథనాల్ (ఫ్యూయల్ గ్రేడ్) దేశంలో ఉత్పత్తి కాగా, 2020–21 నాటికి ఇది 302.3 కోట్ల లీటర్లకు చేరింది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 1.53 శాతం నుంచి 8.17 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో దేశంలో పెట్రోల్ వినియోగం 64 శాతం ఎగబాకడం గమనార్హం. 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తొలుత లక్ష్యంగా నిర్దేశించింది.
అయితే, 2022 జూన్ నాటికే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) 10 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడంతో 2025–26 నాటికి 20 శాతం లక్ష్యాన్ని కుదించారు. 2023–24లో ఈ బ్లెండింగ్ 13 శాతంగా నమోదైంది. డీజిల్‌లో సైతం 5% ఇథనాల్‌ను కలిపే పాలసీని తీసుకొచ్చే ప్రణాళికల్లో ప్రభుత్వం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తికి మరిన్ని రకాల ఫీడ్ స్టాక్లనువినియోగించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
2025 కల్లా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లు తప్పనిసరి..
పెట్రోలు, డీజిల్‌తో నడిచే సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ) వాహనాల స్థానంలో రాబోయే రోజుల్లో ఫ్లెక్సి ఫ్యూయల్ వెహికల్స్ (ఎఫ్సీవీ)లు పరుగులు తీయనున్నాయి. బయో ఫ్యూయల్ పాలసీకి అనుగుణంగా 2025 చివరినాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే ఐసీఈ వాహన ఇంజిన్లను పెట్రోల్‌తోపాటు ఫ్లెక్స్ ఫ్యూయల్ (85 శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్–ఈ 85)కు అనుగుణంగా మార్చడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో ఆటోమొబైల్ కంపెనీలు ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment