
కెమికల్ ఫ్యాక్టరీ దుర్ఘటనలో చాగల్లు యువతి దుర్మరణం
ప్రసన్న మృతితో గ్రామంలో విషాదఛాయలు
ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆమె అత్త కొడుకు
తూర్పు గోదావరి: బాగా చదువుకుంది. జీవితంలో ఏదో సాధించాలనే తపనతో ఉద్యోగంలో చేరింది. చిరుద్యోగులైన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకుంది. తానొకటి తలిస్తే.. విధి ఒకటి తలచిందని.. ఉద్యోగంలో చేరిన రెండు నెలలకే ఆమెను మృత్యువు కబళించింది. ఆమె ఆశలన్నీ కల్లలయ్యాయి.
తెలంగాణలో పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో చాగల్లుకు చెందిన యువతి మృతి చెందడంతో చాగల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన పొలిశెట్టి శ్రీనివాసరావు కుమార్తె ప్రసన్న(22) ఈ దుర్ఘటనలో మృతి చెందింది. రెండు నెలల క్రితమే ఫ్యాక్టరీలో కెమిస్ట్‌గా ఉద్యోగంలో చేరిన ప్రసన్న మరణాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు.
తండ్రి శ్రీనివాసరావు మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి రామలక్ష్మి ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రసన్న కాగా, చిన్న కుమార్తె ప్రభుకుమారి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతుంది.
ప్రాణాపాయం నుంచి తప్పించుకుని..
ప్రసన్న అత్త కొడుకు కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామానికి చెందిన యాతం మహేష్ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రసన్న కూడా రెండు నెలల క్రితమే అదే ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీ పనిపై మహేష్ బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దుర్ఘటన విషయం తెలుసుకుని.. అదే సమయంలో డ్యూటీలో ఉన్న ప్రసన్న కూడా ప్రమాదానికి గురైందని గ్రహించి ఆమె తల్లిదండ్రులకు మహేష్ సమాచారం అందించాడు. సోమవారం సాయంత్రం శ్రీనివాసరావు, రామలక్ష్మి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.
ఎన్నో ఆశలతో..
దుర్ఘటనలో మృతిచెందిన ప్రసన్న బీ–ఫార్మసీ చది వింది. ఉన్నత చదువు అభ్యసించి జీవితంలో మంచి స్థానం సాధించాలని ఆశించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని ఫ్యాక్టరీలో స్టైఫండ్ తీసు కుంటూ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగంలోకి చేరింది. ఎం–ఫార్మసీ చేయాలన్న తపనతో ఓ శిక్షణ సంస్థలో కూడా చేరింది. ఇదే విషయాన్ని దుర్ఘటనకు ముందురోజు ఆమె తల్లితో ఫోన్‌లో చెప్పింది. తాను ఎం–ఫార్మసీ చదివేందుకు ఫీజు చెల్లించానని ఆనందం పంచుకుంది. సోమవారం సాయంత్రం ఏడు గంటల నుంచి జరిగే క్లాసులకు వెళుతున్నానని తల్లికి చెప్పింది. ఎంతో ఆనందాన్ని పంచుకున్న కుమార్తె తమను విషాదంలో విడిచి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు రోదించారు.
కన్నీరుమున్నీరైన చెల్లెలు
చిన్ను(ప్రసన్న) కుటుంబ సభ్యులందరితో కలివిడిగా ఉండేదని, తామిద్దరం అక్కాచెల్లెలైనా.. స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లమని ప్రసన్న చెల్లెలు ప్రభుకుమారి కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ప్రసన్న ఇంటి వద్ద బంధువుల రోదనలు హృదయవిదారకంగా మారాయి.