న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాలను దేశీయంగా తయారు చేయగలగడంతో పాటు ఇక్కడే ఉత్పత్తి చేపట్టేలా అంతర్జాతీయ సంస్థలను కూడా ఆకర్షించగలిగే సత్తా భారత్‌కి పుష్కలంగా ఉందని ట్యాక్సీ సేవల సంస్థ ఓలా సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ ధీమా వ్యక్తం చేశారు. దిగుమతులకే పరిమితం కాకుండా తయారీ కూడా చేపట్టగలమని దేశ సామర్థ్యాలపై గట్టి నమ్మకం ఉండాలని ట్విటర్‌లో పేర్కొన్నారు. దిగుమతయ్యే ఎలక్ట్రిక్ కార్లపై సుంకాలను తగ్గించాలంటూ అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా, కొరియన్ సంస్థ హ్యుందాయ్ ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో భవీష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం 40,000 డాలర్ల పైగా సీఐఎఫ్ (ఖరీదు, బీమా, రవాణా వ్యయాలు) విలువ చేసే కార్ల దిగుమతిపై భారత్ 100% సుంకాలు విధిస్తోంది. అంతకన్నా తక్కువ విలువున్న వాటిపై దిగుమతి సుంకం 60% ఉంటోంది. ఓలా... తమిళనాడులో ఈ–స్కూటర్ల తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం రూ. 2,400 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. విద్యుత్ వాహనాల దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ కోరుతున్న హ్యుందాయ్.. మరో ఆటోమొబైల్ కంపెనీ కియాతో కలిసి ఓలాలో 300 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment