హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ సాగర్ సిమెంట్స్ భారీగా విస్తరిస్తోంది. 2025 నాటికి వార్షిక తయారీ సామర్థ్యాన్ని 10 మిలియన్ టన్నులకు (కోటి టన్నులకు) చేర్చాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రతి 10 ఏళ్లకు సామర్థ్యాన్ని రెండింతలు చేయాలన్నది సంస్థ ధ్యేయం. ప్రస్తుతం ఉన్న మూడు ప్లాంట్లతో కలిపి సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 5.75 మిలియన్ టన్నులు. తాజా విస్తరణలో భాగంగా మధ్యప్రదేశ్, ఒడిశాలో ఏర్పాటు చేయనున్న రెండు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను దక్కించుకుంది. ఈ నెలలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వాల కాలుష్య నియంత్రణ మండలి నుంచి క్లియరెన్సులు రానున్నట్లు సాగర్ సిమెంట్స్ జేఎండీ సమ్మిడి శ్రీకాంత్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఇవి పూర్తి అయితే తయారీ సామర్థ్యం 8.25 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని, విస్తరణకు కావాల్సిన నిధుల కోసం ఒక్కొక్కటి రూ.725 ధరలో 31,00,000 కన్వర్టబుల్ వారంట్లను జారీ చేస్తామని తెలిపారు.
2021 మార్చికల్లా పూర్తి..
కంపెనీ ఒక మిలియన్ టన్ను సామర్థ్యం గల ప్లాంటును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వద్ద ఏర్పాటు చేస్తోంది. వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే 5.5 మెగావాట్ల పవర్ ప్రాజెక్టును సైతం నిర్మిస్తోంది. వీటి కోసం రూ.425 కోట్లు వెచ్చిస్తారు. ఇందులో ఈక్విటీ రూ.150 కోట్లు ఉంటుంది. ఇక ఒడిశాలోని జాజ్‌పూర్ వద్ద ఉన్న జాజ్‌పూర్ సిమెంట్స్‌ను(జేసీపీఎల్) ఇటీవలే రూ.108 కోట్లు వెచ్చించి సాగర్ సిమెంట్స్ దక్కించుకుంది. 100 శాతం అనుబంధ సంస్థగా ఉండే జాజ్‌పూర్ సిమెంట్స్ ద్వారా రూ.308 కోట్లతో 1.5 మిలియన్ టన్నుల గ్రైండింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నా రు. ప్రతిపాదిత కొత్త ప్రాజెక్టుల కోసం యంత్రాలకై ఆర్డర్లు ఇచ్చామని, డెన్మార్క్, జర్మనీకి చెందిన దిగ్గజ కంపెనీలు వీటిని సరఫరా చేస్తాయని చెప్పారాయన. 2021 మార్చికల్లా నిర్మాణాలు పూర్తి అవుతాయని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.
కొత్త మార్కెట్లకు..
సాగర్ సిమెంట్స్ ప్రస్తుతం దక్షిణాది మార్కెట్లతోపాటు మహారాష్ట్ర, ఒడిశాలో విస్తరించింది. ఇండోర్ ప్లాంటు పూర్తయితే పశ్చిమ మధ్యప్రదేశ్, ఆగ్నేయ రాజస్తాన్, తూర్పు గుజరాత్, ఉత్తర మహారాష్ట్రలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమవుతుంది. ఇండోర్, వడోదర, బోపాల్, అహ్మదాబాద్ నగరాలు 110 నుంచి 330 కిలోమీటర్ల పరిధిలో ఉండడం కలిసొచ్చే అంశం. అలాగే ఒడిశా ప్లాంటు రాకతో ఉత్తర, మధ్య ఒడిషా, తూర్పు ఛత్తీస్‌గఢ్, దక్షిణ జార్ఖండ్, దక్షిణ పశ్చిమ బెంగాల్‌లో సిమెంటు మార్కెట్ చేసేందుకు వీలవుతుంది. భువనేశ్వర్, కటక్, బాలాసోర్, కోల్‌కతా, రాంచి, జంషెడ్‌పూర్ పట్టణాలను కవర్ చేయవచ్చునని కంపెనీ భావిస్తోంది.
రెండేళ్లుగా ధర పెంచలేదు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ ప్రాజెక్టులకు కావాల్సిన సిమెంటును రెండేళ్లుగా కంపెనీలు తక్కువ ధరలో సరఫరా చేస్తున్నాయి. డీజిల్ ధర ఈ రెండేళ్లలో 25 శాతం పెరిగిందని, వ్యయ భారం ఉన్నా హామీ ఇచ్చిన ధరలోనే కంపెనీలు సిమెంటును సప్లయ్ చేశాయని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తాయని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల్లో గతేడాది సిమెంటు అమ్మకాల్లో 40 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది వృద్ధి స్థిరంగా ఉండొచ్చని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
2025 నాటికి కోటి టన్నుల ఉత్పత్తి
Published Thu, Jun 6 2019 5:44 AM | Last Updated on Thu, Jun 6 2019 5:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment