
డ్రోన్ల తయారీ రంగంలో మనం బలమైన పోటీదారుగా ఎదగాలి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచన
సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ)పై కేవలం మాటలు చెబితే సరిపోదని, నిర్మాణాత్మక కార్యాచరణ కావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. మన పోటీదార్లు ఏఐలో నూతన సాంకేతిక విధానాలతో ముందుకు దూసుకెళ్తుంటే, మన ప్రధాని నరేంద్ర మోదీ టెలిప్రాంప్టర్‌తో ప్రసంగాలు ఇవ్వడానికే పరిమితం అవుతున్నారని ఆక్షేపించారు. మన దేశంలో ప్రతిభకు కొదవ లేదని, కావాల్సిందల్లా ప్రోత్సాహమేనని సూచించారు.
బలమైన ఉత్పత్తి వ్యవస్థను నిర్మించాలన్నారు. ఉత్త మాటలు పక్కనపెట్టి, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, తద్వారా మన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఈ మేరకు రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యుద్ధరీతుల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టేలా డ్రాగన్ దేశం చైనా అత్యాధునిక డ్రోన్ల ఉత్పత్తి ప్రారంభించిందని వెల్లడించారు.
డ్రోన్ల తయారీ రంగంలో మనం బలమైన పోటీదారుగా ఎదిగేలా ఒక సమగ్ర వ్యూహాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్ టెక్నాలజీపై 9 నిమిషాల నిడివి గల వీడియోను రాహుల్ గాంధీ షేర్ చేశారు. భవిష్యత్తు అవసరాల కోసం ఇలాంటి సాంకేతికతను అభివృద్ధి చేయగల ప్రతిభ, ఇంజనీరింగ్ స్కిల్స్ ఇండియాకు ఉన్నాయని స్పష్టంచేశారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తాను మాట్లాడిన వీడియోను సైతం రాహుల్ గాంధీ షేర్ చేశారు. యుద్ధ రంగంలో డ్రోన్ల ప్రాధాన్యతను ఆయన ఈ వీడియోలో ప్రస్తావించారు.